చిన్నరాష్ట్రాలు – అభివృద్ధి

వీక్షణం మార్చ్ 2010 కొరకు

ఒకపక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి, ఆంధ్రప్రదేశ్ ను యథాతథంగా ఉంచడం గురించి వాదనలు, ఆందోళనలు జరుగుతుండగానే, మరొకపక్క చిన్నరాష్ట్రాల బాగోగుల గురించి చర్చ కూడ మొదలయింది. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిగా ఉన్న పి. చిదంబరం 2003లో ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ లో రాస్తుండిన వారం వారం శీర్షికలో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఒక వ్యాసం రాశారని, అందులో తెలంగాణ ఏర్పాటు చేయాలని సూచించారని, అందువల్ల ప్రస్తుతం ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శలు రావడంతో తెలంగాణ చర్చ, చిన్న రాష్ట్రాల పనితీరు చర్చ కలిసిపోయాయి. ఈలోగానే ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్ ఘర్ ల ఉదాహరణలు చూపుతూ చిన్నరాష్ట్రాలలోనే ఇతోధికమైన అభివృద్ధి జరుగుతుందని స్వామినాథన్ అయ్యర్, సి ఎచ్ హనుమంతరావు వంటి ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్తలు వ్యాసాలు రాశారు. అందుకు భిన్నంగా చిన్నరాష్ట్రమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర పరపతి తగ్గిపోతుందని, అందువల్ల కేంద్రం నుంచి రావలసినవి రాబట్టుకోలేమని, సమైక్యరాష్ట్రం ఉండి తీరవలసిందేనని మరికొందరు వాదిస్తున్నారు.

నిజానికి చిన్న రాష్ట్రాలు మంచివా కావా అనే చర్చను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వంటి భావోద్వేగపూరితమైన అంశాలతో ముడిపెట్టి చర్చించనక్కరలేదు. తెలంగాణ ఏర్పడినా “చిన్న రాష్ట్రం” కాబోదు. దేశంలోని 28 రాష్ట్రాలలో తెలంగాణ కన్న విస్తీర్ణంలో చిన్నవైన రాష్ట్రాలు పదిహేడు ఉన్నాయి. ఆ మాటకొస్తే ప్రపంచంలోని 233 దేశాల జాబితాను విస్తీర్ణం ప్రకారం చూస్తే, తెలంగాణ కన్న చిన్న దేశాలు 133 ఉన్నాయి. కనుక తెలంగాణ చర్చకూ, చిన్న రాష్ట్రాల చర్చకూ పెద్దగా సంబంధం లేదు. తెలంగాణ అంశాన్ని పక్కనపెట్టి  చిన్న రాష్ట్రాల అభివృద్ధి గురించి చర్చించవలసి ఉంది.

ఆ చర్చలోకి వెళ్లబోయే ముందు ప్రస్తుతం వివాదాస్పదమైన చిదంబరం వ్యాసం గురించి కొంచెం తెలుసుకోవాలి. అది తెలంగాణ కోసం రాసిన వ్యాసం కాదు. ఇండియా టుడే వారపత్రిక 2003లో స్టేట్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ (రాష్ట్రాల పరిస్థితి) అని ఒక అధ్యయనం ప్రారంభించింది. ఆ సంవత్సరం అర్థశాస్త్రవేత్తలు వివేక్ దేబ్ రాయ్, లవీష్ భండారీ తొమ్మిది ప్రాతిపదికల మీద రాష్ట్రాలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని పోగు చేసి ఆయా రాష్ట్రాల పనితీరును బట్టి వాటికి స్థానాలు కేటాయించారు. ఆ నివేదిక ప్రకారం గోవా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, హర్యానా, పంజాబ్ వంటి చిన్న రాష్ట్రాలే అన్ని సూచికలలోనూ అగ్రస్థానాలలో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలన్నీ, వాటి పరిమాణాన్ని బట్టి అట్టడుగు స్థానాలు పొందాయి. ఆ నివేదిక మీద వ్యాఖ్యానిస్తూ చిదంబరం 2003 మే 18న రాసిన వ్యాసంలో “ఈ నివేదిక చిన్నరాష్ట్రాలకు అనుకూలమైన, ఖండించడానికి వీలులేని వాదనలు చేస్తుంది…. దాని అర్థం ప్రతి రాష్ట్రాన్నీ రెండు ముక్కలో, మూడు ముక్కలో చేయాలని కాదు. కాని పరిమాణం, జనసంఖ్య, భౌగోళిక లక్షణాల పునాదిపై రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష గనుక ఉంటే రాష్ట్ర విభజనే వివేకవంతమైన నిర్ణయమనిపిస్తుంది” అని రాశారు.

