తెలంగాణ ఉద్యమం – కొత్త సవాళ్లు

(వీక్షణం ఏప్రిల్ 2010 సంచిక కోసం)

నవంబర్ 2009 చివరివారంలో కీలకదశలోకి ప్రవేశించి, డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం చేత చరిత్రాత్మకమైన ప్రకటన చేయించగలిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం కాలం గడిచినకొద్దీ కొత్త చిక్కులలోకి, సవాళ్లలోకి ప్రవేశిస్తున్నది. డిసెంబర్ 9 న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని, ఆ ప్రకటన స్పూర్తితో, కొనసాగింపుగా ముందుకుపోవాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తున్న సూచనలు కనబడడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటిని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో ఎన్ని మాటలు మారుస్తున్నాయో, ఎంత మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయో లెక్కలేదు. రాజకీయపక్షాలన్నీ ఎంతగా తమ వంచననూ, అబద్ధాలనూ ప్రదర్శిస్తున్నా, తెలంగాణ ప్రజలు మాత్రం ఉవ్వెత్తున కదులుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా పోరాటాన్ని విరమించేది లేదంటున్నారు. మరొకవైపు రాజకీయపక్షాల దొంగ నాటకాలవల్ల నిరాశ చెందుతున్న యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఇవాళ్టి స్థితిలో ఒకవైపు ఉద్యమ ఉధృతి, మారుమూల గ్రామసీమలనుంచి నగరాల దాకా అన్ని వర్గాల ప్రజాసమూహాలు ఉద్యమంలో పాల్గొంటూ ఉండడం, కొంతమేరకు నిరాశ కనబడుతుండగా, మరొకవైపు ఇంత విశాలమైన ప్రజాసమూహాన్ని నడిపించవలసిన నాయకత్వంలో అందుకు అవసరమైన దూరాలోచన, సమగ్ర దృక్పథం కనబడడం లేదు.

ఈ సంక్లిష్టమైన, పరస్పర విరుద్ధమైన సూచనలు కనబడుతున్న పరిస్థితినంతా గమనంలోకి తీసుకుని ఇవాళ ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను సమగ్రంగా గుర్తించి, వాటిని అధిగమించే ఆలోచనలుచేసి వాటిని తక్షణమే ఆచరణలో పెట్టగలిగితే ప్రస్తుత ఉద్యమానికి అర్థవంతమైన భవిష్యత్తును ఆశించవచ్చు. ఆ దిశలో కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడమే ఈ వ్యాస లక్ష్యం.

ప్రస్తుత తెలంగాణ ఉద్యమం ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ప్రధానమయినవి ఆరు:

1. ఉద్యమ పరిష్కారం విషయంలో పాలకవర్గాల వైపు నుంచి సాగుతున్న సందిగ్ధత, కాలయాపన.

2. ఉద్యమ ప్రత్యర్థులు సాగిస్తున్న ప్రచారం, అబద్ధాలు, ఆరోపణలు.

3. ఉద్యమ నాయకత్వపు వైఫల్యం, అసమర్థత, లోపాలు.

4. ఉద్యమంలో చీలికలు తేవడానికి పాలకవర్గాలు, ప్రత్యర్థులు, అంతర్గత శక్తులు సాగిస్తున్న ప్రయత్నాలు.

5. ఉద్యమ నాయకులలో కొందరినైనా నిశ్శబ్దం చేయడానికి పాలకుల ప్రయత్నాలు.

6. ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న దమననీతి.

7. ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న ప్రజలకు గాని, ఉద్యమ నాయకత్వానికి గాని దీర్ఘకాలిక దృష్టి లేకపోవడం.

ఈ ఏడు సవాళ్లు దేనికదిగా విడివిడిగా ఉంటే ఎదుర్కోవడం, పరిష్కరించడం సులభమే కావచ్చు గాని, అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి, సంక్లిష్టంగా ఉన్నప్పుడు చిక్కుముడులలాగ తయారవుతాయి. ఒకదాన్ని విప్పబోతే మరొకటి బిగుసుకుంటుంది. అన్నిటినీ సవ్యంగా పరిష్కరించడానికి చాల దూరదృష్టి, ఓపిక, సమన్వయం, ప్రజాప్రయోజనాలపట్ల నిబద్ధత అవసరమవుతాయి. ఇవాళ తెలంగాణ ఉద్యమనాయకులు చాలమందిలో ఈ లక్షణాలు ఉండవలసినంతగా లేవనేది విచారకరమైన వాస్తవం.

