నిశాంతపు వెలుగురేఖ ఆజాద్(Updated)

కృష్ణా జిల్లాలో పుట్టి, ఈ దేశపు దక్షిణ, పశ్చిమ, మధ్య రాష్ట్రాలలో బహుశా మరెవరికన్నా ఎక్కువగా నడయాడిన చెరుకూరి రాజకుమార్ అతి దుర్మార్గంగా హత్యకు గురయ్యాడు. నూజివీడు బిడ్డ కాజీపేట, హనుమకొండ, వరంగల్, విశాఖపట్నం, బెంగళూరు రహదారుల మీదినుంచి పడమటి కనుమలనూ తూర్పు కనుమలనూ కలిపిన దండకారణ్యమంతా విస్తరించాడు. అక్కడి ప్రత్యామ్నాయ ప్రజాపాలన గురించి ప్రపంచానికి తెలియజేసే వాహికా, వ్యాఖ్యాతా అయ్యాడు. ఈ దేశ పీడిత ప్రజాకాశంలో కనిపిస్తున్న నిశాంతపు వెలుగురేఖ అయ్యాడు. ఆ వేకువరేఖను తుడిచేసి, వేకువను ఆపగలమని పాలకులు భ్రమపడుతున్నారు.

రాజకుమార్ హత్య ఏ వైపు నుంచి చూసినా ఇటీవలి చరిత్రలో అత్యంత దుర్మార్గమైన, కుటిలమైన, అమానుషమైన చర్య. ఒకవైపు కేంద్ర హోంమంత్రి చిదంబరం మావోయిస్టులతో చర్చలు జరుపుతామని స్వామి అగ్నివేష్ లాంటి మధ్యవర్తుల సాయంతో ఆజాద్ తో పరోక్ష సంభాషణ ప్రారంభించాడు. ఆ ప్రయత్నాలు సాగుతుండగానే ఆయనను చంపడం పాలకవర్గాల కుటిలత్వానికి చిహ్నం, చర్చలు జరపాలనే కోరిక ప్రభుత్వానికి లేదనడానికి నిదర్శనం. కనీసం గతంలో ప్రముఖమైన వ్యక్తులను చంపడానికి సందేహించిన ఘటనలున్నాయి. కాని ఇప్పుడు నేరుగా భారత మేధావివర్గంతో, పౌరసమాజంతో సంభాషిస్తున్న, ప్రధాన స్రవంతి పత్రికలలో వ్యాసాలు రాసిన, విస్తృతమైన ఇంటర్వ్యూలు ఇచ్చిన వ్యక్తిని వేటాడి పట్టుకుని దొంగచాటుగా చంపడానికి పాలకవర్గాలు ఎంతమాత్రం సందేహించలేదు. అధికారప్రతినిధిగా ఆయన గత ఐదారు సంవత్సరాలుగా భారత విప్లవోద్యమ దృక్పథాన్ని అత్యంత సమర్థంగా ప్రచార సాధనాల ద్వారా ప్రజలకు చేరుస్తున్నాడు. ఆయనను లేకుండా చేస్తే విప్లవోద్యమ గళాన్ని మూసివేయవచ్చునని పాలకులు అనుకున్నారు. ‘ఎన్ కౌంటర్లు ఉండవు’ అని చిదంబరం ప్రకటించిన తర్వాత, ఆజాద్ ను వెంటాడి, ఆయనతో పాటు ఉన్న పాత్రికేయుడితో సహా పట్టుకుని ఆదిలాబాద్ అడవుల్లో చంపి పడేసి ఎన్ కౌంటర్ కట్టుకథలు అల్లుతున్నారు.

ఆయన ముప్పైఆరు సంవత్సరాలుగా నాకు మిత్రుడూ, ఆత్మీయుడూ. ఆయనలోని మేధావిని, చదువరిని, రచయితను, వ్యూహనిపుణుడిని, దార్శనికుడిని, అసాధారణంగా ఆలోచించగల శక్తిమంతుడిని చూశాను. అటువంటి అపార ప్రజ్ఞావంతుడు మళ్లీ ఇంత తొందరగా రావడం కష్టం.

నేనాయనను 1973-74 నుంచీ చూస్తున్నాను. విప్లవమార్గం పట్టిన ప్రతిభావంతులైన వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థుల బృందంలో, సూరపనేని జనార్దన్ సహచరుడిగా రాజకుమార్ వెలుగులీనుతూ వరంగల్ విప్లవ విద్యార్థి ఉద్యమ ఉధృతిలోకి వచ్చాడు. రాడికల్ విద్యార్థి సంఘ నిర్మాతలలో ఒకడయ్యాడు. ఎమెర్జెన్సీలో కొంతకాలం పాటు జైలుపాలయి బైటికి వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన కృషి సాగించాడు. అందువల్లనే ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత పునరుద్ధరించిన ఆర్ ఎస్ యు కు ఆయన నాయకుడయ్యాడు. ఎమర్జెన్సీ తర్వాత వరంగల్ లో జరిగిన ఆర్ ఎస్ యు రెండవ మహాసభలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తర్వాత అనంతపురంలో జరిగిన మూడవ మహాసభలో రెండవ పర్యాయం కూడ అధ్యక్షుడయ్యాడు. వరంగల్ లో ఉన్నా, విశాఖలో ఉన్నా ఉద్యమాలే ఊపిరిగా బతికిన బక్కపలుచటి, చామనచాయ యువకుడు ఈ దేశ విప్లవాన్ని నడిపిన సారథి అయ్యాడు. అందులోనూ ఆర్థిక ప్రయోజనాలను రక్షించేందుకు హోంమంత్రిత్వశాఖ ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ కు ఎదురుగా ప్రజల అధికారప్రతినిధిగా నిలబడి పౌరసమాజపు ఆదరణను చూరగొన్నాడు.

ఆయన గురించి ముప్పిరిగొంటున్న జ్ఞాపకాలలో కొన్నయినా పంచుకోవాలి. సూరపనేని జనార్దన్ తో సహా నలుగురు విద్యార్థులను గిరాయిపల్లి అడవులలో బూటకపు ఎన్ కౌంటర్ లో చంపినప్పుడు, ఆ ఎన్ కౌంటర్ మీద న్యాయవిచారణ జరిపిన జస్టిస్ భార్గవా కమిషన్ ముందు వాదించడానికి అవసరమయిన సాక్ష్యాధారాలన్నీ సేకరించి కన్నబిరాన్ కు సహకరించినవాడు రాజకుమార్. ఆయన మెదక్ జిల్లా గిరాయిపల్లి అడవులలో చేసిన కృషి గురించి కన్నబిరాన్ తన ఆత్మకథ ‘24 గంటలు’ రాస్తున్న సందర్భంలో చాల ఆర్ద్రంగా, అభిమానంగా అనేక సార్లు చెప్పారు.

1978 ఆర్ ఎస్ యు మహాసభ అయిపోయినతర్వాత విశాఖనుంచి వచ్చిన బృందాన్ని రైలు ఎక్కించడానికి రాజకుమార్ వరంగల్ స్టేషన్ కు వెళ్లాడు. వాళ్లు వెళ్లిపోయాక తిరిగివస్తుంటే, ప్లాట్ ఫారం టికెట్ లేదని పట్టుకుని హైదరాబాద్ నుంచి టికెట్ మూడురెట్లు ఫైన్ వేశారని, మర్యాదగా అది కట్టి వచ్చి నవ్వుతూ చెప్పిన ముఖం ఇంకా కళ్లముందు ఆడుతోంది. ఆరోజుల్లో, ఇంకా విశాఖ వెళ్లకముందు, కాజీపేట సిద్ధార్థనగర్ లో ఉండేవాడు.

2004 చర్చల సమయంలో నల్లమలలో ఉండి మొత్తం చర్చల ప్రక్రియకు మార్గదర్శకత్వం వహించినవాడు, ఆ చర్చలకు అవసరమైన పత్రాలు రాయడమో, మెరుగుపరచడమో చేసినవాడు రాజకుమార్. 2004 చర్చల సందర్భంలో ప్రభుత్వం తరఫున ఎనిమిది మంది ప్రతినిధులున్నప్పటికీ, ప్రభుత్వానికి బోలెడంతబలగం, సిబ్బంది ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క పత్రాన్ని తయారు చేయలేదు. ఏ ఒక్క విషయం మీదా హోంవర్క్ చేసిరాలేదు. కాని విప్లవోద్యమం తరఫున అడవిలో, ఎటువంటి సాధన సంపత్తి లేనిచోట ఉండి ఎజెండా తయారీ దగ్గరినుంచి, మొదటి మూడు అంశాలమీద  వివరమైన పత్రాలు తయారు చేసేవరకూ రాజకుమార్ ది అపారమైన కృషి. ఒక పని చేయాలంటే వనరులు, సమయం ఉండడం, లేకపోవడం సమస్య కాదు, దార్శనికత, ఆలోచన, చిత్తశుద్ధి సమస్య అని ఆయన ప్రతిపనిలో, ప్రతిచోటా చూపాడు. ఆ సమయంలో తనకు కంటాక్ట్ లెన్స్ లకు అవసరమైన సొల్యూషన్ అయిపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ సొల్యూషన్ ఇవ్వడానికి ఎరగొండపాలెం వెళ్లాను. ‘ఎవరితోనయినా పంపితే పోయేదిగదా, నాకోసం ఇంత రిస్క్ తీసుకున్నావా’ అని అభిమానపడిన ఆ ప్రేమాస్పద ముఖం మనసులో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.

వ్యక్తిగత అనుబంధం అలా ఉంచి, ఆయన విప్లవోద్యమానికి మాత్రమే కాదు, అసలు భారత ప్రజా జీవనానికే ఒక గొప్ప వనరు. ఈ దేశ ప్రజల వనరులన్నిటినీ కొల్లగొడుతున్న పాలకవర్గాలు ఈ వనరును కూడ లేకుండా చేశాయి. 1980ల చివర కర్ణాటక లో ఇటు హైదరాబాద్ కర్ణాటక, ముఖ్యంగా రాయచూరులో, అటు పడమటి కనుమలలో విప్లవోద్యమ బీజాలు వేసిన దూరదృష్టి ఆయనది. భారత విప్లవానికి విదేశాలలో స్థిరపడిన భారతీయ ప్రగతిశీల వ్యక్తుల సహాయం, విదేశీ విప్లవ సంస్థలతో సమన్వయం అవసరమని గుర్తించి ఆ దిశలో పది సంవత్సరాల కిందనే ప్రయత్నాలు మొదలుపెట్టిన వాడాయన. విప్లవోద్యమం ఇవాళ అనేక రాష్ట్రాలకు విస్తరించడంలో, మధ్య భారత రాష్ట్రాలలో వేళ్లూనుకోవడంలో గణనీయమైన పాత్ర ఆయనది. ఇటువంటి అనేక ప్రయత్నాలలో ఆయన దార్శనికత విస్పష్టంగా కనబడుతుంది.

బహుశా ఆయన వయసులో ఉన్న దేశంలోని ప్రగతిశీల మేధావులందరిలో ఆయనంతటి అధ్యయన శీలురు చాల తక్కువమంది ఉంటారు. కొత్త పుస్తకాల కోసం తపన, దొరికిన పుస్తకమల్లా చదివేయడం, ఇంటర్నెట్ వచ్చాక, మామూలుగా దొరకని సమాచారమంతా సేకరించి తాను చదవడం, ఇతరులతో చదివించడం – ఈ జ్ఞానతృష్ణకు ఆయనకు అజ్ఞాతవాసం ఎప్పుడూ అడ్డుకాలేదు. అలాగే రచనలో గొప్ప ప్రమాణాలు సాధించాడు. తెలుగులోనూ ఇంగ్లిషులోనూ ఆయన రచనలు ఎన్నో ఉన్నాయి. ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాసిన రచనలు, హిందూ కు ఏప్రిల్ లో ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ, వందలాది పత్రికా ప్రకటనలు చూస్తే ఆయన ఎంత ఇంగ్లిషు భాషా పరిజ్ఞానం ఎంత అసాధారణమైనదో తెలుస్తుంది.

