ప్రత్యేక దోపిడీ మండలాలకు ఐదేళ్లు

భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం అమలులోకి వచ్చి ఈ మే 11 కి సరిగ్గా ఐదు సంవత్సరాలు నిండుతాయి. అంతకు చాల ముందు నుంచే వేరు వేరు రూపాలలో, పేర్లతో ఇటువంటి ప్రత్యేక వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, పన్ను-రహిత, ఎగుమతి-ప్రధాన మండలాలు కొనసాగుతున్నప్పటికీ, 2005 నుంచి అమలులోకి వచ్చిన, స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ ఇ జెడ్) అని ప్రఖ్యాతమయిన ఈ పరిణామం గురించి కాస్త ప్రత్యేకంగా, వివరంగా చెప్పుకోవలసి ఉంది. ఎస్ ఇ జెడ్ అంటే స్పెషల్ ఎర్రోనియస్ జోన్ (ప్రత్యేక తప్పుడు మండలం) అనీ, స్పెషల్ ఎక్స్ ప్లాయిటేషన్ జోన్ (ప్రత్యేక దోపిడీ మండలం) అనీ, ప్రత్యేక మృత్యు మండలం అనీ చాల విమర్శలు వచ్చాయి. దేశంలో ఎంత దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక పాలన సాగుతున్నదో, అన్ని రాజకీయ పక్షాలూ ఈ తిలాపాపంలో తలాపిడికెడు భాగస్వామ్యం ఎలా పంచుకుంటున్నాయో అర్థం చేసుకోవడానికి సెజ్ చట్టం గాని, గత ఐదు సంవత్సరాలుగా సెజ్ అమలయినతీరు గాని స్పష్టమైన నిదర్శనాలు.

నిజానికి పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సెజ్ తోనే ప్రారంభం కాలేదు. రెండో ప్రపంచయుద్ధానంతరం అప్పటివరకూ వలసలుగా ఉండిన దేశాలు స్వాతంత్ర్యం సంపాదించుకున్నప్పుడు అభివృద్ధి సాధించడానికి చేసిన ప్రయత్నాలలో ఈ ఆలోచన కూడ ఒకటి. అప్పటికి ఒకవైపు సోషలిస్టు ఆర్థికాభివృద్ధి నమూనా ఉన్నప్పటికీ, దేశాభివృద్ధి అంటే పెట్టుబడిదారీ దేశాలలో సాగినలాంటి అభివృద్ధేనని, భారీ పరిశ్రమలు పెట్టాలనీ, దానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానం కావాలనీ, అది సాధించడానికి విదేశీమారకద్రవ్యం అవసరమనీ, అది సంపాదించడానికి ఎగుమతి ప్రధాన పరిశ్రమలు నెలకొల్పాలనీ, అవి నెలకొల్పేవారికి సదుపాయాలు కల్పించక తప్పదనీ – ఇదంతా చాల అవసరమయిన, సంబద్ధమయిన తర్కంలా కనిపించింది. తమ దేశాల్లో పారిశ్రామిక, వ్యాపారాభివృద్ధిని ఇతోధికంగా సాధించడానికి పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ప్రత్యేక సదుపాయాలు, రాయితీలు, పన్ను మినహాయింపులు కల్పించాలని, ప్రజాధనం వెచ్చించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని పాలకులు ఆలోచించడం మొదలు పెట్టారు. అప్పటికి ఇలా కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల్లో పారిశ్రామికాభివృద్ధికి అవసరమయిన పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, విదేశీమారకద్రవ్యం తగినంతగా లేవు గనుక అవి ఎక్కడినుంచి వచ్చినా ప్రోత్సహించవలసిందేనని, ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించవలసిందేనని నమ్మబలికారు.