మొదటి సమస్య డిసెంబర్ 9 న చిదంబరం ప్రకటన కల్పించిన ఆశలతో మొదలయింది. ఆ ప్రకటనను స్వాగతించిన తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని అవసరం కన్న ఎక్కువగా నమ్మారు.   గత యాభై సంవత్సరాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ తమను అనేకసార్లు మోసం చేశాయని, ఈసారి కూడ మోసం చేయవచ్చునని, అలా మోసం చేయకుండా ఉండాలంటే నిరంతర ఒత్తిడి ఉండాలని తెలంగాణ ప్రజలు గుర్తించలేకపోయారు. లేదా తెలంగాణ ప్రజలకు ఈ జాగరూకతను కల్పించవలసిన ఉద్యమ నాయకత్వం ఆ పని చేయలేకపోయింది. ఈ తెలంగాణ ఉద్యమ నాయకత్వంలో పార్లమెంటరీ రాజకీయ పక్షాలు, పాలకవర్గ ముఠాలు, స్వార్థపర శక్తులు కూడ ఉన్నాయి గనుక వాటికి ఇటువంటి ప్రజాచైతన్యాన్ని కల్పించే ఆసక్తి గాని, కార్యక్రమం గాని ఉంటాయని ఆశించలేము. కాని, ప్రజానుకూల పక్షాలు, పాలకవర్గ కుట్రలను గురించి అధ్యయనం, అనుభవం ఉన్న మేధావులు, ప్రజాసంఘాలు, పార్లమెంటరీయేతర పక్షాలు కూడ ఈ చైతన్యాన్ని కల్గించలేకపోయాయి. మొత్తం మీద డిసెంబర్ 9 ప్రకటనతో తమ పని అయిపోలేదని, నిజానికి అప్పుడే క్రియాశీలంగా పని చేయవలసిన అవసరం పెరిగిందని గుర్తించవలసిన తెలంగాణ ప్రజలు, రాజకీయపక్షాలు కొంత ఏమరపాటును ప్రదర్శించాయి.

సరిగా తెలంగాణ ప్రజలలో, ఉద్యమంలో ఈ ఏమరపాటు ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకున్నవారు కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయనాయకులు. వారు అక్కడి ప్రజలలో ఉండగల భయాలనూ సందేహాలనూ రాజేసి, నిరాధారమైన భయాలను ప్రవేశపెట్టి అక్కడ ఒక ఉద్యమాన్ని సృష్టించగలిగారు. తమ ప్రయోజనాలనే ప్రజల ప్రయోజనాలుగా నమ్మించగలిగారు. ప్రజలను తమవెంట నడపగలిగారు. అక్కడే తెలంగాణ ఉద్యమానికి సవాల్ ఎదురయింది. కోస్తాంధ్ర, రాయలసీమ ఉద్యమాలను చూపించి తన డిసెంబర్ 9 ప్రకటన నుంచి వెనక్కి తగ్గడానికి, సందిగ్ధస్థితి నెలకొల్పడానికి, మరొకసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ బాటలు వేసుకుంది. అలా పూర్తిగా వెనక్కివెళ్లడం విశ్వసనీయతకు దెబ్బగనుక, కాలయాపన ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ కాలయాపన ప్రయత్నాలలో భాగమే ‘విస్తృత సంప్రదింపులు’ అనే మాట. ఆ విస్తృత సంప్రదింపుల ప్రక్రియ దాదాపు నెలన్నర సాగి చివరికి శ్రీకృష్ణ కమిటీ నియామకమయింది. అది కూడ ఏడాదిపాటు పరిస్థితిగురించి సంప్రదింపులు జరుపుతుందంటే అంత సుదీర్ఘకాలం సాచివేతకు రంగం సిద్ధమయిందన్నమాట.

