పరాయి ఖాతాలో ఖమ్మం ఖనిజం

(ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ జూలై 13, 2010)

ఎక్కడైనా నిధినిక్షేపాలు ఉన్నాయంటే, ఆ ప్రాంతవాసులు అదృష్టవంతులనీ, వారు సంపన్నులవుతారనీ, వారి దగ్గరికి పరిశ్రమలు పరుగెత్తుకొస్తాయనీ, అక్కడ నిరుద్యోగం అనేది మచ్చుకైనా ఉండదనీ, అక్కడంతా ఇక పాలూ తేనే ప్రవహిస్తాయని ఒక మూఢనమ్మకం వ్యాపిస్తుంది. ఆ నిధి నిక్షేపాలు తవ్వి అమ్ముకుంటే ఎన్నెన్ని నిధులు, ఎన్నెన్ని డాలర్లు, ఎన్నెన్ని పరిశ్రమలు, ఎన్నెన్ని వెలుగులు వస్తాయో కట్టుకథలు ప్రచారమవుతాయి. ఆ గనుల తవ్వకం మీద ఎవరయినా అనుమానాలు వ్యక్తంచేస్తే, ఎవరు లాభపడతారని ప్రశ్నిస్తే వాళ్లను అభివృద్ధి నిరోధకులంటారు. ఆ ప్రాంతవాసులు ప్రధానస్రవంతిలో చేరడానికి వాళ్ళు అడ్డుపడుతున్నారని విమర్శలూ నిందలూ వెల్లువెత్తుతాయి. ఈ “అభివృద్ధి” పుక్కిటిపురాణాలు ఎన్నోదశాబ్దాలుగా అబద్ధాలని రుజువవుతున్నా మళ్లీ మళ్లీ నమ్మడానికి మన మధ్యతరగతి సిద్ధంగా ఉంటూనే ఉంది.

అటువంటి అభివృద్ధి మాయాజాలంలో మైమరచి ఉన్న వారిని మేల్కొల్పడానికి మన ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల మండలాల్లోని ఇనుప ఖనిజం గాథయినా ఉపకరిస్తుందేమో చూడాలి. ఈ గాథలో ప్రజలకు చెందవలసిన ప్రకృతి వనరులను కొల్లగొట్టే దోపిడీదారుల అక్రమాలు, ఆ దోపిడీదారులకు అన్నివిధాలా సహకరించే ప్రభుత్వ యంత్రాంగం, తాము చేసిన చట్టాల పట్ల ఎటువంటి గౌరవమూ లేని పాలకులు, తెలంగాణ ప్రాంత వనరులపై కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల డేగకళ్లు, ఏ ప్రాంతంలో ఈ గనులు బయటపడుతున్నాయో ఆ భూమి పుత్రులు నిర్వాసితులు కావడం తప్ప ఎటువంటి ప్రయోజనమూ పొందకపోవడం లాంటి అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క అంశం ప్రకారమయినా ఆ గనులు తవ్వడానికి వీలులేదు. కాని ఆ గనుల తవ్వకానికి బాజాప్తా అనుమతులూ, రహస్య జీవోలూ, అనుమతి లేకపోయినా అక్రమ తవ్వకాలూ, కబ్జాలూ సాగిపోతూనే ఉన్నాయి.