అలా ప్రధానంగా విదేశీమారకద్రవ్యం సంపాదించడం కొరకు ఎగుమతి ప్రధాన పరిశ్రమలను నెలకొల్పేవారికి ప్రత్యేక రాయితీలు కల్పించడం చాల దేశాలలో 1960లలో విరివిగా సాగింది. మన దేశంలో ప్రణాళికాబద్ధ ఆర్థికాభివృద్ధి వ్యూహం, పంచవర్ష ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, సోవియట్ యూనియన్ ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఎగుమతి ప్రధాన అభివృద్ధి వ్యూహం కూడ బలపడింది. ఆ నేపథ్యం లోనే 1965లో గుజరాత్ లోని కాండ్లాలో మొదటి ఎగుమతి ప్రధాన మండలం (ఎక్స్ పోర్ట్ ప్రాసెసింగ్ జోన్) ఏర్పడింది. క్రమక్రమంగా దేశంలో దాదాపు పది ఇపిజెడ్ లు ఏర్పడ్డాయి. అయితే ఇవి ఆ పేరు మీద రాయితీలు, సదుపాయాలు సంపాదించడానికే గాని నిజంగా ఎగుమతులలో, ఎగుమతి ఆదాయాలలో గణనీయమైన స్థానాన్నేమీ సాధించలేదు.

ఇది ఇలా సాగుతుండగానే 1970ల చివర, చైనాలో మావో మరణానంతరం వచ్చిన ఆర్థిక సంస్కరణలలో భాగంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పరచారు. షెన్ జెన్ ప్రాంతంలో వేలాది ఎకరాలలో ఏర్పడిన ఆ ప్రత్యేక ఆర్థిక మండలం ప్రపంచవ్యాప్తంగా బహుళజాతిసంస్థలన్నిటికీ ఆదర్శంగా నిలిచింది. ఆ ఎస్ ఇ జెడ్ ను పరిశీలించిన వారి కథనాల ప్రకారం అక్కడ ముళ్లకంచె లోపలి ఎస్ ఇ జెడ్ కూ, బయటి చైనాకూ ఏమీ సంబంధం లేదు. అది కార్మికుల పాలిట ఒక నిర్బంధ శిబిరం. అక్కడ జరుగుతున్నట్టుగా కార్మికులను పిండి, పీల్చి పిప్పి చేసి, ఎటువంటి హక్కులూ, కార్మిక సంక్షేమ నిబంధనలూ లేకుండా చేస్తే, శ్రామిక శక్తి చౌకగా దొరుకుతుందనీ, తద్వారా సరుకులు కారుచౌకగా తయారుచేయవచ్చుననీ, ఎంత తక్కువకు అమ్మినా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు చేసుకోవచ్చుననీ బహుళజాతిసంస్థలు కలలు కనడం మొదలుపెట్టాయి.

ఆ షెన్ జెన్ వృత్తాంతం మనకు వివరంగా అవసరం లేదు గాని, 2000 మార్చ్ లో అప్పటి ఎన్ డి ఎ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా ఉన్న మురసోలి మారన్ ఆ ప్రత్యేక ఆర్థిక మండలాన్ని చూసి తెగ ముచ్చట పడ్డారు. ఆయన చైనా పర్యటన నుంచి తిరిగి రాగానే, ఏప్రిల్ లో, భారతదేశానికి కూడ ఏకైక విముక్తి మార్గం సెజ్ ల రూపకల్పనే అని పారవశ్యంతో పలవరించారు. అలా భారతదేశంలో మొదటి సెజ్ విధాన రూపకల్పన జరిగింది. అప్పుడు ఎన్ డి ఎ లోని భాగస్వామ్య పక్షాలన్నీ ఆ విధానాన్ని స్వాగతించగా, అప్పటి ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఢిల్లీలో వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రం ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఉవ్విళ్లూరాయి. ఎన్ డి ఎ లో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈ విధానాన్ని అమలు చేయడానికి పూనుకోగా, ఎన్ డి ఎ ను విమర్శించిన సిపిఐ (ఎం) నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో సెజ్ విధానాన్ని అమలుచేసే ప్రభుత్వ ఉత్తర్వులను తీసుకు వచ్చింది.

సెజ్ విధానాన్ని అతి తీవ్రంగా విమర్శించిన ప్రతిపక్షాలు ఎన్నికలలో గెలిచి 2004 మేలో యుపిఎ కూటమిగా అధికారంలోకి రాగానే వెంటనే అదే సెజ్ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అంతకు ముందు ఆ విధానాన్ని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ యుపిఎ కూటమికి నాయకత్వం వహిస్తుండగా, వామపక్షాలు దానికి మద్దతు ఇస్తూవచ్చాయి. యుపిఎ ప్రభుత్వ మంత్రివర్గం సెజ్ బిల్లును తయారుచేసి, చర్చకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడ ఏర్పాటు చేసి, చివరికి 2005 మే 10న లోకసభలోనూ, మే 11 న రాజ్యసభలోనూ ఆమోదింపజేసుకుంది. అలా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆక్ట్, 2005 తయారయింది. ఏ చట్టమయినా నిబంధనలు తయారయిన తర్వాతనే అమలు ప్రక్రియ మొదలవుతుందిగాని, ఈ చట్టం విషయంలో మాత్రం 2006 ఫిబ్రవరిలో నిబంధనలు తయారయినప్పటికీ, సెజ్ లకు భూమి కేటాయించడం 2005 మే లోనే మొదలయింది.