అలాగే 2003 నుంచీ కూడ ప్రతిసంవత్సరం ఇండియా టుడే ఇటువంటి అధ్యయనాన్ని సాగిస్తూ రాష్ట్రాలకు వాటి అభివృద్ధి, పనితీరులను బట్టి తరతమ స్థానాలు కేటాయిస్తోంది. ఈ పరిశీలనలో మొత్తం పనితీరు, వ్యవసాయం, వినియోగ సరుకుల మార్కెట్లు, విద్య, శాంతి భద్రతలు, ఆరోగ్యం, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడులు, స్థూల ఆర్థికవ్యవస్థ అనే తొమ్మిది ప్రాతిపదికలను అధ్యయనం చేస్తున్నారు. 2009 సెప్టెంబర్ 14న వెలువడిన తాజా, తొమ్మిదో నివేదిక ప్రకారం కూడ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఢిల్లీ, ఉత్తరాఖండ్ మొదటి ఐదు స్థానాలలో నిలిచాయి. మొదటి పది స్థానాలలో ఒక్క పెద్ద రాష్ట్రం కూడ లేదు.

అయితే ఈ అధ్యయనంలోని ప్రాతిపదికలన్నీ కూడ సగటు అంకెలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాయి గనుక వాటిలో లోపాలు ఉండే అవకాశం కూడ ఉంది. ఆమేరకు చిన్నరాష్ట్రాలకు అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని నిర్ధారణకు రావడానికి వీలులేదు. ఆ సగటు అంకెలను అలా ఉంచి, చిన్న రాష్ట్రాలకు అనుకూల వాదనలలోని గుణాత్మకమైన అంశాలు కొన్ని చూడవలసి ఉంది.

ఒక పాలనా ప్రాంతపు విస్తీర్ణం తగ్గిన కొద్దీ పాలనా వికేంద్రీకరణ సులభసాధ్యమవుతుంది. ప్రజలు తమను తాము పాలించుకోవాలనే ప్రజాస్వామిక ఆదర్శం వాస్తవరూపం ధరించాలంటే పాలనా వ్యవస్థలు వికేంద్రీకరణ జరగాలి. పాలనా ప్రాంతం నిర్వహించడానికి వీలులేనంత సువిశాలంగా ఉండి, పాలన కేంద్రీకరణ జరిగినప్పుడు ప్రజాస్వామిక ఆదర్శం భగ్నమయ్యే అవకాశం ఉంది. అందువల్ల పాలన సులభతరం కావాలన్నా, సరళం కావాలన్నా, ప్రజలవద్దకు చేరాలన్నా, పాలనా పరిధి అంతకంతకూ చిన్నది కావలసి ఉంటుంది. నిజానికి జాతీయోద్యమ ఆదర్శాలలో ఒకటిగా గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించడానికి సారం ఇదే. అందుకే రాజ్యాంగం సమాఖ్య పాలనా పద్ధతిని ఎంచుకుంది. బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫారసులమేరకు పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పింది కూడ అందుకే. రాజ్యాంగపు 73, 74 సవరణలద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది కూడ అందుకే. చిన్న రాష్ట్రాలను ఏర్పరచాలనే డిమాండ్ కూడా ఈ ప్రజాస్వామిక విస్తరణలో భాగమే.

