ఒకే సభ – రెండు జ్ఞాపకాలు

(రచన: ఏప్రిల్ 10, 2010, నవ్య వారపత్రిక)

రావులపాటి సీతారాంరావు గారి ‘ఉద్యోగ విజయాలు’ మొదటినుంచీ ఆసక్తిగా చదువుతున్న పాఠకులలో నేనొకరిని. ఉపాధ్యాయ వృత్తి నుంచి, రచయిత ప్రవృత్తి నుంచి, పోలీసుశాఖలో ఉన్నతోద్యోగానికి వెళ్లి, పదవీ విరమణ తర్వాత క్రియాశీల రాజకీయాలలోకి, మళ్లీ రచనలోకి ప్రవేశించి ఆయన రాస్తున్న అనుభవాలు – జ్ఞాపకాలు మన సామాజిక చరిత్రకు అవసరమయినవి. ఏప్రిల్ 14 సంచికలో నిజాం కాలేజి సభ గురించి ఆయన రాసినది చదివాక, ఆ ఘటనకే మరొక కోణపు జ్ఞాపకాలు కూడ పాఠకులతో పంచుకోవాలని అనిపించింది. ఆ రాత్రంతా నిజాం కాలేజి గ్రౌండ్ లో ఉద్విగ్నంగా గడిపిన వేలాది మందిలో నేనూ ఉన్నాను. ఆయన పూర్తిగా జ్ఞాపకం మీదనే రాశారో, ఏవైనా ఆధారాలు సంప్రదించారో తెలియదు గాని నేను నా జ్ఞాపకాలను అప్పటి పత్రికలతో సరిచూసుకుని రాస్తున్నాను.

చిత్రకళా శిక్షణలో భాగంగా గది మధ్యలో ఒక వస్తువు పెట్టి దాన్ని వేరువేరు వైపుల నుంచి చిత్రించడం నేర్పుతారు. పర్ స్పెక్టివ్ (దృక్కోణం) అనే ఆ శిక్షణవల్ల దర్శించే స్థలం మారినప్పుడు ఒకే వస్తువు భిన్నంగా కనబడుతుందనే తాత్విక అవగాహన కలుగుతుంది. ఒకే సభ గురించి సీతారామారావుగారికి గుర్తున్న కోణం, నాకు గుర్తున్న కోణం చూస్తుంటే ఈ దృక్కోణ వైవిధ్యం అర్థమవుతోంది.

ఆ సభ సీతారాంరావు గారు రాసినట్టుగా చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా గద్దె ఎక్కగానే జరిగినది కాదు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినది డిసెంబర్ 1989లో, ఆ సభ జరిగినది సెప్టెంబర్ 1990లో. అలాగే, ఆ సభ జరిగినది చెన్నారెడ్డి ప్రారంభించిన సడలింపు విధానంలో భాగంగా కాదు, ఆ సడలింపు రద్దయిపోతున్నందుకు నిరసనగా జరిగింది. ఆ మైదానంలో వేలాది మంది సభికులు తెల్లవారేదాకా ఉండడానికి విస్పష్టమైన కారణాలు ఉన్నాయి. సభను పోలీసులు ఆపలేకపోవడమో, ప్రభుత్వం పోలీసుల చేతులు కట్టివేయడమో, ప్రజలు సభ అయిపోయినతర్వాత సెక్రటేరియట్ మీదికి దాడికి పోవాలనుకోవడమో కాదు, ఆ రాత్రి సభకు వస్తున్నవారిమీద పోలీసుల నిర్బంధకాండ, అందుకు ప్రతిగా ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను ప్రజలు తమ అదుపులోకి తీసుకోవడం, సీనియర్ జర్నలిస్టులు, పౌరహక్కుల నాయకులు ముఖ్యమంత్రితోనూ, అధికారులతోనూ జరిపిన చర్చలు లాంటి ఘటనలెన్నో ఆ రాత్రి జరిగాయి.

