జనం మాయ, లాభమే సత్యం ‘వేదాంత’ సారమింతేనయా

(ఈభూమి మాసపత్రిక ఏప్రిల్ 2010 సంచిక కోసం..)

‘మాయంటావా? అంతా

మిథ్యంటావా?

నా ముద్దుల వేదాంతీ!

ఏమంటావు?

మరఫిరంగి, విషవాయువు

మాయంటావూ? ఏం,

ఏమంటావు?

పాలికాపు నుదుటిచెమట,

కూలివాని గుండెచెరువు,

బిచ్చగాని కడుపుకరువు

మాయంటావూ?’

అని మన మహాకవి ప్రశ్నించి డెబ్బై ఐదు సంవత్సరాలయింది. ఇప్పుడొక ‘వేదాంతి’ వచ్చి భూమి మిథ్య, అడవి మిథ్య, అడవిబిడ్డలు మిథ్య, పర్యావరణం మిథ్య, ప్రభుత్వాలు మిథ్య, చట్టాలు మిథ్య, న్యాయస్థానాలు మిథ్య, స్వతంత్ర పరిశీలకులు మిథ్య అని చెపుతున్నాడు. ‘ఉన్నదొక్కటే సత్యం – అది డబ్బు, గనులు సత్యం, ఖనిజాలు సత్యం. వాటిని అమ్ముకుని శతకోటీశ్వరుడిని కావడం సత్యం’ అని సుభాషితాలు పలుకుతున్నాడు. నిజంగా ఈ సత్యాసత్య ప్రవచనం చేస్తున్న సంస్థ తనపేరు వేదాంత రిసోర్సెస్ అని పెట్టుకోవడం ఎంత కవితా న్యాయం?!

వేదాంత రిసోర్సెస్ అనేది ఒక బహుళజాతిసంస్థ. అనిల్ అగర్వాల్ అనే భారతీయుడు 1976లో బొంబాయిలో స్థాపించిన, ప్రస్తుతం లండన్ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న వ్యాపారసంస్థ అది. రాగి, అల్యూమినియం, జింక్, సీసం, ఇనుము, బంగారం వంటి లోహాల, ఖనిజ వనరుల వ్యాపారంలోనూ, విద్యుదుత్పత్తి లోనూ ఉన్న ఈ సంస్థ 2009 ఆర్థిక సంవత్సరంలో 657.8 కోట్ల డాలర్ల (దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల) వ్యాపారం చేసి 110 కోట్ల డాలర్ల (ఐదువేల కోట్ల రూపాయల పైన) లాభాలు చేసుకుంది. ఈ సంస్థను మొదట ప్రారంభించినప్పుడు, 1976లో స్టెరిలైట్ ఇండస్ట్రీస్ అని పిలిచేవారు. కాలక్రమంలో అనేక పారిశ్రామిక, వ్యాపార సంస్థలు పెడుతూ, కొంటూ వచ్చి, 1986లో వాటన్నిటినీ కలిపి వేదాంత రిసోర్సెస్ అనే గొడుగు కంపెనీ కిందికి తీసుకువచ్చారు.

ప్రస్తుతం వేదాంత రిసోర్సెస్ అనే గొడుగు కింద వేదాంత అల్యూమినియం, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, భారత్ అల్యూమినియం కంపెనీ, మద్రాస్ అల్యూమినియం కంపెనీ, స్టెరిలైట్ ఎనర్జీ లిమిటెడ్ వంటి అనేక సంస్థలున్నాయి. ఇందులో హిందుస్తాన్ జింక్, భారత్ అల్యూమినియం అంతకు ముందు ప్రభుత్వరంగ సంస్థలుగా ఉండి 2001-02లో వేదాంత చేతికి చిక్కాయి. ఈ యాజమాన్య మార్పు అప్పట్లో వివాదాస్పదం అయింది. ఇనుపఖనిజ వ్యాపారం చేసే సీసా గోవా అనే కంపెనీ కూడ ప్రస్తుతం వేదాంత గొడుగు కిందనే ఉంది. వేదాంత రిసోర్సెస్ వాటాలపై 1998నుంచి బొంబాయి స్టాక్ ఎక్స్ చేంజిలో, 2003నుంచి లండన్ స్టాక్ ఎక్స్ చేంజిలో వ్యాపారం సాగుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ ధర దాదాపు మూడువేల రూపాయలుగా ఉంది.

