తేలిపోయిన ప్రభుత్వ కుట్ర

ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ ఆగస్ట్ 2, 2010

ఐదు సంవత్సరాల కింద ఐదుగురు సహచరులనూ నన్నూ అరెస్టుచేసి మామీద ఔరంగాబాద్ కుట్రకేసు బనాయించారని ‘ఆఖరిపేజీ’ పాఠకులకు తెలుసు. ఆ అబద్ధపు కేసు గురించీ, అప్పటి పాలకులు, పోలీసులు ఆడిన అబద్ధాల గురించీ అప్పుడే ‘ఆఖరిపేజీ’లో రాశాను.

“ఆ అరెస్టు, కేసు, నిర్బంధం వ్యక్తిగతంగా నాకు సంబంధించినవి మాత్రమే కావు. అవి బహిరంగ ప్రజాజీవిత వ్యవహారాలు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పోలీసు వ్యవస్థ, పాలనా విధానాలు ఏ రకంగా ఉన్నాయో నగ్నంగా, బహిరంగంగా చూపిన వ్యవహారాలు. అందువల్ల ఆ అంశాలను తెలుసుకునే హక్కు, తెలుసుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరికీ ఉన్నాయి. మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మన పన్నులలోంచి జీతాలు తీసుకుంటున్న పోలీసు వ్యవస్థ మనకోసం ఏం చేస్తున్నాయో, మనలో కొందరిని నిర్బంధించడానికి ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతున్నాయో, ఎన్నెన్ని కుయుక్తులు పన్నుతున్నాయో మనం సంపూర్ణంగా తెలుసుకోవలసి ఉంది” అని అప్పుడే ( ప్రజాతంత్ర 2005 జూన్ 19-25 సంచికలో) రాశాను.

ఆగస్ట్ 2న ఆ కేసును కొట్టివేస్తూ నిజామాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు గనుక మరొకసారి ఆ విషయాలు చెప్పవలసి ఉంది. పోలీసుల నేర పరిశోధక తెలివితేటల గురించీ,  న్యాయవ్యవస్థలోని, విచారణలోని డొల్లతనం గురించీ చెప్పవలసి ఉంది. ఈ క్రమంలో ఈ రెండు వ్యవస్థలూ మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురిచేశాయో చెప్పవలసి ఉంది. చట్టం గురించి చదువుకుని, రాసే, మాట్లాడే, వ్యక్తీకరించుకోగలిగిన మమ్మల్నే ఈ రెండు వ్యవస్థలు ఇలా వేధించగలిగితే, ఇక ఈ దేశంలోని కోట్లాది మంది నిరుపేద, నిరక్షరాస్య, అమాయక ప్రజానీకం మీద ఎంతటి దుర్మార్గం, దాష్టీకం అమలవుతున్నదో అర్థం చేసుకోవచ్చు. పాలనా విభాగాలయిన ఈ వ్యవస్థలు ఇంత అమానుషంగా, నిర్దాక్షిణ్యంగా ఎందుకు మారిపోయాయో, ఇటువంటి వేధింపులకు ఎందుకు పాల్పడుతున్నాయో, సామాజిక రాజకీయార్థిక వ్యవస్థ స్వభావాన్ని విశ్లేషించడానికి ఒక ఆధారంగా మా కుట్రకేసును చూడవచ్చు. ఈ వ్యవస్థ మారవలసిన అవసరమేమిటో స్వానుభవం నుంచే చెప్పవచ్చు.

