రాజపక్ష రక్తపిపాస

(ఈభూమి మాసపత్రిక, మార్చ్ 2010 కోసం)

తమ తమిళ ఈలం ఆకాంక్షలు అతి దుర్మార్గంగా అణచివేతకు, జాతి హననానికి గురయిన తర్వాత ఆశోపహత స్థితిలో ఉన్న శ్రీలంక తమిళులు తమను ఎవరు పాలిస్తే బాగుండునని కోరుకుంటున్నారు? తోడేళ్ళమంద కకావికలు చేసివెళ్లిన తర్వాత రెండు తోడేళ్లు, తమలో ఎవరో ఒకరిని ప్రతినిధిగా ఎన్నుకొమ్మని వస్తే రక్తసిక్తమయిన, క్షతగాత్రమయిన మేకలు ఏం ఎంపిక చేసుకుంటాయి? మనం ఈ ప్రశ్నలు అడిగేలోపే ఆ తోడేళ్ల మధ్య పోరాటం భీకరంగా మారిపోయింది. ఒకతోడేలు మరొక తోడేలును మట్టుపెట్టడానికి కుట్ర పన్నుతున్నదని రెండు తోడేళ్లూ ఆరోపించుకుంటున్నాయి. అలా శ్రీలంక మరొకసారి విషాద వార్తలకు నిలయమవుతున్నది. మహింద రాజపక్ష రక్తపిపాస మళ్లీ ఒకసారి బహిరంగంగా వ్యక్తమవుతున్నది.

మహింద రాజపక్ష వేలాది మంది తమిళులను వధించి, లక్షలాది మందిని వేధించి, తనకు సైనిక విజయం సాధించిపెట్టిన జనరల్ శరత్ ఫోన్సెకా మీద పడుతున్నాడు. ఆ శరత్ ఫోన్సెకానే రాజపక్ష కన్న మేలేమో అన్నట్టుగా ఉత్తర, తూర్పు ప్రాంతాల తమిళులు ఆయనకే తమ వోట్లు వేశారు. బట్టికలోవా లాంటి చోట్ల అతి తక్కువగా 25 శాతం మంది వోటర్లు మాత్రమే తమ వోటు హక్కు వినియోగించుకున్నప్పటికీ, మొత్తంగా తమిళుల ఆగ్రహం తమపై నేరుగా దాడిచేసిన ఫోన్సెకా మీది కన్న ఎక్కువగా ఆ దాడుల పథకరచన చేసిన రాజపక్ష మీదనే వ్యక్తమయింది.

అసలు 2005లో ఎన్నికలలో గెలిచి, ఇంకా రెండు సంవత్సరాలు పదవీ కాలం ఉండగానే మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన రాజపక్ష తన ప్రతాపం చూపెట్టదలచుకున్నాడు. ఎన్నికలలో గెలిచి అదనపు బలంతో తన ప్రత్యర్థులను చిత్తు చేయదలచాడు. గతంలో గెలిచింది కేవలం 50.29 శాతం వోట్లతో అతి తక్కువ అధిక్యతతో మాత్రమే గనుక ఇప్పుడు ఎల్ టి టి ఇ ని అంతం చేసిన విజేతగా ఇతోధిక బలం సంపాదించదలిచాడు.

పనిలో పనిగా శరత్ ఫోన్సెకా తోక కత్తిరించాలనీ రాజపక్ష ఆలోచించాడు. నిజానికి ఫోన్సెకా అప్పటివరకూ రాజపక్షకు నమ్మిన బంటు. సైనిక దళాల ప్రధాన అధిపతిగా సింహళ జాత్యహంకారంతో తమిళ పోరాట యోధులను ఊచకోత కోశాడు. ఎంత దాసానదాసుడైనా ఆ విజయోత్సాహంతో శరత్ ఫోన్సెకా తనను మించిపోతాడని భయపడ్డాడు. పేరుకు పెద్దదయినా పనికిమాలిన పదవిని సృష్టించి ఫోన్సెకాను అందులో కూచోపెట్టాడు. ఆ అవమానాన్ని భరించలేని ఫోన్సెకా రాజీనామా చేసి, అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేశాడు. రాజపక్షకు ప్రత్యర్థిగా నిలబడ్డాడు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఫోన్సెకా అభ్యర్థిత్వాన్ని బలపరచాయి.

