ఆత్మహత్యలు కావు, మనం చేస్తున్న హత్యలు

వీక్షణం మార్చ్ 2010

ఇది ‘ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీద సంప్రదింపులు జరిపే జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ కమిటీ’ గురించి చర్చించడానికి కాదు. ఆ కమిటీ సూచన వెలువడిన జనవరి 5న జరిగిన ఒక ఆత్మహత్య నుంచి ఆ కమిటీని బహిష్కరించమనే పిలుపుతో చలో అసెంబ్లీ సాగిన ఫిబ్రవరి 20న జరిగిన మరొక ఆత్మహత్య దాకా పరిస్థితులను చర్చించడానికి. తెలంగాణలో చెలరేగుతున్న ఉద్రేకాలను ఈ కమిటీ చల్లార్చగలదా అని చర్చించడానికి. ఈ కమిటీ తెలంగాణ ప్రజలలో, విద్యార్థులలో ప్రస్తుత నిరాశను తుడిచేసి, ఆశను మేల్కొల్పగలదా అని చర్చించడానికి. ఆ ఆత్మహత్యలలో, హత్యలలో మన బాధ్యతను గుర్తింపజేయడానికి.

ఆదిలాబాద్ జిల్లా ఖానాపురం మండలం అంకెన గ్రామానికి చెందిన దానావత్ శ్వేత ఇచ్చోడ జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండేది. ఆ వయసు విద్యార్థులందరిలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొంటూ, తెలంగాణ ఏర్పడుతుందనే గట్టి విశ్వాసంతో ఉండేది.  రాష్ట్రంలోని రాజకీయపార్టీలతో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగిన జనవరి 5 రోజంతా టి వి చూస్తూ, ఏదో జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తారని ఆశించింది. ఊళ్లో ఉన్న కిరాణా దుకాణంలో చాక్లెట్లన్నీ తానే కొంటానని, శుభవార్త రాగానే పంచుతానని ముందే చెప్పి పెట్టింది. రాత్రి ఒంటి గంట దాకా చూసినా టి వి లో శుభవార్త లేదు సరిగదా, కాలయాపన వంచన ప్రకటనలు వెలువడ్డాయి. అప్పటికి  జస్టిస్ శ్రీకృష్ణ పేరు రాలేదు గాని కమిటీని నియమిస్తామనే ప్రకటన వచ్చింది. ఆ కమిటీ ఏమిచేసినా ప్రస్తుతానికైతే తెలంగాణ వెనక్కి పోయిందని శ్వేతకు అనిపించింది. చాక్లెట్లు కొని ఊరంతా పంచుతానన్న చేతులతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది.

ఆ తర్వాత నలభై ఐదు రోజులు గడిచాయి. కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారో, ఎవరు సభ్యులుగా ఉంటారో, ఆ కమిటీ ఏమి విచారిస్తుందో వివరాలు వచ్చాయి గాని, తెలంగాణ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 9 ప్రకటనకు కొనసాగింపు లేదు. తెలంగాణ పరిస్థితిలో పెద్ద మార్పులేదు. తెలంగాణ ప్రజలలో, విద్యార్థులలో ఆందోళన ఏమీ తగ్గలేదు. వారి కళ్లముందర ఒక్క ఆశాసూచన అయినా, ఒక్క వెలుగురేఖ అయినా మిగలలేదు. కుడి ఎడమల దగా దగా, ఎటుచూస్తే అటు దగా. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి వేసుకున్న రాజీనామా ప్రణాళికకు కాంగ్రెస్ నాయకులు, వారిని చూపెట్టి తెలుగుదేశం నాయకులు తూట్లు పొడిచారు.

