ఒక్క బుల్లెటూ కాల్చలేదట!!!

ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ, జూలై 27, 2010

ప్రభుత్వాధినేతల అబద్ధాలకు అంతూ పొంతూ ఉన్నట్టులేదు. వినేవాళ్లకు కొంత అవగాహన ఉంటుందనీ, తమ మాటలు విని నవ్వుకుంటారనీ కూడ ఏలికలకు తెలుస్తున్నట్టులేదు. గత శనివారం నాడు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో అటు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాటలు గాని, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య మాటలు గాని పచ్చి అబద్ధాలు. నిజంగా జరిగిన సంగతులతో, వాస్తవాలతో ఒక్కదానితో కూడ సరిపోయేవి కావు. అవి సంపూర్ణంగా పరవంచనకు ఉద్దేశించినవి. ఎన్నో దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు గనుక వారికి అంతగా వాస్తవాలు తెలియకుండా ఉంటాయనుకోలేం. అందువల్ల ఇది పరవంచనతో పాటు ఆత్మవంచన కూడ కావచ్చు. నడిచినన్ని రోజులు నడుస్తుందిలే అనే నిర్లక్ష్యం కావచ్చు. అధికారంలో ఉన్న కొన్ని రోజులయినా తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడమో, తమ ఆశ్రితుల ప్రయోజనాలు నెరవేర్చడమో చేస్తే చాలునని అనుకోవడం కావచ్చు. రాజకీయాలంటే ప్రజల సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టే సృజనాత్మక ప్రక్రియగా కాక,  కేవలం లాభసాటి వ్యాపారంగా, లేదా దేశదేశాల సంపన్నులకు గులాములుగా రాజకీయార్థిక విధానాలను అమలుచేసి వాళ్లు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడే యాచక వృత్తి కావచ్చు. కాకపోతే జాతీయ అభివృద్ధి మండలి సమావేశం జరిగిన తీరు ఇలా ఉండేది కాదు.

ఇక్కడ మూడు విషయాలు ఆలోచించవలసి ఉంది. ఒకటి, జాతీయ అభివృద్ధి మండలి చేయవలసిన పని ఏమిటి, మొన్న జరిగిన సమావేశం ఆ పని చేసిందా, లేదా? రెండు, జాతీయ అభివృద్ధి గురించి మాట్లాడవలసిన సమావేశంలో ప్రధాన చర్చనీయాంశం మావోయిస్టులు కావడమంటే అర్థమేమిటి? మూడు, ఆ సమావేశంలో రోశయ్య ప్రవచించిన మాటల నిజానిజాలేమిటి? అన్నన్ని అబద్ధాలను దేశ ప్రజల ముందర ప్రకటించడానికి ఈ నాయకులు సిగ్గుపడడం లేదా?

జాతీయ అభివృద్ధి మండలి అనేదాన్ని 1952 ఆగస్ట్ 6 న ఏర్పాటు చేశారు. అప్పటికే దేశం పంచవర్ష ప్రణాళికలతో అభివృద్ధి చెందాలని తీసుకున్న నిర్ణయం దృష్ట్యా ఆ ప్రణాళికలకు మద్దతుగా దేశవ్యాప్తంగా రాజకీయ కార్యాచరణను సంఘటితం చేయడానికి ఆ మండలిని ఏర్పాటు చేశారు. అలా సంఘటితం చేయడం కోసమే ఈ మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను భాగం చేశారు. మండలికి ప్రధానమంత్రిని అధ్యక్షుడిగా చేశారు. అలా జవహర్లాల్ నెహ్రూ హయాంలో ప్రారంభమైన ఈ మండలి ఇందిరాగాంధీ హయాంలో 1967 అక్టోబర్ లో పునర్నిర్మాణమై, దేశంలో అభివృద్ధి గురించి అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయింది.

ఈ అభివృద్ధి మండలి పని గురించి మాట్లాడేటప్పుడు 1952 నవంబర్ 8-9 లలో జరిగిన దాని మొదటి సమావేశాలను ఉద్దేశిస్తూ అప్పటి ప్రధాని నెహ్రూ మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది: ప్రణాళికను అమలు చేయడానికి అవసరమైన ప్రయత్నాలను, వనరులను సమీకరించడం, బలోపేతం చేయడం, కీలక రంగాలలో ఉమ్మడి ఆర్థిక విధానాలను ప్రోత్సహించడం, దేశంలోని అన్ని ప్రాంతాల సమన్వయ, త్వరిత అబివృద్ధి సాధించడం జాతీయ అభివృద్ధి మండలి లక్ష్యాలని నెహ్రూ అన్నారు.