అత్యున్నత విద్యావంతుడయి, అత్యంత సాధారణ జీవితం గడిపి, యాభైఐదు సంవత్సరాల జీవితంలో చదువు మినహాయిస్తే మిగిలిన జీవితమంతా అజ్ఞాతవాసంలో, ప్రజాఉద్యమంలో, ప్రజాసేవలో గడిపిన ఆయన వ్యక్తిత్వం అద్భుతమైనది. అనన్యసాధ్యమైనది.

ఆజాద్ మరణంతో భారత విప్లవోద్యమానికి జరిగిన నష్టాన్ని చారుమజుందార్ మరణంతో మాత్రమే పోల్చగలం. చారుమజుందార్ మరణం నుంచి తేరుకుని విప్లవోద్యమం విస్తరించింది. ఒకగ్రామపు, రెండు మూడు రాష్ట్రాల ఉద్యమం ఇరవై రాష్ట్రాలకు విస్తరించింది. ఇప్పుడు కూడ కష్టం కావచ్చుగాని విస్తరిస్తుంది. విజయం సాధిస్తుంది. కాని ఆ వేకువ భళ్లుమని విస్తరించే సమయానికి అది చూడడానికి ఆయన లేకపోయాడుగదా అనే విషాదరేఖ మిగిలిపోతుంది.

– ఎన్ వేణుగోపాల్

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, వ్యాసాలు. Bookmark the permalink.

30 Responses to నిశాంతపు వెలుగురేఖ ఆజాద్(Updated)

 1. shayi says:

  ఇక్కడ నేను వ్రాస్తున్నది – నక్సలిజాన్ని సమర్థించడానికి కాదు. ఎందుకంటే నేను హింసా వాదానికి వ్యతిరేకిని.
  లేదా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఖండిచడానికి కాదు. అది నిర్ధారించే స్థాయి నాకు లేదు. కాని ఒక సామాజికునిగా నాకు దర్శనమయిన ఒక నిష్ఠుర సత్యాన్ని ఇక్కడ వ్రాస్తున్నాను. ఒకప్పటి నిజామ్ వ్యతిరేక తెలంగాణ రైతాంగ పోరాటంలో ఎందరో కృష్ణా, గుంటూరు జిల్లా కమ్యూనిస్టులు పోరాడి సహాయపడ్డారు కాబట్టి, దానికి ప్రతిఫలంగా తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజనను కోర కూడదంటూ వాదించే వారికి కనువిప్పుగా ఇది వ్రాస్తున్నాను.
  కృష్ణా జిల్లాలో పుట్టిన ఒక కోస్తా బిడ్డ ‘రాజ్ కుమార్’ అనే ఒక ఉత్తమ విద్యార్థి వరంగల్ లోని REC ( దీనిని ఇప్పుడు NIT గా వ్యవహరిస్తున్నారు.)లో సీట్ సంపాదించుకొన్నాడు. అందరిలాగే బాగా చదువుకొని, అమెరికాకు వెళ్ళి కోట్లు కోట్లు సంపాదించి, హైదరాబాదులో వ్యాపారాలు నెలకొల్పి, తానూ ఈనాటి కోస్తా పెట్టుబడిదారులలో ఒకడై ఉంటే – ఇప్పుడు కరుడుగట్టిన సమైక్యవాదిగా మాట్లాడేవాడేమో ! కాని, రాజ్ కుమార్ అందరిలా స్వార్థపరుడు కాడు. 1970లలోనే తెలంగాణ దీన పరిస్థితికి చలించిపోయాడు. వరంగల్ చుట్టుపక్కల గల పేదలు, దళితులు, గిరిజనుల కోసం నక్సలిజం బాట పట్టాడు. ’ ఆజాద్ ’ గా మారాడు. అడవుల్లో అష్టకష్టాలు పడుతూ ఉద్యమంలో పాల్గొని, అంచెలంచెలుగా మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకునిగా ఎదిగాడు. మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు పలికే నిర్ణయంలో భాగస్వామి అయ్యాడు. రాష్ట్ర విభజనే అన్ని సమస్యలకు పరిష్కారంగా భావించాడు.
  2004 లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్ట్ పార్టీని సిద్ధం చేసాడు. చర్చలలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు ముందు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు లక్షించిన ‘ పేదలకు భూముల పంపకం’ నిక్కచ్చిగా జరగాలని కోరాడు. కోస్తా వాడయి ఉండి, ఎంతో మంది కోస్తా, రాయలసీమ పెట్టుబడిదారుల అక్రమ ఆస్తుల చిట్టా విప్పాలన్నాడు. ఆ పెట్టుబడిదారులకే అనుకూలంగా పనిచేస్తున్న ప్రభుత్వం చర్చలకు గండికొట్టింది. తెలంగాణ విషయంలో మాట మార్చింది. మావోయిస్టులను మట్టు పెట్టాలని నిర్ణయించుకొంది. ఒక్కొక్కర్ని హతమారుస్తూ వచ్చింది. ఆ క్రమంలో త్యాగ ధనుడు, నిస్వార్థ విప్లవ వీరుడు, సంకుచితంగా విశాలాంధ్రను కాకుండా, అందరూ బాగుండాలని కోరుకొనే విశాల హృదయుడు ’ఆజాద్’ ఆదిలాబాద్ అడవుల్లో ఆత్మార్పణ చేసాడు.
  ఒక కోస్తా బిడ్డ .. కాదు కాదు .. మా తెలంగాణ బిడ్డ .. నిజమయిన తెలుగు బిడ్డ ’ఆజాద్’ ని చూసి సంకుచిత స్వార్థ సమైక్యవాదులు సిగ్గుపడాలి.

 2. shayi గారు బట్టతలకీ మోకాలికీ భలే ముడెయ్యజూస్తున్నారే, భలే! తెలంగాణకు చెందిన నల్సలైటును చంపి ఉంటే మీరు ఏమని ఉండేవారో, రాయలసీమకు చెందినవాణ్ణి చంపి ఉంటే ఏమని ఉండేవారో కూడా నేను చెప్పగలను. ఆవు మీద వ్యాసం చెప్పమంటే ఒక అతితెలివి విద్యార్థి ఏం చెబుతాడో ఊహించడం పెద్ద బ్రహ్మ విద్యేం కాదుగదా !

  • shayi says:

   @చదువరి
   మీలాంటివాళ్ళ ’ ఆవు కాంపోజిషన్ ’ కూడా మాకూ బాగానే తెలుసులెండి.
   ఎన్ని సత్యాలు చెప్పినా అది ’ సమైక్య వాదం ’ అరుపులే అరుస్తుంది.

 3. sarath says:

  @chaduvari: హహహ……. ఇంత పెద్ద వ్యాసంలొ, రచయత భావాలను, విషయ తీవ్రతను పట్టించుకోకుండా అసలు విషయం వదిలేసి “ప్రత్యేకం” గురించి మాట్లాడేవారికి మీరెందుకు సార్ రిప్లయ్ ఇవ్వటం.

 4. ఓబుల్ రెడ్డి says:

  ఉన్న రాజ్యాన్ని బలహీనపరచడం, తద్ద్వారా ఏర్పడే రాజకీయశూన్యం కోసం గోతికాడ నక్కల్లా కాచుకునుండడం – వీటిల్లో భాగమే మావోయిస్టులు “ఆంధ్రప్రదేశ్ ముక్కలు కావాలి” అని కోరుకోవడం వెనక ఉన్న మిలిటరీ వ్యూహం. ఇందులో తెలంగాణ డిమాండు ఒక తురుపుముక్క మాత్రమే. మావోయిస్టు ఉద్యమానికీ, తెలంగాణ ఉద్యమానికీ ఆటోమ్యాటిక్ గర్భసంబంధమేమీ లేదు. వ్యూహాత్మక సంబంధం మాత్రమే ఉంది. మావోయిస్టు ఉద్యమాలు దక్షిణాసియా అంతటా ఉన్నాయి. కానీ పచ్చగా ఉన్న ఒక రాజ్యం చిచ్చుగా మారాలనీ, అది శాశ్వతంగా ముక్కలు కావాలని వాళ్ళు కోరడం మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నది. దీనిక్కారణం మావోయిస్టుల్లో ఎక్కువమంది తెలంగాణవాళ్ళు కావడం. తెలంగాణలో ఈ ఎఱ్ఱజెండావాళ్ళ ప్రాబల్యానికి మూలాలు నిజాం దుష్పరిపాలనలో ఉన్నాయి. దీనికీ ఆంధ్ర-రాయలసీమ పెట్టుబడిదార్లకూ అసలు సంబంధమే లేదు. ఇది మోకాటికీ, బోడితలకీ ముడివేయడం. కష్టాలూ, వెనకబాటూ, ఆర్థిక అసమానతలూ ఆంధ్రపదేశ్ అంతటా ఉన్నాయి. తెలంగాణలో వాటిని చూసి చలించిపోవడానికి, తెలంగాణ మిగతా రాష్టం నుండి సపరేట్ అయితే అవి సమసిపోతాయని నమ్మడానికీ అవి కేవలం తెలంగాణకే పరిమితమైన దృగ్విషయం కాదు. మావోయిజమ్ వర్గాల గొడవ. ప్రాంతాల గొడవ కాదు. చదువరిగారు చెప్పినట్లు వేర్పాటువాదులు ప్రతిదానికీ ఆంధ్రావారి (పెర్సీవ్డ్) విలనీతో ముడిపెడుతూ ఒక ఆవుకథ చెబుతూంటారు. అలా రానురాను వాళ్ళు ప్రజల్లో పెద్ద జోకర్లుగా మారిపోతున్నారు.

  ఏదేమైనా REC లో చేరి చెడిపోయిన సున్నితహృదయులైన అమాయకులలో ఆజాద్ ఒకడని ఈ అకౌంట్ ద్వారా అర్థమవుతున్నది. అంతే.

 5. shayi says:

  వ్యాఖ్యలో నేను వ్రాసిన వాస్తవాలను జీర్ణించుకోలేక, సంకుచిత స్వార్థ సమైక్యవాదాన్ని సమర్థించుకోడానికి ఏదో పాత చింతకాయ పచ్చడి సామెతను వల్లించి, మళ్ళీ సమైక్యవాదం ’ఆవు కాంపోజిషన్లు’ వ్రాస్తారే గాని, నిజంగా చెప్పవలసిన పాయింట్ ఉంటే, నా వ్యాఖ్యలోని ప్రతి వాక్యంలోని అంశాన్ని ఎత్తుకొని, “ఇది అసత్యం … ఇది వక్రీకరణ… ” అని ఆధారాలతో నిరూపిస్తూ ఖండించి, అర్థవంతమయిన చర్చ జరిపి మాలాంటి తెలంగాణవాదులను కన్విన్స్ చేసే ప్రయత్నం ఎందుకు చేయరు? అక్కడే మీ నైతిక వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. నిజమయిన సమైక్యవాదులయితే, మీ తెలుగు సోదరులే అయిన తెలంగాణవాదులు వేలాది సాక్ష్యాధారాలతో అనేక ప్రశ్నలను గుప్పిస్తుంటే, వాటికి అర్థవంతమయిన సమాధానాలు చెప్పి కన్విన్స్ చేసి వారిని తమతో కలుపుకుపోవాలి. కాని అలా చెప్పడానికి పాయింట్ లేక, ఏదో పాతకాలం ఆదర్శ వాక్యాన్ని అప్పజెప్పో , లేదా ఏదో పాత చింతకాయ పచ్చడి సామెతను( “బోడిగుండుకు మోకాలి చిప్పకు..” వంటిది ) వల్లించో, లేదా వెటకారం చేసో, దూషించో మాట నెగ్గించుకోవాలనుకోవడం… ఎంతవరకు సబబు? అందుకే పదేళ్ళుగా తెలంగాణవాదం ఇంత స్థాయికి ఎదిగింది. ఇక నా ఈ వ్యాఖ్యకు ” తాను పట్టిన కుందేటికి … ” అంటూ మరో సామెతను అందుకోడమో, లేదా అక్కసు దీరా నన్ను తిట్టిపోయడమో లేక వెటకారం చేయడమో తప్ప ….. అర్థవంతంగా మీరు చెప్పగలిగేదేమిటి?