తెలుగుదేశం పాలన 1985-89 మధ్యకాలంలో వందలాది మందిని బూటకపు ఎన్ కౌంటర్లలో చంపిన, వేలాది మందిపై టాడా కేసులు పెట్టిన నిర్బంధ విధానం అవలంబించింది. స్వయంగా ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు ‘ఆట-పాట-మాట బంద్’ అని అన్ని రకాల భావప్రకటన మీద ఆంక్షలు విధించి, ప్రజాస్వామ్యాన్ని రద్దుచేశారు. ఆ నిర్బంధాన్ని సడలిస్తామని, పౌరహక్కులను పునరుద్ధరిస్తామని  1989 నవంబర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది.

కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత మొదటిసారిగా జనవరి 1990లో విప్లవ రచయితల సంఘం ద్విదశాబ్ది సభల సందర్భంగా ఊరేగింపుకు, బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. ఫిబ్రవరి 18న గద్దర్ అజ్ఞాతవాసం నుంచి బయటికి వచ్చిన సందర్భంగా నిజాం కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. మే 5, 6 తేదీల్లో వరంగల్ లో రైతుకూలీ సంఘం మహాసభలకు, ఊరేగింపుకు, పద్నాలుగు లక్షల మంది హాజరయిన సభకు అనుమతి ఇచ్చారు. ఈ మధ్యలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందితో అనేక చిన్నాపెద్దా సభలు జరిగాయి.

విప్లవోద్యమానికి ఎంత విస్తృతమైన ప్రజా మద్దతు ఉన్నదో అలా బహిరంగంగా వ్యక్తమయిన తర్వాత చెన్నారెడ్డి ప్రభుత్వం సడలింపు విధానం మార్చుకుని, మళ్లీ నిర్బంధకాండ ప్రారంభించింది. ప్రభుత్వ విధానం వల్ల ఆరునెలలపాటు ఆగిపోయిన బూటకపు ఎన్ కౌంటర్లు మళ్లీ ప్రభుత్వ విధానం వల్లనే మొదలయ్యాయి. అలా మే 1990లో మొదలయిన ఎన్ కౌంటర్ హత్యలు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత, తిప్పాపూర్, మదన్ పల్లి, వెల్లుట్ల ఎన్ కౌంటర్ల తర్వాత, ఆ నిర్బంధ విధానాన్ని ఖండించడానికి ఏర్పాటయినది సీతారాంరావుగారు ప్రస్తావించిన నిజాం కాలేజి బహిరంగసభ. ఆ సభను ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం, రాడికల్ విద్యార్థి యువజన సంఘాలు ఏర్పాటు చేశాయి. అది సెప్టెంబర్ 10 న జరిగింది. సీతారాంరావు గారు రాసినట్టుగానే అప్పటి రైతుకూలీసంఘం అధ్యక్షుడు గంజి రామారావు ఆ సభకు అనుమతులు తీసుకున్నారు. ఆ సభలో కన్నబిరాన, బాలగోపాల్, గద్దర్, వరవరరావు తదితరులు పాల్గొన్నారు.

కాని ఒకవైపు అనుమతి ఇస్తూనే ఆ సభను భగ్నం చేయడానికి ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించారు. అన్ని జిల్లాలలో రహదారులను మూసివేశారు. ప్రజలను తీసుకొస్తున్న లారీలను, బస్సులను ఆపివేసి వేలాదిమందిని నిర్బంధంలోకి తీసుకుని వేధించారు. అలా అడ్డుకోవడాన్ని ప్రశ్నించిన ప్రజలపై స్టేషన్ ఘనపూర్ లో కాల్పులు జరిపారు.  చాలచోట్ల లాఠీచార్జి చేశారు. రైళ్లలో వస్తున్నవారిని కూడ దించి కొట్టారు. కొన్ని చోట్ల అలా ఆపినవారిని రాత్రి 8-9 మధ్య వదిలి వెనక్కి పంపడానికి ప్రయత్నిస్తే వాళ్లు హైదరాబాదుకే వచ్చి సభలో పాల్గొన్నారు. అలా రాత్రి 12-1 కి కూడ సభలోకి జనం వస్తూనే ఉన్నారు గనుక సభ కొనసాగింది.