ఈ కంపెనీ భారతదేశంతో పాటు జాంబియా, టాస్మానియా, ఆర్మీనియా, ఆస్ట్రేలియాలలో కూడ పనిచేస్తోంది. భారత జింక్ వ్యాపారంలో 75 శాతం దీని చేతిలోనే ఉందనీ, ఒరిస్సాలోని ఝర్సుగూడాలో ఇది ప్రపంచంలోకెల్లా పెద్దదయిన అల్యూమినియంను కరిగించే కార్ఖానా నిర్మిస్తోందని, భారతదేశంలో ఖనిజాల తవ్వకంలో అతి పెద్ద కంపెనీ ఇదేనని కంపెనీ ఘనతను చెప్పే అంశాలు చాల ఉన్నాయి. “మాకు భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వహించిన, విస్తరించిన అనుభవం ఉంది. అందువల్ల, భారతదేశంలోని అపారమైన ఖనిజ నిలువల ఆకర్షణీయమైన అవకాశాలను వాడుకోవడానికి, సాపేక్షికంగా చౌకగా వ్యాపారం చేయడానికి, అపారమైన శ్రామిక, నైపుణ్య వనరులను తక్కువ ఖరీదుకు సంపాదించి సొమ్ముచేసుకోవడానికి మాకు వీలు ఉంది” అని వేదాంత వెబ్ సైట్ తన ఘనత ఏమిటో నిస్సిగ్గుగా ప్రకటిస్తుంది.

ఈ వేదాంత చర్చ ఇప్పుడు ఎందుకంటే, గత కొద్ది సంవత్సరాలుగా ఈ కంపెనీ సాగిస్తున్న అక్రమాల మీద రగుల్కొంటున్న ప్రజాగ్రహ జ్వాలల వేడి కేంద్ర ప్రభుత్వానికీ ప్రపంచ ప్రజాభిప్రాయానికీ తగలడం ఇప్పుడిప్పుడే మొదలయింది. ముఖ్యంగా తూర్పు కనుమల్లో ఒరిస్సాలోని నియమగిరి కొండల్లో అమాయక ఆదివాసులు (కొండల్లో నివసించే ఆదివాసులను డోంగ్రియా ఖోండ్ – కొండమనుషులు – అనీ, కింద అడవుల్లో నివసించేవారిని కుటియా ఖోండ్ – మైదానపు మనుషులు – అని అంటారు) వేదాంతకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి ఆ కొండమనుషులు తమ మనుగడకోసం, ఆ మనుగడను దెబ్బతీస్తున్న వేదాంతను అక్కడినుంచి తరిమివేయడం సాగిస్తున్న పోరాటానికి సుదీర్ఘ చరిత్రే ఉంది. అది మనదాకా అందడం ఇప్పుడే మొదలవుతోంది. ప్రపంచంలోనే అరుదయిన జీవజాతులకు నిలయమైన ఆ తూర్పుకనుమల కొండలను, అడవులను, జీవనదులను రక్షించడానికి అక్కడి ఆదివాసులు 2009 జనవరిలోనే మానవ వలయం నిర్మించారు. అక్కడికి కూతవేటు దూరంలోనే లాంజిఘర్ లో వేదాంత నిర్మించిన అల్యూమినియం శుద్ధి కర్మాగారం అక్కడ తీవ్రమైన వాయు, జల కాలుష్యానికి కారణమవుతున్నదని ఒరిస్సా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నాలుగైదేళ్లుగా విమర్శిస్తూనే ఉంది. చట్టబద్ధమైన పర్యావరణ నిబంధనలలో ఏ ఒక్కదాన్నీ వేదాంత పాటించడం లేదని ఎన్నో నివేదికలు వెలువడ్డాయి. ఆ ప్రాంతంలో ప్రజల దుస్తులమీద, పంటలమీద, ఆహారంమీద కాలుష్యపు ధూళి పరచుకుని ఉన్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక రాసింది. అక్కడినుంచి ప్రవహించే వంశధార, నాగావళి నదుల నీళ్లు కలుషితమైపోయాయని, ఆ నీటిలో ఆమ్లశాతం పెరిగిపోయిందని పర్యావరణ నివేదికలు తెలిపాయి. డోంగ్రియా ఖోండ్ ప్రజల జీవితాలతో వేదాంత చెలగాటమాడుతున్నదని వచ్చిన ఆరోపణలను విచారించడానికి బ్రిటిష్ ప్రభుత్వం, ఒఇసిడి ప్రయత్నిస్తే, ఆ విచారణకు సహకరించడానికి వేదాంత నిరాకరించింది. దానితో బ్రిటిష్ ప్రభుత్వం వేదాంతను విమర్శిస్తూ బహిరంగ ప్రకటన చేయవలసి వచ్చింది.

