రవీ, నువ్వూ అస్తమిస్తావా?

మన కలల మీద కత్తులవాన కురుస్తున్నవేళ, కాలంగాని కాలంలో మండుటెండలు నాల్కలు చాస్తున్న వేళ, ఒక్కొక్క ఆశా మలిగిపోతున్నవేళ, రవీ, నువ్వు కూడా అస్తమిస్తే ఎట్లా? ఎటువంటి సందర్భం ఇది, నువు మమ్మల్ని వదిలివెళ్లే సమయమేనా? ఎటువంటి  జాగ్రత్త నీది, ఎంత జాగరూకత నీది, ఎంత సాహసోపేత జీవితం నీది, ఎందుకిట్లా ఏ ఏమరపాటు నిను మానుంచి దూరం చేసింది?

ముప్పై సంవత్సరాల జ్ఞాపకాల కన్నీటిధారలు. సరిగ్గా ముప్పై సంవత్సరాల కింద ఇటువంటి ఒక బూటకపు ఎన్ కౌంటర్ సందర్భంలోనే మనం మొదటిసారి సన్నిహితమయ్యాం, గుర్తుందా? ఎమర్జెన్సీ తర్వాత తొలి ఎన్ కౌంటర్ సందర్భం అది. కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలు పెల్లుబుకుతున్నప్పుడు 1982 జనవరి 27న కరీంనగర్ జిల్లా మాదాపూర్ లో అంకం నారాయణను, వాసం గజేందర్ ను కాల్చేశారు. బహుశా ఫిబ్రవరి మొదట్లో అనుకుంటాను, ఆ ఎన్ కౌంటర్ మీద వరంగల్ పాలిటెక్నిక్ లో సభ ఏర్పాటు చేశారు రామకృష్ణా, నువ్వూ, ఇతర పాలిటెక్నిక్ మిత్రులూ. ఆ సభలో బాలగోపాల్ సారూ, నేనూ మాట్లాడాం. అప్పటికే పరిచయమై ఉన్నావేమో గాని అక్కడ సభలో మనం కలుసుకున్నదే బాగా గుర్తు. ఆ సభ అయిపోయాక చాలసేపు కలిసి ఉన్నాం. నాగేశ్వరరావు కుటుంబం లాగనే మీ కుటుంబం కూడ ఆంధ్ర నుంచి వలస వచ్చి నర్సంపేట దగ్గర్ ఖానాపూర్ లో స్థిరపడిందని చెప్పావు. అప్పుడు నర్సంపేట ప్రాంతంలో బలంగా విస్తరిస్తుండిన రైతాంగ ఉద్యమ ప్రభావం  నీ మాటల్లో వినబడింది. అప్పటికే రాడికల్ విద్యార్థి సంఘం చొరవతో పాలిటెక్నిక్ విద్యార్థుల రాష్ట్రవ్యాప్త ఉద్యమం బ్రహ్మాండంగా జరిగి ఉంది. ఆ ఉద్యమంలో పదునుదేరిన నీ చైతన్యం నీ మెరిసే కళ్లలో, ఆసక్తినిండిన, ప్రతిదీ తెలుసుకోవాలని ఎదురుచూసే కళ్లలో స్పష్టంగా కనబడింది. అప్పటికింకా పద్దెనిమిది నిండలేదేమో నీకు!

