బాలగోపాల్ సాహిత్య వ్యక్తిత్వం

(అక్టోబర్ 16, 2009 ఈభూమి మాసపత్రిక )

బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర ఆలోచనాచరణశీలి కె. బాలగోపాల్ తెలుగు సామాజిక జీవనంలో అనేక రంగాలకు అందించిన కానుకల గురించి ఎందరో గుర్తు చేసుకుంటున్నారు. ఆయన వ్యక్తిత్వంలో పౌరహక్కుల కృషికి, తాత్విక, రాజకీయార్థిక, సామాజిక రంగాలలో మేధోకృషికి ఎంత స్థానం ఉందో సాహిత్యానికి కూడ అంత స్థానం ఉంది. నిజానికి ఆయన సామాజిక జీవితం సాహిత్య రంగంలోనే ప్రారంభమయింది. కార్యమగ్నత వల్ల సాహిత్య రచనల మీద కొంతకాలంగా శ్రద్ధ పెట్టకపోయినప్పటికీ, 1981 నుంచి ఇరవై సంవత్సరాలకు పైగా ఆయన సాహిత్యం గురించి ఆలోచించినదీ, ప్రకటించినదీ ఎంతో ఉంది. మొత్తంగా సాహిత్యవిమర్శకు, వ్యాస ప్రక్రియకు, ఉపన్యాస ప్రక్రియకు ఆయన అందించిన కానుకల గురించి చెప్పవలసినది చాల ఉంది.

ఆయన గురించి ఏమి చెప్పబోయినా, ఏమి రాయబోయినా అక్షరాలనిండా కన్నీళ్లు అలుక్కుపోతున్నాయి. ముప్పై సంవత్సరాల సాన్నిహిత్యంలో, అందులో కనీసం పదిహేను సంవత్సరాల ఆత్మీయతలో లెక్కలేనన్ని సహానుభవాలు దుఃఖపు వరదలో ముంచెత్తుతున్నాయి. విజ్ఞానసర్వస్వం లాంటి విషయపరిజ్ఞానం, పదునైన వ్యంగ్యం, లోతయిన విశ్లేషణ, అంగీకరించకపోయినా గౌరవించకతప్పని అభిప్రాయాల చిత్తశుద్ధి, ఎవరయినా వినమ్రంకాక తప్పని వ్యక్తిగత నిరాడంబరత్వం – ఆయనలోని ఏ కోణాన్ని గురించి ఎంత రాస్తే అర్థం చేయించడం సాధ్యమవుతుంది? ఒక సమగ్ర జీవితచరిత్ర పుస్తకమో, సంకీర్ణమైన బృహన్నవలో మాత్రమే ఆయనలోని వైవిధ్యాన్ని కొంతయినా గ్రహించగలదేమో. ఒక మంచి రష్యన్ నవలాపాత్ర లాంటి, బహుశా ఆయనకు చాల ఇష్టమయిన డాస్టవిస్కీ చిత్రించిన పాత్రల లాంటి సమగ్రమైన, సంకీర్ణమైన, సంక్లిష్టమైన, విస్తృతమైన వ్యక్తిత్వం ఆయనది. ఒక అద్భుత రచయిత ఎన్నో స్వభావాలను కలగలిపి తన ఊహాశక్తితో సృష్టించే కల్పితపాత్రకు తప్ప, నిజజీవిత వ్యక్తికి ఇంత వైవిధ్యభరితమైన వ్యక్తిత్వం ఉంటుందా అని ఆశ్చర్యం కలుగుతుంది.

తాను తెలుగు సాహిత్యవిమర్శకు చేసిన దోహదం పెద్దగా లేదనే బాలగోపాల్ స్వయంగా అనుకున్నారు. “నాకు సాహిత్యంతో లోతయిన పరిచయం ఎప్పుడూ లేదు…సాహిత్యం మీద నేను రాసిన వ్యాసాలు సమగ్రమయిన సాహిత్యవిమర్శ అని నేను అనుకోవడం లేదు” అని 1989లో కృష్ణుడు చేసిన ఇంటర్వ్యూలో అన్నారు. కాని ఆయన సాహిత్యం మీద వెలిబుచ్చిన అభిప్రాయాలూ, రాసిన వ్యాసాలూ, పుస్తక సమీక్షలూ, ముందుమాటలూ, చేసిన విశ్లేషణలూ, సాహిత్య సభలలో చేసిన ప్రసంగాలూ, సాహిత్యరంగం గురించే ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలూ అన్నీ కలిపితే రాశిలో తెలుగు సాహిత్య విమర్శకులు చాలమందికన్న ఎక్కువ రచనాసంపదే ఉంది. వాసిలో అవి ఎంత మేలయినవో చెప్పనక్కరలేదు.