ఒరిస్సాలోని కాలాహండి, రాయగడ జిల్లాలలో విస్తరించి ఉన్న నియమగిరి కొండల్లో ఎనిమిదివేల మంది డోంగ్రియా ఖోండు జాతి ప్రజలు నివసిస్తున్నారు. ఆ కొండలు తమ దేవత నియమరాజు స్వస్థలమని ఆ ఆదివాసుల నమ్మకం. మనుషులకూ ప్రకృతికీ నియమాలు నిర్దేశించే నియమరాజు తమ తండ్రి అని, భూమి తమ తల్లి అని ఆ ఇద్దరి వల్లనే తమకు వర్షాలూ నీళ్లూ ఉన్నాయని ఆదివాసులు భావిస్తారు. “ఈ కొండ ఉంటే మా పిల్లలు ఉంటారు. వానలు పడతాయి. చలి వేస్తుంది. గాలి వీస్తుంది. కొండలు నీళ్లు తీసుకొస్తాయి. పంటలు పండతాయి. ఆ కొండను మాయం చేస్తే నీళ్లు ఆగిపోతాయి. మా బతుకే పోతుంది. ఆ కొండ మా ఆత్మ. మా అత్మను తొలగిస్తారా” అని 45 సంవత్సరాల లద్ధా సికాకా అనే డోంగ్రియా ఖోండ్ అడుగుతున్నాడు.

శాస్త్రీయమైన కారణాలు వారికి తెలియకపోవచ్చుగాని, నిజంగానే ఆ ఆదివాసుల నమ్మకానికి శాస్త్రీయమైన, సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. నియమగిరి కొండల్లో అపారమైన బాక్సైట్ ఖనిజ నిలువలు ఉన్నాయి. ఈ నిలువలు మొత్తం ఏడుకోట్ల టన్నుల పైన ఉండవచ్చునని అంచనా. బాక్సైట్ ఖనిజం స్వాభావికంగా రంధ్రాలతో, స్పాంజి లాగ ఉంటుంది. దానికి నీటిని నిలువ ఉంచి ఏడాది పొడవునా విడుదల చేసే శక్తి, స్వభావం ఉన్నాయి. అందువల్లనే బాక్సైట్ కొండల నుంచి ప్రవహించే సెలయేళ్లు ఎప్పుడూ ఆగిపోవు, అక్కడ అడవులు ఎప్పుడూ చిక్కగానే ఉంటాయి.

