“రండి రండి, మా ప్రాణాలు కారుచౌక!!”

(ప్రజాతంత్ర  వారపత్రిక ఆఖరి పేజీ, జూన్  8, 2010)

దేశదేశాల  సంపన్నులకు,

అంతర్జాతీయ విష రసాయన ప్రయోగాల వ్యాపారులకు,

శాస్త్ర ప్రయోగాల బలిపశువుల వేటలో ఉన్న అణ్వాయుధ బేహారులకు,

బహుళజాతిసంస్థల  పేర ఊరేగుతున్న మృత్యు వాణిజ్య  లాభార్జనాపరులకు,

సహజవనరులకోసం  బకాసుర ఆకలితో ప్రపంచాన్నంతా చాపచుడుతున్న హిరణ్యాక్షులకు,

అమ్మకపు సరుకుల విపణివీథులకోసం దేశాలను  కబళిస్తున్న సామ్రాజ్య  దాహపు నరహంతకులకు,

ఇంకా  మాకు తెలిసిన, తెలియని అనేకానేక పరాన్నభుక్కులకు, రక్తపిపాసులకు –

‘భోపాల్ దురంతం’ అని గిట్టనివాళ్లు కారుకూతలు కూసే ఒకానొక రోడ్డు ప్రమాదం వంటి అతిచిన్న సంఘటనలో తీర్పు చెప్పి, మీకు ‘జీ హుజూర్ జో హుకుం’ అని ప్రకటించుకునే మహదవకాశం వచ్చిన న్యాయమూర్తి అనబడే భోపాల్ చీఫ్ జుడిషియల్ మాజిస్ట్రేట్ చేసుకుంటున్న విన్నపాలు.

ఈ విన్నపాలు  నా ఒక్కడివే కావు సుమండీ, ఇవి పలుకుతున్నప్పుడు నేను నా తరఫునా, మా ఘనత వహించిన ప్రాసిక్యూషన్ తరఫునా, మా అతి విధేయ నేర పరిశోధనా సంస్థ తరఫునా, మీ కొలువులో చాల కాలం పనిచేసి ఇప్పుడు మా ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహనుడి తరఫునా, మా ప్రభుత్వం తరఫునా, మా పార్లమెంటరీ రాజకీయ పక్షాలన్నిటి తరఫునా, మా ప్రధాన ప్రచార మాధ్యమాలన్నిటి తరఫునా, మీరు విదిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడే మా దేశంలోని మీ సేవకులందరి తరఫునా చెపుతున్నాను.

రండి, రండి. మా దేశానికే రండి. బిడ్డలను కోసి అతిథులకు వండిపెట్టిన సంప్రదాయం ఉన్న దేశం మాది. ఇంటిని పరాయివాడికి అప్పగించి అడవులుపట్టిపోయిన ఘనత ఉన్న సమాజం మాది. మమ్మల్ని మీరు ఎంతగానైనా దోచుకోవచ్చు. మాకేమీ అభ్యంతరం లేదు. మీ ప్రయోగాల కోసం మా జనాన్ని మీరు ఎట్లాగైనా వాడుకోవచ్చు. మా ప్రజల ప్రాణాలు కారుచౌక. మీ ఇష్టం వచ్చినంత మందిని చంపిపోవచ్చు. మీరు ఎంత మందిని చంపినా మా దేశంలో శిక్ష విధించే సంప్రదాయం లేదు. కాగితాల మీద మహాగంభీరంగా రాసుకున్న మా చట్టాలను మీరు తుంగలో తొక్కినా మేమేమీ అనుకోం. మా ప్రజల్లో వేల మందిని చంపినా, లక్షల మంది ఆరోగ్యాలు చెడగొట్టినా మీమీద మేమసలు కేసే పెట్టం. విచారణే జరపం. కేసు పెట్టినా, విచారణ జరిపినా మీ భారతీయ పాలేర్ల మీద మాత్రమే పెట్టి, వాళ్లకు కూడ కాసింత శిక్ష, మీ లాభాల సముద్రంలో కాకిరెట్టంత జరిమానా విధించి వదిలేస్తాం.

