అంకెల మాయ – అసలు నిజాలు

‘అసత్యాలు మూడు రకాలు: అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, గణాంకాలు’ అని పందొమ్మిదో శతాబ్దపు బ్రిటిష్ ప్రధానమంత్రి బెంజమిన్ డిజ్రాయిలీ అన్నాడని అమెరికన్ వ్యంగ్య రచయిత మార్క్ ట్వెయిన్ రాశాడు. గణాంకాలనేవి సామాజిక వాస్తవికతను క్లుప్తంగా, సారభూతంగా వివరించే రూపాలు గనుక, గణాంకాల సహాయంతో సామాజిక వాస్తవికతను అర్థం చేసుకోవడం సులభం గనుక, గణాంకాలను వాడక తప్పదు. కాని వాటిని తగినంత జాగ్రత్తగా వాడకపోతే అవి పచ్చి అబద్ధాలుగా, సమర్థనయోగ్యం కాని వాదనలను సమర్థించుకునే ఆధారాలుగా మారిపోతాయి.

ఇటీవల సాగుతున్న చర్చోపచర్చలలో గణాంకాల వాడకం చాల విస్తృతంగా జరుగుతున్నది. అంకె అంటే ఏమిటి, ఆ అంకె దేన్ని సూచిస్తుంది, దేన్ని మరుగుపరుస్తుంది, అంకెల వెనుక దాగి ఉండే సంక్లిష్టత ఏమిటి, అంకె నిరపేక్షంగా ఉంటుందా, సాపేక్షికంగా ఉంటుందా, ఒక అంకెను మరొక అంకెతో పోల్చి చూపేటప్పుడు పాటించవలసిన ప్రమాణాలేమిటి, అంకెలలో పెరుగుదలకు, సామాజిక అభివృద్ధికి తేడా ఏమిటి అనే కనీస పరిజ్ఞానం లేనట్టు కనబడుతున్న రచనలు చాల అచ్చవుతున్నాయి. ఆ అంకెలు, వాటిమీద ఆధారపడిన నిర్ధారణలు తమ అభిప్రాయాలకు అనుకూలమైనవైతే వాటిని నెత్తికెత్తుకోవడం, పదేపదే ఉటంకించడం, తమ అభిప్రాయాలకు భిన్నమైనవైతే అవన్నీ దొంగలెక్కలనీ, అబద్ధాలనీ కొట్టిపారేయడం అన్నివైపులా చాల ఎక్కువగా జరుగుతున్నది. ఇటీవలి చర్చలలో ప్రతి ఒక్కరూ చరిత్రకారులుగా, గణాంకశాస్త్రవేత్తలుగా, అర్థశాస్త్రవేత్తలుగా పరిణమిస్తున్నారు. గతంలో చరిత్రకారులుగా, గణాంకశాస్త్రవేత్తలుగా, అర్థశాస్త్రవేత్తలుగా ఉండినవారుకూడ ప్రస్తుతం తమ రాగద్వేషాలకే ప్రాధాన్యత ఇచ్చి శాస్త్ర ప్రమాణాలను పక్కన పెడుతున్నారు. మొత్తం మీద అయా శాస్త్రాలు నిర్దేశించే పద్ధతులు, ప్రమాణాలు, జాగ్రత్తలు అన్నీ గాలికి కొట్టుకుపోతున్నాయి.

