రెండు పదుల తర్వాత

అమరుడు  సూర్యారావు సంస్మరణలో ‘ఉద్యోగ క్రాంతి’ పత్రిక నిర్వహించే వార్షిక సమావేశాల వరుసలో దశమ వార్షికోత్సవంలో 1989 మే 21న వరవరరావుగారు చేసిన ఉపన్యాస పాఠం ఇది. ఆ ఉపన్యాసాన్ని మొదట ‘ఉద్యోగ క్రాంతి’ లో అచ్చువేశారు. తర్వాత మే 1991లో విప్లవ రచయితల సంఘం, అనంతపురం జిల్లా యూనిట్ ఈ ఉపన్యాస పాఠాన్ని ఒక చిన్న పుస్తకంగా ప్రచురించింది. దాన్నే ఇప్పుడు ‘ఉద్యోగ క్రాంతి’ కర్నూలు మిత్రులు పునర్ముద్రిస్తున్నారు. ఇరవై సంవత్సరాల తర్వాత పునర్ముద్రణ సందర్భంగా ఈ ఉపన్యాసం గురించీ, మారిన, మారని కాలం గురించీ కొన్ని విషయాలు మాట్లాడుకోవలసి ఉంది.

***

కాలం  చాల వేగంగా మారుతున్నదనీ, ముఖ్యంగా నూతన ఆర్థిక విధానాల  తర్వాత పరిస్థితులు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయనీ మామూలుగా చాలమంది అనుకుంటున్నారు, అంటున్నారు. ఇంకా కొందరయితే ఈ మార్పులవల్ల విప్లవభావాలకే కాలం చెల్లిపోయిందంటున్నారు. నిజమేమోనని ఆలోచనాపరులు కూడ అనుమానించేంత పెద్దఎత్తున రూపపరమైన మార్పులు జరుగుతున్నాయి. కాని ఎప్పుడూ రూపమే సారాంశం కాదు. లోతుకు వెళ్లి సారంలో ఏమైనా మార్పులు వచ్చాయా, ఒకవేళ ఏమయినా మార్పులు వస్తే కూడ అవి మొత్తంగా సమాజ స్వభావాన్ని మార్చేంత బలమయిన మార్పులా అని ప్రశ్నలు వేసుకోవలసే ఉన్నది. జవాబులు వెతకవలసే ఉన్నది. నిజాయితీగా అన్వేషిస్తే, ‘మారిన దోపిడీ రూపాలు, మారని దోపిడీ స్వభావం’ అనేదే గత ఆరు దశాబ్దాల భారత సమాజపు అనుభవమని తేలుతుంది. అలా మౌలిక స్వభావం మారలేదు గనుక ఆ స్వభావాన్ని మార్చదలచిన ప్రజాఉద్యమ ప్రయత్నమూ మారడానికి అవకాశం లేదని తేలుతుంది. మౌలిక స్వభావం మారలేదంటే అర్థం ఏ మార్పులూ జరగలేదని కాదు, జరిగిన మార్పులను సృజనాత్మకంగా అర్థం చేసుకోవాలని మాత్రమే. సారాంశాన్ని కప్పిపెట్టడంలో ఆ మార్పులు ఎట్లా విజయం సాధిస్తున్నాయో తెలుసుకోవాలని మాత్రమే.

అంటే, మన అవగాహనలో, మన విశ్లేషణలో, మన వివరణలో ఎప్పటికప్పుడు ఇంకా కొత్త అంశాలను చేర్చుకోవచ్చు, కొత్త ప్రాంతాలకూ, కొత్త సామాజిక వర్గాలకూ విస్తరించవచ్చు. కొత్త అన్వేషణలకూ, కొత్త సమాధానాలకూ, కొత్త పోరాటరూపాలకూ విస్తరించవచ్చు. కాని గత ఆరు దశాబ్దాల చరిత్రకైనా, గత రెండు దశాబ్దాల చరిత్రకైనా వర్తించే సాధారణ సూత్రం, ఎప్పుడూ గమనంలో ఉంచుకోవలసిన విషయం – మౌలికంగా అటు దోపిడీ పీడనలు మారలేదు, ఇటు ఆ దోపిడీ పీడనలను రద్దుచేయదలచిన పోరాట అవసరమూ మారలేదు. ఆ దోపిడీ పీడనలను మనం అర్థం చేసుకునే పద్ధతులు మారి ఉండవచ్చు, వాటిని రద్దుచేయడానికి మనం చేయవలసిన ఉద్యోగమేమిటో, క్రాంతి ఏమిటో మన అవగాహనలు మారి ఉండవచ్చు.