ప్రజలందరికీ పాలనలో ఇతోధిక భాగస్వామ్యం కల్గించడానికి, స్వపరిపాలన పెంచడానికి గత ఆరు దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రజలకు ఎక్కువ అధికారాలు ఇస్తే, అధికార వర్గాల ప్రయోజనాలు దెబ్బతింటాయనే అనుమానం వల్లనే, మాటల్లో ఏమి చెప్పినప్పటికీ అన్ని పాలక రాజకీయ పక్షాలూ ఆ ప్రజాస్వామిక ప్రయోగాలకు తూట్లు పొడిచాయి. ఆ నేపథ్యంలోనే ప్రజలలో అసంతృప్తి పెరిగిపోవడం, ఆ అసంతృప్తి విభిన్న రూపాలలో వ్యక్తం కావడం జరుగుతోంది. ఆ అసంతృప్తి ప్రకటిస్తున్నవారిలో కొందరిని వేరుచేసి, వారికి ఏవో స్వార్థ ప్రయోజనాలు కల్పించి, విస్తృత ప్రజానీకాన్ని మాత్రం ప్రజాస్వామ్యానికి దూరం చేయడంలో పాలకవర్గాలు విజయం సాధిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్యం నిజంగా అమలు జరగాలంటే, పాలనలో ప్రజలకు ఇతోధిక భాగస్వామ్యం దొరకాలంటే కనీసం పాలనా వ్యవస్థలు వారికి చేరువగా ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడు ప్రజలకు తమ పాలనా వ్యవస్థలను నిలదీసే, ప్రశ్నించే అధికారం, వాటిలో పాలుపంచుకునే అవకాశం, అవి తప్పుడు మార్గంలో నడిచినప్పుడు ప్రతిఘటించే అవకాశం దొరుకుతాయి.

అలాగే, చిన్న రాష్ట్రాల డిమాండ్ కు ప్రజాస్వామిక విస్తరణ అనే కోణం మాత్రమే కాక, చరిత్ర కోణం కూడ ఉంది. దేశంలో విభిన్న రాజవంశాల పాలనలో బతికిన ప్రజలలో అత్యధికులను ఒకే పాలన కిందికి తీసుకువచ్చిన ఘనత బ్రిటిష్ వలసవాదులదే. వారు కూడ 560 సంస్థానాలను ముట్టుకోకపోయినా, మిగిలిన దేశాన్ని మాత్రం రాష్ట్రాలుగా విభజించారు. ఆ రాష్ట్రాలు కేవలం పాలనాసౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పరచినవే తప్ప పాలితుల సామాజిక, సాంస్కృతిక, చారిత్రక బంధాలను దృష్టిలో పెట్టుకున్నవి కావు. అందువల్ల రాష్ట్ర విభజనకు భాషా ప్రాతిపదికను పునాదిగా పెట్టుకుంటానని భారత జాతీయోద్యమం 1920లలోనే ప్రకటించింది. కాని 1940ల చివరికి వచ్చేసరికి ‘స్వతంత్ర’ భారత పాలకులు భాషాప్రాతిపదికతోపాటు, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం అనే కొత్త ప్రాతిపదికలనూ, పాలనా సౌలభ్యం అనే వలసవాద ప్రాతిపదికనూ కలగలిపి గందరగోళంగా  రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. తామే ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసులను కూడ ఖాతరు చేయలేదు. ఒకే భాష మాట్లాడే ప్రజలు ఏడెనిమిది రాష్ట్రాలలో ఉండగా, ఒకే రాష్ట్రంలో మూడు నాలుగు భాషల ప్రజలను చేర్చిన విచిత్ర స్థితి ఏర్పడింది.

