మద్యమేనా రాష్ట్ర ప్రగతికి దారి?

(ప్రజాతంత్ర  వారపత్రిక ఆఖరి పేజీ, జూన్  15, 2010)

జనం ఎక్కువగా వ్యసనాలకు బానిసలయితేనే రాష్ట్రాభివృద్ధి అట. ఎంత మంది వీలయితే అంత మంది అన్నీ మరచిపోయేలా తప్పతాగితేనే రాష్ట్రం సురక్షితంగా ఉన్నట్టట. ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల రూపాయల మద్యం తాగుతున్నారంటే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుభిక్షంగా ఉన్నదనడానికి చిహ్నమట. రాష్ట్రంలో మద్యం ఏరులై పారితే పాలూ తేనే ప్రవహించినట్టేనట. మద్యం వ్యాపారులకూ, ఆ వ్యాపారం చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ నాయకులకూ, వాళ్లు పెంచి పోషిస్తున్న మాఫియా ముఠాలకూ కోట్లకొద్దీ లాభాలూ ముడుపులూ వస్తేనే రాష్ట్రం ప్రగతిపథాన దూసుకు పోతున్నట్టట. ఆ డబ్బు లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందడానికీ, ప్రజా సంక్షేమ పథకాలు నడవడానికీ వీలే లేదట.

గత  సోమవారం జరిగిన మద్యం దుకాణాల వేలం ఎన్నో కొత్త విషయాలను బయటపెట్టింది. లేదా పాత విషయాలనే పునరుద్ఘాటించింది. రెండు సంవత్సరాలకొకసారి లైసెన్స్ ఫీజు వేలం జరుగుతుండగా, గతంలో 2008-10 కాలానికి రు. 3,183 కోట్లు ఉండిన ఆదాయం, ఇప్పుడు 2010-12 కాలానికి రు. 6,917 కోట్లకు ఎదిగింది. నీతి – అవినీతి, మంచి – చెడు చర్చ లేకుండా, కేవలం అంకెలు పైకి పోవడమే అభివృద్ధి అనుఉంటే ఇది 117 శాతం అభివృద్ధి!!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతమాత్రం బాగులేదని గద్దె మీద ఉన్న పెద్దలు పదే పదే చెప్పే మాట నిజం కాదనీ, పచ్చి అబద్ధమనీ ఈ అంకెలతో రుజువవుతున్నది. తాగే అలవాటున్నవాళ్లు కొన్ని వేల మందికి మించని ఊళ్లల్లో కూడ మద్యం వ్యాపారులు కోట్లాది రూపాయలు లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వానికి చెల్లించడానికి సిద్ధపడ్డారంటే, వాళ్లకు మరెన్ని రెట్ల లాభాలు వస్తూ ఉంటాయి? వాళ్లు జనానికి మరెన్ని కోట్ల రూపాయల మద్యాన్ని తాగబోయిస్తూ ఉంటారు? రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారనుకోవాలి?!

మద్యపానం  వ్యక్తిగత బలహీనత అనీ, నైతిక సమస్య అనీ, మనుషులు బాగుపడితే సమాజం బాగుపడుతుందనీ అర్థరహితమైన ప్రవచనాలు వల్లించేవారి దిమ్మ తిరిగేలా, గత సంవత్సరం తాగినదానికన్న ఈ సంవత్సరం ఎక్కువ తాగించాలని ప్రభుత్వమే నిర్ణయించింది. ప్రభుత్వం చెప్పినదానికన్న కూడ ఎక్కువ తాగిస్తామని మద్యం వ్యాపారులు హామీ ఇస్తున్నారు. ఇక జనానికి ఆ బలహీనత ఉన్నా లేకపోయినా తాగి చావక తప్పుతుందా? ఒకవేళ తాగమని భీష్మించుకుంటే పోలీసు స్టేషన్లలో సారా దుకాణాలు తెరిచి అమ్మకాలు సాగించిన, తాగబోయించిన ఘనమైన చరిత్ర ఉన్న రాష్ట్రం మనది. మన మహా ఘనత వహించిన ప్రజాస్వామిక ప్రభుత్వం ఆమాత్రం సహకరించకుండా ఉంటుందా?