ఈ దృష్టితో చూస్తే రెండు దశాబ్దాల కింద ఈ ప్రసంగంలో చెప్పిన అంశాలలో ఏ ఒక్కదానికీ ప్రాసంగికత చెల్లిపోలేదు. బహుశా కొన్ని అంశాలు అవి చెప్పిన 1989 నాటికన్న ఇవాళ ఎక్కువ స్పష్టంగా, ఎక్కువ బహిరంగంగా కనబడుతున్నాయి.

అయితే అట్లని సమాజం మారలేదా అంటే తప్పకుండా పరిమాణాత్మక మార్పులు ఉన్నాయి, మౌలిక స్వభావాన్ని మార్చకుండానే కొన్ని కొన్ని రంగాలలో జరిగిన గుణాత్మక మార్పులూ ఉన్నాయి. ఆమేరకు ఈ ప్రసంగపాఠానికి ఆయారంగాలలో కొంత అదనపు సమాచారాన్ని, అదనపు విశ్లేషణను జతపరచుకోవలసి ఉన్నది. ఆ అదనపు అంశాలన్నీ కూడ ఈ ప్రసంగంలో చెప్పిన మౌలిక అంశాల్ని బలపరచేవే తప్ప ఖండించేవి కావు. నక్సల్బరీ ప్రజా రాజకీయ విశ్వాసాల పునాదిపై ఇరవై సంవత్సరాల కింద చేసిన ఈ విశ్లేషణలు, ఇరవై సంవత్సరాల తర్వాత బలహీనం కాలేదు సరిగదా, కొత్త ఉపపత్తులకు, కొత్త నిదర్శనాలకు వీలు కలిగిస్తున్నాయంటే, అది నక్సల్బరీ రాజకీయాల బలానికి శక్తిమంతమైన సూచిక.

ఇప్పటికీ చాల తాజాగా కనబడుతున్న ఈ ప్రసంగపాఠంలో ఇప్పుడు చేర్చుకోవలసిన అదనపు అంశాలలో నాలుగైదిటిని మాత్రం ప్రస్తావిస్తాను.

మొట్టమొదటిది, ఈ ప్రసంగ సమయానికి రాష్ట్రంలో తెలుగుదేశం పాలన ఉండింది. ఆ పాలనకు కుడి ఎడమల మద్దతు ఉండింది. ఆ పాలన ఆదివాసుల భూములు కొల్లగొట్టే ఆలోచనలు చేసి, వన్ ఆఫ్ సెవెంటీని రద్దుచేయడానికి ప్రయత్నించింది. ప్రసంగంలో ఆ అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చాయి. అది తెలుగుదేశం మొదటి విడత పాలన. పార్లమెంటరీ రాజకీయాలలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఉంటానని ప్రగల్భాలు పలికిన తెలుగుదేశం తానూ అదే తానులోని ముక్కనని రెండు మూడు సంవత్సరాలలోనే రుజువు చేసుకుంది. మరీ ముఖ్యంగా 1985-89 మధ్య ప్రజా ఉద్యమాలపై దమననీతిని ప్రయోగించి ‘ఆట పాట మాట బంద్’ అని నిర్బంధ రాజ్యాన్ని నెలకొల్పింది. ఆ పాలన చివరి రోజుల్లో వెలువడిన ప్రసంగం ఇది. ఆ తర్వాత గడిచిన ఇరవై ఏళ్లలో రాష్ట్రం మొదట ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పాలనను, తర్వాత పది సంవత్సరాల తెలుగుదేశం పాలనను, తర్వాత మళ్లీ ఆరు సంవత్సరాల కాంగ్రెస్ పాలనను చవి చూసింది. కాషాయం నుంచి ఎరుపు దాకా రాష్ట్రంలోని పార్లమెంటరీ రాజకీయ పక్షాలన్నీ ఈ ప్రభుత్వాలకు అటో ఇటో మద్దతు ఇస్తూనే వచ్చాయి. కాంగ్రెస్ పాలనలో మొదట ముగ్గురు ముఖ్యమంత్రులు, తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు. తెలుగుదేశం పాలనలో ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు. రెండు రాజకీయ పక్షాల, ఏడుగురు ముఖ్యమంత్రుల పాలనలో ప్రజాజీవితాలు మాత్రం ఇసుమంతయినా మెరుగుపడలేదు సరిగదా, మరింత క్షీణించాయి. ఈ వ్యవస్థలో ప్రభుత్వాలేవయినా ప్రజావ్యతిరేకమేననీ, ఉద్యోగులు, బుద్ధిజీవులు పట్టించుకోవలసింది ప్రభుత్వాలను కాదనీ, ప్రజలను మాత్రమేననీ ఈ ప్రసంగం చెప్పిన మాట అక్షరసత్యంగా రుజువయింది.

