వరంగల్, ఇవాళ నా మనసంతా నీచుట్టే

(ప్రజాతంత్ర  వారపత్రిక ఆఖరి పేజీ, మే 26, 2010)

వరంగల్, నువ్వు ధిక్కార పతాకవని నాకెంత గర్వమో నీకు తెలుసు. ఎన్ని అవరోధాలు ఎదురయినా తిరగబడడమే నువు నీ బిడ్డలకు అందించిన గొప్ప వారసత్వ సంపద. అనేకసార్లు నా మాటల్లోనూ రాతల్లోనూ నీ ఘనతను చెప్పే ఉన్నాను. నీమీద నాప్రేమ కేవలం నా రక్తాణువుల్లో నీ నేలగంధం వ్యాపించి ఉన్నదని మాత్రమే కాదు. నీమట్టితో నేను తయారయ్యానని మాత్రమే కాదు. నా జన్మభూమివి కాకపోయినా గౌరవించవలసిన అద్భుత ఉజ్వల ప్రజాపోరాట సంప్రదాయ భూమికవు నువ్వు.

వందల  సంవత్సరాలుగా పోరాట చైతన్యాన్ని కాపాడుకుంటూ నిలబెట్టుకుంటూ విస్తరించుకుంటూ వస్తున్నది నువ్వు. ఇటు చివర రాజరికాన్ని కాదన్న ఆదివాసులు పగిడిద్దరాజు సమ్మక్క సారమ్మల నుంచి, అటుచివర ఢిల్లీ చక్రవర్తిత్వాన్ని కాదన్న మహారాజు ప్రతాపరుద్రుడి వరకు, మధ్యలో పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, సర్వాయి పాపన్న, పాలకుర్తి ఐలమ్మ, దొడ్ది కొమరయ్య, పర్కాల, బైరాన్ పల్లి యోధులు, మొగిలయ్యల నుంచి ఇవాళ్టిదాకా సబ్బండవర్ణాల సకలప్రాంతాల వరంగల్ బిడ్డలలో సర్వవ్యాప్తంగా ఉన్నది ఆ ధిక్కార స్వభావమే.

వరంగల్, ఇవాళ నీ వార్తలు వింటుంటే నా మనసు ఉప్పొంగుతున్నది. ఒక్క వారం రోజుల వ్యవధిలో రెండు ధిక్కార ప్రకటనలు. ఆధిపత్యాన్ని తోసిరాజన్న ఆత్మవిశ్వాస ప్రదర్శనలు.

రాజ్యపాలకుడని పేరు పెట్టుకున్న ఒకానొక విధేయ రాజభటుడు, రక్షకభట సంస్కృతిని నరనరాన జీర్ణించుకున్న నరుడో సింహమో మన ఊరికి, మన విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు నువు ప్రదర్శించిన ధిక్కార సంస్కృతి తెలిసి ఎంత గర్వపడ్డాననుకున్నావు!

ఆ రాజ్యపాలకుడి రాక కూడ ఎటువంటి సందర్భంలో? మన ఆకాంక్షలను గేలి చేసి, మన ఆందోళనల మీద కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపి, మననూ మన పోరాటశీలాన్నీ అవమానించి, మళ్లీ తగుదునమ్మా అని మన బిడ్డల పండుగకు పిలవని పేరంటంగా వస్తే (అవునులే, కులపతి గదా, పిలవకుండానే మనమీద అధికారం చలాయించవచ్చుగదూ!) ఎటువంటి నిరసన చూపావు!

మన  బిడ్డల చదువుల పంట ఇంటికి చేరే పండుగ అది. కుప్పకొట్టి, తూర్పారబట్టి గింజలు కుండలకెత్తినట్టు, ఏళ్లకొద్దీ చదివిన చదువు పంటను కాగితం మీదికెక్కించి ఆ కాగితం అందుకునే పండుగ రోజు. కుటుంబ సభ్యులతో, బంధువులతో, మిత్రులతో, సహవిద్యార్థులతో ఆనందంగా జరుపుకోవలసిన ఆ పండుగ రోజు ఎంత ఉత్సాహంగా ఉండాలి! మనకు ఆ ఉత్సాహం ఉండగూడదట. ‘ఆ సభదగ్గర మీ ఆకాంక్షలు ప్రకటించే నినాదాలు ఇచ్చారా, ఖబర్దార్’ అని అధికారుల బెదిరింపులు. మన ఆకాంక్షల ప్రకటనకు నాయకత్వం వహిస్తారని అనుమానం ఉన్నవారందరి నిర్బంధం. ఊరు ఊరంతా ఖాకీ మూకల మోహరింపు. మన చదువుల బడికి వెళ్లే అన్ని తోవలూ మూసివేత. తెరిచిపెట్టిన మూడుచోట్లా లాఠీలతో తుపాకులతో వందలాది రక్షకభటులు. (మన నేలకు, మన ప్రజలకు రక్షణ కావాలనేవాళ్లను వేధించేవాళ్లు ఎవరి రక్షణకు? ఎవరి భటులు?) అతిథిగా వచ్చిన రాజ్యపాలకుని వాహనశ్రేణిని ఎక్కడ అడ్డుకుంటామోనని అన్ని కూడళ్లలో నిఘా నేత్రాలు, సాయుధ బలగాలు.