ఈ సవాలును ఎదుర్కోవడానికి వచ్చిన అవకాశాలను కూడ తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు సరిగా వినియోగించుకోలేదనే చెప్పాలి. పాలకవర్గాలు కాలయాపన ప్రయత్నాలు చేస్తాయని అనుమానించి వాటిని అడ్డుకోవడానికి తగిన వ్యూహాలను ముందుగానే రచించుకుని ఉండవలసింది. ఈ కాలయాపన ప్రయత్నాలన్నీ కూడ ‘అవతలివాళ్లు ఒప్పుకోవడం లేద’నే సాకు మీదనే ఆధారపడ్డాయి. ఆ సాకు చూపడానికి వీలు లేకుండా, కనీసం అవతలివాళ్ల ఆందోళన పెద్ద ఎత్తున జరగడానికి వీలులేకుండా అక్కడి ప్రజలకు తెలంగాణ ఉద్యమం గురించి వాస్తవాలు చెప్పడం, ఈ ఉద్యమం ఎందుకు న్యాయమైనదో వివరించడం, అవతలివైపు సాధారణ ప్రజానీకాన్ని తెలంగాణ డిమాండ్ కు అనుకూలంగానో, కనీసం తటస్థంగానో మార్చడం తెలంగాణ ఉద్యమకారులు చేసి ఉండవలసిన పనులు. అలాగే కేంద్రప్రభుత్వం ప్రకటన వచ్చినతర్వాత ‘ఎప్పుడు, ఎప్పుడు’ అని వెంటబడి, ‘కేంద్రప్రభుత్వం మాటకు కట్టుబడడంలేదో’ అని గోలపెట్టి, దేశప్రజల ముందర కేంద్రప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకమయ్యేట్టు చేయడం తెలంగాణ ఉద్యమకారులు చేసి ఉండవలసిన పనులు. కాని డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 23 దాకా రెండువారాల విలువైన కాలాన్ని, రాజకీయ ఉద్యమ, చర్చా స్థలాన్ని తెలంగాణ ఉద్యమకారులు సంపూర్ణంగా ఖాళీ చేసి, కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులకు, సంపన్నులకు అప్పగించారు. సరిగ్గా అప్పుడే కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కాలయాపన ప్రయత్నాలకు కుట్రలను ముమ్మరం చేశాయి. ఆ ప్రయత్నాలకు ఇప్పటికైతే డిసెంబర్ 2010 దాకా గడువు పెట్టుకున్నాయి. అప్పటివరకు ఉద్యమం చల్లారిపోతుందని, అలా చల్లారిపోతే ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయనక్కరలేదని, చల్లారకపోతే మళ్లీ కాలయాపనకు మరొక సాకు వెతుక్కోవచ్చునని కాంగ్రెస్ పాలకవర్గాలు ఆలోచిస్తున్నాయి.

ఈ కాలయాపన సవాలును ఎదుర్కోవడం తెలంగాణ ప్రజలకు పెద్దసమస్య కాదు. కాలయాపనను అంగీకరించబోమని, ఏ నిర్ణయమైనా తక్షణమే అమలు చేయవలసిందేనని దృఢమైన సంకేతాలు పంపడమే ఇవాళ తెలంగాణ ఉద్యమం చేయవలసిన పని. పాలకపక్షాలు చేసే ఏ ప్రకటనకయినా తక్షణ ఫలితాన్ని అడగడం, పాలకపక్ష ప్రతినిధులను నిలదీయడం, వారు సరయిన జవాబు చెప్పేదాకా మెసలనీయకపోవడం తెలంగాణ ఉద్యమం చేయగలిగిన, చేసిఉండవలసిన పనులు. తెలంగాణ ఉద్యమం గత నాలుగు నెలలలో తీసుకున్న పోరాటరూపాలతో పోలిస్తే ఇలా నిలదీయడం, మాటకు కట్టుబడి ఉండాలని కోరడం తక్కువస్థాయివే, ఆచరణసాధ్యమైనవే. ‘ఇంకా ఆలస్యం వద్దు, కాలయాపన వద్దు, డిసెంబర్ 9 మాటను అమలు చేయండి’ అనే నినాదాలతో ఆందోళన సాగించడం, కొత్తగా మళ్లీ కాలయాపన చేసే అవకాశం పాలకులకు ఇవ్వకపోవడం తెలంగాణ ఉద్యమం తక్షణం చేపట్టవలసిన పనులు.

ఇవాళ తెలంగాణ ఉద్యమం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లలో మరొకటి అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను పూర్వపక్షం చేసే అబద్ధపు వాదనలు, ప్రచారాలు. అంకెలను, చరిత్రను వక్రీకరిస్తూ, కొన్నిచెప్పి కొన్నిదాస్తూ, నిరాధారమైన అరోపణలు చేస్తూ అనేకమంది కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయనాయకులు, మేధావులు ఈపని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటినుంచి వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధి గురించి, వివక్ష గురించి, ప్రాంతీయ అసమానతల గురించి, తెలుగు జాతి చరిత్ర గురించి, 1956కు ముందూ తర్వాతా తెలుగుజాతి జరిపిన ఉద్యమాల గురించి పెద్ద ఎత్తున అబద్ధాలు ప్రచారమవుతున్నాయి. తెలుగులో ప్రధాన ప్రచారసాధనాలన్నీ కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉండడంవల్ల, ఆంధ్రప్రదేశ్ యథాతథంగా కొనసాగడమే ఆ వర్గాల ప్రయోజనాలకు అవసరం కావడంవల్ల ఆ అబద్ధాలకే అత్యధిక ప్రాచుర్యం లభిస్తోంది. ఆ అబద్ధాలను ఖండించే పని శక్తిమంతంగా జరగడంలేదు. జరుగుతున్న పనికయినా ప్రచారసాధనాలలో అవకాశం దొరకడం లేదు.