 6. shayi says:

  ఓబుల్ రెడ్డి గారు !
  ఒకవైపు తెలంగాణవాళ్ళు మేం చచ్చిపోతున్నామంటూ ఉంటే, ” పచ్చగా ఉన్న రాజ్యం ” అంటారు. ఒకవైపు పచ్చగా ఉంటే సరిపోతుందా ?
  నాటి ’ కొండపల్లి సీతారామయ్య ’ నుండి నిన్నటి ’ ఆజాద్ ’ వరకు, ఇంకా నేటి ’ రామకృష్ణ ’ తో సహా మావోయిస్ట్ నాయకులంతా కోస్తావారే ! అయినా ” మావోయిస్టుల్లో ఎక్కువమంది తెలంగాణవాళ్ళు కావడం ” అని వ్రాస్తారు. ఎందుకు సార్ ఈ వక్రీకరణలు ?
  పైగా ” వేర్పాటువాదులు ప్రతిదానికీ ఆంధ్రావారి (పెర్సీవ్డ్) విలనీతో ముడిపెడుతూ ఒక ఆవుకథ చెబుతూంటారు. అలా రానురాను వాళ్ళు ప్రజల్లో పెద్ద జోకర్లుగా మారిపోతున్నారు. ” అంటూ పైన చెప్పిన మార్గమే తొక్కారు.
  ఏమయినా మిగితావాళ్ళలాగా కేవలం అక్కసు వెళ్ళబోసుకోడం కాకుండా, మీకు తోచిన దృక్కోణం కూడా చెప్పే ప్రయత్నం చేసినందుకు మీకు నా అభినందనలు !

 7. ఓబుల్ రెడ్డి says:

  రాజకీయ అవకాశవాదం కంటే వేరుగా వెతికినప్పుడు తెలంగాణ వేర్పాటువాదానికి సరైన కారణాలు లేవు. వేర్పాటువాదులు “కారణాలు” అని చెబుతున్నవి ఆంధ్రా ఏరియాకి కూడా సమానంగా వర్తిస్తాయి. కానీ ఆంధ్రవారు వేర్పాటువాదులు కారు. ఇప్పటికీ వారు మిగతా ఆంధ్రప్రదేశ్ తో కలిసి శాంతియుతంగా బ్రతకాలనే కోరుతున్నారు. అందుకు తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు, ఇంత సంక్లిష్టమైన కాలమాన పరిస్థితుల్లో కూడా ! ఈ వేర్పాటువాదం – తమ తమ పార్టీల అధిష్ఠానాలపై పోరాడ్డానికి వేఱే ఇష్యూలేమీ దొఱకని తెలంగాణ రెబెల్ నాయకులు ఆంధ్రావారి గురించి ఏళ్ళ తరబడి చేసిన దుష్‌ప్రచారం వల్ల, తెలంగాణ ప్రజలలో ఆంధ్రావారి గురించి గూడుకట్టుకున్న అజ్ఞానపూరితమైన, 1956 నాటి ప్రాచీనమైన, తీర్చబడని నిర్హేతుక భయాల (ఫోబియా) వల్ల, ఆంధ్రావారి గుఱించి కొందఱు వేసుకున్న అతి-అంచనాల (over-estimation) వల్ల పుట్టుకొచ్చినటువంటిది. “మేము వేరు. ఎందుకంటె మేము వేరు. ఆంధ్రావారు మా శత్రువులు. ఎందుకంటే ఆంధ్రావారు మా శత్రువులు. మేము విడిపోవాలంతే ! ఎందుకంటే మేము విడిపోవాలి” ఇదీ ఈ వేర్పాటువాద సారాంశం. ఇది “అల్లా ఒక్కడే దేవుడు. కాదన్నవాణ్ణి నరికి చంపాలి” అనే జిహాదీ టైపు ఉన్మాదంలోకి దిగింది. వేర్పాటువాది అయినవాణ్ణెవరినైనా గమనించండి. అతనొక దెయ్యం పట్టినట్లు, పూనకం వచ్చినట్లు ఊగిపోతూంటాడు. కాస్త ఎక్కువ కదిలిస్తే బూతుల వర్షం కుఱుస్తుంది. ఈ ఉన్మాదం వల్ల తెలంగాణలోని స్థానిక సమైక్యవాదులు (local unitarians) బయటికి రావడానికి భయపడుతున్నారు. అందువల్ల తెలంగాణలో అందరూ వేర్పాటువాదులే ఉన్నారనే భ్రమ కలుగుతుంది. ప్రజాస్వామ్యాల్లో సైతం బహుకొద్దిమంది అతివాదులు సిసలైన మెజారిటీ గల మితవాదుల్ని ఏ విధంగా భయభ్రాంతుల్ని చేసి నోరుమూసేసి తామే మెజారిటీలా చెలామణీ కాగలరో అనే దానికి బహుశా ఇదొక క్లాసికల్ ఎగ్సాంపుల్. ఇది అటుమొన్న మహబూబాబాద్ లో కూడా బయటపడింది. అక్కడ సమైక్యవాదులైన తెలంగాణ ఎమ్మెల్యేల మీద ఱాళ్ళతో టి.ఆర్.ఎస్. ఆధ్వర్యవంలో జరిగిన దాడి ఈ వైనాన్ని నగ్నంగా బయటపెట్టింది. ఈ మనస్తత్త్వం తెలంగాణ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. ఆంధ్రావారి మీది ద్వేషంతో ఈనాడు ఇటువంటి మనస్తత్త్వాన్ని ప్రోత్సహిస్తే ఏ అఱుదైన కారణం చేతనైనా ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు (శాంతమ్ పాపమ్) అది హిట్లర్ వంటి భయంకరులైన నరహంతకుల (Mass murderers) పాలనలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. తెలంగాణవారు ఆంధ్రవారిని అర్థం చేసుకొని వారితో కలిసుందామన్నా తెలంగాణ నాయకులు కలిసుండనివ్వరు.

  ఇంత జరుగుతున్నా సమైక్యవాదులు ఇప్పటికీ ప్రశాంతంగానే ఉన్నారు. మాటల్లో గానీ చేతల్లో గానీ సంయమనం కోల్పోకుండా సహనంతోనే వ్యవహరిస్తూన్నారు. వారు తెలంగాణవాదుల్ని కన్విన్సు చేసే ప్రయత్నం చేయలేదనే ఆరోపణ సరికాదు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పడ్డాక ఆ కమిటీకి తమ వాదాన్ని నివేదించే ప్రక్రియలో భాగంగా ఎంతో చారిత్రిక సమాచారాన్ని వెలికి తీశారు. పత్రికలలో ప్రచురించారు. పుస్తకాలు కుదా అచ్చేశారు. కానీ ఎన్ని చేసినా తెలంగాణవాదులు “మేము వినం, మేము చదవం, మేము నమ్మం” అనే పాలసీని కౌగలించుకొని తమ నమ్మకాలలోనే తాము కొనసాగడానికి నిశ్చయించుకున్నారు. ఎవఱైనా చెబితే కన్విన్స్ అయ్యే స్టేజి తెలంగాణవాదులు దాటిపోయారు. వారేమి వినాలనుకుంటున్నారో వారికి అదే వినిపించాలట. వారేది సత్యమని నమ్ముతున్నారో దానికి మఱో పార్శ్వాన్ని చూపించడానికి ప్రయత్నించిన ప్రతివారిని వినరాని దుర్భాషలతో అడిపోసుకున్నారు. ఉదాహరణకి – శ్రీ లగడపాటి రాజగోపాల్ గారు వారిని కన్విన్సు చేసి చెప్పడానికి ఎంతగా ప్రయత్నించినా సఫలం కాకపోగా తెలంగాణవాదుల చేతుల్లో తన్నులు కూడా తిన్నారని మర్చిపోరాదు. ఎవఱైనా “వేర్పాటువాదం తప్పు. అందరం సమస్యల్ని సావధానంగా సామరస్యంగా పరిష్కరించుకొని కలిసి ఉందాం” అని అనడాన్నే తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు, తాము సమైక్యరాష్ట్రంలోనే పుట్టి పెఱిగామనీ, ఇప్పటికీ సమైక్యరాష్ట్రంలోనే బతుకుతున్నామన్న సత్యాన్ని మర్చిపోయి. “సమైక్యవాదం వినిపిస్తే చంపేస్తాం” అనే చోట ఇహ కన్విన్సు చేసేదేముంటుంది ? ముందు ఒక మంచి వాతావరణాన్ని కల్పించండి. ఆ మైండ్‌సెట్ మార్చుకోండి. ఆ తరువాత ఆలోచిద్దాం ప్రత్యేక తెలంగాణ విషయం.

  నక్సలిజమ్ ఆంధ్రాలో పుట్టలేదు. అది బెంగాల్ లో పుట్టింది. దాని ప్రకంపనలు దేశంలో నలుమూలలా వినిపించాయి. ఆ మూలల్లో ఒరిస్సా సరిహద్దుజిల్లా అయిన శ్రీకాకుళం ఒకటి. మీరు చెబుతున్నది నలభయ్యేళ్ళనాటి మాట. అయితే ఇప్పుడు ఆంధ్రాలో మావోయిజమ్ లేదు. మావోయిస్టులలో అగ్రనాయకులు ఆంధ్రావారే కానీ క్యాడర్ అంతా తెలంగాణవాళ్ళే. క్యాడర్ ని కాదని అగ్రనాయకత్వం ముందుకెళ్ళడం కుదఱదు.

  నా అభిప్రాయంలో, నేను నాలో ఆలోచించుకున్న కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా ప్రత్యేక తెలంగాణ ఎప్పటికీ ఏర్పడదు.

 8. ఓబుల్ రెడ్డి says:

  తెలంగాణలో సమైక్యవాదులు చాలామంది ఉన్నారు. అందఱూ టి.ఆర్.ఎస్. ప్రచారాలకి లొంగిపోయేవాళ్ళే ఉండరనడానికి నిదర్శనంగా ఈ క్రింద ఉదాహరించిన బ్లాగుటపా చూడండి. ఇటువంటివారందఱినీ పక్కన పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పఱిస్తే అది ఎంత అప్రజాస్వామికమవుతుందో, ఎంత ఘోరమైన చారిత్రిక తప్పిదమవుతుందో ఒక్కసారి ఆలోచించండి :

  http://goolmohar.blogspot.com/2010/07/blog-post.html

 9. shayi గారూ,

  “..వ్యాఖ్యలో నేను వ్రాసిన వాస్తవాలను జీర్ణించుకోలేక,..” — ఏమిటి మీర్రాసిన వాస్తవాలు? “తానూ ఈనాటి కోస్తా పెట్టుబడిదారులలో ఒకడై ఉంటే – ఇప్పుడు కరుడుగట్టిన సమైక్యవాదిగా మాట్లాడేవాడేమో !” – ఇది వాస్తవమా? కేవలం మీ ఊహ!

  “2004 లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్ట్ పార్టీని సిద్ధం చేసాడు.” – ఇదా వాస్తవం? తెలంగాణా ఏర్పాటు చేస్తామన్నారు కాబట్టి, చర్చలకొచ్చారా? మరి చర్చలెందుకాగాయి? తెలంగాణ ఇవ్వమని తేల్చెయ్యలేదే? (ఇంకా నయం.. రేపు ఒకవేళ తెలంగాణ ఏర్పడితే, మావోయిస్టు పార్టీని మూసేస్తారని చెప్పలేదు). మీరు చెప్పింది వాస్తవం కాదు సరి కదా, కనీసం మీ ఊహ కూడా కాదు – ఇది స్వైరకల్పన!