అది చదువుల బడేనా? అది చదువుల పండుగేనా? అది మన బిడ్డల పండుగేనా? మన ఊళ్లో, మన బడిలో, మన బిడ్డల చదువుల పండుగను దెబ్బతీసేలా పొద్దున్నే బిడ్డలను పట్టుకుపోతారా? మన పండుగకు మనను రాకుండా, లేకుండా చేస్తారా? వచ్చిన అతిథిని అవమానిస్తామేమో అని అనుమానపడతారా? నిజంగా అతిథి అయితే, తిన్నింటి వాసాలు లెక్కబెట్టని వాడయితే ఎందుకు అవమానిస్తాము? తాను మన క్షేమం కోరే అతిథిని కాననీ, మన ఆకాంక్షలను అణచడానికి వచ్చిన లాఠీననీ, తూటాననీ ఆయనకు కూడ తెలుసు గద. అందుకే మన బిడ్డలను కటకటాల వెనక్కినెట్టి ఆయన వేదికనెక్కాడు.

ఈ ఘోరం చూసి ప్రకృతి కూడ కన్నెర్ర చేసిందనుకో. బిడ్డలను ఇంత  కష్టపెట్టి, బిడ్డల పండుగేమిటని  ఆకాశం భోరున కురిసింది. ఆరుబయట ఆనందోత్సాహాలతో జరగవలసిన ఉత్సవం భయం భయంగా బిక్కుబిక్కుమంటూ నాలుగుగోడల మధ్యకు కదిలిపోయింది.

అటువంటి క్లిష్టమైన సందర్భంలోకూడ, చుట్టూ ఆటంకాల మధ్య కూడ నీ బిడ్డలు, ఆ చదువుల పంటల కాగితాలు అందుకునే బిడ్డలు, అనుమానాల వంతెన మీద నడిచి కత్తుల బోను ఎక్కిన బిడ్డలు గొంతు విప్పారు. మన ఆకాంక్షను వినిపించారు. మన నినాదాలు పలికించారు. ఒక రసాయనశాస్త్ర పరిశోధకుడు ఫిరోజ్ పాషా, ఒక వాణిజ్యశాస్త్ర విద్యార్థి నిరంజన్ శ్రీనివాస్, ఒక చరిత్ర పరిశోధకుడు సైదిరెడ్డి విడివిడి వ్యక్తులు కాదు, ఐదు దశాబ్దాలుగా రగులుతున్న తెలంగాణ ఆకాంక్షల ప్రతీకలు. ఐదునెలలుగా ఈ నేల అనుభవిస్తున్న ఉద్వేగపు తునకలు. వరంగల్, ఆ ముగ్గురూ, రాజ్యపాలకుడు దిగివస్తుంటే ఆయన దగ్గరికి పరుగెత్తుకు వెళ్లిన విద్యార్థీ, వారిని మౌనంగా సమర్థించిన విద్యార్థులూ, తల్లిదండ్రులూ, అధ్యాపకులూ, అధికారులూ అందరిలోనూ ప్రవహిస్తున్నది నువ్వు ఉగ్గుపాలతో రంగరించి పోసిన ధిక్కార కాంక్ష.