విజయవాడ స్నేహప్రచురణగా వెలువడిన ‘రూపం – సారం’ (1986) వ్యాస సంకలనం మినహా బాలగోపాల్ సాహిత్యరచనల పుస్తకం ఏదీ రాలేదు. పర్స్ పెక్టివ్స్ ప్రచురణ ‘కల్లోల కథాచిత్రాలు’ (1997) ప్రధానంగా పౌరహక్కుల మీద వ్యాసాలే అయినా అవీ సాహిత్య రచనలలాగనే భాసిస్తాయి. సాహిత్య వ్యాసం రాస్తున్నప్పుడు దానికి సామాజిక, రాజకీయ, తాత్విక నేపథ్యాన్ని సమకూర్చడం, రాజకీయ, తాత్విక వ్యాసం రాస్తున్నప్పుడు దాన్ని సాహిత్యశిల్పంతో తీర్చిదిద్దడం ఆయన శైలి. అందువల్ల ఆయన వ్యాసాలను వస్తురీత్యా సాహిత్య, సాహిత్యేతర వ్యాసాలు అని వేరుచేయవలసిందే తప్ప శిల్పరీత్యా చూసినప్పుడు అన్నీ సాహిత్యవ్యాసాలే. అన్నీ తెలుగు వ్యాసప్రక్రియను సంపన్నం చేసినవే.

ఆయన తెలుగు సాహిత్య విమర్శలోకి ప్రవేశించినది మార్క్సిజం – సాహిత్యం అనే చర్చలో భాగంగా. ఆర్ ఎస్ సుదర్శనం రాసిన ‘మార్క్స్ దృష్టిలో సాహిత్యం’ వ్యాసం, దానిమీద త్రిపురనేని మధుసూదనరావు విమర్శ 1979-80ల్లో సృజనలో వెలువడ్డాయి. తర్వాత ఆ చర్చలో పాల్గొన్నవారిలో సురేంద్రరాజు, నానీ, ఆర్. రవీంద్ర & మిత్రులు, సి. రామచంద్రారెడ్డి లతో పాటు కె.బి. పేరుతో రాసిన బాలగోపాల్ కూడ ఉన్నారు. ఆయన వ్యాసం సృజన ఏప్రిల్ 1981 సంచికలో అచ్చయింది. అచ్చుకాని కవిత్వం, ఆయనే తిరస్కరించిన రఘువంశం కావ్యం మినహాయిస్తే ఆ వ్యాసమే ఆయన తొలి సాహిత్యరచన కావచ్చు.

ఆ సమయంలోనే ఆయన వరంగల్ రావడంతో సృజన ‘సాహితీమిత్రులు’లో భాగమయ్యారు. ప్రతివారం రచనలను చదివి చర్చించి, ప్రచురణకు స్వీకరించడమో, తిరస్కరించడమో చేసేటప్పుడు ఆయా రచనలమీద ఆయన ముక్తసరిగానే అయినా విలువైన అభిప్రాయాలు చెప్పేవారు. ప్రతినెలా రాయవలసిన అవసరం ఉన్నదని అనుకున్న ఏదో ఒక విషయంపైన రచనచేయడానికి స్వచ్ఛందంగా గాని, అడగగానేగాని ఆయన సిద్ధంగా ఉండేవారు. అలా ఆయన రచనలు – సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు, పౌరహక్కులపై, రాజకీయార్థిక విషయాలపై వ్యాసాలు – సృజనలో మూడు డజన్లకు పైగా ప్రచురితమయ్యాయి.

