చిన్నారి దేశంలో ప్రకృతి బీభత్సం

అది మనకు సుదూరమైన దేశమే కావచ్చు. ప్రపంచ రాజకీయాలలో పెద్ద ప్రాముఖ్యత లేని దేశమే కావచ్చు. విస్తీర్ణంలో గాని, జనాభాలో గాని అది మన రాష్ట్రాల కన్న, జిల్లాల కన్న చిన్నదే కావచ్చు. కాని ఒక్క ప్రకృతి విలయంతో అక్కడి జనాభాలో మూడు శాతం తుడుచిపెట్టుకుపోయిన మహా విషాద సమయంలో ఆ దేశం గురించి ఆలోచించవలసి ఉంది. ఇవాళ జరిగినది ప్రకృతి బీభత్సమే గాని ఐదు వందల సంవత్సరాలకు పైగా పెద్ద దేశాల పాలకులు ఆ చిన్నారి దేశంలో జరిపిన కుట్రలు, కుహకాలు, దురాక్రమణలు, రక్తపాతాలు, దోపిడీ పీడనలు ఇవాళ్టి బీభత్సపు ప్రభావం ఎన్నో రెట్లు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. అందువల్ల ఇవాళ ధ్వంసమైపోయిన పోర్ట్ ఓ ప్రిన్స్ సాక్షిగా, హైతీ సాక్షిగా, ఒక్కుమ్మడిగా రద్దయిపోయిన మూడు లక్షల అమాయక ప్రాణాల సాక్షిగా విషవిషాద చరిత్రను తలచుకోవలసి ఉన్నది. ఒకదేశంలోకి మరొక దేశపు సైన్యాలు, వ్యాపారులు, పెట్టుబడిదారులు ప్రవేశించి ఆ దేశంలో ఎంత విధ్వంసం సృష్టించగలరో తెలుసుకోవడానికి హైతీ పెద్ద నిదర్శనం.

అట్లాంటిక్ మహాసముద్రంలో భాగమైన కరీబియన్ సముద్ర ద్వీప సముదాయంలో ఒక దేశం రిపబ్లిక్ ఆఫ్ హైతీ. దాని విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో సరిగ్గా పదోవంతు. జనాభా ఒక కోటి. ఆ దేశాన్ని జనవరి 12న అతలాకుతలం చేసిన భూకంపం అపారమైన జననష్టానికి, ఆస్తి నష్టానికి కారణమైంది. మృతుల సంఖ్య లక్షన్నర ఉండవచ్చుననే ప్రాథమిక అంచనాలు ప్రస్తుతం మూడు లక్షలకు చేరాయి. అతితక్కువ తలసరి ఆదాయంతో, సగం జనాభా నిరక్షరాస్యతతో, నలభై శాతం ప్రజలు అనారోగ్యంతో చివికిపోతున్న హైతీ ఈ భూకంపపు దెబ్బను తట్టుకోవడం కష్టమే. ప్రపంచ దేశాలన్నిటి నుంచి సహాయం అందుతున్నది, సహాయ వాగ్దానాలు అందుతున్నాయి గాని, ఆ దేశపు చరిత్రలో విదేశీ జోక్యాల గురించి తెలిసిన వారెవరయినా ఈ సహాయాలను ఒకింత అనుమానంతో చూడక తప్పదు.

ఇవాళ్టి హైతీ పాశ్చాత్య ప్రపంచంలో అన్ని దేశాల కన్న వెనుకబడిన నిరుపేద దేశం. కాని పద్దెనిమిదో శతాబ్దపు చివరి రోజుల్లో ఫ్రాన్స్ విదేశీ వాణిజ్యంలో మూడో వంతు హైతీతోనే సాగేదంటే ఫ్రెంచ్ సామ్రాజ్యవాద విస్తరణలో హైతీ పాత్ర ఎంత ప్రముఖమైనదో తెలుస్తుంది. బంగారం గనులతో, పొగాకు, చెరకు, కాఫీ, నీలిమందు పంటలు, పరిశ్రమలతో హైతీ (అప్పుడు ఫ్రెంచి పాలకులు దాన్ని సేంట్ డొమింగో అని పిలిచేవారు) 1790 నాటికి ఫ్రెంచి వలసన్నిటిలో అత్యంత సంపన్నమైన దేశంగా ఉండేది. సరిగ్గా భారతదేశంలాగనే పద్దెనిమిదో శతాబ్దానికి ముందు సంపన్నదేశాలలో ఒకటిగా ఉండి, ఇరవయోశతాబ్దానికల్లా పేద దేశాలలో ఒకటిగా మారిన హైతీలో పదహారో శతాబ్ది నుంచే వలసవాదులు, సామ్రాజ్యవాదులు చేసిన పనులను చూస్తే ఎంత క్రమబద్ధంగా బీభత్సం జరిగిందో అర్థమవుతుంది. అంటే మానవ బీభత్సమే ప్రకృతి విలయం కన్న ప్రమాదకరంగా, ప్రణాళికాబద్ధంగా జరిగిందని తేలుతుంది.