ఈ స్థితిలో మళ్లీ ఒకసారి ఉద్యమాన్ని ఉధృతం చేయదలచిన విద్యార్థులు ఫిబ్రవరి 20న చలో అసెంబ్లీ పిలుపు ఇచ్చారు. ‘మేం మా భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంటే, మా ప్రాణాలు బలిపెడుతుంటే మీరు కడుపులో చల్ల కదలకుండా, మీ కుర్చీలు వదిలకుండా బడ్జెట్లు చర్చిస్తారా’ అని విద్యార్థులు, యువకులు ఆగ్రహ ప్రకటన చేయదలచారు. వేలాది పోలీసు, పారామిలిటరీ బలగాలను దింపి ఈ కనీస, ప్రజాస్వామిక, శాంతియుత నిరసన ప్రకటనను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ‘మామాట వినిపించడానికి కూడ అడ్డం పడతారా’ అని విద్యార్థి యువజనులకు దుఃఖం కలిగింది. ఆ ఆగ్రహం వయసు యాభై ఏళ్లనీ నలభై ఏళ్లనీ పది ఏళ్లనీ చాలమంది చెపుతారు గాని, విద్యార్థులు మాత్రం రెండు నెలలుగా తమ కళ్ల ముందు జరుగుతున్న మోసాలను చూసి ఆగ్రహపడ్డారు. రోజులు గడుస్తుంటే ఆ ఆగ్రహం నిస్సహాయం కావడం మొదలయింది. ఆ నిస్సహాయ ఆగ్రహమే సిరిపురం యాదయ్యను ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఇంటర్ చదువు మధ్యలో ఆపవలసి వచ్చిన యాదయ్య, ఒక రెస్టారెంట్ లో పనిచేస్తూ పొట్టపోషించుకుంటున్న అనాథ యాదయ్య తన కోపాన్ని ఎవరిమీద చూపాలో, ఎట్లా చూపాలో తేల్చుకోలేకపోయాడు. తనమీద తానే తీర్చుకున్నాడు. బహిరంగంగా వంటికి నిప్పంటించుకుని మనందరి కళ్లముందు కాలి కూలిపోయాడు.

పదహారేళ్ల ఆదిలాబాద్ లంబాడీ యువతి, ఇరవై ఏళ్లు నిండని రంగారెడ్డి జిల్లా అనాథ బహుజన యువకుడు, నవంబర్ 30న ఆత్మాహుతికి ప్రయత్నించి డిసెంబర్ 4న మరణించిన కాసోజు శ్రీకాంత్ చారి నుంచి ఇప్పటిదాకా ఆగకుండా సాగుతున్న ఆత్మహత్యల పరంపరలో మరణించిన మూడు వందల మంది విద్యార్థి యువజనులు ఏం కావాలని ఆశించారు? ఏం దొరకలేదని నిరాశపడ్డారు?

వారి ఆత్మ బలిదానాలు తప్పే. ఆ చావులను కీర్తిస్తే ఇతరులకు నమూనాలుగా కనబడతాయనే భయం నిజమే. ఆ అమాయకపు పిల్లలు ఇంకే దారీ కనబడక ఈ తప్పుడు దారిని ఎంచుకున్నారు కావచ్చు. ఎప్పుడయినా బతికి సాధించాలి గాని చచ్చిపోవడం మంచిది కాదని నీతులు చెప్పవచ్చు. కాని ఆలోచనాపరులమూ బుద్ధిమంతులమూ ప్రగతివాదులమూ ఇతరుల తప్పులు ఎంచగలవాళ్లమూ అని మనకు మనం కితాబులు ఇచ్చుకుంటున్న మనం కనీసం ఒక్క నిమిషం ఆగి ఏ కారణాలవల్ల ఈ ఆత్మహత్యల పరంపర సాగుతున్నదో ఆలోచిస్తామా? ‘ఆత్మహత్యలు, బలిదానాలు వద్దు’ అనే శుష్కమైన ప్రకటనలు, పిలుపులు కాకుండా నిజంగా ఆ ఆత్మహత్యలు ఎందువల్ల జరుగుతున్నాయో, వాటిని ఆపే మార్గం ఏమిటో ఆలోచిస్తామా? ఈ ముక్కుపచ్చలారని పిల్లల మరణాల సాక్షిగానైనా మన బాధ్యతలనూ బాధ్యతారాహిత్యాలనూ గుర్తిస్తామా? ఇక నుంచి అయినా బాధ్యతగా ఉంటామని హామీ పడతామా?

