కొండను చూపిన అద్దాన్ని గురించి…

ఇది తెలుగు సాహిత్య విమర్శలో ఒక అపురూపమైన పుస్తకం. విశ్వవిద్యాలయాల పద్ధతుల, పరిధుల, అంతరాల ఎడారిలో ఎప్పుడో ఒకసారి హఠాత్తుగా కనబడే ఒయాసిస్సు వంటి రచన ఇది. విభిన్న ఆలోచనలను సమన్వయించే విస్తారమైన అధ్యయనంతో, సునిశితమైన ఆలోచనతో, సమ్యగ్ దృక్పథపు పరిశీలనతో, పటిష్టమైన విశ్లేషణతో తయారయిన ప్రామాణికమైన సిద్ధాంత వ్యాసం ఇది. మన విశ్వవిద్యాలయాల తెలుగుశాఖల సాధారణ సిద్ధాంత వ్యాసాల సంప్రదాయానికి భిన్నమైన విలక్షణమైన రచన ఇది. విశ్వవిద్యాలయాలతో,  తెలుగు శాఖలతో, డిగ్రీలకోసం సాగుతున్న పరిశోధనతో అంతగా సంబంధంలేని నాకు ఈ రచనకు పరిచయం రాసే అర్హత ఉన్నదో లేదో తెలియదు. కాని మీకూ ఈ రచనకూ మధ్య నిలబడి నాలుగు మాటలు చెప్పే సాహసం చేయడానికి నాలుగు కారణాలున్నాయి.

ఒకటి, ఇది ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యంలో ఒక అరుదయిన, అద్భుతమైన, విలక్షణమయిన కాల్పనిక రచయిత గురించి అన్వేషించడానికి జరిగిన తొలి ప్రయత్నం, సఫలమైన ప్రయత్నం కావడం. రెండు, ఆ విశిష్ట రచయితతో కొంతకాలం సన్నిహతంగా ఉండే అవకాశం కలిగినందువల్ల ఆయన వ్యక్తిత్వం గురించీ, రచన గురించీ నాకు ఎంతో కొంత తెలుసునని అనుకోవడం. మూడు, తెలుగు సాహిత్య విమర్శలో లోపిస్తున్న విశాల అధ్యయనం, సైద్ధాంతిక పటుత్వం, సంయమనంతో కూడిన సమన్వయం, ఆకట్టుకునే వ్యక్తీకరణతో కూడిన వాదనాపటిమ ఈ రచనలో విరివిగా ఉన్నందువల్ల ఇటువంటి రచనను, అసలు ఇటువంటి విశ్లేషణా, పరిశీలనా సంప్రదాయాన్ని ఎత్తిపట్టవలసిన, నలుగురికీ పరిచయం చేయవలసిన అవసరం ఉందని అనుకోవడం. నాలుగు, ఇది ఇరవై సంవత్సరాలకు పైగా సన్నిహితురాలయిన నా చెల్లెలు నీరజ రాసిన సిద్ధాంతపత్రం కావడం.

మొట్టమొదట, కె ఎన్ వై పతంజలి మన సాహిత్యంలో అరుదయిన, విలక్షణమయిన కాల్పనిక రచయిత అనడం కేవలం ఆలంకారికమైన, సాంప్రదాయికంగా అలవాటయిన అభివర్ణన కాదు. అటువంటి మాటలు చాల మంది రచయితల విషయంలో వాడి వాడి అరిగిపోయి ఉన్నాయి గనుక ఈ మాటల అసలు అర్థాన్నీ, అవి వాడడంలో ఔచిత్యాన్నీ కూడ వివరించవలసి ఉంది. నిజంగా పతంజలి ఇరవయోశతాబ్ది చివరి దశాబ్దాలలో తెలుగు సాహిత్యంలో జరిగిన ఒక అద్భుతం. అన్వేషిస్తే ఆ అద్భుతానికి ఎన్నో కారణాలను కనిపెట్టవచ్చు. ప్రధానంగా భౌతిక వాతావరణపు కారణమూ ఉంది. వ్యక్తిగత ప్రతిభ కారణమూ ఉంది.

