అక్షరాలా తీరని లోటు

‘ఆయన లేని లోటు పూడ్చలేనిది’ అనే మాట వినీ వినీ అరిగిపోయింది గాని ఆ మాట అక్షరాలా వర్తించే, సంపూర్ణంగా నిజమయ్యే మనిషి కె. బాలగోపాల్ (1952-2009). నిజంగా తెలుగు సమాజానికీ, ప్రజాఉద్యమాలకూ, ప్రజల హక్కుల పరిరక్షణకూ, తెలుగునాట మేధోకృషికీ ఆయన మరణం తీరని లోటు. ప్రజల సమస్యలను ఆయన పట్టించుకున్నంత తీవ్రంగా పట్టించుకునే, ఆయన ఆలోచించినంత సమగ్రంగా ఆలోచించే, ఆయన పనిచేసినంత సమర్థంగా పనిచేసే మనుషులు తయారు కావడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేము. తెలుగు సమాజం మాత్రమే కాదు యావత్ దేశమే ఒక ఆత్మీయ మిత్రుడిని, హక్కులకోసం ఎలుగెత్తే గొంతును కోల్పోయింది. అటుచివర కాశ్మీర్ నుంచి మరొకచివర ఈశాన్య ప్రాంత ఉద్యమకారులనుంచి, ఛత్తీస్ ఘర్ ఆదివాసులు, గుజరాత్ మైనారిటీలు, కంధమాల్ క్రైస్తవులు, మత్స్యకారులు, ప్రత్యేక ఆర్థిక మండలాల నిర్వాసితులు, దేశవ్యాప్తంగా అభివృద్ధి పథకాల నిర్వాసితులు, ప్రపంచీకరణ విధానాల బాధితులు, రాష్ట్రంలోని అన్ని ప్రజాఉద్యమాల కార్యకర్తలు, విప్లవోద్యమ కార్యకర్తలు, దళితులు, ఆదివాసులు, మహిళలు, మైనారిటీలు — ఆయన స్పృశించని బాధిత సమూహం లేదు. ఆయన పట్టించుకోని జీవన సమస్య లేదు.

ఇరవై ఐదు సంవత్సరాలకింద వరంగల్ లో పనిచేస్తుండిన ఒక పోలీసు అధికారి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ఉత్తరం రాస్తూ బాలగోపాల్ గురించి ‘ఎక్కడ శవం కనబడితే అక్కడ వాలే రాబందు’ అని వ్యాఖానించాడు. (ఇప్పుడు అదే పోలీసు అధికారి ఆయనను ప్రశంసిస్తూ మాట్లాడుతున్నాడు). ఆమాటలో ఉన్న కసినీ, వ్యంగ్యాన్నీ, దూషణనూ పట్టించుకోనక్కరలేదు. కాని నిజంగానే బాలగోపాల్ ‘బ్రదుకును ప్రచండ భేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం’ లాంటి సమగ్రవ్యక్తి. బతుకులోని సమస్త విషయాలనూ ఆయన పట్టించుకున్నారు. నిజంగానే గండభేరుండ దృష్టితో విహంగ వీక్షణ చేసి తన పరిధిలోకి రాని విషయంలేదని రుజువు చేసుకున్నారు. ప్రజాసమస్యల పరిశీలనకూ, ప్రజల హక్కుల రక్షణకూ ఎంత తీక్షణ, అత్యంత నిశిత దృష్టి అవసరమో ప్రదర్శించి చూపారు.

