ఈ “ఘాతుకాలు” ఎందుకు జరుగుతున్నాయి?

(రచన: మే 19, 2010

ప్రచురణ: ప్రజాతంత్ర వారపత్రిక మే 23, 2010)

“ఘాతుకం”, “నరమేధం”, “అమానుషం”, “హేయం”, “దుర్మార్గం”, “హింసాకాండ”, “మారణకాండ”, “మారణహోమం”, బీభత్సం”, “రక్తపిపాస”… ప్రచార సాధనాలూ రాజకీయ నాయకులూ వాడుతున్న విశేషణాలకు కొదవలేదు. మనుషుల ప్రాణాలు అకాలంగా అర్ధాంతరంగా రద్దయిపోతున్న ప్రతి సందర్భంలోనూ సమాజ ప్రతిస్పందన ఇంత తీవ్రంగానే ఉంటే ఎంత బాగుండును! తోటి మనిషి ప్రాణం పట్ల మన ఆవేదన ఎల్లప్పుడూ ఇంత సున్నితంగానే ఉంటే ఎంత బాగుండును!

నిజమే, మరణం విషాదకరమే. ఉద్దేశ్యపూర్వకంగా మరొకరి ప్రాణాలు తీయడం అభ్యంతరకరమే. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు, ఉద్దేశించినా ఉద్దేశించకపోయినా, సంబంధంలేనివారి ప్రాణహాని జరగడం తప్పే.

ఐనా “ఘాతుకం” వంటి విశేషణాల వాడకం గురించి ఆలోచించవలసిన అంశాలెన్నో ఉన్నాయి. ప్రాణాలు పోయిన విషాద వాతావరణంలో ఇటువంటి మాటలు భావోద్వేగాలను రెచ్చగొట్టడానికే పనికొస్తాయి. అసలు సంగతులను మరుగుపరచడానికి జరిగే ప్రయత్నాలలో అవీ భాగమవుతాయి. కాని ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన విషయాలు చర్చకు రావలసే ఉంటుంది.

మొట్టమొదట, ఈ విశేషణాలు వాడుతున్నవారు, జరిగిన “ఘాతుకం” గురించి గగ్గోలు పెడుతున్నవారు అన్ని మరణాల విషయంలోనూ ఇలాగే ప్రతిస్పందిస్తున్నారా అని అడగవలసి ఉంది. సహజ మరణాలు మినహా అన్ని మరణాలనూ “ఘాతుకాలు”గా గుర్తించే స్థితికి మనం చేరామా? సకలాధికారాలూ తన చేతిలో పెట్టుకున్న రాజ్యాంగయంత్రం సాధారణ పౌరుల ప్రాణాలు తీస్తున్నప్పుడు, అధికార పీఠాల మీద ఉన్నవారు అమలుచేస్తున్న రాజకీయార్థిక విధానాల వల్ల వేలాది మంది బతుకులు బుగ్గి అయిపోతున్నప్పుడు, రాజకీయపక్షాల మాఫియా దాడులలో ప్రతిరోజూ డజన్ల కొద్దీ మరణిస్తున్నప్పుడు, కొనసాగుతున్న సామాజికధర్మం వల్ల ఆశోపహతులై వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు, ఒక్కక్షణంలో మరణం కాకుండా ప్రతిక్షణం కొంచెంకొంచెం హత్యచేసే సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక వైఖరులు రాజ్యం చేస్తున్నప్పుడు,  ఒక్కసారి కూడ ఆ హత్యలను ఘాతుకాలుగా అభివర్ణించిన వారు కనబడలేదు. ఎప్పుడో ఒకసారి ప్రస్తావించినా బాధ్యులను వేలెత్తి చూపిన సందర్భం లేదు.