ఈ సంక్షుభిత చరిత్ర నేపథ్యంలో దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఉపజాతి, ఉపప్రాంతీయ ఆకాంక్షలు ప్రబలమయ్యాయి. ఆ ఆకాంక్షలను పరిష్కరించే ప్రయత్నాలు సక్రమంగా జరగనందువల్ల, పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చనందువల్ల, ఆకాంక్షలను అణచివేయడానికి దమననీతి ఉపయోగించినందువల్ల ఆ ఆకాంక్షలు ఇంకా బలపడ్డాయి. ఇవాళ దేశవ్యాప్తంగా కనీసం పది చోట్ల రాష్ట్ర విభజన కోరికలు, ఉద్యమాలు ఏదో ఒక స్థాయిలో ఉన్నాయి. ఆ కోరికలను నెరవేర్చడమంటే నేరుగా చిన్నరాష్ట్రాల డిమాండ్ ను నెరవేర్చడమే కాకపోవచ్చుగాని, అటువంటి విభజనవల్ల ఏర్పడేవి చిన్న రాష్ట్రాలే. ఆ మాటకొస్తే ఇప్పటికే చిన్న రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో కూడ కనీసం రెండు ప్రాంతాలలో ఈ ఉపప్రాంతీయ ఆకాంక్షలున్నాయి.

ఈ ఉపప్రాంతీయ ఆకాంక్షలకే మరొక కోణం, ఆ ప్రాంతాలు, లేదా ఆ ప్రాంత ప్రజలు మరొక పెద్ద రాష్ట్రంలో ఉండడం వల్ల తమ స్వావలంబన, స్వయంనిర్ణయాధికారం కోల్పోతున్నామని భావించడం. ఈ భావన నిజం కావచ్చు, కాకపోవచ్చు. కాని అది ప్రజల మనసులను ఆకట్టుకోగల అవకాశం ఉంది. అప్పటికే అభివృద్ధిలో వివక్ష సాగుతుండడం, తమ వనరులను వాడుకుని మరొక ప్రాంతం వారు లాభపడుతున్నారనే అభిప్రాయం ఉండడం, తమ స్వతంత్ర అస్తిత్వాన్ని మరొక ప్రాంతం వారు అణచివేస్తున్నారని భావించడం వంటి ఆలోచనలు స్వయంనిర్ణయాధికారం కావాలని కోరుకునే వైపుగా దారితీస్తాయి. జార్ఖండ్ లో ఇటువంటి ఉపజాతీయ ఆకాంక్షలు ఎలా స్వయంనిర్ణయాధికార దిశగా పయనించాయో సామాజిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ఈ స్వయంనిర్ణయాధికార ఆకాంక్షలన్నీ నెరవేరుతాయా, అవి విస్తృత ప్రజానీకపు స్వయంనిర్ణయాధికారంగా అమలవుతాయా, లేక మళ్లీ ఒక స్థానిక పాలకవర్గమే ఆ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా వంటి ప్రశ్నలెన్నో వేయవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే బ్రిటిష్ వలసవాదులను వెళ్లిపొమ్మని కోరినప్పుడు భారత ప్రజానీకానికి మొత్తంగా స్వయంనిర్ణయాధికారం దక్కుతుందని ఆశించినప్పటికీ, అరవై ఏళ్లు గడిచినా అది జరగలేదనే వాస్తవం కూడ మన  కళ్ల ముందర ఉంది. కనుక భౌగోళికంగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడడమే, కొత్త సరిహద్దులు గీయడమే ప్రజలకు స్వయంనిర్ణయాధికారం రావడం అవుతుందా అనే ప్రశ్న వేయవలసిందే. అయితే, ప్రజల నిరంతర జాగరూకత, నిరంతర పోరాటం కొనసాగుతూ ఉండేట్టయితే ఈ స్వయంనిర్ణయాధికారం ఒక క్రమంలో సాధ్యమవుతుందనీ, ఆ దిశలో రాష్ట్ర ఏర్పాటు ఒక ముందడుగేననీ చెప్పవచ్చు.