గుంటూరు శేషేంద్రశర్మ రాసిన కవిసేన మానిఫెస్టోను సమీక్షించమని కోరినప్పుడు, శేషేంద్రశర్మ రష్యన్ విమర్శకులు లూనషార్స్కీని లూనా అనీ, మయకోవస్కీని మాయా అనీ ముద్దుగా పిలుస్తూ వారిని వక్రీకరించారని చెపుతూ, సమీక్షతోపాటే, లూనషార్స్కీ రాసిన ‘మార్క్సిస్టు విమర్శ – కొన్ని ప్రతిపాదనలు’ అనే వ్యాసాన్ని అనువాదం కూడ చేసి ఇచ్చారు. ఆ సమీక్ష, అనువాదం రెండూ కూడ సృజన సెప్టెంబర్ 1981 సంచికలో వచ్చాయి. ఒకరకంగా లూనషార్స్కీ సాహిత్య విమర్శ ఎలా ఉండాలని సూచించాడో బాలగోపాల్ సాహిత్యవిమర్శ రచనలు అలాగే సాగాయి.

ఆ సమయంలోనే బాలగోపాల్ విరసం సభ్యులుగా కూడ ఉన్నారు. అరుణతారకు అనేక రచనలు చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ తులసి, తులసిదళం గంజాయిదమ్ములాగ వ్యాపిస్తున్నప్పుడు కుహనా వైజ్ఞానిక నవలలు అని అరుణతారలో ఆయన రాసిన సమీక్షావ్యాసం (ఫిబ్రవరి 1982) ఎంతోమంది కళ్లు తెరిపించింది. 1983 తర్వాత పౌరహక్కులసంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన కార్యక్షేత్రం మారినప్పటికీ అడిగినప్పుడల్లా సాహిత్యరచనలు చేస్తూనే ఉండేవారు. కరీంనగర్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన కథాసంకలనం అడవిలో వెన్నెల (1985) కు ముందుమాట రాశారు. 1986 నవంబర్ లో సృజన పునఃప్రారంభించడానికి విజయవాడ నుంచి ప్రయత్నించినప్పుడు, ఆ ప్రయత్నాన్ని ప్రోత్సహించడమే కాక ‘ఊళ్లోకొచ్చిన ఎన్ కౌంటర్లు’ అనే వ్యాసం రాశారు. ఆ ప్రయత్నం విఫలమై ఖాదర్ మొహియుద్దీన్, ఉషా ఎస్ డానీ, ఏలూరి అజిత, జి శ్రీనివాసులు తదితరుల సహాయంతో ‘సమీక్ష’ పత్రిక ప్రారంభించినప్పుడు కూడ తొలి సంచికకే ఆయన ‘చారిత్రక దృక్పథం’ (మే 1987) అనే వ్యాసం రాశారు. ఆ సమయంలోనే శ్రీకాకుళ సాహితి నడిపిన జముకు పత్రికలో ‘సాహిత్యం – తాత్విక నేపథ్యం’ (నవంబర్ 1987) వ్యాసం రాశారు. వరవరరావు భవిష్యత్ చిత్రపటం నిషేధానికి గురయినప్పుడు ‘నిషేధానికీ నిర్బంధానికీ గురికాని రచయితలు ఉన్నారా?’ అని ఉదయంలో రాశారు. అక్షరభూమి కోసం కృష్ణుడు చేసిన విలువైన రెండుభాగాల ఇంటర్వ్యూ కూడ జూన్ 1989 లోనే ఆంధ్రభూమిలో అచ్చయింది. అలా 1990ల మొదటిదాకా విరివిగా సాగిన ఆయన సాహిత్య రచనలు ఆ తర్వాత కాస్త తగ్గిపోయాయి.

సృజన ప్రచురణగా సాధన రాసిన రాగో నవల వెలువడుతున్నప్పుడు ముందుమాట రాయమని కోరగా ‘మనిషి – చరిత్ర – మార్క్సిజం’ అనే వ్యాసం రాసి, అది ముందుమాటగా పనికి రాదని, కాని దానిమీద చర్చ జరగాలని, దాన్ని అరుణతారలో అచ్చువేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. అది 1993 సెప్టెంబర్ అరుణతారలో అచ్చయింది. ఆ వ్యాసం, ఆ తర్వాత ఆయన రాసిన తాత్విక, రాజకీయ వ్యాసాలు, తదనంతర చర్చ, వివాదం అంతా సమీపచరిత్రే. ఆ వివాదంలో రాజకీయాభిప్రాయాలదే పైచేయి అయి, తాత్విక అంశాలు మరుగున పడ్డాయి. సాహిత్య అంశాలు అసలు చర్చకే రాలేదు. ఆ తర్వాత ఆయన సాహిత్యాభిప్రాయాలు ప్రకటించిన సందర్భాలు ఇంకా తక్కువ. సృజన ప్రచురణ సారాకథలు కు, బుర్రా రాములు ఏడో సారా కథకు, ఎరియెల్ డార్ఫ్ మన్ నవల అనువాదం ‘మిస్సింగ్’ కు, ముస్లింవాద కవితా సంకలనం జల్ జలాకు ముందుమాటలు, ప్రజాతంత్ర సాహిత్య ప్రత్యేక సంచిక (2001) ఇంటర్వ్యూ వంటివి మినహాయిస్తే గత పదిహేను సంవత్సరాలలో ఆయన చేసిన సాహిత్య రచనలు ఎక్కువ ఉన్నట్టు లేవు.