ఈ దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఈ ప్రసంగం తర్వాత జరిగిన ముఖ్యమైన పరిణామాలలో ఒకటి ప్రపంచీకరణ విధానాల అమలు. అంతకు ముందు కూడ అర్ధవలస గానే, మాటల్లో స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ, చేతల్లో సామ్రాజ్యవాద అనుకూల విధానాలను అమలుచేస్తూ ఉన్న భారత ప్రభుత్వం 1991 జూన్ లో నూతన ఆర్థిక విధానాలను ప్రకటించింది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే ప్రపంచవ్యాపిత సామ్రాజ్యవాద, బహుళజాతి సంస్థల షడ్యంత్రంలోకి భారత ప్రజానీకాన్ని లాగింది. అప్పటికి మైనారిటీ ప్రభుత్వంగా ఉండిన కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్షాల సహాయంతో ఐదు సంవత్సరాలు గట్టెక్కింది. ఆ కాంగ్రెస్ ను వీరోచితంగా విమర్శిస్తూ 1994లో రాష్ట్రంలో గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ అతి త్వరలోనే తన ప్రజాసంక్షేమ పథకాలను వదిలి చంద్రబాబు నాయుడు పాలనలో సామ్రాజ్యవాద దళారీగా మారి, కాంగ్రెస్ తో పోటీపడి ప్రపంచీకరణను అమలు చేసింది. రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు పాలన, బహుళజాతి సంస్థల సామ్రాజ్యం నెలకొన్నాయి. అప్పటినుంచీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు, పాలక కూటములు ఎన్ని మారినా, ఆయా రాజకీయ పక్షాల జెండాలూ నినాదాలూ ఏమయినా అప్పటినుంచీ ఆగకుండా సాగుతున్నది మాత్రం రవి అస్తమించని బహుళజాతి సంస్థల సామ్రాజ్యం. అన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలూ అమలు చేస్తున్న విధానాలు ఆ సంస్థలకు, దేశదేశాల సంపన్నులకు, వారికి దళారీలుగా , భాగస్వాములుగా పనిచేసే దేశీ సంపన్నులకు ఊడిగం చేసేవే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రసంగంలో ప్రభుత్వాల పనితీరు గురించి చెప్పిన మాటలు మరింత వాస్తవికంగా మారాయి. అప్పటికి ఇంకా ఇది ప్రజా ప్రభుత్వమేమోనని భ్రమపడుతున్న వాళ్లకు కూడ కళ్లపొరలు వదిలిపోయే మార్పులు జరిగాయి. బహుళజాతిసంస్థలకు, సంపన్నులకు, మాఫియాలకు ఖనిజ వనరులను, భూమిని, నీటిని, చౌక శ్రమను దోచిపెట్టడం కోసం కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ, బారత కమ్యూనిస్టుపార్టీ, బిజూ జనతాదళ్ – పేర్లేవైనా పాలకులందరూ తమ తమ పాలనలలో రక్తాలు పారించారు.

ఈ ప్రసంగం  నాటికే భారతీయ జనతాపార్టీ, సంఘ పరివారంలోని ఇతర శక్తులు దేశంలోని మైనారిటీ మతస్తుల మీద దాడులకు, దమననీతికి, అబద్ధ, విషప్రచారానికి పాల్పడుతున్నాయి. రక్తసిక్తమయిన రథయాత్రలు, ఏకాత్మతా యాత్రలు జరిగి ఉన్నాయి. ప్రసంగం తర్వాత రెండు సంవత్సరాలకే బాబ్రీ మసీదు విధ్వంసం ద్వారా సంఘ పరివారం ఈ దేశపు మైనారిటీ మతస్తుల మనసులలో నిత్య భయాన్ని నాటదలచింది. ఆ పని మరొక పది సంవత్సరాల తర్వాత మరింత దుర్మార్గంగా గుజరాత్ లో సాగింది. మూడువేలమందిని ఊచకోత కోసిన పథకాన్ని రచించిన వ్యక్తి మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఈదేశంలో ఎన్నికల రాజకీయాల దివాళాకోరుతనం బయటపడుతోంది. మైనారిటీలను భయభీతావహంలో ముంచాలనే ప్రయత్నం మరింత ముందుకు సాగి ఒరిస్సాలోని కంధమాల్ లో క్రైస్తవుల మీదికి కూడ సాగింది. ఇదంతా ఈ ప్రసంగంలో చెప్పిన విషయాల కొనసాగింపే.