చెప్పాను  గదా, మా వాళ్ల ప్రాణాలకు  విలువలేదు. మేమేదో చిన్న చిన్న నేరాలకు శిక్షలు విధించాలని పట్టుబడతాంగాని మీ వంటి ప్రపంచ సంపన్నులను ప్రశ్నించగలమా? ఒకరినో ఇద్దరినో చంపితే చంపినవారిని ఉరితీయాలని ఇల్లెక్కి అరుస్తాం గాని మీ లాగ కళాత్మకంగా రాత్రికిరాత్రే వేలాది మందిని చంపిన వ్యాపార కుబేరులను వేలెత్తి చూపగలమా? వందరూపాయలు దొంగిలించినవాడ్ని కొట్టి చంపడానికి ఉర్రూతలూగుతాం గాని వందల కోట్ల రూపాయలు దొంగిలించే మీవంటి ఘరానా మనుషుల మీద చెయ్యి వేయగలమా?

నేను  విచారించి, “శిక్ష” విధించిన తాజా ఉదంతమే చూడండి. ఆ తీర్పులో ఈ దేశాన్ని మీ ఇష్టారాజ్యంగా ఏమి చేసుకున్నా ఫరవాలేదని నేను మరొకసారి నొక్కి వక్కాణించాను. కొందరు అమాయకులకోసం మీకు వ్యతిరేకంగా కూడ కొన్ని మాటలు రాశాను. మీ దేశాల్లో విష రసాయనాలు వదలగూడదని కఠినమైన నిబంధనలు ఉన్నాయి గనుక మా వంటి పేద దేశాలను వాడుకుంటున్నారని రాశాను గాని, విధించిన చిన్నపాటి శిక్షలను బట్టి నా మనసు మీ పక్షానే ఉందని మీకు తెలుసు గదూ. నా ఇబ్బంది అర్థం చేసుకుని క్షమించండి.

ఆ రోజు, ఇరవై ఆరు సంవత్సరాల కింద డిసెంబర్ 2-3 అర్ధరాత్రి భోపాల్ లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే మీ సంస్థకు చెందిన క్రిమిసంహారకాల కర్మాగారంలో ఒక  ట్యాంకు పేలిందట. దానిలో ఉన్న వాయువు బయటపడి అప్పటికప్పుడు ఎనిమిదివేలమందిని చంపేసిందట. ఐదులక్షల మందిని అనారోగ్యం పాలు చేసిందట. దాని ప్రభావం వల్ల ఏడాదికి వెయ్యి మంది చొప్పున ఇరవై ఐదు వేల మంది చనిపోయారట. అయితే ఏం? అవన్నీ అంత పట్టించుకోవలసిన సంగతులా? ఈ పేద దేశంలో ముప్పై వేల ప్రాణాలకు ఏం విలువ? రోజూ చచ్చేవాడికోసం ఏడ్చేదెవరు? ఈ దేశ అభివృద్ధి కోసం సాగుతున్న మహా యజ్ఞంలో ఆ మాత్రం బలిపశువులుండరా?

ఆ ట్యాంకులో దాచిపెట్టిన వాయువు ఏమిటో మీ కంపెనీ యాజమాన్యం చెప్పలేదట. మీ విమర్శకుల మాటలకు ఏమన్నా అర్థముందా? ఈ దేశం మీది, దాంట్లో విషవాయువులే దాస్తారో, పేల్చివేస్తారో, విషవాయువు వదిలితే పరిణామాలేమిటని ప్రయోగాలే చేస్తారో, ఏదయినా మీ ఇష్టం. కదా?! ఆ వాయువు పీల్చిన మనుషులకు చికిత్స చేయాలంటే ఆ వాయువు ఏమిటో తెలియాలట. ఎంత అర్థం లేని మాట? అసలు చికిత్స ఎందుకు చేయాలి? ప్రాణాలు పోతే పోనీ, అంతేగదా. అమెరికన్ డాలర్ల లాభాల కన్న ఎక్కువా? పైనుంచి కింది దాకా మావాళ్లకు అందే కమిషన్ల కన్న ఎక్కువా? అభివృద్ధి కన్న ఎక్కువా? మా ప్రభుత్వం ఎంత గొప్పది! ఆ వాయువు ఏమిటో కంపెనీ యాజమాన్యంతో చెప్పించడానికి మా ప్రభుత్వం ప్రయత్నించలేదని గిట్టనివాళ్లు గోల పెడుతున్నారు గాని ఈ అలగాజనం ప్రాణాలకు విలువ లేదని మా ఏలినవారి కన్న ఎవరికి ఎక్కువ తెలుసు?

