కాలంతో నడిచి, కాలాన్ని నడిపించిన శ్రీశ్రీ

ఎవరి శతజయంతి అయినా వారి కృషిని మననం చేసుకోవడానికీ, ఆ కృషిలోని అనుకూల, ప్రతికూల అంశాలను నిష్పాక్షికంగా మదింపు వేసి, దానినుంచి పాఠాలు గ్రహించడానికీ ఒక సందర్భం కావాలి, సాధారణంగా అవుతుంది. కాని ప్రపంచానికంతా వర్తించే సూత్రాలు కొన్ని తెలుగు సమాజానికి వర్తించవు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని ‘అవతలివాళ్లు’ అన్నారు గనుకనే కాదనడం అలవాటు చేసుకున్న జాతి మనది. ‘రెండు రెళ్లు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసరడం’ ఎప్పటినుంచో చూస్తున్నాం మనం. వివాదానికీ, రంధ్రాన్వేషణకూ, దుమ్మెత్తిపోయడానికీ, స్థలకాలాలతో సంబంధం లేకుండా ‘అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు’ అని అర్థరహిత వాదనలు జరపడానికీ శతజయంతి సందర్భాన్ని కూడ వాడుకోవడంలో మనం సిద్ధహస్తులం. మన మహాకవి శ్రీశ్రీ శతజయంతి విషయంలోనూ ఇది మరొకసారి రుజువవుతోంది. ఆయన జీవించి ఉన్నప్పటి వివాదాలు అలా ఉంచి, మరణించిన ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత, శతజయంతి సందర్భాన్ని ఉపయోగించుకుంటూ కొత్త వివాదాలు ఉత్పత్తి అవుతున్నాయి. శ్రీశ్రీని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం కాక, తాము కోరుకున్నట్టుగా, తమ ఇవాళ్టి విశ్వాసాలకు అనుకూలంగా ఉంటే బాగుండునని చాలమంది ఆశిస్తున్నారు. ఆయన అట్లాగే ఉన్నాడని చెప్పడానికి సాహసిస్తున్నారు. శ్రీశ్రీ గురించి “సన్నిహిత ప్రియమిత్రు”లు ఏమని వర్ణిస్తారని చలం 1940లో చెప్పాడో, ఆ మాటలే సరిగ్గా ఏడు దశాబ్దాల తర్వాత కూడ అక్షరాలా నిజం కావడం చలం దూరదృష్టికి సంకేతమో, తెలుగు సమాజ స్తబ్దతకు సంకేతమో, శ్రీశ్రీ బహుముఖ ప్రజ్ఞాభరిత వ్యక్తిత్వానికి సంకేతమో తేలవలసే ఉంది.

శతజయంతిని పురస్కరించుకుని ఏడాదికిపైగా సాగుతున్న ఈ విచిత్ర విశ్లేషణల తతంగం గురించి ఆలోచిస్తుంటే, శ్రీశ్రీ గురించి ఈ గందరగోళం తలెత్తడానికి, వారివారి సొంత ప్రయోజనాలు అలా ఉంచి, ఒక తాత్విక సమస్య కూడ ఉందేమోననిపిస్తున్నది. బహుశా ఆధునిక తెలుగు సమాజ, సాహిత్య స్థలకాలాలలో శ్రీశ్రీ నిర్వహించిన పాత్ర ఎంత విశిష్టమైనదో మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదేమోననిపిస్తున్నది. ఆయనకూ కాలానికీ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవలసినంతగా చేసుకోకపోవడం వల్లనే ఆయనను ఏదో ఒక కాలానికి కట్టివేయాలనో, లేదా కాలాతీత వ్యక్తిని చేయాలనో మనం ప్రయత్నిస్తున్నట్టున్నాం. మనకు నచ్చిన కాలానికే ఆయనను కట్టివేయడం, కాలాన్ని మనం ఎలా చూస్తున్నామో, చూడదలచుకున్నామో ఆయన కూడ అలానే చూశాడని మనం నమ్మడం, ఇతరులచేత నమ్మించడానికి ప్రయత్నించడం, కాలంతో ఆయన వ్యవహరించిన తీరును విస్మరించడం మొదలయిన తప్పుడు పద్ధతులలో ఆయనను కొలవడానికి ప్రయత్నిస్తున్నాం. మనదగ్గర ఉన్న మూతతోనే ఆ ఆకాశాన్ని మూయదలచుకుంటున్నాం, లేదా ఆ మూత తీసి ఆకాశాన్ని తెరిచామనుకుంటున్నాం. ఆయనే ఒక పాటలో రాసినట్టు మన చెమ్చాతో ఆ సముద్రాన్ని తోడిపోయగలమనుకుంటున్నాం.

