శ్యామలక్క అకాల మృతి

ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ   జూలై 20, 2010

ఇవాళ్టి భారతసమాజంలో, మరీ ముఖ్యంగా తెలంగాణలో సహజ మరణాలుగా కనబడేవి నిజంగా సహజమరణాలేనా? ఎన్నో దశాబ్దాలపాటు అనేకానేక రూపాలలో మౌన హింసకూ, బహిరంగ హింసకూ, వేదనకూ గురయినందువల్ల మనుషులు క్రమక్రమంగా శిథిలమై మరణిస్తే దాన్ని అసలు సహజమరణం అనవచ్చునా? అసలు కారణాలను పక్కనపెట్టి ప్రకృతిమీదా, ఆరోగ్యంమీదా నింద మోపవలసిందేనా? నిజానికి ఇటువంటి మరణాలన్నీ వ్యవస్థ చేస్తున్న హత్యలు కాదా?

జూలై 20 ఉదయం రామంతపూర్ లో శ్యామలక్క మృతదేహం పక్కన నిలబడ్డపుడు ఈ ప్రశ్నలు పోట్లెత్తాయి. ముఖ్యంగా ఆమె సహచరుడు చెరబండరాజు రాసిన కవిత ఒకటీ, చెరబండరాజు మరణం సందర్భంగా శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య ఒకటీ గుర్తుకొచ్చాయి.

చారుమజుందార్ కలకత్తాలో పోలీసు కస్టడీలో గుండెపోటు వచ్చి, ఆస్పత్రిలో 1972 జూలై 28న “సహజమరణం” చెందినప్పుడు “చాటండి గళమెత్తి చారూమజుందారు చచ్చిపోలేదనీ చంపబడ్డాడనీ” అని చెరబండరాజు రాశాడు. అలాగే 1982 జూలై 2న చెరబండరాజు చనిపోయినప్పుడు “చెరబండరాజు ప్రకృతి సహజంగా కాలధర్మం చెందలేదు. ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం అనే పిచ్చికుక్క కరచి చచ్చిపోయాడు” అని శ్రీశ్రీ రాశాడు. నిజంగానే ఇవాళ కొనసాగుతున్న సామాజికార్థిక ధర్మం కింద ఎవరూ సహజంగా, కాలధర్మం ప్రకారం చచ్చిపోవడం లేదు, అకాలంగా, అసహజంగా చంపబడుతున్నారు. చచ్చిపోతున్నారని మనం మామూలు అర్థంలో అనుకునే సందర్భంలో కూడ ఆ మరణానికి సహజకారణాల కన్న వ్యవస్థాగత కారణాలే ఎక్కువగా ఉంటున్నాయి.

చారుమజుందార్ గురించి చెరబండరాజు మాటలు, చెరబండరాజు గురించి శ్రీశ్రీ మాటలు శ్యామలక్కకు సరిగ్గా సరిపోతాయి. ఆమెది వయసు రీత్యా వచ్చిన మరణం కాదు, బాగుచేయలేని వ్యాధివల్ల వచ్చిన మరణం కాదు. ఆ మాటకొస్తే ఇవాళ్టికి అభివృద్ధి చెంది ఉన్న వైద్య, ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానంతో బాగుచేయలేని వ్యాధులేవీలేవు. ఆరోగ్య సేవల వ్యాపారీకరణవల్ల అవి అందరికీ అందుబాటులో లేవనేది ముఖ్యమైన విషయం. అలాగే శ్యామలక్కది ప్రమాదం వల్ల అనుకోకుండా జరిగిన మరణం కూడ కాదు. కేవలం వ్యవస్థ కల్పించిన మానసిక శారీరక క్లేశాల వల్లనే ఆమె అకాలంగా అర్ధాంతరంగా మరణించింది. ఆమె ఆరుపదుల జీవితంలో మూడొంతులకు పైగా సాగిన కష్టాల పరంపరను, ఆ కుటుంబం అనుభవించిన ఒడిదొడుకులను తలచుకున్నప్పుడు ఆమె మరణంలో సహజమైన కారణాలుగా చెప్పదగినవి ఎంత తక్కువో అర్థమవుతుంది. నాలుగు దశాబ్దాలుగా వ్యవస్థ కల్పించిన చిక్కుల వల్ల శిథిలమైన శరీరమూ మనసూ చివరికి ఇక్కడికి చేరాయా అనిపిస్తుంది.