  “సంకుచిత స్వార్థ సమైక్యవాదాన్ని సమర్థించుకోడానికి..” – ఎవరిది సంకుచితత్వం, ఎవరిది స్వార్థం? అభివృద్ధి చెందిన హై. ను అప్పనంగా కొట్టేద్దామని చూస్తున్నవారిదా, సమైక్యవాదులదా?

  “..నిజంగా చెప్పవలసిన పాయింట్ ఉంటే,..” మీ వ్యాఖ్యలో భూతద్దం పట్టుకుని వెతికినా.. బూతర్థాలు తప్ప, పాయింటేమీ లేదని చెప్పడమే నా ఆవు వ్యాఖ్యలోని ఉద్దేశం. కానీ, అది మీకు అర్థమయేలా చెప్పలేకపోయాను.

  “.. నా వ్యాఖ్యలోని ప్రతి వాక్యంలోని అంశాన్ని ఎత్తుకొని,..” – మళ్ళీ చెబుతున్నా.. ఎత్తుకోడానికి అక్కడ మీరు ఒలకబోసిన గొప్ప పాయింట్లేమీ లేవు.

  “..అర్థవంతమయిన చర్చ జరిపి మాలాంటి తెలంగాణవాదులను కన్విన్స్ చేసే ప్రయత్నం ఎందుకు చేయరు?” – మీలాంటి తె.వాదులను (అందరికీ కాదు, “మీలాంటి”వారికి! ఈ ముక్కను వదిలెయ్యకండి. ఎంచేతంటే మీలాంటి తె.వాదులు, మేమూ అందరిలాంటివాళ్ళమే అని చెప్పుకుంటూంటారు. కానీ మీదో ప్రత్యేకమైన తె.వాదం -అది విద్వేషవాదం. తెలంగాణకు అణుమాత్రమైనా ప్రయోజనం కలిగించని, నిరర్థక, నిష్ప్రయోజనకర, నిర్హేతుక విద్వేషవాదం!) కన్విన్సు చెయ్యగలిగేంత సత్తా ఉన్నవాణ్ణి కా న్నేను.

  “..నిజమయిన సమైక్యవాదులయితే, మీ తెలుగు సోదరులే అయిన తెలంగాణవాదులు వేలాది సాక్ష్యాధారాలతో అనేక ప్రశ్నలను గుప్పిస్తుంటే, వాటికి అర్థవంతమయిన సమాధానాలు చెప్పి కన్విన్స్ చేసి వారిని తమతో కలుపుకుపోవాలి.” – ఏంది కలుపుకుపోయేది? చీలడానికి, ప్రజల్ని చీల్చడానికీ, మనసుల్ని విషపూరితం చెయ్యడానికీ కంకణం కట్టుకున్నవారిని ఎవుడైనా ఎలా కలుపుకుపోగలడు?

  “..వెటకారం చేసో, దూషించో మాట నెగ్గించుకోవాలనుకోవడం… ఎంతవరకు సబబు?” – నిజమే, మీ వ్యాఖ్య చదివాక, చిరాగ్గా అనిపించి అలా ఎటకారంగా రాసినమాట వాస్తవం. అలా మాట్టాడకుండా ఉండాల్సింది. కానీ దూషించలేదు.

  “..అక్కసు దీరా నన్ను తిట్టిపోయడమో లేక వెటకారం చేయడమో తప్ప ….. అర్థవంతంగా మీరు చెప్పగలిగేదేమిటి?” – నేనేం చెప్పగలననేది నా బ్లాగులో తెలంగాణ వ్యాసాల్లో చెప్పాను. 36 వ్యాసాలు. మీకు ఆసక్తి ఉంటే, చదవొచ్చు!

 10. shayi says:

  ఓబుల్ రెడ్డి గారు !
  మీరు ఊహించుకొంటున్నంత ఉన్మాదమేదీ తెలంగాణ ప్రజలలో లేదు. ఉంటే, ’ శ్రీకృష్ణ కమిటీ ’ వేయగానే, శాంతించి, వేచి చూచే ధోరణిని అవలంబించరు. తెలంగాణ వాళ్ళని తాలిబాన్లతో, జిహాదీలతో పోలుస్తూ శత్రువులుగా భావిస్తూ దూషిస్తున్నది – రాష్ట్రం ఎట్టి పరిస్థితులలో ఇలాగే కొనసాగాలని మంకుపట్టు పట్టిన మీలాంటివాళ్ళే ! రాష్ట్రాలు, రాజకీయ పాలన వేరు. ప్రజా సంబంధాలు వేరు. ఇంత ఉద్యమ వాతావరణంలో కూడా ఇక్కడి ప్రజలు కోస్తా, రాయలసీమ మూలాలుగా గల ప్రజలతో హాయిగా సహజీవనం చేస్తున్నారు. వారిలో చాలామంది ఇక్కడి ప్రజలకు, తెలంగాణ ఉద్యమానికి సంఘీభావాన్ని తెలుపుతున్న విషయం మీరు గ్రహించాలి. అంతెందుకు ? ఇంత ఉద్యమ కాలంలో కూడా, గత రెండు, మూడేళ్ళలో మా సమీప బంధువులలో కనీసం పది కుటుంబాలు కోస్తా వాళ్ళతో వియ్యమందారు. అయినా, కర్ణాటక, తమిళనాడు వంటి వేరు భాషల రాష్ట్రాలవారితో కూడా పెళ్ళి సంబంధాలు కలుపుకొనే ఈ రోజుల్లో రాష్ట్రాలు వేరవగానే సంబంధాలు మారిపోతాయా ? మేము,మా కోస్తా బంధువులు అందరం కూర్చున్నప్పుడు ఎన్నోమార్లు ’ వేర్పాటు వాద ’ చర్చలు జరుపుతూ ఉంటాం. కాసేపయ్యాక హాయిగా నవ్వుతూ లేస్తాం. తెలంగాణవాదమెత్తగానే, ఒంటి కాలి మీద లేచి అసహనానికి గురై దూషణలు, వెటకారాలు చేసేది రాష్ట్ర విభజనకు ససేమిరా అనే సమైక్యవాదులే. అలాంటివారు మొత్తం కోస్తా, రాయలసీమ ప్రాంతంలో మహా అయితే ఒక 40% ఉంటారేమో ! కాని తెలంగాణలో తెలంగాణను కోరుకొనేవారు 95% మంది ఉన్నారు. రాష్ట్ర విభజనకు, ప్రజా సంబంధాలకు ముడి పెట్టేది సంకుచిత స్వార్థ సమైక్యవాదులే !
  ఇక మీరేమయినా దుమ్మెత్తి పోసేది మా నాయకులనే ! మీరే అన్నారు .. ” మావోయిస్టులలో అగ్రనాయకులు ఆంధ్రావారే కానీ క్యాడర్ అంతా తెలంగాణవాళ్ళే. క్యాడర్ ని కాదని అగ్రనాయకత్వం ముందుకెళ్ళడం కుదఱదు. ” అని. మరి ఆ సూత్రం రాజకీయ పార్టీలకు వర్తించదా ? వారు ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకొంటున్నారని మీకు తెలిసినా, మీలోని సమైక్యవాదం దానిని అంగీకరింపనీయదు. మొదట రాజశేఖరరెడ్డి పిచ్చివాడా ? వేర్పాటువాద పార్టీతో పొత్తు పెట్టుకోడానికి. చంద్రబాబు మూర్ఖుడా ? ఎందుకు ’ జై తెలంగాణ ’ అన్నాడు. చిరంజీవి అమాయికుడా ? పార్టీ పెట్టగానే ’ ఆత్మ గౌరవ సమస్య ’ అని మద్దతు పలికాడే ? అంతెందుకు … ఇప్పుడు ఉప ఎన్నికలనగానే మళ్ళీ చంద్రబాబు ” మేము అనుకూలమే ” అని ఎందుకన్నాడు ? వీళ్ళ కుటిలత్వమంతా ఎన్నికల ఓడ దాటాక తెలంగాణ ప్రజలను బురిడీ కొట్టించవచ్చనేగా ? నేననేది … మీరు, నేనని కాదు. ఈ మహానాయకులో, కోస్తా, రాయలసీమ ప్రాంత కవులు, కళాకారులు, మేధావులో సమైక్య రాష్ట్ర ప్రయోజనాలను అర్థవంతంగా చెప్పి, కన్విన్స్ చేసి ఓట్లు అడగవచ్చుగా ! ఒక్క పార్టీకి ఆ ధైర్యం లేదే ? ఒక్క CPIM తప్ప. ఆ పార్టీకి తెలంగాణలో వచ్చిన ఫలితాలు చూసారు గదా !
  పోనీ ! ఎన్నికల సమయం వదలి పెట్టండి. మిగితా సమయాల్లో కోస్తా, రాయలసీమ మేధావులు ఇక్కడి ప్రజలను కన్విన్స్ చేయవచ్చుగా ! ’ hmtv దశ – దిశ ’ కార్యక్రమాలు చూస్తున్నాంగా … ఏం పాయింట్లు చెబుతున్నారో ! తెలంగాణ ప్రజలు ఎత్తి చూపుతున్న సమస్యలకు, సందేహాలకు ఏం సమాధానాలు చెబుతున్నారో ! అంతా ఐకమత్యం, ఆదర్శాలపై గాలి కబుర్లు … అవి కడుపులు నింపవు సార్ ! లేదా వెటకారాలు .. దూషణలు ! అవి సమాధానాలు కాలేవు సార్ !
  పైగా, తెలంగాణ వారే దూషిస్తారని మీరు అనడం హాస్యాస్పదం. తెలంగాణవాళ్ళు మొదట ఎవరినీ దూషించరు. వారిని అవహేళనలు, దూషణలు చేస్తే మాత్రం అభిమాన ధనులుగా అంతకు పదింతలంటారు. మొదట – వారినన్న మాటలను కప్పిపుచ్చి, వారన్న మాటలనే హైలైట్ చేయడం మీడియాకు పరిపాటి అయింది.
  మీరు తెలుసుకోవలసిన మరో విషయం … కోస్తా, రాయలసీమ ప్రాంతపు ఎందరో మేధావులు తెలంగాణ వాదాన్ని సమర్థిస్తున్నారు. మీరూ hmtv చూసే ఉంటారు. రాయలసీమకు చెందిన సుప్రసిద్ధ రచయిత ’ బండి నారాయణ స్వామి ’ హైదరాబాదులో ఒక బహిరంగ సభలో ఏమన్నారో తెలుసా ? ” తెలంగాణవాదులు పోరాడుతున్నది – న్యాయమా .. అన్యాయమా .. అన్న ప్రాతిపదికన. సమైక్యవాదులు పోరాడుతున్నది – లాభమా .. నష్టమా .. అన్న ప్రాతిపదికన. ” ఇది చాలు నిష్పాక్షిక విశ్లేషణకు, సంకుచిత స్వార్థ విశ్లేషణకూ గల తేడాను గమనించడానికి. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
  వీరినందరినీ కాదని లగడపాటిని మీరు మహా మేధావి అని, ఆయన అచ్చేసిన పుస్తకాలు, కమిటీకిచ్చిన రిపోర్టులు పెద్ద విజ్ఞానమనుకొంటే .. నాకు నవ్వు ఆగడం లేదు. చరిత్ర, విజ్ఞానం లగడపాటి ఇంట్లోనో, గొడ్ల చావడిలోనో ఉండదు సార్ ! ఒక్కసారి కాస్త సమయం కేటాయించి రాష్ట్ర స్థాయి లైబ్రరీలలో క్రీ. పూ. నుండి నేటి వరకు తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన గ్రంథాలన్ని మథించండి. అప్పుడు మీకే అర్థమవుతుంది తెలంగాణ ప్రజల ఆవేదన ఏమిటో !
  ఇక తెలంగాణ ఏర్పడితే నరహంతకుల పాలన అంటూ బెదిరించడం మామూలే ! బ్రిటిష్ వాడు కూడా ఆనాడు భారతీయులను అలాగే భయపెట్టాడు.
  ఇక మీ చివరి మాట … ” నా అభిప్రాయంలో, నేను నాలో ఆలోచించుకున్న కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా ప్రత్యేక తెలంగాణ ఎప్పటికీ ఏర్పడదు. ” … అంత మీలో మీరే ఆలోచించుకొని, నలుగురికీ చెప్పుకోలేని, చర్చనీయాంశాలు కాని అపారదర్శక విషయాలు కూడా ఉన్నాయా ? అన్నదమ్ముల మధ్య అంత కుటిలత్వం అవసరమా ? మీ మాటలు చూస్తుంటే నాకు కౌరవుల కుతంత్రాలు గుర్తొస్తున్నాయి. మీ ఆలోచనలు ఎలా ఉన్నా … మేము ధర్మం జయిస్తుందని విశ్వసిస్తున్నాం.
  ఇది అర్థవంతమయిన చర్చ అయినా, కాక పోయినా, సామరస్యంగా చర్చించినందుకు మీకు నా ధన్యవాదాలు !