ఆ తర్వాత అరవై సంవత్సరాలు గడిచిపోయాయి. అసలు ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాన్నే పలుచబరచడం జరిగింది. ప్రయత్నాలూ వనరులూ అన్నీ బహుళజాతిసంస్థలకు, దేశదేశాల సంపన్నులకు కట్టబెట్టడం ఎట్లా అనే కృషిలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలమునకలు కావడం మొదలయింది. ఉమ్మడి ఆర్థిక విధానాలు అంటే ప్రజల బాగు కొరకు ఉమ్మడి ఆర్థిక విధానాలు అనే అర్థం మారిపోయి కేవలం పెట్టుబడిదారుల, సంపన్నుల ఉమ్మడి ఆర్థికాభివృద్ధి కొరకు ఏం చేయాలనేదే ప్రభుత్వాల లక్ష్యమై పోయింది. ప్రాంతాల మధ్య సమన్వయ అభివృద్ధీ లేదు, త్వరిత అభివృద్ధీ లేదు. ఉన్నదంతా పిడికెడుమంది ధనవంతుల సమన్వయ, త్వరిత అభివృద్ధి. కోట్లాదిమంది పేదప్రజలను మరింత పేదలుగా మార్చే ప్రయత్నం.

దేశాభివృద్ధి అనేది ఇలా జరగగూడదని గొంతెత్తున్నవాళ్లు, ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను, ప్రజలు కేంద్రంగా ఉండే నమూనాను సూచిస్తున్నవాళ్లు మావోయిస్టులు. ఆ నమూనాను సాధించడం కొరకు వాళ్లు సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. కాని ఆ నమూనా అవసరమని వాళ్లు ఒక్కరు మాత్రమే అనడం లేదు. దేశమంటే ప్రజలు అని అనుకునేవాళ్లు ఎంతోమంది, ప్రజల అభ్యున్నతి మీద శ్రద్ధాసక్తులు ఉన్నవాళ్ళు ఎంతోమంది, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి నమూనా ప్రజల అభివృద్ధి నమూనా కాదని అంటూనే ఉన్నారు. సాయుధ మార్గంలో కాకపోయినా ఈ నమూనాను మార్చవలసిన అవసరం ఉందని అంటున్నారు. గాంధేయవాదులు, సర్వోదయవాదులు, చిత్తశుద్ధి గల, ప్రజానుకూల స్వచ్ఛందసంస్థలు, స్వతంత్ర మేధావులు – ఈ దేశంలో ఇంకా ప్రజల పట్ల , దేశం పట్ల ప్రేమాభిమానాలు గల పౌరసమాజం ఒకటి ఉందని చూపుతూనే ఉన్నారు. జాతీయ అభివృద్ధి మండలి నిజంగా అది ప్రారంభించిన నాటి ఆదర్శాలకు, వలసవ్యతిరేక జాతీయోద్యమ ఆదర్శాలకు కట్టుబడి ఉంటే వీరందరినీ తనలో సంలీనం చేసుకోవలసి ఉండింది. కాని ప్రజావ్యతిరేక అభివృద్ధి నమూనానే తమ లక్ష్యంగా చేసుకున్న ఈ దేశ పాలకవర్గాలు ఆ నిజమైన దేశభక్తుల మీద కత్తిగట్టాయి. వెంటాడి, వేధిస్తున్నాయి. చిత్రహింసల పాలుజేస్తున్నాయి. ఊచకోత కోస్తున్నాయి. ఈ దేశపు సంపన్న వనరులను బహుళజాతిసంస్థల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.