మమ్మల్ని అరెస్టు చేసింది చట్టబద్ధమైన, చట్టాన్ని గౌరవించే పోలీసులు కారు. మమ్మల్ని చట్టవ్యతిరేకంగా అక్రమ నిర్బంధంలో ఉంచారు. న్యాయస్థానం ముందర హాజరుపరచే క్రమంలో కూడ మామీద చట్టబద్ధమైన దర్యాప్తు అనేదేదీ జరగలేదు. మామీద నేరారోపణ చట్టబద్ధంగా జరగలేదు. న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నపుడు బోనెక్కి సాక్ష్యం చెప్పిన పోలీసు సాక్షులు పది మందీ అబద్ధాలో, అర్ధ సత్యాలో చెప్పారని అందరికీ అర్థమయింది. అంటే మేం కుట్ర చేయలేదనీ, పోలీసులు, ప్రాసిక్యూషన్, ప్రభుత్వం కుట్ర చేశాయనీ రుజువయింది. అయినా న్యాయస్థానం చుట్టూ తిరగడంలో మేం ఐదు సంవత్సరాల విలువైన కాలాన్ని వ్యర్థం చేసుకున్నాం. అలా మా సమయమూ, ఆర్థిక వనరులూ, ఆరోగ్యాలూ దెబ్బతిన్న తర్వాత మామీద నేరారోపణలను పోలీసు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది గనుక కేసు కొట్టివేసి మమ్మల్ని నిరపరాధులుగా వదిలేశారు. మరి మేం నిరపరాధులమైతే, మమ్మల్ని అపరాధులుగా నిరూపించడానికి విఫల ప్రయత్నం చేసినవాళ్ల అపరాధం మాటేమిటి?

ఏదయినా నేరం జరిగినప్పుడు, లేదా నేరం జరగబోతున్నదని తెలిసినప్పుడు ఆ నేరస్తులను, అనుమానితులను నిర్బంధంలోకి తీసుకుని, దర్యాప్తు జరిపి, న్యాయవిచారణ కోసం న్యాయస్థానం ముందుపెట్టి, తమ ఆధారాలు చూపి, శిక్ష విధించడం ఎందుకు అవసరమో వాదనలు వినిపించవలసిన బాధ్యత పోలీసు శాఖది. అందులోనూ శాంతిభద్రతల విభాగానిది. కాని మహత్తర ప్రజాపోరాటాల చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ సంప్రదాయం ఎప్పుడో కనుమరుగయి పోయింది. ప్రజలను అనుమానించడం, ప్రజాపోరాటాలను అణచివేయడం, ప్రజల పక్షం తీసుకునే బుద్ధిజీవులమీద నిరంతర నిఘాతో వేధించడం, అందుకోసం తోచిన అబద్ధమల్లా చెప్పడం మాత్రమే పోలీసుశాఖ పనులయిపోయాయి. ఈ క్రమంలో పోలీసులు మామూలు నేరాలను అరికట్టడం, ఆ నేరస్తులను పట్టుకోవడం, సరయిన దర్యాప్తు జరపడం, పటిష్టంగా నేరారోపణచేసి న్యాయవిచారణకు సహకరించడం వంటి పనులన్నీ మరచిపోయారు. ప్రజలను అణచివేయడం అనే ఒక్క పనిచేస్తే చాలునని, దానితోనే లెక్క చూపనక్కరలేని నిధులూ, పదోన్నతులూ, ఇతర సౌకర్యాలూ కల్పిస్తామని పాలకులు పోలీసులకు నేర్పిపెట్టారు. దీనివల్ల పోలీసులు ప్రజాపోరాటాలను అణచగలరో లేదో తెలియదు గాని, వాళ్లకు వృత్తిధర్మంగా ఉండవలసిన తెలివినీ, నైపుణ్యాన్నీ కూడ కోల్పోయారు. ఎవరి పని ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియని అరాచకం రాజ్యం ఏలడం మొదలయింది.