తర్వాత కొద్దిరోజులకే నువ్వు పూర్తికాలం విప్లవ కార్యకర్తగా వెళిపోయినట్టున్నావు. కొన్ని నెలల తర్వాత సిద్ధిపేటలో కలిశావు. సిద్ధిపేటలో రాడికల్ విద్యార్థి యువజనులను సంఘటితం చేస్తూ ఆ కొద్దినెలల్లోనే అక్కడ ఎంతమందిని ఆకర్షించావో చూసి ఆశ్చర్యమయింది. తర్వాత ఆ మెదక్ జిల్లాలోనే నీ అభిమానులయిన, సహచరులయిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, రచయితలను, పాత్రికేయులను, సాధారణ గృహిణులను, ప్రజలను ఎంతోమందిని చూశాను. ఆ జిల్లాలోనూ, దక్షిణ తెలంగాణ బాధ్యతలలోనూ గడిపిన పది సంవత్సరాలలో ఎందరు తల్లులకు బిడ్డవయ్యావో, ఎన్ని కుటుంబాలలో విడదీయరాని సభ్యుడివయ్యావో ప్రతిచోటా చూశాను. అక్కడ నువు కలవని మనుషులున్నారా, నువు తట్టని హృదయముందా అని ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనూ, ఆరుగురు తోబుట్టువులనూ ఆశయం కోసం వదిలి రాగలిగిన మనిషే కనబడిన ప్రతిమనిషితోనూ అవ్వా నాయినా అన్నా తమ్మీ అక్కా చెల్లీ అని అన్యోన్యబంధం కలుపుకుంటే ఇతనుగదా మనిషి అని పొంగిపోయాను, నా తమ్ముడుగదా ఈ అద్భుతం అని ఊగిపోయాను. పది పదిహేనేళ్లు నిన్ను ప్రత్యక్షంగా చూడకపోయినా ఇటువంటి నీ ఆత్మబంధువులను వందలాది మందిని చూసి, నీ పరోక్ష స్పర్శను అనుభవించాను, నీ ఆప్యాయతను పోల్చుకున్నాను.

అల్లం రాజయ్య రమాకాంత్ గురించి ‘అతడు ప్రతిమనిషినీ ముట్టుకున్నాడు’ అని రాసినప్పుడు ఆ మానవసంబంధాల స్పర్శ నీది కూడానని నాకనిపించింది. అవి కేవలం భావోద్వేగపు సంబంధాలు మాత్రమే కావు. మన నేలమీద లలితకళార్ద్ర నాట్య శాస్త్రాన్నీ, కఠినాయుధ సైనిక వ్యూహ చతురతనూ కలగలిపిన జాయపసేనాని వలె నువ్వు, ఆ సుతిమెత్తని, అపురూప మైత్రీ చిహ్నానివైన నువ్వు, ప్రత్యర్థి మీద అశనిపాతంలా విరుచుకుపడడమూ చూశాను. నీ సాహస విన్యాసాల హొయలు చూసి కూడ మైమరచిపోయాను. ఆర్ద్రతా కాఠిన్యమూ ఒకేనాణానికి రెండు ముఖాలనీ, ప్రేమించవలసినదాన్ని ప్రేమించేటప్పుడు ద్వేషించవలసినదాన్ని ద్వేషించకతప్పదని నీ అనుభవంనుంచి మరొకసారి తెలిసింది.

మానవుల మీద ప్రేమలో మాత్రమే కాదు, అమానవుల మీద ద్వేషంలో మాత్రమే కాదు, మనుషులను కలపడంలో, వారిని నడిపించడంలో, వారికి నాయకత్వం వహించడంలో, వారికి మెళకువలు నేర్పడంలో, నాయకుడిగా ఉంటూనే సహచరుడిగా, మందిలో ఒకడిగా ఉండడంలో నువు ఆదర్శంగా నిలిచావు. ఇవాళ మౌనంగా రోదిస్తున్న వందలాది కుటుంబాలు, వేలాది వ్యక్తులు నీ మహోన్నత వ్యక్తిత్వానికి సాక్ష్యం పలుకుతున్నారు. అనునిత్యం రాజ్యంతో సాయుధఘర్షణలో నువు మునిగి ఉన్నప్పటికీ,  మనిషికీ మనిషికీ వచ్చిన తగాదాలనుంచి, మనిషికీ రాజ్యానికీ వచ్చిన తగాదాల దాకా నీ జోక్యం కోరని సమస్య లేదు. నువు పరిష్కరించని సమస్య లేదు.