ఒక చిన్న రాష్ట్రం ఏర్పడగానే అభివృద్ధి జరుగుతుందా అనే ప్రశ్న కూడ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్ ఘర్ ల అభివృద్ధి సూచికలను బట్టి, అక్కడి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు ఎక్కువగా ఉండడాన్ని బట్టి చిన్న రాష్ట్రాలలో ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని ఆర్థికశాస్త్రవేత్తలు చెపుతున్నారు. కాని కొత్త రాష్ట్రం ఏర్పడగానే మంత్రదండం ఉపయోగించినట్టుగా అభివృద్ధి జరిగిపోతుందనే నియమమేమీ లేదు. ఈ మూడు రాష్ట్రాలలో, అవి అంతకు ముందు భాగంగా ఉన్న పెద్ద రాష్ట్రాలకన్న పెరుగుదల రేటు ఎక్కువగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఎప్పుడైనా ప్రాతిపదిక (బేస్) తక్కువగా ఉంటే పెరుగుదలరేటు ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువ పెరుగుదల అయినా ఎక్కువ రేటును నమోదు చేస్తుంది. ఉదాహరణకు ఒకటికి ఒకటి చేరడానికి, పదికి ఒకటి చేరడానికి తేడా ఏమీలేదు, రెండు చోట్లా చేరినది ఒకటే. కాని ఒకటికి ఒకటి చేరితే వందశాతం పెరుగుదల అవుతుంది, పదికి ఒకటి చేరితే పది శాతం పెరుగుదల మాత్రమే అవుతుంది. చిన్న రాష్ట్రాలలో, వెనుకబడిన ప్రాంతాలలో సూచికలు తక్కువ స్థాయిలో ఉంటాయి గనుక అక్కడ ఎంత చిన్నపాటి అభివృద్ధి అయినా విపరీతమైన అభివృద్ధి రేటుగా కనబడుతుంది. ఆ అంకెల వెనుక గుణాత్మక అంశాలేమిటో, ఆ అంకెల పెరుగుదల నిజంగా ప్రజాజీవన ప్రమాణాలలో మెరుగుదలకు దారి తీస్తుందో లేదో ఇంకా నిశితంగా చూడవలసి ఉంటుంది.

ఇక వ్యతిరేక వాదనలలో ఒకటి, రాష్ట్రం, పాలనాప్రాంతం చిన్నదైనకొద్దీ అక్కడ రాజ్యాంగయంత్రపు శక్తి ఇనుమడిస్తుందనేది. ఎప్పుడైనా రాజ్యాంగ యంత్రం విస్తరించడమంటే ప్రజాజీవనం మీద ప్రతికూల ప్రభావం వేయడమనే అర్థం. ప్రజలను ఇంకా ఎక్కువ అదుపులో పెట్టడానికి, ప్రజలమీద ఎక్కువ నిర్బంధాన్ని అమలు చేయడానికి, ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేయడానికి చిన్నరాష్ట్రంలో పాలకవర్గాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఈ వాదన అంటుంది. నిజంగానే చత్తీస్ ఘర్ లో ఈ వాదన నిజమయింది కూడ. అక్కడ ప్రజల మీద పోలీసు దమనకాండ అది మధ్యప్రదేశ్ లో భాగంగా ఉండి, నిర్ణయాలు భోపాల్ లో జరిగినప్పటికన్న, వేరు రాష్ట్రమై రాయపూర్ నుంచి నిర్ణయాలు జరగడం మొదలయిన తర్వాత పెరిగింది. ఒక్కొక్క రెవెన్యూ జిల్లాను రెండు పోలీసు జిల్లాలుగా మార్చి మొత్తం రాష్ట్రాన్ని నిర్బంధ శిబిరంగా మార్చారు. అయితే ఈ వాదనకు మరొక ప్రతివాదన కూడ ఉంది. పెద్ద రాష్ట్రాలలో కూడ ప్రజల మీద ఘోరమైన నిర్బంధమే అమలవుతున్నప్పుడు, నిర్బంధాన్ని చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం అనే ప్రమాణాలతో చూడడం సరికాదని ఈ ప్రతివాదన అంటుంది. పాలకవర్గాలు ప్రజా ఉద్యమాల మీద దమననీతిని ప్రదర్శించడం అనేది పెద్దరాష్ట్రంలోనైనా, చిన్నరాష్ట్రంలోనైనా ఒకేవిధంగా ఉంటున్నదని ఈ ప్రతివాదన అంటుంది.

