కొరతలేని దారిద్ర్య కొలతలు

మన దేశంలో పేదలు ఉన్నారా, లేరా? ఉంటే ఎంతమంది ఉండవచ్చు? అసలు పేద అంటే నిర్వచనం ఏమిటి? పేదలు ఎంతమంది ఉన్నారో ఎట్లా లెక్కపెట్టాలి?

ప్రతిక్షణం ఎక్కడ చూసినా కనీస అవసరాలు కూడ తీరని, చాలీచాలని బతుకులీడుస్తున్న కోట్లాది మంది ప్రజలతో పేదరికం సర్వాంతర్యామిగా కనబడుతూనే ఉంటుంది గనుక మామూలు మనుషులకు ఈ ప్రశ్నలు రాకపోవచ్చు. కాని మహాఘనత వహించిన భారత ప్రభుత్వానికి మాత్రం వెయ్యిన్నొకటోసారి ఈ సందేహాలే తలెత్తాయి. దేశంలోని దరిద్రుల సంఖ్యను లెక్కించడంలో ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతులు సరయినవో కావో నిర్ధారించాలని కోరిక కలిగింది. దాదాపు నలభై ఏళ్లుగా లెక్కలు వేస్తున్నా దారిద్ర్యం పాపం పెరిగినట్టు పెరుగుతూనే ఉంది గనుక, ఎప్పటికప్పుడు లెక్కల తేడాలు వస్తున్నాయి గనుక అసలు మళ్లీ మొదటికి వద్దామని ఆలోచన కలిగింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా గురించి అందరికీ ఆమోదయోగ్యమైన, శాస్త్రీయమైన, కచ్చితమైన ప్రాతిపదికలను, అంచనాలను నిర్మించాలని కేంద్రప్రభుత్వం తలపెట్టింది.

దేశంలో పేదరికం పరిమాణం గురించి కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పడం, ప్రణాళికా సంఘం మరొక అంకె చెప్పడం, రిజర్వ్ బ్యాంక్ ఒక అంకె ఇవ్వడం, జాతీయ నమూనా సర్వే మరొక అంకె ఇవ్వడం, స్వతంత్ర అర్థ గణాంక శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు మరొక లెక్క చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. పేదరిక నిర్మూలనా నిధుల కేటాయింపులు ఈ అంకెలమీదనే ఆధారపడి ఉంటాయి గనుక ఈ తగాదా అంకెలకు మాత్రమే పరిమితమయినది కాదు. అది కేటాయింపులు ఎక్కువ అవసరమా, తక్కువ సరిపోతాయా అని మరింత లోతయిన ప్రశ్నలకు దారితీస్తుంది.  ఇందిరా ఆవాస్ యోజన, వృద్ధాప్య పెన్షన్, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, పనికి ఆహార పథకం, జాతీయ గ్రామీణ ఉద్యోగ కల్పనా పథకం వంటి అనేక పేదరిక నిర్మూలనా, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఈ దారిద్ర్యరేఖ అంచనాలు ఏదో ఒక స్థాయిలో ప్రాతిపదికగా ఉంటాయి. దారిద్ర్యరేఖ దిగువన ఉన్న జనాభా పెరిగిందంటే ఈ పథకాల కేటాయింపులు పెరగవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తయారు చేస్తున్న ఆహారభద్రతా చట్టం కూడ ఈ అంకెల వివాదంలో చిక్కుకుంటుందేమోనని సందేహం తలెత్తింది.

సంక్షేమ పథకాలకు కేటాయింపులు నానాటికీ తగ్గించాలనే సిద్ధాంతానికి నిబద్ధులైన పెద్దమనుషులు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు గనుక దారిద్ర్య గణాంకాలు పెరిగినకొద్దీ వారికి చిరాకు పెరుగుతోంది. నూతన ఆర్థిక విధానాలు మొదలయిన తర్వాత దారిద్ర్యం గణనీయంగా తగ్గిందని అంకెల గారడీ చేయాలని చాల ప్రయత్నించారు గాని విఫలమయ్యారు. ఏ ప్రాతిపదికలు ఎటు నుంచి ఎటు మార్చి చూసినా పేదరికం పెరిగిందని నిర్ధారణలే వస్తున్నాయి గాని వారు కోరుకున్న ఫలితాలు రావడం లేదు. అందువల్ల అసలు దారిద్ర్యాన్ని గణించే సంవిధానాన్నే సమీక్షించాలని ఏలినవారు తలపెట్టారు.