మద్యపానాన్ని  వ్యతిరేకిస్తున్నామని, నిషేధిస్తామని చెప్పుకునే రాజకీయ పక్షాలకు కనీస చిత్తశుద్ధి కూడ లేదని ఈ మద్యం వేలం రుజువు చేస్తున్నది. అన్ని పార్టీల నాయకులూ చాల చోట్ల నేరుగానో, బేనామీ గానో మద్యం వ్యాపారులుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఏ ఒక్క పార్టీ కూడ తమ ప్రకటిత లక్ష్యమయిన మద్యనిషేధానికి తమ స్థానిక నాయకులు తూట్లు పొడుస్తున్నారనీ, అందువల్ల వారిమీద చర్యలు తీసుకుంటున్నామనీ ప్రకటించిన దాఖలా లేదు.

ఇంత చేసీ, ప్రజలను వ్యసనాలకు బానిసలను చేసి వసూలు చేసిన ఈ డబ్బు ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేయడానికేనని ఏలినవారు చెపుతున్న మాట పచ్చి అబద్ధమని కూడ రుజువవుతున్నది. సంక్షేమ పథకాల మీద ఖర్చు పెడుతున్నది ఈ మద్యం రాబడిలో చిన్న భాగం మాత్రమే. నిజానికి ఆ ఖర్చుకోసం కూడ మద్యం రాబడి మీద ఆధారపడనక్కరలేదు.

మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఎక్సైజ్  ఆదాయం ద్వారానే ప్రభుత్వం నడుస్తున్నదని ప్రభుత్వాధినేతలూ, అధికారులూ, మద్యం వ్యాపారులూ కలిసికట్టుగా పాడుతున్న పాట, నిజంలా వినిపిస్తున్న అబద్ధపు పాట. మధ్యతరగతి ఆలోచించకుండా, లోతులలోకి వెళ్లకుండా నమ్మదలచుకున్న మాట.

కాని  ఇది అక్షరాలా రాజ్యాంగ వ్యతిరేకం. భారత రాజ్యాంగంలోని అధికరణం 47 సూటిగా మద్యపాన నిషేధం గురించి మాట్లాడింది. పోషకాహార విలువల స్థాయిని, జీవనప్రమాణాన్ని పెంచడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం రాజ్యపు బాధ్యతలు అని చెప్పే ఆ ఆధికరణం “ప్రజల పోషకాహార విలువల స్థాయిని, జీవన ప్రమాణాన్ని పెంచడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం తన ప్రాథమిక విధులలో భాగంగా రాజ్యం గుర్తిస్తుంది. ప్రత్యేకంగా, ఔషధపరమైన అవసరాల కోసం మినహా, సాధారణంగా మత్తెక్కించే పానీయాలను, ఆరోగ్యానికి హానికరమైన మందులను నిషేధించడానికి రాజ్యం కృషి చేస్తుంది” అని ఆ అధికరణం చాల స్పష్టంగా చెప్పింది. భారత ప్రజలు 1950 జనవరి 26న తమకు తాము ఇచ్చుకున్న రాజ్యాంగంలోని ఈ ఆదేశిక సూత్రం అరవై సంవత్సరాల తర్వాత కూడ అరకొరగా కూడ అమలులోకి రాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వమయితే ఆ రాజ్యాంగ బాధ్యతను విస్మరించడం మాత్రమే కాదు, అందుకు పూర్తిగా వ్యతిరేకమైన దిశలో నడుస్తోంది. ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గద్దెనెక్కిందో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అనుక్షణం భంగపరుస్తోంది.

ఇక  ప్రభుత్వాన్ని అలా ఉంచి, పాలక కాంగ్రెస్ పార్టీని ఒక రాజకీయ పక్షంగా చూస్తే ఈ మద్యం అమ్మకాల ప్రోత్సాహం పూర్తిగా దగుల్బాజీతనం. నయవంచన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన వలస వ్యతిరేక జాతీయోద్యమ కాలమంతా, 1947 తర్వాత ఇప్పటివరకూ కూడ మద్యనిషేధం గురించి గంభీర ప్రవచనాలు పలుకుతూనే వస్తోంది. అవన్నీ అలా ఉంచినా మన రాష్ట్రం వరకూ వస్తే, 1994లో అధికారం పోగొట్టుకున్న తర్వాత, 1999లో అధికారానికి రాలేకపోయిన తర్వాత, 2004 ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రణాళికలో మద్యనిషేధం గురించి మాట్లాడింది. మహిళాభ్యుదయం శీర్షిక కింద, “మద్యపానానికి బానిసలు అయినవారివల్ల సమాజం, ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోంది. మద్యానికి బానిసలు కావడం వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు తెలియజెప్పడానికీ, బెల్టుషాపుల మూసివేతకూ, పబ్ లు, బార్లు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోవడాన్ని నివారించడానికీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది” అని రాశారు.

