తెలంగాణ ఉద్యమ పురోగతిలో విద్యార్థుల పాత్ర

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నవంబర్ 29 నుంచి ఒక కీలకదశలోకి ప్రవేశించి డిసెంబర్ 9 కేంద్రప్రభుత్వ ప్రకటనతో దాదాపు విజయాన్ని సాధించింది. ఆ విజయాన్ని వమ్ముచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు, అన్ని రాజకీయ పక్షాలు అనేక రకాల కుట్రలు పన్నుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి, వాయిదావేయించడానికి అత్యంత దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ఉపయోగిస్తున్నాయి. ఏ ఒక్కరి మీద నమ్మకం ఉంచలేని ఈ స్థితిలో కొంతవరకు నిరాశకు లోనవుతున్న తెలంగాణ ప్రజానీకం విద్యార్థులవైపే ఆశగా చూస్తున్నారు. ప్రస్తుత ప్రతిష్టంభన నుంచి ఉద్యమాన్ని కొత్త దశకు తీసుకుపోగలిగిన శక్తి విద్యార్థులకే ఉందని నమ్ముతున్నారు.

విద్యార్థులు తమంతట తామే ఒక విప్లవశక్తి కాగలరా, సామాజిక పరిణామాన్ని సాధించగలరా, సామాజిక ఉద్యమాలను ముందుకు తీసుకుపోగలరా అని 1960ల చివరి నుంచీ కూడ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మార్క్సిస్టు సంప్రదాయంలో ఈ చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఫ్రాన్స్, అమెరికా, మెక్సికో, అర్జెంటీనా, భారతదేశం, ఆగ్నేయాసియా వంటి అనేకచోట్ల 1960ల చివరలో విద్యార్థులు నిర్వహించిన ఉత్తేజకర పోరాటాల నేపథ్యంలో ఈ చర్చ మొదలయింది. ఇక నుంచి కార్మికవర్గానికి విప్లవశక్తి లేదని, విద్యార్థుల వంటి ఇతర సామాజిక బృందాలకే విప్లవశక్తి ఉందని రుజువయిందని కొందరు మేధావులు వాదించారు. విద్యార్థులు ఒక వర్గంగా వ్యవస్థను ధిక్కరిస్తున్నారని, ఇక పాతకాలపు మార్క్సిస్టు కార్మికవర్గ విప్లవానికి కాలం చెల్లిందని కూడ వాళ్లు అన్నారు. అప్పటినుంచీ సామాజిక పరిణామంలో విద్యార్థుల పాత్ర పెద్ద చర్చనీయాంశం అయింది.

విద్యార్థులకు రాజకీయాలు వద్దనే సాంప్రదాయిక వాదులు, విద్యార్థులకు మాత్రమే సామాజిక పరివర్తనా రాజకీయాలు నడిపే శక్తి ఉందని వాదించే తీవ్రవాదులు ఇప్పటికీ ఉన్నారు. కాని విశాల సమాజంలో విద్యార్థులు ఒక భాగం మాత్రమే. ఒక సమగ్ర దృక్పథంతో జరిగే సామాజిక ఉద్యమాలలో విద్యార్థులు అంతర్భాగంగానే పాల్గొంటారు. వారు సమాజాన్ని విడిచి ఒంటరిగా పోరాడడం సాధ్యం కాదు, అలాగే సమాజం పోరాడుతున్నప్పుడు దూరంగా ఉండడమూ సాధ్యం కాదు. ఐతే సామాజిక పోరాటాలలో విద్యార్థుల పాత్రకు ఒక విశిష్టత ఉంటుంది. వారి వయసు వల్ల, ఉద్వేగాల వల్ల, ఆదర్శాల వల్ల, త్యాగనిరతి వల్ల, స్వార్థ ప్రయోజనాలేమీ ఉండనందువల్ల విద్యార్థుల పోరాటాలు సహజంగా, స్వచ్ఛంగా, సమరశీలంగా, ధర్మాగ్రహంతో, సంఘటితంగా ఉంటాయి. ఏ లక్షణాలయితే ఏ సామాజిక పోరాటాన్నయినా ఉధృతం చేయగలుగుతాయో, శక్తిమంతం చేయగలుగుతాయో ఆ లక్షణాలు విద్యార్థులలో చాల ఎక్కువగా ఉంటాయి. స్వచ్ఛత, సమరశీలత, ధర్మాగ్రహం, సంఘటిత ఆచరణ అనే ఆ లక్షణాలే విద్యార్థుల పోరాటాలకు విలక్షణత్వాన్ని సంపాదించి పెడతాయి. అందువల్లనే కార్మిక పోరాటాలతో సమానంగానూ, అంతకన్న ఎక్కువగానూ విద్యార్థి పోరాటాలు గౌరవాదరాలు పొందుతాయి.

సరిగ్గా 1960ల చివర ప్రపంచవ్యాపిత విద్యార్థి సంచలనాలు జరుగుతున్నపుడు ఆ సంచలనాల ధ్వనులూ, ప్రతిధ్వనులూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడ వినిపించాయి. అప్పటికి తెలంగాణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటే ఉండేది. తర్వాత గడిచిన నలభై ఏళ్లలో ఇంకొక నాలుగైదు విశ్వవిద్యాలయాలు ఏర్పడి ఉస్మానియా పరిధి తగ్గిపోయినప్పటికీ అన్ని విశ్వవిద్యాలయాలూ కలిసిన తెలంగాణ విద్యార్థి సమూహం ఇవాళ మళ్లీ శిరమెత్తి, గళమెత్తి లేచినిలిచింది. ఆ విద్యార్థి సమూహం 2009 నవంబర్ 29 నుంచి గడిచిన మూడునెలలలో అత్యద్భుతమైన పాత్రను పోషిస్తున్నది.