నిజానికి ఈ ఆత్మహత్యలకు మనందరిదీ, మనలో ప్రతి ఒక్కరిదీ బాధ్యత. న్యాయం పక్షం వహించలేని వాళ్లది. న్యాయపక్షాన్ని బలోపేతం చేయడానికి మన శక్తియుక్తులన్నీ ఖర్చుపెట్టాలని అనుకోని వాళ్లది. ఈ సంక్షుభిత సమయంలో కూడ శవదహనాల మీద తమ పేలాలు వేయించుకు తిందామని అనుకుంటున్నవాళ్లది. న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఇవ్వలేని వాళ్లది. అన్యాయాన్ని గెలిపించడానికి అర్థబలాన్నీ అంగబలాన్నీ ఆలోచనలనూ వాడుతున్నవాళ్లది. తెలుగు సమాజంలోని ప్రతి ఒక్కరి మనసుల మీద ఈ నెత్తుటి మరక అంటుకునే ఉంటుంది.

ఆ పసిమొగ్గలు రాలిపోకుండా ఉండాలంటే మనం చేసి ఉండగలిగిన పనులు చాల ఉన్నాయి. ఏ ఒక్కటీ మనం చేయలేదు.  నిజానికి ఇవి ఆత్మహత్యలు కావు. హత్యలు. మనందరం, సభ్య సమాజం కలిసి చేసిన హత్యలివి.

ఈ హత్యలకు ప్రధాన, ప్రథమ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను తుంగలో తొక్కిన నాటినుంచి, పెద్దమనుషుల ఒప్పందం అమలు కాకపోతుంటే మౌనంగా ఉన్ననాటినుంచి, 1969 ఉద్యమాన్ని నెత్తురుటేర్లలో అణచివేసిన నాటినుంచి శ్రీకృష్ణ కమిటీ అనే బూటకపు తతంగం దాకా కేంద్ర ప్రభుత్వ నేరాల జబితా చాల పెద్దది. ఈ నేరాల గంజాయి వనం మధ్యలో ఒకే ఒక్క తులసిమొక్క డిసెంబర్ 9 ప్రకటన. ఆ ప్రకటనను కొనసాగించకపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వందలాదిగా విద్యార్థి యువజనులను హత్య చేస్తోంది. ఈ హత్యలు ఆగిపోవాలని చిత్తశుద్ధితో కోరుకునే వారెవరయినా డిసెంబర్ 9 ప్రకటనను అమలులో పెట్టమని కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి.

ఈ హత్యలకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. 1956 నవంబర్ 1 న ఏర్పడిననాటినుంచీ తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల అన్యాయాన్ని, వివక్షను, హామీల ఉల్లంఘనలను సాగిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చిట్టచివరికి నవంబర్ 29 నుంచీ సాగుతున్న ఆందోళన మీద అన్ని వైపుల నుంచీ దాడి సాగిస్తోంది. ఒకవైపు ఉద్యమం మీద అబద్ధాలు ప్రచారం చేయడం, మరోవైపు తెలంగాణ నుంచే కొందరు దళారీలను తయారుచేసి, కొనివేసి వారిని ఉద్యమానికి వ్యతిరేకంగా ఉపయోగించడం, అయినా పట్టుదలగా తెలంగాణ ఆకాంక్షలను ప్రకటిస్తున్న వారి మీద భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించడం, ఇంత ఉద్యమం నడుస్తున్న రోజులలో కూడ నిస్సిగ్గుగా తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు చేయడం, ప్రకటనలు చేయడం, చివరికి తెలంగాణ విద్యార్థుల మీద అణచివేతను ఆపబోనని సుప్రీంకోర్టుకు వెళ్లడం – రాష్ట్ర ప్రభుత్వం మీద మోపగలిగిన హత్యాభియోగాలకు లెక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పనులే ప్రత్యక్షంగా విద్యార్థి యువజనులను హత్య చేస్తున్నాయి. ఈ హత్యలు ఆగిపోవాలంటే ఈ హంతక ప్రభుత్వాన్ని తక్షణమే కట్టడి చేయవలసి ఉంది.