ఈ దృష్టితో శ్రీశ్రీకీ కాలానికీ ఉన్న సంబంధం గురించి ఆలోచించినప్పుడు, అది చాల సంక్లిష్టమైన సంబంధమనీ, ఇరవయోశతాబ్ది తెలుగు సామాజిక సాహిత్య చరిత్రతో మాత్రమే కాదు, ప్రపంచ చరిత్ర పూర్వరంగంలో చూసినప్పుడు మాత్రమే ఆ సంబంధాన్ని ఎక్కువగా అవగాహన చేసుకోగలమనీ అనిపిస్తున్నది. అది చాల పెద్ద ప్రయత్నం గాని, ఆ ప్రయత్నానికి ఉపయోగపడగల ప్రాతిపదికలు సూచించడమే ఈ వ్యాస లక్ష్యం.

***

నవకవిత లక్షణాలేమిటో అత్యద్భుతంగా వివరిస్తూ ‘కదలేదీ కదలించేదీ మారేదీ మార్పించేదీ పాడేదీ పాడించేదీ’ అని 1937లో రాస్తున్నప్పుడు శ్రీరంగం శ్రీనివాసరావు అనే ఇరవై ఏడేళ్ల కవికి తన మాటల అంతరార్థం, సంపూర్ణ అర్థం తెలుసునో లేదో చెప్పలేం. కాని అంతకు ముందు గడిచిన ఇరవై ఏడేళ్లలో ఎలా ఉన్నా, ఆతర్వాత గడిచిన నలభై ఐదేళ్లలో మాత్రం ఆయన కాలంతోపాటు కదిలాడు, కాలాన్ని కదిలించాడు. కాలంతోపాటు మారాడు, కాలాన్ని మార్పించాడు. కాలంతోపాటు పాడాడు, తనను పాడించేది కాలమే అని గుర్తించాడు. ఇక్కడ ‘కాలం’ అన్న మాటను అన్ని పొరల, అన్ని కోణాల, అన్ని స్థాయిల అర్థంలో గుర్తించవలసి ఉంది. అది కేవలం ఇరవయోశతాబ్ది నాలుగో దశకం నుంచి ఎనిమిదో దశకం దాకా అనే సమయ సూచి కావచ్చు. స్థలం లేకుండా కాలం లేదు గనుక అది తెలుగు నేల  అనుభవించిన కాలం కావచ్చు. స్థలకాలాలు సమాజం లేకుండాలేవు గనుక నిర్దిష్ట స్థలకాలాల తెలుగు సమాజం కావచ్చు. గొప్ప చదువరిగా, లోతయిన ఆలోచనాపరుడిగా, ‘ఖండాంతర నానాజాతులు’ ఒక గొంతుకతో చాటించే చారిత్రక యథార్థతత్వం తెలుసుకోవడానికి నిరంతర అన్వేషకుడిగా శ్రీశ్రీకి కాలం తన కాలం మాత్రమే కాదు. అది చారిత్రక కాలం. స్థలం తన స్థలం మాత్రమే కాదు, ఖండాంతర స్థలం. సమాజం తెలుగు సమాజం మాత్రమే కాదు, నానాజాతుల సమాజం. అంటే నిర్దిష్టంగానూ, సాధారణంగానూ శ్రీశ్రీ తాను జీవించిన స్థలకాల సమాజాలను సంపూర్ణంగా తనలోకి తీసుకున్నాడు, తాను వాటిలో లీనమయ్యాడు. వాటితో పాటు కదిలాడు, వాటిని కదిలించాడు. అవి ఎలా మార్పు చెందుతున్నాయో చూశాడు, వాటిని మార్చే మహామానవ ప్రయత్నంలో తానూ భాగమయ్యాడు. వాటిని పాడాడు. అవే తనచేత పాడిస్తున్నాయని, తనపాటలు మళ్లీ ఇతరులను కరగించే, కానరాక కదిలించే గళ గళన్మంగళ కళాకాహళ హళాహళి అవుతాయని కూడ అర్థం చేసుకున్నాడు.