భూగర్భంలో నిక్షిప్తమయిన ఖనిజ నిలువలు, భూగర్భ జలాలు, భూమి మీద ఉన్న నదీజలాలు, అటవీ వనరులు, కొండలలో ఉన్న ఖనిజాలు ప్రజల ఉమ్మడి ఆస్తి అనే భావన కొత్తది కాదు. భూమి మీద వ్యక్తి యాజమాన్యం ఉనికిలోకి వచ్చిన తర్వాత కూడ ఇటువంటి వనరులు ఉమ్మడి ఆస్తి అనీ, ఎవరు పడితే వారు వాడుకోగూడదనీ, సమాజం తరఫున పాలన సాగించే ప్రభుత్వమే దాని మీద బాధ్యత వహించాలనీ అభిప్రాయం బలపడుతూ వచ్చింది. అప్పుడు కూడ ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా ఆ వనరుల మీద ఆధిపత్యం చలాయించగూడదనీ, రాజ్యాంగ బద్ధమైన ఖనిజ విధానం, జలవనరుల విధానం ఆ అధికారాన్ని నిర్దేశించాలనే ప్రజాస్వామిక సంప్రదాయాలు ఉన్నాయి. మామూలు లోకజ్ఞానం ప్రకారం ఆలోచించినా, లక్షల ఏళ్లుగానో, వేల ఏళ్లుగానో సామాజిక ఉమ్మడి ఆస్తిగా ఉన్న ప్రకృతివనరులను తన ఇష్టారాజ్యంగా పందారం చేసే అధికారం ఐదు సంవత్సరాల కోసం గద్దెనెక్కే ప్రభుత్వానికి ఉండడానికి వీలులేదు. అటువంటి పని ఏదయినా చేస్తే ఆ ప్రభుత్వానికి సాధికారత రద్దయిపోవాలి.

కాని మన ప్రభుత్వాలు, ముఖ్యంగా తక్షణ లాభాలకోసం గద్దెనెక్కుతున్న రాజకీయ నాయకులు, ఎన్నికలలో కోట్ల రూపాయలు పెట్టుబడిపెట్టి అధికారంలోకి వచ్చి, మళ్లీ మరిన్ని కోట్లు సంపాదించే అవకాశంకోసం చూస్తున్న రాజకీయ నాయకులు ఖనిజ వనరులను బంగారు గుడ్లుపెట్టే బాతుగా చూస్తున్నారు. తాము పదవిలో, అధికారంలో ఎన్నాళ్లుంటామో తెలియదు గనుక, ఇవాళ్టికివాళనే ఆ గనులను తోడిపోసి, తాకట్టుపెట్టి, తెగనమ్మి కమిషన్లతో తమ సొంత బొక్కసాలు నింపుకుంటే చాలునని చూస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో బొగ్గు ఉన్నదని వంద సంవత్సరాల కిందనే కనిపెడితే, ఇనుపఖనిజం, బరైటిస్, గ్రనైట్ వంటి విలువైన ఖనిజాలున్నాయని కొన్ని దశాబ్దాల కింద బయటపడింది. అప్పటికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఖనిజాభివృద్ధి సంస్థ ఉంది. ఆ సంస్థ తరఫున ప్రభుత్వ రంగంలోనే గనుల తవ్వకాలు జరపవచ్చు. ప్రభుత్వ ఖజానాకే అదనపు ఆదాయం వచ్చేలా చూడవచ్చు. కాని గనుల విధానంలో 1992 నూతన ఆర్థిక విధానాల తర్వాత వచ్చిన మార్పుల వల్ల గనుల తవ్వకాన్ని, ముఖ్యంగా కొన్ని ఖనిజాల తవ్వకాన్ని ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి మళ్లించారు.

ఒకవైపు విధానపరంగానే ఇటువంటి మార్పులు జరుగుతుండగా, ఆయా శాఖలకు ఆధిపత్యం వహించే అధికార యంత్రాంగం అవినీతి మయమయిపోయి, చట్టబద్ధంగా పరిరక్షించవలసిన ఉమ్మడి సామాజిక ప్రయోజనాలను బలిపెట్టడం ప్రారంభించింది. నిర్ణయాధికారం ఉండే అధికారులు, రహస్యాలు తెలిసే అవకాశం ఉన్న అధికారులు తమ కుటుంబ సభ్యుల పేర్లమీదనో, బేనామీలుగానో, ఆశ్రితుల పేరుమీదనో గనుల తవ్వకాన్ని తామే ప్రారంభించారు. లేదా ఆయా గనుల విధానాలకు సంబంధించిన లొసుగులను స్వార్థపరశక్తులకు చేరవేయడం ప్రారంభించారు.