1970లనుంచీ తెలంగాణలో ఒక ప్రగతిశీల, ప్రజానుకూల బుద్ధిజీవి కుటుంబం ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందో అన్ని ఇబ్బందులనూ చెరబండరాజు కుటుంబం ఎదుర్కొంది. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను చవిచూసింది. అక్రమ అరెస్టులను అనుభవించింది. బనాయించిన కుట్రకేసు విచారణలో ఎన్నో ఏళ్లు వేధింపులను భరించింది. కుటుంబ పెద్ద మూడు నాలుగు సార్లు అరెస్టయి జైలు జీవితాన్ని గడిపితే ఆ ఖైదీ కన్న ఎక్కువ చెరను శ్యామలక్క అనుభవించింది. చంటిపిల్లతో వారానికొకసారి జైలుకు వెళ్లి పడిగాపులు పడి అరగంటో, గంటో భర్తను కలవవలసిన దుస్థితి అనుభవించింది. ప్రభుత్వం కక్షగట్టి చెరబండరాజును ఉద్యోగం నుంచి తొలగిస్తే కుటుంబం నిరుద్యోగాన్ని, ఆర్థిక ఇబ్బందులను అనుభవించింది. బ్రెయిన్ ట్యూమర్, కాన్సర్, కిడ్నీ వైఫల్యం వంటి మహా వ్యాధులను అనుభవించింది. నెలలతరబడీ, ఏళ్ల తరబడీ ‘గాంధీ రోగనిలయం’ లోనూ, ఇతర ఆసుపత్రులలోనూ గడిపింది. ఎన్నో శస్త్ర చికిత్సలను భరించింది. లెక్కలేనన్ని మాత్రలనూ ఇంజక్షన్లనూ రేడియేషన్ లనూ కీమోథెరపీలనూ భరించింది. ముగ్గురు కుటుంబ సభ్యులు – ఒకరు ముప్పై ఎనిమిదో ఏట, మరి ఇద్దరు ఇరవైలలో ఉండగా – అకాలంగా మరణిస్తే ఆ బాధనంతా చవిచూసింది. ఆ ఇంట్లో ఒక పాప ఎనిమిదో ఏట, ఒక బాబు నాలుగో ఏట, మరొక పాప రెండో ఏట తండ్రిని పోగొట్టుకోవలసి వచ్చింది. ఆ కుటుంబం ఒక బూటకపు ఎన్ కౌంటర్ ను కూడ చూసింది. శ్యామలక్క తండ్రిలేని తన పిల్లలిద్దరిని మాత్రమే కాదు, తండ్రిని కోల్పోయిన చిన్నారి మనుమరాలిని కూడ పెంచవలసి వచ్చింది.

ఇన్నిన్ని కష్టాలు ఒకదానిమీద ఒకటి తోసుకువస్తూ ఉంటే మనిషయిన వారు కన్నీటి వరదలో నీరుకాకుండా ఉండగలరా? ఆరోగ్యం కోల్పోకుండా ఉండగలరా? అలా దెబ్బతిన్న ఆరోగ్యం అకాల మరణానికి దారితీయదా?

అయితే గుర్తించవలసినదేమంటే ఈ కష్టాలలో ఏ ఒక్కటీ నివారించలేనిది కాదు. వీటిలో ఏ ఒక్కటీ మన చేతుల్లో లేనిది కాదు. సామాజిక ఆర్థిక వ్యవస్థ బాగుంటే, పాలన బాగుంటే, వైద్య, ఆరోగ్య వ్యవస్థ బాగుంటే ఈ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలలో ఏ ఒక్కటీ నిజంగా కష్టాలయి ఉండేవి కావు.

శ్యామలక్క జీవిత కథ నిజంగా ఈ సమాజంలో సమాజం గురించి ఆలోచించి, సమాజహితం కోసం ఏమయినా చేద్దామని అనుకునే వ్యక్తి స్వయంగా ఎన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుందో, ఆ వ్యక్తి కుటుంబం ఎన్ని కడగండ్ల పాలవుతుందో చూపుతుంది.