ఇక్కడ మరొక సమస్య కూడ ఉంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా అంచనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వపు అంకెలమీద రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉంటున్నాయి. తాము అభివృద్ధి చెందామని చెప్పుకోదలచుకున్నప్పుడు తమ దగ్గర పేదరికం చాల తక్కువని వాదించడం, పేదరిక నిర్మూలనా పథకాల నిధులు కావలసి వచ్చినప్పుడు తమ దగ్గర పేదరికం కేంద్రం చెపుతున్న దానికన్న చాల ఎక్కువని వాదించడం రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటయిపోయింది. ఇందుకు గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెసిన వాదనే సుప్రసిద్ధమైన ఉదాహరణ: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వం ప్రజాసంక్షేమ కార్యక్రమాలు గొప్పగా అమలు చేశానని అందువల్ల రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా 22 శాతానికి తగ్గిపోయిందని లెక్కలు చెప్పుకుంది. కొన్నాళ్ల తర్వాత పేదరిక నిర్మూలనా పథకాలకు నిధులు కేటాయించేటప్పుడు ‘మీదగ్గర పేదరికం తగ్గిపోయింది గదా, ఎక్కువ నిధులు ఇవ్వనవసరం లేదు’ అని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ‘మా దగ్గర పేదరికం 22 శాతం అని మేము గతంలో చెప్పినది తప్పు లెక్క. ఇప్పుడు ప్రపంచబ్యాంకుతో లెక్క వేయించాం. మాదగ్గర పేదరికం 29.4 శాతం’ అని రాష్ట్ర ప్రభుత్వం మాటమార్చింది. ఈ అనుభవం కేంద్రప్రభుత్వానికీ, ప్రణాళికా సంఘానికీ చాల రాష్ట్ర ప్రభుత్వాలతో కలిగింది. అందువల్ల కూడ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి సమానంగా అంగీకారయోగ్యమైన అంచనాలు వేసే నిర్దుష్టమైన పద్ధతి కోసం చర్చ మొదలయింది.

ఈలోగా దారిద్ర్యరేఖను తయారుచేసే ప్రాతిపదికలను అధ్యయనం చేయడానికి 2008 ఆగస్టులో నియామకమైన ఎన్ సి సక్సేనా కమిటీ కొన్ని కొత్త సూచనలు చేసింది. పేదరికాన్ని లెక్కించడానికి ప్రస్తుతం అమలులో ఉన్న పదమూడు ప్రాతిపదికలతో పాటు కుల, మత వెనుకబాటుతనం వంటి ప్రమాణాలను కూడ గుర్తించాలని సూచించింది. షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు, వెనుకబడిన కులాలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు, మత మైనారిటీలకు అవకాశాల నిరాకరణ ఉంది గనుక, ప్రస్తుత పేదరిక అంచనాలు అవకాశాల నిరాకరణ మీదనే ఆధారపడి ఉన్నాయి గనుక ఈ ప్రాతిపదికలను కూడ చేర్చాలని సూచించింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, దారిద్ర్యరేఖ రూపొందించడానికి కొత్త ప్రాతిపదికలను తయారుచేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సి పి జోషి రెండువారాల కింద ప్రకటించారు.

ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చ వివరంగా అర్థం కావాలంటే, ఇంతవరకూ అనుసరిస్తున్న ప్రమాణాల, ప్రాతిపదికల చరిత్ర చూడాలి.