నిజానికి ఖమ్మం జిల్లా ఖనిజ నిలువలకు సంబంధించి, కనీసం ఏజెన్సీ ప్రాంతాల గనులకు సంబంధించి మరొక అంశం కూడ ఉంది. ఆదివాసులు తరతరాలుగా అనాదరణకు, అవిద్యకు, మైదానప్రాంతవాసుల దోపిడీ పీడనలకు గురయ్యారు గనుక వారి ప్రాంతాలలోకి ఇతరులు జొరబడడానికి, అక్కడి భూమినిగాని, ఇతర వనరులను గాని ఆక్రమించుకోవడానికి వీలులేదని భారత రాజ్యాంగం ఆదేశించింది. రాజ్యాంగంలో ఒక ప్రత్యేక షెడ్యూల్ చేర్చి, ఆ షెడ్యూల్ లో నమోదు చేసిన ప్రాంతాలకు ఈ రక్షణలు కల్పించింది. కేవలం ఆ రాజ్యాంగ రక్షణలు మాత్రమే కాక, ఆదివాసి జనాభా ఉన్న రాష్ట్రాలన్నీ తమ సొంత చట్టాలు కూడ తయారు చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడ భూ బదలాయింపు చట్టం 1959కి 1970లో చేసిన ఒక సవరణ (దాన్నే 1 ఆఫ్ 1970 అంటారు) ద్వారా గిరిజన, ఆదివాసి, షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఆదివాసియేతరులు ఎటువంటి స్థిరాస్తి కలిగి ఉండడానికి వీలులేదని నిర్దేశించారు. ఆ తర్వాత ఒక కీలకమైన తీర్పులో సుప్రీంకోర్టు ఈ 1 ఆఫ్ 1970 సవరణలో ఆదివాసియేతర వ్యక్తి అనే నిర్వచనం కిందికి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కూడ వస్తాయని ప్రకటించింది. అంటే ఆదివాసి ప్రాంతాల భూమిని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కూడ ఆక్రమించడానికి వీలులేదు. కాని ఈ నలభై సంవత్సరాలలో ఆ చట్టానికి ఎన్ని తూట్లు పడ్డాయో లెక్కలేదు. ఆ తీర్పులో ప్రజాప్రయోజనాల కోసం అయితే ప్రభుత్వ ప్రవేశానికి మినహాయింపు తీసుకోవచ్చు అనే అవకాశాన్ని పట్టుకుని ప్రభుత్వం లక్షలాది ఎకరాల ఆదివాసి భూమిని ఆక్రమించి, ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు అప్పగిస్తోంది.

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం వివాదాస్పదమైన ప్రాంతాలు ఈ చట్టం కిందికి వచ్చేవే. వాటిని నేరుగా ప్రైవేటువ్యక్తులు గాని, కార్పొరేటు సంస్థలు గాని ఆక్రమించడానికి వీలులేదు గనుక ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వాటిని మొదట ఆక్రమించింది. ఆ తర్వాత తానే స్వయంగా గనుల తవ్వకం చేపట్టకుండా, ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం మొదలుపెట్టింది. ఇదంతా స్థానికుల అభివృద్ధి కోసం అవసరమనే పేరు మీద జరుగుతోంది గాని, స్థానికులను తమ ఆవాసాల నుంచి వెళ్లగొట్టడం తప్ప వారికి జరగబోయే మేలేమీ లేదు.

ఇందులో కేవలం ఈ సాంకేతిక, చట్టపరమైన అంశాలు మాత్రమే కాదు, రాజకీయాలు కూడ ఇమిడి ఉన్నాయి. రాజకీయవాదులు ఈ దేశాన్ని, ఈ దేశ వనరులను తమ సొంత ఆస్తిగా భావిస్తున్న వ్యవహారం కూడ ఇమిడి ఉంది. రాజకీయాలు ప్రవేశించాయంటేనే అక్రమాలు, అవినీతి, హింస, బెదిరింపు, దుర్మార్గం ప్రవేశించాయని అర్థం.