ఎన్నికలకు ముందూ, ఎన్నికల రోజునా, ఎన్నికల తర్వాతా ప్రభుత్వ బలగాలు జరిపిన హింసాకాండ గురించీ, సాగించిన దౌర్జన్యాల గురించి ఎన్నో కథలు వెలువడ్డాయి. రాజపక్ష అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశాడనీ, సాయుధ గూండా ముఠాలనూ వాడుకున్నాడనీ పరిశీలకులు రాస్తున్నారు. అలా రాజపక్ష 57 శాతం వోట్లు గెలుచుకోగా, ఫోన్సెకా 40 శాతం గెలుచుకున్నాడు. ఈ ఫలితాలను తాను అంగీకరించనని ఫోన్సెకా ప్రకటించాడు. ఇది ప్రజావిజయమని రాజపక్ష అన్నాడు. ఎన్నికలు సక్రమంగా జరగలేదని స్వయంగా ఎన్నికల కమిషనరే అన్నాడు.

ఫలితాలు వెలువడిన పది రోజులలో రాజపక్ష పార్లమెంటును రద్దుచేశాడు. శరత్ ఫోన్సెకాను అరెస్టు చేయించాడు. ఫోన్సెకా జరిపిన అత్యాచారాలకు, కుట్రలకు గాను సైనిక విచారణ జరుపుతామని ప్రకటించాడు. ఫోన్సెకాకు అంగరక్షకులుగా ఉన్న సైనికులందరినీ నిర్బంధించాడు. పత్రికలమీద, ప్రచార సాధనాలమీద ఆంక్షలు విధించాడు, ఉన్న ఆంక్షలను పెంచాడు. ఒక సంపాదకుడిని అరెస్టు చేయించాడు. కొన్ని వెబ్ సైట్లను నిషేధించాడు. ప్రభుత్వ టెలివిజన్ సంస్థ ఉద్యోగులను తొలగించాడు. జరుగుతున్న దమనకాండలో వందో వంతయినా బైటికి వస్తున్నదో లేదో తెలియదు.

మొత్తం మీద సమాజంలోని ఒక భాగం మీద దాడి చేయడానికి, దుర్మార్గంగా ఉండడానికి పాలకులను ఒకసారి అనుమతిస్తే అది ఆ ఒక్కచోటే ఆగదని, రక్తం మరిగిన పులి అందరిమీదికీ తన పంజా విసురుతుందనీ రాజపక్ష ప్రవర్తన రుజువు చేస్తోంది. అడాల్ఫ్ హిట్లర్ గురించి మార్టిన్ నీమొల్లర్ అనే కవి రాసినట్టు మొదట యూదులను, తర్వాత కార్మిక నాయకులను, తర్వాత కమ్యూనిస్టులను ఊచకోతకోస్తూ వచ్చిన హిట్లర్ చివరికి మామూలు ప్రజల మీద పడ్డాడు. ఏ వర్గానికావర్గం ఈదాడి మామీద కాదులే అని ఊరక కూచుంటే చివరి వాడి గురించి మాట్లాడేవాళ్లెవరూ లేకపోయారు.  ప్రభుత్వం ఇవాళ ఏదో ఒక సామాజిక వర్గాన్ని మట్టుపెట్టడానికి పూనుకుంటున్నప్పుడు మనమీద కాదులే అని ఊరుకున్నామంటే రేపు ఆ పులి మనమీద దూకడానికి అనుమతిస్తున్నామన్నమాట

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s