ఈ ఉద్యమం ఒక సమగ్ర సామాజిక పరిణామంలో భాగమో, వ్యవస్థమీద మౌలిక పోరాటమో కాకపోవచ్చు. కాని కొనసాగుతున్న అన్యాయంమీద, వివక్షమీద విద్యార్థులు తమ ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు. గొప్ప సంఘటిత చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ క్రమంలో దారుణమైన అణచివేతను చవిచూస్తున్నారు. ప్రపంచీకరణ మొదలయ్యాక, విద్యార్థులు సమాజం గురించి పట్టించుకోవడం మానేశారనీ, తమ వృత్తి ఉద్యోగాల వేటలో పడిపోయారనీ అభిప్రాయాలు వెల్లువెత్తుతున్న సందర్భంలో తెలంగాణ విద్యార్థులు ఆ అభిప్రాయాలను సవాల్ చేశారు. సమాజం గురించి బహుశా మిగిలిన వాళ్లందరికన్న ఎక్కువ తీవ్రంగా ఆలోచించడం, ఆచరణలోకి దిగడం ప్రారంభించారు. సాంప్రదాయికంగా ప్రజాందోళనలకు నాయకత్వం వహించవలసిన రాజకీయ పక్షాల చేతినుంచి, ప్రజాసంఘాల చేతినుంచి, మేధావుల చేతినుంచి విద్యార్థులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ మూడునెలల్లో కనీసం అరడజను సందర్భాలలో విద్యార్థులే ఉద్యమానికి దారి చూపించారు. విద్యార్థిలోకంలో ఎన్ని రాజకీయ, సామాజిక అంతరాలున్నా అద్భుతమైన ఐక్యతను కనబరిచారు. కొత్త కొత్త పోరాటరూపాలను కనిపెట్టారు. గొప్ప క్రమశిక్షణను, త్యాగనిరతిని ప్రదర్శించారు.

ఈ ప్రశంసలకు అర్థం విద్యార్థుల ఉద్యమంలో ఏ లోపాలూ లేవని కాదు. తప్పనిసరిగా ఇంత ఉవ్వెత్తున ఉద్యమం సాగినప్పుడు కొన్ని పెడధోరణులు, అవాంఛనీయమైన వైఖరులు తలెత్తుతాయి. ఊళ్లూ బీళ్లూ ముంచేసే వరద వచ్చినప్పుడు కొంత చెత్త కూడ కొట్టుకువస్తుంది. కాని ఈ విద్యార్థి ఉద్యమ వెల్లువ స్వభామూ, సారమూ ఆ చెత్త కాదు. ప్రవాహమే ఈ వరద స్వభావం. స్వచ్చతే ఈ వరద స్వభావం. ఈ వరద స్వభావం సమరశీలమైన ఉరవడి. కొత్త ఒరవడి.

అన్ని రాజకీయ పక్షాలూ తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు మళ్లీ ఒకసారి ద్రోహం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నవేళ విద్యార్థి ఉద్యమంలోని ఈ స్వభావాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసి ఉంది. ఆ స్వచ్ఛమైన, సమరశీలమైన స్వభావమే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కాపాడగలుగుతుంది. విద్యార్థిలోకం ఆ స్వభావాన్ని మళ్లీ ఒకసారి ఉపయోగించవలసిన తరుణం వచ్చింది. మాటమార్చిన కేంద్రప్రభుత్వాన్ని, బహిరంగంగా తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మోసం చేయడానికి అవకాశం వెతుక్కుంటున్న రాజకీయ పక్షాలను, నంగి నంగిగా మాట్లాడుతున్న రాజకీయ నాయకులను, న్యాయ పక్షం వహించడానికి సందేహిస్తున్న తటస్థులను, అన్యాయాన్ని సమర్థించడానికి సాకులు వెతుక్కుంటున్న ప్రచార సాధనాలను – ఒక్కమాటలో తెలంగాణ వ్యతిరేకులందరినీ ఎదిరించే, ప్రతిఘటించే బాధ్యతను ఇవాళ చరిత్ర విద్యార్థుల మీద పెడుతున్నది. చారిత్రక కర్తవ్యాలను నెరవేర్చడంలో ఎల్లవేళలా అగ్రభాగాన నిలిచిన తెలంగాణ విద్యార్థులకు ఈ బాధ్యత తీర్చుకునే మార్గాలేమిటో చెప్పనవసరంలేదు. ఆ మార్గాల అన్వేషణే వారి నిత్యజీవితపోరాటాచరణ.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana. Bookmark the permalink.

3 Responses to తెలంగాణ ఉద్యమ పురోగతిలో విద్యార్థుల పాత్ర

  1. Rakesh says:

    Well said sir!

  2. ఓబుల్ రెడ్డి says:

    మీది అరణ్యరోదన.

  3. Yedukondalu says:

    Great article

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s