ఇలా తెలంగాణ గురించి అబద్ధాలు ప్రచారం చేయడం కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయనాయకులకు, మేధావులకు చాలకాలంగా అలవాటే గాని, ప్రస్తుత స్థితి వల్ల, ఆ రచనలకు, అభిప్రాయాలకు దొరుకుతున్న ప్రాధాన్యత వల్ల వాటివల్ల కొందరయినా మోసపోయే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలలో అమాయకంగా తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారికి ఈ అబద్ధాలే ఆధారాలవుతున్నాయి. తెలంగాణ ప్రజలలో కూడ సమగ్రంగా వాస్తవాలు తెలియనివారు ఈ అబద్ధాలతో గందరగోళపడుతున్నారు. అందువల్ల ఈ సవాలును ఎదుర్కోవడం తెలంగాణ ఉద్యమానికి తక్షణ అవసరం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరం కేవలం భావోద్వేగపూరితమైన అంశం కాదు. అది అసమానత, అన్యాయం, వివక్ష, వనరుల దోపిడీ, హామీల ఉల్లంఘన, ప్రత్యేక అస్తిత్వ నిరాకరణ, అవమానం వంటి అనేక కారణాల మీద మొదలయి, స్వయంపాలన, అధికార వికేంద్రీకరణ, ఆత్మగౌరవం సాధించే క్రమంలో ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడకతప్పదనే అవగాహనకు దారి తీసింది. ఇది కేవలం సెంటిమెంటో, కొన్ని ఎంపికచేసిన అంకెల ప్రకటనో, రాజకీయ నిరుద్యోగుల సృష్టో కాదు. ఇది ఐదున్నర దశాబ్దాల ఘోష. న్యాయబద్ధమైన, ప్రజాస్వామికమైన, ప్రజా ఆకాంక్ష. అందువల్ల దీన్ని బలపరచడానికి ఉద్యమకారులు కేవలం భావోద్వేగాలమీద ఆధారపడితే సరిపోదు. ప్రజలను అంతకంతకూ ఎక్కువగా సమీకరించడానికి, వీరిలో ఉత్తేజం నింపడానికి, నిబద్ధత పెంచడానికి భావోద్వేగభరితమైన ప్రచారం అవసరమే కావచ్చు. కాని ఆ ఉత్తేజం, నిబద్ధత దీర్ఘకాలికంగా, దృఢంగా నిలవాలన్నా, పత్యర్థుల ప్రశ్నలకు జవాబులు చెప్పాలన్నా, ప్రత్యర్థుల అబద్ధాలను ఖండించాలన్నా, శాస్త్రీయమైన, కచ్చితమైన అధ్యయనం, పరిశోధన, వాదనలు అవసరమవుతాయి. ఇవాళ తెలంగాణ ఉద్యమం ఈ పనిమీద ఎక్కువ కేంద్రీకరించవలసి ఉంది. ప్రత్యర్థులు లేవనెత్తుతున్న అబద్ధపు వాదనలను ఎప్పటికప్పుడు ఖండించవలసి ఉంది. తమ వాదనలలో పొరపాట్లు, వక్రీకరణలు లేకుండా జాగ్రత్త పడవలసి ఉంది.

