ఇవాళ శ్రీశ్రీ అవసరం ఏమిటి?

(ఏప్రిల్ 19, 2010, వార్త ఆదివారం అనుబంధం, ఏప్రిల్ 25, 2010)

వంద సంవత్సరాల కింద పుట్టి, ఓ యాభై ఏళ్లు కవిత్వం రాసి, వచన రచనలూ, ఉపన్యాసాలూ చేసి, తనకాలపు సామాజిక, సాహిత్య ఉద్యమాలలో పాల్గొని, ఇరవై ఏడేళ్ల కింద మరణించిన మనిషికి ఇవాళ సంబద్ధత ఉన్నదా లేదా అని ఎందుకింత చర్చ, వివాదం జరుగుతున్నాయి? అసలు అంత చర్చ, వివాదం జరగడమే ఆయన ఇంకా సజీవంగా ఉన్నాడనడానికి, ఆయన సంబద్ధత చెరిగిపోలేదని అనడానికి చిహ్నమా?

మా సామాజిక వర్గంలో, మా ప్రాంతంలో, మా బృందంలో పుట్టలేదు గనుక, మాగురించి రాయలేదు గనుక, మాప్రాంతం గురించి రాయలేదు గనుక, మా బృందం గురించి రాయలేదు గనుక ఆ వ్యక్తికి ఇప్పుడు సంబద్ధత లేదు అనే వాదనలు తలెత్తుతున్న కాలం ఇది. అయితే ఒక రచయిత, లేదా ఒక వ్యక్తి తన కాలంలోనో, తాను భౌతికంగా మరణించిన తర్వాత కాలానికో సంబద్ధంగా ఉండడమంటే అర్థం ఏమిటి?

ఏ మనిషికయినా ఆ మనిషి జీవితకాలపు పరిస్థితుల వల్ల, నమ్మిన విశ్వాసాల వల్ల, కార్యాచరణ వల్ల, వెలువరించిన వ్యక్తీకరణ వల్ల మరణానంతర జీవితం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ప్రాసంగికతను సామాజికస్థితి, విలువలూ విశ్వాసాలూ, వ్యక్తిగత ఆచరణ, వ్యక్తీకరణ అనే నాలుగు ప్రాతిపదికలమీద కొలవవలసిందే తప్ప అది మన ఇష్టాయిష్టాలను బట్టి నిర్ణయం కాదు. ఆ నాలుగు ప్రాతిపదికలతో సంబంధంలేకుండా మన ఆవేశకావేషాలతోనో, అభిమానంతోనో ఏ మనిషికీ లేని ప్రాసంగికతను తెచ్చిపెట్టలేము. ఉన్న ప్రాసంగికతను తొలగించలేము.

అలాగే ఏ మనిషీ కూడ తన కాలం తర్వాత నూటికి నూరుపాళ్లు సంపూర్ణంగా ప్రాసంగికంగా ఉండడం సాధ్యం కాదు. అక్కడకూడ మళ్లీ ఈ నాలుగు ప్రాతిపదికలలో వచ్చిన మార్పులు ఆ ప్రాసంగికత స్థాయిని మారుస్తూ ఉంటాయి. తమకాలంలో అసందర్భంగా కనబడిన వాళ్లు ఆ తర్వాత ఎంతోకాలానికి ప్రాసంగికంగా కనబడడం, తమకాలంలో మహాత్ములుగా గుర్తింపు పొందినవాళ్లు ఆ తర్వాత వీసమెత్తు విలువ చేయకపోవడం, ఒకరికి క్రమక్రమంగా ప్రాసంగికత పెరుగుతూ ఉండడం, మరొకరికి క్రమక్రమంగా ప్రాసంగికత తగ్గుతూ ఉండడం ప్రపంచచరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. అలాగే తొంబైతొమ్మిది విషయాలలో ప్రాసంగికంగా ఉన్న వ్యక్తి ఒక విషయంలో చాల అసందర్భంగా కనబడే సందర్భమూ ఉంటుంది. తొంబై తొమ్మిది విషయాలలో పనికిమాలిన వ్యక్తిదగ్గర కూడ సంబద్ధమైన అంశం ఒకటి ఉండవచ్చు. కనుక ఏ వ్యక్తి గురించి అయినా ఇటువంటి సాపేక్షిక దృక్పథం తీసుకోకుండా పరమంగా సంబద్ధతనో, అసంబద్ధతనో ప్రకటించడం జడాత్మక తర్కం. ఆ మనిషి చుట్టూ ఉండే సమాజం, ఆ మనిషి కార్యాచరణ సాపేక్షికంగానే ఉంటాయి గనుక సాపేక్షిక అంశాలను నిరపేక్షంగా అంచనాకడితే, ఆ అంశాలకు వచ్చే నష్టమేమీ లేదు, మన దృష్టిలోపమే కనబడుతుంది.

