శ్రీకృష్ణ కమిటీని ఏం చేద్దాం?

కాకతీయ విద్యార్థుల బులెటిన్ కోసం

ఫిబ్రవరి 12న కేంద్రప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ విచారణాంశాలను ప్రకటించినప్పటినుంచీ తెలంగాణ ఉద్యమంలో, రాజకీయాలలో మరొకసారి పెద్దఎత్తున చర్చ, ఆందోళన మొదలయ్యాయి. అసలు ఈ కమిటీని గౌరవించాలా లేదా, ఈ కమిటీ ఏమి చేస్తుంది, ఈ స్థాయిలో కమిటీ విచారణాంశాలు మార్పించే ప్రయత్నం చేయవచ్చునా, ఈ విచారణాంశాలతో విచారణలో పాల్గొనడం మంచిదా, బహిష్కరించడం మంచిదా, పాల్గొనకపోతే మన వాదనలు వినిపించే అవకాశం కోల్పోయినట్టవుతుందా, బహిష్కరించకపోతే ఈ బూటకపు కమిటీని గౌరవించినట్టు కాదా, పాల్గొంటే ఎలా పాల్గొనాలి, బహిష్కరిస్తే ఎంత విస్తృతంగా బహిష్కరించాలి అని అనేక ప్రశ్నలు, చర్చలు రేకెత్తుతున్నాయి. ఈ సందేహాలకు సమాధానాలు కనిపెట్టి, శ్రీకృష్ణ కమిటీ గురించి ఒక వాస్తవికమైన, హేతుబద్ధమైన వైఖరిని సూచించడం ఈ వ్యాస లక్ష్యం.

అసలు మొట్టమొదట జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ కమిటీ ఎందుకు, ఎట్లా ఏర్పడిందో గుర్తు చేసుకోవాలి. కేంద్రప్రభుత్వం తరఫున హోంమంత్రి పి చిదంబరం డిసెంబర్ 9న ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నద’ని ప్రకటించారు. కాని ఆ ప్రక్రియ ప్రారంభించకుండానే ‘మారిన పరిస్థితులలో విస్తృత చర్చ అవసరమ’ని డిసెంబర్ 23న హోంమంత్రి మరొక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా జనవరి 5న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశం తర్వాత ఒక విచారణ కమిటీ ఏర్పడుతుందనే ప్రకటన వెలువడింది. దాదాపు ఒక నెల తర్వాత ఫిబ్రవరి 3న జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ నాయకత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు జరిగింది. ఆ కమిటీ విచారణాంశాలను ఫిబ్రవరి 12న ప్రకటించారు.

ఈ చరిత్ర మొత్తం చూస్తే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 9 ప్రకటన స్ఫూర్తికి కొనసాగింపు కాదని, డిసెంబర్ 23 ప్రకటనకు కొనసాగింపు అనీ స్పష్టంగానే అర్థమవుతుంది. అంటే మౌలికంగానే ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలా, సమైక్య రాష్ట్రం కొనసాగాలా అనే విస్తృత చర్చ చేయడానికే తప్ప, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగమైన చర్యలు చేపట్టడానికి కాదు. కేంద్రప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన తన ప్రకటనకు తానే కట్టుబడి ఉండడంలేదని స్వయంగానే ప్రకటించిందన్నమాట.

అలా ప్రాథమికంగానే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు అనుమానాస్పదంగా ఉండగా, ఈ క్రమంలో సాగుతున్న కాలయాపన మరిన్ని అనుమానాలకు దారితీసేలా ఉన్నది. విస్తృత చర్చలు అవసరమని ప్రకటించిన తర్వాత రెండు వారాలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కమిటీ వేయాలని నిర్ణయించినా, కమిటీ పేర్లు ప్రకటించడానికి మరొక నాలుగు వారాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కమిటీ విచారణాంశాలు ప్రకటించడానికి మరొక వారం తీసుకున్నారు. ఆ కమిటీ విచారణకు ఎనిమిది నెలల గడువు పెట్టారు. ఇదంతా చూస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు పరిష్కారం వెతకడం కన్న, తాత్సారం చేసి అసలు సమస్యలనుంచి దృష్టి మళ్లించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతున్నది. ఒక మాజీ పోలీసు అధికారిని గవర్నర్ గా పంపించి, తెలంగాణ ప్రజాందోళన మీద దమనకాండ అమలుచేసి, ఆ ఆందోళన పూర్తిగా చల్లారిందని అనుకున్న తర్వాతనే కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు, నాయకులు కోరుకున్న పద్ధతిలోనే సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీ పాలకులు పన్నాగాలు పన్నుతున్నారనడానికి ఈ కమిటీ ఏర్పాటే తార్కాణం.