 11. shayi says:

  చదువరి గారు !
  ” “తానూ ఈనాటి కోస్తా పెట్టుబడిదారులలో ఒకడై ఉంటే – ఇప్పుడు కరుడుగట్టిన సమైక్యవాదిగా మాట్లాడేవాడేమో !” – ఇది వాస్తవమా? కేవలం మీ ఊహ ! ” అన్నారు. ఇది నా ఊహ కాదు, సాధారణంగా జరుగుతున్న విషయం. కానీ అలా చేయక పోవడం ’ఆజాద్’ గొప్పతనమని పొగడ్త.
  ” “2004 లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్ట్ పార్టీని సిద్ధం చేసాడు.” – ఇదా వాస్తవం? తెలంగాణా ఏర్పాటు చేస్తామన్నారు కాబట్టి, చర్చలకొచ్చారా? మరి చర్చలెందుకాగాయి? తెలంగాణ ఇవ్వమని తేల్చెయ్యలేదే? (ఇంకా నయం.. రేపు ఒకవేళ తెలంగాణ ఏర్పడితే, మావోయిస్టు పార్టీని మూసేస్తారని చెప్పలేదు). ” అన్నారు. మళ్ళీ వెటకారమే. అయినా సమాధానం చెబుతాను. ఒక్కసారి అప్పటి పేపర్లన్నీ తిరగేసి, క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పుకోండి. అది వాస్తవమా.. కాదా .. మీకే బోధ పడుతుంది –
  1. మావోయిస్టులు చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేసారు ?
  2. ఎప్పుడూ ఎలక్షన్లను బహిష్కరించమనే మావోయిస్టులు తెలంగాణ పల్లెల్లో ఎందుకు ఓట్లేయమని చెప్పారు ?
  3. కాంగ్రెస్ – TRS కూటమికి మావోయిస్ట్ పార్టీ బహిరంగంగా మద్దతెందుకు ప్రకటించింది ?
  4 కాంగ్రెస్ మానిఫెస్టొలో మావోయిస్టులతో చర్చల ప్రతిపాదన ఎందుకు ఉంచింది ?
  5 మొదటి దఫా చర్చలలో మొట్టమొదటి డిమాండేంటి ? ఆ చర్చలు ఎందుకు ఫెయిలయ్యాయి ?
  6 రెండవ దఫా చర్చలలో డిమాండ్ల సారాంశమేమిటి ? అవి ఎందుకు ఫెయిలయ్యాయి ?
  7 ముందు ఆయుధాలతో వచ్చిన మావోయిస్టులకు ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం, తరువాత ఆయుధాలు వదిలితేనే చర్చలు కొనసాగుతాయని మెలికపెట్టి అర్ధంతరంగా నిలిపివేసింది ?
  వెటకారాలు వాస్తవాలను మరుగునపడేయలేవు బ్రదర్ !
  ” అభివృద్ధి చెందిన హై. ను అప్పనంగా కొట్టేద్దామని చూస్తున్నవారిదా, సమైక్యవాదులదా? ” అన్నారు … ఇదే మీ ఆవు కాంపోజిషన్ ! 1956లో మీరు మద్రాసు రాష్ట్రంనుండి పట్టుకొస్తే, మేం కొట్టేద్దామని చూస్తున్నామా బ్రదర్ ? అదే హైదరాబాదులో మా భూస్వాములు ఇప్పుడు రోడ్ల మీదికి వచ్చారు. మా పేదలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే .. అన్నట్టుగా ఉన్నారు. అయినా .. ఇప్పుడు అభివృద్ధి చేసుకొని ఆక్రమించుకొన్నవారిని వదిలేసి పొమ్మంటున్నామా ? లేదే ? మరి ఈ పప్పులు అప్పుడు మద్రాసు నగరం కోసం ఉడకలేదే ? బొంబాయి గురించి ఇలాగే మాట్లాడిన గుజరాతీలతో అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా బ్రదర్ ? బాగా అధ్యయనం చెయ్యాలి సార్ ! … 50 ఏళ్ళు రాజధానిగా ఉన్నందుకే ఇంత ఉడుక్కుంటే … 400 ఏళ్ళు రాజధానిగా కలవారు ఏమనుకోవాలి బ్రదర్ ?
  ” “.. నా వ్యాఖ్యలోని ప్రతి వాక్యంలోని అంశాన్ని ఎత్తుకొని,..” – మళ్ళీ చెబుతున్నా.. ఎత్తుకోడానికి అక్కడ మీరు ఒలకబోసిన గొప్ప పాయింట్లేమీ లేవు. ” అన్నారు … ఇదీ వెటకారమే !
  ” “మీలాంటి”వారికి! ఈ ముక్కను వదిలెయ్యకండి. ఎంచేతంటే మీలాంటి తె.వాదులు, మేమూ అందరిలాంటివాళ్ళమే అని చెప్పుకుంటూంటారు. కానీ మీదో ప్రత్యేకమైన తె.వాదం -అది విద్వేషవాదం. తెలంగాణకు అణుమాత్రమైనా ప్రయోజనం కలిగించని, నిరర్థక, నిష్ప్రయోజనకర, నిర్హేతుక విద్వేషవాదం!) ” అన్నారు …ఇందులో పాయింటుందా ? కేవలం అక్కసు వెళ్ళగక్కడమే ! దూషణ కూడాను ! ఇంకా మీరన్న – ” ఏంది కలుపుకుపోయేది? చీలడానికి, ప్రజల్ని చీల్చడానికీ, మనసుల్ని విషపూరితం చెయ్యడానికీ కంకణం కట్టుకున్నవారిని ఎవుడైనా ఎలా కలుపుకుపోగలడు? ” … ఇదీ అక్కసే ! మరి అలా నిర్ణయించుకొన్నాక, ఇక విద్వేషాలెందుకు ? నవ్వుతూ అన్నదమ్ముల్లా విడిపోవచ్చుగా !
  ” “..వెటకారం చేసో, దూషించో మాట నెగ్గించుకోవాలనుకోవడం… ఎంతవరకు సబబు?” – నిజమే, మీ వ్యాఖ్య చదివాక, చిరాగ్గా అనిపించి అలా ఎటకారంగా రాసినమాట వాస్తవం. అలా మాట్టాడకుండా ఉండాల్సింది. ” అన్నారు. ఇక్కడ మీ సంస్కారానికి నమస్కరిస్తున్నాను.

 12. saamaanyudu says:

  అజాద్ ఓ తెలుగు చేగువేరా.. కాదు కాదు Indian Che guevera..

 13. ఓబుల్ రెడ్డి says:

  అయ్యా ! shayi గారూ ! మీరు ఎవరనేది మీ శైలిని బట్టి నేను అంతో ఇంతో పోల్చుకోగలను. నా ఊహ నిజమైతే మీరు బొంబాయిలో ఉంటున్నారు. తెలంగాణ పేరెత్తితే మీకిలా పూనకం వస్తుంది. తెలంగాణవాదులు వేరు. తెలంగాణ ప్రజలు వేరు. నేనెక్కడా పొరపడలేదు. ఎవరినీ అవమానించలేదు. నేను వ్రాసిన ఒక్క పాయింటు మీద కూడా మీరు వ్రాయలేదు. మీ గొడవలో మీరున్నారు. మీతో వాదించడం కేవలం వృథా అనిపిస్తోంది.

  ఆంధ్రావారు అంగీకరిస్తే ప్రత్యేక తెలంగాణ ఏర్పరచడం సమస్య కాదు. ఆ ఏర్పడడం, అలా విడిగా కొనసాగడం అవసరమేనని భావి తెలుగుతరాల్ని తర్కబద్ధంగా నమ్మించగలగడం ఒక పెద్దసమస్య. విడగొట్టిన తరువాత ఏదైనా చారిత్రిక అవసరం కలిగితే మళ్ళీ తెలుగువాళ్ళని కలపడం ఇంకా పెద్ద సమస్య అవుతుంది. ఈ ధోరణుల్ని anti-evolutionary tendencies అంటారు. అంటే చరిత్రలో కొన్ని పరిణామాల్ని దాటుకొని ఇక్కడిదాకా వచ్చాక మళ్లీ ఆ ప్రొసెస్ ని మొదట్నుంచీ మొదలుపెట్టుకుంటూ రావడం. ఇది అంత అవసరమా ? ఒకసారి ఆత్మశోధన చేసుకోండి. ఈ యూనిఫికేషన్ బాధలన్నీ మన పూర్వీకులు ఆల్రెడీ పడ్డారు. ఇప్పుడు మనం రాష్ట్రాన్ని విడగొట్టుకొని అంతా మొదటికి తేవడం ఏమాత్రం తెలివైన పనో, మనం ఎంత historical fools అవుతామో గమనించండి.

  లాభం-నష్టం దృష్టికంటే న్యాయం – అన్యాయం దృష్టి గొప్పదన్నారు. పదక్రీడ పక్కన పెడితే రెంటికీ ఆచరణాత్మకంగా ఉన్న తేడా ఏంటి ? అని ప్రశ్నిస్తున్నాను. సమైక్యం వల్ల లాభం కలగలేదనే ప్రాతిపదిక మీద కాదూ తెలంగాణవాదులు న్యాయం జరగలేదంటున్నారు ? ఒకవేళ లాభం కలిగితే న్యాయం జరిగినట్లే కదా ?

 14. “..’ఆజాద్’ గొప్పతనమని పొగడ్త.” – అయితేలు కానీలూ ఊహలే అవుతై, వాస్తవాలు కావు.

  ఏడు ప్రశ్నలు వేసారు. ఒక్కటి కూడా మీ మొదటి వ్యాఖ్యలో సారాన్ని ఊరించలేకపోయాయి. ఇంకోటి.. ఊరికే ప్రశ్నలు వెయ్యొద్దు, మీ పాయింట్లేంటో చెప్పండి, వాటిలో ఒప్పుంటే ఒప్పుకుంటాను, తప్పులుంటే చెబుతాను. మీరేసిన మొత్తం ప్రశ్నలూ మొదట మీరు చేసిన వ్యాఖ్యకు సంబంధం లేనివి. మీ మొదటి వ్యాఖ్యలో ఇలా అన్నారు: “కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్ట్ పార్టీని సిద్ధం చేసాడు” – మావోయిస్టులు చర్చలకొచ్చింది, తెలంగాణ ఇస్తానని అన్నందుక్కాదు, -వాళ్ళమీద బ్యాన్ను కొనసాగించనందుకు, కాల్పుల విరమణ పాటించినందుకు. ఒకవేళ మీరన్న తెలంగాణ అంశమే నిజమైతే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా చర్చలకు ఎందుకు సిద్ధమయ్యారు మావోయిస్టులు? పీపుల్సు వార్ తరపున వరవరరావు ప్రభుత్వంతో మాట్టాడారు. కొన్నాళ్ళపాటు వాళ్ళు కాల్పుల విరమణ కూడా పాటించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ’అసలు ఆయుధాలను విడిచిపెట్టాలి, అప్పుడే చర్చల’ని అంది. పైగా కాల్పులవిరమణ కాలంలో ప్రభుత్వం ఎన్‍కౌంటర్లు జరిపింది. దాంతో వాళ్ళకు విసుగొచ్చేసి చర్చల్లేవు గిర్చల్లేవు పొమ్మన్నారు. మరి, కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా ఉందని నక్సళ్ళు చర్చలకు వచ్చారని మీరు ఎలా చెబుతున్నారు? అదే నిజమైతే, తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబుతో చర్చలకు ఎందుకు సిద్ధమయ్యారు? తమ దూతను ప్రభుత్వం దగ్గరికి ఎందుకు పంపారు? కాల్పుల విరమణ ఎందుకు పాటించారు?