శ్రీశ్రీ ఇవాళ్టి సమాజానికి పనికిరాడని, ఆయన ప్రాసంగికత ముగిసిపోయిందని వస్తున్న వాదనలలో అటువంటి పొరపాటు ఉన్నదనిపిస్తున్నది. శ్రీశ్రీ నూటికి నూరుపాళ్లు ప్రాసంగికుడేనని వాదిస్తున్న వాళ్లలో కూడ ఈ అతివాదమే ఉన్నది. బహుశా ఈ రెండు అతివాదాల మధ్య తెలుగు సాహిత్యం గురించిన అంచనాలు అసమగ్రంగా మారిపోతున్నాయి.

శ్రీశ్రీ గురించి రాసేటప్పుడు ఆయన కృషిని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సందర్భంలో అంచనా వేయడానికి బదులుగా ఆయన మాటలే అటూ ఇటూ తిప్పి ఆలంకారికంగా, ప్రవాహ సదృశ శైలిలో రాయడం అలవాటయిపోయింది. బహుశా చలం యోగ్యతాపత్రంలో ప్రారంభించిన ఈ పలవరింత సంప్రదాయం ఇవాళ్టికీ మనను వదలడం లేదు. ఈ శైలిని కొందరు శ్రీశ్రీ విమర్శకులు కూడ ఉపయోగించుకున్నారు గాని మొత్తం మీద ఈ ధోరణిలో అభిమానం పాలే హెచ్చు గాని అంచనాకు అవసరమైన నిర్మమకారమైన విమర్శనాత్మక దృక్పథం లేదు. ఇది ఒక కొస కాగా, శ్రీశ్రీ రాసిన ప్రతిదాన్నీ తమకు కావలసినట్టుగా అర్థం చేసుకోవడం, ఇవాళ్టి తమ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక దృక్పథాన్ని బట్టి శ్రీశ్రీని అంచనా కట్టడానికి ప్రయత్నించడం మరొక కొస. ఇందులో కూడ అభిమానులూ వ్యతిరేకులూ ఉన్నారు గాని శ్రీశ్రీకి ఆయన స్థలమూ కాలమూ దృక్పథమూ ఇచ్చిన అవకాశాలేమిటో, విధించిన పరిమితులేమిటో వీరికి అక్కరలేదు. తమ అభిప్రాయానికి అనుగుణంగా శ్రీశ్రీ మారాలి, తమ దగ్గర ఉన్న కొలత పాత్రలో ఇమిడే శ్రీశ్రీ కావాలి గాని, వాస్తవంగా ఉన్న శ్రీశ్రీని ఎలా అర్థం చేసుకోవాలనే దృష్టిలేదు.

విశ్లేషకులకు నచ్చినా నచ్చకపోయినా ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్య సీమలో అసాధారణ పాత్ర వహించిన, అసాధారణ ప్రభావం చూపిన శ్రీశ్రీ గురించి విశ్లేషణలు ఇంత బోలుగా ఉండడం విచారకరం. కాని ఇటువంటి దుస్థితి ఒక్క శ్రీశ్రీకి మాత్రమే పట్టలేదు, బహుశా తెలుగు సామాజికుల ఆలోచనాపద్ధతిలోనే ఉన్న పెడధోరణులకు ఇది ఒక నిదర్శనం. శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా మళ్లీ ఒకసారి రుజువవుతోంది.