ఇక్కడ తెలుసుకోవలసిన విషయం మరొకటి ఉంది. నిజంగా అత్యంత వినాశకరమైన, దేశ ప్రయోజనాలకు భంగకరమైన ఈ చట్టం పార్లమెంటులో ప్రజాప్రతినిధుల ఆమోదం ఎంత సులభంగా పొందిందో చూస్తే ఈ దేశ చట్టసభలు నిజంగా ప్రజాప్రతినిధుల సభలేనా అని అనుమానం కలుగుతుంది. ఈ చట్టం ముసాయిదా – బిల్లు – పైన ఎటువంటి లోతయిన చర్చ జరగలేదు. అసలు ప్రభుత్వం దాన్ని ప్రవేశపెట్టడమే బడ్జెట్ సమావేశాలు మరొక రెండురోజులకు ముగిసిపోతాయనగా ప్రవేశపెట్టి చర్చ జరగడానికి వీలు లేకుండా చూసుకుంది. అప్పటికయినా చర్చించగలవాళ్లు చర్చించనే లేదు. వామపక్షాల నుంచి లోకసభలో ఇద్దరు సభ్యులు (గురుదాస్ దాస్ గుప్తా, రూప్ చంద్ పాల్), రాజ్యసభలో ఒక సభ్యులు (నీలోత్పల్ బసు) మాత్రమే ప్రశ్నలు వేశారు. ఆ ముగ్గురూ కూడ ప్రస్తుతం సెజ్ లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటున్న సిపిఐ, సిపిఐ(ఎం) సభ్యులే. కాని వాళ్లు అడిగిన ప్రశ్నలు బిల్లును మౌలికంగా వ్యతిరేకిస్తూ కాదు, బిల్లులోని ప్రజావ్యతిరేక అంశాలను ఎత్తిచూపెడుతూ కాదు. ముగ్గురికి ముగ్గురూ కూడ బిల్లు రచనలోని సాంకేతిక అంశాలపైన, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వకపోవడం పైన, స్పష్టంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ సెజ్ లు ఏర్పాటు చేసే అధికారం ఇవ్వకపోవడం పైన మాత్రమే ప్రశ్నలు వేశారు. మొత్తానికి బిల్లు చట్టమైపోయింది.

చట్టపరంగానే ఈ సెజ్ ల చట్టంలో ఎన్నో లోపాలు, ప్రజావ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని చెప్పుకోవాలంటే:

ఈ చట్టం సెజ్ ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చే పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ప్రభుత్వమే భూమి చూపించాలని, సేకరించి ఇవ్వాలని, అలా ఇచ్చిన భూమిలో 35 శాతం భాగాన్ని మాత్రమే వారు ఉద్దేశిత, ప్రకటిత  లక్ష్యానికి వాడుకోవచ్చుననీ, మిగిలిన 65 శాతం భూమిని వారు ఏమి చేసుకుంటారో ప్రభుత్వానికి అక్కరలేదని చెపుతుంది. (ఈ 35 శాతాన్ని 50 శాతంగా తర్వాత సవరించారు. ఈ సవరణతోనే దేశప్రయోజనాలను తాము గొప్పగా కాపాడగలిగామని వామపక్షాలు చెప్పుకుంటున్నాయి).