కమిటీ ఏర్పాటులోనే దురుద్దేశ్యం ఉన్నదనుకుంటే, ఆ కమిటీ విచారణాంశాల ప్రకటనలో అది మరింత స్పష్టంగా బయటపడింది. హోంమంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 12న చేసిన ప్రకటన ప్రకారం ఆ విచారణాంశాలు ఏడు. అవి తెలంగాణ ప్రజా ఆకాంక్షలను అవమానించేలా, సమైక్యాంధ్ర కొనసాగింపును బలపరిచేలా, తెలంగాణ ప్రజాందోళనలో చీలికలు తెచ్చేలా, అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి. పేరుకు ఏడు విచారణాంశాలు అని లెక్క చెప్పారు గాని ఆ మొత్తం విచారణాంశాలను రెండుగానో, మూడుగానో చెప్పవచ్చు.

మొదటి అంశం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, సమైక్యాంధ్రప్రదేశ్ కొనసాగింపు ఉద్యమాల వల్ల ఏర్పడిన పరిస్థితిని పరీక్షించడం, రెండవ అంశం రాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుంచి జరిగిన అభివృద్ధిని, వివిధ ప్రాంతాల మీద ఆ అభివృద్ధి ప్రభావాన్ని సమీక్షించడం, మూడవ అంశం విభిన్నవర్గాల ప్రజలపైన ఇటీవలి పరిణామాల ప్రభావాన్ని పరీక్షించడం అని రాసి, నాలుగవ అంశంగా ‘పై మూడు అంశాలలో ముఖ్యమైన అంశాలను గుర్తించడం’ అని రాశారు. మరి పై మూడు అంశాలను పరీక్షించడమే నాలుగవ అంశం అయితే, పై మూడు అంశాలలో చేసే పని ఏమిటి? ఎంత తెలివితక్కువ రచయిత అయినా ఇంత హాస్యాస్పదమైన వాక్యాలు రాయలేడు. కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరయినా ఈ మాయను గుర్తించగలరు. కాని కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వ శాఖ, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రజలను ఘోరంగా అవమానించదలిచారు. ఆ అంశాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు తమ కుటిలత్వాన్ని బహిర్గతం చేసుకుంటున్నారు.

ఇక ఐదవ అంశం విభిన్న వర్గాల ప్రజలను, ప్రత్యేకించి రాజకీయ పార్టీలను సంప్రదించడం అని రాసి ఆరవ అంశంగా పౌర సమాజ సంస్థలను సంప్రదించడం అని రాశారు. నిజానికి విభిన్నవర్గాల ప్రజలు అనే మాటలోనే ఈ పౌరసమాజ సంస్థలు అన్నీ ఉంటాయి. అంటే ఐదో అంశం, ఆరో అంశం కలిపి రాయవలసినవే, లేదా ఆరో అంశం రాయనవసరమే లేదు. ఇక ఏడో అంశం కమిటీ తలచుకున్న ఇతర సూచనలకు, సిఫారసులకు సంబంధించినది. అది విచారణాంశం కాదు, కమిటీ చేయవలసిన పని అవుతుంది.