మొత్తం మీద మూడు నాలుగు వందల పేజీలకు విస్తరించిన బాలగోపాల్ సాహిత్య రచనలను నిశితంగా పరిశీలిస్తే, ఆయన తెలుగు సాహిత్యానికీ, తెలుగు సాహిత్యవిమర్శకూ అందించిన కానుకలు ఎంత విలువైనవో అర్థమవుతుంది. ఆయన సాహిత్యకృషి ఎక్కువగా సాగిన మొదటిదశ పదిహేను సంవత్సరాలూ మార్క్సిస్టు దృక్పథాన్ని దృఢంగా నమ్మారు. మార్క్సిస్టు పరికరాలతోనే సాహిత్యాన్ని పరిశీలించారు. తర్వాతిదశ పదిహేను సంవత్సరాలలో మార్క్సిస్టు దృక్పథం మీద నమ్మకం పోయిందని ఆయనే చెప్పుకున్నారు. ఆ “ఆదర్శాలతోనూ విలువలతోనూ నాకు ఈరోజు కూడ పేచీలేదు (బహుశా ఎప్పటికీ ఉండదు) అని చెపుతూనే “కానీ వాటిలోని తాత్విక దృక్పథంతో నేనీ రోజు సంతృప్తి చెందడం లేదు” అని అన్నారు. ఈ దశలో ఆయన సాహిత్య రచన కూడ తగ్గింది.

మొదటి దశ కృషిలో ఆయన నుంచి మిరుమిట్లు గొలిపే విశ్లేషణ వెలువడింది. రాజకీయార్థిక శాస్త్రం, తత్వశాస్త్రం, చరిత్ర, విజ్ఞాన శాస్త్రాలు ఇచ్చే అవగాహన, గణితశాస్త్రపు సునిశితత్వం, అత్యంత సరళమైన, వ్యంగ్యం అద్దుకున్న శైలి మిళితమైన సంపన్నమైన సాహిత్య విమర్శ అది. రెండో దశలో తెలుగు ప్రగతిశీల సాహిత్య సంప్రదాయం అంగీకరించలేని అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రధానంగా సాహిత్యం వైపు నుంచీ, తాత్విక దృష్టి నుంచీ కొత్త ప్రశ్నలు, ఆలోచించవలసిన ప్రశ్నలు ఆయన లేవనెత్తారు. తెలుగు సాహిత్య పరిధిని విస్తరించడానికి ఆయన ప్రయత్నించారు.