ఆ విషవాయువును  అక్కడ దాచిపెట్టడంలో సహకరించినందుకు అధికారులమీద చర్యలు తీసుకోలేదని విమర్శకులు అంటున్నారు. వాళ్లు చట్టాలు పాటించలేదట. అసలా చట్టాలు రాసి పెట్టింది ప్రదర్శన కోసం గాని అమలు చేయడానికా? ఇంతకూ అలా చట్టాలను కూడ పక్కనపెట్టి పరాయి కంపెనీకి, డబ్బున్నవారికి సేవ చేసినందుకు, సర్వసత్తాక భారత ప్రభుత్వ ఇంగితాన్ని సక్రమంగా గుర్తించినందుకు ఆ అధికారులందరికీ బహుమతులు ప్రకటించాలని నా సూచన.

ఇంకా  ఘోరం విన్నారా, అలా వాయువు బయటపడినందుకు ఆ కంపెనీ మాతృసంస్థ అమెరికన్ కంపెనీ అధ్యక్షుడు వారెన్ ఆండర్సన్ ను అరెస్టు చేయలేదని మా ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. ఈ కొక్కిరాయిలకేం తెలుసుగాని, మా ప్రభుత్వం ఎంత సముచితంగా ప్రవర్తించింది! గౌరవనీయ అతిథి గారిని, వారెన్ ఆండర్సన్ దొరగారిని ఎంత సన్మానించింది! ఆయనకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికింది. అతిథిగృహంలో ఉంచి, రాచమర్యాదలు చేసి, ముఖ్యమంత్రి విమానంలో భోపాల్ నుంచి ఢిల్లీ పంపించి, అక్కడినుంచి అమెరికా వెళ్లిపోవడానికి అన్ని సదుపాయాలు చేసింది. ఆయన మీద ఈగ వాలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పాపం, అలా చెప్పవలసి వచ్చినందుకు కించ పడుతూనే, ఆయన ఆచూకీ దొరకడం లేదని పదహారేళ్లుగా న్యాయస్థానానికి చెపుతోంది. ఇక మా నేర పరిశోధక సంస్థ అయితే ఆయన పేరే లేకుండా అభియోగ పత్రం తయారు చేసింది.

అంతేగాక మా సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన న్యాయశాస్త్ర పరిజ్ఞానమంతా ఉపయోగించి, అభియోగపత్రంలో ఒక సెక్షన్ మార్చివేశారు. విచారణ జరిగి, శిక్ష విధించవలసివచ్చినా అది మామూలుగా పది ఏళ్లో, యావజ్జీవితమో కాగూడదని, రెండేళ్లకు మించగూడదని సవరణ తెచ్చారు. అదే కదా ఇప్పుడు నేను చిన్నపాటి శిక్షలు విధించడానికి ఆధారం. ఈలోగా, యూనియన్ కార్బైడ్ వంటి గౌరవనీయ సంస్థమీద ఎవరు పడితే వారు కేసులు వేసి వేధిస్తారేమో పాపం అని, మా ప్రభుత్వం తనకు మాత్రమే కేసులువేసే అధికారం ఉన్నదని చట్టం కూడ తీసుకువచ్చింది.

ఇన్ని చేసినా మీరింకా మమ్మల్ని అనుమానంతోనే చూస్తున్నారు. మీరింకా మా దగ్గరికి డాలర్ల మూటలతో రావడంలేదు. మా ఖనిజాలు తవ్వుకుపోవడం లేదు. మా సంపదలు దోచుకుపోవడం లేదు. మా ప్రజల్ని లొంగదీయకపోతే రామంటున్నారు. మిమ్మల్ని రప్పించాలంటే ఈ దేశాన్ని ఇంకా తెరిచి పెట్టాలని, మీ మీద ఏ ఆంక్షలు లేకుండా చూడాలని, వద్దన్నవాడినల్లా చావచంపి చెవులు మూయాలని మా దగ్గరి పెద్ద మనుషులూ, పెద్దింటి పత్రికల, టీవీ ఛానళ్ల మేధావులూ గగ్గోలు పెడుతూనే ఉన్నారు.

భోపాల్  కథంతా జరిగింది ఇరవై ఆరేళ్లకింద. ఆ తర్వాత మీ ఆదేశాల మేరకే ఈ దేశంలో నూతన ఆర్థిక విధానాలు తీసుకువచ్చాం. ‘ఈ దేశం మీదేనండి, మీ రాజ్యం మీరేలండి, మా ప్రజల బతుకులు బుగ్గి చేయండి’ అని దొరికిన వేదికలన్నిటి మీది నుంచీ మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాం. ఇరవై సంవత్సరాలుగా ఆహ్వానాలు పలుకుతున్నాం.