తెలంగాణ ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లలో మరొకటి నాయకత్వానికి ఉన్న అసమర్థత, లోపాలు, వైఫల్యం. ఉద్యమం ఎన్ని మార్గాల నడవాలో, ఇది ఎంత విస్తృతమైన ఉద్యమమో, అందరినీ కలుపుకు పోవడానికి ఏ స్థాయిలో ఇచ్చిపుచ్చుకునే సమన్వయ వైఖరి అవలంబించాలో స్పష్టంగా తెలిసిన నాయకత్వం గాని, తెలిసినా అమలులో పెట్టగల నాయకత్వం గాని లేకపోవడం ఒక సమస్య. ఇది ప్రాంతీయ ఆకాంక్షల ఉద్యమం గనుక, పార్లమెంటరీ ప్రజాస్వామిక చట్రంలోపల, రాజ్యాంగబద్ధంగా అమలు కాగల డిమాండ్ మీద సాగుతున్న ఉద్యమం గనుక ఇందులో ప్రజలు ఎంత పెద్ద ఎత్తున పాల్గొన్నప్పటికీ, అంతిమంగా ఉద్యమ నాయకత్వాన్ని పార్లమెంటరీ పక్షాలు, పాలకవర్గాల ముఠాలు ఆక్రమిస్తాయి. ఆ పక్షాలకు తమకు అధికారం రావాలనే కోరికే తప్ప, నిజంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలనే కోరిక ఉండకపోవచ్చు. కాని ఉద్యమ సాఫల్యంలో ప్రజల ఆకాంక్షలు కూడ ఇమిడి ఉన్నాయి గనుక ప్రజలు నిరంతర జాగరూకత ప్రదర్శించవలసి ఉంటుంది. నాయకత్వం తన స్వార్థ ప్రయోజనాలకు ఉద్యమాన్ని బలి చేయకుండా కాపాడగలిగేది ప్రజల జాగరూకత మాత్రమే. అందువల్ల ఈ సవాలును అధిగమించడానికి ప్రజలు ఎప్పటికప్పుడు ఉద్యమ నాయకత్వాన్ని తమ చేతులలోకి తీసుకోవడానికి ప్రయత్నించడం, నిర్ణయాధికారాన్ని వీలయినంతగా వికేంద్రీకరించమని ఒత్తిడి తేవడం, ఏకవ్యక్తి నాయకత్వం స్థానంలో సామూహిక నాయకత్వాన్ని, ఏక వర్గ/బృంద నాయకత్వం స్థానంలో బహువర్గ/బృంద నాయకత్వాన్ని కోరడం, ప్రతి చర్చలోనూ, నిర్ణయంలోనూ, అమలులోనూ నాయకత్వం సమన్వయపూరితంగా ఉండాలని కోరడం చేస్తూ ఉండాలి.

ఉద్యమంలో చీలికలు తేవడానికి పాలకవర్గాలు, ప్రత్యర్థులు, అంతర్గత శక్తులు సాగిస్తున్న ప్రయత్నాలు ఇవాళ్టి మరొక సవాలు. ఉద్యమ స్వభావం వల్లనే ఇందులో అన్ని వర్గాల, అన్ని సమూహాల ప్రజలు పాల్గొంటారు. అందువల్ల భిన్న వర్గాలకు, సమూహాలకు, ప్రయోజనాలకు చెందిన నాయకులను, ప్రజలను చీల్చడం ప్రత్యర్థులకు సులభమవుతోంది. అంతర్గతంగా కూడ చీలికలకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఇటువంటి విశాలమైన ప్రాంతీయ ఉద్యమంలోకి ప్రాంతవాసులైన వారందరూ – వారి వారి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, వర్గ, మత, కుల, స్త్రీపురుష, వయో భేదాలతో నిమిత్తం లేకుండా, ఆ భేదాలను పక్కనపెట్టి – వస్తారు. ఇన్ని రకాల వాళ్లు ఉండడం ఇటువంటి ఉద్యమపు బలమూ బలహీనతా కూడ. ఇన్ని రకాలవాళ్లు ఉండడం ఉద్యమానికి గొప్ప శక్తినీ, వైవిధ్యాన్నీ, ప్రజాస్వామికతనూ ఇస్తుంది. అదేసమయంలో ఇన్ని రకాల వాళ్లు ఉండడం వల్ల ఏ క్షణమైనా ఈ ఐక్యత భగ్నమయ్యే అవకాశమూ ఉంటుంది. ఏదయినా ఒక వర్గ, బృంద ప్రయోజనాలు నెరవేర్చి, నెరవేరుస్తామని ఆశపెట్టి ఉద్యమాన్ని చీల్చడానికి ప్రత్యర్థులు, పాలకులు ప్రయత్నించడానికి అవకాశం దొరుకుతుంది. తమ ప్రయోజనాలు నెరవేరాకగాని, నెరవేరాయని నమ్మిగాని ఏదయినా ఒక బృందం ఉద్యమం నుంచి చీలిపోయే అవకాశం ఉంటుంది.