అందుకే అభివృద్ధి గురించి మాట్లాడవలసిన జాతీయ అభివృద్ధి మండలి అభివృద్ధి సంగతి పక్కనపెట్టి మావోయిస్టుల గురించే మాట్లాడింది. ఇప్పటికీ దేశంలో సగం మందికి విద్య లేదని, అది అందించడమే అభివృద్ధి అనీ జాతీయ అభివృద్ధి మండలికి అనిపించలేదు. ఇప్పటికీ దేశంలో మూడో వంతుకన్న ఎక్కువ కటిక పేదరికంలో బతుకుతున్నారనీ వారికి మంచి బతుకు ఇవ్వడమే అభివృద్ధి అని మండలికి అనిపించలేదు. ఇలా లెక్కవేస్తూ పోతే, జాతీయ అభివృద్ధి మండలి ప్రజల అభివృద్ధి గురించి ఏమీ మాట్లాడలేదు. మావోయిస్టులను రూపుమాపడం గురించీ, దేశ సంపదను తమ వాటాల ప్రకారం పంచుకోవడం గురించీ మాత్రమే మాట్లాడింది.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రులందరూ పాల్గొనవలసి ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ తో పాటు, భారతీయ జనతాపార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), బిజూ జనతా దళ్, బహుజన సమాజ్ పార్టీ, డి ఎం కె, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వంటి అన్ని రాజకీయ పక్షాలూ తమ తమ రాష్ట్రాలలో ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడే బదులు మావోయిస్టుల గురించే మాట్లాడారంటే ఈ దేశంలో పాలకులెవరో, నిజమైన ప్రజా పక్షమూ ప్రతిపక్షమూ ఎవరో చెప్పకనే చెప్పినట్టవుతున్నది.

ఇక రోశయ్య “ఆంధ్రప్రదేశ్ లో 2004 తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. అందువల్లే…ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే…60 ఏళ్లుగా ఏదో ఒక రూపంలో కొనసాగిన కమ్యూనిస్టు సాయుధ విప్లవం రాష్ట్రంలో మటుమాయమైంది” అని అన్నారని పత్రికల్లో వచ్చింది. రెండంటే రెండే వాక్యాలలో అరడజను అబద్ధాలను కూరి అమ్మడానికి ప్రయత్నించడం రోశయ్య వంటి అనుభవజ్ఞుడైన పార్లమెంటరీ రాజకీయ నాయకునికే చెల్లింది.

ఆంధ్రప్రదేశ్ లో 2004 తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారనేది అబద్ధం. స్వయంగా ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందవలసిన జనసంఖ్య తగ్గలేదు గదా పెరిగిపోయింది. అంటే ఆ అభివృద్ధి కార్యక్రమాలు అబద్ధమైనా అయి ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాల పెరుగుదల రేటు కన్నా జనాభా పెరుగుదల రేటు ఎక్కువయినా అయిఉండాలి. జనాభా పెరుగుదల రాష్ట్రంలో అదుపులోనే ఉన్నదని అవే ప్రభుత్వ గణాంకాలు చూపుతున్నాయి గనుక అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రభుత్వం చెప్పేది పచ్చి అబద్ధమన్నమాట. రాష్ట్రానికి సంబంధించి విద్య, అక్షరాస్యత, ప్రాథమిక వైద్య, ఆరోగ్య సౌకర్యాలు, రవాణా, మాతాశిశు ఆరోగ్యం, శిశు మరణాల రేటు, పోషకాహారలోపం, పేదరికం, నిరుద్యోగం వంటి ఏ ప్రమాణం తీసుకున్నా రాష్ట్రంలో అభివృద్ధి లేదని స్పష్టంగా రుజువవుతుంది.

ఈ కనీస మౌలిక సౌకర్యాలను కల్పించకపోవడం మాత్రమే కాదు, రైతుల ఆత్మహత్యలు, గ్రామాలలో బతుకు దుర్భరమై ప్రజలు పట్టణాలకు వలస రావడం, విదేశాలకు, ఇతర ప్రాంతలకూ వలస వెళ్లడం, గిట్టుబాటు ధరలు దొరకక రైతులు వ్యవసాయాన్ని వదిలిపెడుతుండడం, పరిశ్రమలు మూతబడుతూ అంతకంతకూ ఎక్కువమంది వీథిన పడడం, సమాజ6లో హింస, నేరం పెరిగిపోవడం, మరొకవైపు సంపన్నుల సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం – ఇదీ ఆంధ్రప్రదేశ్ వర్తమానచిత్రం. మరి ముఖ్యమంత్రి చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ?

ఇక అంతకన్న ఘోరమైన అబద్ధం ఈ జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల కమ్యూనిస్టు సాయుధ విప్లవం మాయమయిందట. అది కూడ మటుమాయం. అది కూడ ఒక్క బుల్లెట్ పేల్చకుండానే!