స్పానిష్ అన్వేషణలలో భాగంగా క్రిస్టఫర్ కొలంబస్ 1492లోనే ఈ ప్రాంతంలో అడుగుపెట్టి తన వలసలను స్థాపించడం మొదలుపెట్టాడు. స్థానిక తెగల నాయకురాలు అనాకౌనా ఆ స్పానిష్ వలసవాదులను ఎదిరించి పోరాడింది. ఆ పోరాటంలో భాగంగా వలస స్థావరం లా నావిదాద్ ను హైతియన్లు ధ్వంసం చేశారు. స్పానిష్ సైన్యాలు ఆనాకౌనాను, ఆమె భర్త కావోనాబో ను నిర్బంధించి, ఆమెను ప్రజల ముందు బహిరంగంగా ఉరితీశారు. ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇవాళ్టికి కూడ హైతియన్లు ఆనాకౌనా ను తమ దేశస్థాపకులలో ఒకరిగా గౌరవప్రపత్తులతో పూజిస్తారు. అయితే విదేశీ దురాక్రమణలను ఎదిరించిన, పోరాడిన హైతియన్ల చరిత్ర ఆనాకౌనాతో మొదలయిందేగాని ఈ ఐదు శతాబ్దాలలో ఎప్పుడూ ఆగలేదు.

వలసవాదులతో ఈ ప్రాంతంలో ప్రవేశించిన అంటువ్యాధులవల్ల, వలసవాదుల దుర్మార్గాలవల్ల స్థానిక జాతులు అంతరించిపోవడం మొదలుకాగా, పాలకులు ఆఫ్రికా నుంచి బానిసలను ఇక్కడికి పనులకోసం తోలుకు రావడం ప్రారంభించారు. అలా స్థానిక తెగలు, స్పానిష్ వలసవాదులు, ఆఫ్రికన్ బానిసలు కలగలసిన మిశ్రమ జాతుల జనం ఇవాళ హైతియన్లుగా ఉన్నారు.

తమది కాని ఈ నేల మీద అధికారం కోసం స్పానిష్ వలసవాదులు, ఫ్రెంచి వలసవాదులు ఘర్షణ పడి, యుద్ధాలు చేసుకుని, చివరికి 1697లో ప్రాంతాలను పంచుకుని సంధి చేసుకున్నారు. అలా ప్రస్తుత హైతీ ఫ్రెంచివారి చేతికి వచ్చింది. వందసంవత్సరాల కష్టభరితమైన ఫ్రెంచి పాలనతర్వాత హైతియన్లకు ఆ ఫ్రాన్స్ లోనే సాగిన విప్లవం ఆశలు కల్పించింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం నినాదాలు తమకు కూడ వర్తించాలని హైతియన్లు పోరాట మార్గం పట్టారు. ఇదే అదనుగా చూసుకుని బ్రిటిష్, అమెరికన్ పాలకులు కూడ హైతీలో తమ ప్రయోజనాలకోసం ఆక్రమణలకు, కుట్రలకు దిగారు. స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బానిసనాయకుడిని చర్చలకు ఆహ్వానించి, ఎత్తుకుపోయి ఫ్రాన్స్ లో నిర్బంధించారు. ఆతర్వాత కూడ కొనసాగిన పోరాట ఫలితంగా చివరికి 1804 జనవరి 1 న బానిసలు, స్థానికులు కలిసి హైతీని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. అలా అమెరికా తర్వాత వలస నుంచి విముక్తమయిన రెండో దేశం హైతీ. అప్పటిదాకా వలసవాదులు పిలిచిన వేరువేరు పేర్లను వదులుకుని, తన పాత తైనో తెగ భాష నుంచి ఈ హైతీ అనే పేరును కొత్త దేశానికి పెట్టుకున్నారు.  బానిస తిరుగుబాట్లవల్ల విముక్తమయిన ఒకే ఒక్క దేశంగా హైతీకి చారిత్రక ప్రాధాన్యత వచ్చింది. ఈ భీకరమైన యుద్ధంలో లక్షమంది నల్ల జాతీయులు, ఇరవైనాలుగువేలమంది శ్వేతజాతీయులు చనిపోయారని ఒక అంచనా. ఈ స్వాతంత్ర్యపోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తి నియంతగా  మారిపోయి 1806లో హత్యకు గురయ్యాడు. దేశం రెండు ముక్కలై ఒకచోట రాచరికం, ఒకచోట గణతంత్రం  నెలకొన్నాయి. ఆ తర్వాత రెండు వందల సంవత్సరాలలో ప్రజాస్వామికంగా పాలించిన నాయకులూ, నియంతృత్వం నెరపిన నాయకులూ, ఎందరో నాయకులు హతం కావడం, ముప్పైకి పైగా సైనిక కుట్రలు, విదేశీ జోక్యాలు, ఆక్రమణలు, దేశం నానాటికీ పేదరికంలోకి దిగజారడం జరిగాయి. ఆ చరిత్ర నిండా అమెరికన్ పాలకుల కుటిల విదేశాంగనీతి నీడలు కనబడతాయి.

