మాట్లాడడం నేరం కాదు, అది మానవ స్వభావం! మానవ సహజాతాన్ని నేరంగా భావించే హంతక రాజ్యం ఇది!

సి ఆర్ పి సి సెక్షన్ 313 కింద ఔరంగాబాద్ కుట్రకేసు (నిజామాబాదు I టౌన్ క్రైం నం. 214/09) లో అసిస్టెంట్ సెషన్స్ జడ్జి, నిజామాబాద్ ముందు మూడో ముద్దాయి ఎన్ వేణుగోపాల్ ప్రకటన

గౌరవనీయులైన న్యాయమూర్తి గారూ,

మూడో ముద్దాయినైన నా మీద, నా సహ ముద్దాయిలు ఐదుగురి మీద కలిపి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120 (బి) (నేరస్వభావంగల కుట్ర), సెక్షన్ 121 (ఎ) (భారతప్రభుత్వంపై యుద్ధం చేయడానికి, లేదా యుద్ధాన్ని ప్రోత్సహించడానికి కుట్ర), సెక్షన్ 122 (భారత ప్రభుత్వంపై యుద్ధం చేసే ఉద్దేశ్యంతో ఆయుధాలు, తదితరాల సేకరణ) అనే అభియోగాలతో ప్రాసిక్యూషన్ వారు బనాయించిన ఈ కేసు ఒక అబద్ధపు కేసు.  ఔరంగాబాదులో నా సహముద్దాయిలతో కలిసి మాట్లాడాననేది మినహా, ప్రభుత్వం తరఫున ఈ ప్రాసిక్యూషన్ వారు పెట్టిన ఛార్జిషీటులో ఒక్క అంశం కూడ నిజం కాదు. వారు ఆరోపిస్తున్న నేరాలలో ఏ ఒక్కటీ నేను చేయలేదు. ఆ పనులు నేరాలని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తున్నది గాని అవేవీ నేరాలని కూడ నేను అనుకోవడం లేదు. అవి నేరాలని నేను ఎందుకు అనుకోవడం లేదో మీకు వివరించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఇది బహిరంగ విచారణ గనుక నా సమాధానాన్ని మీద్వారా ప్రజల దృష్టికి కూడ తీసుకుపోదలచాను.

మొట్టమొదట ఇటువంటి కోర్టు ప్రకటన చదవడం అనే సంప్రదాయం భారతదేశపు న్యాయస్థానాలలో వంద సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉందని మీ దృష్టికి తేదలచాను. బాలగంగాధర తిలక్, అరవింద ఘోష్, వి డి సావర్కర్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, భగత్ సింగ్, బటుకేశ్వర దత్, ఎం ఎన్ రాయ్ మొదలయిన భారత జాతీయోద్యమ నాయకులు, మీరట్ కుట్రకేసు వంటి ప్రఖ్యాత కేసుల నిందితులు కూడ ఇటువంటి కోర్టు ప్రకటనలు చేశారు. ఆశ్చర్యమూ విషాదమూ ఏమంటే సరిగ్గా ఇవాళ మామీద ప్రాసిక్యూషన్ వారు బనాయించిన సెక్షన్లే – ఐపిసి 120 (బి), 121 (ఎ), 122 – ఈ నాయకులందరిమీద కూడ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ బనాయించింది. ఆ నేరారోపణలకు జవాబుగా ఆ ముద్దాయిలందరూ న్యాయస్థానాలలో తమ మీద బనాయించిన తప్పుడు కేసుల గురించి, తమ రాజకీయ విశ్వాసాల గురించి సుదీర్ఘ ప్రకటనలు చదివారు. అవన్నీ బ్రిటిష్ వలసవాద వ్యతిరేక భారత జాతీయోద్యమ చరిత్రలో భాగమైనవే.