ముఖ్యమంత్రి గారూ, ఒక్క బుల్లెట్ కూడ పేల్చలేదని మీరంటున్నారు గాని 2004 తర్వాతనే మీ పోలీసులు, రహస్యంగా స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో, గ్రే హూండ్స్ గాని, బహిరంగంగా శాంతి భద్రతల పోలీసులు గాని  వందలాది మంది విప్లవ కార్యకర్తలను చంపివేశారు. ఒక్క బుల్లెట్ కూడ పేల్చకుండా ఇన్ని వందల మందిని చంపారా? ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2004 మేలో ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత జనవరి వరకు ఏడున్నర నెలలు మాత్రమే బుల్లెట్లు పేలలేదు. కాని ఆ తర్వాత గడిచిన ఆరు సంవత్సరాలలో 414 మంది ఉద్యమ కారులను (2005లో 170, 2006లో 135, 2007లో 43, 2008లో 36, 2009లో 16, 2010 జూన్ చివరికి 14) పోలీసులు కాల్చి చంపారు. ఒక్క బుల్లెటూ పేల్చకుండానే ఈహత్యలన్నీ జరిగాయని రోశయ్యగారు ఎవరిని నమ్మించదలిచారు?

ఇక విప్లవోద్యమం మటుమాయమయిందని, మటుమాయం కావాలని కోరుకున్నవాళ్లలో ఆయన మొదటివారూ కాదు, బహుశా చివరి వారూ కాబోరు. 1969లో మొదటి ఎన్ కౌంటర్ సందర్భంగా ఇక ఉద్యమం అయిపోతుంది, మూడు నెలలు, ఆరునెలలు అని వాయిదాలు పెట్టిన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి, హోం మంత్రి వెంగళ రావుల నాటి నుంచి తన వరకూ ముఖ్యమంత్రుల, హోంమంత్రుల జాబితా ఒకసారి చదువుకుని వారి ప్రకటనలన్నీ కూడ చదువుకుంటే బాగుంటుంది. ఉద్యమాలు మటుమాయం కావాలంటే ఆ ఉద్యమాలకు దారితీస్తున్న కారణాలు మటుమాయం కావాలి. ఇవాళ నడుస్తున్న రాజకీయార్థిక విధానాలు ఆ కారణాలను రోజురోజుకూ పెంచి పోషించేవే గాని మటుమాయం చేసేవి కావు. అందువల్ల ఉద్యమాలు మటుమాయం కావడం అసాధ్యం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

2 Responses to ఒక్క బుల్లెటూ కాల్చలేదట!!!

 1. Policeman says:

  నిజమే! మీకు మద్దతు ఇవ్వాల్సిందే.
  ఉద్యమకారులు కూడా ఒక్క బుల్లెట్ కాల్చలేదు. ఒక్క బ్రిడ్జి,టెలిఫోను టవరూ కూల్చలేదు. ఒక్క పోలీసు ఉద్యోగినీ హత్య చేయలేదు. కాంట్రాక్టర్ల నుంచి ఒక్క పైసా దోచలేదు.

  చైనాలో ఉద్యమాలను టాంకులతో తియాన్ మన్ స్కేర్లో పబ్లిక్ గా తొక్కించి నిరాయుధ విద్యార్థులను, ప్రజాస్వామ్య వాదులను అణిచివేసినా పరవాలేదు, ఇక్కడ మీకు వాక్స్వాతంత్రం ఇవ్వాలి. నిజమే!

 2. తార says:

  నిజమే నాస్తికవాదం పేరుతో రష్యాలో లక్షల మందిని కుక్కల్లగా మీరు చంపలేదు..
  స్టాలిన్ గొప్ప అహింసావాది…
  మొన్నే చత్తిస్‌ఘడ్లో ౧౫ యేల్ల పిల్లవాడిని, యమ్.యల్.ఎ. కొడుకు అనే ఏకైక కారణంతో చంపలేదు..

  మీరు మీకు వ్యతిరేకంగా మట్లాడిన వారిని చంపొచ్చు, మీరు మీకు నచ్చినవాళ్ళని చంపొచ్చు, కానీ హక్కులు కుడా మికే కావాలి..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s