ఎవరి శతజయంతి అయినా వారి కృషిని మననం చేసుకోవడానికీ, ఆ కృషిలోని అనుకూల, ప్రతికూల అంశాలను నిష్పాక్షికంగా మదింపు వేసి, దానినుంచి పాఠాలు గ్రహించడానికీ ఒక సందర్భం కావాలి, సాధారణంగా అవుతుంది. కాని ప్రపంచానికంతా వర్తించే సూత్రాలు కొన్ని తెలుగు సమాజానికి వర్తించవు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని ‘అవతలివాళ్లు’ అన్నారు గనుకనే కాదనడం అలవాటు చేసుకున్న జాతి మనది. ‘రెండు రెళ్లు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసరడం’ ఎప్పటినుంచో చూస్తున్నాం మనం. వివాదానికీ, రంధ్రాన్వేషణకూ, దుమ్మెత్తిపోయడానికీ, స్థలకాలాలతో సంబంధం లేకుండా ‘అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు’ అని అర్థరహిత వాదనలు జరపడానికీ, లేదా ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సార్వకాలికుడు, ఆదిమధ్యాంతరహితుడు, మహిమాన్వితుడు అని భజన చేయడానికీ శతజయంతి సందర్భాన్ని వాడుకోవడంలో మనం సిద్ధహస్తులం.

సామాజికస్థితి, విలువలూ విశ్వాసాలూ, ఆచరణ, వ్యక్తీకరణ అనే నాలుగు ప్రాతిపదికలమీద చూసినప్పుడు శ్రీశ్రీలో ఇవాళ్టికీ కొనసాగుతున్న భాగమూ ఉంది, ఇవాళ అర్థరహితమైపోయిన భాగమూ ఉంది, ఆయన రాసిననాటికన్న ఇవాళే ఎక్కువ సంబద్ధమైన భాగమూ ఉంది. బహుశా ఏమనిషికయినా అలాగే ఉంటుంది. ఉదాహరణకు వేమన విషయంలో ఆయన కాలం, ఆయన ఆచరణ, ఆయన విలువలూ విశ్వాసాలూ మనకు ఉజ్జాయింపుగానే తప్ప కచ్చితంగా తెలియదు గనుక వాటిని బట్టి ఆయన ప్రాసంగికతను అంచనావేయలేం. కాని ఆయన వ్యక్తీకరణలో ‘కులము గలవాడు, గోత్రంబు గలవాడు విద్యచేత విర్రవీగువాడు, పసిడిగల్గువాని బానిసకొడుకులు’ అనీ, ‘భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వు’ అనీ ఇవాళ మరింత ఎక్కువ అక్షరసత్యాలుగా ఉన్న వ్యక్తీకరణలూ ఉన్నాయి, కుల, స్త్రీ-పురుష విభేద, మత ఆలోచనలకు సంబంధించి ఇవాళ అంగీకరించలేని వ్యక్తీకరణలూ ఉన్నాయి. మొదటి వ్యక్తీకరణలలో ఎంత ప్రాసంగికత ఉన్నదో, రెండో వ్యక్తీకరణలలో తన కాలపు ప్రభావాలు అంతగా ఉన్నాయి.

అటు దురభిమానానికో, ఇటు నిర్హేతుక వ్యతిరేకతకో, మరోవంక మన విశ్వాసాలకు అనుగుణంగా శ్రీశ్రీని కత్తిరించడానికో గురికాకుండా శ్రీశ్రీని కూడ ఈ నాలుగు ప్రాతిపదికలమీద అంచనాకట్టవలసి ఉంది.

శ్రీశ్రీ జీవించిన కాలం నాటి పరిస్థితులు మౌలికంగా మారినప్పుడే శ్రీశ్రీ సంబద్ధత రద్దయిపోతుంది. ఆ పరిస్థితులు పైపైన కొన్ని మార్పులకు గురయితే అవి ఎక్కడెక్కడ మారాయో అక్కడక్కడ మాత్రమే ఆయన ప్రాసంగికత కనబడకుండాపోతుంది. ‘ప్రపంచాగ్నికి సమిధ అవుతూ’, ప్రపంచాన్ని నడుపుతూ తగిన ప్రతిఫలానికి నోచుకోక, ‘ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోతున్న’ మనిషి ఇంకా అట్లాగే ఉన్నాడు. ‘ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించాలని’ ఆ మనిషి కంటున్న కల ఇంకా సాకారం కాలేదు. ఆ కల ఇంకా బలవత్తరమవుతోంది. ‘నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలలో చిక్కేవాళ్లూ, కష్టం చాలక కడుపుమంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్లూ శ్రమ నిష్ఫలమై, జని నిష్ఠురమై, నూతిని గోతిని వెదకేవాళ్లూ అనేకులింకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా’ ఆయన రాసిన ముప్పైలనాటికీ ఇవాళ్టికీ ఇంకా పెరిగిపోయారు గాని తగ్గలేదు. ‘వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం’ ఇంకా అలాగే ఉంది. ఆ దృశ్యపు రంగులు మారాయేమో, చూస్తున్న మన దృక్కోణం మారిందేమో, ఆ దృశ్యపు రూపం మారిందేమో కాని అసలు దృశ్యపు సారాంశం బహుశా ఇంకా భయంకరంగా మారింది. అందువల్ల శ్రీశ్రీ సంబద్ధత ఇంకా పెరిగింది గాని తగ్గలేదు. ‘కోటిగొంతులు కోరి రమ్మన్న రష్యా, కోటిచేతులు కౌగలించిన రష్యా’ మారిపోయిందేమో, కూలిపోయిందేమో, ‘ఆకారం దాల్చుతున్న ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రజాతికంతటికీ విజయం, ఆంధ్రసంస్కృతికి అఖండ విజయం’ అన్నమాటకు కాలం చెల్లిపోయిందేమో. ఆమేరకు ఆ పంక్తుల ప్రాసంగికత రద్దయింది. అలా జాబిల్లి చేసిన కొన్ని సంతకాలను కాలం చెరిపెయ్యడమూ ఉంటుంది, కొన్నిటిని చెరిగిపోకుండా కాలమే కాపాడడమూ ఉంటుంది.