నీ కృషికంతటికీ శిఖరాయమానం జైలు పోరాటం. నిజమే గదూ నీ ఇరవై ఎనిమిది సంవత్సరాల పోరాట జీవితంలో ఎనిమిది సంవత్సరాలు జైలులోనే గడిచాయి. జైలును పాఠశాలగా, పోరాటకేంద్రంగా, మిత్రుల సమావేశస్థలంగా, ప్రత్యర్థులలో కూడ పరివర్తన సాధించే ప్రయోగశాలగా మార్చింది నువ్వు. సుధాకర్, నువ్వూ, బాలకృష్ణా కలిసి జైలును ఎట్లా తీర్చిదిద్దారు. జైలునుంచి న్యాయస్థానం వేదికగా రాజ్యాన్ని ప్రశ్నించడం గాని, అంతర్జాతీయ సదస్సు వేదికగా విప్లవ వైఖరి ప్రకటించడం గాని, ఖైదీల హక్కులమీదా, పౌరహక్కులమీదా సమ్మె నడపడం గాని, ప్రభుత్వంతో చర్చలు జరిపి జైలు పరిస్థితులను సంస్కరించడం గాని…ఎన్నెన్ని పనులు చేశారు! రవీ, నీ నుంచి నేర్చుకోవలసినదెంత ఉంది! మీరు జైలునుంచి వేసిన సవాలుకు జవాబు చెపుతూనేగదా, విప్లవోద్యమం సమస్య కాదనీ, తమ సమస్యలకు పరిష్కారం అని ప్రజలు భావిస్తున్నారనీ న్యాయమూర్తి అంగీకరించారు. ఆ జైలు జీవితంలోనే గదా నీ అసాధారణ వ్యక్తిత్వం బయటపడింది, ఎన్ని సంవత్సరాలకు జైలుజీవితం ముగుస్తుందో తెలియని అనిశ్చితిలో ‘నాకోసం వేచి చూడు’ అని సహచరిని కోరలేక, మరొక సహజీవనానికి ప్రోత్సహించావు!

గుహలోంచి బయటికి రాగానే మళ్లీ తన పంజాలోకి తీసుకోవాలని పులి ప్రయత్నిస్తే, ఎంత అద్భుతమైన ప్రణాళిక పన్నావు, ఎంత చాకచక్యంగా తప్పించుకుపోయావు, కుందేలువో, జింకవో అయి పులి చేతికి చిక్కకుండా నల్లమలకు ఎంత సాహసికంగా వెళ్లిపోయావు!

చర్చలకు ముందు చినఆరుట్ల దగ్గర నిను చిట్టచివరిసారి చూసి అప్పుడే ఐదు సంవత్సరాలు. ఆనాడు ఆ సెలయేటి అంచున కొండరాళ్ల మీద కూచుని ఎంతమంది మనుషుల గురించి ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం! ఎప్పుడో ఇరవై ఏళ్లకింద చూసిన మనుషుల గురించీ ఎంత స్నేహంగా, ఆప్యాయంగా అడిగావు!

రవీ, అత్యవసరమయిన సమయంలో ఎట్లా వెళిపోయావు? ఇప్పుడు నువ్వు కావాలి, నీలాంటివాళ్లు కావాలి. నిన్ను నువ్వే అధిగమించిన మనిషివి నువ్వు. కోస్తాంధ్ర నుంచి వలస వచ్చిన ఇంట్లో పుట్టి తెలంగాణను తలకెత్తుకున్నావు. అగ్రవర్ణంలో పుట్టి అట్టడుగు గూడాలలో తిరిగావు. ఉన్నత సాంకేతికవిద్య చదివి నిరక్షరాస్యులమధ్య పనిచేశావు. ఇంటిని వదిలేసి వచ్చీ ప్రతి ఇంట్లో నువ్వే అయ్యావు. పురుషుడివై పుట్టి పురుషాహంకారాన్ని వదులుకున్నావు. నాయకుడివయ్యీ మందిలో ఒకడివయ్యావు. సైనికుడివయ్యీ సుతిమెత్తని పువ్వువయ్యావు.

నువ్వు అస్తమించడానికి వీలులేదు రవీ, నీ ప్రాభవం నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది. నీ ప్రభావం అనంతంగా విస్తరిస్తూనే ఉంటుంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s