కాని అమెరికా కోసం ఆ బాక్సైట్ తవ్వక తప్పదు. ఆ కొండలను కరిగించక తప్పదు. అడ్డం వచ్చిన మనుషులను నిర్మూలించకతప్పదు. ఆ బాక్సైట్ ఖనిజం లేకపోతే అమెరికాలో, యూరప్ లో పరిశ్రమలు, అక్కడ అలవాటయిన జీవనవిధానం కుప్పకూలిపోతాయి. బాక్సైట్ నుంచి అల్యూమినియం తయారవుతుంది. వ్యోమనౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, అధునాతన ఆయుధాలు, వాహనాల దగ్గరినుంచి రోజువారీ సరుకులను ప్యాక్ చేసే ఫాయిల్ దాకా అల్యూమినియం లేకుండా బహుళజాతిసంస్థల బతుకు గడవదు. ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో పదోవంతు మాత్రమే ఉత్పత్తి చేసే అమెరికా తనకు అవసరమైన అల్యూమినియంలో మూడింట రెండువంతులు దిగుమతి చేసుకుంటుంది. నిజానికి అమెరికాలో ఉన్న బాక్సైట్ ఖనిజ నిలువలు ఇంకా తవ్వడం లేదుగాని అవి ఎంత తక్కువంటే మొత్తం భూగోళంలో 27,000 కోట్ల టన్నుల బాక్సైట్ ఖనిజం ఉందని అంచనా కాగా, అమెరికాలో ఉన్న నిక్షేపాలు అక్షరాలా ఇరవై కోట్ల టన్నులు మాత్రమే. ప్రస్తుత వినియోగ గణాంకాలను బట్టి సాలీనా అమెరికా వాడే అల్యూమినియం ఒక కోటీ ఇరవై లక్షల టన్నులు. ఒక టన్ను అల్యూమినియం తయారు కావడానికి దాదాపు ఐదు టన్నుల బాక్సైట్ ఖనిజం, పద్నాలుగువేల యూనిట్ల విద్యుత్తు కావాలి.

ఇలా సంపన్న దేశాల బహుళజాతి సంస్థల, ప్రజల అవసరాలు తీర్చే బాక్సైట్ ను తవ్వితీసి ఇబ్బడిముబ్బడిగా లాభాలు చేసుకునే పనిలో ఉంది వేదాంత రిసోర్సెస్. అది నియమగిరి కొండల్లో ఓపెన్ కాస్ట్ బాక్సైట్ గనుల తవ్వకాన్ని చేపట్టి రు. 12,500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. సమీపంలోని లాంజిఘర్ లో ఏడాదికి పది లక్షల టన్నుల శుద్ధి కర్మాగారాన్ని 2007 నుంచి నడుపుతోంది. నిజానికి నియమగిరి కొండల్లో గనుల తవ్వకానికి అవసరమైన అనుమతులన్నీ రాకముందే ఈ శుద్ధి కర్మాగారం పని ప్రారంభమయిందంటే, గనుల తవ్వకం తనకే దక్కుతుందని వేదాంత నూటికి నూరుపాళ్లు నమ్మకంతో ఉందన్నమాట.  ప్రభుత్వాలు నడిపేవాళ్లు, నిర్ణయాధికారం ఉన్నవాళ్లు తన నౌకర్లని వేదాంత అనుకుంటుందని ఒక స్వచ్చంద సంస్థ నాయకుడు అన్నారు. అందుకే అది స్థానిక చట్టాలను, స్థానిక ఆదివాసి ప్రజల జీవనభద్రతను నిర్భయంగా, నిష్పూచీగా కొల్లగొడుతున్నది.

వేదాంత అక్రమాల గురించి స్వయంగా భారత కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేశ్ రెండువారాల కింద బహిరంగంగా ప్రకటించవలసి వచ్చింది. హక్కుల బృందాలు, పర్యావరణ పరిరక్షణ బృందాలు అప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ముగ్గురు సభ్యుల ఉన్నతాధికార బృందం నియమగిరి కొండలను సందర్శించి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక తర్వాత పత్రికలతో మాట్లాడుతూ జైరాం రమేశ్ “విభిన్న బృందాలు ఎంత పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారంతో నేను ప్రభావితం కాలేదు. అక్కడ వాస్తవంగా ఏమి జరుగుతున్నదో సమాచారం తెలుసుకున్నాను. వేదాంత కంపెనీ అటవీవాసుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిందనేది వాస్తవం. ఆదివాసుల హక్కుల పట్ల ఎటువంటి గౌరవాన్ని కనబరచలేదనేది వాస్తవం” అన్నాడు. ఆయన ఆ ఉల్లంఘనల వివరాలలోకి వెళ్లలేదు గాని, ప్రభుత్వ అనుమతి లేకుండానే వేదాంత ప్రభుత్వ భూమి మీద తవ్వకాలు చేపట్టిందని స్పష్టమయిందని మాత్రం అన్నాడు.