ఇతర వాగ్దానాలతో పాటు ఈ వాగ్దానం మీద ఆధారపడి గెలిచిన తర్వాత, ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ “పెద్ద ఎత్తున ఉద్యమం” కాదు గదా, అసలు ఆ మాటే ఎత్తలేదు. ఇక 2009 ఎన్నికల ప్రణాళిక కొత్త వాగ్దానాలేమీ చేయకుండానే 2004 వాగ్దానాల కొనసాగింపుగా సాగింది గనుక మద్యనిషేధ ఆశయం 2009 తర్వాత ఉన్నట్టా లేనట్టా తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కాంగ్రెస్ తనకు తాను చేసుకున్న ఆత్మవంచన, పరవంచన, ప్రజలపట్ల నయవంచన.

నిజానికి  ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ పాపం మాత్రమే కూడ కాదు, ఈ తిలా పాపంలో తలా పిడికెడు భాగస్వామ్యం ఉన్నది. ఇది అన్ని పార్లమెంటరీ పార్టీల రాజకీయ దివాళాకోరుతనానికి చిహ్నం. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మద్యం వ్యాపారాన్ని ఖండిస్తూ ఇల్లెక్కి అరుస్తున్న తెలుగుదేశం పార్టీ సారా వ్యతిరేక ఉద్యమం తర్వాత 1994 ఎన్నికలలో మద్య నిషేధాన్ని విధిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు 1995లో మద్యనిషేధం విధించారు. దాన్ని సక్రమంగా అమలుచేయకుండా తూట్లు పొడిచి, అది అసలు అమలు చేయడం సాధ్యం కాదనే ప్రచారానికి లంకించుకున్నది తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే 1997లో మద్యనిషేధాన్ని పాక్షికంగా సడలించి తర్వాత పూర్తిగా ఎత్తివేశారు. ఇప్పుడు ఎన్నికల ఎత్తుగడగా ప్రభుత్వ మద్య విధానాన్ని, కొత్త వేలం పాటను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం నాయకులలో అనేకమంది మద్యం వ్యాపారులు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ కూడ ఎంతో మంది మద్యం వ్యాపారులకు ఆశ్రయమిచ్చింది. ఇతర పార్టీలు కూడ సారా వ్యాపారులతో, సారా డబ్బుతో సంబంధం లేని పవిత్రమైనవేమీ కావు.

ఈ అన్ని  రాజకీయ పక్షాలకూ ఒక యుగళ గీతం ఉంది. నిషేధం మానవ ప్రవృత్తికి వ్యతిరేకమట. అది ఆచరణ సాధ్యం కానిదట. మనిషిలో హృదయ పరివర్తన వచ్చిన తర్వాతనే ఆది సాధ్యమవుతుందట. నిజానికి మద్యనిషేధ విధానాన్ని ఎక్కడయినా చిత్తశుద్ధితో నూటికి నూరుపాళ్లు అమలు చేసి ఉంటే, అమలు చేయడానికి ప్రయత్నించి విఫలమై ఉంటే, ఈ మాటలకు ఏమయినా అర్థం ఉండేది. మనిషికి అనేక సమస్యలు సృష్టిస్తున్న వ్యవస్థ, ఆ సమస్యలనుంచి తప్పించుకునే ఒక పరిష్కార మార్గంగా మాదక ద్రవ్యాలకు బానిస కావచ్చునని సూచిస్తున్న వ్యవస్థ, ప్రోత్సహిస్తున్న వ్యవస్థ, ఆ మాదక ద్రవ్యాలు అమ్మే పని తానే పెట్టుకున్న వ్యవస్థ, ఆ అమ్మకాల ద్వారా పన్నులు, లాభాలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్న వ్యవస్థ నిజంగా మద్యనిషేధం అమలు చేయగలదా? ఇదంతా మారినప్పుడు కదా, మద్యనిషేధం విజయవంతమవుతుందో లేదో నిజంగా చెప్పగలిగేది. ఈ వ్యవస్థను యథాతథంగా కాపాడదలచిన అన్ని యంత్రాంగాలూ మద్య నిషేధ ఆలోచనకు తూట్లు పొడుస్తున్నాయి. మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కనుక మద్య నిషేధం ఆచరణ సాధ్యం కానిదని గగ్గోలు పెట్టే వాళ్లకూ తల్లిదండ్రులను తామే చంపి అనాథలమని ఏడుస్తున్నవాళ్ల లాంటి వాళ్లే.