మూడో పంచవర్ష ప్రణాళికా కాలంలో (1961 – 66) ప్రణాళికా సంఘం నియమించిన నిపుణుల బృందం మొదటిసారిగా దేశంలో పేదరికం పరిమాణం గురించి చర్చ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రతిమనిషికీ ప్రతినెలా కనీస వినియోగానికి అవసరమైన సగటు ఆదాయం 1960-61 ధరల ప్రకారం రు. 20 ఉండాలని 1962 జూలై లో ఆ బృందం ప్రకటించింది. ఆ మాత్రం ఆదాయం లేనివారందరూ పేదలేనని ఒక స్థూల దారిద్ర్యరేఖ నిర్ణయమయింది. అయితే ఈ కసరత్తులో కనీస వినియోగమనేది స్పష్టంగా లేదనీ, దాన్ని నిర్ణయించిన ప్రాతిపదిక ఏమిటో తెలపలేదనీ, వినియోగంలో ఆహారం కాక ఇతర అవసరాలను లెక్కించారో లేదో తెలియదనీ, గ్రామీణ వినియోగానికి, పట్టణ వినియోగానికి తేడా చూపలేదనీ అనేక విమర్శలు చెలరేగాయి. అయినా ప్రణాళికా సంఘం ఆ ప్రమాణాన్నే అంగీకరించింది.

తర్వాత గడిచిన ఐదు దశాబ్దాలలో బి ఎస్ మిన్హాస్, ఎ వైద్యనాథన్, పి కె బర్దన్, వి ఎం దండేకర్, నీలకంఠ రథ్, ఎం ఎస్ అహ్లువాలియా, డి టి లక్డావాలా, అర్జున్ సేన్ గుప్తా, యోగేంద్ర అలగ్, సురేష్ టెండూల్కర్, ఎన్ సి సక్సేనా వంటి ఎందరో అర్థశాస్త్రవేత్తలు, సంస్థలు స్వతంత్రంగా దారిద్ర్యరేఖకు ప్రాతిపదికలు తయారుచేశారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా ఎంతో అంచనాలు కట్టారు. ప్రపంచ బ్యాంకు కూడ ప్రతిసంవత్సరం తన అంచనాలు ప్రకటిస్తోంది.

ఈ అంశం మీద విస్తృతమైన చర్చ జరిగిన తర్వాత 1978లో ప్రణాళికా సంఘం మళ్లీ ఒక నిపుణుల బృందాన్ని నియమించింది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండి, ఉత్పాదకమైన పనిచేయాలంటే రోజుకు గ్రామీణ ప్రాంతాల్లోనయితే 2400 కాలరీల, పట్టణ ప్రాంతాల్లోనయితే 2100 కాలరీల ఆహారం తీసుకోవలసి ఉంటుందని ఈ బృందం లెక్కవేసింది. దాదాపు 650 గ్రాముల ఆహారధాన్యాలు ఇంత శక్తిని ఇవ్వగలవనీ, ఆ పరిమాణపు ఆహారధాన్యాలకు నెలకు 1973-74 ధరల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో రు. 61.80 ఖర్చు అవుతుందనీ, పట్టణ ప్రాంతాలలో రు. 71.30 అవుతుందనీ 1978లో తేల్చారు. అంతకన్న తక్కువ ఆదాయం ఉన్నవారు దారిద్ర్యరేఖ కన్న దిగువన ఉన్నట్టు లెక్క. అలా భారతదేశంలో దారిద్ర్యరేఖ నిర్ణయమయింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణాన్ని, ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ అంకెను సవరిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో తొమ్మిదో పంచవర్ష ప్రణాళికా కాలంలో (1997 – 2002) దారిద్ర్యాన్ని అంచనా కట్టడానికి ఆదాయానికి తోడుగా మరికొన్ని ప్రమాణాలను చేర్చారు. అప్పటికే మానవాభివృద్ధి భావన బలపడుతూ ఉంది. మానవాభివృద్ధి అనేది కేవలం ఆదాయపు సగటు అంకెలతో తేల్చగలిగినది కాదనీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, సమాచార, వినోద అవసరాలు, సామాజిక సంపర్కం వంటివి కూడ మానవాభివృద్ధిలో ముఖ్యమైనవనీ, వాటిని ఏదో ఒక రకంగా లెక్కపెట్టాలనీ ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక సూచించింది. అందువల్ల, 1997 నాటికి ఇరవైవేల రూపాయల కన్న తక్కువ వార్షిక కుటుంబాదాయం, రెండు హెక్టార్ల కన్న తక్కువ భూమి, టెలివిజన్ గాని రిఫ్రిజిరేటర్ గాని లేకపోవడం వంటి ప్రాతిపదికలను పేదరికానికి చిహ్నంగా భావించారు.