మొదట, పతంజలిని రచయితగా రూపొందించిన వాతావరణం, నేపథ్యం ప్రత్యేకమైనవి. ఆయన తన రచనా కృషిని 1970లలో ప్రారంభించారని, ఆ దశాబ్దంలో వలసానంతర భారత సమాజంలో రెండో తరం అనుభవించిన ప్రత్యేకమైన రాజకీయార్థిక వాతావరణం ఉండిందని గుర్తించడం అత్యవసరం. వలస వ్యతిరేక జాతీయోద్యమానికి ఏకైక ప్రతినిధిగా భ్రమలు కల్పించి, అప్పటివరకూ అవిచ్ఛిన్నంగా పాలిస్తూవచ్చిన రాజకీయపక్షం మీద ఆ దశకంలోనే ప్రజలలో అసంతృప్తి ప్రజ్వరిల్లింది. ఆ అసంతృప్తి విద్యార్థి ఆందోళనల నుంచి ఆదివాసి పోరాటాల దాకా, పార్లమెంటరీ ప్రతిపక్షాల సమీకరణాల నుంచి సాయుధ పోరాటాల దాకా అనేక రూపాలలో పెల్లుబికింది. తన పదవిని కాపాడుకోవడానికి, అప్పటికే ప్రజలనుంచి పెద్ద ఎత్తున వస్తున్న సవాళ్లనుంచి పాలకవర్గాలను కాపాడడానికి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో అత్యవసర పరిస్థితి విధించారు. అది దేశంలోని మధ్య తరగతి జీవితాన్ని కుదిపివేసి, రాజ్య బీభత్సం గురించి తొలిసారి పెద్ద ఎత్తున మధ్యతరగతికి తెలియజెప్పిన సందర్భం. పందొమ్మిది నెలల తర్వాత ఆ అత్యవసర పరిస్థితి ఎత్తివేసి ఎన్నికలు జరిపితే ఇందిరాగాంధీ, అత్యధిక కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. జనతాపార్టీ రూపంలో తొలిసారిగా కేంద్రప్రభుత్వంలో కాంగ్రెసేతర ఐక్య సంఘటన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎమర్జెన్సీలో జరిగిన అక్రమాల వార్తలు విస్తృతంగా బయటపడి, ముఖ్యంగా పార్లమెంటరీ ప్రతిపక్ష పార్టీల నాయకులు, మధ్యతరగతి ప్రజలు అనుభవించిన పోలీసు దౌర్జన్యం వార్తలు ప్రచారమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక చైతన్యం వెల్లువెత్తింది.

ఈ నేపథ్యంలో పతంజలి రచనల ప్రారంభాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సంక్షోభమయ, సంఘటనామయ దశాబ్దంలో 1975లో ఆయన తొలి కథల సంపుటి దిక్కుమాలిన కాలేజీ వెలువడింది. తొలి నవల ఖాకీవనం 1979లో రాశారు.

ఖాకీవనం నవల ఇతివృత్తానికి మూలం 1979లో ఉత్తరప్రదేశ్ లో జరిగిన పోలీసు సమ్మె. ఆ ప్రభుత్వ సాయుధ బలగాల అసంతృప్తి ప్రజ్వలనం వలసానంతర భారత చరిత్రలోనే అరుదైనదీ, మొదటిదీ. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా 1857లో, రాయల్ ఇండియన్ నేవీ 1946 తిరుగుబాటులో మాత్రమే కనబడిన సాయుధ బలగాల తిరుగుబాటు 1979లో ఉత్తరప్రదేశ్ లో మొదలయి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కనిపించింది. ప్రభుత్వం తరఫున ప్రజలమీద దౌర్జన్యం సాగిస్తున్న ఒక బలగం ఎదురుతిరిగి ప్రభుత్వాన్నే నిలదీయడం, స్తంభింపజేయడం నిజంగా ఒక అపురూపమైన ఘటన. అది ఎందుకు జరిగిందో, అందులో వ్యక్తిగతమైన కారణాలేమిటో, సామాజికమైన కారణాలేమిటో, ఆ రెండూ ఎలా కలగలిశాయో అన్వేషించడం సాధారణంగానే కాల్పనిక రచయితలకు గొప్ప ముడిసరుకు. ఆ ముడిసరుకును పతంజలి సంపూర్ణంగా వాడుకున్నారు.

