వాళ్లే ఎందుకు గెలవాలి?

(ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ, జూన్ 22, 2010)

ముందే ఒక మాట స్పష్టం చేయాలి. ఈ దేశంలో కొనసాగుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల వ్యవస్థ మీద నాకేమీ గౌరవం లేదు, కనీసమైన నమ్మకం కూడ లేదు. ఇది నిజంగా ప్రజాస్వామ్యం కాదనీ, ఆ పేరుతో ఊరేగుతున్న తోలుబొమ్మలాట అనీ నా నిశ్చితాభిప్రాయం.

ప్రజాస్వామ్యానికి మూలధాతువు ఎటువంటి బలవంతమూ, నిర్బంధమూ లేని స్వేచ్ఛాయుతమైన ఎంపిక. మరి సమానత్వం లేనిచోట, వ్యక్తిస్వేచ్ఛ లేనిచోట, అసలు మనిషి ఇంకా వ్యక్తిగా ఎదగనిచోట, కుటుంబం, కులం, మతం, మద్యం, డబ్బు, ఆకర్షణలు, వగైరాల కింద మనిషి అణగిపోతున్నచోట స్వేచ్ఛాయుతమైన ఎంపిక అమలయ్యే అవకాశం లేదు. అంటే ఎన్నికలలో నిజమైన ప్రజాభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం చాల తక్కువ. అందువల్ల సమానత్వం, వ్యక్తిస్వేచ్ఛ నెలకొనేవరకూ ఎన్నికల ప్రజాస్వామ్యం అసమగ్రమే అవుతుంది. అందులోనూ పార్లమెంటరీ తరహా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటుకట్టిన మొక్కే అవుతుంది. సహజమైన ఫల పుష్ప భరితమైన హరిత లత కాజాలదు. ఎక్కువలో ఎక్కువ అది బోన్ సాయి మొక్క అవుతుంది. అది మర్రి చెట్టులాగే కనబడుతుంది, ముదురాకు పచ్చరంగులో మర్రి ఆకులు కూడ కనబడతాయి. కాని ఆ మర్రి చెట్టు అరవై సంవత్సరాల తర్వాత కూడ అడుగున్నరకు మించి మిల్లీమీటరు పెరగదు. ఇక ఆ మర్రినీడలో మల్లెతీగల గురించి ఆలోచనకు వీలే లేదు. ఐదేళ్లకోసారో, ఇంకా తొందరగానో ఎన్నికలు జరిగినట్టే ఉంటాయి, ప్రజాభిప్రాయం వ్యక్తమయినట్టే ఉంటుంది. అదేమిటో పాపం, ప్రజలు ఎప్పుడూ తమకు అన్యాయం చేసేవారినీ, ద్రోహం చేసేవారినీ ఎన్నుకుని తమ అభిమతాన్ని ప్రకటిస్తుంటారు! ఇదీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం! ఇవీ ఈ దేశంలో ఎన్నికలు!

ఎన్నికల రాజకీయాల మీద అటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ, తెలంగాణలో పది శాసనసభ స్థానాలకు ఇంకొక నాలుగు వారాలలో జరగనున్న ఉపఎన్నికల గురించీ, ప్రజాభిప్రాయ ప్రకటన గురించీ మాట్లాడవలసి ఉంది. ఒక విస్తృత ప్రజా ఉద్యమం నడిచిన తర్వాత, గ్రామాలలోనూ, పట్టణాలలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగి, ప్రజలు అనేక పోరాట రూపాలతో తమ అభిప్రాయాన్ని ప్రకటించిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. అరకొర ప్రజాస్వామ్యం అమలవుతున్న మన దేశంలో కూడ, ఎన్నికలలో ఎంతోకొంత ప్రజాభిప్రాయం వ్యక్తం కావడానికి అవకాశం వచ్చే అరుదయిన సందర్భం ఇది. నిజానికి 1971 పార్లమెంటు ఉప ఎన్నికల నుంచి, 2009 శాసనసభ సార్వత్రిక ఎన్నికల దాకా ఇటువంటి ప్రజాభిప్రాయం వ్యక్తమయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించే అభ్యర్థులే ఎన్నికయ్యారు. మరి ఈ ఎన్నికలలో ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుందని అనుకునే వారు ఆ అభిప్రాయాన్ని ఎందుకు గౌరవించలేదో తమను తాము ప్రశ్నించుకోవలసి ఉంది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉప ఎన్నికలు అనే కొత్త అంకం ప్రారంభమయి కొన్నాళ్లయింది. కచ్చితంగా చెప్పాలంటే ఫిబ్రవరిలో మొదలయి ప్రస్తుతం శిఖరాగ్రానికి చేరింది. గత ఐదు నెలలుగా తెలంగాణ ఉద్యమంలో ‘శాసనసభ్యుల రాజీనామాలు అర్థవంతమైన వ్యూహమేనా’, ‘రాజీనామా చేసినందువల్ల తెలంగాణ వస్తుందా’, ‘రాజీనామాలు త్యాగానికి సూచనా’, ‘రాజీనామాలు చేయకపోవడం ద్రోహానికి చిహ్నమా’, ‘రాజీనామా చేస్తే అడిగేవాళ్లు కూడ లేకుండా పోతారు గదా’, ‘వాళ్లు రాజీనామా చేయకుండా మేం ఎందుకు రాజీనామా చేస్తాం’ లాంటి అనేక ప్రశ్నలతో, తర్కాలతో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ చర్చలో అటూ ఇటూ కూడ అతివాదాలూ, వక్రీకరణలూ, కుతర్కాలూ, ‘మాదంతా ఒప్పు, అవతలివాళ్ళదంతా తప్పు’ లాంటి బుకాయింపులూ, తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లనే పిడివాదమూ వినబడుతున్నాయి.