మూడో ముద్దాయిగా ఈ హత్యలకు బాధ్యత వహించవలసినది రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు. తెలంగాణ ప్రజల వోట్ల కోసం ఒక మాట, కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్న వర్గాల ప్రయోజనాలకోసం మరొకమాట చెపుతున్న రాజకీయ పార్టీల రెండునాల్కల వైఖరే ప్రస్తుత హత్యలకు కారణం. తెలంగాణ సాధించేవరకు విశ్రమించబోమని, పదవులను, ప్రాణాలను తృణప్రాయంగా త్యజిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నాయకులు కేంద్రం మీద ఒత్తిడి చేసేలా రాజీనామా చేయడానికి వెనుకాడుతున్నారు. పదవికి అంటిపెట్టుకుని ఉండడానికి ఏ గడ్డి అయినా కరుస్తున్నారు. ఐక్య కార్యాచరణ సమితి నుంచి కూడ వైదొలిగారు. ఇక తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ ను సాకుగా చూపి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వెనుకాడుతున్నారు. ఇప్పటికి మూడుసార్లు రాజీనామా చేసిన అనుభవం ఉన్న తెరాస అధిపతి కొత్త రాజీనామా లేఖను ఆమోదం పొందడానికి వీలులేని పద్ధతిలో రాశారు. గత అరవై ఏళ్ల చరిత్రలో పార్లమెంటరీ రాజకీయ పక్షాలన్నీ కూడ తెలంగాణకు ద్రోహం చేసినవే. ఆ ద్రోహాల కుప్ప పెరిగి పెరిగి ఇవాళ తెలంగాణ విద్యార్థి యువజనులను హత్యలు చేస్తున్నది. ఈ హత్యలు ఆగిపోవాలని కోరుకునే వారెవరయినా ఈ రాజకీయ పార్టీల బండారాన్ని బయటపెట్టవలసి ఉంటుంది. రాజకీయ పక్షాలు ఎంత అవిశ్వసనీయమైనవో ప్రజలకు తెలియజెప్పవలసి ఉంటుంది. రాజకీయ పార్టీలను ఎంతమాత్రం నమ్మనక్కరలేదని, వారి పని కేవలం పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు వోటు వేయడం మాత్రమేననీ, అంతకన్న ఎక్కువ గౌరవం, స్థానం వారికి ఇవ్వనక్కరలేదని ప్రజలకు తెలియజేయవలసి ఉంటుంది.

నాలుగో ముద్దాయిగా ఈ హత్యలకు బాధ్యత వహించవలసినది కోస్తాంధ్ర పెట్టుబడిదారులు, సంపన్నులు, రాజకీయనాయకులు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరుతో తెలంగాణ వనరులను తెలంగాణ ప్రజలనుంచి కొల్లగొట్టి వందల, వేల కోట్ల రూపాయలు ఆర్జించిన ఈ పెద్దమనుషులు, తమ దోపిడీ కబంధ హస్తాలనుంచి తెలంగాణను విడుదల చేయదలచుకోలేదు. అందుకే ఢిల్లీలోనూ, ఇతరచోట్లా వందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ సమైక్య ఉద్యమం అనేది నడుపుతున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలలోని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారికి అబద్ధాలు చెపుతూ, తమ ప్రయోజనాలనే ప్రజల ప్రయోజనాలుగా నమ్మిస్తూ ఉద్యమం నడుపుతున్నారు. ఇలా అధర్మం మీద ఆధారపడిన ఒక చర్యో, ఒక మాటో అటు జరగగానే అది తెలంగాణ విద్యార్థి యువజనులలో నిరాశకు కారణమవుతున్నది. ప్రత్యర్థుల అర్థబలం, అంగబలం ముందు తమ న్యాయమైన ఆకాంక్ష భగ్నమైపోతుందేమోననే భయం ముప్పిరిగొంటున్నది. తమ కళ్లముందరే డిసెంబర్ 9 ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటే కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నుల కుయుక్తులు ఎంత బలమైనవో అర్థమై తెలంగాణ ప్రజలలో నిస్సహాయత పెరుగుతున్నది. ఆ నిస్సహాయతే వారి హత్యలకు కారణమవుతున్నది. ఈ హత్యలు ఆగిపోవాలని కోరుకునేవారెవరయినా వెంటనే కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నుల రహస్య వ్యాపార ఎజెండాలను బయటపెట్టాలి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు తమ నాయకుల ఉచ్చులో చిక్కుకోకుండా కాపాడాలి. ధనబలంతో, అబద్ధాలతో గెలుపు సాధ్యం కాదనీ, తాత్కాలికంగా గెలుపులాగ కనిపించినది కూడ దీర్ఘకాలికంగా, నైతిక అర్థంలో గెలుపు కాదనీ చెప్పాలి.