ఆ అరాచకంలో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ పోలీసుశాఖలోకెల్లా క్రూరమైన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ ఐ బి) అనే వ్యవస్థ తయారయింది. ఈ ఎస్ ఐ బి ఎవరికి జవాబుదారీయో ఎవరికీ తెలియదు. విప్లవకారులను దొంగతనంగా పట్టుకుని కాల్చిచంపడమే వాళ్ల పని.  అందుకొరకు దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలోనూ వాళ్ల స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏళ్ల తరబడి ఆ నగరాలలో తమకు కావలసిన వాళ్లకోసం వేటాడుతూ ఉందడం మినహా వాళ్లకు మరొక పని లేదు. ఔరంగాబాద్ లో మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ లో ఒకగదిలో కూచుని మాట్లాడుకుంటున్న మామీద దాడి చేసినది వాళ్లే. దొంగచాటుగా పట్టుకుని, వెంటనే మా కళ్లకు గంతలు కట్టి, చేతులు విరిచి కట్టి, ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు. ఒకరోజంతా అక్కడ ఉంచి, ఆ తర్వాత వాహనాలు ఎక్కించి, ఏడెనిమిది గంటలు ప్రయాణం చేయించి మరొక చోట మళ్లీ రెండు రోజులు మమ్మల్ని నిర్బంధించారు. ‘ఇక మామూలు పోలీసులు వచ్చి మీ బాధ్యత తీసుకుంటారు’ అని చెప్పి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లాక అరగంటకు వచ్చిన పోలీసులు మమ్మల్ని కళ్లకు గంతలతో, విరిచికట్టిన చేతులతోనే అరగంట ప్రయాణం చేయించి కట్లు విప్పదీస్తే మేం నిజామాబాదు డిఐజి కార్యాలయంలో ఉన్నామని తేలింది. ఇదంతా ఇంత వివరంగా చెప్పడం ఎందుకంటే ఔరంగాబాదు అరెస్టు, మూడురోజుల అక్రమ నిర్బంధం అన్నీ మాయం చేసి, మమ్మల్ని నిజామాబాదులో అప్పుడే పట్టుకున్నట్టు శాంతిభద్రతల పోలీసులు చెప్పిన అబద్ధం మీదనే ఈ కేసు మొత్తం నిర్మాణమయింది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్ లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి నల్లమల వెళుతుండగా నిజామాబాదులో పట్టుకున్నామని కట్టుకథ అల్లారు.

అది అబద్ధం కనుకనే తర్వాత విచారణలో పోలీసు సాక్షులలో ఒక్కరు కూడ ఆ అబద్ధాన్ని రుజువు చేసే కథనం చెప్పలేకపోయారు. అది వాస్తవమయితే ఒకటే కథనం ఉంటుంది కాని అబద్ధం ఆడినప్పుడల్లా మారుతుంది గద! మమ్మల్ని అరెస్టుచేయడానికి ఒకే వాహనంలో వెళ్లామని చెప్పిన ఇద్దరు పోలీసు సాక్షులు ఆ వాహనమార్గం గురించి మాత్రం వేరువేరుగా చెప్పారు. మమ్మల్ని నిజామాబాదులో అరెస్టు చేసినప్పుడు చూశామని పంచనామా మీద సంతకం చేసిన ఇద్దరు ఆటోడ్రైవర్లు. వారి ఆటోలు సీజ్ అయి పోలీసు స్టేషన్ లో ఉంటే అడగడానికి వెళ్లినప్పుడు తెల్లకాగితాల మీద సంతకం తీసుకున్నారట. ఆ కాగితాలేమిటో వాళ్లకు తెలియదు. మమ్మల్ని వాళ్లెప్పుడూ చూడలేదు. మా అరెస్టుకూ పంచనామాకూ వాళ్లు సాక్షులు కారు!

ఇక మరొక పోలీసు సాక్షి మమ్మల్ని అరెస్టు చేసినప్పుడు మాదగ్గర విప్లవ సాహిత్యం దొరికిందని చిలకపలుకులు అప్పగించాడు. ‘విప్లవ సాహిత్యం అంటే ఏమిటి’ అని మా న్యాయవాది మాధవరావు గారు ప్రశ్నవేశారు. ‘విప్లవ సాహిత్యం అంటే బానిస సంకెళ్లు తెంచుకొండి అని ప్రజలకు చెప్పేది’ అని ఆ కానిస్టేబుల్ అమాయకంగా నిజం చెప్పాడు. ‘మరి అది మంచిపని కాదా’ అంటే ‘మా డిపార్టుమెంటుకు మంచిది కాదు’ అన్నాడు.