అక్కడితో  అయిపోలేదు, రాజ్యపాలకుడు కాలు కింద పెట్టకపోయినా, ఆయన వాహనాలు  వరంగల్ మట్టి మీదనే తిరగాలి  గదా. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి కాజీపేట దాకా ప్రయాణం  అంత సులభమా? వరంగల్, నీ గాలిలోని తిరుగుబాటు ధ్వని నాకిక్కడికి వినబడుతున్నది. వినయభాస్కర్ పేరు బయటికి వినబడి ఉండవచ్చు, ఎన్ని వందలమంది వరంగల్ బిడ్డలు అలాగే ఆలోచించారో. రాజ్యపాలకుడి వాహనశ్రేణికి అడ్డం పడదామనీ, తప్పుడు నివేదికల, అబద్ధపు గూఢచారుల రాజ్యపాలకుడికి తెలంగాణ గొంతు వినిపిద్దామనీ ప్రజాగ్రహం ఆ పది కిలోమీటర్ల రహదారి మీద కనీసం మూడు చోట్ల కట్టలు కట్టిందట.

రాజ్యపాలకుడి  అబద్ధపు ప్రయత్నాలు చూస్తే చాలు, రాజ్యం ఎంత వణికిపోయిందో అర్థమవుతుంది. సకలాధికారాలూ సకలవ్యవస్థలూ తన చేతుల్లో పెట్టుకున్న రాజ్యం దొంగలా, దొంగతనంగా, మోసపుచ్చేలా అబద్ధపు వాహనశ్రేణిని పంపించిందట. ప్రత్యర్థి కళ్లలో భయం నీడలు వ్యాపించాయనడానికి అది చాలదూ. మహాబల సంపన్నుడైన రాజ్యపాలకుడు ఇంత దొంగ ఎత్తు ఎత్తుతాడని అనుకుంటామా? అవి నిజం వాహనాలేమో అనుకుని ఎదురుపడ్డాం, నిర్బంధంలోకి వెళ్లాం. గెలిచినదెవరు? ఓడినదెవరు?

ఈ హడావిడి  గురించి చదువుతుంటే నాకు ముప్పై ఏళ్లకిందటి స్నాతకోత్సవం గుర్తుకొచ్చింది. అప్పటికి పి వి నరసింహారావు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి. ఆ సంవత్సరం స్నాతకోపన్యాసానికి ఆయన వచ్చారు. అప్పటికి కాకతీయ విశ్వవిద్యాలయం విప్లవ విద్యార్థి ఉద్యమ కేంద్రంగా ఉన్నది. అప్పటికింకా ఇన్ని భవనాలు రాలేదు. మొదటి గేటు పక్కన మైదానం, అక్కడే వేదిక. నరసింహారావు వరంగల్ నేలలోని ధిక్కార స్వభావం గురించి పోతన నుంచి కాళోజీ దాకా ఉటంకిస్తూ ఉత్తేజకర ఉపన్యాసం చేశారు. కాని సరిగ్గా ఆ సమయానికి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులమీద అమలవుతున్న పోలీసు నిర్బంధం గురించి వివరిస్తూ విద్యార్థి సంఘం వేసిన కరపత్రాన్ని పంచుతూ నినాదాలిస్తూ ఉన్నందుకు నా పక్కన విద్యార్థులను అరెస్టు చేయడం చూశాను. వేదిక మీద మంత్రి నోట ధిక్కార ప్రశంస. వేదిక కింద విద్యార్థుల ధిక్కారానికి బహుమతి నిర్బంధం. అదీ వరంగల్.

విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సంరంభం శనివారం జరిగితే ఆ తర్వాత రానున్న శుక్రవారం నాడు వరంగల్ మళ్లీ ఒకసారి తన ధిక్కారాన్ని ప్రదర్శించవలసిన సమయం ఎదురుచూస్తున్నది. ఇది రాసే సమయానికి ఇంకా ఆ శుక్రవారం రాలేదుగాని, ఆ దిశగా వేడి రాజుకుంటున్నది.

తెలంగాణ ఆకాంక్షలను అడ్డుకున్న, తెలంగాణ  ఉద్యమాన్ని అణచడానికి అన్ని  రకాలుగా ప్రయత్నించిన ముఖ్యమంత్రి చనిపోతే ఆ దుఃఖంలో మామూలు ప్రజలు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారట. ఆ ఆత్మహత్యలలో నిజంగా ఆ దుఃఖంలో చేసుకున్నవెన్నో, ఇతర కారణాలవల్ల చేసుకోగా ఆ ఖాతాలో వేసినవెన్నో ఆ లెక్కలు ఇప్పుడు అవసరం లేదు. కాని, దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్క మొరిగిందన్న సామెతను నిజం చేస్తూ ఆ మరణించిన నాయకుడి కొడుకు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఓదార్పు యాత్రకు బయలుదేరారట. పరామర్శలూ, ఓదార్పులూ తెలంగాణకు తెలియనివి కావు. కాని ఇది ఓదార్పేనా? రాచరిక పాలనలో లాగ తండ్రి మరణిస్తే, శవం ఇంకా లేవకముందే, సింహాసనాన్ని అధిష్టించాలని యువరాజు కోరుకున్నట్టు ఈ ఓదార్పు నేత కూడ ప్రజాస్వామిక పదవి కోసం ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగమే ఈ ఓదార్పు యాత్ర.

