తెలంగాణ రైతు విషాదగాథ

“దెబ్బ మీద దెబ్బ కోలుకోకుంట. కాలం దెబ్బ. మనిషి దెబ్బ”

ఒక్కమాటలో ఇదీ ఇవాళ భారతదేశపు రైతు కథ. కూలీ కథ. సగటు మనిషి కథ. కోట్లాది మంది పీడితుల కథ. ఇంక తెలంగాణ రైతు కథ చెప్పనే అక్కరలేదు. కాచుకునే, తేరుకునే, లేచినిలబడే సమయం కూడ ఇవ్వకుండా కాలం దెబ్బమీద దెబ్బ కొడుతూనే ఉంది. కాలంతో సమానంగానో, కాలం కన్న ఎక్కువగానో మనిషి దెబ్బమీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు.

నిజానికి ఇలా కాలం, మనిషి అని అనిర్దిష్టంగా చెప్పడానికి కూడ వీలులేదు. కొన్ని దశాబ్దాల కిందనైతే  అలా కాలం, మనిషి అని అమూర్త సర్వనామాల మీద నెపం పెట్టే అవకాశం ఉండేదేమో. అప్పటి కాలం మండిన ఎండకాలం కావచ్చు, పడని వానల కాలం కావచ్చు. చెరువుకట్ట తెగగొట్టో, పురుగులనూ, మిడతలనూ పంపో దెబ్బతీసిన కాలం కావచ్చు. కాని ఇప్పుడు కాలం అంత సాధారణమైనది కాదు. ఇది ప్రపంచీకరణ కాలం. ఉద్దేశపూర్వకంగా శత్రుపూరితంగా ఉన్న కాలం. చప్పన్నారు దేశాల సంపన్నులకు ఊడిగంచేస్తున్న కాలం. బహుళజాతి సంస్థల ప్రయోగాలలో మామూలు మనుషులకోసం విషాన్ని తయారు చేస్తున్న కాలం.

అప్పటి మనిషి ఊళ్లోనే తెలిసిన భూస్వామో, స్వార్థపరుడో, పెత్తందారో, వ్యాపారో, దొరో కావచ్చు. ఎంత చెడ్డా అయ్యా అప్పా అనే అవకాశం మిగిలి ఉండేదేమో. కాని ఇప్పుడు మాత్రం మనిషంటే ఆ పాత పెత్తందార్లను మించిన యంత్రాంగం. కులం, మతం, ప్రాంతం, భాష, సంపద, అధికారం – ఏ ఆధిపత్యం వీలయితే ఆ ఆధిపత్యాన్ని మూర్తీభవించుకున్న యంత్రభూతం. మనిషితనం లేని, రక్తం పీల్చే రాజకీయార్థిక విధానం. ఆ యంత్రాంగంలో హైదరాబాదులోనో, ఢిల్లీలోనో అధికారం వెలగబెడుతూ దేశ వనరులను దేశదేశాల బేహారులకు అమ్మడానికి పథకాలు రచిస్తున్న రాజకీయ నాయకులున్నారు. ఆ రాజకీయ నాయకుల ఆదేశాలను ఔదలదాలుస్తూ, తాము ప్రజాసేవకులమని మరచిపోతూ ప్రజాకంటకులుగా తయారయిన ప్రభుత్వాధికారులున్నారు. సంపదతో, ఆధిపత్యంతో కన్నూమిన్నూ కానని దురహంకారులున్నారు. తెలంగాణలోనయితే అదనంగా, తలాపున నది పారుతున్న ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించని రాజకీయార్థిక వ్యవస్థ ఉంది. ఆధునిక అభివృద్ధి భావజాలపు మాయాజాలాన్ని ప్రవచిస్తూనే ప్రజలను ప్రకృతి దయాదాక్షిణ్యాలకు బలిచేస్తున్న ఏలికలున్నారు. వలసవచ్చి, కొత్త పంటలు మప్పి, ఆ పంటలకు విత్తనాలూ, పురుగుల మందులూ, ఎరువులూ అమ్ముకుంటూ, ఆ కొనుగోళ్లకు అప్పులు పెడుతూ బలిసిన వ్యాపారపంటల కోస్తా రైతులున్నారు. తమ చుట్టుపట్ల ఉన్న ప్రజల పట్ల నెనరు చూపడం మాని, పరాయివారికి ఊడిగం చేసయినా సరే తాము నిచ్చెనలెక్కదలచిన స్థానిక రాజకీయనాయకులున్నారు. ఈ తెలంగాణ ప్రజాశత్రువులందరూ స్పష్టంగానే, బహిరంగంగానే కనబడుతున్నారు.

