తెలంగాణ కోరడం దేశద్రోహమట!!

ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ ఆగస్ట్ 9, 2010

తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉపఎన్నికలు జరిగిన పన్నెండు నియోజకవర్గాల వోటర్లు తమ ఆకాంక్షను దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఎవరికైనా ఇంకా సందేహాలు మిగిలి ఉంటాయా అని అనుకుంటున్న తరుణం ఇది. అయినా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రెండు రెళ్లు నాలుగు అన్న సత్యాల్ని కూడ ప్రశ్నించగలిగిన మహానుభావులున్న తెలుగునేలలో తెలంగాణ ప్రజా ఆకాంక్షల పట్ల అనుమానాలు పొడసూపడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఆ అనుమానాలు విషపూరితంగా, చట్టవ్యతిరేకంగా, దుర్మార్గంగా, అసహ్యంగా, అబద్ధాలమయంగా ఉండడం కొంచెం ఆశ్చర్యకరం. ఆ అనుమానాలను ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రానికి బాధ్యత వహించవలసిన మంత్రులు ప్రకటించడం మరింత శోచనీయం. నిజానికి ఈ చర్య ద్వారా తాము కేవలం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నామనీ, మొత్తం రాష్ట్రం తమ దృష్టిలో లేదనీ ఆ మంత్రులు బహిరంగంగా ఒప్పుకున్నట్టయింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష, వ్యతిరేకత చూపుతున్నదని ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ వాదులం చేస్తున్న విమర్శలను ఇప్పుడు రాష్ట్ర మంత్రులే అధికారికంగా అంగీకరించారన్నమాట.

ఆగస్ట్ 6న రాష్ట్ర సీనియర్ మంత్రి గాదె వెంకట రెడ్డి నాయకత్వాన పదహారు మంది మంత్రుల బృందం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని కలిసి 62 పేజీల నివేదిక సమర్పించింది. మంత్రి వట్టి వసంత కుమార్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ వాదనలు వినిపించారు. మంత్రులకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చు గనుక వారు శ్రీకృష్ణ కమిషన్ ను కలవడం గాని, నివేదిక సమర్పించడం గాని వాటికవిగా అభ్యంతరకరమైనవి కాకపోవచ్చు. కాని వారు రాష్ట్రానికంతటికీ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు గనుక, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలమధ్య వచ్చిన వివాదంలో తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం అభ్యంతరకరమవుతుంది. అలా చెప్పడమంటే తమ బాధ్యతా నిర్వహణలో అన్ని ప్రాంతాలపట్ల సమదృష్టితో వ్యవహరించలేదని ఒప్పుకున్నట్టవుతుంది. అంటే మంత్రి పదవి చేపట్టినప్పుడు తీసుకున్న ప్రమాణస్వీకార శపథాన్ని ఉల్లంఘించినట్టవుతుంది. రాజ్యాంగం మూడో షెడ్యూల్ నిర్వచించిన ఆ ప్రమాణస్వీకారం ప్రకారం ఏ రాష్ట్ర మంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూస్తాననీ, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, భయమూ ఆశ్రిత పక్షపాతమూ లేకుండా పనిచేస్తాననీ శపథం తీసుకోవాలి. మరి ఈ పదహారుగురు మంత్రులు లిఖితపూర్వకంగా ఒక ప్రాంతంపట్ల తమ పక్షపాతాన్నీ, మరొక ప్రాంతంపట్ల ద్వేషాన్నీ ప్రకటించారు. అంటే ఆ ప్రమాణ స్వీకారం ప్రకారమే వీరికి మంత్రులుగా కొనసాగే అర్హత లేదు.

వాళ్లు మాత్రమే కాదు, వాళ్లు ఆ మాట అనలేదని ప్రకటించడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్ కూడ ప్రజలను మోసగించడానికి సిద్ధపడ్డారు. లిఖిత పూర్వకంగా నివేదికలో ఉన్న విషయం లేదని ముఖ్యమంత్రి అంటున్నారంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే తన మంత్రుల తప్పును కప్పిపుచ్చుతున్నారన్నమాట. మంత్రులు తీసుకున్న పక్షపాతవైఖరిని సమర్థిస్తున్నారన్నమాట. అంటే తెలంగాణ పట్ల తన వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారన్నమాట. ఇక గవర్నర్ దయితే మరింత అభ్యంతరకరమైన వైఖరి. ఆయనకు మంత్రుల నివేదికతో గాని, శ్రీకృష్ణ కమిటీతో గాని సంబంధం లేదు. దానిమీద ఆయన వ్యాఖ్యానించనక్కరలేదు. అసలు ఇటువంటి రాజకీయ వ్యవహారాలమీద ఆయన వ్యాఖ్యానించగూడదు. కాని నివేదికలో ఉన్నవిషయం లేదని ఆయన అన్నారు.