యాభైఏడు సంవత్సరాల జీవితంలో, తొలి ఇరవై ఐదు సంవత్సరాలు చదువుకు పోయినా, మిగిలిన ముప్పై సంవత్సరాలకు పైగా ఆయన సాధించిన విస్తృతి, సాగించిన కృషి చూస్తే ఒక మనిషి, ఇంత జీవితకాలంలో ఇన్ని సాధించగలరా అని ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ఆ చదువు కూడ ఆయన ఎంత అసాధారణ ప్రతిభతో సాగించారంటే, 1981లో ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో లెక్చరర్ పదవికి ఇటర్వ్యూకు హాజరయినప్పుడు, ప్రొఫెసర్లకు కూడ లేని అర్హతలు ఆయనకు ఉన్నాయని ఇంటర్వ్యూ కమిటీ అభిప్రాయపడిందని చెప్పుకునేవారు. అప్పటికే ఆయన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి, రీజినల్ ఇంజనీరింగ్ కాలేజిలో గణితశాస్త్రంలో ఎం ఎస్ సి (1974), అక్కడే స్టాటిస్టిక్స్ లో పి ఎచ్ డి (1977) చేసి, ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో పోస్ట్ డాక్టొరల్ రిసర్చ్ చేస్తూ 1980లో వదిలేసి వచ్చారు. స్టాటిస్టిక్స్ కు చెందిన అంతర్జాతీయ ప్రామాణిక పత్రికలలో పరిశోధనా పత్రాలు రాశారు. అమెరికన్ మాథమాటికల్ సొసైటీ పత్రికకు సమీక్షాసంపాదకుల బృందంలో ఉన్నారు. అంటే మూడు పదులు నిండకుండానే ఆయన ఇటు గణితశాస్త్రంలో అపారమైన ప్రజ్ఞ మాత్రమే కాక, క్రికెట్, సంగీతం, సినిమాలు, సాహిత్యం వంటి విభిన్నమైన, వైవిధ్యభరితమైన ఆసక్తులలో కేవలం ప్రవేశమే కాదు, ప్రావీణ్యం సంపాదించి ఉన్నారు. అప్పటికే మార్క్సిస్టు ప్రామాణిక గ్రంథాలు చదివి మార్క్సిజాన్ని ఒక శాస్త్రంగానూ, ప్రజాసమస్యల పరిష్కారమార్గం గానూ నమ్ముతున్నారు. ఆయనే 1987లో జెంటిల్ మన్ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పినట్టు, ఆర్ ఇ సి లో పి ఎచ్ డి చేస్తున్న కాలంలో అమరుడు సూరపనేని జనార్దన్ వంటి రాడికల్ విద్యార్థుల కార్యక్రమాలు, వరంగల్ ప్రజాచైతన్యం, ఎమర్జెన్సీ నిర్బంధం చూస్తూ, అసలు వీళ్లు చెప్పే మార్క్సిజం ఏమిటో తెలుసుకోవాలని కాపిటల్ చదివేశారు.

1981 మార్చ్ లో కాకతీయ విశ్వవిద్యాలయ గణిత శాఖలో లెక్చరర్ గా చేరి, అప్పటినుంచే సృజన సాహితీమిత్రులలోనూ, పౌరహక్కుల సంఘంలోనూ పనిచేయడం మొదలుపెట్టారు. 1983లో పౌరహక్కులసంఘం ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1980 నుంచీ కూడ ఆయన వరంగల్ సామాజిక జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా, ఎందరికో తలలో నాలుకలా, మిత్రుడిగా, ఆత్మీయుడిగా ఎదిగారు. ఆ రోజుల్లో ఆయన సహాయం పొందని వరంగల్ ప్రజా ఉద్యమ కార్యకర్తలు ఒక్కరు కూడ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతి రాడికల్ విద్యార్థి యువజన కార్యకర్తకూ ఆయన తమకు రక్షణగా ఉన్నాడనే భరోసా ఉండేది. జిల్లాలో అప్పుడు విస్తరిస్తున్న రైతాంగ ఉద్యమం ఆయనను తన మిత్రుడిగా, మార్గదర్శిగా, ప్రచారకుడిగా ఆత్మీయంగా తీసుకుంది. అందుకే పాలకవర్గాలకు, పోలీసులకు ఆయన పేరే కంటగింపయింది. 1985లో పోలీసు ఇనస్పెక్టర్ యాదగిరిరెడ్డి శవయాత్ర డా. రామనాథం ఆస్పత్రి మీదుగా వెళ్లడంతో డాక్టరుగారి హత్య జరిగిందిగాని, ఆ ఊరేగింపులో ‘బాలగోపాల్ ను చంపుతాం’ అని పోలీసులు నినాదాలు ఇచ్చారు. అప్పటికాయన హనుమకొండలో రాగన్నదర్వాజలోని ఒక చిన్న గదిలో ఉంటున్నారు. ఇక వరంగల్ లో ఉండలేని పరిస్థితి వచ్చాక నాలుగైదేళ్లపాటు పేరుకు హైదరాబాదులో గది ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లేవారు. తర్వాత హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పడి, న్యాయవాదవృత్తి మొదలుపెట్టినా ప్రతి శని ఆదివారాలు ఎక్కడికో ఒకచోటికి వెళ్ళి ప్రజాసమస్యల అధ్యయనాలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. మార్క్సిస్టు దృక్పథం నుంచి దూరమయ్యానని తానే రాసినా, పౌరహక్కుల సంఘంలో చర్చ ఫలితంగా మానవహక్కుల వేదిక ఏర్పాటు చేసినా ఆయన తనకోసం తాను నిర్వచించుకున్న పనిని, సమాజమూ కాలమూ తన నుంచి ఆశించిన పనిని ఎన్నడూ వదిలిపెట్టలేదు.

