జర్నలిస్టులకు ఎవరి సర్టిఫికెట్ కావాలి?

(ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ, జూలై 6, 2010)

వర్తమాన ఘటనలు జరగగానే గత ఘటనలు గుర్తు రావడం మన జ్ఞాపకశక్తికి చిహ్నమైతే కావచ్చు గాని సమాజం ముందుకు పోతున్నదనడానికి మాత్రం చిహ్నం కాదు. ఇప్పుడు కూడ అప్పటిలాగనే జరుగుతున్నదనో, అప్పటికన్న ఘోరంగా జరుగుతున్నదనో అనిపించడం సామాజిక పరిణామానికైతే మంచిది కాదు. కాని తెలుగు సమాజానికి ఇది నిత్యకృత్యమయిపోయింది. అవే అవే విషాద, దుస్సహ దృశ్యాలు మళ్లీ మళ్లీ కనబడుతున్నాయి. ఇవాళ జరుగుతున్న సన్నివేశాలన్నీ ఇదివరకే అనుభవించిన విసుగూ దుఃఖమూ కలుగుతున్నది. గతంలో ఇటువంటి ఘటనలే అనేకం జరిగి అశ్రువులూ రక్తాశ్రువులూ నదీ ప్రవాహాలయి ఇవాళ కొత్త సంఘటనలకు కన్నీళ్లింకిపోయిన స్థితి వస్తున్నది.

వార్తాసేకరణ కోసం ఢిల్లీనుంచి దండకారణ్యానికి బయలుదేరి, నాగపూర్ దాకా వచ్చి, ఆదిలాబాద్ జిల్లా జోగాపూర్ అడవిలో మావోయిస్టు నేత ఆజాద్ తో కలిసి మృతదేహమై మిగిలి, జర్నలిస్టా కాదా అని ధర్మసందేహాలకు ఆస్కారం ఇచ్చిన హిందీ పత్రికా రచయిత హేమచంద్ర పాండే ఉదంతం అటువంటి పాత జ్ఞాపకాలను రెండిటిని మేల్కొలిపింది.

ఒకటి, మా వరంగల్లులో  ఇరవై ఐదు సంవత్సరాల కింద జరిగినది. రెండవది, పద్దెనిమిది సంవత్సరాల కింద గులాం రసూల్ అనే మరొక జర్నలిస్టుకు జరిగినది, ఇరవై ఏళ్లుగా తెలుగునాట డజన్లకొద్దీ జర్నలిస్టులకు జరుగుతున్నది.

వరంగల్ లో 1980ల తొలిరోజుల్లో అన్ని విద్యాలయాల్లోను విప్లవ విద్యార్థి ఉద్యమం బలంగా సాగుతున్నప్పుడు, దాన్ని అణచివేయడానికి పోలీసులు భయంకరమైన పద్ధతులెన్నో చేపట్టారు. వాటిలో భాగంగా విద్యాలయాల్లోకి ఎప్పుడంటే అప్పుడు జొరబడడం, విద్యార్థులనూ అధ్యాపకులనూ బెదిరించడం, విద్యార్థులను ఎత్తుకుపోవడం, చివరికి తరగతి గదుల్లోకి కూడ జొరబడి లాఠీఛార్జి చేయడం జరిగాయి. ‘విద్యాలయ ప్రాంగణం ఎవరుపడితే వాళ్ళు ప్రవేశించగలిగిన బహిరంగ స్థలం కాదు. దానిలో ప్రవేశించడానికి తప్పనిసరిగా వైస్ ఛాన్సలర్, ప్రిన్సిపాల్ వంటి విద్యాలయ అధిపతుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అలా తీసుకోకుండా లోపలికి ప్రవేశించడం విద్యాలయాల విద్యాస్వేచ్ఛకు ఆటంకమే, చట్టవ్యతిరేకమే’ అని విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అప్పుడు ‘పోలీసులకు ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంది. కాలేజిల్లోకి మాత్రమే కాదు, ఇళ్లలోకి, పడకగదుల్లోకి కూడ వాళ్లు ప్రవేశించవచ్చు. పడకగదిలో కూడ 144 సెక్షన్ విధించవచ్చు’ అని కొందరు పెద్దమనుషులు చెప్పుకొచ్చారు. పోలీసు వ్యవస్థ కేవలం సమాజంలో శాంతిభద్రతలు కాపాడడానికే ఉన్నదని, ఆ పని కూడ చట్టానికి లోబడి చేయవలసిందేనని కనీస జ్ఞానం లేకుండా అన్న మాటలవి.