ప్రపంచ చరిత్రలో విశాల ఉద్యమాలన్నీ ఈ చీలికల సవాలును ఎదుర్కొన్నాయి. ఐక్యంగా ఉండడం, ఐక్యత కొరకు ఇతోధిక ప్రయత్నాలు చేయడం, ఐక్యత కొరకు పట్టువిడుపులకు సిద్ధపడడం ద్వారా మాత్రమే ఈ సవాలును అధిగమించడం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమం కూడ అటువంటి ఐక్యతా ప్రయత్నాలను ముమ్మరం చేసి, చీలిక సవాలును అధిగమించవలసిఉంది. ఇంకా ఎక్కువ శక్తులను ఆకర్షించడం, సమీకరించడం, మిగిలిన విషయాలలో ఘర్షణ, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఏకైకలక్ష్యం పునాదిగా బలమైన ఐక్యత సాధించడం ఇవాళ తెలంగాణ ఉద్యమ శక్తుల కర్తవ్యం.

ఈ క్రమంలోనే ఉద్యమ శ్రేణులను, నాయకులను చీల్చడానికి మాత్రమే కాక, కొనివేయడానికి, మాట్లాడకుండా చేయడానికి కూడ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. పదవుల ఆశ చూపి, డబ్బులు ఎరవేసి, పార్టీల కట్టుబాట్లు చూపి నాయకులను, శ్రేణులను తెలంగాణ ఉద్యమం నుంచి దూరం చేయడానికి ప్రధాన రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయి.  విశాలమైన ప్రజా ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇలా ఏదో ఒక సాకుతో దూరం కావడం ఉద్యమానికీ, ప్రజలకూ ద్రోహం చేయడమేననే స్పష్టతతో ద్రోహులను ఎండగట్టడం, వారిని మిగిలిన తెలంగాణ సమాజం నుంచి వేరుచేసి చూపడం, వారు అంతిమంగా ఉద్యమంలోకి రావడానికి, కనీసం తటస్థంగా ఉండడానికి సహకరించడం ఇవాళ ఉద్యమకారుల బాధ్యత.

తెలంగాణ ఉద్యమం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లన్నిటిలోకీ ముఖ్యమైనదీ, కష్టతరమైనదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగించబోతున్న అణచివేత, దమననీతి. పోలీసు కాల్పులలో 370 మందిని బలి తీసుకుని, నెలల తరబడి 144 సెక్షన్, కర్ఫ్యూలు, నిషేధాజ్ఞలు విధించి 1969 ఉద్యమాన్ని అణచివేసినట్టుగానే ప్రస్తుత ఉద్యమాన్ని కూడ అణచివేయవచ్చునని పాలకులు ఆలోచిస్తున్నారు. ఈ దమనకాండ ఆలోచనలకు ఎన్నో సూచనలున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుండగానే డిసెంబర్ 27న ఇ ఎస్ ఎల్ నరసింహన్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. జనవరి 22న ఆయననే పూర్తికాలపు గవర్నర్ గా మార్చారు. మాజీ పోలీసు అధికారిగా, చత్తీస్ గడ్ గవర్నర్ గా ప్రజా ఉద్యమాల అణచివేతలో శిక్షణ, అనుభవం ఉన్న వ్యక్తిని గవర్నర్ గా నియమించడం తెలంగాణ ప్రజాఉద్యమంపై దమననీతిని అమలు చేయడానికే. గవర్నర్ గా ఎవరిని నియమించాలనే విషయంలో మార్గదర్శక సూత్రాలేవీ లేకపోయినప్పటికీ, సాధారణంగా రాజకీయవాదులనే, క్రియాశీల రాజకీయజీవితం ముగిసి, విశ్రాంత జీవితం గడుపుతున్న వాళ్లనే నియమించడం ఆనవాయితీ. రాష్ట్రవిభజన ఉద్యమం ఉధృతంగా సాగుతూ, కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియ ప్రారంభమయిందని ప్రకటన కూడ చేసిన తర్వాత తలెత్తే సమస్యలకు తప్పనిసరిగా రాజకీయ పరిష్కారాలే ఉంటాయి గనుక గవర్నర్ పదవిలో రాజకీయ వ్యక్తినే నియమించాలి. కాని అటువంటి స్థితిలో పోలీసు అధికారిని నియమించడమంటే తప్పనిసరిగా ఉద్యమ అణచివేతకు సంకేతాలు పంపినట్టే.

