చిదంబరం బెదిరింపులు

రచన: మే 12, 2010

ప్రచురణ: ప్రజాతంత్ర వారపత్రిక మే 16, 2010

కేంద్ర ప్రభుత్వ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వశాఖ గత గురువారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పైకి చూడడానికి అది కేవలం 1967 నాటి చట్టంలోని ఒకానొక సెక్షన్ ను ప్రజల దృష్టికి తెస్తున్నట్టు మాత్రమే కనబడుతుంది గాని, అది భారత ప్రజాస్వామిక వ్యవస్థ గురించి ఆలోచించవలసిన ఎన్నో విషయాలను లేవనెత్తుతోంది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అనే నిషిద్ధ సంస్థ నాయకులు తమ కార్యకలాపాలను, సిద్ధాంతాలను ప్రచారం చేయమని స్వచ్ఛంద సంస్థలను, మేధావులను కోరుతున్నారని, అలా ప్రచారం ఇవ్వడం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధ) చట్టం 1967 ప్రకారం శిక్షార్హమని, అలా చేసినవారికి పది సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించవచ్చునని ఆ ప్రకటన చెప్పింది. అటువంటి ప్రచారాలను చూసి మోసపోవద్దని ప్రజలను కోరింది. మావోయిస్టు పార్టీ విధ్వంసాలకు పాల్పడుతున్నదని, అభివృద్ధికి ఆటంకంగా ఉన్నదని, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అటువంటి కార్యకలాపాలకు, ఆలోచనలకు స్థానం లేదని కూడ ఆ ప్రకటన చెప్పింది.

అలా మరొకరి కార్యకలాపాల గురించి, సిద్ధాంతాల గురించి ప్రచారం చేసినందుకే స్వచ్ఛంద సంస్థలను, మేధావులను శిక్షార్హులను చేసే అటువంటి సెక్షన్ గల చట్టం 1967 నాటి నుంచీ అమలులో ఉంటే ఇప్పుడు హఠాత్తుగా ‘అది ఉంది సుమా, జాగ్రత్త’ అని హెచ్చరించవలసిన అవసరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఎందుకు కలిగింది?

నిజానికి ఇలా కొన్ని పనులను నేరాలుగా ప్రకటించి, వాటిని ప్రచారం చేయడమైనా, సమర్థించడమైనా శిక్షార్హమైన నేరమే అవుతుందని అనడం కొత్త విషయం కాదు. అది అన్ లాఫుల్ ఆక్టివిటీస్ (ప్రివెన్షన్) ఆక్ట్, 1967లో సెక్షన్ 13 ప్రకారం శిక్షార్హంగా ఉండేది. ఇందిరాగాంధీ హత్యానంతర వాతావరణంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకువచ్చిన టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ ఆక్టివిటీస్ (ప్రెవెన్షన్) ఆక్ట్ (టాడా), 1987 లో సెక్షన్ 3 కింద శిక్షకు అవకాశం ఉంది. ఆ చట్టం అమలులో వేలాది మంది అమాయకులను, “తీవ్రవాదం”తో గాని, “విచ్ఛిన్నకర కార్యకలాపాల”తోగాని ఎటువంటి సంబంధంలేని వాళ్లను (దుస్తులు కుట్టిన దర్జీలు, చికిత్స చేసిన వైద్యులు, భోజనం పెట్టిన, ఆశ్రయం ఇచ్చిన దాతలు, గ్రామాల్లో పెత్తందార్లకు, పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక కార్యకర్తలతో సహా 65,000 మందిని) ఇరికించడంతో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. 1995లో ఆ చట్టాన్ని పొడిగించకుండా ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం 2001 లో ప్రెవెన్షన్ ఆఫ్ టెర్రరిజం ఆర్డినెన్స్ తీసుకువచ్చి, 2002 లో దాన్ని పోటా చట్టంగా మార్చి సరిగ్గా టాడా లాగనే దాన్ని వాడి, వేలాది మంది మీద నిర్బంధం ప్రయోగించింది. దానిలో సెక్షన్ 21 కింద నేరానికి సహకరించారనే పేరుమీద ఎవరినైనా శిక్షార్హులను చేసే అవకాశం ఉంది. చిదంబరం భాగస్వామిగా ఉన్న యుపిఎ ప్రభుత్వం ఆ పోటా చట్టాన్ని 2004లో రద్దు చేసింది. అదే సమయంలో 1967 చట్టానికి కొత్త కోరలు దిద్ది అమలు లోకి తెచ్చింది. అలా 1967 చట్టానికి చేసిన సవరణల్లో భాగంగా టాడా చట్టంలోని మాటలనే ఇక్కడ సెక్షన్ 39 గా చేర్చారు. ఇప్పుడు చిదంబరం మంత్రిత్వశాఖ బూచిగా చూపుతున్నది ఆ సెక్షన్ నే.