మొత్తానికి బహురూపుల, బహుముఖాల కాలమూ మనిషీ కూడ ఇవాళ తెలంగాణ కష్టజీవి మీద పగబట్టి ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కోట్లాదిమంది సామాన్యులు ప్రతిక్షణం ఆ వేయిపడగల కాటుకు బలి అవుతూనే ఉన్నారు. ఆ విషాదచరిత్ర ఎందరు చెప్పినా ఎన్నితీర్ల చెప్పినా ముగిసిపోని అనంతగాథ.

ఆ అనంతగాథలో ఒక అవిభాజ్యమైన మచ్చుతునక వంటి భాగం ఎలెకట్టె శంకరరావు రాసిన ఈ ‘దేవుని రాజ్యం’ నవల. నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ఎర్రగూడెం గ్రామంలోని నాలుగెకరాల చిన్నరైతు కథను పునాదిగా తీసుకుని, కన్నీటి పదనుతో కలిపి ఈ తెలంగాణ రైతు అనంత విషాదగాథను అద్భుతంగా అక్షరీకరించిన నవల ఇది. దీనిలో కల్పన, వాస్తవం ఎంతగా కలగలిసిపోయాయంటే, నిజంగా ఆ అక్షరాలకు అంటిన ఎర్రగూడెం రైతుల కన్నీరూ నెత్తురూ నా మునివేళ్లకు తగిలి, ఎన్నోచోట్ల కంట తడి పెట్టించాయి. నల్లగొండ జిల్లా, నిల్వనూరు అని పిలుచుకునే నిడమానూరు మండలం, అందులో ఎర్రగూడెం, మారుపాక, ఎర్రబెల్లి గ్రామాలు అక్షరాలా వాస్తవాలు. నారాయణ, కమలమ్మ, శీను, బంటు ఎల్లయ్య, పరంధాములు, బొర్రెంకయ్య, గురవయ్య, తదితరులు రచయిత సృష్టి కావచ్చు, కాని ఆ పాత్రలన్నిటికీ వాస్తవికతలో మూలాలు ఉన్నాయి. అందువల్లనే, అవి ఊహాపాత్రలు కావనే తెలివిడి, వారు అనుభవించిన కష్టాలూ కడగండ్లూ కల్పన కావనే సోయి, అటువంటి వేదన అనుభవించిన వేలాది, లక్షలాది తెలంగాణ చిన్నరైతులకు ఈ నారాయణ, కమలమ్మ వాస్తవిక ప్రతినిధులనే ఎరుక నవల చదువుతున్నప్పుడు నా దుఃఖాన్ని మరింత పెంచాయి. పఠిత హృదయాన్ని కరిగించి కంటతడిపెట్టించగలిగేదే మంచి సాహిత్యమని, అటువంటి ప్రతిస్పందన కలిగించగలిగిన రచయిత తన ప్రయత్నంలో కృతకృత్యులయినట్టేనని అందరికీ తెలుసు.

అయితే ‘ఇది నా హృదయాన్ని తాకింది’ అని కేవలం అభిరుచి ప్రధానమైన విమర్శతో ఈ నవలను పాఠకులకు పరిచయం చేస్తే దాని నిజమైన మూల్యాలను గుర్తించనట్టే అవుతుంది. ఇది కేవలం పఠిత అభిరుచి అనే స్వీయమానసిక ప్రమాణం వల్ల మాత్రమే కాదు, నవల ఇతివృత్తం, దాని విస్తృతి, దాని నిర్వహణ, వాస్తవికతకూ కళాత్మకతకూ కుదిరిన మేళవింపు, మానవసంబంధాల చిత్రణ, పాఠకుల అవగాహన ఉన్నతీకరణ అనే వస్తుగత ప్రమాణాల వల్ల కూడ ఇది తప్పనిసరిగా చదవవలసిన ముఖ్యమైన నవల అవుతున్నది.