బహుముఖ ప్రజ్ఞ, విస్తారమైన అధ్యయనం, నిరంతరమైన పని, అత్యంత నిరాడంబరమైన జీవనశైలి నిండిన బాలగోపాల్ ఆలోచనలనుంచీ, రచనల నుంచీ, ఆచరణనుంచీ, పని విధానం నుంచీ నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. బహుశా తెలుగు సామాజిక కార్యకర్తలలో ఆయన మొదటిసారి ప్రారంభించిన సంప్రదాయాలూ ఉన్నాయి. తెలుగులో ప్రజాఉద్యమాలు, ఉద్యమకారులు రచనలు, ఉపన్యాసాలు చాలవరకు ఆలంకారిక శైలిలో, ఉత్తేజపరిచే లక్ష్యంతో ఉండడమే ఎక్కువ అలవాటు. కాని ప్రజాఉద్యమాల ఆలోచనలు విషయ పరిజ్ఞానంతో, వాదనాపటిమతో, విశ్లేషణా శక్తితో, ఇతరులను, ముఖ్యంగా ఆ సమస్య గురించి అవగాహనలేని వాళ్లను ఒప్పించగల నేర్పుతో ఉండాలనేది ప్రధానంగా బాలగోపాల్ ఇచ్చిన కానుకే. విశాల ప్రజాసమస్యలపట్ల అధ్యయనం లేకుండా ఊకదంపుడు మాట్లాడగూడదని, ఆ సమస్యలను స్థూలస్థాయిలో మాత్రమే కాక, సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేయాలనీ ఆయన తన ఆచరణ ద్వారా చెప్పారు. సాధారణంగా ప్రజా ఉద్యమాలు తమవాళ్లనే ఉద్దేశించి మాట్లాడుతూ, ఇదివరకే పరివర్తన పొందినవారిని పరివర్తన చెందించడానికి ప్రయత్నిస్తుండగా, ఆయన కొత్తవారినీ, తటస్థులనూ ఆకట్టుకోవడానికి ప్రయత్నించి విజయం సాధించారు.

ఇలా కొత్తవారిని ఆకర్షించడం అనేది కేవలం సంఖ్యా బలాన్ని పెంచడానికి మాత్రమే కాదు, అసలు అవగాహనలోనే ప్రజాఉద్యమం అనేది అత్యంత సూక్షమైన సమస్యలను కూడ పట్టించుకుని, ఆ చిన్న చిన్న పోరాటాలను కూడ ఏకం చేసి మహాప్రవాహం కావాలని ఆయన విశ్వసించారు. అందువల్లనే ఆయన కృషి పౌరహక్కుల ఉద్యమ పరిధిని విస్తృతం చేయడం దిశగా సాగింది. కేవలం రాజ్య హింస, రాజ్యాంగ బద్ధమైన హక్కుల పరిరక్షణ మాత్రమే కాక, అన్ని ఆధిపత్య శక్తులు సాగించే హక్కుల ఉల్లంఘనలమీద మాట్లాడాలని ఆయన పరిధిని విస్తృతపరచడం మొదలుపెట్టారు. అలా పౌరహక్కుల ఉద్యమం 1980లలో అనేక కొత్త సమూహాలలోకి, సమస్యలలోకి, ప్రాంతాలలోకి విస్తరించింది. ఆ వాదనను ఆయన ప్రజాఉద్యమ నిర్మాణాలు కూడ ఆధిపత్య శక్తులు కాగలవనే వాదనలోకి, వారి ఉల్లంఘనలను కూడ ఖండించాలనే దగ్గరికి తీసుకుపోయారుగాని, అయినా ప్రజల సమస్యలపై ఉద్యమాలను మాత్రం సంపూర్ణంగా సమర్థిస్తూనేవచ్చారు.

