రియింబర్స్ మెంట్ వివాదపు చిక్కుముడులు

(ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ, జూన్ 29, 2010)

బలహీన వర్గాల విద్యార్థులకు వారి బోధనా ఫీజు రియింబర్స్ మెంట్ లోనూ, ఉపకార వేతనాల చెల్లింపులోనూ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం, అపసవ్య ధోరణి, పెరిగిపోయిన బకాయిలు చిలికి చిలికి గాలివాన అయ్యాయి. ఈ అంశం ఆరోపణలకు, ప్రత్యారోపణలకు, ఆమరణ నిరాహార దీక్షలకు, దీక్షల భగ్నాలకు, కుట్ర జరిగిందనే నిందలకు, బైటపెట్టండనే సవాళ్లకు రంగస్థలంగా మారింది.

ముఖ్యమంత్రి, బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే మంత్రులు, తామే బలహీన వర్గాల ప్రతినిధులమనుకునే నాయకులు అందరికందరూ తమ పాత్రలను యథాశక్తి పోషించారు. వెనుకబడిన కులాల సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఒకవైపునా, భారతీయ జనతా పార్టీ నాయకుడు జి కిషన్ రెడ్డి మరోవైపునా నిరాహారదీక్షలకు దిగారు. ఈ లోగా తామూ తక్కువ తినలేదన్నట్టు ప్రైవేటు కాలేజీల యాజమాన్య ప్రతినిధులూ రంగంమీదికి వచ్చారు. విద్యార్థి సంఘాలు కూడ తమ గళం వినిపించాయి. ఈ మొత్తంలో అసలు బాధితులయిన విద్యార్థులు వీథుల్లోకొచ్చినట్టు పెద్దగా కనబడలేదు గాని మంగళవారం నాడు విద్యా సంస్థల బంద్ మాత్రం జరిగింది.

సాధారణంగానే ఇటువంటి వివాద సందర్భాలలో వేడి వెలువడినంతగా వెలుగు కనబడదు. ఇంత గందరగోళపు రచ్చ జరిగినపుడు అవసరమయిన విషయాల మీద అందరికీ వినబడే, తెలిసే పద్ధతిలో చర్చ జరగడానికి అవకాశం తగ్గిపోతుంది. ఇప్పుడు కూడ చర్చ ఏమీ జరగకుండానే రచ్చ మొదలయింది గనుక ఆలోచించవలసిన విషయాల మీద సహజంగానే దృష్టి తగ్గింది.

మొట్టమొదట గుర్తించవలసింది, అంగీకరించవలసింది ఇప్పటికే తరతరాలుగా విద్యకు, ముఖ్యంగా ఉన్నత విద్యకు, ఆర్థిక, సామాజిక కారణాలతో దూరంగా ఉంచబడిన బలహీన వర్గాల విద్యారుల చదువుల బాధ్యత తప్పనిసరిగా సమాజమే తీసుకోవాలి. అంటే ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజాధనం నుంచే ఆ వ్యయం భరించాలి. బలహీన వర్గాల విద్యార్థులకు తప్పనిసరిగా ప్రభుత్వం బోధనా ఫీజులు రియింబర్స్ చేయాలి. ఉపకార వేతనాలు చెల్లించాలి. ఆ ఉపకార వేతనాలను కూడ పెరుగుతున్న ధరలతో పాటుగా పెంచుతూ ఉండాలి. ఎవరూ అడగనక్కర లేకుండానే, ఆందోళనలకూ నిరాహారదీక్షలకూ దిగనక్కర లేకుండానే ప్రభుత్వం నిర్వహించవలసిన బాధ్యత ఇది. మరీ ముఖ్యంగా తనను తాను సంక్షేమ రాజ్యమని పిలుచుకుంటున్న ప్రభుత్వపు కర్తవ్యం ఇది. మొత్తం వివాదంలో ఉన్న మౌలికమైన, న్యాయమైన అంశం ఇది.