బహుశా శ్రీశ్రీ లో ఈ రెండులక్షణాలూ – కాలబద్ధత, కాల పరివర్తనా బాధ్యత నిర్వహణ – ఏకకాలంలో సరయిన పాళ్లలో ఉన్నాయని గుర్తించకపోవడం వల్లనేననుకుంటాను, ఆయన పట్ల అవగాహనలలో గందరగోళం రావడానికి అవకాశం ఉంది. మనలో చాలమందిమి కాలానికి, కాలం విధించే పరిమితులకు, కాలం ఇచ్చే అవకాశాలకు బద్ధులమై ఉంటాము. మన జీవితాలన్నీ ఈ కాలబద్ధతలోనే గడిచిపోతాయి. బహుశా అందువల్లనే కాలబద్ధమైన అస్తిత్వాన్ని, ఆచరణను మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతాం, ఆమోదించగలుగుతాం. ఎవరయినా కాలానికి కళ్లెం వేస్తానంటే, వారి దృష్టి ఆద్యంత రహితం అంటే, వారు ముందుకుపోతుంటే ప్రపంచం వారివెంట నడుస్తుందంటే, ఆ రేఖ చెదిరితే గొల్లుమనిపోతాం. కాని అటువంటి ప్రయోగశీలత, నూతనాన్వేషణ, సృజన ఉన్నవాళ్లు లేకపోయి ఉంటే కాలం ముందుకు కదిలే ఉండేది కాదు, మానవసమాజం ఇంతదూరం నడిచి వచ్చి ఉండేదే కాదు. అలాంటి వాళ్లు ఏ సమాజంలోనయినా కొద్దిమందే కావచ్చు. ఎక్కువమంది అయితే బాగుండునని మనం కోరుకోవచ్చుగాని, ఎక్కువమంది కాకపోవడం కూడ కాలం విధించే పరిమితే. ఆ కొద్దిమంది కాలం కన్న ముందుకు చూస్తూ, ఒక్కొక్కసారి తాము ఉన్న కాల పరిమితులను కూడ దాటిపోతుంటారు. తమను దాటి పోతున్నారు గనుక కాలం వారిని గుర్తించదు. కాలంతో నడిచే పనీ, కాలాన్ని ముందుకు తీసుకుపోయే పనీ సమపాళ్లలో చేసేవారు, కాల6తోపాటు కదులుతూ, ఆ కాలాన్ని కదల్చే సాధనాలు కూడ చేజిక్కించుకుంటారు. ఉపయోగిస్తారు. అలా కాలాన్ని కదల్చినవారు భౌతికంగా ఉన్నా లేకపోయినా జీవించే ఉంటారు. ఇరవయోశతాబ్ది తెలుగు సామాజిక సాహిత్య జీవితంలో శ్రీశ్రీ అలాంటి వ్యక్తి.