1947 అధికార మార్పిడి తర్వాత కూడ ఇటువంటి నేరారోపణలు, వాటికి జవాబుగా న్యాయస్థానాలలో ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో అచ్చయిన ఐదువందల పేజీల పుస్తకం తరిమెల నాగిరెడ్డి హైదరాబాదు కుట్రకేసులో ముద్దాయిగా చేసిన కోర్టు ప్రకటనే. ఆ కుట్రకేసులోనే ముద్దాయిలందరి తరఫున దేవులపల్లి వెంకటేశ్వరరావు ‘విప్లవ కమ్యూనిస్టుల కార్యక్రమం – ఎత్తుగడల వివరణ’ అనే సుదీర్ఘమైన కోర్టు ప్రకటన చదివారు. పార్వతీపురం కుట్రకేసు నిందితులలో చాలమంది కోర్టులో తమ రాజకీయ విశ్వాసాలను తెలియజెప్పే కోర్టు ప్రకటనలు చేశారు. కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి అనేక కేసులలో ఇటువంటి కోర్టు ప్రకటనలు చేశారు. రచయితల విషయానికే వస్తే సికింద్రాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు వంటి వాటిలో ముద్దాయిలైన కె. వి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, చెరబండరాజు, ఎం టి ఖాన్ మొదలయిన వారు సుదీర్ఘమైన కోర్టు ప్రకటనలు చేశారు. అవన్నీ పుస్తకాలుగా కూడ అచ్చయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ ఈ కేసుకు సంబంధించీ, నా రాజకీయ విశ్వాసాలకు సంబంధించీ నేను ఈ ప్రకటన చేయదలిచాను:

మొట్టమొదట నా అరెస్టుకూ, నా మీద నేరారోపణలకూ సంబంధించి నా వివరణ ఇవ్వనివ్వండి. పోలీసులు నన్ను అరెస్టు చేసే సమయానికి నేను ప్రజాతంత్ర వారపత్రికలో ‘ఆఖరిపేజీ’ అని ఒక వారంవారం శీర్షిక రాస్తున్నాను. విడుదలయ్యాక ఆ శీర్షిక కింద నేను రాసిన వ్యాసాన్ని ఉటంకించడం ఇక్కడ ఉచితంగా ఉంటుంది. అది ప్రజాతంత్ర వారపత్రికలో 2005 జూన్ 19-25 సంచికలో అచ్చయింది.

“మూడువారాలుగా ఆఖరిపేజీ రాయలేకపోయినందుకు క్షమించాలి. ఎన్నో సంవత్సరాలుగా ప్రజాతంత్ర పాఠకులతో సాగుతున్న ఈ సంభాషణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల, పోలీసుశాఖ వల్ల గత మూడువారాలుగా ఆగిపోవలసి వచ్చింది. నేను రాష్ట్రప్రభుత్వ పోలీసులచేత అక్రమంగా నిర్బంధించబడి, ఒక అక్రమ కేసులో ఇరికించబడి, చెరసాలకు పంపబడినందువల్ల ఆఖరిపేజీ రాయలేకపోయాను. ఆ అరెస్టు, కేసు, నిర్బంధం వ్యక్తిగతంగా నాకు సంబంధించినవి మాత్రమే కావు. అవి బహిరంగ ప్రజాజీవిత వ్యవహారాలు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పోలీసు వ్యవస్థ, పాలనావిధానాలు ఏ రకంగా ఉన్నాయో నగ్నంగా, బహిరంగంగా చూపిన వ్యవహారాలు. అందువల్ల ఆ అంశాలను తెలుసుకునే హక్కు, తెలుసుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరికీ ఉన్నాయి. మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మన పన్నులలోంచి జీతాలు తీసుకుంటున్న పోలీసు వ్యవస్థ మనకోసం ఏం చేస్తున్నాయో, మనలో కొందరిని నిర్బంధించడానికి ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతున్నాయో, ఎన్నెన్ని కుయుక్తులు పన్నుతున్నాయో మనం సంపూర్ణంగా తెలుసుకోవలసి ఉంది.

ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య తొలివిడత చర్చలు జరిగిన తర్వాత, మరీ ముఖ్యంగా జనవరి 2005 తర్వాత మళ్లీ మొదలయిన ఎన్ కౌంటర్లు, దాడులు, కూంబింగులు, అరెస్టులు, నక్సలైట్ల వైపునుంచి జరుగుతున్న ప్రతిదాడులు, ఇన్ఫార్మర్ల హత్యలు, పోలీసుస్టేషన్లపై దాడుల నేపథ్యంలో ప్రజాభిప్రాయం ఎలాఉన్నదో తెలుసుకోవాలని మావోయిస్టుపార్టీ రాష్ట్ర నాయకత్వం అనుకున్నదట. బహిరంగ ప్రజాజీవితంలో ఉంటూ, విస్తృత ప్రజాసంబంధాలతో ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించగల కొద్దిమంది రచయితలనూ, పాత్రికేయులనూ కలవదలచుకున్నదట. గత ఆరునెలలుగా మావోయిస్టుపార్టీ రాష్ట్రకమిటీ మీడియా ప్రతినిధిగా ఉన్న బలరాం ఈ విషయం కబురుచేసి, ఈ విషయంలో నేనాయనను కలవగలనా అని అడిగారు. తన భద్రత దృష్ట్యా ఈ కలయిక రాష్ట్రం బయటనే జరగాలని, అందువల్ల నాకు ఔరంగాబాదు రావడం వీలవుతుందా అని అడిగారు. నాతోపాటుగా విరసం ఉపాధ్యక్షులు, అరుణతార మాజీ సంపాదకులు, కావలి జవహర్ భారతిలో తెలుగు అధ్యాపకులు వి. చెంచయ్య, అరుణతార సంపాదకులు పినాకపాణి, అరుణతార మేనేజర్ రవికుమార్ కూడ వచ్చారు.

నేను గత ఇరవై సంవత్సరాలకు పైగా పాత్రికేయుడిగా ఎట్లా ఉన్నానో, విరసం సభ్యుడిగా కూడ అట్లాగే ఉన్నాను. కనుక విరసం సభ్యుడిగా గాని, పాత్రికేయుడిగా గాని ఆయనను కలవడం నాకేమీ అభ్యంతరంగా కనిపించలేదు. నా వ్యక్తిత్వంలోని ఈ రెండు పార్శ్వాలమధ్య ఏదో విభజన రేఖ ఉన్నదని నేనెప్పుడూ అనుకోలేదు. అట్లని పాత్రికేయవృత్తి పరిధి దాటి విరసం సభ్యుడి పాత్రలోకో, అటునుంచి ఇటో అతిక్రమించనూ లేదు. మాట్లాడదలచుకున్నది ఒక రాజకీయపార్టీ మీడియా ప్రతినిధి. పాత్రికేయుడిగానో, విరసం సభ్యుడిగానో ఉన్న నాతో. మరి అటువంటప్పుడు ఎందుకు అభ్యంతరం ఉండాలి? ఆ పార్టీ రాష్ట్రకమిటీ కార్యదర్శితోనే స్వయంగా ఈ రాష్ట్ర హోంమంత్రి, మరి ముగ్గురు మంత్రులు వారంరోజులపాటు మాట్లాడారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వచ్చి హైదరాబాదులో మంజీర అతిథిగృహంలో ఉన్నప్పుడు వేలాది మంది కలిసి మాట్లాడాలని ఉవ్విళ్లూరారు. మరి నాకెందుకు అభ్యంతరం ఉండాలి?