ప్రభుత్వ సంస్థల దగ్గరినుంచి నామమాత్రంగా కొన్ని ఎకరాలు లీజుకు తీసుకోవడం, అంతకు కొన్ని వందలరెట్లు ఎక్కువ విస్తీర్ణంలో గనులు తవ్వడం కొన్ని దశాబ్దాలుగా ఈ గనుల కాంట్రాక్టర్లు అవలంబిస్తున్న పద్ధతి. నిజానికి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సామ్రాజ్యం మంగంపేట బెరైటిస్ గనులలో విస్తరించింది ఆ పద్ధతిలోనే. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి ఆ అక్రమ తవ్వకాలలో ఎంత సిద్ధహస్తుడో ప్రభుత్వ నివేదికలే తెలుపుతున్నాయి. ఈ గని తవ్వకందార్లలో ఇటువంటి అక్రమాలకు పాల్పడనివారు ఒక్కరు కూడ ఉండరు. ఆ అక్రమాలు తెలిసినా ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చుకోవడమూ లేదు, ప్రైవేటు వ్యక్తులకు గనుల తవ్వకాన్ని ఇవ్వగూడదని అనుకోవడమూ లేదు.

ఇక మరొక అక్రమం కూడ ఉంది. కొన్ని ఖనిజాలకు దేశంలోనే ఉన్న డిమాండు వల్ల అవి తవ్వాలంటే, వాటిని ఇక్కడే శుద్ధిచేసే, ఉత్పత్తిచేసే కర్మాగారం పెట్టాలని చట్టపరమైన నిబంధన ఉంటుంది. అందువల్ల గనుల తవ్వకం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ తవ్వకందార్లందరూ కర్మాగారాలు ఏర్పాటు చేస్తామనీ, దానిలో ఇంతమందికి ఉపాధి కల్పిస్తామనీ ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తారు.  కాని కార్ఖానా పెట్టడం, దాన్ని నిర్వహించడం అంటే అనవసరమైన, ఎడతెగని తలనొప్పి అనీ, ఊరికే భూమిని తవ్వి ఖనిజాన్ని విదేశీ మార్కెట్లో అమ్ముకుంటే అప్పనంగా డాలర్లు వచ్చిపడతాయిగదా అనీ అనుకుంటారు. ఆపనే చేస్తారు. కార్ఖానా పెట్టనక్కరలేదు, ఉపాధి కల్పించనక్కరలేదు. రోజువారీ ప్రభుత్వ నిబంధనలను పాటించనక్కరలేదు. ఓ డజను ఎర్త్ మూవర్లు, బుల్డోజర్లు కొని రోజుకు ఇరవై నాలుగ్గంటలూ తవ్వుతూ వందలాది లారీలలో ఆ ఖనిజాన్నంతా దగ్గర్లోని ఓడరేవుకు పంపితే చాలు. ఈ తతంగం ఏళ్లతరబడి సాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎప్పుడూ ఎక్కడా ఆ తవ్వకందార్లను మీ వాగ్దానాలు ఎందుకు నెరవేర్చలేదు అని అడిగిన పాపాన పోలేదు. వాగ్దానాలు నెరవేర్చలేదు గనుక లైసెన్సులు రద్దు చేస్తాం అనలేదు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు, అడవులు, కొండలు, ఖనిజాలు పంచుకుంటున్నారు.

