కాంగ్రెస్ తో “భావ సారూప్యత”!!

(ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ, జూన్ 1, 2010)

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శనివారం నాడు దేశ రాజధానిలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఇరవై నిమిషాలు ముచ్చటించారు. ఇంతవరకూ ఆయనకూ ఆయనను నమ్మి ఆయనకు అనుచరులైన వేలాది మందికీ తెలియని ఒక మహా రహస్యం ఆయన ఆ సంభాషణలో తెలుసుకున్నారు! ఆ రహస్యాన్ని ఆ ఆంతరంగిక సమావేశం అయిపోగానే బహిరంగంగానే తెలియజెప్పారు.

ప్రజారాజ్యం పార్టీకీ కాంగ్రెస్ కూ “భావసారూప్యత” ఉన్నదట.

ఇన్నాళ్లూ అవి రెండూ వేరువేరు పార్టీలని అనుకుంటున్నవాళ్లు, వాటి మధ్య రాజకీయ భిన్నత్వం ఉన్నదని అనుకుంటున్నవాళ్లు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నెలకొల్పిన అవినీతిమయ, అరాచక పాలనకు ప్రత్యామ్నాయంగానే తాను వస్తున్నానని ప్రజారాజ్యం పార్టీ 2008లో చెప్పినప్పుడు నమ్మినవాళ్లు ఇప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారో తెలియదు.

నిజానికి చిరంజీవి తెలిసి చెప్పారో తెలియక చెప్పారో గాని ఆయన ఇప్పుడు చెప్పినది అక్షర సత్యం. ఒక్క ప్రజారాజ్యం పార్టీకి ఏమొచ్చె, ఈ దేశంలో పార్లమెంటరీ రాజకీయపక్షాలన్నిటికీ కాంగ్రెస్ తో భావసారూప్యత ఉన్నది. అటు కొసన కాషాయరంగుతో శివసేన, భారతీయ జనతాపార్టీ అని పేరు పెట్టుకున్నా, ఇటు కొసన ఎరుపు రంగుతో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అని పేరు పెట్టుకున్నా, లేదా మధ్యన ఆకుపచ్చలోనో, నీలంలోనో, పసుపులోనో, గులాబీలోనో ప్రాంతీయపార్టీలుగా, వెనకబడిన వర్గాల పార్టీలుగా చెప్పుకుంటున్నా అన్ని పార్టీలకూ కాంగ్రెస్ తో భావసారూప్యత ఉన్నది.

ఆ కాంగ్రెస్ పుట్టడమే ఒక దళారీ పార్టీగా పుట్టింది. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 1857లో దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం తనకు వ్యతిరేకంగా ఉన్నదని తెలిసినాక బ్రిటిష్ వలసవాదం ఉద్దేశపూర్వకంగా పుట్టించిన పార్టీ అది. 1860 లలో విద్యావిధానం, అప్పుడే శిక్షాస్మృతులు, న్యాయస్థానాలు ఏర్పరచిన వలసవాదం 1885లో తన అధికారి చేతనే కాంగ్రెస్ ను ఏర్పాటు చేయించింది. మాటల్లో తనకు వ్యతిరేకంగా ఉంటూ, చేతల్లో తన ప్రయోజనాలను రక్షించే ఒక పార్టీ కావాలని వలసవాదులు కోరుకున్నారు. దేశప్రజలు సహజంగా, స్వచ్ఛంగా, అనేక పాయలలో సాగిస్తున్న వలసవాద వ్యతిరేక జాతీయోద్యమంలోకి ప్రవేశించి దాని నాయకత్వాన్ని హస్తగతం చేసుకున్నది ఆ పార్టీ. దొరల, పెట్టుబడిదారుల, వారి వెనుక తెల్లదొరల పాలనను యథాతథంగా కొనసాగించే “స్వాతంత్ర్యం”అనబడే అధికారమార్పిడి చేసుకుంది. ఆ తర్వాత గడిచిన ఆరు దశాబ్దాలలో ఆ చట్రంలోపల ఎన్ని పార్టీలు వచ్చినా సాగించినది ఆ పాలననే. అలా కొనసాగించడంలో అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలకూ భావసారూప్యత ఉన్నది. ఈ దేశంలో అన్ని దుర్మార్గాలకూ వనరు, కన్నతల్లి, అన్ని దుర్మార్గాలనూ పెంచి పోషించినది కాంగ్రెస్ పార్టీ. ఆ దుర్మార్గాలన్నిటినీ కొనసాగిస్తున్నవి ఆయా పార్లమెంటరీ రాజకీయపక్షాలు.