పదో పంచవర్ష ప్రణాళికా కాలానికి (2002 – 2007) దారిద్ర్యరేఖ నిర్వచనం మారకపోయినా, దాన్ని గణించడంలో పదమూడు ప్రాతిపదికలను నిర్ణయించారు. వాటి కొరత ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో గ్రామీణ పేదరికాన్ని లెక్కించడం మొదలుపెట్టారు. సొంతభూమి, ఇల్లు, దుస్తులు, ఆహారభద్రత, పారిశుధ్యం, ఇంట్లో ఉన్న మన్నికయ్యే వినియోగ వస్తువులు, అక్షరాస్యత, శ్రమశక్తి, జీవనోపాధి మార్గం, పిల్లల చదువు, అప్పుల స్థితి, వలస స్థితి వగైరా ఈ కొత్త గ్రామీణ దారిద్ర్య ప్రాతిపదికలు. పట్టణ పేదరికాన్ని లెక్కించడానికి ఏడు ప్రాతిపదికలను నిర్ణయించారు. 2002లో ఈ ప్రాతిపదికలపైననే దేశవ్యాప్తంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనగణన ప్రారంభించారు. సుప్రీంకోర్టులో వివాదం వల్ల ఈ జనగణన ఫలితాలు వెల్లడించడానికి వీలు లేకపోయింది గాని ఈ కృషిలో భాగంగా ఈ ప్రాతిపదికలతో మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో భామ్రాగడ్ తాలూకాలోని మాడియాగోండు తెగ ప్రజలలో జరిపిన సర్వేలో 91.08 శాతం ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని తేలింది.

ఈలోగా కేంద్ర ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాల వల్ల దేశంలో పేదరికం తగ్గిందని 1993-94లో మొత్తం దారిద్ర్యం 36 శాతం, గ్రామీణ దారిద్ర్యం 37.2 శాతం, పట్టణ దారిద్ర్యం 32.6 శాతం ఉదండేదనీ, అది 2004 – 05 నాటికి గణనీయంగా తగ్గి మొత్తం దారిద్ర్యం 27.5 శాతానికి, గ్రామీణ దారిద్ర్యం 28.3 శాతానికి, పట్టణ దారిద్ర్యం 25.7 శాతానికి పడిపోయిందని ఒక ప్రకటన చేసింది. కాని అదే సమయంలో ప్రణాళికా సంఘం నియమించిన, సురేష్ టెండుల్కర్ నాయకత్వాన ఉన్న నిపుణుల బృందం 2004 – 05లో దేశంలో మొత్తం దారిద్ర్య జనాభా 37.2 శాతంగా, గ్రామీణ దారిద్ర్యం 41.8 శాతంగా, పట్టణ దారిద్ర్యం 25.7 శాతంగా ఉందని తేల్చింది. 1993 – 94లో ఈ అంకెలు వరుసగా 45.3 శాతం, 50.1 శాతం, 31.8 శాతంగా ఉండేవని కూడ నిర్ధారించింది. ఈ అంకెలను సూక్ష్మంగా పరిశీలిస్తే, పట్టణ ప్రాంతాల దారిద్ర్యం కన్న గ్రామీణ ప్రాంతాల దారిద్ర్యం చాల ఎక్కువని తేలుతుంది. అయితే టెండూల్కర్ నిర్ధారణలతో ప్రభుత్వానికి ఒక ఊరట, ఒక సమస్య ఉన్నాయి. ప్రపంచీకరణ క్రమంలో పేదరికం తగ్గిందనే ప్రభుత్వ వాదనను టెండూల్కర్ అంకెలు సమర్థిస్తాయి. కాని పేదరికం ప్రభుత్వం చెపుతున్నదాని కంటే చాల ఎక్కువగా ఉన్నదని కూడ ఆ అంకెలు తెలియజేస్తాయి.

దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభాను లెక్కగట్టడం, అసలు దారిద్ర్యరేఖను పునర్నిర్వచించడం టెండూల్కర్ కమిటీ ముందు ఉండిన కర్తవ్యాలు. దానికి అనుగుణంగానే ఆ కమిటీ ఇంతకాలం సాగుతూ వచ్చిన దారిద్ర్యరేఖ ప్రాతిపదికలను సవరించింది. గతంలో ప్రధాన ప్రాతిపదికగా ఉండిన రోజువారీ ఆహార – కాలరీ వినియోగ ప్రాతిపదికను పక్కనపెట్టింది. ధరల సూచికలను ప్రామాణికం చేసింది. అలాగే వ్యక్తిగత వినియోగం అనే నిర్వచనం కిందికి విద్యావ్యయం, ఆరోగ్యవ్యయం, ఇంటి అద్దె, ప్రయాణఖర్చు వంటి ఖర్చులను కూడ కలిపి దాన్ని విశాలం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య వినియోగ తేడాలను గుర్తించలేదు.

1962 నుంచి 2002 వరకూ సాగిన ఈ దారిద్ర్యరేఖ నిర్ధారణ చరిత్రతో అర్థమయ్యేదేమంటే భారత పాలకులకు భారతదేశంలోని ప్రధాన ప్రజా సమస్యలలో అతి ముఖ్యమైన సమస్యను అర్థం చెసుకోవడానికే ఇంకా సమయం సరిపోలేదని. ఆ నేపథ్యంలోనే ఇటీవల దారిద్ర్యరేఖను నిర్దిష్టంగా, నిర్దుష్టంగా, కచ్చితంగా, సర్వజనామోదంగా తయారు చేయాలనే ఆకాంక్షలు, వాదనలు పెరిగాయి. ఆ వాదనలకు జవాబు చెప్పే క్రమంలోనే దారిద్ర్యరేఖను నిర్ధారించే సంవిధానం గురించి చర్చ జరుగుతోంది. ఇది నిజానికి భారతదేశపు సమస్య మాత్రమే కాదు. పూర్వపు వలసలన్నిటిలోనూ రెండు మూడు శతాబ్దాలపాటు అన్ని సమస్యలకు  వలసవాద ప్రభుత్వాలే కారణమనే దృష్టితో జాతీయోద్యమాలు జరిగాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత దాదాపు అన్ని వలసలు స్వతంత్ర పాలనలోకి వచ్చాయి. అన్ని వలసల్లోనూ ప్రధాన సమస్య అయిన పేదరికాన్ని సొంత ప్రభుత్వాలు ఆరు దశాబ్దాల తర్వాత కూడ ఎంతమాత్రం పరిష్కరించలేకపోయాయి. కనుక అసలు పేదరికం అంటే ఏమిటి అనే చర్చ మళ్లీ మొదలవుతున్నది.

నిజానికి పేదరికం సమస్య అభివృద్ధి చెందిన దేశాలలో కూడ గణనీయంగానే ఉంది. అమెరికా జనాభాలో 13.2 శాతం మంది (నాలుగుకోట్లు) దారిద్యరేఖకు దిగువన ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెపుతుండగా ఇటీవలనే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విడుదలచేసిన ప్రాతిపదికల ప్రకారం ఈ సంఖ్య 15.8 శాతానికి (నాలుగుకోట్ల డెబ్బైలక్షలకు) చేరింది. అంటే ప్రతి ఆరుగురు అమెరికన్లలో ఒకరు దారిద్ర్యంలో ఉన్నారు. అమెరికాలో దారిద్ర్యరేఖను గణించే పద్ధతి ప్రకారం నలుగురు సభ్యులున్న కుటుంబానికి 24 వేల డాలర్లు కన్న తక్కువ ఆదాయం ఉంటే దారిద్ర్యరేఖ దిగువకు వస్తారు.