ఇక ఆయన విలువలలో విశ్వాసాలలో కూడ కొన్నిటికి ప్రాసంగికత ఇంకా పెరిగింది, కొన్నిటికి తగ్గింది. ఆయన విలువలూ విశ్వాసాలలో ప్రధానభాగం రెండు ప్రపంచయుద్ధాల మధ్య ఆకటి దశాబ్దంలో రూపొందినవి. ఆతర్వాత 1960ల కోపోద్రిక్త యువతరపు కల్లోల దశాబ్దంలో పదునెక్కినవి. ఆ విలువలకూ విశ్వాసాలకూ నిజంగా ఇవాళ చాల అవసరం ఉంది. స్పానిష్ అంతర్యుద్ధం నాటి పరిస్థితులు, నాజీజం, ఫాసిజం విస్తరించిన నాటి పరిస్థితులు, ఆధిపత్య ధోరణుల దౌర్జన్యం ఇవాళ మరింత ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ విస్తరిస్తున్నప్పుడు శ్రీశ్రీని రూపొందించిన, శ్రీశ్రీ కలమూ గళమూ ఇచ్చిన ఆ విలువలు ఇవాళ చాల అవసరమయినవి. చరిత్ర పునరావృతమవుతున్న వేళ తప్పనిసరిగా ప్రాసంగికమైనవి. కాలం ఏడు దశాబ్దాలో నాలుగు దశాబ్దాలో ముందుకు నడిచింది గనుక ఆ విలువలూ విశ్వాసాలూ మరింత నైశిత్యాన్ని కోరుకుంటాయి, మరింత విస్తృతినీ లోతునూ కోరుకుంటాయి, కాని రద్దయిపోవు. ఆ మేరకు శ్రీశ్రీ విలువలలో విశ్వాసాలలో తొలగించవలసినవీ, సవరించవలసినవీ, అభివృద్ధి చేయవలసినవీ ఉంటాయి గాని శ్రీశ్రీని మొత్తంగా తోసివేయనక్కరలేదు.