ఈ చట్టం సెజ్ గా ప్రకటించిన ప్రాంతాన్ని “విదేశీ భూభాగంతో సమానమైనది”గా పరిగణిస్తుంది. భారత ప్రభుత్వ చట్టాలలోని 21 చట్టాలు ఈ ప్రాంతంలోపల చెల్లవని సెజ్ చట్టం చెప్పింది. సెజ్ లోపల అధికారం ప్రత్యేకంగా ఏర్పడే సెజ్ అథారిటీదే తప్ప భారత రాజ్యాంగానిది, భారత చట్ట వ్యవస్థది కాదు. ఆ సెజ్ అథారిటీ రూపకల్పన అత్యంత అప్రజాస్వామికంగా, కేవలం పారిశ్రామిక, వ్యాపార సంస్థల ప్రయోజనాలు మాత్రమే కాపాడేలా జరుగుతుంది. అంటే ఒక్క ఈస్టిండియా కంపెనీని వెళ్లగొట్టడానికి రెండు శతాబ్దాల పాటు పోరాటం జరిపిన భారత ప్రజానీకం తమదనుకున్న ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఆ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వందలాది ఈస్టిండియా కంపెనీల పాలనాప్రాంతాల్ని నెలకొల్పిందన్నమాట.

అలాగే సెజ్ చట్ట నిబంధనల ప్రకారమే సెజ్ ప్రకటిత లక్ష్యాలకు తూట్లు పొడవవచ్చు. అది ఎలాగంటే, సెజ్ లను ఏర్పాటు చేసిందేమో ఎగుమతుల కోసమే ప్రత్యేకంగా సరుకులను తయారు చేసి వాటి ద్వారా విదేశీమారకద్రవ్యాన్ని సంపాదించడానికి. కాని సెజ్ చట్టం “ఎగుమతి” అనే మాటకు సెజ్ లోని ఒక యూనిట్ నుంచి మరొక యూనిట్ కు, ప్రాసెసింగ్ ఏరియా నుంచి నాన్ ప్రాసెసింగ్ ఏరియాకు జరిగే లావాదేవీలన్నీ ఎగుమతులే అని నిర్వచించింది. అంటే సెజ్ లోపలి నుంచి గేటు బయటికి వచ్చే సరుకులు, గేటు లోపలే ఒక యూనిట్ నుంచి మరొక యూనిట్ కు వెళ్లే సరుకులు అన్నీ ఎగుమతులే అవుతాయి గనుక సెజ్ లోని యూనిట్లు చట్టాన్ని పాటించినట్టూ ఉండవచ్చు. ఒక్కపైసా కూడ విదేశీ మారకద్రవ్యం ఆర్జించకుండానూ ఉండవచ్చు.

వ్రతం చెడ్డా ఫలం దక్కనట్టు, ఇంత చేసి ఇది దేశ ఖజానాకు ఏమన్నా మేలు చేస్తుందా అంటే అది కూడ లేదు. సెజ్ చట్టమే సెజ్ లకు అనేక పన్ను మినహాయింపులు, రాయితీలు, పన్ను హాలిడేలు ప్రకటించింది. 2005లోనే అప్పటి వాణిజ్య మంత్రి కమల్ నాథ్ కు, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంకు మధ్య ఈ విషయంలో చాల వివాదం చెలరేగింది. దేశ ఖజానాకు రావలసిన పన్నుల ఆదాయం సాలీనా దాదాపు లక్ష కోట్ల రూపాయలు సెజ్ ల వల్ల రాకుండా పోతుందని అప్పటి ఆర్థిక మంత్రిత్వశాఖ అభ్యంతరాలు తెల్పింది.

ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనయినా, ఏ రెండు సంస్థల మధ్యనయినా ఒక ఒడంబడిక జరిగినప్పుడు ఆ ఒడంబడికను ఒక పక్షం పాటించకపోతే పర్యవసానం ఏమిటి అని రాసుకుంటారు. ఇది కనీసమైన ఇంగిత జ్ఞానం. చట్ట పరిభాషలో దీన్ని ఎగ్జిట్ రూట్ అంటారు. అటువంటి నిబంధన ఏదీ సెజ్ చట్టంలో లేదు. సెజ్ ఏర్పాటు చేస్తాను అని ఊరికే కాగితం రాసి ఇచ్చి ఎవరయినా ప్రభుత్వం దగ్గర ఉచితంగానో, కారుచౌకగానో పదుల ఎకరాలో, వందల ఎకరాలో భూమి సంపాదించవచ్చు. వాళ్లు సెజ్ ఏర్పాటు చేసినా చేయకపోయినా ఆ భూమి వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వానికి మాత్రం అసాధ్యమో, కష్ట సాధ్యమో అయిపోతుంది.