అలా అంకెల గురించి కూడ భావోద్వేగాలు పెరిగిన ఈ సున్నితమైన నేపథ్యంలో ఒకరి అంకెలు సరయినవనీ, మరొకరి అంకెలు తప్పులనీ చెప్పే పరిస్థితి కనుమరుగవుతున్నది. ఒక్కోసారి రెండు పక్షాలు చెప్పే అంకెలూ నిజాలే గాని వాటిని చూడవలసిన పద్ధతి, చూస్తున్న పద్ధతి విభిన్నంగా ఉంటున్నాయి. ఒక్కోసారి రెండు పక్షాల అంకెలూ నిజాలే అయినా పరస్పరం సంబంధం లేనివిగా ఉంటున్నాయి గనుక వాటిమధ్య తులనాత్మకత ఉండడం లేదు. ఒక్కోసారి రెండు పక్షాలూ తమకు అనుకూలమైన అంకెలనే ఉదహరిస్తూ, ప్రతికూలమైన అంకెలను దాటవేస్తున్నాయి. ఇక ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఉపపత్తులను, తప్పుడు అంకెలను వండుతున్నవారి గురించి చెప్పనవసరమే లేదు. ఈ పరిస్థితిలో గణాంకాల వెనుక ఉన్న లోతయిన అంశాల గురించి, గణాంకాల వాడకంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి, అంకెల వినియోగంలో శాస్త్రీయమైన, ప్రామాణికమైన పద్ధతి గురించి మళ్లీ ఒకసారి గుర్తు చేయడం అవసరమనిపిస్తున్నది.

అసలు తమ అభిప్రాయాలనో, అపోహలనో అంకెలద్వారా వ్యాపింపజేయాలని ఎవరయినా ఎందుకు అనుకుంటున్నారో ముందు అర్థం చేసుకోవలసి ఉంది. మౌఖిక సంస్కృతి ప్రధానంగా ఉన్న మన సమాజంలో ఎవరి చేతయినా దేన్నయినా సమ్మించాలంటే ‘ఫలానాచోట రాసి ఉంది తెలుసా’ అని చెప్పే అలవాటు ఉంది. అంటే లిఖితంగా ఉంటే చాలు నమ్మదగినదేననే అభిప్రాయం ఉంది. సరిగ్గా అలాగే చాలమంది అంకెలలో ఉంటే నమ్మదగినదేననుకుంటారు. కనుక అంకెలతో మాయ చేయడం సులభం. ఒకరకంగా చెప్పాలంటే అంకెలు ఈ కాలపు సంస్కృతం. అవతలివాళ్లను భయపెట్టాలంటే అంకెలు వల్లిస్తే చాలు. ఇవాళ చాలమంది మంత్రోచ్ఛాటనలా అంకెలను వల్లించడం అందువల్లనే.

అయితే సమస్య ఏమంటే అంకెలు సామాజిక వాస్తవికతా సారాన్ని ఎట్లా ప్రకటించగలవో, అట్లాగే అవాస్తవాలకు విశ్వసనీయత ముసుగు కూడ కప్పగలవు. అబద్ధాలు ప్రచారం చేయదలచుకున్నవాళ్లు అంకెలను దుర్వినియోగం చేస్తున్నప్పుడు, నిజాలు చెప్పదలచుకున్నవాళ్లు కూడ ఆ అంకెల మీదనే ఆధారపడక తప్పదు. ఈ అంకెల యుద్ధాలలో అసలు అంకెలు ఎవరివో, అంకెలను దుర్వినియోగం చేస్తున్నదెవరో తెలియని గందరగోళం వ్యాపిస్తుంది. అందువల్ల అంకెల మాయను గ్రహించాలంటే కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవలసి ఉంది.

గణాంకాలను ఉటంకిస్తున్నవారు ఆ అంకెలను తమ ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారా, తమకు రుచించని అంకెలను విస్మరిస్తున్నారా జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడయినా ఏ సాధారణీకరణకైనా మినహాయింపులుంటాయి. ఒకరు ఉటంకిస్తున్న అంకె సాధారణమైనదా, మినహాయింపుదా చూస్తే దాని విశ్వసనీయత ఎంతో అర్థమవుతుంది. ఒక అంకె మీద ఆధారపడి రెండో అంకెను తొక్కిపెట్టడం కాకుండా, రెండో అంకెను కూడ ప్రస్తావించి వివరించగలిగినపుడే అంకెల వాడకం విశ్వసనీయమవుతుంది.