పాలకులు అనుసరిస్తున్న ఈ దుర్మార్గ రాజకీయాలను ధిక్కరిస్తూ నక్సల్బరీ ఒక ప్రత్యామ్నాయ, ప్రజా, విప్లవ రాజకీయ మార్గాన్ని ప్రవేశపెట్టిందనీ, దాన్ని సమర్థించడమే ప్రజల ఉప్పు తింటున్న మనందరి కర్తవ్యమనీ ఈ ప్రసంగం చెప్పింది. ఈ ప్రసంగం తర్వాత రెండు సంవత్సరాలలోనే రాష్ట్రంలో ఆ మార్గంలో సాగే, ఆ మార్గాన్ని ప్రచారం చేసే విప్లవపార్టీపై, ప్రజాసంఘాలపై నిషేధం మొదలయింది. ప్రపంచ చరిత్రలోనే అరుదుగా విద్యార్థి సంఘం పైన, యువజన సంఘం పైన, చివరికి గని కార్మిక సంఘం పైన నిషేధం మొదలయింది. ఆ రాజకీయ కార్యాచరణ పైన మాత్రమే కాదు, దాని గురించి ఆలోచించాలని చెప్పే భావప్రకటనా స్వేచ్ఛపైన కూడ దమనకాండ మొదలయింది. ఆ నిషేధం ఎన్ కౌంటర్ హత్యాకాండలతో, మిస్సింగులతో, అత్యాచారాలతో, మాఫియా హత్యలతో పెచ్చరిల్లి ఇరవై సంవత్సరాలు తిరిగేసరికి ఆపరేషన్ గ్రీన్ హంట్ రూపమెత్తింది. విప్లవోద్యమాన్ని రూపు మాపుతామనీ, అది దేశపు అంతర్గత భద్రతకు అతి పెద్ద ప్రమాదమనీ పాలకులు నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు.

అయితే ఈ ఇరవై సంవత్సరాలలో కేవలం ఈ విచార, విషాద వార్తలు మాత్రమే లేవు. విప్లవోద్యమం విస్తరిస్తున్నదనే ఉత్తేజకరమైన చరిత్రను కూడ ఈ ఇరవై సంవత్సరాలు నమోదు చేశాయి. ప్రభుత్వాలూ పాలకవర్గాలూ ప్రచారసాధనాలూ ఆడే అబద్ధాలూ చూపే బూచీ ఎలా ఉన్నా, ఇవాళ విప్లవోద్యమం అనే దన్ను, ఆశ లేకపోతే దేశవ్యాప్తంగా ఆదివాసుల ప్రాంతాలలో వనరులు ఎట్లా దోపిడీ అయిపోయేవో, ప్రజాజీవితం ఎంత దుర్భరమయ్యేదో స్పష్టంగా కనబడుతున్నది. గాంధేయవాదులు, నిజమైన దేశభక్తులు, ఆదివాసుల పట్ల, దళితుల పట్ల, వెనుకబడిన సామాజికవర్గాల పట్ల, మహిళల పట్ల, మైనారిటీల పట్ల నిజమైన ప్రేమ ఉన్నవాళ్లందరూ విప్లవోద్యమం వైపే ఆశతో చూసే పరిస్థితి వచ్చింది. తమనుతాము ప్రధానస్రవంతి రాజకీయాలమనీ, ప్రధానస్రవంతి ప్రచారసాధనాలమనీ చెప్పుకునేవారికి కూడ విప్లవోద్యమం గురించి మాట్లాడకుండా రోజు గడవని స్థితి వచ్చింది.