అయితే ఇక్కడ ఆగి, ఇంత దుర్మార్గంగా తయారయిన చట్టాన్ని తేవడానికి రాజకీయ నాయకులు, ప్రభుత్వం ఏ కారణాలు చెప్పాయో, అవి సరయినవో కావో కూడ చూడాలి. నాలుగు ప్రధాన కారణాలు – విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వస్తుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది, ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం వస్తుంది – చూపి, వాటివల్లనే ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయవలసి వస్తోందని ప్రభుత్వం చెపుతోంది.

నిజానికి ప్రస్తుతం తయారయిన, అనుమతులు పొందిన ప్రత్యేక ఆర్థిక మండలాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చినవి చాల తక్కువ. ప్రస్తుతం దేశం మొత్తం మీద ఉన్న 600 పైచిలుకు సెజ్ లలో, దేశంలోని అన్ని రాష్ట్రాలకన్న అత్యధికంగా 100 కు పైన సెజ్ లు ఉన్న మన రాష్ట్రంలో అతి ఎక్కువ భాగం స్థానిక పెట్టుబడిదారులవి, ఇతరదేశాలలో స్థిరపడిన భారతీయులవి, విదేశీ కంపెనీలకు శాఖలుగా పని చేసేవి మాత్రమే ఉన్నాయి. వీటిద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చే అవకాశం చాల తక్కువ. అలాగే సెజ్ లు గా ప్రకటిస్తున్న వాటిలో చాల భాగం ఇప్పటికే పనిచేస్తున్న పారిశ్రామిక, వ్యాపార సంస్థలు. కేవలం 2005 సెజ్ చట్టం కల్పించే సదుపాయాలు పొందడానికే, పన్నులు ఎగగొట్టడానికే ఆ వ్యాపారవేత్తలు తమ పేరు మార్చుకున్నారు. (ఒక సుప్రసిద్ధమైన ఉదాహరణ చెప్పాలంటే, అప్పటికే పది సంవత్సరాలకు పైగా పన్ను హాలిడే అనుభవిస్తున్న హైదరాబాదుకు చెందిన ఒక బడా సాఫ్ట్ వేర్ కంపెనీ, రాత్రికి రాత్రి సెజ్ అయిపోయింది. ఒక సంవత్సరంలో ముగిసిపోనున్న పన్ను హాలిడేను మరొక ఐదు సంవత్సరాలో, పది సంవత్సరాలో పెంచుకుంది!) అంటే ఇలా పేరుకు ఎన్నో కొత్త సెజ్ లు వచ్చాయి గాని, అవి కొత్త పెట్టుబడులూ కావు, విదేశీ పెట్టుబడులు అసలే కావు. ఇంతకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చినా అది దేశానికేమన్నా మేలు చేస్తుందా అనే చర్చ కూడ ఉంది గనుక ఈ కారణం పూర్తిగా అసంబద్ధమైనదే.

ఇక మరో కారణంగా సెజ్ ల వల్ల బోలెడంత ఉద్యోగ కల్పన జరుగుతుందని, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ఊదరగొడుతోంది. నిజానికి తాజా గణాంకాల ప్రకారం గత ఐదు సంవత్సరాలలో దేశంలోని అన్ని సెజ్ లు కలిసి సృష్టించిన ఉద్యోగాల సంఖ్య 4,90,358. వీటిలో సెజ్ లు గా పేరు మార్చుకున్న పాత పారిశ్రామిక, వ్యాపార సంస్థలు కూడ ఉన్నాయి గనుక సెజ్ ల వల్ల నిజంగా వచ్చిన కొత్త ఉపాధికల్పన ఈ అంకె కన్న తక్కువే గాని ఎక్కువ ఉండదన్నమాట. దేశంలో మొత్తం సంఘటిత రంగంలో ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే ఈ అంకె సముద్రంలో కాకిరెట్ట. కాకపోతే ఆ సముద్రానికి ఇచ్చిన రాయితీలు కాకిరెట్టంత, ఈ కాకిరెట్టకు ఇచ్చిన రాయితీలు సముద్రమంత. ఈ సెజ్ ల ఉపాధి కల్పనలో మరొక కిటుకు కూడ ఉంది. చాల సెజ్ లు రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చాయి గనుక, వాటిలో నిర్మాణ పనుల వల్ల తొలిరోజుల్లో ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం అవుతారు గనుక ఈ అంకెలో వాపు కనబడుతుంది గాని, అది నిజమైన బలుపు కాదు. అంతేకాదు, ఈ సెజ్ లు ఏర్పాటు చేసిన భూములనుంచి, గ్రామాలనుంచి, సముద్ర తీర ప్రాంతాల నుంచి ఉపాధి కోల్పోయిన వారు కనీసం ఇరవై లక్షల మంది ఉంటారు. అంటే, ప్రభుత్వం ఊదర గొడుతున్న అంకె నిజమయినదే అనుకున్నా, ఇరవై లక్షల మంది బతుకు కొల్లగొట్టి, ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఏమి విజ్ఞతో ఆలోచించాలి.