ఒక్క రాత్రి దేశ రాజధాని నగరంలో మూడువేలమంది సిక్కులను ఊచకోత కోయించిన వ్యక్తి ఈ దేశానికి ప్రధాన మంత్రి అయ్యాడు. మూడు నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా నరమేధం జరిపించిన వ్యక్తి అప్పటికి ముఖ్యమంత్రిగా ఉండి, ఆ తర్వాత ముఖ్యమంత్రీ అయ్యాడు, కానున్న ప్రధానమంత్రి అని ప్రశంసలూ అందుకుంటున్నాడు. ముఖ్యమంత్రిని మార్చడానికి మూడువందల కుత్తుకలు తెగగోసిన వ్యక్తి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడూ, ముఖమంత్రీ అయ్యాడు. ఇరవై సంవత్సరాలుగా అటు చివర కాషాయం నుంచి ఇటు చివర ఎర్రజెండా దాకా ఎవరు, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా నిరాఘాటంగా అమలు చేసిన రాజకీయార్థిక విధానాల వల్ల లక్షన్నరకు పైగా రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, లక్షలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైపోయింది. లక్షలాది కార్మిక కుటుంబాలు వీథినపడ్డాయి, వేలాది కార్ఖానాలు మూతపడ్డాయి. ఇవేవీ మనకు “ఘాతుకాలు”గా కనబడలేదు. ‘మౌనహింసపట్ల మనం మౌనంగా ఉంటాం, నెత్తురు కారితేనే గొంతెత్తుతాం’ అనుకోవడానికి కూడ లేదు. ఇదంతా కనబడకుండా మౌనంగా జరిగిపోయిన హింస కాదు. మన కళ్లముందు బహిరంగంగా జరిగిన దుర్మార్గం. వ్యవస్థీకృత హింస. దాన్ని ఖండించడానికి మన గొంతులో ఏదో అడ్డుపడుతుంది. కాని ఆ వ్యవస్థీకృత హింస వేల ఏళ్లుగా ఊడలుదిగిన మర్రి కనుక, దాన్ని పెకలించడం ఒక సుదీర్ఘ మహా ప్రయత్నం కనుక, ఆ క్రమంలో ఒక పొరపాటు జరిగితే మాత్రం మన భాష నిప్పులు కురుస్తుంది. పొరపాటు జరిగిందని వాళ్లే అంగీకరించినప్పటికీ ఆ ఘటనలమీద మనం ఒంటికాలితో లేస్తాం. వ్యవస్థీకృత హింస లోని ఘాతుకాల గురించి మాట్లాడకుండా, ఆ హింసను ధిక్కరించడంలో జరిగే “ఘాతుకాల” గురించి మాట్లాడే అర్హత మనకు ఉందా?

చారిత్రక క్రమంలో జరిగే చర్య – ప్రతిచర్యలలో ఏదో ఒకదాన్ని మాత్రం తీవ్రంగా ఖండించడం మరొకదాన్ని చూసీ చూడనట్టు వదిలేయడం కనీస నిష్పాక్షిక నైతిక దృష్టి కూడ కాదు. కనీసం రెండిటినీ సమానంగా ఖండించడం తార్కికంగా సరయినది అవుతుంది.

“ఘాతుకం” వంటి తీవ్రమైన విశేషణాలు వాడి, ఖండించి, మన బాధ్యత నెరవేర్చామని ఆత్మసంతృప్తి పడేకన్నా ముఖ్యమైనది అసలు ఇటువంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయని ఆలోచించడం. అంటే చరిత్ర క్రమాన్ని పరిశీలించడం. ఈ బహిరంగంగా కనబడుతున్న “హింసా” రూపాలు ఒక్కొక్కదానికీ కనీసం వందలో వేలో కనబడని, వ్యవస్థీకృతమైన, అధికారయుతమైన “హింసా” రూపాలు ఉన్నాయి, ఉంటాయి. ఆ హింసా రూపాల గురించి మాట్లాడకుండా, వాటిని ఖండించకుండా, వాటి పర్యవసానాలయిన ఈ హింసా రూపాలను ఖండించడం తార్కికమూ కాదు, నైతికమూ కాదు. ఈ హింసా రూపాలను సమర్థించనక్కరలేదు, కాని అవి ఏ నేపథ్యంలో జరుగుతున్నాయో గుర్తించాలి. అవి ఆగిపోవాలంటే ఆ నేపథ్యం రద్దు కావాలని గుర్తించాలి. అలా రద్దు చేయడంలో మన బాధ్యతను గుర్తించాలి.