ఇది తక్షణ నేపథ్యం కాగా, అసలు ఆయన పుట్టిపెరిగిన, చైతన్యవంతుడయిన వాతావరణానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. గురజాడ అప్పారావు ప్రారంభించి, పురిపండా అప్పలస్వామి, శ్రీశ్రీ, నారాయణబాబుల మీదుగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కాళీపట్నం రామారావు, సుబ్బారావు పాణిగ్రాహిల దాకా ప్రవహించిన ఉత్తరాంధ్ర ప్రగతిశీల సాహిత్యధార అది. ఆ సాహిత్య సంచలనాల వారసత్వం కూడ నిజానికి ఇంకాలోతయిన ఆదివాసి ప్రజా పోరాతాల సమాంతర ధారకు ప్రతిఫలనమే. రంప పితూరీ, ద్వారబంధాల చంద్రయ్య, అల్లూరి సీతారామరాజు, గున్నమ్మల నుంచి వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం ల దాకా సాగివచ్చిన పోరాటధార అధి. అటువంటి ఆదివాసి ఉద్యమం జరిగిన ప్రాంతపు అంచులలోని భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన నేపథ్యం, ఆదివాసి విప్లవోద్యమాన్ని సంపూర్ణంగా సమర్థించిన విప్లవ సాహిత్యోద్యమం పురుటి నొప్పులు అనుభవించిన విశాఖపట్నంలో గడిపిన తొలి యవ్వనం, ఉత్తరాంధ్ర ఉజ్వల సాహిత్య వారసత్వం పతంజలికి కోరకుండానే దొరికిన సంపన్నమైన వనరులు. ఇక విస్తృత అధ్యయనం వల్ల విభిన్న జీవనవిధానాలు, విశిష్ట రచనా శైలులు ఒకవైపు ఆకళించుకుంటూనే, తనచుట్టూ ఉత్తరాంధ్ర జీవితంలో సహజమైన వాక్చాతుర్యాన్నీ, చమత్కృతినీ ఆయన తన సృజనలో భాగం చేసుకున్నారు.