  వీటినిబట్టి తేలేది ఏంటంటే.. చర్చలకు పోడానికీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకతకూ సంబంధం లేదు. (చర్చలకు సిద్ధమయ్యారో లేదో తెలుసుకోవాలంటే 2002 లోవో 2003 లోవో పేపర్లు తిరగెయ్యండి తెలుస్తది.) ఇవి నిజాలు బ్రదర్, ఎటకారాలు కాదు. ప్రశ్నలు నాకు వెయ్యడం కాదు, మీకు మీరు వేసుకుని సమాధానాలు వెతుక్కోండి. లేదా మీ వాదనేంటో చెప్పండి. ఇది ఎటకారం కాదు బ్రదర్.

  “.. 50 ఏళ్ళు రాజధానిగా ఉన్నందుకే ఇంత ఉడుక్కుంటే … 400 ఏళ్ళు రాజధానిగా కలవారు ఏమనుకోవాలి బ్రదర్ ?” – మీరంటూంటారే.., మాది కడుపు ఎండిన, కడుపు మండిన వ్యవహారం, మీది కడుపు నిండిన వ్యవహారం అని -నేనన్న ఆ మాటక్కూడా మూలం అదే! నీదేదో నేను లాకున్నానని బాధపడుతూ, నాకున్నదాన్ని లాగేసుకుంటానంటే నాకు బాధుండదా బ్రదర్? ఈ మాత్రం లాజిక్కు చెప్పడానికి అంబేద్కరో, గాంధీయో రావాలా? ఇది బతుకు లాజిక్కు, కామన్ సెన్సు బ్రదర్, చరిత్ర పుస్తకాల్లో దొరకదు.

  “ఎత్తుకోడానికి అక్కడ మీరు ఒలకబోసిన గొప్ప పాయింట్లేమీ లేవు. అన్నారు … ఇదీ వెటకారమే !” ఎటకారం కాదు బ్రదర్, నిజం! మీ మొదటి వ్యాఖ్యలో సరుకేమీ లేదు. మళ్ళీ ఒకసారి చూడండి.

  ” …ఇందులో పాయింటుందా ? కేవలం అక్కసు వెళ్ళగక్కడమే ! దూషణ కూడాను !” -కాదు బ్రదర్, వివరంగా చెప్పాలంటే చాలా ఉంది, ఇక్కడ వ్యాఖ్యల్లో చెప్పలేను. నేనిచ్చానే ఆ లింకులు చూడండి, కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. దూషణంటారా.. దూషణ కాదుగానీ, దురుసుగా మాట్టాడ్డం అని నేను ఒప్పుకుంటాను. కానీ అది నా సహజ తత్వం కాదండి, మీరు ’ఆంద్రోళ్ళ’ను తిడుతుంటే వినీ వినీ నేర్చుకున్నదే! అయితే సరిగ్గా నేర్చుకోలేదు, చాలా కొద్దిగా నేర్చుకోగలిగానంతే!

  ” నవ్వుతూ అన్నదమ్ముల్లా విడిపోవచ్చుగా !” – అన్నల్దమ్ముల్లా విడిపోవచ్చండి. కానీ పంపకం న్యాయంగా ఉండాలిగా. ’నువ్వుబో, మీ రాజధాన్ని ఏర్పాటు చేసుకోపో, ఈ హై. అంతా మాదే, ఇక్కడి పరిశ్రమలన్నీ మావే, మా 67 శాతం నీళ్ళు మాక్కావాల్సిందే’ -ఇట్టా మాట్టాడితే, ఈ రకంగా పంచితే దాన్ని అన్నదమ్ముల పంపకం అంటారటండి? నిజమైన అన్నదమ్ముల పంపకం గురించి మాట్టాడి ఉంటే, శ్రీకృష్ణ కమిటీ అవసరం ఉండేదే కాదని నా అభిప్రాయం బ్రదర్. అన్నదమ్ముల్లాగా విడిపోదామనేది తె.వాదుల వ్యూహంలో భాగమే తప్ప, పెదాల మీదనుంచి వచ్చిన మాటే తప్ప, గుండెలోంచి వచ్చినది కాదు బ్రదర్.

 15. shayi says:

  ఓబుల్ రెడ్డి గారు !
  తెలంగాణవాడు బొంబాయిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా ఆ ప్రాంతం కష్టనష్టాలు తెలిసినవాడిగా ఎప్పుడూ తెలంగాణవాదిగానే ఉంటాడు. దాన్ని మీరు పూనకం అని కొట్టిపారేయకపోతే మీకు మీరు ఎలా సమాధానం చెప్పుకోగలరు? అయినా నేనెక్కడుంటున్నానో ఈ చర్చకు అవసరమా ?
  విడగొట్టిన తరువాత మళ్ళీ కలపడమా? ఒక్కసారి విముక్తి పొందితే చాలని తెలంగాణ ప్రజలనుకొంటుంటే ! మా దృష్టిలో విడగొట్టడం అంటే ఆధిపత్యాన్ని తొలగించడం .. మేము ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసుందామంటాం. మీరు ప్రజలుగా కొట్టుకుచచ్చినా ప్రాంతాలుగా కలిసుండాలి అంటారు. అదే న్యాయానికి, లాభానికి తేడా ! ఇంకా వివరంగా చెప్పాలంటే .. న్యాయబద్ధంగా అందే భాగం న్యాయం అవుతుంది. పక్కవాడిది అనుభవించడం లాభం అవుతుంది. రెండూ ఒకటే అనుకొంటేనేగదా అప్పుడప్పుడూ మేల్కొనే మీ అంతరాత్మను నిద్రపుచ్చగలిగేది !
  మీరు భావితరాల గురించి మాట్లాడుతున్నారు. 1969 ఉద్యమంనాటి విద్యార్థులు ఇప్పటికీ తెలంగాణవాదులుగానే ఉన్నారు. వాళ్ళకేం సమాధానం చెప్పగలరు మీరు? ఇవాళ తెలంగాణలో స్కూలు పిల్లలు ’జై తెలంగాణ’ అంటున్నారు. వాళ్ళలో ఎంతమంది రేపు KCR లవుతారో మాకు తెలుసు.
  ఇప్పుడు ఒకవేళ తెలంగాణ రాకపోతే, తెలంగాణకు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. వాళ్ళ దీన, హీన స్థితులు అలాగే కొనసాగుతాయి. నిండా మునిగినవానికి చలేమిటి? నిత్య ఘర్షణలతో, అభివృద్ధికి ఆటంకాలతో నష్టపోయేది కోస్తా, రాయలసీమ సోదరులే ! హైదరాబాదుకు వచ్చే బలిసిన, ఇంకా మధ్య తరగతి ప్రజల గురించి బాధ లేదు. నిజమయిన సామ్యవాది అయితే .. రాజధానికి చాలా దూరంగా ఎక్కడో పల్లెల్లో నలిగిపోయే పేదల గురించి బాధపడాలి. తెలంగాణ ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్నాళ్ళకయినా రాక తప్పదు. ఆంధ్ర రాష్ట్రం అప్పుడు zero base నుంచి ఆరంభమవడం దౌర్భాగ్యం.
  ” మీతో వాదించడం కేవలం వృథా అనిపిస్తోంది. ” అన్నారు. నేనలా అనుకోడం లేదు. కొంతైనా మా ఆవేదన, భావ వ్యాప్తి జరుగుతుందనుకొంటున్నాను. అయినా మీరు ఆపేయదలచుకొంటే .. నిరభ్యంతరంగా ఆపేయవచ్చు.

 16. shayi says:

  చదువరి గారు !
  నేను వేసిన ప్రశ్నలకు, తెలంగాణవాదానికి సంబంధమే లేదని ముందే ముడుచుక్కూర్చుంటే .. ఇక నేను చెప్పేదేముంది ?
  కనీసం ఆ అయిదో ప్రశ్నకు సమాధానమయినా అప్పటి పేపర్లు తిరిగేసి చూడండి.
  ” నీదేదో నేను లాకున్నానని బాధపడుతూ, నాకున్నదాన్ని లాగేసుకుంటానంటే నాకు బాధుండదా బ్రదర్? ఈ మాత్రం లాజిక్కు చెప్పడానికి అంబేద్కరో, గాంధీయో రావాలా? ఇది బతుకు లాజిక్కు, కామన్ సెన్సు బ్రదర్, చరిత్ర పుస్తకాల్లో దొరకదు. ” … నిజమే పాపం ! మహా భారత కాలంనుంచి, మొన్నటి ఆంధ్ర రాష్ట్రం, నిన్నటి గుజరాత్ రాష్ట్ర ఏర్పాటువరకు ఇలాంటి సందర్భాలు లేవు.. తీర్పులు లేవు .. విచిత్రం ! ఇదంతా చూస్తుంటే .. హైదరాబాదును మేమే అభివృద్ధి చేసామని గొప్పలు చెప్పుకొనే మీరు, మరో నగరాన్ని మాత్రం అభివృద్ధి చేయలేని చేతగానితనాన్ని, నైరాశ్యాన్ని ప్రకటించినట్టయింది.
  ” మీ మొదటి వ్యాఖ్యలో సరుకేమీ లేదు. ” అన్నారు. నాకూ మీ సమాధానాలను చూస్తే అలాగే అనిపిస్తుంది మరి !
  చివరలో మాత్రం ఒక్క మంచి మాటన్నారు. ” నిజమైన అన్నదమ్ముల పంపకం గురించి మాట్టాడి ఉంటే, శ్రీకృష్ణ కమిటీ అవసరం ఉండేదే కాదని నా అభిప్రాయం బ్రదర్ ” అని. తెలంగాణ మేధావులు ఎన్నోసార్లు అడిగారు.. ” విడిపోడానికి ఒప్పుకోడానికి మీ డిమాండ్లేంటి? ” అని. కోస్తా, రాయలసీమ మేధావులు ( పొత్తూరి, డా. ఎం. వి.రమణారెడ్డి, భూమన్ మొ||నవారు ) ” తెలంగాణ ప్రజల నోటి ముందు ఫలాన్ని లాక్కోడం కాదు ..ఇప్పుడు మనకేం కావాలో చెప్పాలి ” అన్నారు. అలాంటి కోణంలో సమక్యవాదులు ముందుకు రాకపోగా, రాష్ట్ర విభజనకు ససేమిరా అని భీష్మించి, ఇప్పుడు “అన్నదమ్ముల్లాగా విడిపోదామనేది తె.వాదుల వ్యూహంలో భాగమే తప్ప, పెదాల మీదనుంచి వచ్చిన మాటే తప్ప, గుండెలోంచి వచ్చినది కాదు బ్రదర్.” అని అభాండం వేయడం ఎంతవరకు న్యాయమో.. గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి.

 17. మీ తె.వాదులతో ఇదే తలకాయనెప్పి – హై.ను మేం అభివృద్ధి చేసామని నేనెప్పుడన్నాను? ఎక్స్ట్రీములకెళ్ళిపోయి ఆలోచించడం తప్ప కాస్త సావధానంగా, నిదానించి ఆలోచించడమనేదే లేదు. సరే.., ఇదంతా పక్కన పెట్టండి, మన చర్చ పక్కదారి పడుతోంది..