మాదృష్టిది వర్తుల మార్గం, ఆద్యంత రహితం అన్నప్పుడు అది ఎటువంటి కుదుపులూ, గుణాత్మక మార్పులూ లేని వృత్తం మీద నింపాది నడకేమో అనిపిస్తుంది గాని ముళ్లూ రాళ్లూ అవాంతరాలెన్ని ఉన్నా ముందుదారి మాది అన్నప్పుడు అది కేవలం వృత్తం కాదనీ, అంతకంతకూ పైకిపోయే శంకు ఆకారపు నిచ్చెన అనీ అర్థమవుతుంది. నిజంగా ఆయన ఆ ప్రవాహశీల స్వభావంతో కాలంలా ముందుకు కదిలాడు. ఒక రకంగా కాలానికి సమానార్థకమయ్యాడు. ఆయన జీవించిన ఏడు దశాబ్దాలలో సంభవించిన ప్రధాన ఘటనలను, సామాజిక సందర్భాలను, సమాజ పరిణామక్రమాన్ని తీసుకుని అవి శ్రీశ్రీ ఆలోచనా ధోరణి మీద, వ్యక్తీకరణ మీద ఎటువంటి ప్రభావం వేశాయో నిరూపించవచ్చు. అంతకు ముందరి సమాజ చరిత్ర అంతా కూడ అధ్యయనం వల్ల ఆయన చైతన్యంలో భాగమయింది గనుక సమయానుసారంగా ఆ సందర్భాలు ఆయన మీద ఏప్రభావం వేశాయో చూపవచ్చు. అలాగే ఆయన రచనలు, ఉపన్యాసాలు, కార్యాచరణ సమాజం మీద ఎటువంటి ప్రభావం వేశాయో నిరూపించవచ్చు. కాలంచేత ప్రభావితుడయి శ్రీశ్రీ చేసిన రచనల చేత ప్రభావితులయిన యువతరం కార్యాచరణ మళ్లీ తిరిగి ఆయనను ప్రభావితం చేయడం కూడ గుర్తించవచ్చు.

శ్రీశ్రీ జీవితానికి సమాంతరంగా సమాజ జీవితంలోని ప్రధాన సందర్భాలను చూస్తే, తొలి దశాబ్దంలో బరంపురం సహపంక్తి భోజనం, మొదటి ప్రపంచయుద్ధం, బోల్షివిక్ విప్లవం; రెండో దశాబ్దంలో అల్లూరి సీతారామరాజు నడిపిన మన్య విప్లవం, క్రియాశీల జాతీయోద్యమం, ఆర్థిక సంక్షోభం; ఆకటి దశాబ్దంగా పేరుపొందిన కీలకమైన మూడో దశాబ్దంలో తెలుగు సీమలో సామ్యవాద భావాల వ్యాప్తి, సంక్షోభంలో చెక్కుచెదరని సోవియట్ యూనియన్, స్పానిష్ అంతర్యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకోవడం; నాలుగో దశాబ్దంలో అభ్యుదయ రచయితల సంఘం, కమ్యూనిస్టుపార్టీ ప్రభావం, జాతీయోద్యమ ఉధృతి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అధికారమార్పిడి, చైనా విముక్తి; ఐదో దశాబ్దంలో తెలంగాణ సాయుధ పోరాట విరమణ, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, 1955 ఆంధ్ర ఉప ఎన్నికలు, సోవియట్ పార్టీ ఇరవయో మహాసభ, రివిజనిజం, కేరళ ఎన్నికల విజయం, నంబాద్రిపాద్ ప్రభుత్వ బర్తరఫ్; ఆరో దశాబ్దంలో చైనా యుద్ధం, కోపోద్రిక్త యువతరం ప్రపంచవ్యాపిత పోరాటాలు, చైనా సాంస్కృతిక విప్లవం, కమ్యూనిస్టు శిబిరంలో చర్చలు, చీలికలు, నక్సల్బరీ; ఏడో దశకంలో విరసం ఏర్పాటు, చైనా విజయాలు, వియత్నాం విజయం, విప్లవోద్యమ వెనుకంజ, పునరుత్థానం, ఎమర్జెన్సీ, ప్రజా ఉద్యమ వెల్లువ వంటివెన్నో ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్క పరిణామమూ శ్రీశ్రీని ప్రభావితం చేసింది. ప్రతి పరిణామం మీదా ఆయన తన స్పందనను వ్యక్తీకరించాడు.