మొదట శాసనసభ్యుల రాజీనామా అనే వ్యూహం ఎక్కడ మొదలయి, ఏయే మలుపులు తిరిగి, ఎంత దూరం వచ్చిందో చూస్తే గాని ఈ చర్చకు అర్థం ఉండదు. తెలంగాణ శాసనసభ్యుల రాజీనామా ఆలోచన నిజానికి తెలంగాణలో పుట్టలేదు. డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన తర్వాత కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యుల రాజీనామాల దగ్గర ఇది మొదలయింది. డిసెంబర్ 23 ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసిన తర్వాత, ఆ పరిణామానికి కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యుల రాజీనామాల బెదిరింపులే ప్రధాన కారణమనే అభిప్రాయం తెలంగాణలో విస్తృతంగా వినిపించింది. అవతలివాళ్లు రాజీనామా హెచ్చరికతో ఒక నిర్ణయాన్ని మార్చగలిగితే, మనం కూడ అదే ఆయుధాన్ని వాడి మళ్లీ నిర్ణయాన్ని మార్చవచ్చునేమో అని కొందరయినా అనుకున్నారు. అప్పటి ఉద్రిక్త వాతావరణంలో ఈ ఆలోచన బలపడి, బలప్రదర్శన దాకా సాగింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల మృతదేహాల దగ్గర ఉద్విగ్న ప్రకటనలతో ఇది ఇంకా వేడెక్కింది.

అయితే ఇక్కడ ఆలోచించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యుల రాజీనామాలు ఉత్తుత్తి బెదిరింపులే గాని, నిజంగా ఆమోదిస్తామంటే ఎంతమంది రాజీనామాకు కట్టుబడి ఉండేవారో తెలియదు. కనుక ఆ ఆయుధానికి నిజమైన పరీక్ష ఏమీ రాలేదు. అలా పరీక్షకు గురికాని ఆయుధాన్ని, గెలిచిన ఆయుధంగా భావించి ఇక్కడ వాడుకుందామనే ప్రయత్నం జరిగింది.

రెండు, డిసెంబర్ 23 పిల్లిమొగ్గ కేవలం రాజీనామా బెదిరింపు వల్లనే జరగలేదు. డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయమని తెలంగాణ నుంచి తగినంత ఒత్తిడి లేనందువల్ల, తెలంగాణ వాదుల మౌనాన్ని ఆసరా చేసుకుని, ఆ పన్నెండు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు ఢిల్లీ స్థాయిలో సాగించిన ప్రయత్నాల ఫలితంగా ఆ మార్పు జరిగింది. ఆ మార్పులో సూట్ కేసుల పాత్రా ఉంది, మన్మోహన్ సింగ్ నమ్మే భావజాలపు పాత్రా ఉంది, హైదరాబాద్ మీద కన్నువేసిన బహుళజాతి సంస్థల ఒత్తిడీ ఉంది, తెలంగాణ గళాన్ని సరిగా వినిపించలేకపోయిన అశక్తత పాత్రా ఉంది. అందువల్ల రాజీనామాలకూ డిసెంబర్ 23కూ ముడిపెట్టి, అటువంటి రాజీనామాలే మరొక మార్పు తీసుకువస్తాయని అనుకోవడం అమాయకత్వం.