ఎక్సైజ్ ను మించిన ఆదాయ వనరు లేదని, అందువల్లనే తమకు ఇష్టం లేకపోయినా మద్యం అమ్మకాల లక్ష్యాలు విధించి అమ్మకాలను ప్రోత్సహించవలసి వస్తున్నదని పాలకులు పదేపదే అంటూ ఉంటారు. అమాయకులు నమ్ముతుంటారు కూడ. ప్రస్తుత సందర్భమే చూస్తే, ఈ లైసెన్స్ ఫీజు, ఆ తర్వాత అమ్మకాల మీద పన్నులు కలిపి మొత్తం మీద ప్రభుత్వానికి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు వస్తాయి. ఒక్క ఓబుళాపురం గనులలో అక్రమాలను అరికట్టినా, సింగరేణి గనులలో అక్రమాలను అరికట్టినా, రాష్ట్రంలోని సాఫ్ట్ వేర్ రంగం లాభాల మీద పన్నులు విధించినా ఒక్కొక్క చోటి నుంచీ ప్రభుత్వానికి అంతకన్న ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ మూడూ ఉదహరణ కోసం చెప్పినవి మాత్రమే, నిజంగా చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఇతర ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి.

నిజంగా  అర్థం చేసుకోవలసింది, అది  వ్యసనమా, బలహీనతా, వంచనా, రాజకీయ దివాళాకోరుతనమా, ఆదాయ మార్గమా  అని మాత్రమే కాదు. అది ఒక రాజకీయార్థిక, సామాజిక కుట్ర. ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలంటే, ప్రభుత్వ అక్రమాల మీద, పాలకవర్గాల దుర్మార్గాల మీద ప్రజల దృష్టి మళ్లకుండా ఉండాలంటే ప్రజలు నిత్యం ఏదో మత్తులో ఉండాలి. ఎప్పుడో ఎనభై సంవత్సరాల కింద బ్రిటిష్ రచయిత ఆల్డస్ హక్స్ లీ నవల ‘బ్రేవ్ న్యూ వరల్డ్’ లో ప్రజలు నోరెత్తకుండా ఉండడానికి వారిని సోమ అనే పానీయానికి బానిసలను చేశారని రాశాడు.

మనం ఇప్పుడు ఆ బ్రేవ్ న్యూ వరల్డ్ లోనే ఉన్నట్టున్నాం!

– ఎన్ వేణుగోపాల్

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

6 Responses to మద్యమేనా రాష్ట్ర ప్రగతికి దారి?

 1. మద్యంలో చాలా రకాలు ఉన్నాయి. కాస్ట్లీ వైన్ తాగితే ఆరోగ్యం చెడిపోదు. ఆ రకం వైన్ కొనగలిగేవాళ్ళు ఎంత మంది ఉన్నారనేది ప్రశ్న. మన కమ్యూనిస్ట్ దేశమైన క్యూబాలో అందరూ వైన్ తాగుతారు. అక్కడ చెరుకు ఎక్కువ పండుతుంది. చెరుకుని ప్రోసెస్ చెయ్యగా మిగిలిన మొలాసెస్ తో రమ్ తయారు చేసుకుని తాగుతారు. మన ఇండియాలో ఎక్కువ మంది తాగేది చీప్ లికర్. అది తాగితే ఆరోగ్యం పాడవ్వడం సులభమే. అయినా కాస్ట్లీ వైన్ కొనడానికి డబ్బులు లేక చీప్ లికర్ తాగుతుంటారు.