ఆ పోలీసు అధికారి – గవర్నర్ పదవి చేపట్టిన నాటినుంచీ, రాష్ట్రంలో రాజకీయ నాయకత్వాన్ని కూడ పక్కనపెట్టి విధాన నిర్ణయాలు, సంప్రదింపులు జరుపుతూ ఒకరకంగా రాష్ట్రపతి పాలన ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన గవర్నర్ గా వచ్చిననాటినుంచీ తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టుల పాత్ర గురించి అధికారవర్గాలు, కాంగ్రెస్ రాజకీయనాయకులు కూడ మాట్లాడడం ఎక్కువయింది. మావోయిస్టుల బూచి చూపి ఉద్యమం మీద అణచివేత సాగించడానికి సన్నాహాలు మొదలయినట్టు కనబడుతోంది. ఇప్పటికే రాపిడ్ ఆక్షన్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వంటి కేంద్ర బలగాలను, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి పోలీసు బలగాలను, గ్రేహూండ్స్ వంటి రాష్ట్రస్థాయిలో కరడుగట్టిన అణచివేత బలగాలను దించడం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇటువంటి ప్రత్యేక బలగాలను మోహరించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపడితే ఆ తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడ వెళ్లి అణచివేత బలగాలను దింపుతానని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నది. విద్యార్థులమీద, ఆందోళనకారులమీద కేసులు ఉపసంహరిస్తామని కేంద్రహోం మంత్రి ప్రకటించి మూడునెలలు గడిచినా ఒక్క కేసు కూడ ఉపసంహరించలేదు సరిగదా మరికొన్ని వేల కొత్త కేసులు బనాయించారు. కొంతమంది పోలీసు అధికారులు విద్యార్థుల మీద కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారని, వారిమీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవహక్కుల సంఘం నిర్దేశించినా రాష్ట్రప్రభుత్వం ఖాతరు చేయలేదు. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తున్న మావోయిస్టు పార్టీ అగ్రనాయకులను ఎక్కడో పట్టుకుని, ఎన్ కౌంటర్ పేరిట కాల్చిచంపి తెలంగాణ ఉద్యమ కారులకు హెచ్చరిక చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ దమననీతికంతా పరాకాష్ట.

ఈ అణచివేత సవాలును కూడ తెలంగాణ ఉద్యమం తీసుకోవలసినంత తీవ్రంగా తీసుకుంటున్నట్టులేదు. అణచివేత ప్రతిఘటనకు దారితీస్తుందనే సాధారణ సూత్రం సరైనదే గాని, ఆ ప్రతిఘటనకు మార్గదర్శకత్వం వహించే, సమన్వయం చేసే ఆలోచనలు, శక్తులు లేకపోతే ప్రతిఘటన దానంతట అది సరయిన దారిలో నడవదు. ఆ ప్రతిఘటనను సమరశీల పోరాటరూపాలలోకి, విస్తృతిలోకి తీసుకుపోకపోతే అణచివేత తాత్కాలిక విజయాన్ని కూడ సాధించవచ్చు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందనే మాట నిజమే గాని, న్యాయ పోరాటాన్ని కూడ పశుబలం తాత్కాలికంగా ఓడించగలుగుతుంది. ఆ పశుబలాన్ని, ప్రత్యర్థులు పన్నుతున్న దమనకాండను సరిగా అర్థం చేసుకుని, ప్రతిఘటించే చైతన్యాన్ని ఉద్యమంలో భాగం చేసినప్పుడే ఉద్యమానికి విజయం చేకూరుతుంది.

ఈ తక్షణ సవాళ్లకు తోడు దీర్ఘకాలికంగా పరిష్కరించవలసిన మరొక సవాల్ కూడ ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనతో అన్ని సమస్యలు సమసిపోతాయని, అది ఒక మంత్రదండంలాగ తమను స్వర్గంలోకి తీసుకుపోతుందని చాలమంది ప్రజలు అమాయకంగా నమ్ముతున్నారు. ఇవాళ ఉన్న అన్ని సమస్యలకు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రమే కారణమని, అది తొలగిపోగానే చదువులు, ఉద్యోగాలు, నీళ్లు, కరెంట్, హక్కులు, అవకాశాలు, సమానత్వం వాటంతట అవే వస్తాయని ఆశిస్తున్నారు. అటువంటి స్వర్గతుల్యమైన మార్పులు జరగబోవని, జరగడానికి అవకాశం లేదని తెలిసిన నాయకత్వం కూడ ఆ విషయాలు చెప్పడం లేదు. ఎక్కువ ఎక్కువ సమైక్య రాష్ట్రంలో జరుగుతున్న వనరుల దోపిడీకి, విద్యా, ఉద్యోగ అవకాశాలలో వివక్షకు స్థానం తొలగిపోతుంది. ఆతర్వాత మిగిలిన సమస్యల పరిష్కారం కొరకు ఇప్పటికన్నా తీవ్రతరమైన పోరాటమే చేయవలసి ఉంటుంది. ఈ అవగాహనను ఇప్పటినుంచే కల్పించకపోతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోపు పెద్ద ఎత్తున నిరాశా నిస్పృహలు అలముకుంటాయి. అది సాంస్కృతిక జీవనానికే ప్రమాదం తెస్తుంది. ఈ దీర్ఘకాలిక దృష్టితో ఈ సవాల్ ను కూడ ఎదుర్కోవడం ఇవాళ్టి అవసరం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu, Veekshanam. Bookmark the permalink.