అయితే సమస్య ఏమంటే, చాల న్యాయమైన ఈ పునాది మీద అనేక అక్రమ కట్టడాలు కూడ లేచాయి. ఆ కట్టడాలలో ప్రభుత్వానికీ, రాజకీయ నాయకత్వానికీ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యానికీ, స్వార్థ ప్రయోజన శక్తులకీ అందరికీ తలా పిడికెడు భాగం ఉంది. కనుక ఈ సమస్యను ఇవాళ విద్యార్థుల ఫీజులు సమయానికి రియింబర్స్ కాకపోవడం, ఉపకారవేతనాల బకాయిలు పేరుకుపోవడం అనే వాస్తవ సమస్యలతోపాటు కాస్త చరిత్రలోకి కూడ వెళ్లి పరిశీలించాలి.

నిజానికి విద్యను, ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ ఉన్నత విద్యను విపరీతంగా వ్యాపారమయం చేయడం వల్ల తలెత్తిన రాజకీయార్థిక సమస్యలలో ఇది ఒకటి. ఉన్నత విద్యలో ప్రైవేటు శక్తులు ప్రవేశిస్తే, వాటికి లాభాల వేట తప్ప విద్యా నాణ్యతపై శ్రద్ధ ఉండదనీ, అందువల్ల నాణ్యత దెబ్బ తింటుందనీ, సమాజానికి అత్యవసరమైన మెడికల్, ఇంజనీరింగ్ వంటి కోర్సులలో అక్రమాలు తలెత్తుతాయనీ, అందువల్ల ఈ వృత్తి విద్యా కోర్సులలో ప్రైవేటీకరణ జరగగూడదనీ ఇరవై ఏళ్లకింది వరకూ సర్వజనామోదం ఉండేది. అందువల్లనే రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజిలు పెద్ద ఎత్తున తేవడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి జనార్దనరెడ్డి పదవినే వదులుకోవలసి వచ్చింది.

కాని కొద్దికాలానికే నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించి, ఏదయినా డబ్బు లెక్కల్లో కొలిచే వ్యాపార విలువలు మొదలయ్యాక ఉన్నత విద్యను ప్రైవేటీకరించడమే సరయినదనే అభిప్రాయాలు బలపడ్డాయి. ఆ అభిప్రాయాలకు మొనగాడుగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి వందలాది ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలకు అనుమతి ఇచ్చి, అదే గొప్పగా కూడ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అప్పటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు విరివిగా ఉన్నాయి గనుక ఆ పరిణామాన్ని చాలమంది మధ్యతరగతి వారు ఆహ్వానించారు. కాని ప్రైవేటు విద్యా వ్యాపారుల అక్రమాల గురించి విమర్శకులు లేవనెత్తిన సందేహాలన్నీ సహేతుకమని పదిహేనేళ్లు గడిచాక ఇప్పుడు రుజువవుతున్నది.

ఆ ప్రైవేటు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు పెట్టిన వారిలో చాల మంది కేవలం అది ఒక వ్యాపారంగా పెట్టారు గాని విద్య మీద, సమాజాభివృద్ధి మీద అపేక్షతో కాదు. అలా కళాశాలలు తెరిచినవారు ఎక్కువగా రాజకీయ నాయకులు, శాసనసభ్యులు, వారి ఆశ్రితులు, పెట్టుబడిదారులు. అందుకే కోళ్ల ఫారాలలో, నెలవారీ అద్దెకు తెచ్చిన కంప్యూటర్లతో ఇంజనీరింగ్ కాలేజీలు మొదలయ్యాయి. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా చూపడానికి కిరాయి డాక్టర్లు, కిరాయి ప్రొఫెసర్లు, కిరాయి రోగుల వ్యవస్థ ఏర్పడింది. కాలేజీలు పెట్టినవారికి అవి సులభంగా డబ్బు సంపాదించే సాధనాలు మాత్రమే. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఇబ్బడి ముబ్బడి ఫీజుల ద్వారా వసూలు చేసేది సరిపోక, ఏదో ఒక పేరు చెప్పి ప్రభుత్వం దగ్గరి నుంచి ప్రజాధనాన్ని కొల్లగొడితే సరిపోదా అనే ఆలోచన ఈ విద్యావ్యాపారులలో మొదలయింది.