 2. అభిషేక్ చౌదరి says:

  సోమం మత్తుపానీయం కాదండీ. అలా అనడం బ్రిటీషువారి ప్రచారం మాత్రం. అది హిమాలయాల్లోని ముంజపర్వతాల్లో మాత్రమే పెరిగే ఒకానొక ఔషధ మొక్క. అది సంవత్సరంలో ఒకే ఒక నెలలో రోజుకొక ఆకు చొప్పున 15 రోజులకు 15 ఆకులు తొడుగుతుంది. అప్పుడా ఆకుల నుండి తీసిన రసంతో కాయకల్పచికిత్స చేస్తారు. శరీర దోషాలన్నీ పోగొట్టి అది యౌవనాన్ని సంతరించుకోవడం కోసం చేసే ఆయుర్వేద ప్రక్రియే కాయకల్పం. దానివల్ల మనుషులు 120 సంవత్సరాలు జీవిస్తారు. సోమపానం యజ్ఞార్హత గల ఉన్నతవర్గాలకే తప్ప సామాన్యప్రజల కోసం ఉద్దేశించబడినది కాదు.

 3. ramanarsimha says:

  Sir,

  After reading MAHATMA GANDHI`S – AUTO BIOGRAPHY, I decided not to SMOKE & DRINK..

  So, please kindly publish Gandhi`s autobiography as a serial in your VEEKSHANAM..

  rputluri@yahoo.com

 4. Dr.Rajendra Prasad says:

  ఎక్సైజ్ ను మించిన ఆదాయ వనరు లేదని, అందువల్లనే తమకు ఇష్టం లేకపోయినా మద్యం అమ్మకాల లక్ష్యాలు విధించి అమ్మకాలను ప్రోత్సహించవలసి వస్తున్నదని పాలకులు పదేపదే అంటూ ఉంటారు. అమాయకులు నమ్ముతుంటారు కూడ. ప్రస్తుత సందర్భమే చూస్తే, ఈ లైసెన్స్ ఫీజు, ఆ తర్వాత అమ్మకాల మీద పన్నులు కలిపి మొత్తం మీద ప్రభుత్వానికి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు వస్తాయి. ఒక్క ఓబుళాపురం గనులలో అక్రమాలను అరికట్టినా, సింగరేణి గనులలో అక్రమాలను అరికట్టినా, రాష్ట్రంలోని సాఫ్ట్ వేర్ రంగం లాభాల మీద పన్నులు విధించినా ఒక్కొక్క చోటి నుంచీ ప్రభుత్వానికి అంతకన్న ఎక్కువ ఆదాయం వస్తుంది.
  Correct Analysis
  Soma created in that novel is not the same soma described by Abhishek chowdary, which is a myth!!
  Publishing Gandhi’s Autobiography in Veekshanam is criminal waste of every thing that takes to produce that magazine

 5. అభిషేక్ చౌదరి says:

  ప్రభుత్వం మద్యం మీద సంపాదించకూడదనుకుంటే ఆ సంపాదనకి ప్రత్యామ్నాయాన్ని కూడా చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఉన్నపళాన మద్యాన్ని నిషేధించాలంటే అందరికీ ఇబ్బందే. గతంలో ఒకసారి తాడేపల్లిగారు చెప్పినట్లు వ్యవసాయం మీద పన్నువేయాలి, కనీసం పంటలో పదిశాతం చొప్పున !

 6. అభిషేక్ చౌదరి says:

  మన కాలానికి లేకపోతే అన్నీ మైతే. ఒక వస్తువు వాస్తవంగా అస్తిత్వంలో లేకపోతే దాని గురించి పూర్వగ్రంథాలలో విస్తారంగా ప్రస్తావించరు. దాన్ని యజ్ఞాలలో తాగితీరాలని అంత ఖచ్చితమైన నిబంధన కూడా పెట్టరు. మన కాలానికొచ్చేసరికి చాలా వృక్షజాతులూ, జీవజాతులూ అంతరించిపోయాయి. రాజేంద్రప్రసాద్ గారి వాదన ప్రకారం అవన్నీ మైతే. ఇప్పుడు పులి, ఏనుగు కూడా ప్రమాదంలో పడ్డాయి. ఒక వందేళ్ళ తరువాత రాజేంద్రప్రసాద్ గారి మునిమనుమలు అవి కూడా మైత్ అనే అంటారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s