ఆ స్పందనలు కేవలం కాటలాగ్ వ్యక్తీకరణలుగాకాక, ఆయా ఘటనలను, క్రమాలను ఇతరులకు ఎక్కువ అర్థం చేయించేవిగా, ఆయా సందర్భాలలో ఏమి చేయాలో మార్గదర్శకత్వం చూపేవిగా కూడ ఉన్నాయి. కాలం వల్ల వెలువడ్డ రచనలే అయినా కాలాన్ని ముందుకు తోయగల శక్తిమంతమయిన రచనలు అవి. దాదాపు ప్రతి రచననూ తీసుకుని ఈ అంశాన్ని వివరించవచ్చు గాని, జయభేరి గీతాన్ని బోల్షివిక్ విప్లవంతో లేచినిలిచి, తనశక్తి తెలుసుకున్న శ్రమజీవి ప్రకటనగా చూస్తే అది ఒకే సమయంలో తన కాలాన్నీ ప్రతిఫలించిందనీ, ఎల్లకాలానికీ నిలిచే ప్రకటనా చేసిందనీ అర్థమవుతుంది. అలాగే చేదుపాట – ఆకటి దశాబ్దం, దేశచరిత్రలు – స్పానిష్ అంతర్యుద్ధం, మహా సంకల్పం – అధికారమార్పిడి, సదసత్సంశయం – సాయుధపోరాట విరమణ, కేరళలో శగట్లు – నంబూద్రిపాద్ బర్తరఫ్, విప్లవోద్యమం ఓటమి-గెలుపు-ఓటమి – ఊగరా ఊగరా వంటివి శ్రీశ్రీ రచనలకూ సామాజిక సందర్భాలకూ చూపగల అనేక పోలికలలో కొన్ని మాత్రమే. దాదాపు అవన్నీ కాలబద్ధమై కూడ, కాలాన్ని ముందుకు నడిపించడానికి దారి తీసినవి.

శ్రీశ్రీ రచనలలో ఈ రెండు లక్షణాలు ఎంత అద్భుతంగా, రసాయనిక సంయోగక్రియలాగ కలగలిసి కొత్త చైతన్యానికి, కొత్త స్ఫూర్తికి, కొత్త అన్వేషణకు, కొత్త ఆచరణకు వీలు కలిగించాయో లోతుగా పరిశోధించగలిగితే శ్రీశ్రీ ఘనత పూర్తిగా అర్థమవుతుంది. ఎన్ని విమర్శలు ఉన్నా, ఆ విమర్శకులు కూడ శ్రీశ్రీని ఎందుకు కొట్టివెయ్యలేరో అర్థమవుతుంది. శ్రీశ్రీని మన ఇష్టం వచ్చిన కాలానికి కట్టివెయ్యడం ఎంత అసాధ్యమో తెలుస్తుంది.

రచన: ఏప్రిల్ 17, 2010

ప్రచురణ: శ్రీశ్రీ సాహిత్య నిధి, విజయవాడ – శ్రీశ్రీ శతజయంతి సంచిక, ఏప్రిల్ 2010

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

One Response to కాలంతో నడిచి, కాలాన్ని నడిపించిన శ్రీశ్రీ

  1. bondalapati says:

    Please excuse me for writing in english. Some how lekhini is not working on my system.
    I think it would have been better understood if you elaborated the context of “kaalaanni munduku nadipinchatam”.

    If you talk physically, nobody, however great he is, can do “kaalaanni munduku nadipinchatam”. If you talk about the cultural aspects there are visionaries in this field who thought centuries and milleniums ahead of time. It’s not that tough “to think ahead of the time” when compared to “implementing those thoughts”. The difference between other great thinkers and Sri sri had a great and unmatching cultural interface to his futuristic thoughts.

    Representing even the past through reading the past works is again only true at intellectual level. Past can not be embodied by a person at physical, emotional, psycological levels by reading books about past.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s