అసలు అటువంటి ప్రత్యేక చట్టాలే అసహజమైనవి, అప్రజాస్వామికమైనవి, దుర్మార్గమైనవి. సమాజంలో నేరాలు-శిక్షలు ఎప్పటినుంచో ఉన్నాయి. అర్థశాస్త్రం, మనుస్మృతి వగైరాలు, వాటి ఆధారంగా వెలువడిన డజన్లకొద్దీ శిక్షాస్మృతులు నిర్వచించిన నేరాలు-శిక్షలు ఎలా ఉన్నా, 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత ఈ దేశవాసులకు ఆధునిక విద్యనూ, నేరశిక్షాస్మృతినీ ఒక్కచేతి మీద ఇచ్చినవాడు మెకాలే. అలా 1860లో భారత శిక్షాస్మృతి, 1872లో నేరవిచారణాస్మృతి తయారయ్యాయి. ఆ తర్వాత ఎన్ని మార్పులూ చేర్పులూ జరిగినా ఇవాళ్టికీ మౌలికంగా మన మీద అధికారం నెరపుతున్నవి ఆ వలస చట్టాలే. ప్రజలను పాలకులకు శత్రువులుగా చూసే చట్టాలే. అవి మన సమాజంలో జరగడానికి అవకాశం ఉన్న నేరాలన్నిటినీ నమోదు చేసి, ప్రతిదానికీ శిక్షను సూచించాయి. అటువంటప్పుడు మళ్లీ అవే నేరాలకు కొత్త చట్టాలు చేయడం అనవసరం మాత్రమే కాదు, చట్టపు మాయను, దుర్మార్గాన్ని మరింత దుర్భేద్యంగా మార్చడమే. అందువల్ల ఇటువంటి ప్రత్యేక చట్టాల పద్ధతి ప్రజలను భయభీతావహంలో ముంచేందుకేననే వాదన ఎంతో కాలంగా ఉంది.

సరే, ప్రత్యేక చట్టాల బాగోగుల సంగతి ఎలా ఉన్నా, ఒక రాజకీయ పక్షపు సిద్ధాంతం గురించి, కార్యాచరణ గురించి రాయడం, మాట్లాడడం నేరం ఎలా అవుతుంది? సిద్ధాంతం నేరం కావడానికి ఎప్పుడూ వీలులేదు. ముఖ్యంగా తనను తాను ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే చోట ఎటువంటి అభిప్రాయాలయినా బహిరంగంగా చర్చకు రావలసిందే. ‘ఆ సిద్ధాంతం గురించి రాసినా మాట్లాడినా పది సంవత్సరాల శిక్ష వేస్తాను జాగ్రత్త’ అని బెత్తం పుచ్చుకుని కూచుంటే, ఇవాళ ఒక సిద్ధాంతమయింది, రేపు మరొక సిద్ధాంతమవుతుంది, చివరికి ‘నువు మాట్లాడేదేదయినా శిక్షార్హమైన సిద్ధాంతమే, ఏకీభవించనోని పీక నొక్కుతా’ అనే దగ్గరికి వస్తుంది.