అంటే మొత్తం మీద పిల్లి అంటే మార్జాలం అంటే బిల్లీ అంటే క్యాట్ అని నాలుగు చెప్పాను చూసుకో అని ఒక్క సంగతే చెప్పినట్టుగా, శ్రీకృష్ణ కమిటీ విచారణాంశాలు ఏడు అని చెప్పినా మౌలికంగా ఉన్నవి రెండే – ఒకటి, 1956 నుంచి జరిగిన అభివృద్ధిని, విభిన్న ప్రాంతాల మీద దాని ప్రభావాన్ని అంచనా కట్టడం, రెండు, రాష్ట్ర విభజన – ఐక్యత మీద వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించడం. ఇందులో మొదటి పని గత యాభైనాలుగు సంవత్సరాలలో వందలాది అధ్యయనాలలో, పరిశోధనలలో, పుస్తకాలలో, నివేదికలలో, ప్రభుత్వ పత్రాలలో జరిగింది. దానికోసం కొత్త కమిటీ అవసరం లేదు. రెండవ పని గత రెండు నెలలుగా అన్ని ప్రచార, ప్రసార సాధనాలలో జరిగింది. ఎవరయినా వారం, పది రోజులు పరిశోధిస్తే ఈ రెండు అంశాలమీద నివేదిక తయారు చేయవచ్చు.

ఇంతకూ ఈ కమిటీ సిఫారసులకు ఆచరణయోగ్యత ఉందా, ఉంటే ఎంత అనేది కూడ ఆలోచించాలి. ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నది ఒక న్యాయమూర్తే గాని ఇది విచారణ కమిషన్ల చట్టం కింద ఏర్పడిన చట్టబద్ధ న్యాయవిచారణ కమిషన్ కాదు. అటువంటి కమిషన్ల సిఫారసులను కూడ ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆమోదించి అమలు చేయాలన్న నియమం లేదు. ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదా, హోంమంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తున్నదా ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఈ కమిటీ చేసే పని ఎక్కువలో ఎక్కువగా హోంమంత్రిత్వశాఖకు అవసరమైన సమాచారం అందించడం మాత్రమే. నిజనిర్ధారణ కమిటీ చేసే పని లాంటిది మాత్రమే. ఈ కమిటీ కన్న ఎక్కువ చట్టబద్ధత ఉన్న, ఎక్కువ విస్తృతమైన కమిటీలు, కమిషన్లు గతంలో తెలంగాణ విషయంలో అనేక సిఫారసులు చేసి ఉన్నాయి. ఆ సిఫారసులలో ముఖ్యమైనవయినా అమలులోకి రాలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయమని జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ 1955లో చేసిన సిఫారసును కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఆ తర్వాత కె. లలిత్ కమిటీ (1969), జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ (1969), కె జయభారత్ రెడ్డి నాయకత్వాన ముగ్గురు అధికారుల కమిటీ (1985), శాసనసభాసంఘం (2001), జె ఎం గిర్ గ్లాని కమిటీ (2003) వంటి కమిటీలు తెలంగాణకు అనుకూలంగా చేసిన సిఫారసులేవీ అమలులోకి రాలేదు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ (2004), రోశయ్య కమిటీ (2009) అసలు పని చేశాయో లేదో తెలియదు. ఇన్ని అనుభవాల నేపథ్యంలో ప్రస్తుత జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా సిఫారసులు చేసినా కేంద్ర ప్రభుత్వం ఆ సిఫారసులను మన్నిస్తుందనే నమ్మకం లేదు.

కనుక జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ ఎంత నిజాయితీపరుడైనా, ఆ కమిటీలోని ఇతర సభ్యులు ఎంత నిపుణులైనా ఆ కమిటీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీరుస్తుందనే విశ్వాసం ఉంచడానికి అవకాశం ఎంతమాత్రం లేదు. ఎనిమిదినెలల ఎదురుచూపుల తర్వాత అనుకూల సిఫారసులు చేస్తారో లేదో తెలియని, అనుకూల సిఫారసులు చేసినా అమలుచేస్తారో లేదో తెలియని స్థితిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ మీద తెలంగాణ ప్రజలు నమ్మకం పెట్టుకోవడం అసాధ్యం. భారత జాతీయోద్యమ క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన అనేక కమిషన్లను, కమిటీలను భారత ప్రజలు వ్యతిరేకించినట్టే, నిరసించినట్టే, బహిష్కరించినట్టే, సహాయ నిరాకరణ చేసినట్టే ప్రస్తుత శ్రీకృష్ణ కమిటీ పట్ల కూడ తెలంగాణ ప్రజలు నిరసన తెలపవలసి ఉంది.

అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించాలనే రాజకీయ డిమాండ్ ను ముందుకు తెస్తూనే అదే సమయంలో ఆలోచించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలలో చాల బలంగా వ్యక్తమవుతున్నప్పటికీ, రాజకీయవర్గాలు అంత బలంగా ఆ ఆకాంక్షలను ప్రకటించడంలేదు. అన్ని రాజకీయపార్టీలూ దివాళాకోరు ఎత్తుగడలతో తమ తమ రాజకీయ స్వప్రయోజనాలకొరకు మాత్రమే తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకుంటున్నాయి. వీలయిన చోటనల్లా మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజకీయ విభేదాలు, విభజనలు మాత్రమే కాక, సామాజిక వర్గాల పునాదిపై విభజనలు కూడ వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా అందరూ తమ తమ విభేదాలు పక్కనపెట్టి ఐక్యంగా పనిచేస్తున్న పరిస్థితి కనబడడం లేదు. ఇటువంటి పరిస్థితిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించాలనే నినాదానికి సంపూర్ణమైన మద్దతు లభిస్తుందో లేదో అనుమానమే. కమిటీ విచారణను నూటికి నూరు శాతం బహిష్కరించగలిగినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రజా ఆకాంక్షల ప్రభావం కమిటీమీద ఉంటుంది. తెలంగాణ నుంచి ఒక్క వ్యక్తి హాజరయినా, ఒక్క మహజరు సమర్పణ జరిగినా కమిటీ తెలంగాణ భాగస్వామ్యంతో నివేదిక తయారయినట్టుగానే చెప్పుకుంటుంది. సంపూర్ణ బహిష్కరణ జరిగినప్పుడు మాత్రమే ఆ కమిటీ నివేదికను, సిఫారసులను ఏకపక్షమైనవిగా చెప్పే వీలుంటుంది.

అలా సంపూర్ణంగా బహిష్కరించలేనప్పుడు, బహిష్కరించే బృందాలు, వర్గాలు బహిష్కరిస్తూనే, పాల్గొనదలచుకున్న వర్గాల మీద మరొక రకమైన ఒత్తిడి తేవలసి ఉంటుంది. పాల్గొనదలచిన వ్యక్తులు, రాజకీయపక్షాలు, బృందాలు తెలంగాణ వాదనలను బలంగా కమిటీ ముందు వినిపించేలా అన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. సమైక్యాంధ్రప్రదేశ్ పాలకవర్గాలు తెలంగాణ ప్రజాజీవితాన్ని యాభైనాలుగు సంవత్సరాలుగా ఎట్లా ధ్వంసం చేస్తూ వచ్చాయో సమగ్రమైన నివేదికలు కమిటీ ముందుకు తీసుకుపోవలసి ఉంటుంది. గణాంకాలతో, ఉదాహరణలతో, వివరణలతో, సమగ్రమైన సమాచారంతో, విశ్లేషణలతో, వాదనలతో కమిటీ ముందు బలమైన వ్యక్తీకరణలు సాగవలసి ఉంటుంది. ఆ సమాచారాన్ని కమిటీ ముందు పెట్టి వాదించడం మాత్రమే కాక, దేశవ్యాప్తంగా ప్రచారంలో పెట్టవలసి ఉంటుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత న్యాయమైనదో మొత్తం దేశంలోని ప్రజాస్వామిక శక్తులు అంగీకరించి, తెలంగాణ తరఫున వాదించేలా చేయవలసి ఉంటుంది.

అంటే మొత్తం మీద జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించడం ద్వారానైనా, పాల్గొనడం ద్వారానైనా తెలంగాణ ప్రజా ఆకాంక్షలను ముందుకు తీసుకుపోవడమే ఏకైక లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయవలసిన తరుణమిది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s