నిజానికి ఆ పార్టీ మీద నిషేధం ఉన్న రోజులలోనే ఆ పార్టీ అగ్రనాయకులెందరినో డజన్లకొద్దీ పాత్రికేయులు రహస్యంగా కలిసి పత్రికలలో, ప్రచార సాధనాలలో ఎన్నో వార్తాకథనాలు, ఇంటర్వ్యూలు ప్రచురించారు. ఆ పార్టీ మీద నిషేధం ఉన్నరోజులలోనే మాన్యులు ఎస్ ఆర్ శంకరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొ. హరగోపాల్ తదితరులు ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసి మాట్లాడి తిరిగి వచ్చి తాము మాట్లాడిన విషయం అప్పటి ముఖ్యమంత్రికి తెలియజేశారు. నిషేధం ఉన్నరోజులలోనే తమ సంభాషణలను పుస్తకరూపంలో వెలువరించారు. మరి ఆ పార్టీ నాయకులలో ఒకరిని కలవడానికి నాకెందుకు అభ్యంతరం ఉండాలి? ఇరవై సంవత్సరాల పాత్రికేయవృత్తిలో, ముఖ్యంగా పది సంవత్సరాలకు పైబడిన విలేకరి వృత్తిలో, ఇరవై రెండు సంవత్సరాలుగా విరసం సభ్యుడిగా కొన్ని వేల మందిని కలిసి, చర్చించి, పత్రికలలో రాసిఉన్న నేను ఇవాళ ఈయనను కలవడానికి ఎందుకు సంకోచించాలి?

అందుకే మే 28 సాయంత్రం కాచిగూడ – మన్మాడ్ ఎక్స్ ప్రెస్ లో ఔరంగాబాదు బయల్దేరాను. మర్నాడు ఉదయమే మహారాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ గెస్ట్ హౌజ్ లో నా పేరు మీదనే గది తీసుకున్నాను. ఆ గదిలోనే ఆ రోజంతా, ఆ మర్నాడూ కూచుని మాట్లాడుకున్నాం. మే 30 సాయంత్రం ఏడున్నర ఎనిమిది మధ్య తలుపు తోసుకుని దాదాపు ఇరవై మంది ఆయుధధారులైన మఫ్టీ పోలీసులు వచ్చేదాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం.

పోలీసులు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడి కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసుమార్కు ప్రవర్తన రుచి చూపించారు. అప్పటినుంచి జూన్ 2 సాయంత్రం నిజామాబాద్ రేంజి డిఐజి కార్యాలయంలో పత్రికా సమావేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టినదాకా, అంటే దాదాపు 70 గంటలు మేం ఇలా కళ్లకు గంతలతో, కట్టేసిన చేతులతో, ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి వీలులేకుండా నిర్బంధించబడి ఉన్నాం. అరెస్టు చేసిన ఏ వ్యక్తినయినా 24 గంటల కంటె ఎక్కువసేపు కోర్టులో హాజరుపరచకుండా ఉంచుకోగూడదని, హింసించగూడదని చెప్పే చట్టాలు, ప్రజాజీవనంలో ఇంత ప్రముఖులుగా ఉన్న మాపట్లనే ఇంతగా ఉల్లంఘించబడితే ఇక దేశంలో అనామకులకు, పేదలకు న్యాయం అందుతుందంటే ఎవరు నమ్ముతారు?

ఔరంగాబాదుకు మా ప్రయాణాలు, ఔరంగాబాదులో మా బస అన్నీ సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో ఉన్నాయి గనుక పోలీసులకు వాటిని తారుమారు చేయడం సాధ్యం కాలేదు. అందువల్ల మేం ఔరంగాబాదులో సమావేశమై నల్లమలకు తిరిగివెళ్తూ, నిజామాబాదు పరిసరాల్లో దిగి తచ్చాడుతుండగా జూన్ 2 మధ్యాహ్నం పోలీసుల చేతికి చిక్కామని ఒక కట్టుకథ అల్లారు. పోలీసు రచయితల భౌగోళిక పరిజ్ఞానం ఈ రకంగా ఉంది! ఔరంగాబాదునుంచి నల్లమలకు వెళ్ళదలచుకున్నవారు ఏమార్గంలో వెళతారో పటం చూసి ఎవరయినా చెప్పగలరు. అందుకు నిజామాబాదు వెళ్లనక్కరలేదు. అంతేకాదు, నా తిరుగుప్రయాణపు టికెట్ మన్మాడ్ – కాచిగూడ ఎక్స్ ప్రెస్ లో మే 31 న బుక్ అయి ఉంది. చెంచయ్య, పినాకపాణి, రవికుమార్ లకు తిరుగు ప్రయాణపు టికెట్లు హమ్ సఫర్ ట్రావెల్స్ బస్సులో మే 31 సాయంత్రానికి హైదరాబాదుకు బుక్ అయిఉన్నాయి. పోలీసులు మా జేబుల్లోంచి లాగేసుకున్న ఆ టికెట్లను చించివేసి ఉండవచ్చు గాని ఆ బుక్ చేసుకున్న ఆసాములు రాలేదని రైల్వేవారి దగ్గర, బస్సు కంపెనీ దగ్గర ఉన్న సాక్ష్యాలనేంచేస్తారు?