  నా చర్చంతా మీ మొదటి వ్యాఖ్య గురించే!

  “నేను వేసిన ప్రశ్నలకు, తెలంగాణవాదానికి సంబంధమే లేదని ముందే ముడుచుక్కూర్చుంటే .. ఇక నేను చెప్పేదేముంది ?” – అని మీరన్నారు. కానీ అసలు నేనన్నదేంటి? “మీరేసిన మొత్తం ప్రశ్నలూ మొదట మీరు చేసిన వ్యాఖ్యకు సంబంధం లేనివి.” అని. మీరు దాన్ని దారి మళ్ళించారు.

  మీరు “నిజంగా చెప్పవలసిన పాయింట్ ఉంటే, నా వ్యాఖ్యలోని ప్రతి వాక్యంలోని అంశాన్ని ఎత్తుకొని, ఇది అసత్యం … ఇది వక్రీకరణ… అని ఆధారాలతో నిరూపిస్తూ ఖండించి, ” – అంటూ చెప్పుకుపోయారు. అందుకనే మీరు రాసిన ఆ వ్యాఖ్యలోని అంశాల్లో ఎందుకు పసలేదో రాసాను, ఇప్పుడు మీరు దాన్ని దారిమళ్ళిస్తున్నారు.

  “2004 లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్ట్ పార్టీని సిద్ధం చేసాడు.” అని మీరన్నారు. అదే నిజమైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేకి అయిన చంద్రబాబుతో చర్చలకు ఎందుకు సిద్ధపడ్డారని అడిగాను. మీరు దాన్ని పక్కన పెట్టారు. నా ఉద్దేశమల్లా ఒక్కటే -మీ మొదటి వ్యాఖ్యలో సరుకు లేదు. అంతే!

  ఇక మీరు రాసిన ఏడు ప్రశ్నలపై చర్చ -ప్రతీ ఒక్కదాని గురించీ సాకల్యంగా చర్చించవచ్చు. అయితే నా గత వ్యాఖ్యలో చెప్పినట్టు, అవి మీ మొదటి వ్యాఖ్యకు ఊపిరులూదలేవు. కాబట్టి ఇక్కడ చర్చ అనవసరం. అది మరెప్పుడైనా మరెక్కడైనా చేద్దాం. నాకూ ఆసక్తే. ఈ టపాలో కాదు.

  shayi గారూ, మీచేత దేన్నో ఒప్పించాలనో, ఏదో చెప్పించాలనో నాకు లేదు. ప్రతీ విషయాన్నీ ’ప్రత్యేక రాష్ట్ర’ కళ్ళజోడు పెట్టుకుని చూసి, ’ప్రత్యేక’ భాష్యాలు చెబుతూంటే ఆవు వ్యాసం లాగే ఉంటుందనేది నే చెప్పదలచాను అంతే! ఉంటానండి, నమస్కారం!

 18. ఓబుల్ రెడ్డి says:

  విముక్తి అట.

  ఆంధ్రా-తెలంగాణ ప్రజలూ కలిసే ఉన్నారు. ప్రాంతాలూ కలిసే ఉన్నాయి. మీవంటివారు ఏ గొడవా చేయకపోతే ఇంకొన్నివందల సంవత్సరాల పాటు కలిసే ఉంటారు. స్వాభావికంగా ఏ గొడవా లేనివాళ్ళ మధ్య non-issues ని issues గా మారుస్తూ వేర్పాటువాదాన్ని పెంచిపోషిస్తున్నది తెలంగాణ మేధావులూ, కేసీయార్ లాంటి నాయకులూ మాత్రమే. తమతో ఏ పో్లికా లేని పెర్షియన్ ఆధిపత్యం వర్గంతో 175 సంవత్సరాల పాటు సహజీవనం చేయగల్గిన తెలంగాణవారు తమ సోదరసమానులైన ఆంధ్రావారితో కలిసి ఉండలేరని చెప్పడం హాస్యాస్పదం. ఈ సహజీవనాన్ని బానిసత్వంగా అభివర్ణిస్తే ప్రపంచంలో అన్ని మానవసంబంధాలూ బానిసత్వమే అనాల్సివస్తుంది.

 19. shayi says:

  చదువరి గారు !
  చంద్రబాబుతో మావోయిస్టులు చర్చలకు సిద్ధపడ్డ విషయం నేను మీ వక్రీకరణగా భావిస్తున్నాను. నాకు గురుతున్నంత మట్టుకు చంద్రబాబు ’మాధవ రెడ్డి’ హత్య తరువాత మావోయిస్ట్ పార్టీని నిషేధించాడు. ఆ తరువాత మావోయిస్టులు చంద్రబాబు వల్డ్ బాంక్ తొత్తుగా మారాడని శత్రువుగా చూడడం మొదలు పెట్టారు. ఆ కాలంలో వాళ్ళ విప్లవ గీతాలను ఫాలో అయినవాళ్ళకు దాని పర్యవసానంగానే తెలంగాణ పల్లెల్లో రైతుల ఆత్మహత్యలు, సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, మహబూబ్ నగర్ లో వలసలు అధికమయినట్టుగా భావించారని అవగతమవుతుంది. అందుకే వాళ్ళు ఆయనపై హత్యాప్రయత్నం చేసారు. దాని వెనువెంటనే ఆయన ఎన్నికలకు సిద్ధపడ్డాడు. ఇక చర్చల ప్రసక్తి ఎక్కడ వచ్చిందో మీరే తేల్చాలి. అయితే, మీరు మరీ మరీ అదే చెబుతున్నారంటే, నేను వెరిఫై చేసుకోవాలి .. అనుకొని నేను ఆ విషయంపై స్పందించలేదు. అలాగే ” రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో మొదటి దఫా చర్చలలో మొట్టమొదటి డిమాండేమిటి? ” అని నేను ఎన్నిసార్లడిగినా మీరు స్పందించడం లేదు. ఇలా ఇద్దరం వెరిఫై చేసుకోవాల్సిన అంశాలున్నప్పుడు మీరన్నట్టు ఇక చర్చ కొనసాగడం కష్టం. ఒక్కటి మాత్రం నిజం … 2004లో మావోయిస్టులు కాంగ్రెస్ – TRS కూటమికి దగ్గరవడంలో తెలంగాణ అంశం ప్రధాన పాత్ర పోషించిందని నేనే కాదు, చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు.

 20. shayi says:

  ఓబుల్ రెడ్డి గారు !
  మా వంటివారు గొడవ చేయకపోతేనేగదా యాబయ్యేళ్ళు ఆధిపత్య పాలన సాగింది. కాని ఇప్పుడు తెలంగాణలో 95% ప్రజలకు వాళ్ళకు జరిగే అన్యాయాలపై అవగాహనతో కూడిన చైతన్యం ఉంది. ఇంకా వందల సంవత్సరాల కలలు కనడం ఆపండి. ఏమన్నారూ ?… ” తమతో ఏ పో్లికా లేని పెర్షియన్ ఆధిపత్యం వర్గంతో 175 సంవత్సరాల పాటు సహజీవనం చేయగల్గిన తెలంగాణవారు తమ సోదరసమానులైన ఆంధ్రావారితో కలిసి ఉండలేరని చెప్పడం హాస్యాస్పదం. ఈ సహజీవనాన్ని బానిసత్వంగా అభివర్ణిస్తే ప్రపంచంలో అన్ని మానవసంబంధాలూ బానిసత్వమే అనాల్సివస్తుంది. ” అంటారా ? మరి, తమతో ఏ పోలికా లేని బ్రిటిష్ ఆధిపత్య వర్గంతో 200 సంవత్సరాల పాటు సహజీవనం కాదు … బానిసత్వం అనుభవించిన కోస్తా, రాయలసీమవారు భారతీయ సోదరులే అయిన తమిళులతో కలిసి ఉండలేకపోవడం హాస్యాస్పదమే కాదు … సిగ్గు చేటు కాదా ? ఇదే మరి .. న్యాయానికి, లాభానికి తేడా !

 21. shayi గారూ,
  “అని నేను ఎన్నిసార్లడిగినా మీరు స్పందించడం లేదు.” – అదే చెబుతున్నానండి, మీ మొదటి వ్యాఖ్య గురించి నేను చేసిన వ్యాఖ్యకు మీరు, ’నిజంగా చెప్పవలసిన పాయింట్ ఉంటే, నా వ్యాఖ్యలోని ప్రతి వాక్యంలోని అంశాన్ని ఎత్తుకొని,’ అంటూ స్పందించారు – దానికి స్పందనే నేను రాసిన చంద్రబాబుతో చర్చల సంగతి. అంతేగానీ, 2004 చర్చల్లో వాళ్ళు పెట్టిన పాయింట్లేంటన్నది మన చర్చావిషయం కాదు. అందుకే నేను దాని గురించి స్పందించలేదు. అంతేతప్ప తెలంగాణ అంశం వాళ్ళ డిమాండ్లలో లేదని నేను అనడం లేదు. వాస్తవాన్ని కాదని ఎలా అంటాను? నేనన్నదేంటంటే –

  “..రాష్ట్ర విభజనను కోర కూడదంటూ వాదించే వారికి కనువిప్పుగా ఇది వ్రాస్తున్నాను.”
  “అందరిలాగే బాగా చదువుకొని, అమెరికాకు వెళ్ళి కోట్లు కోట్లు సంపాదించి, హైదరాబాదులో వ్యాపారాలు నెలకొల్పి, తానూ ఈనాటి కోస్తా పెట్టుబడిదారులలో ఒకడై ఉంటే – ఇప్పుడు కరుడుగట్టిన సమైక్యవాదిగా మాట్లాడేవాడేమో !”
  “2004 లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్ట్ పార్టీని సిద్ధం చేసాడు.”
  మీ మొదటి వ్యాఖ్యలొ రాసిన పై వ్యాఖ్యానాలు అసంబద్ధమైనవని అన్నాను.

  పోతే, ఆ చంద్రబాబు ప్రభుత్వంతో చర్చల ప్రయత్నాల సంగతి క్షుణ్ణంగా తెలిసిన వేణుగోపాల్ గారి బ్లాగులోనే మనమిద్దరం ఈ చర్చ చేస్తున్నాం. :) వారేమైనా చెబుతారేమో చూద్దాం. ఈలోగా నేనూ చూస్తాను, జాలంలో దొరక్కపోదు.

 22. ఓబుల్ రెడ్డి says:

  వేర్పాటువాదాన్ని ఖండించినప్పుడల్లా తెలంగాణని ఆంధ్రోద్యమంతో పోల్చడాన్ని గమనిస్తున్నాను. ఇదొక హాస్యాస్పదమైన పోలిక. ఈ పోలిక తెచ్చేవాళ్లు రెండు ఉద్దేశపూర్వక నేరాలకి పాల్పడుతూంటారు. ఒకటి – తెలుగువాళ్ళతో ఏ పోలికా లేని తమిళులతో ఆంధ్రావారికి బాంధవ్యాన్ని అంటగట్టడం. రెండొది, చాలా తెలంగాణవారితో సహజ బాంధవ్యం గల ఆంధ్రావారిని తెలంగాణవారి పాలిట విదేశీయుల్ని చేసి మాట్లాడడం. ఇది కేసీయార్ టెక్నిక్కు. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే – కొంతమంది చదువుకున్న తెలుగువాళ్ళని మీ ముందు నిలబెడితే వాళ్ళలో ఎవరు ఆంధ్రావాల్లో ఎవరు తెలంగాణవాళ్లో మీరు చెప్పలేరు. ఈ కృత్రిమభేదం గురించి మనం ప్రత్యేక రాష్ట్రాల దాకా వెళ్ళి కొట్టుకు చావడం అవసరమా ?