ప్రస్తుత ఉదాహరణే తీసుకుంటే,  చత్తీస్ గడ్ దంతెవాడ జిల్లాలోని సింగవరం దగ్గర జరిగిన ఘటన గురించి రాజకీయ పక్షాలు, ప్రచారసాధనాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నాయి. అక్కడ పోలీసులు, ఎస్పీవోలతో పాటు సాధారణ పౌరులు కూడ మరణించారు. సాధారణ పౌరులు ప్రయాణించే బస్సులో, నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు ప్రయాణించినందువల్ల, పోలీసులు బస్సుపైన కూడ కూచున్నందువల్ల అది పోలీసుల బస్సు అనే అనుమానంతో మావోయిస్టులు మందుపాతర పేల్చారని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఈ ప్రాంతంలోనే ప్రభుత్వం, పోలీసులు కలిసి సాల్వాజుడుం అనే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసి గత ఐదు సంవత్సరాలలో వందలాది గూడాలను తగులబెట్టారు. వేలాది మందిని చంపివేశారు. వందలాది మంది స్త్రీలపై అత్యాచారం చేశారు. ఈ బీభత్సంలో రెండు లక్షలకు పైగా ఆదివాసులు తమ ఆవాసాల నుంచి పారిపోయి పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటున్నారు. సాల్వాజుడుం దుర్మార్గాల గురించి దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబికిన తర్వాత, సుప్రీంకోర్టు ముందు కూడ విచారణ జరుగుతుండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించాయి. అడవి నుంచి ఆదివాసులను, వారికి మద్దతు ఇస్తున్న మావోయిస్టులను అక్కడినుంచి తొలగించి, అక్కడి సంపన్న ఖనిజ నిలువలను బహుళజాతి సంస్థలకు అప్పగించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ ఆపరేషన్ మొదలయ్యాక గత ఆరు నెలల్లో నూట ఇరవై మందికి పైగా ఆదివాసులను ప్రభుత్వ బలగాలు చంపివేశాయి. సింగవరం ఘటనను ఈ సంఘటనల, పరిణామాల గొలుసులో భాగంగా చూడవలసి ఉంటుంది.

అక్కడ మొత్తం మృతులు ఎందరు, వారిలో కోబ్రా కమాండోలు ఎందరు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అనే పేరుతో తిరుగుతున్న సాల్వాజుడుం కార్యకర్తలు ఎందరు, సాధారణ ఆదివాసులు ఎందరు అనే కచ్చితమైన అంకెలు ఇంతవరకు రాలేదు గాని, ప్రచారసాధనాలన్నీ మొత్తం మృతుల సంఖ్యను, అందులో ఆదివాసులు సంఖ్యను తమ ఇష్టం వచ్చినట్టుగా (25 నుంచి 41 దాకా) ప్రకటిస్తున్నాయి. ఒక అభిప్రాయాన్ని, వైఖరిని ప్రకటించే ముందు నిర్దిష్టంగా, నిర్దుష్టంగా వాస్తవాన్ని గ్రహించాలనే కనీస నియమాన్ని కూడ వ్యాఖ్యాతలు విస్మరిస్తున్నారు.