ఇంతకూ మంత్రులు, వారికి నాయకత్వం వహించిన గాదె వెంకట రెడ్డి అన్నమాట, వారామాట అనలేదని ముఖ్యమంత్రి, గవర్నర్ లు అంటున్నమాట ఏమిటి? తెలంగాణ రాష్ట్రం కావాలనే కోరిక దేశద్రోహమని తాము ఎప్పుడూ అనలేదని ఇప్పుడు మంత్రులు అంటున్నారు. వారు అనలేదని ముఖ్యమంత్రీ గవర్నరూ అంటున్నారు.

కాని ఆ పదహారు మంది మంత్రులకూ, వారికి నాయకత్వం వహించిన గాదె వెంకటరెడ్డికీ ఇంగ్లిషు వచ్చునా? లేక తామే ఇచ్చిన నివేదిక తాము చదవలేదా? వాళ్లను సమర్థించడానికి ఉబలాటపడిన కొణిజేటి రోశయ్యకూ, ఇ ఎస్ ఎల్ నరసింహన్ కూ ఇంగ్లిషు వచ్చునా? అనువదించి చెప్పే సహాయకులుంటారా? ఇప్పటికైనా ఈ పెద్దమనుషులందరూ ఆ నివేదిక ఒకసారి చదువుకుంటే బాగుంటుంది. అందులో కనీసం ఐదో పేజీ, 23వ పేజీ చదువుకుంటే వాళ్లు ఏమన్నారో వాళ్లకే తెలిసివస్తుంది. తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని, ప్రజా ఆకాంక్షలను దేశద్రోహమనీ, శిక్షార్హమైన నేరమనీ అన్నారో లేదో వారికే తెలిసివస్తుంది.

ఆ నివేదికలో ఐదో పేజీలో “…ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కు పునాది స్వపరిపాలన, ఆత్మగౌరవం అని మార్చారు. ఆ నినాదాలకు దేశాన్ని ముక్కలు చేయగల శక్తి ఉందని గుర్తించలేదు. నిజానికి, దీన్ని భారత ప్రభుత్వం భారత శిక్షా స్మృతి  కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవలసి ఉండింది” అని ఉంది.

అలాగే 23వ పేజీలో “స్వపరిపాలన, ఆత్మగౌరవం వంటి నినాదాలు తప్పనిసరిగా దేశాన్ని ముక్కలు చేయడానికి బీజాలు నాటుతాయి గనుక అటువంటి కోరికలను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి. ఆత్మగౌరవం, స్వపరిపాలన అనే పునాదిపై ప్రత్యేక రాష్ట్రం కోరడమంటే భారత ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడంతో సమానం. ఈ దేశవ్యతిరేక కోరికలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించడమే ఆశ్చర్యకరం. భారత రాజ్యాంగం లోని అధికరణం 3 ప్రకారం ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ పునాది అత్యంత శోచనీయం, అనుమానాస్పదం” అని ఉంది.

ఇంతకన్న దుర్మార్గమైన, అనైతికమైన, అబద్ధాలమయమైన మాటలు కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు, మేధావులు ఇదివరకు చాలసార్లు అన్నారు. కాని ఆ మాటలకూ వీటికీ తేడా ఏమంటే, ఈ మాటలు అన్నది మొత్తం రాష్ట్రానికి బాధ్యత వహించవలసిన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు. వారు ఆ మాటలనడం సరయినది కాదని సవరించవలసిన ముఖ్యమంత్రి ఆ తప్పును కప్పిపుచ్చి వారిని వెనకేసుకు వచ్చారు. ఆ సమస్యలో జోక్యం చేసుకోగూడని గవర్నర్ వారిని వెనకేసుకు వచ్చారు. అందువల్ల దీన్ని తీవ్రంగా పరిగణించాలి.