ఆ చనిపోయిన వందమంది కుటుంబాలకు ఓదార్పు  పలకడానికి వస్తున్న ఈ మనిషి, శిథిలమైపోయిన తెలంగాణ మూడున్నరకోట్ల  ప్రజలను ఓదార్చాలనుకోలేదు. ఈ ప్రజలకు న్యాయం జరగాలని తనంతట తానూ అనలేదు. కనీసం కోట్లాది ప్రజలు లేచినిలిచి తమ ఆకాంక్షను ప్రకటిస్తున్నప్పుడూ అనలేదు. పైగా ఆ ఆకాంక్షను గుర్తించిన కేంద్రప్రభుత్వ ప్రకటన తర్వాత, పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులతో చేతులు కలిపి, వారి చేతుల్లోని నినాదం అందుకుని తన తండ్రి మాత్రమే కాదు, తాను కూడ తెలంగాణకు వ్యతిరేకమే అని బాహాటంగా ప్రకటించారు. ఎనిమిది నెలలకింద వరంగల్ బిడ్డలు కొందరు అమాయకంగా ఒక అనవసరపు కారణం కొరకు ప్రాణాలు వదిలారేమో, వారి కుటుంబాలను ఓదార్చడానికి రావాలని ఈ పార్లమెంటు సభ్యుడు అనుకుంటున్నారేమో. కాని ఆ తర్వాత వరంగల్ బిడ్డలు చాలమంది అమాయకంగా కాదు, చాల చైతన్యంతో, తెలిసితెలిసీ మృత్యువుకు ఎదురువెళ్లారు. వారి కుటుంబాల శోకం ఇంకా పచ్చిగా ఉన్నది. వారిని ఓదార్చవలసి ఉన్నది. వారిని ఓదార్చాలంటే వారి బిడ్డలు ప్రాణాలు ఇచ్చిన ఆశయం నెరవేరవలసి ఉన్నది.

ప్రాణత్యాగం, తెలిసి తెలిసీ మృత్యువుకు ఎదురువెళ్లడం వరంగల్ కు కొత్తకాదు. ధిక్కారం వరంగల్ కు కొత్తకాదు. ఢిల్లీ సుల్తాన్ కు లొంగిపోవడం కన్న ఆత్మత్యాగమే మంచిదనుకున్నాడు వరంగల్ రాజు ప్రతాపరుద్రుడు. ఆధిపత్యం ఎక్కడిదయినా అది ఢిల్లీదయినా, కోస్తాంధ్రదయినా, రాయలసీమదయినా ధిక్కరించక తప్పదన్నది వరంగల్ స్ఫూర్తి.

– ఎన్ వేణుగోపాల్

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

4 Responses to వరంగల్, ఇవాళ నా మనసంతా నీచుట్టే

 1. 1991 నుంచి 1995 వరకు కరీంనగర్ లో ఉండేవాళ్ళం. అప్పట్లో శ్రీకాకుళం రావడానికి వరంగల్ స్టేషన్ లో ట్రైన్ ఎక్కేవాళ్ళం. వరంగల్ – విజయవాడ మధ్య ఉన్న స్టేషన్లలో నాకు బాగా గుర్తున్నవి నెక్కొండ, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి స్టేషన్లు. మహబూబాబాద్ లో కాల్పులు జరిగాయని వార్త విన్నప్పుడు చిన్నప్పుడు ప్రయాణించిన లైన్ లో చాలా సార్లు చూసిన స్టేషన్ గుర్తొచ్చింది.

 2. RAVINDRANATH says:

  Very inspiring article.
  VIVALA WARANGAL

 3. rajani says:

  annayya ippude nee blog chusaanu. dhikkaara swaram gurinchina vivarana baagundi.

 4. rajani says:

  nee blog chusaanu. baagundi.

  rajani

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s