పాలక  ముఠాలలో ఎన్ని మార్పులు జరిగి ఎవరు అధికారంలోకి వచ్చినా, ప్రపంచీకరణ పేరుతో ఈ దేశ వనరులను, మార్కెట్లను సామ్రాజ్యవాద లాభాల దాహానికి బలిచేసినా, బాబ్రీమసీదు విధ్వంసం దగ్గరి నుంచి గుజరాత్ మీదుగా కంధమాల్ మారణ కాండ దాకా మతోన్మాద, భూస్వామ్య, హైందవ, బ్రాహ్మణ్యం ఎన్ని రక్తపాతాలు సృష్టించినా, ప్రజా ప్రత్యామ్నాయాన్ని స్థాపించదలచిన విప్లవోద్యమ సంస్థలను నిషేధించినా, ఈ దేశానికి, ఈ సమాజానికి విప్లవం ఒక చారిత్రిక అవసరమని ఈ ఇరవై సంవత్సరాలు మరింత బలంగా రుజువు చేశాయి. అందువల్లనే విప్లవోద్యమం అసాధారణంగా పురోగమిస్తున్నది. ఈ నడుస్తున్న చరిత్ర గమనాన్నంతా దృష్టిలో ఉంచుకుని ఇరవై సంవత్సరాల కిందటి ఈ ప్రసంగపు ఆలోచనలను అవలోకిస్తే, వాటి సంబద్ధతా కనబడుతుంది, వాటి విస్తరణా కనబడుతుంది.

***

వరవరరావు  గుర్తింపు కవిగా, రచయితగా, విరసం నాయకుడిగా, విప్లవోద్యమ వ్యాఖ్యాతగా, తెలుగు రచయితలందరిలోకీ అతి ఎక్కువ నిర్బంధానికి గురయిన వ్యక్తిగా ఎంత ఉన్నప్పటికీ, బహుశా అంతకన్న ఎక్కువగానో సమానంగానో ఉపన్యాసకుడిగా, వక్తగా ఉంటుంది. తెలుగు అధ్యాపకుడిగా నలభై సంవత్సరాలు ప్రతిరోజూ తరగతి గదిలో ఉపన్యాసాలతో మాత్రమే కాదు, 1968-69 నుంచి ఇప్పటిదాకా బహిరంగ సభలలో, నాలుగు గోడల మధ్య సభలలో, సమావేశాలలో, సదస్సులలో, అధ్యయన తరగతుల్లో వరవరరావు కనీసం రెండువేల ఉపన్యాసాలు ఇచ్చి ఉంటారు. కొన్ని లక్షల మందిని తన ఉపన్యాసాలతో ప్రభావితం చేసి ఉంటారు. గత నలభై సంవత్సరాలలో ఆరు సంవత్సరాల జైలు జీవితం మినహా మిగిలిన కాలమంతా ఒక్క ఉపన్యాసమైనా ఇవ్వకుండా ఒక్క వారమైనా గడిచి ఉండదు. ఈ క్రమంలో ఆయన వక్తృత్వశైలిలో విశిష్టమైన లక్షణాలెన్నో వచ్చి చేరాయి. ఒక అంశాన్ని వివరించడానికి విభిన్న కోణాల నుంచి వాదనలు చేయడం, ఒక భావనను వేర్వేరు ప్రతీకలతో, ఉపపత్తులతో అర్థం చేయించడం, మన సామాజిక చరిత్రనుంచి, ముఖ్యంగా మహాభారతం నుంచి, జానపదగాథల నుంచి ఉదాహరణలు ఇవ్వడం, రాజకీయార్థిక దృక్పథపు పనిముట్లతో విశ్లేషించడం, వాక్య నిర్మాణాలలో శ్రోతలను ఆకట్టుకునే, హృదయాన్ని తట్టే, ఆలోచనను మేల్కొలిపే భాషా విన్యాసాలు ఆయన ఉపన్యాసాలలో నిండి ఉంటాయి. ఆయన ఉపన్యాసం వినడం ఒక గొప్ప అనుభవం లాగుంటుంది. ఆయన ఉపన్యాసాలను రికార్డు చేసి యథాతథంగా అచ్చువేయడం అవసరమనీ, అది తెలుగు వాక్యం గురించి, వాక్య విన్యాసాలలో శైలీ భేదాల గురించీ తాను చేస్తున్న పరిశోధనకు చాల ఉపయోగపడుతుందనీ చేకూరి రామారావుగారు చాలసార్లు అన్నారు. వేలాదిగా విస్తరించిన ఆ ఉపన్యాసాలు మిత్రుల దగ్గర కాసెట్లలో రికార్డ్ అయి ఉన్నాయో లేదో తెలియదు గాని ఐదారు సందర్భాలలో మాత్రం కాసెట్ల నుంచి యథాతథంగా లిఖితరూపంలోకి వచ్చి పత్రికలలో, పుస్తకాలలో అచ్చయ్యాయి. ఆ రకంగా వస్తువు కోసం మాత్రమే కాక, శైలీ శిల్పాల కోసం కూడ ఇది చాల అవసరమయిన ప్రసంగం. మరొకసారి ముద్రించి పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన ‘ఉద్యోగ క్రాంతి’ కర్నూలు మిత్రులకు అభినందనలు.