మొత్తంమీద హైతీ చరిత్రను చదివితే అర్థమయ్యేదేమంటే ఆ దేశాన్ని ఇవాళ వణికించిన మహావిషాదాన్ని మించిన విషాదాలను వలసవాదం, ప్రత్యేకించి ఫ్రెంచి, అమెరికన్ పాలకులు ఆ దేశం మీద విధించారు.

ఈ విషాదాన్ని మరొకవైపు నుంచి కూడ చూడాలి. అసలు ఈ భూకంపం అమెరికన్ పాలకుల ప్రయోగాల వల్లనే జరిగిందని హ్యూగో ఛావెజ్ ఆరోపించారు. భూకంపం ప్రకృతి సహజమైన బీభత్సమే కావచ్చు కాని మానవప్రయత్నంతో దాన్ని నివారించవచ్చు, దాని నష్టాన్ని తగ్గించవచ్చు. వేల ఏళ్ల నాగరికతలో మనుషులు ప్రకృతి వైపరీత్యాలనుంచి తమను తాము కాపాడుకోవడం నేర్చుకున్నారు. భూకంపాలను అరికట్టే, దిశమార్చే వైపుగా భూభౌతిక శాస్త్రప్రయోగాలు జరిగితే భూకంప తీవ్రతను తగ్గించడం పెద్ద సమస్య కాదు. సామ్రాజ్యవాదం యుద్ధ సాంకేతిక పరిజ్ఞానం కోసం వెచ్చిస్తున్న నిధులలో పావో, పదో వంతో ఖర్చుపెట్టినా ఈవిషయంలో విజయం చేకూరి ఉండేది. కనీసం భూకంపం వంటి ప్రకృతి విలయాలను ముందస్తుగా గుర్తించగలిగే పరిజ్ఞానం అభివృద్ధి చేసినా, బాధిత ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, నష్టపు తీవ్రతను తగ్గించడం సాధ్యమవుతాయి. భూకంపం వచ్చిన తర్వాత ఎంత తక్కువ వ్యవధిలో సాధ్యమయితే అంత తక్కువ వ్యవధిలో బాధితులకు సహాయ పునరావాస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. స్వయంగా అధ్యక్ష భవనం కూడ ధ్వంసమైపోయిన స్థితిలో ఇవాళ హైతీ ప్రభుత్వానికి ఈ సహాయ పునరావాస చర్యలకు తగిన శక్తి లేకపోవచ్చు. కాని కూతవేటు దూరంలో మహా సంపన్నమైన అమెరికా ఉంది. హైతీ బాధితులను ఆదుకోవడం తన నైతిక బాధ్యతగా అమెరికా భావించాలి. ఇరాక్ మీద దండెత్తడానికి దేశదేశాల సైన్యాలను తరలించుకుపోయి,  లక్షల కోట్ల డాలర్లు భస్మీపటలం చేయడానికి చూపిన ఉత్సాహంలో కొంతయినా, పొరుగువారిని ఆదుకోవడానికి చూపాలి.

* రచన జనవరి 29, 2010

* ప్రచురణ ఈభూమి మాసపత్రిక ఫిబ్రవరి 2010

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s