అందుకే ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీ రాయ్ “దంతెవాడలో మావోయిస్టులు ఉద్దేశపూర్వకంగా పౌరులమీద దాడి చేసి చంపివేశారని ప్రచారసాధనాల వార్తలు చెపుతున్నాయి. అది నిజమైతే, సంపూర్ణంగా క్షమించరాని విషయమే. ఏ రకంగా చూసినా సమర్థించడానికి వీలులేనిదే. కాని, ప్రధానస్రవంతి ప్రచార సాధనాలలో కొన్ని చాల తరచుగా దురభిప్రాయాలతో, అవాస్తవమైన వార్తలు ప్రకటించడం మామూలే. ఈ ఘటనలో కూడ ఎస్పీవోలు, పోలీసులతో పాటు ఉన్న మిగతా ప్రయాణికులు ఎస్పీవోలుగా చేరడానికి దరఖాస్తు చేసుకుని వస్తున్నవారని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎక్కువ సమాచారం కోసం ఎదురుచూడవలసే ఉన్నది. ఆ బస్సులో నిజంగానే సాధారణ పౌరులు ఉన్నట్టయితే, వాళ్లను అలా పోలీసులతో, ఎస్పీవోలతోపాటు కలిసి ఆ యుద్ధ ప్రాంతంలో మృత్యువుకు ఎదురు పంపినందుకు ప్రభుత్వాన్నే తప్పు పట్టవలసి ఉంటుంది” అన్నారు.

మావోయిస్టులు అక్కడ లేరనో, లేకుండా చేశారనో అనుకుందాం. ఏం జరుగుతుంది? ఏం జరిగి ఉండేది? దంతెవాడ టాటాలకో, ఎస్సార్ కో, మిత్తల్ లకో, వేదాంతకో సొంత ఆస్తి అయిపోయి, ఆదివాసులు ‘అంతరించిపోయిన జాతుల’లో చేరి ఉండేవాళ్లు.

వలస పాలకులు వెళ్లిపోయాక కనీసం ముప్పై సంవత్సరాలు ఆ ప్రాంతంలో విప్లవకారులు లేరు. కాని అక్కడి ఆదివాసుల బతుకులలో “స్వతంత్ర” భారత ప్రభుత్వం ఏ వెలుగులూ తేలేదు. ఇప్పటికీ అక్కడికి ప్రభుత్వం, పోలీసులు వెళుతున్నది, బహుళజాతిసంస్థలకు, సంపన్నులకు, వ్యాపారులకు మార్గం సుగమం చేయడానికే గాని ఆదివాసుల బతుకులు బాగుచేయడానికి కాదు. ఆ నేల కింద ఇనుపఖనిజమూ, బాక్సైట్ ఖనిజమూ లేకపోతే భారత ప్రభుత్వానికి ఆనేల గురించి శ్రద్ధే ఉండేది కాదు. అరవై సంవత్సరాల ప్రభుత్వ పాలన తమకు ఏమీ ఒరగబెట్టలేదనీ, ఇది ప్రభుత్వాలను మార్చే సమస్య కాదనీ, వ్యవస్థను మార్చవలసిన ప్రయత్నమనీ గుర్తించిన ఆదివాసులు ఆ ప్రయత్నంలో భాగమయ్యారు. తమ జల్ జంగల్ జమీన్ తమవే అంటున్నారు. ఆ జమీన్ లో ఉన్న ఖనిజాలు దేశదేశాల సంపన్నుల హక్కు భుక్తం కావడానికి వీలులేదంటున్నారు. వాళ్లను బెదరగొట్టి, వెళ్లగొట్టి, చంపి అయినాసరే ఆ జల్ జంగల్ జమీన్ లను తమ దొరలకు అప్పగించడానికి పూనుకుంటున్నది ప్రభుత్వం.

ఏది “ఘాతుక”మో ఆలోచించవలసింది మనమే.


Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

One Response to ఈ “ఘాతుకాలు” ఎందుకు జరుగుతున్నాయి?

  1. kalyani says:

    సమస్యని కొత్త కోణంలో ఆవిష్కరించారు. ఎవరు పట్టించుకోని, కనీసం ఆలోచించని విషయం ఇది. ఏది ఏమయినా హింస హింసే. పోయిన ప్రాణాలు తిరిగి రావు అది ఎవరి ప్రాణం అయినా సరే.. పోలీసులా, మావోలా, సాధారణ పౌరులా… అందరూ సమానమే మృత్యుదేవతకి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s