మూడు, ఒకచోట ఒకసారి విజయం సాధించిన ఎత్తుగడ మరొకసారి మరొకచోట అటువంటి విజయమే సాధిస్తుందనే హామీ ఏమీలేదు. స్థలకాలాల మార్పును బట్టి ఆయుధాల శక్తి మారుతుంది. ఒకవేళ రాజీనామాల వల్లనే సమైక్య వాదులు విజయం సాధించారని అనుకున్నా, రాజకీయ వ్యూహ చతురులకు ఆయుధాల వాడకంలో స్థలకాలాల స్పృహ, పట్టువిడుపులు ఉండవలసింది.

నాలుగు, ఇంత చెప్పినా, శాసనసభ్యుల రాజీనామాలు శక్తివంతమైన ఆయుధమే. నిజంగానే శాసనసభ్యులు రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభానికీ, రాజ్యాంగ సంక్షోభానికీ కూడ దారితీయగల శక్తి ఉంది. కాని తెలంగాణలోని మొత్తానికి మొత్తం శాసనసభ్యులు, కనీసం ఈ ప్రాంత శాసనసభ్యులలో సగానికన్న ఎక్కువమంది రాజీనామా చేస్తే నిజంగానే తెలంగాణ విషయంలో కేంద్రం నిర్ణయాత్మక వైఖరి ప్రకటించవలసి వచ్చేది. అప్పుడు రాజీనామా అనేది చాల బలమైన ఆయుధమయ్యేది. నిజానికి ఇది పెద్ద సమస్య కాదు. 2009 ఎన్నికలలో అన్ని పార్టీలూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించాయి గనుక, చివరికి డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశంలో కూడ తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపాయి గనుక, వాళ్లను రాజీనామా చేయమని అడగడం న్యాయమైన కోరికే అయిఉండేది. రాజీనామా చేయడం వాళ్ల నైతిక బాధ్యత అయి ఉండేది. కాని రాజీనామా తామే ముందు చేసి, ఇతరులను ఇరుకున పెట్టాలని అనుకోవడం వల్ల అసలు ఆలోచనకే గండి పడింది.

అందరూ రాజీనామాలు చేయకపోవడం వల్ల చేసిన పన్నెండు రాజీనామాల ప్రభావం ఏమీ లేకుండా పోయింది. అందరూ రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం వచ్చి, డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయవలసి వచ్చేది, తెలంగాణ రాష్ట్రం వచ్చేది. అప్పుడు కొత్త రాష్ట్రంలో తొలి ఎన్నికలయినా జరిగేవి, లేదా, మధ్యే మార్గంగా (1953లో ఆంధ్ర లో జరిగినట్టు) 2009 ఎన్నికలలో గెలిచినవారితోనే శాసనసభ ఏర్పడేది. కాని కొందరే రాజీనామాలు చేయడం వల్ల తెలంగాణ రాకపోగా ఉపఎన్నికలు వచ్చాయి.

ఉపఎన్నికలు వచ్చాయి గదా అని మళ్లీ అందరూ అన్ని పార్టీల అభ్యర్థులు గోదా లోకి దిగుతున్నారు.

ఇది పూర్తిగా అనైతికం. 2009 మే లో ఆయా స్థానాలకు ఎన్నికయిన వాళ్లు ఐదు సంవత్సరాల కొరకు ఎన్నికయ్యారు. ఏడాది కూడ నిండకుండానే, ఒక ఆశయంతో, అది కూడ ఈ పార్టీలన్నీ ఆమోదించే ఆశయంతోనే, తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ రాజీనామా ఎత్తుగడతో ఎంత విభేదం ఉన్నప్పటికీ, 2009 విజయం దృష్ట్యానైనా, రాజీనామా కారణంతో తమకు కూడ ఏకీభావం ఉన్నందువల్లనైనా మిగిలిన అభ్యర్థులందరూ ఆ స్థానాలను పాత అభ్యర్థులకే వదిలిపెట్టవలసి ఉంది.