ఖమ్మం విషయానికి వచ్చేసరికి ఈ దొంగతనానికి మరొక ముఖం కూడ ఉంది. తెలంగాణ లోని నీళ్లు, నిధులు, నియామకాలలో ఇన్నాళ్లుగా దోపిడీ సాగిందని, కనుక మా రాష్ట్రం మాకు కావాలని తెలంగాణ ప్రజానీకం ఉవ్వెత్తున ఉద్యమిస్తున్న సందర్భంలో ఈ గనుల భాగోతం బయటపడింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ గనులు వట్టిపోవడమో, లేదా అప్పటికే ఏ యాభై ఏళ్ల లీజుకో లైసెన్సు తీసుకుని ఉన్న తెలంగాణేతర గని యజమానులకు తెలంగాణ వనరులు హక్కుభుక్తం కావడమో జరుగుతుంది. ఖమ్మం గనులు పేరుకు రక్షణ స్టీల్స్ అనే ఒక కార్పొరేట్ సంస్థ చేతుల్లో ఉన్నాయి గాని, దానివెనుక వై ఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అంటే ఈ రక్షణ స్టీల్స్ ఖమ్మం ఖనిజ వనరుల మీద తెలంగాణ ప్రయోజనాల రక్షణకు కాదు, తెలంగాణేతర ప్రయోజనాల రక్షణకు మాత్రమే.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra. Bookmark the permalink.

One Response to పరాయి ఖాతాలో ఖమ్మం ఖనిజం

  1. ఓబుల్ రెడ్డి says:

    ఈ సమస్యని ప్రాంతీయకోణంలోంచి చూడ్డం సరికాదు. మీరు సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండీ కేసీయార్ లా రాయడం ఆశ్చర్యకరం. కార్పొరేట్ దోపిడి అన్ని ప్రాంతాల్లోను జఱుగుతున్నది. ఆంధ్రా ఏరియాలో మొన్న జఱిగిన సోంపేట గొడవల తరువాతైనా తెలంగాణవాదులు అసలు విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను. కానీ ప్చ్ ! ప్రైవేట్ సంస్థలు ఏ ప్రాంతానికి చెందినా వాటికి ప్రాంతీయ ప్రయోజనాల నిబద్ధతలేమీ ఉండవు. రక్షణ స్టీల్స్ వారు రాయలసీమ ఛాంపియన్లూ కారు, సమైక్యవాదులు అంతకంటే కారు. తెలుగుతల్లి భక్తులు అంతకంటే కారు. వారు లాభార్జన కోసం పెట్టుకొన్న ఒక కంపెనీ మాత్రమే. ఆ లాభాలు ఏ ప్రాంతం నుంచి ? అనేది వారికి అనవసరం. ఒకవేళ అలాంటి కంపెనీలు తెలంగాణవారి మేనేజ్‌‍మెంట్‌లో ఉంటే వాళ్ళ పాపాలన్నీ కడుక్కుపోతాయా ?

    అసలు విషయం – కేంద్రప్రభుత్వం 1993 లో సవరించిన మైనింగ్ పాలసీ. దాని ప్రకారం దేశం యొక్క సహజవనరుల్ని తవ్వితీసే బాధ్యతని దేశవ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీలకి అప్పగిస్తూ వస్తున్నారు. అంతకుముందు ఆ పని ప్రభుత్వం చేసేది. మీరు దోపిడీదారులని ఆరోపిస్తున్న ఆంధ్రావారు తమ ప్రాంతంలోని బాక్సైట్ నీ, పెట్రోలియమ్ నీ, గ్యాస్ నీ గుజరాతీలు ఎత్తుకెళుతూంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయులై గుడ్లప్పగించి చూస్తున్నారు. ఇది ప్రాంతాల మధ్య గొడవ కాదనీ, ఇది క్లాస్ వార్ అనీ గమనించండి. మనం ఎన్నుకొన్న ప్రభుత్వాలు మన జీవితాల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం మీద పోరాడమని చెప్పండి. అంతే తప్ప ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతాన్ని అనవసరంగా ఎగసన దోయవద్దు. సమస్య మూలకారణాల్ని గ్రహించకుండా/ గ్రహించనివ్వకుండా ఊరికే తప్పుదోవ పడితే ఆ సమస్య అలా పరిష్కృతంగానే మిగిలిపోతుంది. పరస్పర విద్వేషాలు మాత్రం మిగుల్తాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s