 23. ఓబుల్ రెడ్డి says:

  corrected version :

  వేర్పాటువాదాన్ని ఖండించినప్పుడల్లా తెలంగాణని ఆంధ్రోద్యమంతో పోల్చడాన్ని గమనిస్తున్నాను. ఇదొక హాస్యాస్పదమైన పోలిక. ఈ పోలిక తెచ్చేవాళ్లు రెండు ఉద్దేశపూర్వక నేరాలకి పాల్పడుతూంటారు. ఒకటి – తెలుగువాళ్ళతో ఏ పోలికా లేని తమిళులతో ఆంధ్రావారికి బాంధవ్యాన్ని అంటగట్టడం. రెండొది, తెలంగాణవారితో చాలా సహజ బాంధవ్యం గల ఆంధ్రావారిని తెలంగాణవారి పాలిట విదేశీయుల్ని చేసి మాట్లాడడం. ఇది కేసీయార్ టెక్నిక్కు. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే – కొంతమంది చదువుకున్న తెలుగువాళ్ళని మీ ముందు నిలబెడితే వాళ్ళలో ఎవరు ఆంధ్రావాళ్ళో ఎవరు తెలంగాణవాళ్లో మీరు చెప్పలేరు. ఈ కృత్రిమభేదం గురించి మనం ప్రత్యేక రాష్ట్రాల దాకా వెళ్ళి కొట్టుకు చావడం అవసరమా ?

 24. shayi says:

  చదువరి గారు !
  ” తెలంగాణ అంశం వాళ్ళ డిమాండ్లలో లేదని నేను అనడం లేదు.” అని మీరంటున్నారు. మీలోని సమైక్యవాదం మిమ్మల్ని అక్కడికే పరిమితం చేసింది.
  చర్చలకు నేపథ్యం, ప్రధాన అజెండా మొత్తం తెలంగాణ అంశమే అని నేను నమ్ముతున్నాను. ఏమో ! ఇది నాలోని తెలంగాణవాదమేమో !
  ఇప్పటికే మనం చాలా దగ్గరికి వచ్చాం. ఇక ముందు చర్చించినా మనలోని వాదాలు మనను ఏక తీర్మానానికి రానీయలేవు. ఇక చర్చ కొనసాగినా ఫలితం ఉండదు.
  మీరన్నట్టూ … వేణుగోపాల్ గారే సాక్షి !
  వేణుగోపాల్ గారికి, మీకు నా ధన్యవాదాలు !

 25. shayi says:

  ఓబుల్ రెడ్డి గారు !
  ఏ పోలికా లేని తమిళులా !
  పోలిక, సహజీవనానికి భాష కాదు ప్రధానం. నడవడి, జీవన విధానం.
  మీకు తమిళులతో ఉన్న పోలిక తెలంగాణవారితో లేదని కచ్చితంగా చెప్పగలను.
  మీరు, తమిళులు తొందరగా పడుకొని, పెందలాడే నిద్ర లేస్తారు. తెలంగాణవాళ్ళు రాత్రి కాస్త ఆలస్యంగా పడుకొని, సాధారణంగా కాస్త ఆలస్యంగా నిద్ర లేస్తారు. మీరు వాళ్ళలాగే ఇడ్లీ, సాంబార్ ఇష్టపడతారు. తెలంగాణవాళ్ళు రొట్టె, పప్పుగాని, కూరగాని ఎక్కువగా తింటారు. ఇతర వంటకాలల్లో కూడా మా మసాలాలు వేరు. మీ వంటకాలు వేరు.
  మీకు, తమిళులకు సంక్రాంతి పెద్ద పండుగ .. మాకు దసరా .. మీరు, తమిళులు ప్రతిదాన్ని తెలివిగా, ముందు జాగ్రత్తగా చూస్తారు. అంతా అయిపోయాక గాని జరిగింది తెలుసుకొనే అమాయకత్వం తెలంగాణ ప్రజలది. ఇలా ఇంకా ఎన్నైనా చెప్పగలను. యాబయ్యేళ్ళ సహజీవనంలో ఇప్పటికీ మన పద్ధతులు వేరుగానే కొనసాగుతున్నాయి.
  ఇక్కడ మీరు పోలిక, భాష అన్న ఊకదంపుడు మాటలు చెప్పేది లాభ,నష్టాలు బేరీజు వేసుకోడం వల్లే ! నిజంగా అలా కాకపోతే.. 1973లో ముల్కి రూల్స్ వల్ల మీకు నష్టం అని భావించినప్పుడు ’జై ఆంధ్ర’ ఉద్యమం ఎందుకు లేవదీసారు ? అప్పుడు తెలుగు భాష, పోలిక ఎక్కడికి పోయాయి స్వామీ ?

 26. shayi గారూ,
  http://www.pucl.org/Topics/Industries-envirn-resettlement/2003/ccc.htm -ఈ లింకు చూడండి. 2002 లో చంద్రబాబు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నక్సళ్ళు ఎంత ప్రయత్నించారో తెలుస్తుంది.

  “చర్చలా? నేనా? వాళ్ళతోటా?” అని చంద్రబాబు అంటే, సరేనని జూనియరు మంత్రులతోటి చర్చించేందుకు సిద్ధపడ్డారు. లాల్ బహదూరు స్టేడియములో చర్చించాలన్నదానికి ప్రభుతం ఒప్పుకోకపోతే, మంత్రి ఛాంబర్లో చర్చించేందుకు సిద్ధపడ్డారు. కాల్పుల విరమణను అమలు చేసారు. ఆ సమయంలో ఎన్‍కౌంటర్లు జరిగినా సర్దుకుపోయారు. వీళ్ళు మంత్రితో మాట్టాడ్డానికి వెళ్ళేసమయానికి (అసలు చర్చలు మొదలై కొంత ముందుకు పోయినట్టే అగుపిస్తోంది) ఎన్‍కౌంటరు జరిగినా కూడా చర్చలను కొనసాగించారు -ఎన్‍కౌంటరు జరిగిన సంగతి నాకు తెలియదని మంత్రి అంటే సరేనని ఒప్పుకున్నారు.

  ఎక్కడా తెలంగాణ ఊసులేదు. అ సమయంలో చంద్రబబు తెలంగాణ ప్రత్యేకరాష్ట్రానికి వ్యతిరేకి అని వేరే చెప్పనక్కరలేదు! నేను నక్సళ్ళను తప్పు పట్టడం లేదు. చర్చలకోసం హుందాగా ప్రయత్నించి ఉండొచ్చు. కానీ మీ మొదటి వ్యాఖ్య గురించే నా గోసంతా! నేనేదో మిమ్మల్ని ఎటకారం చేసేసానని నామీద కోప్పడతన్నారుగానీ, అందులో సరుకు లేదనేది వాస్తవం.

  ఉంటానండి, నమస్కారం!

 27. shayi గారూ,
  మీ నమ్మకంతో నాకు పనిలేదు. నమ్మకం వేరు. దాన్ని మార్చుకోడం చాలా కష్టం. మారేందుకు ఇష్టపడితే తప్ప, మన నమ్మకాలను మార్చుకోం. అంచేత దాన్ని నేను మార్చాలని అనుకోవడం లేదు. కానీ వాస్తవమేంటో చూడమంటున్నాను. నా గత వ్యాఖ్యలో ఇచ్చిన లింకు చూసారా? అందులోని వాస్తవాన్ని గమనించారా? అది ఏ రైటిస్టులో సెంట్రిస్టులో చెప్పింది కాదు. స్వయానా పీపుల్సు వారు చెప్పిందే, మధ్యవర్తిత్వం వహించిన పౌరుల సంఘం చెప్పిందే! ఏమంటారిప్పుడు?

  అది చదివినా మీ నమ్మకాన్ని మార్చుకోలేరు, నాకు తెలుసు. ఎందుకంటే మీ నమ్మకం మీ వాదానికి బలాన్నిస్తోంది. ఒక నైతిక స్థైర్యాన్నిస్తోంది. అంచేత దాన్ని వదులుకోలేరు. ఇంకోటి.. ఇంతా చదివాక కూడా మీ తొలివ్యాఖ్యపై నే జేసిన విమర్శను వక్రీకరణే అని అంటారు, అదీ నాకు తెలుసు. ఎంచేతంటే తె.వాదిగా అది మీకు జీవజలం. ఉద్యమోజ్వలన ఇంధనం!

 28. shayi says:

  చదువరి గారు !
  సరే … తెలంగాణవాదం మాకు జీవజలం అని మీరంటే, సమైక్యవాదం మీకు లాభఫలం అని నేనంటాను.
  నేనెన్ని పాయింట్లు చెప్పినా, వాటన్నిటి మీద స్పందించకుండా పక్కన బెట్టి, నా దృష్టికి రాని ఒక్క పాయింటును పట్టుకొన్నారేంటా .. అనుకొన్నాను. మీరిచ్చిన లింక్ చూసాక, ఇప్పుడర్థమయింది. కాని అందులోని వార్తల నేపథ్యం ఏమిటి? తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిగిన చర్చల నేపథ్యం ఏమిటి?
  ఒకవైపు నక్సలైట్లతోబాటు సామాన్యులపై కూడ అనుమానంతో విపరీతమయిన పోలిసుల ఎన్కౌంటర్లు, మరో పక్క మావోయిస్టులు తరచుగా జరుపుతున్న హింసాత్మక ఘటనలు, ఇంకో పక్క ఇన్ఫార్మర్లేమో అన్న అనుమానంతో కొందరు సామాన్యుల హత్యలతో.. ఇలా రెండు వర్గాల మధ్య, ప్రజలు భయభ్రాంతులై, తెలంగాణ పల్లెలు అట్టుడుకుతున్న నేపథ్యంలో.. ఆ ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడానికి మధ్యవర్తులుగా కన్నాభిరాన్, గద్దర్ లాంటివాళ్ళు అటు ప్రభుత్వాన్ని, ఇటు మావోయిస్టులను చర్చించుకొమ్మన్న నేపథ్యానికి …, తరువాత కాలంలో నక్సలిజమన్నది సామాజిక ఆర్థిక సమస్యగా పరిగణించి, కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన విస్తృత చర్చల నేపథ్యానికి … ఏమయినా సంబంధముందా ? తాత్కాలిక ఉపశమనం లక్ష్యంగా మధ్యవర్తులు ప్రభుత్వాన్ని, మావోయిస్టులను చర్చలు జరుపుకొమ్మనడానికి … శాశ్వత పరిష్కారం కొరకు ప్రభుత్వం, మావోయిస్టులు చర్చించడానికి సిద్ధపడి మధ్యవర్తులను నియమించుకోడానికి తేడా మీకు తెలియక కాదు. శాశ్వత పరిష్కారమన్నప్పుడే తెలంగాణ అంశం తెరపైకి వస్తుందని కూడా మీకు అర్థం కాక కాదు. దాన్ని, దీన్ని ఒకే గాటన కట్టి, మీలోని సమైక్యవాదం నా తెలంగాణవాదాన్ని ఏదోలా బురిడీ కొట్టించాలని చేసిన ప్రయత్నమే అది అన్నది సుస్పష్టం. అసలు 1969లో తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కాకే, తెలంగాణలో నక్సలిజం వేళ్ళూనుకొన్నదన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి మావోయిస్టులు శాశ్వత పరిష్కారం కొరకు ఎప్పుడు చర్చించినా, ఆ చర్చలకు మూలం తెలంగాణ అంశమే అవుతుంది. కాని మీ సమైక్యవాదం దీన్ని మీతో అంగీకరించనీయదు.
  అందుకే అన్నాను … మనం చర్చలో చాలా చేరువగా వచ్చాం. మిమ్మల్ని మీ సమైక్యవాదం ఇక ఇంకా ముందుకు అడుగు వేయనీయదు. ఇంకా చర్చిస్తే నమ్మకాలు, అభిప్రాయాలంటూ మీ నుండి వ్యక్తిగత విమర్శతో కూడిన వ్యాఖ్యలే వస్తాయి తప్ప, ఫలితం ఉండదు. సెలవు.

 29. Pingback: 2010 in review « KadaliTaraga : a wave in the Ocean !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s