నిజానికి రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి స్థానంలో ఉన్నారు గనుక పోటీ లేకుండా గెలిపించాలని పి వి నరసింహారావు మీద నంద్యాలలో ఏ పార్టీ కూడ పోటీ పెట్టగూడదనే ఆలోచన వచ్చింది. అలాగే, ప్రతిభాభారతి శాసనసభ స్పీకర్ గా ఉన్నప్పుడు స్పీకర్ ను గౌరవించే ఉద్దేశంతో ఆమె మీద పోటీ పెట్టవద్దని చంద్రబాబు నాయుడు ఇతర పార్టీలను కోరారు. నిజానికి ఆ రెండు సందర్భాల కన్న సముచితమైన సందర్భం ఇప్పటి ఉపఎన్నికలది. రాజీనామా నిర్ణయం తప్పు అని అనుకున్నప్పటికీ, రాజీనామాలకు పునాది ఐన ఆలోచనతో ఎవరికీ విభేదం లేదు గనుక రాజీనామా చేసిన శాసనసభ్యులనే తిరిగి గెలిపించడానికి ప్రయత్నించవలసి ఉంది.

ప్రజాస్వామ్యంలో ఎవరినీ పోటీ చేయగూడదని అనే హక్కు ఎవరికీ లేదని చాలమంది ధర్మపన్నాలు వల్లిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమయితే ఫజల్ అలీ నివేదిక నాటి నుంచి డిసెంబర్ 9 ప్రకటన దాకా ఆ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందో అడగవలసి ఉంది. అయినా ఈ ఎన్నికలు ఒక ప్రత్యేక సందర్భంలో జరుగుతున్నాయనే విషయం గుర్తు చేయవలసి ఉంది.

ఏమయినా, చరిత్ర మనం చర్చించుకున్నట్టు, తర్కించుకున్నట్టు నడవదు, నడవలేదు. తెలంగాణ శాసనసభ్యులు, తెలంగాణలోని అన్ని పార్టీలు నవంబర్ 29 నుంచి ఫిబ్రవరి మధ్య వరకూ ప్రవర్తించిన తీరు వేరు, ఆ తర్వాత ప్రవర్తిస్తున్న తీరు వేరు. అందరూ తెలంగాణ కోసమే ఉన్నామంటారు, ఇంత మంది కోరుకుంటున్న తెలంగాణ మాత్రం ఇంకా ఇంకా వెనక్కి వెనక్కి జరుగుతోంది. ప్రతి ఒక్కరూ తమ మాటలవల్ల, చేతలవల్ల తెలంగాణ ఆశయం ఎలా తూట్లు పడుతున్నదో గ్రహించకుండా అవతలివాళ్ళ మీద నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆరోపణల ప్రత్యారోపణల పర్వంలో వాస్తవాలు కనుమరుగయిపోతున్నాయి. కనీసం ఒక వాస్తవాన్ని గుర్తు తెచ్చుకోవాలి: ఇప్పుడు ఎన్నికలు జరగవలసిన పన్నెండు (లేదా జరుగుతున్న పది) శాసనసభ స్థానాలు సాధారణ అర్థంలో 2009 మేలో కొందరు శాసనసభ్యులను ఎన్నుకున్నాయి. వారికి 2014 మే దాకా ఆ స్థానాలకు ప్రాతినిధ్యం వహించే హక్కు, అధికారం ఉన్నాయి. మధ్యలో వచ్చిన రాజీనామాలు ఒక అసాధారణ స్థితి వల్ల వచ్చినవే. ఆ అసాధారణ స్థితిని రద్దు చేయాలంటే 2010 జులై ఉప ఎన్నికలలో అసాధారణ పరిణామాలు జరగవలసిందే.

– ఎన్ వేణుగోపాల్

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telangana, Telugu. Bookmark the permalink.

2 Responses to వాళ్లే ఎందుకు గెలవాలి?

  1. mutyam says:

    aaapandraa baabu, sollu kottakandi. ilaa article raase vaallu ekkuvayyaaru gaaani idey vedi continue chese vaadu okadu ledu

  2. namdikeswar says:

    అవును వీళ్ళల్లో ఒక్కరుకూడా గెలవకూడదు…గెలిస్తే మళ్ళీ గెలవటానికి రాజీనామాలు చేస్తారు, ప్రజలకోసం కాదు, వీళ్ళల్లో ఒక్కరుకూడా పూర్తిగా ఐదు సం// పదవిలో ఉంటే ఒక్కరు కూడా తిరిగి గెలవలేరు అందుకని, మద్యలో రాజీ నామాలిచ్చి ప్రజలకి నామాలు పెడుతుంటారు.వీలైతే మీరు నిలబడండి మేము తప్పక వోటేస్తాము.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s