నిజానికి ఈ నవలిక ఒక బృహన్నవల కాదగినంత విస్తృతమైన రంగస్థలం మీద తన ఇతివృత్తాన్ని ప్రదర్శించింది. నవలలో కాలం రెండు మూడు సంవత్సరాలకు మించలేదు, స్థలం ఒక గ్రామాన్ని దాటలేదు. ప్రధానంగా ఒక కుటుంబ కథగా ఉంటూ, మరికొన్ని కుటుంబాలనూ వ్యక్తులనూ కూడ తనలో భాగం చేసుకుంది. కాని ఆ పరిమిత స్థల కాలాలలోనే రచయిత అనేక విషయాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాఠకుల ముందుంచారు. తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనాకాలాల్లో ప్రజల, ముఖ్యంగా రైతుల కడగండ్లు, ప్రభుత్వ అభివృద్ధి పథకాల తీరుతెన్నులు, వాణిజ్య పంటల దాడివల్ల రైతాంగం పరిస్థితి దుర్భరం కావడం, చేనేతకార్మికుల, ఇతర చేతివృత్తుల వారి పరిస్థితులు దిగజారడం, వలసలు, రైతుల ఆత్మహత్యలు, పల్లెజనాలు పట్టణాల వైపు, ఉద్యోగాల వైపు, స్వయం ఉపాధి వైపు చూడవలసిరావడం, స్వయం ఉపాధి పథకాల అసలు స్వరూపం, యువకుల నిరాశా నిస్పృహలు, గ్రామసీమల్లో విప్లవభావాల ప్రచారం, విప్లవ కార్యక్రమాలు, పోలీసు నిర్బంధం, వడ్డీ వ్యాపారులు, బోరుబావుల ఎండమావుల అన్వేషణ, రైతుల మధ్య పోటీ, భూగర్భజలాలు అడుగంటిపోవడం, తెలంగాణ–ఆంధ్ర వైరుధ్యం, సాంస్కృతిక భిన్నత్వం… నిజానికి ఇలా చెపుతూ పోతే గత దశాబ్దం చివరా, ఈ దశాబ్దం మొదటా తెలంగాణ జనజీవితాన్ని ప్రభావితం చేసిన ఏ ఒక్క అంశమూ ఈ నవలలో ప్రస్తావనకు రాకుండా లేదు. అట్లని ఆ రాజకీయార్థిక, సామాజిక పరిణామాల గురించి జాబితాలూ ఉపన్యాసాలూ వ్యాసాలూ సాగాయని కాదు, రచయిత చాల నేర్పుతో నవలా రూపానికి అవసరమైన మానవసంబంధాల చిత్రణ లోనే ఈ సమకాలీన సామాజిక వాతావరణాన్ని రంగరించారు.