– ఎన్ వేణుగోపాల్

హైదరాబాదు, మే 27, 2010

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

One Response to రెండు పదుల తర్వాత

 1. రాజు says:

  “ఆయన ఉపన్యాసం వినడం ఒక గొప్ప అనుభవం లాగుంటుంది. ఆయన ఉపన్యాసాలను రికార్డు చేసి యథాతథంగా అచ్చువేయడం అవసరమనీ, అది తెలుగు వాక్యం గురించి, వాక్య విన్యాసాలలో శైలీ భేదాల గురించీ తాను చేస్తున్న పరిశోధనకు చాల ఉపయోగపడుతుందనీ చేకూరి రామారావుగారు చాలసార్లు అన్నారు. వేలాదిగా విస్తరించిన ఆ ఉపన్యాసాలు మిత్రుల దగ్గర కాసెట్లలో రికార్డ్ అయి ఉన్నాయో లేదో తెలియదు గాని”

  వేణు గారూ,
  మళ్లీ పాతికేళ్ల నాటి జ్ఞాపకాలను తట్టి లేపారు. శ్రోతలను మంత్రముగ్దులను చేస్తూ, బోధిస్తున్నట్లుగా కాక నచ్చచెబుతున్నట్లుగా సాగే ఆయన ఉపన్యాసం రాజకీయపరమైనదైనా, సాహిత్య పరమైనదైనా ఇతరత్రా అయినా తెలుగు భాషలో సున్నితత్వానికి, నిశితత్వానికి మారుపేరుగా ఉంటుంది. 40 ఏళ్లకు పైగా ఆయన కన్విన్స్ చేయడమనే కేంద్రం చుట్టూ మాటలతో మంత్రోచ్చాటన చేస్తున్నారు. తిరుపతి కోనేటి కట్ట వద్ద ఆయన ఉపన్యాసాలు పాతికేళ్లకు ముందు చెవులు రిక్కించుకుని విన్న రోజులు ఇప్పటికీ మర్చిపోలేదు. వంద పీహెచ్‌డీల పెట్టు అయిన ఆయన సిద్ధాంత వ్యాసం “ప్రజలమనిషి” వుస్తకాన్ని ఆప్యాయంగా హత్తుకున్న రోజుల్నీ మర్చిపోలేదు. విరసానికి ఆయన అవసరం కూడా తీరిపోతున్నట్లుంది. కాబోలు. ఆయన గొంతునయినా సీడీ లేదా డీవీడీల రూపంలో భద్రపర్చవలసిన అవసరం ఇప్పడు ఎంతయినా ఉంది. కనీసం మీరయినా ఈ పనికి పూనుకోవచ్చు కదా..

  ఉద్యోగ క్రాంతి మళ్లీ ప్రచురించిన వీవీ గారి తాత్విక ప్రసంగ వ్యాసం ప్రతి నాకూ కావాలి. అయిదు కాపీలు తీసుకోవాలంటే మార్గం సూచించండి.

  సిద్దాంతాలు, వాదాలు ప్రతివాదాలు చరిత్రకెక్కుతున్నట్లుగా ప్రసంగాలు, మాటలు ప్రపంచానికి మిగులుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎవరో ఒకరు పూనుకుంటే తప్ప ఈ నష్టాన్ని పూరించడం అసాధ్యం. తెలుగు జాతికి చందమామ పత్రిక చరిత్రను రికార్డు చేయడం ఎంత ముఖ్యమో, ఉద్యమాల సంస్కృతిని రికార్డు చేయడం అంతే ముఖ్యం. కవిత్వం, కథలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నట్లుంది. కాని గత నాలుగు దశాబ్దాలుగా తెలుగునేలపై లక్షలాది మందిని తట్టిలేపిన అద్భుతమైన ప్రసంగాలు చరిత్ర ఊసులోకి కూడా రాకుండా కనుమరుగవుతున్నాయి. వీవీ గారి ఆ సుప్రసిద్ధ తాత్విక ప్రసంగం ఆడియో రూపంలో దొరికే అవకాశం ఉందా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s