అక్కడి బాక్సైట్ తవ్వుకుని అమ్మి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోబోతున్న వేదాంత కంపెనీ గాని, ఆ భూమిని వేదాంతకు రాసి ఇచ్చిన రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వాలు గాని స్థానిక ప్రజలకు ఏమి జరగబోతున్నదో చెప్పలేదు. ఒకవేళ అది అభివృద్ధి కార్యక్రమమే అయితే, స్థానిక ప్రజలకు పూర్తి సమాచారం అందించి, వారిని భాగస్వాములుగా చేసి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కేవలం వారి నేలను దురాక్రమించే ప్రయత్నం చేసి, విమర్శలు వచ్చాక అది అభివృద్ధి కార్యక్రమమే అంటున్నారు. చట్టప్రకారం బహిరంగ విచారణ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలి గనుక పత్రికలలో ఒక ప్రకటన మాత్రం అచ్చువేసి, తూతూ మంత్రపు బహిరంగ విచారణ జరిపారు. వేదాంత, ప్రభుత్వం కలిసి ఆడిన ఈ నాటకాన్ని విమర్శించినది ప్రభుత్వ వ్యతిరేకులు కారు, స్వయంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ మాటలు అంది.

వేదాంత నెలకొల్పబోతున్న అల్యూమినియం శుద్ధికర్మాగారం వల్ల స్థానిక ప్రజలకు ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయంలో తాము కోరిన, తమకు అవసరమయిన సమాచారాన్ని భారత ప్రభుత్వం తమకు ఇవ్వలేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రాసిన నివేదిక ‘డోన్ట్ మైన్ అజ్ ఔట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్: బాక్సైట్ మైన్ అండ్ రిఫైనరీ డివాస్టేట్ లైవ్స్ ఇన్ ఇండియా’ (గనుల పేరుతో మమ్మల్ని తవ్వి పారేయకండి : భారతదేశంలో జీవితాల్ని ధ్వంసం చేస్తున్న బాక్సైట్ గనులు, శుద్ధి కర్మాగారం) ఫిబ్రవరి 9 న విడుదల అయింది. ఆమ్నెస్టీ ఈ నివేదికను ఆషామాషీగా తయారు చేయలేదు. ఈ నివేదిక రాయడానికి తమ బృందాలు 18 నెలలపాటు పరిశోధన చేశాయని, ఆ బృందాలు 2008 ఆగస్ట్, 2009 ఫిబ్రవరి/మార్చ్, 2009 సెప్టెంబర్ లలో మూడుసార్లు లాంజిఘర్, నియమగిరి లలో పర్యటించాయని ఆమ్నెస్టీ తెలిపింది. లాంజిఘర్ లో ఎనిమిది గ్రామాలలో దళిత, మాఝి ఖోండ్ ఆదివాసి, తదితర సమూహాల ప్రజలను ఒక్కొక్కరిని కలుసుకుని ఇంటర్వ్యూలు చేశామని, నియమగిరి కొండలలో 19 గ్రామాలలొ డోంగ్రియా ఖోండులను కలిశామని ఆమ్నెస్టీ తెలిపింది. జూన్ 2006 నుంచి ఒరిస్సా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన అన్ని నివేదికలనూ అధ్యయనం చేశామని ఆమ్నెస్టీ తెలిపింది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటే భారత ప్రభుత్వానికి, వేదాంత వంటి బహుళజాతి సంస్థలకు లెక్కలేక పోవచ్చు గాని, ప్రపంచ ప్రజలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల మధ్యతరగతి, చదివే, రాసే, ఆలోచించే ప్రజానీకం ఆమ్నెస్టీ అభిప్రాయాలకు విలువ ఇస్తారు. అందువల్ల ఈ నివేదికతో యూరప్ లో, అమెరికాలో తన పరపతి తగ్గిపోతుందని వేదాంతకు భయం పట్టుకుంది.