సాధారణంగానే ఆయన చూపు మరెవరూ చూడని కోణాలు చూసేది. సాహిత్యంలో కూడ ఆయన అలాగే సాధారణంగా తెలుగు సాహిత్యకారులకూ, సాహిత్యవిమర్శకులకూ స్ఫురించని ఆలోచనలు చేశారు. బహుశా అందువల్లనే కొన్నిసార్లు అపార్థానికీ, కొన్నిసార్లు వివాదానికీ కారణమయ్యారు. ఆర్ ఎస్ సుదర్శనం మీద విమర్శతో ప్రారంభమైన ఆయన సాహిత్య కృషి, ఆ తర్వాత కాలంలో గుంటూరు శేషేంద్రశర్మ, కంభంపాటి సత్యనారాయణ, యండమూరి వీరేంద్రనాథ్, సి వి సుబ్బారావు, రంగనాయకమ్మ, రావిపూడివెంకటాద్రి, స్త్రీశక్తిసంఘటన, ఉప్పల లక్ష్మణరావు లాంటి వారి అభిప్రాయాల మీద విమర్శగా సాగింది. ఎవరిలోనైనా అమోదించవలసిన అంశాలను ఆమోదిస్తూనే, విమర్శించవలసిన అంశాలను సునిశితంగా విమర్శించారు. ఎప్పుడయినా ఆయన దృష్టి విషయం మీదనే తప్ప తాను విమర్శిస్తున్న వ్యక్తి తన శిబిరంలోని వారా కాదా అనేదాని మీద కాదు. ఆ నిష్కర్ష ఆయనలో తొలిరచన నుంచీ చివరిదాకా ఉంది. అది ఒకరకంగా చూస్తే నిరంతర అన్వేషణ అని కూడ అనుకోవచ్చు. ఆ అన్వేషణలో భాగంగానే ఆయన సాహిత్యాభిప్రాయాలు, వాటికి పునాది అయిన తాత్విక అభిప్రాయాలు మారుతూ వచ్చాయి.

“చారిత్రక ఆశావాదాన్నీ భౌతికవాదాన్నీ ప్రాతిపదికగాగల తాత్విక దృక్పథాన్ని సాహిత్యానికి భూమికగా నిలబెట్టే ప్రయత్నం కావాలి. సమాజాన్ని ఒక మొత్తంగా మార్చడం ప్రజలకు సాధ్యం అనీ మార్చడానికి అనుగుణ్యంగా తమను తాము మార్చుకోవడం కూడ సాధ్యం అనీ చెప్పే సాహిత్యం కావాలి. గతంలో జరిగిన, ఇవ్వాళ జరుగుతున్న, ప్రజాపోరాటాల వెలుగులో ఈ సందేశాన్ని అందివ్వడం సాహిత్యం కర్తవ్యం కావాలి” అని ఆయన 1987 లో రాశారు.

“సాహిత్య వస్తువయిన జీవితం ఒకే సమయంలో అనేక లెవల్స్ లో ఉంటుంది. వస్తుగత సామాజిక సంబంధాలుంటాయి. వాటిమధ్య ఘర్షణలుంటాయి. వాటిని మనం దర్శించుకునే విభిన్న సిద్ధాంత, తాత్విక, భావజాల చట్రాలుంటాయి. వాటిమధ్య సంఘర్షణ ఉంటుంది…జీవితం ఇన్ని లెవెల్స్ లోనూ ఒకే సమయంలో ఉంటుంది. ఉన్నతమయిన సాహిత్యం కూడ అన్ని లెవెల్స్ లోని జీవితాన్నీ వాటి అంతస్సంబంధాన్నీ విశదీకరిస్తుంది…సాహిత్య విమర్శ కూడా అన్ని లెవెల్స్ లోనూ ఒకే సమయంలో వ్యవహరించగలిగినప్పుడే పరిపూర్ణం అవుతుంది. వాస్తవికత – భావజాలం, సమాజం – వ్యక్తి అనే గతితార్కిక ద్వంద్వాలలోని అంతస్సంబంధాన్ని సమగ్రంగా విశదీకరించకుండా ఒక దాన్ని మట్టుకు ప్రతిపాదించి రెండవదాన్ని తత్ఫలితమయిన అనివార్య పర్యవసానంగా కొట్టిపారేసేది సమగ్రమయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శకాదు” అని 1989లో అన్నారు.

“జీవితంలోని ఖాళీలను పూర్తి చేయడం సాహిత్యం పాత్ర…దానికి వేరే ఏ కర్తవ్యాన్ని అప్పగించడంలోనూ అర్థం లేదు” అని 2001 లో అన్నారు.

ఆయన సాహిత్యాభిప్రాయాలలోని ఈ భిన్నత్వాన్ని అంతిమ నిర్ధారణగా కాక అన్వేషణగా గుర్తిస్తే లోతయిన చర్చకు వీలు కలుగుతుంది. ఆ అభిప్రాయాల సమర్థన కోసమో, తిరస్కరణ కోసమోకాక, తెలుగునాట సాహిత్య స్వభావం గురించీ, సాహిత్య ప్రయోజనం గురించీ అవసరమయిన చర్చకు బాలగోపాల్ స్మరణను ఒక సందర్భంగా చూడాలి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s