అలాగే గణాంకాలను ప్రస్తావించడమే ముఖ్యం కాదు, వాటిని వ్యాఖ్యానించడం ప్రధానం. ఉత్తి అంకెకు ఏ అర్థమూ లేదు. దాన్ని వివరించే, వ్యాఖ్యానించే క్రమంలోనే ఆ అంకెకు ఒక అర్థం వస్తుంది. కనుక ఒక అంకెకు వ్యాఖ్యాత ఏ అర్థం చెపుతున్నారో, మరొక అర్థం వచ్చే అవకాశం ఉందో లేదో జాగ్రత్తగా గమనించాలి. మరొక అర్థం వచ్చే అవకాశం ఉందంటే ఆ అంకె విశ్వసనీయత సందేహాస్పదమే.

ఇటీవలి కాలంలో వృద్ధిరేటు అనే అంకెను ఉటంకించడం, దానిద్వారా తమ వాదన బలపరచుకోవడం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిజానికి వృద్ధిరేటు అనేది సాపేక్షిక సంఖ్యే తప్ప దానికదిగా అభివృద్ధి సూచిక కాదు. వృద్ధి అంటే ఒకచోటి నుంచి మరొకచోటికి, కిందిస్థాయి నుంచి పైస్థాయికి కదలడం, పరిమాణాత్మకంగా మారడం అని మాత్రమే అర్థం. ఆ మార్పు అభివృద్ధి వైపూ కావచ్చు, తిరోగమనం వైపూ కావచ్చు. ‘పది సంవత్సరాల కింద సాలీనా ఐదువందల ఆత్మహత్యలు జరిగేవి, ప్రస్తుతం పదిహేనువేల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అంటే మూడువేల శాతం వృద్ధిరేటు ఉంది’ అని చెప్పడం హాస్యాస్పదం.

అలాగే అంకెలు పెరగడమే వృద్ధి కాదు, ఆ అంకె సూచించే చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే ఆ అంకె వాస్తవికంగా అర్థమవుతుంది. ‘ఐదు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి – వెలుగునీడలు’ (2005) వ్యాసంలో ఈ అంకెల మాయకు సంబంధించి ఇచ్చిన అనేక ఉదాహరణలలో ఒకదాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావిస్తాను: 1956 నాటికి రాష్ట్రంలో నమోదయిన వాహనాలలో రిగ్ అనే వాహనం లేదు. 2003 మార్చ్ నాటికి రాష్ట్రంలో 1491 రిగ్గులున్నాయి. ఇది కొందరికి అభివృద్ధి సూచికగా కనబడవచ్చు. ఇంకా కొంచెం లోతుకు వెళితే 251 రిగ్గులతో కరీంనగర్, 240 రిగ్గులతో నల్లగొండ, 205 రిగ్గులతో రంగారెడ్డి జిల్లాలు ‘అభివృద్ధి పథం’లో అగ్రభాగాన ఉన్నట్టు కనబడతాయి. కానీ ఈ నాణానికి అవతలివైపు ఈ మూడు జిల్లాలలో నానాటికీ అడుగంటిపోయిన భూగర్భజలాలు, బావులు వట్టిపోవడం, బావుల మోటలకు అవసరమయిన పనులు చేసే వడ్రంగి, కమ్మరి, తోలు పనుల వృత్తిదారుల ఉపాధి రద్దయిపోవడం, పశువుల అవసరం తీరిపోయి కబేళాలకు తరలించడం వంటి పరిణామాల వరుస కనబడుతుంది. కనుక ఒక మారుమూల తెలుగు గ్రామంలోకి రిగ్ అనే అత్యాధునిక ఉత్పత్తి సాధనం ప్రవేశించడం అభివృద్ధా కాదా అనే ప్రశ్నకు సూటిగా ఒకే జవాబు చెప్పగల స్థితిలేదు. ఒక ఆధునిక పారిశ్రామిక పరికరంగా రిగ్ ప్రవేశం ఆధునికతకు, అభివృద్ధికి ఎంత సూచికో, అది పరోక్షంగా  కొల్లగొట్టిన ఉపాధికి, భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి చిహ్నంగా అభివృద్ధి రాహిత్యానికీ అంతే సూచిక. అటువంటి పరిణామాన్ని అంకెలతో పట్టుకోవడం అసాధ్యం.