తెలుగుదేశం పాలనాకాలపు చివరి సంవత్సరంలో బలహీన వర్గాల విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల బోధనా ఫీజులను ప్రభుత్వమే కళాశాల యాజమాన్యాలకు రియింబర్స్ మెంట్ చేసే ఉత్తర్వులు వచ్చాయి. ఆ ఉత్తర్వులనే ఆ తర్వాతి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, రోశయ్య ప్రభుత్వం మార్పు చేర్పులతో కొనసాగిస్తూ వస్తున్నాయి.  సెప్టెంబర్ 2009లో ఈ విధానాన్ని సమీక్షించి, సవరణలు సూచించడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ ఉపసంఘం నివేదిక పూర్తి కానందువల్లనో, ఆర్థిక ఇబ్బందులవల్లనో, ఇతర కారణాల వల్లనో ప్రభుత్వం రియింబర్స్ మెంట్ సక్రమంగా చేయలేకపోయింది. బకాయిలు పేరుకుపోయాయి. పనిలో పనిగా ఉపకారవేతనాల చెల్లింపులలో కూడ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.

రియింబర్స్ మెంటి ఆపివేయడంవల్ల మొట్టమొదటి ఇబ్బంది ఎదురయింది కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు. నిజానికి వారికి కూడ అది ఇబ్బంది అనడానికి వీలులేదు. అప్పటికే వారు వసూలుచేస్తున్న ఫీజులు, వారి ఖర్చులతో పోలిస్తే చాల ఎక్కువ గనుక, ప్రభుత్వం దగ్గరినుంచి ఇవాళ కాకపోతే రేపయినా బకాయిలు వస్తాయి గనుక, అందులోనూ వారందరూ అధికార పార్టీకో, ఇతర రాజకీయ పార్టీలకో చెందినవారే గనుక ఆ డబ్బు సంపాదించడం వారికేమీ కష్టం కాదు.

కాని ఈలోగా ఇందులోకి అధికారపార్టీలోని ముఠారాజకీయాలు కూడ ప్రవేశించాయి. అందువల్ల కాలేజి యాజమాన్యాలు మొండిపట్టు పట్టదలచాయి. బోధనా ఫీజు రియింబర్స్ మెంట్ రాకపోతే విద్యార్థులను పరీక్షలకు కూచోనివ్వమన్నారు, ఇతర రకాల ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. నిజం చెప్పాలంటే, ఈ రియంబర్స్ మెంట్ వచ్చే విద్యార్థులకు అసలు ఎటువంటి బోధనా ఫీజు అవసరం లేకుండా ఉచితంగానే విద్యాబోధన చేయడానికి సరిపోయే నిధులను ఇప్పటికే ఆ కాలేజీలు ప్రభుత్వాల నుంచి వసూలు చేసి ఉన్నాయి. అలా వసూలు చేసినది కనీసం సాలీనా పన్నెండు వందల కోట్ల రూపాయలు.

ఇక్కడ అడగవలసిన ప్రశ్న, నాణ్యత హామీ లేని విద్య కోసం ఇన్ని వందలకోట్ల రూపాయలు ప్రైవేటు విద్యాసంస్థల యజమానులకు అప్పగించే బదులు ప్రభుత్వ రంగంలోనే, విశ్వవిద్యాలయాలకు అనుబంధంగానే కళాశాలలు ఏర్పాటు చేసి ఉండవచ్చు గదా అని. గత ఏడెనిమిదేళ్లలో మొత్తం మీద ఇలా ప్రైవేటు విద్యా సంస్థలకు అందిన దాదాపు ఎనిమిది వేలకోట్ల రూపాయలతో ప్రభుత్వ రంగంలోనే మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఉంటే వాటికి మౌలిక సాధన సంపత్తి ఉండేది. అధ్యాపకులను, సిబ్బందిని నియమించడం వల్ల ఉపాధి కల్పన సాగి ఉండేది. చివరికి ప్రభుత్వానికి, అంటే సమాజానికి ఆ కళాశాలల ఆస్తులు కూడ మిగిలిపోయేవి. ఇప్పుడు ఆ నిధులన్నీ ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల యజమానుల సొంత బొక్కసాలలోకి వెళ్లాయి తప్ప జరిగిందేమీ లేదు.