ఇక ఆయన ఆచరణ 1928లో కవితాసమితి సభ్యుడిగా ప్రభవ ప్రచురించిననాటినుంచీ 1983లో విప్లవ రచయితల సంఘం సభ్యుడిగా మరణించేదాకా నిరంతరం ప్రజాజీవిత సంచలనాలలో, సాహిత్య ఉద్యమాలలో ఆయన వహించిన పాత్ర. సాహిత్య సంఘాలలో భాగస్వామ్యం, పౌరహక్కుల ఉద్యమ కృషి, ఉపన్యాసాలు వంటి అనేక కార్యాచరణలలో ఆయన జీవితం గడిచింది. మేధోశ్రమ చేసేవారు వీథుల్లోకి రానక్కరలేదనీ, ప్రవచిస్తే చాలుననీ, శారీరకశ్రమ చేసేవారు వేరనీ అప్పటిదాకా ఉన్న విభజనరేఖను ఆయన చెరిపివేశాడు. కనీసం చెరపడానికి దారివేశాడు. ఇవాళ్టికీ ఆ దారి అవసరం మరింత ఎక్కువగా ఉన్నది. కొత్త బ్రాహ్మణ్యం, కొత్త పాండిత్యం, కొత్త ఆభిజాత్యం రూపొందుతున్న వేళ కొత్త విభజనలు తలెత్తుతున్నవేళ శ్రీశ్రీ తన జీవితంలో చేసి చూపిన పనులు ప్రాసంగికంగానే ఉంటాయి. అదే సమయంలో ఒక సంస్కరణవాద ఆచరణలో భాగం పంచుకోవడం గాని, ఒక భారత చైనా మైత్రీ ప్రయత్నాలలో నాయకత్వంగాని, ఒక ఎమర్జెన్సీని ‘వామపక్ష నియంతృత్వమ’ని భ్రమపడడం గాని ఆయన ఆచరణలో ఇవాళ అంగీకరించడానికి వీలులేని, ప్రాసంగికత లేని అంశాలు.  ఆయన సామాజికాచరణలో కొద్దిగానూ, వ్యక్తిగత జీవితాచరణలో ఎక్కువగానూ ప్రతికూల అంశాలు ఉన్నాయి. అవి ఆమేరకు ఆయన ప్రాసంగికతను తగ్గిస్తాయి.

మహాప్రస్థాన కవిగా ప్రసిద్ధుడయినప్పటికీ, ఇవాళ్టికీ ఆయనను మహాప్రస్థానానికే పరిమితం చేయడానికి ఆయన అభిమానులే కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన సృజన శక్తి విస్తృతమైనది. కవిత్వం, కథ, నాటిక, సాహిత్య విమర్శ, వ్యాసం, ఉపన్యాసం, చమత్కారం, పదబంధప్రహేళిక, ఆత్మకథ,  అనువాదం, ప్రశ్నలు జవాబులు వంటి అనేక సృజనాత్మక వ్యక్తీకరణలలో ఆయన అనితరసాధ్యమైన ప్రయోగాలు చేశాడు. ఐదారువేల పేజీల సాహిత్యం సృష్టించాడు. కొత్త వస్తువు కోసం గాని, కొత్త రూపాల అన్వేషణ కోసం గాని, ప్రయోగం కోసం గాని, వైచిత్రి కోసం గాని, చమత్కారం కోసంగాని, హేతుబద్ధవాదన కోసం గాని ఆయన రచనలలో అత్యధికభాగం ఇవాళ్టికీ అటు పాఠ్యపుస్తకాలుగానూ, ఇటు స్ఫూర్తిదాయకమయిన, ఉత్తేజకరమయిన రచనలుగా నిలుస్తాయి. ఆమేరకు వాటి ప్రాసంగికత చెక్కుచెదరదు. శబ్దలౌల్యంతో చేసిన కొన్ని ప్రయోగాలు, ప్రాచీన సాహిత్య సంప్రదాయంలో శిక్షణవల్ల ఉపయోగించిన భాష, ఆ నాటికి ఇంకా స్ఫురణకు రాని అవగాహనలవల్ల వాడిన అభ్యంతరకరమయిన, అవమానకరమయిన ప్రయోగాలు కూడ ఆయన రచనలలో ఉన్నాయి. ఆ మేరకు అవి వాటి ప్రాసంగికతను రద్దుచేసుకుంటాయి.

అంతిమంగా శ్రీశ్రీ ఏమిటి అని నిర్ణయించేవి రాశి రీత్యా చూసినా, గుణం రీత్యా చూసినా ఆ అసంబద్ధమైన, ప్రాసంగికతను కోల్పోయిన భాగాలు కాదు. తప్పనిసరిగా ఆయనలో – జీవితంలో, విలువలలో, రచనలో – లోపాలు ఉన్నాయి. కాని అవే ఆయన సారాంశం కాదు. సారాంశంలో ఆయన తెలుగు సమాజానికీ సాహిత్యానికీ అందజేసిన కానుకల విలువ అపారమైనది. తెలుగు సమాజంలో ఇవాళ ఉన్న స్థితి మౌలికంగా మారనంతవరకూ శ్రీశ్రీకి ఆ విలువ ఉంటుంది. ఆ విలువ ఎంతో తెలుసుకునే ప్రయత్నమే, అంచనాకట్టే ప్రయత్నమే మనమింకా సమగ్రంగా చేయలేదు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu, Vaartha. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s