అక్కడినుంచి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచేసరికి పోలీసులు ఎక్కడికైనా ప్రవేశించడం మాత్రమే కాదు, మొత్తం సమాజ జీవితాన్ని శాసించే స్థితికి చేరినట్టున్నారు. ఒక మనిషి జర్నలిస్టా కాదా నిర్ణయించే, నిర్వచించే, సర్టిఫికెట్ ఇచ్చే, సహజర్నలిస్టులను బెదిరించే అధికారం కూడ పోలీసులకు సమకూరినట్టుంది. తాము హత్య చేసిన హేమచంద్ర పాండే జర్నలిస్టు కాదని చెప్పడానికి ఉత్తరాఖండ్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ దాకా పోలీసు వ్యవస్థ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. విధినిర్వహణలో ఉన్న ఒక పత్రికా రచయితను దుర్మార్గంగా హత్య చేయడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి గురించి అబద్ధాలు ప్రచారం చేసేంత అమానుషత్వ స్థితికి, ఆ పాత్రికేయుడితో తమకు సంబంధంలేదని యాజమాన్యాల చేతనే అనిపించే దుర్మార్గ స్థితికి మన పోలీసు వ్యవస్థ చేరింది.

ఇక రెండవ సందర్భం. రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కయిన ఒక పోలీసు ఉన్నతాధికారి సాగిస్తున్న అక్రమాల వార్తలు రాసినందుకు ఉదయం దినపత్రిక విలేకరి గులాం రసూల్ ను మట్టుబెట్టాలని పోలీసులు తలపెట్టారు. ఆయనను చంపదలచుకున్న సమయానికి ఆయనతో పాటు విజయప్రసాదరావు అనే స్నేహితుడు కూడ ఉంటే, సాక్ష్యం మిగలగూడదని ఇద్దరినీ తీసుకుపోయి ఉప్పల్ అవతల మసీదుగూడలో చంపిపడేశారు. 1991 డిసెంబర్ 28న జరిగిన ఈ బూటకపు ఎన్ కౌంటర్ ను కప్పిపుచ్చుకోవడానికి రసూల్ నక్సలైటనే ప్రచారానికి దిగారు. ఆయనకు విద్యార్థి జీవితంలో విప్లవ విద్యార్థి ఉద్యమంతో సంబంధం ఉండడం పోలీసులకు ఒక సాకుగా పనికి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియుడబ్ల్యుజె) నాయకత్వంలో తెలుగుసీమలోని మొత్తం జర్నలిస్టు సమాజం ముక్తకంఠంతో ఈ హత్యను నిరసించింది. ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఇంటి ముందు బైఠాయింపు జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు, పౌరహక్కుల సంస్థలు, ప్రజాసంఘాలు, ప్రజలు కూడ నిరసన ప్రకటించాక, చివరికి ప్రభుత్వం దిగివచ్చి జస్టిస్ టి ఎల్ ఎన్ రెడ్డి ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్ నియమించవలసి వచ్చింది.

కాని ఆ కమిషన్ విధివిధానాలను రూపొందించడంలోనే కుట్ర జరిగింది. ఎన్ కౌంటర్ నిజమా బూటకమా అని నిర్ధారించడంతో పాటు, గులాం రసూల్ నక్సలైటా కాదా నిర్ధారించడం కూడ ఒక విచారణాంశం అయింది. గులాం రసూల్ నక్సలైటేనని కమిషన్ నిర్ధారించింది. ‘న్యాయమూ లేదు, విచారణా లేదు – రెండో సారి రసూల్ హత్య’ అని పౌరహక్కుల సంఘంతో కలిసి ఎపియుడబ్ల్యుజె తన ప్రతిస్పందనను ప్రకటించవలసి వచ్చింది.

అప్పుడు హతుడు జర్నలిస్టు కాదనీ నక్సలైటేననీ బుకాయించడానికి కనీసం ఒక న్యాయవిచారణ ముసుగయినా, తతంగమయినా ఉండింది. ఇప్పుడు హతుడు జర్నలిస్టు కాదని హంతకులే ప్రకటిస్తారు. హతుడి కుటుంబసభ్యులు, సహచరులు చెప్పిన మాటలను అనుమానిస్తూ, సాక్ష్యాధారాలు తీసుకురమ్మని నిలదీస్తారు. హంతకుల మాటను నమ్మడానికి మనలో చాలమందిమి సిద్ధంగా ఉంటాం. నిజంగా సమాజం ఎంత ముందుకు పోయింది!