నాలుగు ఎకరాల చెలక ఉన్న ఒక సాంప్రదాయిక రైతు కుటుంబంలో తొలివానలు పడగానే విత్తనాల కోసం వెతుకులాటతో నవల మొదలవుతుంది. ఆ రైతు దెబ్బమీద దెబ్బ తిని ఆశోపహతుడై ఆత్మహత్యాలోచనలు చేయడం, కొడుకు వ్యక్తిగతంగానూ, విప్లవ కార్యకర్తల కార్యాచరణ సామూహికంగానూ ఆశలు కల్పించడంతో నవల ముగుస్తుంది. నిజానికి ఇది పెద్ద ఇతివృత్తం కాదనిపిస్తుంది గాని, రచయిత చాల సున్నితంగా, నేర్పుగా చిత్రించిన అనేక జీవిత పార్శ్వాలు నవలకు సమగ్రతనూ, విస్తృతినీ ఇచ్చి, పాఠకుల అవగాహనా పరిధిని పెంచుతాయి. సద్దలు, జొన్నలు పండించే తెలంగాణ రైతు కుటుంబం వేరుశనగ లోకి దిగి అప్పులపాలు అయ్యారనే సూచనతో మొదలయిన నవల, మళ్లీ వేరుశనగే వేద్దామా అని నారాయణ, కమలమ్మ ఆలోచిస్తుండగా, గుంటూరు నుంచి వచ్చి ఆ ఊళ్లో పత్తిపంట మొదలుపెట్టిన ఎంకటేస్పరావు, అప్పారావుల ప్రభావంతో పత్తివేద్దామని శీను అనడంతో, మలుపు తిరుగుతుంది. నిజానికి జిల్లా సరిహద్దు గీస్తూ జీవనది కృష్ణ ప్రవహిస్తుండగా, దేశంలోకెల్లా పేరెన్నికగన్న నాగార్జునసాగర్ జిల్లాలోనే, ఈ గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉండగా, రైతులు వర్షాధారపు వ్యవసాయంలోనే ఉండడం, వానలకోసం ఎదురుచూడడం, నాలుగెకరాల రైతు వరి అన్నం ఎరగకపోవడం, ఎవరో నేర్పితే వ్యవసాయం నేర్చుకునేలా ఉండడం నవలలోని కథాస్థలపు వైచిత్రిని చెపుతాయి. పత్తి విత్తనాల కొనుగోలు, అందుకు అప్పు, పత్తి పంటకు పురుగు సోకడం, పురుగుల మందులు, మళ్లీ అప్పు, పత్తి అమ్మకాల దగ్గర మోసాలు, నీటికోసం బోరు బావులు, పొరుగు రైతుల పోటీ బోరు బావులు, రెండో తరం వ్యవసాయాన్ని వదిలి స్వయంఉపాధి కోసం ప్రయత్నించి విఫలం కావడం, బోరు బావులు ఎండిపోవడం, మళ్లీ బోరు బావులు తవ్వే ప్రయత్నాలు, కాలువలు తవ్వుతామనే పేరుతో భూసేకరణ, ఉన్న నాలుగెకరాల్లో రెండు ఎకరాలు పోగొట్టుకోవడం, మిగిలిన రెండు ఎకరాలు కొట్టెయ్యడానికి అప్పులవాళ్ల కుట్ర, దిక్కుతోచని రైతు ఆత్మహత్య ఆలోచనలు, కొడుకు ధైర్యం చెప్పడం, పెత్తందారును అన్నలు వచ్చి శిక్షించడం – ఆయా ఘటనల మీద, పరిణామాల మీద మన అభిప్రాయాలు ఏమయినప్పటికీ, తెలంగాణ రైతు జీవితం గత రెండు దశాబ్దాలలో అనుభవించిన వాస్తవ సన్నివేశాలు ఇవి. నవల వాటిని వాస్తవ విధేయంగా, కళాత్మకంగా చిత్రించింది.

ఆ ఒక్క కుటుంబం కథ మాత్రమే కాదు, సమాంతరంగా గ్రామీణ జీవితంలోని ప్రధాన పరిణామాలన్నీ కూడ నవలలోకి వచ్చాయి. పరంధాములు ద్వారా చేనేత సంక్షోభం, ఆరెంపీ డాక్టరు సోవబెమ్మం ద్వారా తెలుగుదేశం రాజకీయాలు, పడిదలోని ద్వారా కాంగ్రెస్ రాజకీయాలు, గురవయ్య ద్వారా ప్రజా రాజకీయాలు, బంటు ఎల్లయ్య ద్వారా పేదరైతుల, ఇప్పుడిప్పుడే పైకి ఎదగాలనుకుంటున్న అట్టడుగు జనాల కథ, ఎల్లయ్య ఆత్మహత్య ద్వారా అటువంటి స్థితిలోనే ఉన్న వేలాది మంది దుస్థితి, అప్పారావు పరారీ ద్వారా వలస రైతుల మోసాలు, బొర్రెంకయ్య దాష్టీకం ద్వారా అప్పుల బాధలు, మెకానిక్ చారి ద్వారా గ్రామీణ జీవితంలోని ఆత్మీయతలు కళ్లకు కడతాయి. వలస వచ్చి భూములు, వ్యాపారాలు ఆక్రమించి సాంస్కృతిక దోపిడీ సాగిస్తున్న పొరుగు జిల్లాల వారు ఒకవైపు ఉండగా మరోవైపు స్థానికులు పొట్టచేతపట్టుకుని వలస పోవలసి రావడం, కల్లు వ్యాపారం, అన్నలు, మీటింగులు, పోలీసుదాడులు, భూతనఖా బ్యాంకు అప్పుల వసూళ్ల దౌర్జన్యాలు, బషీర్ బాగ్ కాల్పులు, ఎన్ కౌంటర్ హత్యలు, మద్యనిషేధం వంటి సామాజిక, రాజకీయార్థిక పరిణామాలన్నీ కూడ కొంత విస్తృతంగానో, ప్రస్తావనవశాత్తూనో వస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, మహాకావ్యంగా ఎదగగల అవకాశాలు ఎన్నో ఈ నవలిక నిర్మాణంలో కనబడతాయి. ఇవాళ బదనాంకు గురవుతున్న విమర్శనాత్మక వాస్తవికాతవాద శిల్పాన్ని ఈ రచయిత అద్భుతంగా పట్టుకున్నారనిపిస్తుంది.