ఎంత ఉజ్వలమైన నేపథ్యం ఉన్నప్పటికీ, ఒక ఇతివృత్తం రసాయనిక పరివర్తనం చెంది కళారూపంగా వికసించాలంటే సృజనకర్తకు ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి. పతంజలిలో అది పుష్కలంగా ఉందని ఇవాళ మూడున్నర దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత సులభంగానే చెప్పవచ్చు. కాని ప్రారంభంలో ఆ నైపుణ్యం కోసం అన్వేషణ అసాధారణ వస్తువుల కోసం తపనగా, అటువంటి వస్తువులను ఎంచుకునే సాహసంగా మొదలయింది. అందరికీ కనబడే విషయాలలోనే దాగి ఉన్న కనబడని అంశాలకోసం అయన వెతికారు. ప్రతిదాన్నీ కొత్తగా చూశారు. కొత్తగా చూడడానికి ఆటంకాలుగా తాను భావించినవాటి మీద ఎంత గౌరవం ఉన్నా పక్కనపెట్టారు. అందుకే ఖాకీవనం ఆయన సృజనలో భాగమయింది. నిజానికి అప్పటికి ప్రగతిశీల సంప్రదాయంలో పోలీసుల పట్ల సానుభూతి లేదు. మాలోనివాడివే అని పోలీసులను ఉద్దేశించి రాసినందుకు, మాపల్లె నవలలో పోలీసుపాత్ర పట్ల సానుభూతి ప్రదర్శించినందుకు చెరబండరాజు విమర్శలను ఎదుర్కొని ఉన్నారు. అటువంటి సమయంలో పోలీసుల జీవితం ఇతివృత్తంగా నవల రాయడం, ప్రగతిశీల పాఠకుల ఆదరణను కూడ చూరగొనడం పతంజలికే చెల్లింది. అందుకు కారణం ఆయనలోని అసాధారణ దృష్టికోణమేననిపిస్తుంది. ఖాకీవనం నుంచి అసంపూర్ణ మహాకావ్యంగా మిగిలిన రాజులలోగిళ్లు దాకా ఆయనలో ముప్పై సంవత్సరాల పాటు నిరంతర ధారగా కొనసాగిన లక్షణం అదే.

అందుకే పతంజలి చాల మంది తెలుగు రచయితల కన్న విలక్షణమైన రచయితగా ఎదిగారు. ఎంచుకున్న ఇతివృత్తాలు కొత్తగా ఉండడమో, ఇతర రచయితలు ఎంచుకున్న ఇతివృత్తాల మీద పనిచేసినప్పుడు కూడ వాటిని కొత్తగా దర్శించడమో పతంజలిలో కనబడతాయి. పాత్రచిత్రణ, సన్నివేశాల కల్పన, సంభాషణలు, నుడికారం, మిరుమిట్లు గొలిపే కొత్త ఆలోచనలు – ఏది చూసినా పతంజలి రచనా విశిష్టత కనబడుతుంది. ఆరకంగా ఆయన తెలుగు రచయితలలో చాలమందికన్న విభిన్నమైన ఎత్తులో, అపారమైన లోతుతో తన ఇతివృత్తాలతో వ్యవహరించారు.

అందువల్ల పతంజలి రచనపై సాగే విమర్శ పాతపద్ధతిలో, అలవాటయిన పరికరాలతో ఉండడానికి వీలులేదు. అలా ఉంటే ఆయన విలక్షణతను పూర్తిగా అర్థం చేసుకోవడంగాని, చేయించడంగాని సాధ్యం కాదు. నీరజ సాగించిన పరిశోధన సాంప్రదాయిక పద్ధతి నుంచి బయటపడి పతంజలిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. చాలవరకు ఆ ప్రయత్నంలో సఫలమయింది కూడ. నిజానికి పతంజలి లాంటి బహుళార్థబోధక, విశాలమైన, శక్తిమంతమైన రచయితను ఒక్క ప్రయత్నంలో అర్థం చేసుకోగలమని అనుకోవడం కూడ అత్యాశే. కాని ఆ పని ఇంతవరకూ జరగని నేపథ్యంలో, నీరజ పూనుకుని కొంత వరకయినా విజయం సాధించింది గనుక ఈ పుస్తకాన్ని సాదరంగా ఆహ్వానించవలసి ఉంది.

