రాజోళి, అలంపురం విషాదం

(అక్టోబర్ 19, 2009, ఆంధ్రజ్యోతి దినపత్రిక)

తుంగభద్ర – కృష్ణ వరద బీభత్సంలో కకావికలయిన ప్రజాజీవనానికి సహాయ సహకారాలు అందించడానికి, దెబ్బతిన్న వేలాది బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి సమాజమంతా పెద్ద ఎత్తున కదులుతున్నట్టు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలన్నీ సహాయ, పునరావాస కార్యక్రమాలలో తలమునకలుగా ఉన్నట్టు ఒక అభిప్రాయం చలామణీలోకి వచ్చింది. పనిచేసే వారినెవరినీ విమర్శించనక్కరలేదేమో. సహాయ, పునరావాస చర్యలు పెద్ద ఎత్తునే జరుగుతున్నమాట, సామూహిక ఔదార్యం వ్యక్తమవుతున్నమాట నిజమేనేమో. కాని ప్రజల విషాదం, దైన్యం, దిగ్భ్రాంతి, సహాయం కోసం ఎదురుచూపు మాత్రం మొదటిరోజున ఎట్లా ఉండి ఉంటాయో అట్లాగే ఉన్నాయి.

జలప్రళయం ఎగసిపడి నిండా రెండువారాలు గడిచిన తర్వాత కూడ ఆ దుస్థితి ఏమీ మారలేదని మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం రాజోళి గ్రామ శిథిలాలను, అదే జిల్లా అలంపురం పట్టణవీథులను పైపైన చూసినా అర్థమవుతుంది. సుంకేశుల ఆనకట్ట తెగిపోయి వరద తీసిందేమో గాని, రాజోళిలో కన్నీటివరద ఇంకా ఆగలేదు. శ్రీశైలం నుంచి వరదనీరు కిందికి పంపినందువల్ల పైన అలంపురంలో తుంగభద్రలో నీళ్లు కనబడడం లేదేమోగాని రక్షణకు కట్టిన రాతికట్టమీదినుంచి తుంగభద్ర దూకి ధ్వంసమైన ఇళ్లూ జీవితాలూ జీవనోపాధులూ ఇంకా ఆ బీభత్సాన్ని అనుభవిస్తూనే, ప్రకటిస్తూనే ఉన్నాయి.

మన అధికార వ్యవస్థలకు తోటి మనుషులపట్ల కనీస గౌరవం లేదని చెప్పడానికి నిదర్శనంగా రెండు ఊళ్లలోనూ భరించరాని దుర్గంధం వ్యాపించి ఉంది. కనీసం ఆరేడు అంగుళాల నుంచి గరిష్టంగా రెండు మూడు అడుగుల మేర పేరుకుపోయిన ఒండ్రుమట్టిలో, బురదలో చిక్కుకున్న జీవజాతుల కళేబరాలు కుళ్లినవాసన, ఆహారపదార్థాలు కుళ్లిన వాసన, మురికి కాలువలు రోడ్ల బురద కలగలిసిపోయి ముక్కులు బద్దలు చేసే నీచు వాసన, కుళ్లువాసన. చూడడానికి వెళ్లినవాళ్లు కొన్ని గంటలకోసమో, నిమిషాలకోసమో అది భరించలేక ముక్కులకు గుడ్డలు అడ్డం పెట్టుకుని, వాంతులు చేసుకుంటూ ఉంటే, నిస్సహాయులైన రాజోళి ప్రజలు, అంతకన్న ఎక్కువగా అలంపురం ప్రజలు ఆ దుర్వాసనలో తిరుగుతున్నారు, వండుకుని తింటున్నారు, నిత్యజీవిత కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఎంత దుర్మార్గమైన లోకం ఇది?! రెండువారాలు గడిచినా కనీసం బురద శుభ్రం చేయడానికి శక్తి చాలని, మనసుపోని అధికార యంత్రాంగం ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు? నాయకులకు రక్షణ కవచంగా నిలబడే వందలాదిమంది, ప్రజల ఆందోళనలను అణచడానికి సర్వ శక్తి సాధనాలతో తరలివచ్చే వేలాదిమంది ‘ప్రజాసేవకుల’ వ్యవస్థ కొన్ని గ్రామాలలో బురద ఎత్తించడం లాంటి చిన్నపని చేయడానికి వారాల తరబడి తీసుకుంటోంది. ఉద్యమకారులను అణచడానికి వేలాది మందిని హుటాహుటిన క్షణాలమీద పంపించే ప్రభుత్వం ఒక్కొక్క గ్రామంలో నుంచి కొన్ని వందల టన్నుల బురదను తొలగించి, కడిగి, శుభ్రం చేసి, రోగాలకు నిలయం కాకుండా చేయడానికి కనీస చర్యలు కూడ చేపట్టలేదు. ఎవరి ఇంట్లో బురద వాళ్లే ఎత్తేసుకుంటారులే, ప్రకృతే శుభ్రం చేస్తుందిలే అన్నట్టు ఉపేక్షిస్తోంది. ఎర్త్ మూవర్లు, బుల్డోజర్లు వచ్చాయి గాని కేవలం ప్రభుత్వవాహనాలు, సందర్శకుల వాహనాలు తిరగడానికి వీలయినంత మట్టుకు రోడ్లమీద బురదను పక్కకు నెట్టాయి. ఇప్పుడు రోడ్డుకు రెండు పక్కలా దుర్గంధపు కుప్పలు. ఆ దుర్వాసన మహాఘనతవహించిన సందర్శకులను చికాకు పెట్టకుండా ఆ కుప్పల మీద డిడిటి, క్లోరిన్ చల్లితే చాలునని మాత్రం అధికారగణం అనుకున్నట్టుంది. రెండు గాఢమైన వాసనలు కలిసి దుర్భరమైన వాతావరణం.