పట్టుకున్న స్థలం, సమయం అబద్ధం చెప్పాక, ఆ అబద్ధపు వేళ నుంచి 24 గంటల లోపల కోర్టులో చూపారు. జైలుకు పంపారు. ఈ కథలన్నీ వివరంగా పుస్తకం రాయబోతున్నాను గాని ఇక్కడ మరొక విషయం చెప్పాలి. నా అరెస్టు గురించి ప్రత్యేకంగానూ, నా సహముద్దాయిల అరెస్టు గురించి సాధారణంగానూ చాల నిరసన వ్యక్తమయింది. నా ఆరోగ్య పరిస్థితివల్ల మిత్రులు, శ్రేయోభిలాషులు చాల కంగారు పడ్డారు. అంతర్జాతీయ సంస్థల నుంచి స్థానిక సంస్థల దాకా సంఘీభావం ప్రకటించాయి.

సెక్రటేరియట్ లో జరిగిన పత్రికా సమావేశంలో నా ప్రస్తావన వస్తే స్వయంగా ముఖ్యమంత్రి ‘ఆయనకు బెయిల్ పిటిషన్ దాఖలయితే ప్రభుత్వం వైపు నుంచి దాన్ని వ్యతిరేకించబోము. ఆయనను మళ్లీ పోలీసు విచారణకు పిలిపించబోము” అన్నారు. కాని నిజామాబాదు కోర్టులో నా బెయిల్ పిటిషన్ మొదటిసారి దాఖలయినప్పుడు, అప్పటికే రెండోసారి పోలీసు విచారణకు కావాలనే దరఖాస్తు ఉన్నందువల్ల నాకు బెయిల్ రాలేదు. వెంటనే ముఖ్యమంత్రిని హైదరాబాదులోనూ, కర్నూలులోనూ పాత్రికేయ మిత్రులు ప్రశ్నించారు. “ఏదో సమాచార లోపం వల్ల అలా జరిగింది” అన్నారాయన! ఇంత హైటెక్ ప్రభుత్వానికి ఇంత సమాచార లోపం! మళ్లీ ఐదు రోజుల తర్వాత రెండోసారి బెయిల్ దరఖాస్తు దాఖలయినప్పటికీ, నిజామాబాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు నా బెయిల్ వ్యతిరేకించగూడదనే ఆదేశమేమీ లేదు! ఆయన అన్ని బెయిల్ దరఖాస్తులనూ వ్యతిరేకించినట్టే, ఈ దరఖాస్తును కూడ వ్యతిరేకించారు. అయినా మా న్యాయవాది వాదనలోని బలంవల్ల ఇప్పుడు బెయిల్ మీద విడుదలయి ఇది రాయగలుగుతున్నాను. ‘ఈ రాజ్యాన్ని కూలదోయడానికి మరో నలుగురితో కలిసి కుట్ర చేశాన”న్న అభియోగం మీద విచారణ ఇంకా సాగుతూనే ఉంది. మాదగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్న పుస్తకాలలో, కాగితాలలో అటువంటి “కుట్ర” జరిగిందని చెప్పే సాక్ష్యాధారం ఒక్క అక్షరం కూడ లేనప్పటికీ!!”