“ఒక పాఠకుడిగా పఠనం వేరు, పరిశోధకుడిగా అధ్యయనం వేరు అనే సంగతి పతంజలి రచనలు చదువుతున్నప్పుడు అర్థమైంది. పతంజలి చాలా భిన్నమైన రచయిత. అందరిలాగే కథ, నవల రాసినట్టే ఉంటుంది కాని అది ఆయా ప్రక్రియా లక్షణాల పరిధులను అధిగమిస్తుంటుంది. పతంజలి రచనలో కథ ఒక సాకు మాత్రమే. తాను చెప్పదలచుకున్న విషయానికి అది పైకి కనిపించే ఒక ఉపరితల పార్శ్వం మాత్రమే. కథలోపల మరెన్నో అంతరార్థ కథనాలు వినిపిస్తాయి. కథా వాచకాన్ని చదువుతున్నకొద్దీ మరిన్ని కొత్త స్వభావాలు, ధర్మాలు, వాస్తవికతలు ప్రత్యక్షమవుతాయి. పతంజలి తన రచనను బహుళార్థ ప్రయోజనాల సాధనంగా తీర్చిదిద్దారు” అని నీరజ చేసిన వ్యాఖ్య చాల లోతయినదీ, సరయినదీ, తెలుగు సాహిత్య అధ్యయనంలో చాల అరుదుగా కనిపించేదీ. (ఎంతో గంభీరమైన, ఆలోచనాత్మకమైన ఈ వ్యాఖ్య చేసిన నీరజ కూడ పాఠకు “డు”, పరిశోధకు “డు” అని వాడడం మన ఆలోచనల మీద, వ్యక్తీకరణలమీద సాంప్రదాయిక ప్రభావానికి గుర్తు. నిజానికి ఇంగ్లిషులో కొందరు రచయితలు ఈ సాధారణ నామవాచకాలను పురుష సూచకాలుగా కాక, స్త్రీ సూచకాలుగా కూడ వాడడం మొదలుపెట్టారు. మనం కనీసం అటుకొసకు వెళ్లకపోయినా, బహువచనం చేసి, స్త్రీపురుష భేదాన్ని తొలగించడం మంచిదనుకుంటాను.)

ఒక సృజనకర్తతో ప్రత్యక్ష పరిచయం ఉన్న లేకపోయినా ఆ సృజన మన అనుభూతులనూ ఆలోచనలనూ ప్రేరేపించగలగడమే ఆ సృజనకర్త శక్తికి గీటురాయి. పతంజలి అటువంటి ప్రతిభావంతమైన రచయిత. కాని ఆయనతో పరిచయం వల్ల, ఆయన మాటతీరు గురించీ, ఆయన చూసే దృష్టి గురించీ తెలిసిఉంటే, ఆయన గురించి చెప్పుకోవలసిన విషయాలూ, వాటివల్ల ఆయన రచనలు ఇంకా ఎక్కువగా అర్థం కావడమూ కూడ జరుగుతాయి. ఆయనతో నా పరిచయం గురించీ, ఆయన రచనల గురించీ గతంలోనే రాసి ఉన్నాను గాని, పునరుక్తి దోషం ఉన్నా వాటిలో కొన్ని ఇక్కడ మళ్లీ చెప్పవచ్చు:

“వ్యక్తిగానూ ఆలోచనాపరుడిగానూ రచయితగానూ పతంజలి విస్తృతీ లోతూ సాధారణమైనవి కావు. కథ, నవల, వ్యాసం, వ్యంగ్య రచన, సంపాదకీయం వంటి అనేక ప్రక్రియలలో ముప్పై సంవత్సరాలకు పైగా అనన్య సాధ్యమైన కృషి చేసి ఆయన వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. పత్రికారచయితగా, వైద్యుడిగా, స్నేహశీలిగా వేలాదిమందికి వ్యక్తిగతంగా సన్నిహితంగా మెలిగారు. ఈ వేలాదిమంది అభిమానులలో ప్రతిఒక్కరికీ తనకే ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తెలిసిన పతంజలి ఉన్నారు. ప్రతిఒక్కరూ తమకు తెలిసిన పతంజలే అసలు పతంజలి అని అనుకుంటున్నారు, అంటున్నారు. ఇతర పతంజలుల గురించి వారికి తెలియకపోవచ్చు కూడ. కనుక ఏ ఒక్కరూ అబద్ధమూ కాదు. అట్లని ఏ ఒక్కరూ నిజం కూడ కాదు.