ఇప్పుడు ముఠా తగాదాల వల్ల ఈ అంశాలన్నీ బజారుకెక్కాయిగనుక ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రీ మంత్రులూ బోగస్ విద్యార్థుల గురించీ, యాజమాన్యాల కుట్ర గురించీ, దాదాపు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు సొంత బ్యాంక్ అకౌంట్లు లేకపోవడం వల్ల ఉపకార వేతనాలు ఆపడం గురించీ మాట్లాడుతున్నారు.

అధికార యంత్రాంగానికి ఈ అక్రమాల గురించి ఎప్పుడు జ్ఞానోదయం కలిగిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. బోగస్ విద్యార్థుల పేర్లను విద్యావ్యాపారులు ఏసంవత్సరానికి ఆ సంవత్సరం పంపుతుంటే, వారి పేరు మీద ట్యూషన్ ఫీజు కోరుతుంటే, ఆ ట్యూషన్ ఫీజు కూడ న్యాయంగా అవసరమయిన దానికన్న చాల ఎక్కువ కోరుతుంటే, అధికార యంత్రాంగమంతా తమ ముడుపుల యావలో అవన్నీ పట్టించుకోకుండా వదిలేశారు గదా. తోటకూర దొంగతనం నాడే బుద్ధి చెప్పి ఉంటే బందిపోటు అయి ఉండేవాడా అని సామెత చెప్పినట్టు ఇవాళ యాజమాన్యాల కుట్ర గురించి వగచి ఏం లాభం?

ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందిస్తూనే, అలా అందిస్తున్నామనే పేరుమీద ఎన్నో రెట్లు ఎక్కువ బిల్లులువేసి ఆరోగ్యశ్రీ పేరుమీద కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న పద్ధతికీ దీనికీ ఏమీ తేడా లేదు. ముప్పైవేలు కూడ ఖర్చు కాని వైద్యానికి ఆరోగ్యశ్రీ కింద రెండు లక్షలు వసూలు చేస్తాము, ఎట్లాగూ ప్రభుత్వమే కదా ఇచ్చేది, మీదేం పోతుంది అని కార్పొరేట్ ఆస్పత్రులు ఇప్పటికే మనకు సమాజం గురించి ఆలోచించడం తప్పు అనే విలువలు మప్పాయి. బహుశా రేపు ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే ఇవ్వకపోతే రోగులను చూడం అని కార్పొరేట్ ఆస్పత్రులు సమ్మె చేసే స్థితి, కార్పొరేట్ ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వండి అని పెద్దమనుషులు అడిగే స్థితి వస్తుందేమో.

సమాజ విలువలు కూడ ఎక్కడికి వచ్చాయంటే, ప్రభుత్వ రంగంలో కాలేజీలు పెట్టండి, మాకు మంచి విద్య అందించండి, మా అభివృద్ధి సమాజ బాధ్యత అని అడగవలసిన వర్గాలు, మా పేరుమీద దోపిడీ సాగిస్తున్న పెద్దల దోపిడీ కొనసాగనివ్వండి అని అడుగుతున్నాయి. ఎప్పుడయినా మనం ఎటువంటి ప్రశ్నలు అడిగితే అటువంటి జవాబులే వస్తాయి. రియింబర్స్ మెంట్ వివాదం నిజంగా బలహీన వర్గాల విద్యార్థులకు మేలు చేయాలంటే, కార్పొరేట్ కాలేజీలకు వాళ్లు అడిగిన డబ్బులు వస్తున్నాయా లేవా అనే ప్రశ్నకు బదులు, ఈ సమాజంలో విద్యావ్యవస్థ ఇలా ఎందుకున్నది, ప్రజాధనం ఇలా విద్యావ్యాపారుల హక్కుభుక్తం ఎందుకు అయిపోతున్నది అనే ప్రశ్నలు వేయవలసి ఉంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s