ఇక భాష, నుడికారం, నల్లగొండ మట్టివాసనల గురించి చెప్పనక్కరలేదు. నిజానికి వాటి గురించే ప్రత్యేకంగా రాయవలసినంత ఉద్వేగపడ్డాను గాని, ఇప్పటికే చాల రాశాను గనుక ఆ భాషాసౌందర్యాన్ని గ్రహించే, ఆశ్చర్యపోయే, ప్రశంసించే పని పాఠకులకే మిగులుస్తున్నాను.

నేను గుర్తించిన ఒక లోపం కూడ చెప్పాలి: కుటుంబ సంబంధాలు నవలలో ఎంతోకొంత వచ్చాయి గాని, కాల్పనిక రచనకు, జీవిత చిత్రణకు అత్యవసరమయిన, ప్రాణప్రదమయిన ముడిసరుకుగా ఉండవలసిన స్త్రీ పురుష ప్రేమ నవలికలో కనీసంగానయినా చిత్రణకు రాకపోవడం కొరతగా కనబడుతున్నది. నిజానికి తెలంగాణ ప్రజలు జీవిస్తున్న దుర్భర పరిస్థితులలో కూడ ప్రేమ, ఆత్మీయత, మానవసంబంధాలు ఎంత బలంగా, ఎంత మానవీయంగా ఉంటాయో చూపగలగడమే మనిషి మీద విశ్వాసం పెంచడానికి అవసరమనుకుంటాను. అయితే, చతుర వంటి పత్రికలో అచ్చయినప్పుడు, అక్కడ ఉండే స్థల పరిమితి వల్ల రచయిత సులభంగా పక్కకుపెట్టగల జీవిత కోణంగా ఆ పార్శ్వాన్ని చూసి ఉంటారు.

జీవితాన్ని, అంతరంగ ఘర్షణనూ, బాహ్య ఘర్షణలనూ కూడ సునిశితంగా పట్టుకోగల, చిత్రించగల, ఆర్ద్రంగా ప్రదర్శించగల నైపుణ్యం తనకు దండిగా ఉందని రచయిత ఈ నవల ద్వారా పూర్తిగా రుజువు చేసుకున్నారు. ఆ హామీని నిలబెట్టుకుంటారని, తెలంగాణ గ్రామీణ జీవితాన్నీ జీవిత సంఘర్షణనూ సంపూర్ణంగా ప్రతిఫలించే సమగ్రమైన కాల్పనిక రచనలను అందిస్తారని ఆశించడం అత్యాశకాదు. నిజం చెప్పాలంటే గత వంద సంవత్సరాల నలగొండ జనజీవితం అత్యంత అద్భుతమైన, విస్తృతమైన, లోతయిన, నాటకీయమైన సామాజిక పరిణామాలకు భూమికగా నిలిచింది. ఆ ఇతివృత్తం కన్న నవలకు కావలసినదేముంటుంది? అటువంటి నవలను మిత్రుడు ఎలికట్టె శంకర రావు నుంచి ఆశిస్తూ, అభినందనలతో…

–          ఎన్ వేణుగోపాల్

మే 15, 2010

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s