ఇక తాను చేయని అరెస్టులను చేశానని చెప్పుకోవలసి వచ్చిన దర్యాప్తు అధికారి మేం కుట్ర చేశామని చూపడానికి చాల ప్రయత్నించాడు.  మాదగ్గర తానే జప్తు చేశానని ఆయన చెప్పిన ఒక్కొక్క వస్తువునూ చూపుతూ ‘దీనిలో కుట్ర ఉందా’, ‘దీనిలో కుట్ర ఉందా’ అని మా న్యాయవాది ప్రశ్నించారు. ఏ ఒక్క వస్తువులోనూ కుట్రకు ఆధారం లేదని దర్యాప్తు అధికారి నోటనే చెప్పించగలిగారు. మరి కుట్ర చేశారనడానికి ఆధారం ఏమిటి అనే చివరి ప్రశ్నకు ‘ఏమీ లేదు’ అని దర్యాప్తు అధికారి చెప్పవలసి వచ్చింది. దర్యాప్తూ లేదు, ఆ అధికారికి సంబంధమే లేదు. కుట్ర జరగలేదు, అరెస్టు చేసినది ఆయన కాదు. సాక్షులుగా ప్రవేశపెట్టిన వాళ్లు సాక్షులు కాదు.

ఎన్నెన్ని ‘కాదు’ల మీద, ‘లేదు’ల మీద ఆధారపడి మా నేరం రుజువు చేయదలిచారు పోలీసులు!!!

మమ్మల్ని మావోయిస్టుపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడితో పాటు అరెస్టు చేశారు గాని అప్పటికి ఆ పార్టీ మీద నిషేధం లేదు. నిషేధం ఉన్నదో లేదో తెలియదని ఛార్జిషీటు తయారు చేసిన పోలీసు అధికారి అన్నాడు. అధికారికంగా నిషేధం లేకపోవచ్చు గాని నిషేధం ఉన్నట్టేనని తమకు ఉత్తర్వులు ఉన్నాయన్నాడు. ఆ ఉత్తర్వు ప్రతి ఉందా అంటే లేదన్నాదు. తాము చేస్తున్న పని అధికారికంగా సరయినదా కాదా, చట్టానికి లోబడినదా కాదా చెప్పలేని స్థితిలో పోలీసు అధికారులు ఉన్నారన్నమాట.

ఇదంతా పోలీసు సాక్షుల సమర్థత, అసమర్థతకు సంబంధించిన విషయం కాదు. స్వయంగా పాలకులే పోలీసుల శాఖకు ఈ సంస్కృతి నేర్పిపెట్టారు. ‘ప్రజలను శత్రువులుగా చూడండి, వాళ్లను ఏమిచేసినా ఫరవాలేదు, చట్టాలు రాతకోసం మాత్రమే, పాటించనక్కరలేదు’ అని బ్రిటిష్ కాలంలో పాలకులు పోలీసుశాఖకు నేర్పారు. 1947 తర్వాత కూడ పోలీసు శాఖలో ఆ సంస్కృతి మారలేదు. ప్రజాసేవకుల స్థానానికి మారడానికి పోలీసులకు శిక్షణ ఇవ్వలేదు. ఇక 1967 తర్వాత, నక్సల్బరీ ప్రజా ప్రజ్వలనం తర్వాత ప్రజలను శత్రువులుగా చూసే సంస్కృతిని మరింత పెంచారు. అందువల్లనే అబద్ధాలు చెప్పడం, చట్టవ్యతిరేక దమనకాండ సాగించడం, తప్పుడు కేసులు తయారు చేయడం, అవి తప్పుడువి గనుక వాటిని రుజువు చేయలేకపోవడం, కేసులు పెట్టి సంవత్సరాల తరబడి వేధిస్తే చాలుననుకోవడం పోలీసులకు అలవాటయిపోయాయి.

రాష్ట్రంలో ఇప్పటికి హైదరాబాద్ కుట్రకేసు, పార్వతీపురం కుట్రకేసు, సికిందరాబాదు కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు, బెంగళూరు కుట్రకేసు, ఔరంగాబాద్ కుట్రకేసు వంటి సుప్రసిద్ధమైన కుట్రకేసులలో ఒక్కకేసులోకూడ ప్రాసిక్యూషన్ నేరారోపణలను రుజువు చేయలేకపోయింది. ఒక్కకేసులో కూడ న్యాయస్థానాలు శిక్షలు విధించలేదు. మరి ఎవరి కుట్ర రుజువవుతున్నట్టు?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

One Response to తేలిపోయిన ప్రభుత్వ కుట్ర

  1. chavakiran says:

    మీరెన్నైనా చెప్పండి తుపాకీ గొట్టంతో ఏమీ సాధించలేరు మరణం తప్ప.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s