అలాగే వృద్ధిరేట్లను ప్రస్తావిస్తూ ఇటీవలి చర్చలో వందలశాతం, వేలశాతం పెరుగుదల గురించి మాట్లాడుతున్నారు. ఒకప్రాంతంలో వేలశాతం పెరుగుదల ఉండగా మరొకప్రాంతంలో వందల శాతమో, రెండంకెల శాతమో ఉన్నదని, అందువల్ల అభివృద్ధి ఒకచోటే జరిగిందని, మరొకచోట జరగలేదని కూడ వాదిస్తున్నారు. వృద్ధిరేటును చారిత్రక పరిణామంలో చూడాలని అవసరంకొద్దీ మరచిపోతున్నారు. ఎప్పుడయినా ప్రాతిపదిక (బేస్) తక్కువగా ఉన్నప్పుడు వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండుగా మారడం వందశాతం పెరుగుదల అయితే, పది పదకొండుగా మారడం పది శాతం పెరుగుదల మాత్రమే అవుతుంది. రెండుచోట్లా పరిమాణంలో చూస్తే అదనంగా చేరినది ఒకటే, సమానమే. కాని వృద్ధి రేటు లెక్కగడితే అంత తేడా వస్తుంది. ఈ విషయం గమనంలో పెట్టుకోకుండా, చారిత్రక పునాది చూపకుండా వేలశాతం వృద్ధిరేటు గురించి మాట్లాడడం అర్థరహితం.

అలాగే గణాంక శాస్త్ర పాఠ్య గ్రంథాలు, గణాంక శాస్త్రవేత్తలు పదే పదే చేసిన హెచ్చరికలు కూడ ప్రస్తుత చర్చలో కనుమరుగవుతున్నాయి. అందరూ వాటిని మరచిపోతున్నారు గనుక మరొకసారి గుర్తుచేయవలసి ఉంది. గణాంకాలు పరిమాణాన్ని మాత్రమే చెపుతాయి గాని గుణాన్ని చెప్పవు.  గణాంకాలు రెండు విభిన్న అంశాల మధ్య పోలికను మాత్రమే చెప్పగలవు గాని కార్యకారణ సంబంధాన్ని చెప్పజాలవు. గణాంకాల ద్వారా స్థూలమైన నిర్ధారణలు చేయవచ్చు గాని ఆ నిర్ధారణ నూటికి నూరు శాతం నిజం కాదు. ఇతర సామాజిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే ఆ గణాంకాలు పరిపుష్టమవుతాయి. గణాంకాల వినియోగం న్యాయాన్ని బలపరచడానికి జరగాలి గాని, అన్యాయాన్ని సమర్థించడానికి కాగూడదు. సమస్య అంకెలది కాదు, న్యాయాన్యాయలది. చరిత్రలో జరిగిన అన్యాయాలది. ఆ అన్యాయాలను సవరించడానికి జరిగే ప్రయత్నానిది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

2 Responses to అంకెల మాయ – అసలు నిజాలు

 1. sri says:

  అయితే సమస్య ఏమంటే అంకెలు సామాజిక వాస్తవికతా సారాన్ని ఎట్లా ప్రకటించగలవో, అట్లాగే అవాస్తవాలకు విశ్వసనీయత ముసుగు కూడ కప్పగలవు.

  “Statistics are like a bikini. What they reveal is suggestive, but what they conceal is vital.”
  —Aaron Levenstein

 2. గణాంకాల గురించి ఓ సబ్జెక్ట్ గా చదువుకున్నవాళ్ళకే ఈ నిజాలు తెలుస్తాయి.

  వాటిని అన్వయించుకోవడం తెలిసినవాళ్ళకి తెలుస్తాయి.

  లేకపోతే, “lies, damn lies and Statistics!” అన్నది పూర్తి సత్యం అవుతుంది.

  మీ టపా సమయానుకూలం గా వుండి, బాగుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s