మరొక వాదన ప్రకారం రాష్ట్రం చిన్నదయ్యే కొద్దీ అధికారవర్గాలకు బేరసారాలాడే అధికారం, ఇతర బృందాలను, సామాజిక వర్గాలను లొంగదీసుకునే అవకాశం పెరుగుతాయి. తద్వారా రాష్ట్రం చిన్నదయ్యే కొద్దీ పాలనలో నిరంకుశత్వం, కుట్రలు, కుహకాలు, స్వార్థ ప్రయోజనాలు పెరిగిపోతాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వానికి దెబ్బ తగులుతుంది. అలాగే మన సమాఖ్య వ్యవస్థలో కేంద్రప్రభుత్వ స్థాయిలో రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరాలంటే పెద్దరాష్ట్రానికే వీలవుతుంది గాని చిన్నరాష్ట్రానికి వీలు కాదని కూడ ఈ వాదన అంటుంది. ఈ వాదన నిజమయిన సందర్భాలు కూడ ఉన్నాయి గాని, ప్రతివాదనలు కూడ ఉన్నాయి. రాష్ట్రం చిన్నదయినా స్థిరంగా ఉన్న సందర్భాలూ, పెద్దదయినా అస్థిరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అలాగే పెద్ద రాష్ట్రాలలో కూడ నిరంకుశత్వం, కుట్రలు, స్వార్థ ప్రయోజనాలు రాజ్యం చేసిన ఉదాహరణలు కొల్లలుగా ఉన్నాయి. అలాగే రాష్ట్రం పెద్దదయి, ఎక్కువమంది పార్లమెంటు సభ్యులు ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయనే హామీ ఏమీ లేదు. విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న రాజస్తాన్ కూ, పార్లమెంటు సభ్యుల సంఖ్యలో మొదటిస్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ కూ గత అరవై సంవత్సరాలలో దక్కిందేమీ లేదు.

చిన్నరాష్ట్రానికి వనరుల కొరత సమస్య ఉంటుందనీ, అందులోనూ అనవసరపు పాలనా వ్యయం వల్ల అది అభివృద్ధి మీద కేంద్రీకరించడం సాధ్యం కాదనీ మరొక వాదన. సహజ వనరులు ఉండడం అనేది రాష్ట్రం చిన్నదా, పెద్దదా అనేదాని మీద ఆధారపడి ఉండదు. వనరులు లేని పెద్దరాష్ట్రాలూ ఉండవచ్చు, విస్తారంగా వనరులు ఉన్న చిన్న రాష్ట్రాలూ ఉండవచ్చు. అలాగే పాలనావ్యయం వృధా కావడమనేది పెద్దరాష్ట్రాలలో కూడ ఎక్కువగానే ఉంది గనుక ఎక్కడయినా దాన్ని సవ్యంగా, హేతుబద్ధంగా, ప్రజాసంక్షేమ దృష్టితో సమీక్షించవలసిందే.

ఈ చర్చను బట్టి తేలేదేమంటే ఒక రాష్ట్రం చిన్నదా, పెద్దదా అనేది గీటురాయి కాదు. కనీసం ప్రస్తుత భారత రాజకీయాలలో కాదు. ఆ రాష్ట్రం ప్రజా ఆకాంక్షలకు అనుగుణమైనదా కాదా, ప్రజావసరాలను తీర్చగలిగినదా కాదా, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, భౌగోళిక కారణాల రీత్యా సమర్థించదగినదా కాదా అనేదే గీటురాయి అవుతుంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s