ఈ లోగా, పోలీసులు నిర్బంధంలో ఉంచుకున్నవాళ్లను వదిలి, సభకు వెళ్లనివ్వాలని కోరుతూ ఒక తెలుగు దేశం శాసనసభ్యుడిని, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, నాలుగు జిల్లాలలో 14 మంది ప్రభుత్వాధికారులను ప్రజలు తమ అదుపులోకి తీసుకున్నారు. తమవాళ్లను వదిలితేనే ఈ బంధితులను వదిలిపెడతామన్నారు. ఈ వార్తలు నిజాం కాలేజి గ్రౌండుకు చేరి, వేదికమీదినుంచి ప్రకటనలు వెలువడి ఉద్విగ్నత మరింత పెరిగింది. అప్పుడు పొత్తూరి వెంకటేశ్వరరావుగారితో సహా సీనియర్ జర్నలిస్టులు, పౌరహక్కుల నాయకులు ముఖ్యమంత్రితోనూ, అధికారులతోనూ చర్చలు జరిపి రెండు వైపులా నిర్బంధంలో ఉన్నవారిని విడిపించినాకనే సభ ముగిసింది.

ఆ ఉద్విగ్నభరిత రాత్రితో నాకు ఒక వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. సభ రాత్రంతా జరిగింది గనుక బషీర్ బాగ్ చౌరస్తా మూలమీద అప్పుడుండిన ఎంబసీ కేఫ్ రాత్రంతా తెరిచే ఉండింది. అక్కడ రాత్రంతా చాయలు తాగుతూనే ఉన్నాం. అక్కడ అప్పుడు విశాలమైన ట్రాఫిక్ ఐలాండ్, అందులో ఒత్తుగా పచ్చిక ఉండేవి. సంక్షోభం ముగిసిన తర్వాత తెలతెలవారుతుండగా, ఎంబసీ కేఫ్ లో చాయ తాగి, ఐదారుగురు మిత్రులం ఆ పచ్చికలో కూచున్నాం. ఆ ముసిముసి వేకువన, ఆ మహానగరం మధ్య పచ్చికమీద, ఆ మిత్రులలో ఒకరు పాడిన ‘మనసున మల్లెల మాలలూగెనే’ పాట ఇరవై సంవత్సరాల తర్వాత కూడ నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

One Response to ఒకే సభ – రెండు జ్ఞాపకాలు

 1. రాజు says:

  వేణు గారూ,
  మీ వ్యాసం ఆసాంతం బాగుంది. కానీ చివరలో మిత్రులలో ఒకరు పాడిన మనసున మల్లెల మాలులూగెనే పాటతో ముగించారే.. మీమీద కొత్త ముద్రలేవీ పడలేదా. ఇప్పటికే తల బొప్పి కట్టి ఉంటుంది మీకు. తెల్లవార్లూ జరిగిన విప్లవ సభ ముగింపులో మీరు మనసున మల్లెల మాలలూగిన పాట ఎలా విన్నారండీ.. దీనికంటే మించిన విప్లవ ద్రోహం ఏదైనా ఉందా?

  ఏంటో అన్ని చోట్లా తప్పటడుగులే మీవి. జీవితమంతా విప్లవం, విప్లవం అంటూ పెనుకేకలు వేయవలసింది పోయి మీరు మనసున మల్లెల మాలలూగితే ఎలా? ఇంకా మీకు ఎక్కడో ఓ చోటనుంచీ తాఖీదులు రాలేదా? రాకపోతేనే ఆశ్చర్యం మరి.

  మీరు ఇరవయ్యేళ్లుగా ఆ పాట మనసులో వింటూనే ఉన్నారు. కాని గత 35 ఏళ్లకు పైగా ఆ పాట నన్ను వెంటాడుతూనే ఉంది మరి. మన రాజ్యమొస్తే దాన్ని కూడా నిషేధిద్దాం లెండి. అంతవరకు ఎవరేమన్నా ఆ పాటను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉందాం.

  అయినా మీరు మాజీ ఎస్పీ వ్యాసానికి కూడా ఇలా స్పందిస్తే ఎలాగండీ. వెలి వేయించుకోవడం అంటే అంత ఇష్టమా మీకు.. కొన్నాళ్లు ఇలాగే రాసుకుంటూ పోతే మీరు మనుషులుగా కూడా లెక్కలోకి రాకుండా పోతారేమో మరి. చూసుకోండి మరి.
  మీ మీద సానుభూతితో..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s