ఆ సాధారణ విశ్లేషణను అలా ఉంచి, ప్రస్తుత సందర్భంలోని కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల సయోధ్య గురించి ప్రత్యేకంగా చర్చించవలసి ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య కుదిరినది కేవలం రాజ్యసభ ఎన్నికల పొత్తో, స్థానిక సంస్థల ఎన్నికల పొత్తో మాత్రమే కాదు. అయితే ఇంతగా చర్చించవలసినదేమీ లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పక్షాలూ ఎన్నికల సమయంలో తమ అవసరాల కోసం పూర్తిగా భిన్న ప్రయోజనాలున్న రాజకీయ పక్షాలతో కూడ అవకాశవాద పొత్తులు పెట్టుకోవడం మామూలే.

కాని ప్రస్తుతం చిరంజీవి అటువంటి మామూలు పొత్తును గురించి మాత్రమే కాక, భావసారూప్యత గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ ఒకసారి మిశ్రమ మంత్రివర్గం ఏర్పడుతుందనీ, అందులో ప్రజారాజ్యం చేరుతుందనీ వార్తలు వస్తున్నాయి. అసలు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుందనీ వార్తలు వస్తున్నాయి. వీటిలో కొన్నిటిని ఖండించడం జరుగుతున్నది గాని, కొన్ని మాటలను చూస్తే అసలు చెపుతున్నవి నిజాలా అబద్ధాలా తెలియడం లేదు.

ఆదివారం నుంచి ఇది రాస్తున్న బుధవారం దాకా ప్రజారాజ్యం పార్టీ నుంచీ, స్వయంగా చిరంజీవి నోటి నుంచీ పరస్పర వ్యతిరేకమైన, భిన్నమైన ప్రకటనలెన్నో వచ్చాయి. సోనియా గాంధీ తానూ రాష్ట్రంలో తుపాను బాధితుల పునరావాసం గురించి మాట్లాడుకున్నామని ఒకసారి అన్నారు. పోలవరం, ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పించడం గురించి తాను సోనియా గాంధీతో మాట్లాడానని మరొకసారి అన్నారు. రాజ్యసభ ఎన్నికలలో తమకు ఒక స్థానం కావాలని అడిగామనీ, పార్లమెంటులో తమ వాణి వినిపించడానికి అది అవసరమనీ ఒకసారి అన్నారు. రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను బలపరచమని సోనియాగాంధీ తనను కోరారని మరొకసారి అన్నారు. రాజకీయాల్లో డైనమిక్స్ మారుతుంటాయని నర్మగర్భమైన సూచన ఒకసారి చేశారు. కాంగ్రెస్ వి లౌకిక రాజకీయాలనీ, తమ పార్టీవి సామాజికన్యాయ రాజకీయాలనీ కనుక రెంటి మధ్యా భావసారూప్యత ఉందని మరొకసారి అన్నారు. గదిలోపల, ఇద్దరి మధ్య, లేదా అహ్మద్ పటేల్ కూడ ఉండి ఉంటే ముగ్గురి మధ్య జరిగిన సంభాషణలో కచ్చితంగా ఏమి జరిగిందో ఎవరూ చెప్పలేరు. ఏమి జరిగిందో ఒక పక్షం ఏమీ చెప్పడం లేదు గనుక, మరొక పక్షమేమో ఒక్కోసారి ఒక్కోమాట చెపుతున్నది గనుక మాటల అంతరార్థాన్ని ఊహించడమే తప్ప చేయగలిగింది లేదు.