ఈ హత్యలకు తెలంగాణ ఉద్యమకారులు కూడ బాధ్యత వహించవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఒకానొక పాలనాపరమైన మార్పే తప్ప, దాని ద్వారా స్వర్గం ఏర్పడదని, ఎక్కువలో ఎక్కువ నీళ్లు, నిధులు, నియామకాలు, కేటాయింపులలో జరిగిన అన్యాయాలు సవరించడం మాత్రమే జరుగుతుందనీ, అప్పటికీ అది ప్రజా తెలంగాణ కాకపోవచ్చుననీ తెలియజెప్పడంలో తెలంగాణ ఉద్యమకారులు విఫలమయ్యారు. ఒక శ్వేతకూ, ఒక యాదయ్యకూ, అటువంటి నవయువకులందరికీ తెలంగాణ వస్తే ప్రపంచమే మారిపోతుందనే ఆశను కల్పించారు. ఈ మితిమీరిన ఆశలు ఎదురుదెబ్బ తగిలినప్పుడు నిరాశగా మారడం, ఆత్మహత్యకు పురికొల్పడం సహజమే. అలాగే, అటువంటి ఆశను ప్రోది చేసిన ఉద్యమనాయకత్వం ఆ ఆశకు తగిన క్రియాశీలమైన, శక్తిమంతమైన పోరాటరూపాలను ప్రజలముందు ఉంచలేదు. ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం పెరిగినకొద్దీ, ఉద్యమం ఉధృతమైనకొద్దీ, పోరాట రూపాలను ఉన్నతదశకు ఎదిగించవలసి ఉంటుందని గుర్తించలేదు. కాలం గడిచినకొద్దీ పాత పోరాటరూపాలే సాగుతూ, ఫలితమేమీ కనబడకపోవడంతో నిరాశ వ్యాపించడం మొదలయింది. దూరదృష్టిని, పోరాటపు ఒడిదుడుకులపట్ల చైతన్యపూరితమైన అవగాహనను కలిగించి ఉంటే ఈ తాత్కాలిక నిరాశను జయించి పోరాటాన్నిముందుకు తీసుకుపోయే అవకాశం ఉండేది. కాని ప్రస్తుత ఉద్యమ నాయకత్వానికి ఆ పని చేయాలనే కోరిక లేకనో, చేసే సామర్థ్యం లేకనో ఆ పని మాత్రం జరగలేదు. కనుక ప్రస్తుత హత్యల పరంపర ఆగాలంటే ఈ రెండున్నరనెలల ఉద్యమం నుంచి పాఠాలు తీసుకుని కొత్త, విస్తృతమైన, శక్తిమంతమైన పోరాటరూపాలు కనిపెట్టడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, పాల్గొంటున్న ప్రజల చైతన్యాన్ని, అవగాహనను పెంచడం సాగించాలి.