అందుకే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక తప్పులతడక అని, పాత సమాచారం మీద ఆధారపడిందని, తమ వ్యాపార ప్రత్యర్థుల కనుసన్నలలో తయారయిందని వేదాంత ఆరోపించింది. ఆమ్నెస్టీ తమను సంప్రదించలేదని వేదాంత ప్రకటించింది. గనుల తవ్వకం జరిగే చోట అసలు మానవ ఆవాసాలే లేవని వేదాంత ప్రకటించింది. ఉన్నా, వారికి ఇటువంటి అభివృద్ధి పథకం రాబోతున్నదని స్థానిక ప్రభుత్వాధికారులు తెలియజెప్పారని అంది. చివరికి భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు కూడ చట్టపరంగా తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకున్నారని, సుప్రీంకోర్టు తమకు అనుమతి ఇచ్చిందని అంది. “భారత నియంత్రణా వ్యవస్థ చాల దృఢమైనది. ఆ వ్యవస్థ ఉండగా ఎవరూ అక్రమాలు చేయడానికి వీలులేదు” అని వేదాంత అల్యూమినియం ప్రధాన నిర్వహణాధికారి ముకేష్ కుమార్ గజం మిథ్య, పలాయనం మిథ్య సూత్రం ప్రవచించాడు. సుప్ర్రీంకోర్టు సాంకేతిక కారణాలతో వేదాంతకు అనుకూలంగా 2007లో ఒక తీర్పు చెప్పినమాట నిజమే. ఆ తీర్పులో కూడ వేదాంత తన లాభాల్లో కనీసం 5 శాతం ఆదివాసుల అభివృద్ధి పై ఖర్చుపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాని వేదాంత చేసిన ప్రకటనలో ప్రతి అక్షరమూ ఎట్లా అబద్ధమో చూపుతూ ఆమ్నెస్టీ మళ్లీ ఒక సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేసింది.

ఆమ్నెస్టీ నివేదిక నిజంగానే కందిరీగల తుట్టెను కదిలించింది. వేదాంతలో పెట్టుబడులు పెట్టిన మదుపుదార్లకు తమ డాలర్లు, పౌండ్లు భారతదేశపు నిరుపేద ఆదివాసుల చెమటనూ నెత్తురునూ మాత్రమే కాదు, అసలు బతుకులనే ఛిద్రం చేసి, తమకు లాభాలు సంపాదించి పెడుతున్నాయని అర్థమయింది. ఈ అవగాహనతో నైతిక ప్రశ్నలు వేసుకుని జవాబులు చెప్పుకున్న ఘనత చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ కు దక్కుతుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక బయటికి వస్తుండగానే, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ వేదాంతలో తమ పెట్టుబడిని నైతిక కారణాల వల్ల ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. తమ సంపదలను పెట్టుబడిగా పెట్టడం నైతికం అవునా కాదా అనే చర్చ ఎలా ఉన్నా, చర్చి ఆఫ్ ఇంగ్లండ్ గాని, పాశ్చాత్య దేశాలలోని కొన్ని ధార్మిక, సామాజిక సంస్థలు గాని, తమ దగ్గర పోగుపడిన నిధులను షేర్ మార్కెట్లలోనో, ఆదాయాన్ని సమకూర్చిపెట్టే ఇతర ఆర్థిక కార్యక్రమాలలోనో పెట్టడం ఆనవాయితీ. వేదాంత డోంగ్రియా ఖోండులతో వ్యవహరిస్తున్న పద్ధతి, వారి తరతరాల ఆవాసాలను తన లాభాలకోసం కొల్లగొడుతున్న పద్ధతి నీతి బాహ్యమని చర్చి గుర్తించింది. పాపులను క్షమించి ఊరుకుందాం అని అనుకోకుండా, పాపుల బొక్కసాల్లో తమ డబ్బు ఉండడం కూడ అనైతికమేనని భావించింది.

చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ పెట్టుబడుల ఉపసంహరణను ఆదర్శంగా తీసుకుని జోసెఫ్ రోన్ ట్రీ చారిటబుల్ ట్రస్ట్, మార్ల్ బరో ఎథికల్ ఫండ్, మిల్ ఫీల్డ్ హౌజ్ ఫౌండేషన్, మార్టిన్ కర్రీ ఇన్ వెస్ట్ మెంట్స్ వంటి సంస్థలు కూడ తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి. బిపి పెన్షన్ ఫండ్ తన పెట్టుబడులను తగ్గించింది. బ్రిటన్, నార్వే ప్రభుత్వాలు వేదాంత బాక్సైట్ గనుల ప్రాజెక్టును తప్పు పట్టాయి. ఆక్షన్ ఎయిడ్, సర్వైవల్ ఇంటర్నేషనల్ వంటి స్వచ్ఛంద సంస్థలు వేదాంతకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం మొదలుపెట్టాయి.

వేదాంత రాజ్యమే సాగుతందో, అమాయక ఆదివాసుల జీవితాలు సురక్షితంగా ఉంటాయో కాలమే తేల్చాలి.

Box items

అవతార్ నియమగిరి

వేదాంత వివాదం సాగుతుండగానే హాలీ ఉడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీసిన అవతార్ సినిమా అత్యంత ప్రజాదరణ పొందింది. అవతార్ సినిమాలో కూడ పాండోరా అనే గ్రహంలో నివసించే నావి తెగ ప్రజలు పవిత్రంగా పూజించే మహావృక్షం కింద మనుషులకు అవసరమైన ఖనిజ నిలువలు ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆ అమాయక తెగను ధ్వంసం చేస్తారు. అవతార్ చూసిన చాల మంది ప్రేక్షకులు, వ్యాఖ్యాతలు డోంగ్రియా ఖోండ్ ప్రజలకూ, నావి తెగకూ మధ్య పోలికలు వెతికారు.

చట్టం ఏం చెపుతుంది?

నిజానికి వేదాంత చేసిన, చేస్తున్న పనులు చట్టవ్యతిరేకమైనవి. కాని చట్టాన్ని వ్యాఖ్యానించే అధికారం ఉన్న వర్గాలు ‘పసిడిగల్గువాని బానిసకొడుకులు’గా ఉన్నారు గనుక చట్టం వారి చుట్టమైపోతున్నది. భారత రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేక హక్కులను, రక్షణలను కల్పించింది. భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం ఆదివాసులు నివసించే ప్రాంతాలను ఇతరులు ఆక్రమించడానికి, దోపిడీ చేయడానికి, ఆదివాసులను వారి స్వస్థలాల నుంచి బేదఖలు చేయడానికి వీలులేదు. ఆ తర్వాత, ఆదివాసి ప్రాంతాలను అభివృద్ధి కొరకుగాని, పరిశ్రమలకొరకు గాని తీసుకోవలసివస్తే, అది కేవలం ఆదివాసుల గ్రామసభల అనుమతితో మాత్రమే జరగాలని 1996లో చట్టం వచ్చింది. అప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న 1/70 అనే చట్టం వల్ల ఆదివాసి ప్రాంతాలలో ఆదివాసేతరులు భూములు కొనడం మీద నిషేధం ఉంది. 1997 లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పుతో ఆదివాసేతరులు నిర్వచనం కిందికి ప్రభుత్వం కూడ వస్తుందని, అదివాసుల భూమిని ఆక్రమించుకుని ఇతరులకు కట్టబెట్టడానికి ప్రభుత్వానికి కూడ హక్కులేదని నిర్ధారణ అయింది. అయితే ఐదవ షెడ్యూల్ నూ, ఆంధ్రప్రదేశ్ చట్టాలనూ కలిపి ఈ తీర్పు చెప్పినందువల్ల, ఈ తీరు తమకు వర్తించదని ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s