అదీ నేను ఐదు సంవత్సరాల కింద రాసింది. ఈ ఐదు సంవత్సరాలుగా ఈ విచారణ జరుగుతూనే ఉంది. రెండు సంవత్సరాల కింద సెషన్స్ కు కమిట్ అయి, మీ ముందు సాక్షుల విచారణ జరిగి ఇవాళ్టికి మా 313 ప్రకటనల దగ్గరికి చేరింది.

ఈ కేసులో 2007లో తయారుచేసిన ఛార్జిషీటులో కూడ ప్రభుత్వం ఈ అబద్ధాలనే కొనసాగించింది. మా ఒప్పుకోలు పత్రాల పేరుతో మేం ఎప్పుడూ చెప్పని విషయాలు, మా ఊహకు కూడ అందని విషయాలు అనేకం కలిపి వండారు. మమ్మల్ని నిజామాబాదు పరిసరాల్లో అరెస్టు చేశామని చెప్పడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు. మమ్మల్ని అరెస్టు చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న జీపులో ఉన్నామని చెప్పుకుంటున్న ఇద్దరు పోలీసు సాక్షులు ఆ జీపు ప్రయాణమార్గాన్ని చెరొక రకంగా చెప్పడం మీరు విన్నారు. అంటే మా నిజామాబాదు అరెస్టు మిథ్య గనుక ఆ జీపు ప్రయాణమూ మిథ్యే అయింది. మా అరెస్టు పంచనామా చేసిన పంచులుగా చూపిన ఇద్దరు అమాయక ఆటో డ్రైవర్లు మమ్మల్ని తామెన్నడూ చూడలేదని, పోలీసులు తమతో తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారని చెప్పడం మీరు విన్నారు. విచారణ సమయంలో ప్రధాన దర్యాప్తు అధికారి, ఛార్జిషీటు తయారుచేసిన అధికారి ఇద్దరూ కూడ ఈ అబద్ధాలనే కొనసాగించారు. న్యాయస్థానాన్ని తప్పుతోవ పట్టించడానికి, న్యాయస్థానపు విలువైన సమయాన్ని వృథా చేయడానికి ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించారు. మేం కలిసినప్పుడు ఆ రాజకీయ పార్టీ మీద నిషేధం లేనప్పటికీ నిషేధం ఉన్నదని తప్పుడు సమాచారం చెప్పారు. మా దగ్గర దొరికినవని చెపుతున్న పుస్తకాలలో, కాగితాలలో నేరస్వభావాన్ని రుజువు చేసేవి గాని, నిషిద్ధమైనవి గాని ఒక్కటి కూడ లేకపోయినా వాటన్నిటినీ కుట్రకు సాక్ష్యాలుగా బుకాయించారు. మేము మాట్లాడుకున్న విషయాల ఎజెండా అని వారే దాఖలు చేసిన పత్రంలో కుట్రగా అభివర్ణించదగిన వాక్యం ఒక్కటి కూడ లేనప్పటికీ సెక్షన్ 120 (బి), సెక్షన్ 121 (ఎ) నేరారోపణలను సమర్థించుకున్నారు. ఆయుధాలు గాని, ఇతరాలు గాని మేము సేకరించామని ఒక్క ఆధారం కూడ చూపకుండానే మా మీద సెక్షన్ 122 ఆరోపించారు. ఆ మొత్తం ఆరోపణలలో మేం ఆరుగురం ఔరంగాబాద్ లో కలిసి మాట్లాడుకున్నామనేది ఒక్కటే వాస్తవం. మిగిలినవన్నీ పచ్చి అబద్ధాలు. ఆ ఒక్క వాస్తవం కూడ నేరం కావడానికి వీలు లేనిది. ఎప్పుడయినా, ఎక్కడయినా మనుషులు మాట్లాడుకోవడం నేరమవుతుందా?