పౌరహక్కుల ఉద్యమంతోపాటు సాహిత్య విమర్శ, చరిత్ర, తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రాలు, సమకాలీన రాజకీయార్థిక పరిణామాలు, మొదలయిన ఎన్నో విషయాలమీద ఆయన సాగించిన రచనలు, అద్భుతమైన సమాచార, విశ్లేషణా సంపదతో నిండిన వక్తృత్వం, పదునైన వ్యంగ్యం వంటి అపారమైన కృషి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే  మేధావి – కార్యకర్త అనేవి ఒకదానికొకటి సంబంధంలేని ద్వంద్వాలనీ, మేధావి అనిపేరు వచ్చినవారు పనిచేయరనీ, కార్యకర్తలు మేధోకృషి సాగించలేరనీ ఉన్న దురభిప్రాయాన్ని ఆయన తన జీవితాచరణతో రద్దుచేశారు.

1980లో సృజనలో ఆర్ ఎస్ సుదర్శనం రాసిన మార్క్సిజం – సాహిత్యం పై త్రిపురనేని మధుసూదనరావు విమర్శ రాయగా, దానిమీద చర్చ జరిగింది. ఆ చర్చలో పాల్గొంటూ రాసిన వ్యాసం బాలగోపాల్ మొదటి తెలుగు వ్యాసం కావచ్చు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆర్ ఇ సి క్వార్టర్స్ లో మిత్రుడి ఇంట్లో ఉంటూ ట్యూషన్లు  చెప్పుకుంటూ ఉండిన రోజులనుంచీ 30 సంవత్సరాల అనుబంధంలో లెక్కలేనన్ని అనుభవాలు. ఆయన వ్యక్తిగతంగా నాకు గురువు, మిత్రుడు, మార్గదర్శి, జీవనదాత. 1988 మార్చ్ లో నేను ఒక రోడ్డుప్రమాదానికి గురయి చావుబతుకుల మధ్య ఉండినపుడు, పోలీసులు చేర్చిన ఆస్పత్రిలోనే ఉంటే బహుశా చచ్చిపోయి ఉండేవాడినే. అక్కడ వైద్యం సరిగాలేదని, వాళ్లతో పోట్లాడి, ఏమైనా చేసుకోండి అని నన్ను భుజాన వేసుకుని మరో ఆస్పత్రికి చేర్చి నన్ను బతికించినది బాలగోపాలే. అంతకు రెండు సంవత్సరాల ముందు నాజీవితంలో ఒక ముఖ్యమైన మార్పు ఆయనతో చర్చించి తీసుకున్న నిర్ణయమే. ఆయన అభిప్రాయాలతో తీవ్రమైన విభేదం వచ్చినప్పుడు ఆయనను విమర్శిస్తూ పుస్తకమే రాసినప్పటికీ ఆయన అపారమేధోశక్తిముందు, ఆయన అకుంఠితదీక్షముందు, అవిశ్రాంతమైన ఆయన పనిముందు ఎప్పుడూ వినమ్రుడినై ఉన్నాను. అక్టోబర్ 9 సాయంకాలం పంజగుట్ట శ్మశానవాటికలో కట్టెలపరుపుమీద ఆయన చేతిని ఆఖరిసారి ముట్టుకుని ఆ వినమ్రత ప్రకటించాను.

ఆయననుంచి నేర్చుకుని, ఆచరణలో పెట్టినప్పుడే ఆయనలేని లోటు కొతయినా తీరుతుంది.

* రచన అక్టోబర్ 10, 2009

* ప్రచురణ మానవీయ బాలగోపాల్ నివాళి వ్యాసాలు, అక్టోబర్ 2009

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

One Response to అక్షరాలా తీరని లోటు

  1. sri sasidhar says:

    kevalam dabbu ,swartham chuttu tirugutunna prastutha samajamlo manava jeevitha paramarthanni chetalatho choopina maha manishi.Manavahakkula kosam nirataram tapinchi,jwalinchi velugu choopinchi oka margadarsiga manaki dari choopinchi vellipoyadu.prastuta yuvataraniki alanti vyakthi okadu unnadu ani teliyadam chala avasaram.We miss u sir…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s