ఇంకో సమర్థనగా సెజ్ ల వల్ల విదేశీ సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని నమ్మబలుకుతున్నారు. కాని ఇప్పటిదాకా వచ్చిన సెజ్ లలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణం, పాదరక్షల తయారీ, లోదుస్తుల తయారీ, బొమ్మల తయారీ, ఔషధాల తయారీ వంటి రంగాలలోనే గనుక వాటిలో అవసరమైన విదేశీ సాంకేతిక పరిజ్ఞానమూ లేదు, అది వచ్చిందీ లేదు.

పాత కంపెనీలు కొత్త పేర్లు పెట్టుకోవడం, అవి ఇప్పటికే మనకు అనుభవం, పరిజ్ఞానం ఉన్న పారిశ్రామిక రంగాలలోనే పనిచేస్తుండడం లాంటి కారణాల వల్ల ఈ సెజ్ ల ఉత్పత్తులు కొత్తగా ఎగుమతులు అయ్యేదీ లేదు, ప్రభుత్వం చెపుతున్న విదేశీ మారకద్రవ్యం రాబడి అనే కారణం నిజమయ్యేదీ లేదు.

మరి ప్రభుత్వం చెప్పే కారణాలన్నీ ఇలా పచ్చి అబద్ధాలో, అర్ధ సత్యాలో అయితే, సెజ్ లు రావడానికి అసలు కారణాలు ఏమిటి?

భారతదేశంలోని విస్తారమైన భూమి, ఆ భూమి చౌకగా దొరకడం, ఆ భూమిని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని సేకరించి తమ చేతుల్లో పెట్టడం అనే కారణాలు బహుళజాతిసంస్థలకు, దేశదేశాల సంపన్నులకు నోరూరిస్తున్నాయి. లక్షలాది ఎకరాల భూమిని హస్తగతం చేసుకోవడం, దాన్ని పరిశ్రమ పేరుతో తీసుకున్నా అందులో సగం భూమిని పారిశ్రామికేతర అవసరాలకు వాడుకునే వీలు ఉండడం, అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలను కూడ సెజ్ లుగా గుర్తించడం వల్ల, విదేశీ, స్వదేశీ సంపన్నులందరికీ ఇది కామధేనువులాగ కనబడుతోంది. అందువల్లనే అతి ఎక్కువభాగం సెజ్ లు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడం మాత్రమే కాదు, పెద్ద పట్టణాల పరిసరాల్లో మాత్రమే ఉన్నాయి.

దీనితో పాటు సెజ్ పేరు పెట్టుకుంటే పన్నులు తగ్గించుకోవడానికి, ఎగ్గొట్టడానికి, కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉండడానికి వీలుంది గనుక ఆయా వ్యాపారవేత్తలకు ఇది చాల లాభసాటి వ్యవహారంగా కనబడుతోంది.

నిజానికి ఈ భూముల పందారం వల్ల కొన్ని లక్షల ఎకరాలు పంట భూములు – అవి ఆహారధాన్యాలు పండించే భూములయినా కావచ్చు, కూరగాయలు పండించే నగరాల శివారు భూములయినా కావచ్చు – ఇలా వ్యవసాయానికి దూరం కావడం వల్ల దేశపు ఆహార భద్రతకు విఘాతం కలుగుతుందని, అందువల్ల ఇది దేశానికి వినాశకరమని ఎం ఎస్ స్వామినాథన్ వంటి శాస్రవేత్తలు కూడ అన్నారు. ఆహార భద్రతను దెబ్బతీసినా, పన్నుల రాబడిని దెబ్బతీసినా ఫరవాలేదని, తమ ఆశ్రితులకు వేలాది ఎకరాల భూములు, తమకు కోట్ల కొద్దీ ముడుపులు దక్కితే చాలునని ఏలినవారు అనుకున్నారు. ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కూడ కాదు. అన్ని పార్టీలూ తాము అధికారంలో ఉన్నచోట సెజ్ లు ఏర్పరచాయి, సెజ్ లను సమర్థించాయి. తాము ప్రతిపక్షంలో ఉన్నచోట సెజ్ లను వ్యతిరేకించాయి.