ఆ 62 పేజీల నివేదికలో సగానికన్న తక్కువే వాదనలు, సగానికన్న ఎక్కువ గణాంకాలు, పట్టికలు ఉన్నాయి. వాటిలోని తప్పులను, వక్రీకరణలను, అసత్యాలను, అర్ధసత్యాలను వివరించడం, ప్రతివాదనలు వినిపించడం మొదలుపెడితే ఇక్కడ స్థలం సరిపోదు. కాని పైన ఉటంకించిన రెండు వివాదాస్పద వ్యాఖ్యల గురించి విశ్లేషించవలసి ఉంది.

ప్రత్యేక రాష్ట్రం కోరడాన్ని భారత శిక్షా స్మృతి కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని ఈ మంత్రులు కోరుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోరడమంటే భారతప్రభుత్వంపై యుద్ధానికి దిగడమే అంటున్నారు. అది ఒక దేశద్రోహకరమైన, జాతివ్యతిరేకమైన కోరిక అంటున్నారు. రాష్ట్రాల
ఏర్పాటుకు అది ప్రాతిపదిక కాజాలదంటున్నారు.

ఈ నాలుగు వాక్యాలూ అసత్యాలు, దురుద్దేశ్యపూరిత వ్యాఖ్యలు. రెచ్చగొట్టే ప్రకటనలు. ఒక ప్రాంతం మీద, ఆ ప్రాంత ప్రజల మీద, ఆ ప్రజల కోరికల మీద విద్వేషం నిండిన విషపూరితమైన వ్యాఖ్యలు.

మొదటి వాక్యం అబద్ధం. భారత శిక్షాస్మృతి దేశంలో ఒక కొత్త పాలనా ప్రాంతాన్ని ఏర్పరచాలని కోరడం నేరమని ప్రకటించలేదు. భారత శిక్షా స్మృతిని బ్రిటిష్ వలసవాదులు 1860లో తయారు చేశారు. మార్పు చేర్పులతో అది కొనసాగిన ఈ నూటయాభై సంవత్సరాలలో దేశంలో కొత్త పాలనా ప్రాంతాలు ఎన్నో వచ్చాయి. కొత్త రాష్ట్రాలు అనేకం ఏర్పాటయ్యాయి. స్వయంగా భారత రాజ్యాంగమే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వీలుకలిగించే అధికరణాన్ని రాసింది. మరి ఈ పదహారుగురు మంత్రులు ఏ భారత శిక్షా స్మృతి గురించి మాట్లాడుతున్నారు? లేక వీరి తెలంగాణ వ్యతిరేకత ఉన్మాదస్థాయికి చేరి, భారత శిక్షా స్మృతిలో లేనివి కనబడుతున్నాయా? నిజంగానే ఉన్మాద స్థితిలో ఉన్నవారికి లేని వస్తువులూ మనుషులూ దయ్యాలూ భూతాలూ ఉన్నట్టుగా కనబడుతుంటాయి.

రెండో వాక్యం మరొక అబద్ధం. మొదటి వాక్యంలో అది నేరమని అన్నారు గనుక, అది నేరం కాదని తెలుసు గనుక, ఏదో ఒక నేరం పేరు చెప్పడానికి ‘భారత ప్రభుత్వంపై యుద్ధం’ అనే నేరాన్ని తీసుకువచ్చారు. భారత శిక్షా స్మృతిలో 121, 121 ఎ, 122, 123, 124 ఎ వంటి సెక్షన్లు ‘భారత ప్రభుత్వంపై యుద్ధం’ అనే నేరం గురించి మాట్లాడుతాయి. వాటిలో ఎక్కడా కొత్త రాష్ట్రాన్ని, కొత్త పాలనా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కోరడం ఆ నేరం కిందికి వస్తుందని లేదు. అసలింతకీ, తెలంగాణ రాష్ట్రం కోరుతున్న వారు భారత ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ప్రకటించి, భారత రాజ్యాంగంలోని అధికరణం 3 ప్రకారమే కొత్త రాష్ట్రం కావాలని కోరుతున్నారు గనుక భారతప్రభుత్వం మీద యుద్ధం అనే ప్రశ్నే లేదు.