బ్రిటన్ లో ఒక కోటీ ముప్పై ఐదు లక్షల మంది, అంటే జనాభాలో 23 శాతం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. బ్రిటన్ లో దేశపు సగటు తలసరి ఆదాయంలో 60 శాతం కన్న తక్కువ ఉన్నవారిని దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్టుగా గుర్తిస్తారు. అది ఒంటరి వ్యక్తికి వారానికి 115 పౌండ్లు, ఇద్దరు సభ్యుల కుటుంబానికి వారానికి 199 పౌండ్లుగా లెక్కిస్తారు.

ఆ రెండు అభివృద్ధి చెందిన దేశాల ప్రభుత్వాలు దారిద్ర్యరేఖను గణించడంలో చాల సాంకేతికమైన, సంక్లిష్టమైన ప్రాతిపదికలను, ప్రమాణాలను పాటిస్తాయి గాని మన లెక్కలో చెప్పాలంటే మొత్తం మీద ఒక మనిషి దారిద్ర్యరేఖకు దిగువన ఉండడం అంటే వార్షికాదాయం అమెరికాలోనైతే మూడులక్షల రూపాయలు, బ్రిటన్ లోనైతే నాలుగులక్షల రూపాయల పైచిలుకుగా వుండడమని అర్థం. ఆ లెక్కన భారత జనాభా మొత్తానికి మొత్తం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్టే చెప్పుకోవాలి.

దారిద్ర్యాన్ని లెక్కించడానికి అంతర్జాతీయంగా చర్చిస్తున్న మరొక ప్రమాణం ఉంది. అది ఆదాయం మీద, వినియోగం మీద ఆధారపడకుండా తులనాత్మక కొనుగోలు శక్తి అనే ప్రమాణాన్ని లెక్కిస్తుంది. దాని ప్రకారం రోజుకు తలసరి కొనుగోలు శక్తి ఒక డాలర్ కన్న తక్కువ ఉంటే అత్యంత పేదరికమని, రెండు డాలర్ల కన్న తక్కువ ఉంటే పేదరికమని నిర్ణయిస్తారు. ప్రపంచ బ్యాంకు కొన్ని అధ్యయనాలలో ఈ ప్రమాణాన్ని వినియోగిస్తోంది. ఈ లెక్క ప్రకారం భారత జనాభాలో 45 శాతం అత్యంత పేదరికంలోను, 80 శాతం పేదరికంలోను ఉన్నారు.

ఏనుగు ఏడుగురు గుడ్డివాళ్లు కథలో చెప్పినట్టుగా మన దేశంలో పేదలు 77 శాతం అని అర్జున్ సేన్ గుప్తా కమిటీ, 50 శాతం అని ఎన్ సి సక్సేనా కమిటీ, 41.6 శాతం అని ప్రపంచబ్యాంకు, 37.2 శాతం అని సురేష్ టెండూల్కర్, 27 శాతం అని ప్రభుత్వం అంటున్నాయి. లోకమందలి మంచిచెడ్డలు లోకులెరుగుదురా అన్నాడు గురజాడ!

* రచన జనవరి 27, 2010

* ప్రచురణ ఈభూమి ఫిబ్రవరి 2010

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

3 Responses to కొరతలేని దారిద్ర్య కొలతలు

 1. siva says:

  చాలా బాగా విశ్లేషించారు, ఓపికతొ ఇన్ని అంకేలను ఒక చోట చేర్చి ఒక అవగాహన ఏర్పరచటం, మీ ప్రయత్నం అభినందనీయం.

 2. మార్క్సిస్ట్ అయిన మీకు తెలిసే ఉంటుంది “ఆర్థిక శాస్త్రవేత్తలు తమకి జీతాలు ఇచ్చేవాళ్లకి అనుకూలంగా లెక్కలు వ్రాస్తారని”.

 3. తార says:

  కొన్ని తప్పులు, అంకెలన్నీ ఒక్క చోటకి చేర్చారు.
  కానీ దీని స్థాయి ఒక పత్రికా విలేఖరికి సరిపోతుంది కానీ, ఎకనామిస్ట్ అని చెప్పుకునే స్థాయిలో మాత్రం లేదు.
  ఒక ఆర్ధిక వేత్త స్థాయి కి బహుదూరంగా ఉన్నది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s