దుర్వాసన ఒకపక్కనయితే, మనిషి పట్ల గౌరవం లేని, మనుషులందరినీ బిచ్చగాళ్లుగా చూసే ప్రభుత్వాధికారుల, రాజకీయనాయకుల, సందర్శకుల వైఖరి. రెండువారాలుగా నిస్సహాయతలో మగ్గిపోయి, వాహనం కనబడితే చాలు ఏదో ఇవ్వడానికి ఎవరో వచ్చారని, ఈ వేటలో వెనుకబడితే ఆ ఆందేదేదో అందదని దయనీయమైన ఆదుర్దా మరొకపక్కన. నిన్నటివరకూ తన శ్రమమీద తాను ఆధారపడుతూ, ఆత్మగౌరవంతో బతికిన మనిషి ఇవాళ ఇంత దుర్భరమైన స్థితిలోకి జారిపోతే, కనీస గౌరవం కూడ లేకుండా తోటి మనుషులూ, అధికార వ్యవస్థలూ ఎలా పనిచేస్తున్నాయో చూస్తే ఆపుకోలేని దుఃఖం కలిగింది. మనిషి ముందర మనిషి ఇంత దీనంగా ఉండవలసిన పరిస్థితి ఎందువల్ల తలెత్తింది?

ఇంకా ఘోరం దారి పొడవునా గుట్టలుగుట్టలుగా పారవేసిన పాతబట్టలు. గ్రహీతలకు అవసరమయినవి, గౌరవప్రదమయినవి ఇస్తున్నామా లేదా చూడకుండా సహాయం పేరుమీద ప్రకటితమైన ఔదార్యం నిజంగా బాధితులకు పనికిరాలేదు. లేదా బాధితులకు అవసరమయినవి అందలేదు. ఫలితం పాతబట్టలు, చాలీచాలనిబట్టలు అందినవాళ్లందరూ అక్కడికక్కడే పారేసిపోయారు.