అయితే ఈ వినాశకర విధానాన్ని ప్రజలు మౌనంగా అంగీకరించలేదు. పండినా పండకపోయినా, పండితే గిట్టుబాటు ధర రాకపోయినా తమ శాశ్వత జీవనోపాధి వనరుగా ఉన్న భూమిని వదులుకోవడానికి పేద, మధ్యతరగతి రైతాంగం అంగీకరించలేదు. దేశవ్యాప్తంగా సెజ్ లకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉవ్వెత్తున లేచాయి. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సెజ్ వ్యతిరేక ఆందోళనకు స్వయంగా మాజీ ప్రధాని వి పి సింగ్ నాయకత్వం వహించారు. చనిపోవడానికి కొద్ది ముందు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఒక సెజ్ వ్యతిరేక నిరసన ప్రదర్శనలో మాట్లాడుతూ ఆయన ‘ఈ ప్రత్యేక ఆర్థిక మండలాల నమూనానే ఈ దేశ అభివృద్ధి నమూనా అయితే, తిరగబడక తప్పదు. ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటే మావోయిస్టుల మార్గమే సరయినదనిపిస్తోంది. నా వయసు అనుకూలిస్తే నేను కూడ వాళ్లలో చేరేవాడినే” అన్నారంటే సెజ్ ల పట్ల ఆయన వ్యతిరేకత ఎంత తీవ్రమయినదో అర్థమవుతుంది. అలాగే, భారత నౌకాదళ ప్రధానాధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన అడ్మిరల్ రాందాస్ ప్రస్తుతం మహారాష్ట్రలో సెజ్ వ్యతిరేక ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా గాంధేయవాదులు, సర్వోదయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, నక్సలైట్లు సెజ్ వ్యతిరేక పోరాటాలకు మద్దతునిచ్చారు. ఇలా దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రపతి తర్వాత రెండో స్థానంలో పనిచేసిన సైనికాధికారి దగ్గరి నుంచి గాంధేయుల నుంచి, అట్టడుగున తమ భూములు కోల్పోయిన దళితులు, ఆదివాసుల దాకా దేశంలో సెజ్ ల పట్ల వ్యతిరేకత పెద్ద ఎత్తునే వచ్చింది. ఇటువంటి వ్యతిరేకత వల్లనే గోవా రాష్ట్ర ప్రభుత్వం తాను అనుమతించిన 14 సెజ్ లను కూడ ఉపసంహరించుకోవలసి వచ్చింది.

వ్యతిరేక ఆందోళనల వల్ల కొంత, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వల్ల కొంత, వివాదాల వల్ల కోత ఇప్పటికి ప్రత్యేక ఆర్థిక మండలాల జోరు తగ్గినట్టు కనబడుతున్నది గాని, బడావ్యాపారస్తుల చేతుల్లో చిక్కిన లక్షలాది ఎకరాల భూమి ఇంకా వాళ్ల చేతుల్లోనే ఉన్నది. ఈ కొత్త హిరణ్యాక్షులు ఆ భూమిని చాపగా చుడతారో, ఏం చేస్తారో, ‘భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు’ అని వేమన పలికిన ఆదిమ సహజ వివేకం మేలుకుంటుందో చూడవలసే ఉంది.

* రచన: ఏప్రిల్ 27, 2010

* ప్రచురణ: ఈభూమి మాసపత్రిక జూన్ 2010

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu. Bookmark the permalink.

4 Responses to ప్రత్యేక దోపిడీ మండలాలకు ఐదేళ్లు

  1. ammaodi says:

    సెజ్ ల గురించి చాలా వివరంగ చెప్పారు. నెనర్లు!

  2. ramnarsimha says:

    Sir,

    How to read VEEKASHANAM in Internet?

    If possible plz mail your opinions to me.

    RPUTLURI@YAHOO.COM

  3. కమల్ says:

    ధన్యవాదాలు.

  4. ramnarsimha says:

    Sir,

    Plz write about STUDY-PRESSURE….

    on students..

    rputluri@yahoo.com

Leave a reply to కమల్ Cancel reply