అయితే ఇది పోలీసులకు, ప్రాసిక్యూషన్ కు మాత్రమే సంబంధించిన విషయం కాదు. కేవలం అబద్ధాలు చెప్పడం మాత్రమే కాదు. ఈ వ్యవస్థలో సాగుతున్న దోపిడీ పీడనలను వ్యతిరేకిస్తూ రచనలు చేసేవారిని, ఉపన్యాసాలు ఇచ్చేవారిని ‘ఇదిగో ఇలా వేధిస్తాం, అక్రమ నిర్బంధాల పాలుజేస్తాం, అబద్ధపు కేసులు బనాయిస్తాం’ అని బెదిరించడానికే ఈ కేసు. ఈ దోపిడీ పీడనల వ్యవస్థను మార్చాలని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న వారిని కలుసుకున్నా, వారితో మాట్లాడినా వేధింపులు తప్పవు అని హెచ్చరించడానికే ఈ కేసు. ఈ వ్యవస్థ మీద వచ్చే ప్రశ్నలను మూసిపెట్టడానికే ఈ కేసు. ప్రశ్నించేవారిని, తమ ప్రశ్నల గురించి ఇతరులను ఆలోచించేలా చేసినవారిని వేధించడానికి పాలకవర్గాలు, అధికార యంత్రాంగం నిరంతరం చేసే ప్రయత్నంలో భాగమే ఈ కేసు. నావరకు నేను గత మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయుడిగా, రచయితగా, ఉపన్యాసకుడిగా ప్రభుత్వ దుర్మార్గాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రభుత్వాలన్నీ ప్రజా ప్రభుత్వాలుగా పాలన నెరపడం లేదని, భారత ప్రజలు తమకు తాము ఇచ్చుకున్న రాజ్యాంగంలోని ప్రవేశికను గాని, ప్రాథమిక హక్కులను గాని, ఆదేశిక సూత్రాలను గాని గౌరవించే, చిత్తశుద్ధితో అమలుచేసే ప్రభుత్వం ఇంతవరకు ఏర్పడలేదని నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని సోదాహరణంగా ప్రజలకు వివరించడం బుద్ధిజీవిగా నా బాధ్యత అనుకుంటున్నాను. నేను ఆ బాధ్యత నిర్వహించడం పాలకులకు కంటగింపు అయినందువల్లనే, నన్ను శారీరకంగాను, మానసికంగాను వేధించడానికే, నా కృషిని అడ్డుకోవడానికే నాపై ఈ అబద్ధపు కేసు బనాయించారు.

కాని ఈ కేసు వల్ల ప్రభుత్వాలు, పోలీసులు చెప్పే అబద్ధాలే బయటపడ్డాయి. నా తాత్విక, రాజకీయ విశ్వాసాలు బలపడ్డాయి. ఈ వ్యవస్థ దోపిడీ పీడనల మీదనే ఆధారపడి ఉన్నదని, దీన్ని రద్దుచేసి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా ఒక కొత్త వ్యవస్థను నిర్మించక తప్పదని నా విశ్వాసం బలపడింది. ఆ కొత్త వ్యవస్థ గురించి కలలు కనేవారిని, ఆ కలలను ఇతరులతో పంచుకునే వారిని నిర్మూలించడం, నిర్బంధించడం, భయపెట్టడం, వేధించడం ఈ వ్యవస్థ లక్ష్యం అని నాకు ఈ కేసు తెలియజెప్పింది. మనిషికి కలిగే ఆలోచనలనూ, వాటిని ఇతరులతో పంచుకునే మాటలనూ చూసి ఈ వ్యవస్థ భయపడుతోందని ఈ కేసు తెలియజెప్పింది. ఈ కేసులో మాట్లాడుకోవడాన్నే నేరంగా చిత్రిస్తున్నారు. మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

One Response to మాట్లాడడం నేరం కాదు, అది మానవ స్వభావం! మానవ సహజాతాన్ని నేరంగా భావించే హంతక రాజ్యం ఇది!

  1. Prakash says:

    Hats off to you for exposing the drama played by the govt. All the best for your future.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s