రాజోళి జనాభా 2001 జనగణన ప్రకారం 11,617. బహుశా ప్రస్తుతం పదిహేనువేలు కావచ్చు. సరిగ్గా సుంకేశుల ఆనకట్ట కింద ఉండే ఈ గ్రామం ఆ అనకట్ట తెగి మీద పడడంతో హతాశురాలయింది. ఆ ఆనకట్ట రాత్రిపూట తెగి ఉంటే, సరిగ్గా ముప్పైఏళ్లకింద గుజరాత్ లో ఆనకట్ట తెగి మోర్వీ పట్టణంలో వేలాదిమంది మనుషులు జల సమాధి అయిపోయినట్టు అయి ఉండేది. ‘అలా జరిగినా బాగుండును, మాకూ ఈ బాధ తప్పేది, మీకూ ఈ బాధ తప్పేది’ అని ఒక చేనేత కార్మికుడు కన్నీళ్లింకిపోయిన గొంతుతో, సమాజం తలదించుకోవలసిన మాట అన్నాడంటే ఆ ఊరు ఎంత దుఃఖాన్ని చవిచూసి ఉంటుంది! ఆ ఊరిలో ఇళ్లన్నీ నేలమట్టమయిపోయాయి. గోడలు గట్టిగా నిలిచి ఉన్నచోటకూడ ఇళ్లలో రెండడుగులమేర బురద నిండి నివాసయోగ్యం కాకుండాపోయాయి. అక్కడినుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కాస్త మెరకగా ఉన్నచోట పునరావాసం కల్పించవచ్చుగాని జీవనోపాధి కల్పించడం అత్యవసరమైన పెద్దపని.

ఆ గ్రామంలో కనీసం మూడువేలమగ్గాలు పనిచేస్తున్నాయని ఒక అంచనా. ఆ మూడువేల మగ్గాలు ఇవాళ విరిగిపోయి ఉన్నాయి. వేలాది కుటుంబాల జీవనాధారం ధ్వంసమైపోయింది. ఒక్క పద్మశాలి కుటుంబాలు మాత్రమే కాదు, రాజోళిలో ముస్లింలు, కురబ, చాకలి, కమ్మరి వంటి ఇతర కులాలవాళ్లు కూడ నేతపనిలో ఉన్నారు. గద్వాల వంటి ప్రఖ్యాత నేతవస్త్రాల మార్కెట్లకు తమ ఉత్పత్తులు అందిస్తున్నారు. ఒక మగ్గం పునర్నిర్మించాలంటే కనీసం అరవై వేలనుంచి లక్ష రూపాయలు అవసరమవుతుంది. సహాయ పునరావాస కార్యక్రమాలలో ఈ జీవనోపాధి నష్టం లెక్కకే రావడం లేదు. చేనేత సహకార సంఘం కార్యాలయంలో ఉన్న కోటి రూపాయలకు పైగా విలువచేసే వస్త్రాలు, నూలు నాశనమయిపోయాయి. అ కార్యాలయంలోనుంచి బురద ఎత్తివేయడానికి అధికార యంత్రాంగం ఏమీ చేయలేదు. ఎంత కూలి ఇచ్చినా ఆ దుర్గంధపూరితమైన బురద ఎత్తిపోయడానికి ఎవరూ దొరకక, చేనేత కార్మికులు, ఆ కార్యాలయ ఉద్యోగులు పారిశుధ్యకార్మికులలా పనిచేస్తున్నారు.

ఇక అలంపురంలో ఎక్కడ చూస్తే అక్కడ సహాయ శిబిరాలు, బృందాలు, అధికారగణం కనబడుతున్నారు గాని, అంతకన్న మించిన దుర్వాసన. పరిశుభ్రమైన, గౌరవప్రదమయిన వాతావరణం ముందు కల్పించాలనే కనీస స్పృహ కొరవడిన స్థితి. అసలు ఆ ఊరే శ్రీశైలం జలాశయంలో ముంపుకు గురవుతుందని అనుకున్నప్పుడు, ప్రాచీన ఆలయాలను, ఊరిని రక్షించడానికి పెద్ద రాతిగోడ కట్టారు. తుంగభద్రలో అనూహ్యమైన వరద వచ్చినందువల్ల, సుంకేశుల ఆనకట్ట నిర్మాణంలో గతంలో జరిగిన అవకతవకలవల్ల, ప్రస్తుతం ఆ ఆనకట్ట తెగిపోయినందువల్ల ఆ రాతిగోడమీదినుంచి వరద ఊళ్లోకి ప్రవేశించింది. అసలు సుంకేశుల ఆనకట్ట నిర్మాణం దగ్గరినుంచీ ఊళ్లోకి ప్రవేశించిన బురదను ఎత్తిపోయడం దాకా ప్రభుత్వ, అధికార యంత్రాంగం లోపాలు, నిర్లక్ష్యాలు, అక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పటి బురద ఇది? ఎంత కడిగితే తరుగుతుంది ఇది?


Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s