ఆమె సహచరుడు చెరబండరాజు తెలంగాణ సమాజం సృష్టించిన అద్భుతమైన కవి, సున్నితమైన భావుకుడు, గొప్ప ఆలోచనాశీలి, తన శక్తియుక్తులన్నిటినీ సమాజపురోగతి కోసం వెచ్చించినవాడు. “నిజంగానె నిజంగానె తెలంగాణ మాగాణం అనాదిగా అరుణారుణ వీరులకిది జయగానం” అని ప్రజాజీవితాన్నీ, పోరాటాన్నీ ఎత్తిపట్టడానికే ఆయన కవిత్వం రాశాడు, కథలు రాశాడు, నవలలు రాశాడు. తరతరాలు గుర్తుపెట్టుకోదగిన అద్భుతమైన కవితాచరణాలు వదిలిపోయాడు. ఈ నేలమీద కపటత్వాన్నీ, రాజకీయ దివాళాకోరుతనాన్నీ సవాలు చేస్తూ దిగంబర కవితా ఉద్యమ ప్రారంభకుడయ్యాడు. కాలంచెల్లిన సమాజ విధ్వంసం మాత్రమే కాదు, నవసమాజ నిర్మాణం కూడ కావాలని విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమ నిర్మాత అయ్యాడు. అందువల్లనే ఆయన కలమూ గళమూ పాలకవర్గాలకు కంటగింపయ్యాయి. ఆయన ముప్పై ఎనిమిదేళ్ల జీవితంలో నాలుగుసార్లు – 1971లో ప్రెవెంటివ్ డిటెన్షన్ చట్టం కింద, 1973లో ఆంతరంగిక భద్రతా చట్టం కింద, 1974లో సికిందరాబాదు కుట్రకేసులో, 1975 ఎమర్జెన్సీలో ఆంతరంగిక భద్రతా చట్టం కింద జైలుకు వెళ్లవలసివచ్చింది. దాదాపు మూడేళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆ జైలు జీవితంలో మొదలయిన అల్సర్ , తలనొప్పి చివరికి బ్రెయిన్ ట్యూమర్ గా పరిణమించి 1976 అక్టోబర్ లో, 1979 నవంబర్ లో, 1981 జూలైలో మూడుసార్లు శస్త్ర చికిత్స జరిగింది. చివరిసారి శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడ “అనారోగ్య బాధితుణ్నే, అయితేనేం యోధుణ్నే, పోరాటం డైరెక్షన్, పాట నాకు ఆక్సిజన్” అని తన మార్గం వదలని యోధుడు చెరబండరాజు. ఈ మధ్యలోనే 1975లో ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించమని పిలుపు ఇస్తూ నిరసన ప్రదర్శన చేసి శ్రీశ్రీతో పాటు అరెస్టయి ఒక రోజంతా పోలీసు లాకప్ లో గడపడం దగ్గరి నుంచి, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సభలు, సమావేశాల్లో పాల్గొంటూ పాటలు పాడుతూ, ఉపన్యాసాలు ఇస్తూ తిరగడం దాకా చెర ఒక సంపూర్ణ జీవిత కాలపు పనులు ముప్పై ఎనిమిది ఏళ్ల జీవితంలోనే చేశాడు. ఆ కాలమంతా ఆయనతో పాటుగా ఆ సమస్యల్ని ఎదుర్కొంటూ ఆ వేదనలను అనుభవిస్తూ సహచరిగా నిలిచింది శ్యామలక్క.

ఇలా చెరబండరాజు అనారోగ్య పీడితుడుగా, నిత్యం ఆస్పత్రికి తిరుగుతూ ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడానికి ప్రయత్నించింది. కారణాలు చూపనక్కరలేకుండా ప్రభుత్వోద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించడానికి రాజ్యాంగ అధికరణం 311 (2)(సి) కింద గవర్నర్ కు ఉన్న అధికారాన్ని వాడుకుని 1980 మార్చ్ 18న చెరబండరాజును, రాజలోచన్ ను ఉద్యోగాలనుంచి తొలగించారు. ఆ కేసులో ప్రభుత్వం మీద గెలిచి తిరిగి ఉద్యోగం సంపాదించుకున్నదాకా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురయింది. ఆయన అలా ఆనారోగ్య పీడితుడిగా ఉన్నప్పుడు కూడ సికిందరాబాదు కుట్రకేసు విచారణ సాగుతూనే ఉండింది. “నా కక్షిదారు అనారోగ్యం వల్ల, మాట్లాడగలిగే స్థితిలో లేనందువల్ల నాకు ఏ ఆదేశాలు ఇవ్వడం లేదు. కనుక నేను ఆయన తరఫున వాదించలేకుండా ఉన్నాను” అని న్యాయవాది కె జి కన్నబిరాన్ గారు న్యాయమూర్తికి విన్నవించుకున్నా ఏమీ జరగలేదు. చిట్టచివరికి కొద్దిరోజుల్లో చనిపోతాడనగా మాత్రమే ప్రభుత్వం అతి ఉదారంగా కేసులోనుంచి చెరబండరాజు పేరు ఉపసంహరించుకుంది.

చెరబండరాజు కూతురు ఉదయిని ఇష్టప్రకారం నాగార్జున రెడ్డిని సహచరుడిగా ఎంచుకుంది. వారికి అపరంజిబొమ్మ లాంటి పాప సింధు పుట్టిన కొద్దికాలానికే నాగార్జునను పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపారు. నిజానికి నాగార్జునకు రాజకీయ కార్యాచరణ ఏమీలేదు. ఆయన విద్యార్థిగా ఉన్న రోజులలో స్నేహితుడిగా ఉండి, ఆ తర్వాత మెదక్ జిల్లా విప్లవోద్యమ నాయకుడిగా ఎదిగిన భానుప్రసాద్ కలవాలని పిలిస్తే, కలవడానికి వెళ్ళి తార్నాక ఆరాధన థియేటర్ దగ్గర ఆయనతోపాటు పోలీసులకు దొరికాడు. భానును చంపదలచి, సాక్ష్యం లేకుండా చేయడం కొరకు నాగార్జునను కూడ చంపేశారు.