ఈ హత్యలకు కొంత బాధ్యత ప్రచార సాధనాలు కూడ తీసుకోవలసి ఉంటుంది. సంచలనాల ద్వారా తమ ఆర్థిక ప్రయోజనాలు సాధించుకోదలచిన ప్రచార, ప్రసార సాధనాలు ప్రతి ఆత్మహత్యనూ ఒక సంచలనవార్తగా మాత్రమే చూస్తున్నాయి, చూపిస్తున్నాయి. ఒక నమూనాగా చూపిస్తున్నాయి. తద్వారా రాబోయే ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నాయి. ఇటువంటి ఘటనలను తగిన మోతాదులోనే చూపడం, సంచలనాత్మకం చేయకపోవడం, అటువంటి ఘటన చూపెట్టక తప్పనప్పుడు కూడ అది మార్గం కాదనే మాట ఒకటికి పది సార్లు చెప్పడం ప్రచార సాధనాల సామాజిక బాధ్యత. కాని అవి ఆ పని చేయడం లేదు. ఇప్పటికైనా ఆ పని సాగితేనే, ప్రస్తుత ఆత్మహత్యల పరంపర ఆగిపోవడానికి వీలవుతుంది.

ఇక ఈ హత్యలలో మేధావుల బాధ్యత కూడ ఉంది. గత రెండున్నర నెలలుగా పత్రికలలో వ్యాసాలు రాస్తున్న, టివి చర్చలలో తమ అభిప్రాయాలు ప్రకటిస్తున్న మేధావులు చెప్పిన ప్రతి అబద్ధమూ ఒక బలి కోరుతున్నది. తన పొలానికి నీళ్లందక, తన తండ్రికి ఉద్యోగం రాక, తనకు సరయిన చదువు అందక, తన కళ్లముందర తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరిగిందో చూసిన తెలంగాణ విద్యార్థి యువజనులు, పత్రికలోనో, టివిలోనో తెలంగాణకు ఏమీ అన్యాయం జరగలేదని మేధావులు ప్రకటిస్తున్న అబద్ధాలు విని అవమానపడుతున్నారు, నిరాశపడుతున్నారు. లోకమంతా ఒక్కటయి తనకు అన్యాయం చేస్తోందని, తనమీద జరిగిన అన్యాయాన్ని సమర్థిస్తోందని బాధపడుతున్నారు. అది ఆత్మహత్యలకు దారితీస్తోంది. ఈ నవయువకుల బలిదానాలపట్ల స్పందించే సున్నిత హృదయం, ఇలా జరగగూడదని భావించే మానవత్వం ఇంకా మిగిలిఉంటే మేధావులు కనీసం తమ అబద్ధాలను మానేయాలి.

ఈ హత్యలకు బాధ్యత ప్రజలందరిదీ కూడ. ఉద్యమంలో ఇంకా ఎక్కువగా పాల్గొని, ఉద్యమాన్ని ఇంకా సమరశీలంగా మార్చి తక్షణ పరిష్కారం దిశగా ఉద్యమాన్ని నడపలేకపోతున్న తెలంగాణ ప్రజలది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు తమ ఆకాంక్షల న్యాయబద్ధతను వివరించి సంఘీభావం కూడగట్టలేకపోతున్న తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజల ఆందోళనలో న్యాయం ఉన్నదని గుర్తించి, ఆ ఆందోళనను సమర్థించి, సంఘీభావం ప్రకటించే బదులు, తమ నాయకుల ఉచ్చులలో పడి, తాము మోసపోతూ తెలంగాణ విద్యార్థి యువజనులను ఆందోళన పరుస్తున్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలది. పిడికెడు మంది ఆందోళనకారులు సమైక్యాంధ్ర అంటూ ఉంటే, ఆ భావాలేమీ లేకపోయినా వారిని ఖండించకుండా మౌనంగా ఉండిపోతున్న విశాల కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజారాశులది.

ఈ హత్యలకు బాధ్యత మనలో ప్రతి ఒక్కరిదీ. ప్రజా న్యాయస్థానం ముందర మన మీద మోపుతున్న ఈ హత్యా అభియోగాలకి జవాబు చెప్పుకోవలసిన బాధ్యత మనదే.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Veekshanam. Bookmark the permalink.

One Response to ఆత్మహత్యలు కావు, మనం చేస్తున్న హత్యలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s