ఈ పార్టీ పుట్టినప్పుడు ఉండిన పరిస్థితిని గుర్తు తెచ్చుకోండి. అదేమీ సుదీర్ఘ గతం కాదు, ఇంకా పూర్తిగా రెండు సంవత్సరాలు నిండలేదు. అప్పటికి ఐదు దశాబ్దాలు నిండిన ఆంధ్ర ప్రదేశ్ లో ముప్పై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్, పదహారు సంవత్సరాలు తెలుగుదేశం పాలించాయి గనుక, ఆ రెండు పార్టీల గుత్తాధిపత్యంలో ప్రజాజీవనం నానాటికీ మరింత దుర్భరమైపోయింది గనుక, ప్రజాస్వామ్యం అనేది కేవలం ఎన్నికల తంతుకు మాత్రమే పరిమితమైపోయి, నిజమైన ప్రజాస్వామిక పాలన ఏర్పడలేదు గనుక, ఆ గుత్తాధిపత్యాన్ని తొలగించే రాజకీయపక్షమేదయినా ఈ వ్యవస్థలోపలనే సాధ్యమవుతుందా అని కొందరయినా ఆలోచించారు. చిరంజీవి మాటలను బట్టి, కనీసం పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అటువంటి ప్రత్యామ్నాయ పాలన సాధ్యమవుతుందని ఆశపడ్డారు. అందుకే, ప్రజారాజ్యం పార్టీ ఏర్పడగానే అందులో చేరిన దళితనేత కత్తి పద్మారావు ముప్పై ఏళ్లుగా తాను ఎదురుచూస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఆవిర్భవించిందన్నారు. మార్క్సిజాన్నీ, అంబేద్కరిజాన్నీ కలగలిపి భారతీయ నిర్దిష్ట పరిస్థితులకు కొత్త సిద్ధాంతాన్ని, ఆచరణను తయారు చేయాలన్న ఆలోచనతో ఏర్పరచిన మహాజన పార్టీని రద్దు చేసుకుని ఆ పార్టీ నాయకులు ఉ. సాంబశివరావు, జె. గౌతమ్ లు ప్రజారాజ్యంలో చేరారు. ఇలా ప్రజారాజ్యంను ఒక ఆశాసూచికగా భావించినవారెందరో ఉన్నారు. ఇందులో గౌతమ్ తప్ప మిగిలిన వారందరూ ఆ పార్టీని వదలడమూ, ఆ పార్టీ గురించి విమర్శకులకన్న ఎక్కువ విమర్శలు చేయడమూ కూడ జరిగాయి.

2008 ఆగస్ట్ 18న పార్టీ స్థాపనను ప్రకటించి, ఆగస్ట్ 26న తిరుపతి బహిరంగసభలో పార్టీ పేరును, విధానాలను ప్రకటించి, ఎనిమిది నెలలలో ఎన్నికల బరిలోకి దిగవలసి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ గత ఇరవై నెలలలో చిన్నా పెద్దా సంక్షోభాలెన్నిటినో చవిచూసింది. ఆ పార్టీ స్వభావాన్ని గుర్తించడానికి సరిపోయినన్ని సూచనలను వదిలింది. అదంతా ఇప్పుడు అవసరం లేదు గాని కనీసం మూడు ముఖ్యమైన సామాజిక, రాజకీయార్థిక సవాళ్ల విషయంలో దాని వైఖరులేమిటో చూస్తే దానికి కాంగ్రెస్ తో మాత్రమే కాదు, ఈ దేశంలోని మిగిలిన పార్లమెంటరీ రాజకీయ పక్షాలన్నిటితో భావసారూప్యత ఉందని అర్థమవుతుంది.