నాగార్జున హత్య జరిగిన కొద్ది రోజులకే ఉదయినికి కాన్సర్ ఉందని బయట పడింది. దాదాపు రెండు సంవత్సరాలు చికిత్స జరిగింది. కీమోథెరపీ బాధతో ఉదయిని విలవిలలాడుతుంటే అంతకన్న ఎక్కువ బాధను శ్యామలక్క అనుభవించింది. ఆ చికిత్స తర్వాత ఉదయిని తేరుకుంది. వ్యాధి తగ్గిపోయిందనీ ఇక కుటుంబం కష్టాల బారినుంచి బయట పడిందనీ అనిపించింది. కాని త్వరలోనే వ్యాధి మళ్లీ తిరగబెట్టి ఉదయిని  మరణించింది.

ఇదంతా చెరబండరాజు – శ్యామలక్క కుటుంబపు కష్టాల చరిత్ర అయితే, ఈ నాణానికి మరొక వైపు కూడ ఉంది. ఇన్ని కష్టాలలో చెరబండరాజుగాని, చెరబండరాజు మరణానంతరం శ్యామలక్క గాని చలించకుండా నిలబడడం, విలువలను కాపాడుకోవడం అపురూపమైన విషయాలు. చెర నిలబడడానికి ఆయన రాజకీయ విశ్వాసాలు కారణం. కాని, శ్యామలక్కకయితే రాజకీయాలు అంతగా తెలుసునని కూడ అనుకోలేం. చెరబండరాజు సహచరిగా ఆయన విలువలను కాపాడడం తన బాధ్యత అని ఆమె అనుకున్నది. ముఖ్యంగా ఆయన మరణానంతరం ఆయన పేరు భంగపడే పని ఏదీ చేయవద్దని అనుకున్నది. ఆ మాటకు ముప్పై ఏళ్లపాటు కట్టుబడి ఉన్నది. ఆయన మరణించిన కొద్దికాలానికే ఆయన నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి ఇవ్వజూపితే ఆ బహుమతిని తిరస్కరించడం దగ్గరినుంచి నిషేధానంతర విరసం మహాసభల పతాకావిష్కరణ దాకా, కుటుంబంలో పిల్లల వివాహాలలో ఆదర్శాలు పాటించడం దగ్గరినుంచి విప్లవసాహిత్య, సాంస్కృతికోద్యమ సహచరులను, విప్లవకారులను తన కుటుంబ సభ్యులుగా భావించడం దాకా శ్యామలక్క ఎటువంటి ఆర్భాటాలూ లేకుండానే చెరబండరాజుకు నిజమైన సహచరిగా బతికింది. చెరబండరాజు లాగానే వ్యవస్థ దుర్మార్గానికి బలి అయిపోయింది. కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సరిగా పనిచేయక బాధపడుతూ ఉండి జూలై 20 ఉదయం మరణించింది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra. Bookmark the permalink.

4 Responses to శ్యామలక్క అకాల మృతి

 1. Dr.Rajendra Prasad says:

  A great tribute for a great family

 2. anynymous says:

  All these people died because they were injected with the dangerous and cureless virus of communism and nothing else.

 3. afsar says:

  వేణూ:

  చాలా ఆలశ్యంగా చదివాను.

  ఇప్పటికీ బాగా గుర్తు: ఖమ్మం లో హరీష్ అవార్డు కోసం శ్యామల గారిని కలవడం. ఆ రోజు కేవియార్తో సుదీర్ఘ సమావేశం. మా నిరసన. ఆయన సమాధానం.

  కాని, నువ్వు లేవనెత్తిన ప్రశ్నలకి జవాబుల్లేవు.

  చనిపోకముందే మనుషుల్ని ప్రేమించే రోజు వస్తుందంటావా? ఏమో?!

  అఫ్సర్
  http://www.afsartleugu.blogspot.com

 4. bhasker.koorapati says:

  dear venu.
  i have literally wept as i read the article. anta aardranga raasaaru meeru. shyaamalakka laanti viplava sahachari dorakadam cheraku nijangaa garvakaaranam. shyamalakka moorteebhavinchina comdrade. ameku laal salaam. misfortunes never come singly, antadu, shakespear anukunta. atla, shyamalakka jeevitamlo anni eduru debbalu tagilaayi. ayinaa gunde nibbaram kolpoledu. hats off to her. red salute!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s