ఎప్పుడో అరవై ఏళ్లకింద మా ప్రజలు పొరపాటున అమాయకత్వంతో తెల్లతోలును వ్యతిరేకించినందుకు మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని వెళ్లగొట్టాలని ఉద్యమించిన మా పూర్వీకుల తప్పు కాయండి. అయినా మీరెంత అద్భుత ప్రజ్ఞావంతులు! ఆ వెర్రిబాగులవాళ్ల కోరికను మన్నించినట్టే నటించి మీ బంటులనే గద్దెమీద కూచోబెట్టి, మీ మాటలే చెల్లేటట్టు చేసి, మీ ఆస్తులు కాపాడుకుంటూ, మీ లాభాలు పెంచి పోషించుకుంటూ వెళ్లిపోయారు గదా. అయినా మధ్యలో చాల జరిగిపోయాయి. మా దేశాన్ని ఏదో మా ప్రజలే పాలించుకుంటున్నట్టు కొందరికి అనుమానాలు కలిగాయి. మీకు వ్యతిరేకంగా మేమేదో గూడుపుఠాణీ చేస్తున్నట్టు మీరు యాగీ చేయడం మొదలుపెట్టారు.

మేము  సంపూర్ణంగా మీ విధేయులమేనని, మీ ప్రయోజనాలు రక్షించడం కన్న మాకు మరొక ఆలోచనే లేదని మా ప్రభుత్వాధినేతలు మీకు ఎన్నిసార్లు విన్నవించుకోలేదు! ఎన్నిసార్లు ఆచరణలో చూపెట్టలేదు. భోపాల్ కేసు సంగతి పోనీయండి. మీరు చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టి మా రైతుల బతుకులు బుగ్గి చేయలేదా? మీరు మూసేయమన్న కంపెనీనల్లా మూసివేసి మా కార్మికుల ఉపాధి ఊడగొట్టలేదా? మీరు ప్రైవేటు వ్యక్తులకు, మీ తైనాతీలకు అప్పగించమని ఆదేశించిన కంపెనీనల్లా పువ్వుల్లో పెట్టి వారి చేతులకు అందించలేదా? మీరు ఈ నేలమీద ఎక్కడి ఖనిజం కావాలనుకుంటే అక్కడ ఆదివాసులను ఖాళీ చేయించి మీకు ధారాదత్తం చేయలేదా? మీరు అడిగితే దేశంలో ఎక్కడ భూమినైనా లక్షలాది ఎకరాలు మీకూ, మీరు చెప్పిన వారికీ ప్రత్యేక ఆర్థిక మండలాలని పేరు పెట్టి అప్పగించి అక్కడినుంచి మా చట్టాలను ఉపసంహరించలేదా? మీరు తీసేయమన్న చట్టాలను తీసేసి, మార్చమన్న చట్టాలను మార్చలేదా? అవన్నీ పోనీయండి, ఇవాళ్టికివాళ మా పార్లమెంటు ముందర ఉన్న బిల్లు చదవండి. మీరు ఇక్కడ అణుశక్తి కర్మాగారాలు పెట్టి ఎన్ని వేలమందిని చంపినా మీమీద అభియోగాలు మోపబోమని ఆ బిల్లులో స్పష్టంగా రాశాము గదా.

ఇక  మీ విమర్శకులంటారా? పార్లమెంటరీ పార్టీలన్నీ, ప్రధాన స్రవంతి ప్రచార మాధ్యమాలన్నీ ఊరికే తూతూ మంత్రానికి మీకు వ్యతిరేకంగా మాట్లాడతాయి గాని ఆ మాటలు పెదాల మీంచి వచ్చే గాలి మాటలేనని మీకూ తెలుసు, మాకూ తెలుసు. మనం భయపడవలసిందల్లా ప్రజలకు మాత్రమే గాని, వాళ్లను చీలదీయడంలో మేం విజయం సాధించాం. వారికి నాయకత్వం వహించేవాళ్లనూ దారి చూపేవాళ్లనూ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపుతున్నాం. ఇక మీరు నిర్భయంగా ఈ నేలమీదికి రావచ్చు.


Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

One Response to “రండి రండి, మా ప్రాణాలు కారుచౌక!!”

  1. Divya says:

    Good post :(

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s