పతంజలి రచనలోనూ, జీవితంలోనూ అపారమైన లోతు, సువిశాలమైన విస్తృతి ఉన్నందువల్ల ఆయన అక్షరాల అంతస్సారాన్నిగాని, జీవిత దృక్పథాన్ని గాని తెలిసిన వర్గీకరణలలోకి విభజించి ఏకైక అస్తిత్వాన్ని ఆపాదించడం కుదరదు. రచనా వస్తువువల్ల, శైలి వల్ల, అసాధారణమైన జీవితానుభవంతో, అధ్యయనంతో ఆయన రచనలోకి ప్రవహించిన ఎన్నెన్నో పొరల, స్థాయిల, కోణాల, రంగాల జీవిత విశ్లేషణల రసాయనిక మేళవింపు వల్ల ఆయన రచన చెప్పదలచినదేమిటో ఒకే పఠనంలో సంపూర్ణంగా అవగాహనకు వస్తుందని చెప్పడానికి వీలు లేదు. చదివినప్పుడల్లా, చదివే సందర్భం మారినప్పుడల్లా ఒక కొత్త కోణం కనబడే రచనలు ఆయనవి.

లోతూ విస్తృతీ అంతు తెలియని పతంజలి సాహిత్య వ్యక్తిత్వం లాగే ఆయన జీవితం, వ్యక్తిత్వం కూడ మనకు తెలిసిన సాధారణ సరళరేఖ సూత్రాలలోకి, నలుపు తెలుపులలోకి కుదించగలిగినవి కావు. ఆయన ఏకకాలంలో తనను తాను ప్రగతిశీల వాదిగానూ గుర్తించుకున్నారు, హస్తసాముద్రికాన్నీ నమ్మారు. అత్యద్భుతమైన రచనలు చేసి వేలాదిమందిలో ప్రకంపనాలు సృష్టిస్తూనే, అసలు రచనకు సామాజిక ప్రయోజనం ఉంటుందా అనీ సందేహించారు. తన రచనలను లోకం ఎలా స్వీకరిస్తుందో చూస్తూనే ‘నేను నాకోసం మాత్రమే రాసుకుంటున్నాను’ అన్నారు. ‘నాకు ప్రజలంటే ఇష్టం’ అంటూనే ‘కాని నిస్సిగ్గయిన ఊరేగింపులంటే అసహ్యం’ అన్నారు. రాజుగా బతుకుతూనే రాజుల బూజును కడిగేశారు. జర్నలిస్టుగా ఉంటూనే జర్నలిస్టులు పెంపుడుజంతువులుగా మారిన తీరును దుయ్యబట్టారు. బహుశా మన సమాజంలో విరుద్ధాంశాల మధ్య ఐక్యత – ఘర్షణ ఎలా ఉంటాయో ఆయన జీవించీ రచించీ చూపారు. అది మామూలు దృష్టికి వైచిత్రిలాగ కనబడుతుంది. కాని అది మన సమాజంలో విభిన్న అస్తిత్వాలను ఏకకాలంలో జీవించవలసివచ్చిన ఒక బహుముఖ ప్రజ్ఞావంతుడి బహుళ అస్తిత్వ ఏకత” అని నేను మూడు దశాబ్దాల పరిచయంతో, సాన్నిహిత్యంతో ఆయన గురించి చేసిన విశ్లేషణను, ఈ సిద్ధాంత వ్యాసంలో నీరజ సోపపత్తికంగా, తార్కికంగా, ఆమోదయోగ్యంగా వివరించడం నావరకు నాకు చాల సంతోషం కలిగించింది. ఈ సిద్ధాంత వ్యాసం చదివిన పాఠకులకు పతంజలిని, పతంజలి రచనలను ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుందనడంలో సందేహం లేదు.