ఇక ఒక రాజకీయ సంస్థ కార్యాచరణ నిషిద్ధమని అనడమే ప్రజాస్వామిక వ్యవస్థలో అసమంజసం. బ్రిటిష్ వలసవాదం డజన్లకొద్దీ సంస్థలను నిషేధించింది, ఆ సంస్థలన్నిటినీ ఇవాళ మనం స్వాతంత్ర్యసమర సంస్థలుగా గుర్తిస్తున్నాం. అది పరాయి ప్రభుత్వమనుకుంటే, నిజాం ప్రభుత్వం స్టేట్ కాంగ్రెస్ నూ నిషేధించింది, కమ్యూనిస్టుపార్టీనీ నిషేధించింది. ఆ నిషేధాజ్ఞలను ధిక్కరించి లక్షలాది ప్రజలు ఆ రెండు పార్టీల వెనుకా సమీకృతమయ్యారు. అది రాజరిక ప్రభుత్వమని అనుకుంటే, గాంధీ హత్య తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిషేధానికి గురయింది. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిలో ఆర్ ఎస్ ఎస్, ఆనందమార్గ్, జమాయత్ ఎ ఇస్లామీ, మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలతో సహా ఎన్నో సంస్థలు నిషేధానికి గురయ్యాయి. మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం విప్లవ రచయితల సంఘాన్ని నిషేధిస్తే ముగ్గురు న్యాయమూర్తుల విచారణ సంఘం ఆ నిషేధాన్ని కొట్టివేసింది. కనుక ఒక ప్రభుత్వం వచ్చి ఇది నిషిద్ధ సంస్థ అన్నా, మరొక ప్రభుత్వం వచ్చి ఆ నిషేధం తొలగించినా పట్టించుకోవలసిన అవసరమేమీ లేదు. ఆ సంస్థ మౌలికంగా ప్రజాప్రయోజనాలకోసం పనిచేస్తున్నదా లేదా అనేది మాత్రమే గీటురాయిగా ఉండాలి.

ఒక్కో సందర్భంలో ఆ సంస్థ ఆశయాలు మంచివేనని, మార్గాలు మంచివి కావనీ కూడ ఎవరయినా అనుకోవచ్చు. ఆ మార్గాలు హింసాపూరితమైనవనీ కనుక వాటికి స్థానం లేదనీ అనుకోవచ్చు. కాని దానికి కూడ రెండు జవాబులున్నాయి. ఒకటి, మొత్తం కార్యాచరణను గుండుగుత్తగా నిషేధించడం కాక, ఏ చర్యకు ఆ చర్యను నేరంగానో, హింసగానో భావించి విచారణ జరిపి శిక్ష విధించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. రెండు: అసలు తమ మీద జరిగే దోపిడీ పీడనలను ఎదుర్కోవడానికి అవసరమైన ఏ చర్యనైనా చేపట్టే హక్కు ప్రజలకు ఎప్పుడూ ఉంటుంది. ప్రజల కోసం చట్టాలు గాని, చట్టాల కోసం ప్రజలు కాదు.

మావోయిస్టుల సిద్ధాంతాన్ని, కార్యాచరణను సమర్థించేవారు, ప్రచారం చేసేవారు అనే పేరుతో ప్రభుత్వం ఎవరిమీదనైనా విరుచుకుపడి నిర్బంధం ప్రయోగించవచ్చు. మాట్లాడే, రాసే, ఆలోచించే ప్రతివారి మీద ఆ కత్తి వేలాడదీసి సమాజాన్ని ఒక శ్మశాన నిశ్శబ్దంలోకి నెట్టవచ్చు. అలా దేశాన్ని శాంతిమండలంగా మార్చి బహుళజాతి సంస్థలకు, ఆశ్రితులకు దేశ వనరులన్నిటినీ అప్పనంగా అప్పగించడమే ఈ హోం మంత్రిత్వశాఖ బెదిరింపు ప్రకటన అసలు ఉద్దేశం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

One Response to చిదంబరం బెదిరింపులు

  1. Pingback: 2010 in review « KadaliTaraga : a wave in the Ocean !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s