7 Responses to తెలంగాణ ఉద్యమం – కొత్త సవాళ్లు

 1. chavakiran says:

  >> ఆతర్వాత మిగిలిన సమస్యల పరిష్కారం కొరకు ఇప్పటికన్నా తీవ్రతరమైన పోరాటమే చేయవలసి ఉంటుంది

  ఆ పోరాటం ఏదో కలిసి ఉండే చెయ్యమని చెప్పవచ్చు కదా, లేదా ప్రత్యేక దేశం కోసం పోరాటం చెయ్యవచ్చు కదా, అప్పుడు దోపిడీ పూర్తిగా దొబ్బిపోతుంది.

 2. ఓబుల్ రెడ్డి says:

  ప్రత్యేక తెలంగాణ రాదు. ఆంధ్రావాళ్ళు రానివ్వరు. ఒకవేళ just before 2014 లో పార్లమెంటులో బిల్లు పెట్టి ఎట్లనో నెగ్గించినా కూడా “ప్రత్యేక” తెలంగాణా ఏర్పడ్డం కష్టం. ఆ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోను అనుకున్నట్టుగా అమలు జరగదు. ఎందుకంటే ఆంధ్రప్రాంతంలో రాజధానీనగరం ఏర్పాటుకు సమయం పట్టుద్ది కాబట్టి ఆ తరువాత పదేళ్ళ పాటు ఆంధ్రరాజధాని హైదరాబాదులోనే కొనసాగించాలని నిర్ణయమవుతుంది. ఈ లోపల జనాల మనసు మారిపోయే అవకాశం పెచ్చు. ఎక్కువ వివరించదల్చుకోలేదు. కానీ నా అంచనాలో – ఆంధ్రప్రదేశ్ ని రెండుముక్కలు చేసే ఏ సక్సెస్‌ఫుల్ ప్రయత్నమైనా సబ్‌సీక్వెంట్‌గా తెలంగాణ కూడా రెండుముక్కలు కావడానికి దారితీసే అవకాసం ఉంది.

 3. జనాభాలోనూ, విస్తీర్ణంలోనూ ఆంధ్ర ప్రదేశ్ కంటే చిన్నవైన దేశాలు ఉన్నాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ ని రెండు చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే తప్పా?

  • chavakiran says:

   >>జనాభాలోనూ, విస్తీర్ణంలోనూ ఆంధ్ర ప్రదేశ్ కంటే చిన్నవైన దేశాలు ఉన్నాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ ని రెండు చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే తప్పా?
   అదే లాజిక్ తో అయితే శ్రీకాకుళాన్ని ప్రత్యేక దేశం చెయ్యాలి. చేసేద్దామా?
   (నీ నోట్లో నోరు పెట్టకూడదని ఇంతకు ముదోసారి అనుకున్నా, కానీ ఈ పాలికి టెంప్టైపొయ్యా, ఇహ నన్ను ఆ దేవుడే కాపాడాలని తెలుసు)

 4. ఓబుల్ రెడ్డి says:

  ఈ చెరసాల శర్మ పేరేంటయ్యా బాబూ ఛండాలంగా ? ఇదివరకు ప్రవీణ్ శర్మ పేరుతో రాసేవాడివని జ్ఞాపకం. అదే బావుంది. ఇహనైనా ఈ పేరు మానుకోవయ్యా బాబూ ! ఏమీ అనుకోవద్దు. చదవడానికే దరిద్రంగా ఉంది.

 5. నెల్సన్ మండేలా చెరసాల (జైలు)కి వెళ్ళలేదా? దేశభక్తులు ఎవరైనా చెరసాల అనేది వినకూడని పదం అనుకోరు.

 6. Sridhar says:

  Nenu Karimnagar vanni. Telangana anedi oka Pedda kutra. Velamalu power kosam sagiatunna an intelligent coup idi. Telangana lone enni diff. levu. Karimnagar slang ki nalgonda slang ki sambadham ledu. Karmnagarodiki nizamabad ante padadu. Telangana lone okko dist okko rakanga develop aindi. Appudu each dist oka state aina

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s