మొట్టమొదటిది సామాజిక న్యాయ భావనను ఆ పార్టీ ఇతర పార్టీలకన్న భిన్నంగా అర్థం చేసుకోలేదనేది. సామాజిక న్యాయమంటే, వేల ఏళ్లుగా, వందల ఏళ్లుగా జరిగిన సామాజిక అన్యాయాలను, వివక్షను సరిదిద్దడం అని ప్రజారాజ్యం పార్టీ నిజంగా అర్థం చేసుకున్నదా అనుమానమే. కనీసం, ఎన్నికల రాజకీయాలలో జనాభా ప్రాతిపదికన స్థానాలు కేటాయించడం అనే అతిచిన్న అర్థానికి సామాజిక న్యాయ భావనను కుదించినా ఆ పని కూడ ప్రజారాజ్యం చేయలేకపోయింది. అగ్రకులాల వారికి, సంపన్నులకు, ఏ రాజకీయ చరిత్ర లేకపోయినా అప్పటికప్పుడు డబ్బుపెట్టి కొనుక్కోగలవాళ్లకు టికెట్లమ్మి, సరిగ్గా కాంగ్రెస్ తోనూ, ఇతర పార్టీలతోనూ తనకు భావసారూప్యత ఉన్నదని రుజువు చేసుకుంది.

సామాజిక న్యాయ భావనకు చారిత్రక అన్యాయాలను సరిదిద్దే కృషి అని అర్థం చెప్పుకోకపోవడం తెలంగాణ ప్రజల ఆకాంక్షల విషయంలో మరింత బహిరంగంగా బయటపడింది. తెలంగాణది ఆత్మగౌరవ సమస్య అని తిరుపతి సభలో గుర్తించిన పార్టీ, సామాజిక తెలంగాణ సాధనే తన ధ్యేయమని ప్రకటించిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర సాధన ఒక తక్షణ అంశంగా వేదిక మీదికి వచ్చే సరికి మాట మార్చింది. ప్రజల గురించి, ప్రజా సమస్యలగురించి మాట్లాడుతూనే, అవి తీర్చవలసిన సరైన సమయం వచ్చే సరికి మాటమార్చే కాంగ్రెస్ తో, ఇతర రాజకీయ పక్షాలతో భావసారూప్యత ఉన్నదని రుజువు చేసుకుంది.

ఇక ప్రజారాజ్యం భావసారూప్యతను రుజువు చేసిన మరొక అంశం పోలవరం. మూడు వందల గ్రామాలనూ, మూడు లక్షల ప్రజలనూ ముంచి, విలువైన అడవిని ముంచి, కేవలం కాకినాడ నుంచి విశాఖపట్నం దాకా రాబోతున్న దేశదేశాల సంపన్నుల కోస్తాకారిడార్ పారిశ్రామిక వాడకు నీళ్లు అందించడానికి మాత్రమే తయారవుతున్న ప్రాజెక్టు మీద చిరంజీవికి ఇంత శ్రద్ధ ఎందుకు కలిగిందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. అది నూతన ఆర్థిక విధానాలనూ, ప్రపంచీకరణనూ తెచ్చిన కాంగ్రెస్ తో భావసారూప్యత. ఆ ప్రపంచీకరణను విమర్శిస్తూనే ఆచరణలో కొనసాగిస్తున్న ఇతర రాజకీయ పక్షాలతో భావసారూప్యత.

ప్రజావ్యతిరేకతలో, నిజమైన ప్రజల పాలనను అందించకపోవడంలో, సంపన్న వర్గాలకు, బహుళజాతిసంస్థలకు ఈ దేశ వనరులను దోచిపెట్టడంలో అన్ని రాజకీయ పార్టీల మధ్య విపరీతమైన భావసారూప్యత ఉన్నది. ఇన్నాళ్లూ వ్యవస్థ మారాలని పోరాటం చేస్తున్నవాళ్లు మాత్రమే అంటున్న ఈ మాటను తాను కూడ అన్నందుకు, ఒకరకమైన “అప్రూవర్ స్టేట్ మెంట్’ ఇచ్చినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పాలి.

– ఎన్ వేణుగోపాల్

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

3 Responses to కాంగ్రెస్ తో “భావ సారూప్యత”!!

 1. surender says:

  meeru raasindi anta bane undi kaani, polavaram gurinchi inkonchem study chesi raste bagundedi.

 2. బాగా చెప్పారు. ఐనా, ఈనాటి రాజకీయపార్టీలని విమర్శించటం, గొంగళ్ళో తింటూ వెంట్రుకలు ఏరడంలాంటిది.

 3. Dayalan says:

  good article,. every body should read.
  we need people like you for this society to educate people on current political dramas.
  keep it up

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s