నిజానికి జర్నలిస్టుల మీద ఈ ముద్రలూ ఆరోపణలూ కొత్త కాదు. తమను, పాలకవర్గాలను, స్వార్థ ప్రయోజక శక్తులను ఎదిరించే జర్నలిస్టులందరూ పోలీసుల దృష్టిలో జర్నలిస్టులు కాకుండా పోతారు. ఆ పేరుతో సోలిపేట రామలింగారెడ్డిని ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించిన 1990 నుంచి ఇటీవల తృటిలో ఎన్ కౌంటర్ తప్పించుకున్న పిట్టల శ్రీశైలం దాకా మనరాష్ట్రంలో ఎంతోమంది జర్నలిస్టులను ఇలాగే నక్సలైట్లుగా, మావోయిస్టులుగా ముద్రవేసి ఎన్ కౌంటర్ చేయబోయారు, కేసులలో ఇరికించారు, వేధించారు. స్వయంగా నేను కూడ ఇటువంటి వేధింపును అనుభవించి, ఇంకా ఔరంగాబాద్ కుట్రకేసులో ముద్దాయిగా విచారణను ఎదుర్కొంటున్నాను. అటువంటి ప్రతి సందర్భంలోనూ పోలీసులు పదేపదే పాడుతున్న పాట ఈ వ్యక్తులు జర్నలిస్టులు కాదని. రాష్ట్రంలో జర్నలిస్టు ఉద్యమం ప్రతి సందర్భంలోనూ ఈ పోలీసు పాటను ఖండించింది. ఎవరు జర్నలిస్టో, ఎవరు కాదో చెప్పే అధికారం పోలీసులకు లేదని ప్రకటించింది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులకు ఎటువంటి నియామక పత్రాలూ, వేతన రసీదులూ లేనిచోట, కష్టం వచ్చినప్పుడు యాజమాన్యాలు ఆదుకోవడానికి సిద్ధంగా లేనిచోట, “ప్రమాదకర” వార్తాసేకరణ అవకాశాలెన్నో ఉన్నచోట, ఎవరు జర్నలిస్టులో నిర్వచించే అధికారం పోలీసులకూ, యాజమాన్యాలకూ లేదు. ఉండడానికి వీలులేదు. జర్నలిస్టు సమాజానికీ, ఆ జర్నలిస్టులు ఏ ప్రజలమధ్య పనిచేస్తున్నారో ఆ ప్రజలకూ మాత్రమే ఆ అధికారం ఉండాలి.

హేమచంద్ర పాండే జర్నలిస్టా కాదా అని ఇంకా అనుమానించే వారికోసం కొన్ని వాస్తవాలు చెప్పాలి.  ఆయన ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘర్ జిల్లాకు చెందినవాడు. అర్థశాస్త్రంలో ఎంఎ తోపాటు అనువాదంలో, జర్నలిజంలో డిప్లొమాలు చేశాడు. నాలుగైదేళ్లుగా హిందీలో జాగరణ్, నయీ దునియా, రాష్ట్రీయ సహారా వంటి అనేక పత్రికలలో వార్తాకథనాలూ వ్యాసాలూ రాశాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఒక లాజిస్టిక్స్ కంపెనీలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేస్తూ, ఆ కంపెనీకి చెందిన ఆన్ లైన్ పత్రిక చేతన లో ఉపసంపాదకుడిగా ఉన్నాడు.

ఇతర జర్నలిస్టులందరికీ ఉన్నట్టుగానే ఆయనకూ రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి. అదేమీ తప్పు కాదు. విద్యార్థి దశలో ఆయన ఒక వామపక్ష విద్యార్థి సంఘ కార్యకర్తగా ఉన్నాడు. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాడు. ఇప్పుడు కూడ మావోయిస్టు రాజకీయాల ప్రభావంలో ఉంటే ఉండవచ్చు. ప్రవృత్తిపరంగా ఆయన ఏమయినప్పటికీ వృత్తిపరంగా పత్రికా రచయిత అనేది నిస్సందేహం.

దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాల గురించి వార్తలూ, వార్తాకథనాలూ రాయాలనే కోరిక, గత ఐదారు సంవత్సరాలుగా ప్రాంతీయంగానూ, జాతీయస్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ విస్తృతంగా కనబడుతోంది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, బిబిసి తో సహా ఎన్నెన్నో ప్రచార మాధ్యమాల విలేకరులు దండకారణ్యానికి వెళ్లి రోజులతరబడి గడిపి అక్కడి విశేషాలు బయటి ప్రపంచానికి తెలిపారు. నవలారచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ అక్కడికి వెళ్లి వచ్చి రాసిన సుదీర్ఘ వ్యాసాన్ని ఔట్ లుక్ పత్రిక ప్రచురించింది. ఈ వాతావరణంలో హేమచంద్ర పాండే వంటి ఉత్సాహవంతుడైన యువ జర్నలిస్టు ఇటువంటి వార్తాకథనం రాయాలని ఉవ్విళ్లూరడంలో ఆశ్చర్యం లేదు. ఇలా మావోయిస్టుల వార్తలు, విశేషాలు రాసేవారిని చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద శిక్షిస్తామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మూడు నెలల కిందనే ఒక ప్రకటనలో బెదిరించింది. ఆ బెదిరింపుకు పాత్రికేయులు, స్వతంత్ర పరిశీలకులు లొంగిపోకపోవడం మాత్రమే కాదు, తీవ్రమైన నిరసన ప్రకటించారు. ఇక ఉత్తుత్తి బెదిరింపులతో లాభం లేదనీ, ఒక పాత్రికేయుడినైనా చంపి హెచ్చరిక చేస్తే గాని ఇటువంటి వార్తా కథనాలు ఆగవనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించినట్టున్నాయి.

పాలకులకు అటువంటి ఆలోచనలు ఉండడం ఆశ్చర్యకరం కాదు. కాని ఇక్కడ ఆలోచించవలసినది పాత్రికేయుల విధినిర్వహణకు ఏం జరగబోతున్నదనేది. జర్నలిస్టులు తమ ఉద్యోగధర్మంలో భాగంగా ఎటువంటి వార్తావనరులనైనా కలుస్తారు, వారి గళాన్ని ప్రజలకు వినిపిస్తారు. ప్రజాస్వామ్యానికి గీటురాయి ఇటువంటి భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ. ప్రచారమాధ్యమాలకు ఉండే ఈ భావప్రకటనా స్వేచ్ఛను, సమాచార ప్రకటనా స్వేచ్ఛను అరికట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఒకటిగా హేమచంద్ర పాండే హత్యను చూడవలసి ఉంది. ఇది కేవలం ప్రచార మాధ్యమాల స్వేచ్ఛ సమస్య మాత్రమే కాదు. ఇది ప్రజలకు ఉన్న తెలుసుకునే హక్కు మీద గొడ్డలిపెట్టు. నిజానికి ప్రచార మాధ్యమాలు, బుద్దిజీవులు ఒక్క జర్నలిస్టు హత్యను మాత్రమే కాక, అసలు ఈ బూటకపు ఎన్ కౌంటర్ ను, మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ను చంపడాన్ని కూడ తీవ్రంగా ఖండించవలసి ఉంది. ఈ సమయంలో ప్రచార మాధ్యమాలు పోలీసులతో గొంతు కలిపితే, లేదా మౌనంగా నిలబడితే ఇక మిగిలేది ప్రజల సమాచార హక్కునూ, పత్రికల సమాచార ప్రకటనా హక్కునూ కొల్లగొట్టిన ఎమర్జెన్సీ నాటి చీకటిరోజుల స్థితి మాత్రమే.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

2 Responses to జర్నలిస్టులకు ఎవరి సర్టిఫికెట్ కావాలి?

  1. challa.jayadevaanandasaastry says:

    thikable topic….jayadev,chennai-17…………..

    • ఓబుల్ రెడ్డి says:

      పత్రికాస్వేచ్ఛ, వామపక్షభావజాలం – ఈ రెండూ ఒకే ఒఱలో ఇమడలేని కత్తులు. వీటిల్లో ఒకటి గెలిస్తే ఇంకొకటి ఓడిపోతుంది. వామపక్షవాదులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న చోట్ల తమ పత్రికలూ, తమ భావజాలమూ తప్ప ఇంకేవీ చెలామణిలో ఉండకుండా సకల హక్కుల్నీ, స్వేచ్ఛల్ని హరిస్తారు. కానీ ఇదే వామపక్షవాదులు ప్రజాస్వామ్యంలో తమ భావజాలాన్ని ప్రచారం చేసుకోవడం కోసం పత్త్రికాస్వేచ్ఛ గుఱించి లబలబలాడుతూంటారు. వారు ఇతరుల పట్ల చేసేదే పెట్టుబడిదారీ వ్యవస్థలు వారి పట్ల చేస్తే తప్పా ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s