ఇక తెలుగు సాహిత్య విమర్శ స్థితి గురించి – దుస్థితి గురించి – ఈ రోజుల్లో మాట్లాడని వాళ్లు లేరు. కాని ఈ స్థితిని మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలు కూడ పెద్దగా ఉన్నట్టు లేవు. సాహిత్య విమర్శ సక్రమంగా ఉండాలంటే విస్తృతమైన అధ్యయనం కావాలి. ఆ అధ్యయనం కూడ సృజనాత్మక రచయిత పట్ల ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో కాక, వస్తుగత దృష్టితో జరగాలి. తులనాత్మక పరిశీలన కావాలి. సాహిత్య సంప్రదాయాలతో మాత్రమే కాక సామాజిక శాస్త్రాలతో తగినంత పరిచయం ఉండాలి. సాంప్రదాయిక, ఆధునిక సాహిత్య విమర్శా పరికరాలతో, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వెలువడుతున్న సాహిత్య విమర్శాధోరణులతో పరిచయం ఉండాలి. సాహిత్య విమర్శ అనేది ఏదో దంతప్రాకారంలోని, తమలాంటివారికే అర్థమయ్యే రచనాశైలి కాదనీ, అది సాధారణ పాఠకులలో కూడ సాహిత్యానుభవాన్ని ఇనుమడింపజేసే సాధనమనీ ఎరుక ఉండాలి. ఇవాళ్టి సాహిత్య విమర్శలో సాధారణంగా లోపిస్తున్న లక్షణాలివి. నీరజ సిద్ధాంత వ్యాసం ఈ అవసరమైన లక్షణాలన్నిటినీ సంపూర్ణంగా కలిగిఉన్నదని చెప్పలేకపోయినా, అవి సాధించే దిశలో ఉన్నదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. విషాదహాస్యం, అధికల్పన, అద్భుతవాస్తవికత, సమాంతర వాస్తవికత, స్థానీయత వంటి భావనలను వివరించేటప్పుడు, పతంజలి రచనలను అర్థం చేసుకునే, చేయించే తాళపుచేతులు వెతుకుతున్నపుడు నీరజ తెలుగు సాహిత్య విమర్శకే కొత్త చేర్పులు చేసింది. కొత్త కానుకలు అందించింది. అందువల్ల తెలుగు సాహిత్య విమర్శలో ప్రవేశించదలచుకున్నవాళ్లు తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఇది. ఇప్పటికే సాహిత్య విమర్శలో ఎంతో కొంత సాధించామని అనుకుంటున్నవాళ్లు పునశ్చరణ, పునర్నవీకరణ కోసం ఈ పుస్తకం చదవాలి.

ఇక చివరిగా, ఈ పుస్తకాన్ని నా చెల్లిలి రచనగా మీకు సిఫారసు చేస్తున్నాను. 1990 చివరలో నేను బెజవాడ ‘ఆంధ్రపత్రిక’ వదిలి హైదరాబాదు ‘సమయం’లో చేరినప్పుడు, నా సహోద్యోగి, ఆ తర్వాత నా సహచరి వనజ ద్వారా పరిచయమయిన నీరజ – రఘు మా కుటుంబ సభ్యుల కింద లెక్క. ఎం ఎ తెలుగు విద్యార్థులుగా పరిచయమయిన ఆ ఇద్దరూ అది కేవలం డిగ్రీ కోసమో, ఉద్యోగం కోసమో చదివిన చదువుగా కాక, నిజమైన ఆసక్తితో, అన్వేషణతో, సృజన శక్తితో తెలుగు సాహిత్య సీమలోకి ప్రవేశించి చెప్పుకోదగిన విజయాలు సాధించారు. ఆ విజయాలలో ఒకటి ఇలా మీ చేతులలో ఉంది. ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.

రచన: ఏప్రిల్ 2, 2010

ప్రచురణ: కె ఎన్ వై పతంజలి రచనలపై జవ్వాజి నీరజ పి ఎచ్ డి సిద్ధాంతపత్రం

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Book Reviews, Reviews. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s