దేశాన్నీ, భారత జాతినీ వ్యతిరేకించే, ద్రోహం చేసే విషయమేదీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ లో లేదు. తెలంగాణ దేశం నుంచీ, జాతి నుంచీ విడిపోతానని కోరడం లేదు. కనుక ఇది దేశద్రోహకరమో, జాతివ్యతిరేకమో కానేకాదు. యాభై నాలుగు సంవత్సరాలుగా అమలయిన రాజకీయార్థిక విధానాల వల్ల తమకు న్యాయంగా అందవలసిన వాటా అందలేదని, కనుక తమ రాష్ట్రం తమకు ఇస్తే ఆ చారిత్రక అన్యాయాన్ని సవరించుకుంటామని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఒకరకంగా దళితులకు, ఆదివాసులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంలో రాజ్యాంగం అనుసరించిన ‘రక్షణాత్మకమైన విచక్షణ’ విధానం ఇది. దీన్ని జాతిద్రోహం అనడం ఎటువంటి వాదమవుతుంది?

ఇక రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగ బద్ధమైన ప్రాతిపదికల ప్రకారం తెలంగాణ అనుచితమైన కోరిక అని మరొక వాదన. ఒక్కసారి వీళ్లు రాజ్యాంగం చదివితే (మన రాజకీయ నాయకులకు పాలకులకు అటువంటి పుస్తకం ఒకటుందని తెలుసునా అని?!) అధికరణం 3 కేవలం రాష్ట్రాల ఏర్పాటుకు, విభజనకు, పునర్ వ్యవస్థీకరణకు, మార్పు చేర్పులకు కేంద్రప్రభుత్వానికి ఉన్న అధికారం గురించి మాత్రమే మాట్లాడింది గాని రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదికల గురించి మాట్లాడలేదని తెలుస్తుంది. ఎందుకు మాట్లాడలేదంటే రాష్ట్ర ఏర్పాటుకు ఏదయినా కారణం కావచ్చునని రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నారు గనుక. అలాగే  ఈ అరవై సంవత్సరాలలో విభిన్న ప్రాతిపదికలమీద కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రజాభిప్రాయం అనే ప్రాతిపదిక వాటన్నిటిలోకీ ముఖ్యమైనది. ఇవాళ తెలంగాణ విషయంలోనూ అదే ప్రాతిపదిక. కాని ప్రజలు, ప్రజల కోరికలు అనేవే మన పాలకులకు, మంత్రులకు తెలియవని ఈ నివేదికతో మరొకసారి రుజువవుతున్నది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telangana, Telugu. Bookmark the permalink.

15 Responses to తెలంగాణ కోరడం దేశద్రోహమట!!

 1. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ప్రత్యేక తెలంగాణ డిమాండు జాతిద్రోహమని ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనలేదు. ఇకముందు అలాంటి డిమాండ్లని ఆ విధంగా పరిగణిస్తూ ఒక చట్టసవరణ చేయాలని మాత్రమే అన్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండు తప్పు కాకపోతే చట్టసవరణ డిమాండు కూడా తప్పు కాదు. ఇహపోతే వారు యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి తమ వ్యక్తిగత అభిప్రాయాలు వినిపించే అధికారం వారికి లేదని మీరు చేస్తున్న వాదన సంగతి. కొద్దినెలల క్రితం తెలంగాణకు చెందిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు రాష్ట్రాన్ని విభజిస్తే తప్ప తాము బతకలేమని ఇదే కమిటీకి నివేదిక ఇచ్చారు. అప్పుడు మీకు రాష్ట్రమంత్రుల బాధ్యతలు గుర్తుకు రాలేదా ? నూటికి 60 శాతం జనాభా సమైక్యవాదులుగా ఉన్న ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ వారు అలా వేర్పాటువాదం వినిపించడం సబబేనా ? వారు మంత్రులు కాబట్టే వారు విభజన కోరకూడదు. వారు సమైక్యాన్నే కోరాలి. ఏ దేశమంత్రీ తన దేశం విచ్ఛిన్నం కావాలని కోరడు. ఎందుకంటే విభజనకు ఏవైతే కారణాలని చెప్పబడుతున్నాయో ఆ కారణాల్ని నిర్మూలించే శక్తి, సాధనసంపత్తి వారిచేతుల్లో ఉన్నాయి కనుక. వారు చెయ్యాల్సింది, వారి చేతుల్లో ఉన్నది, మనలాంటివారి చేతుల్లో లేనిది – ఆ సాధనసంపత్తిని వినియోగించుకొని ఆయా ప్రాంతాల్ని బాగుచేయడం. అంతేతప్ప ఆ స్థాయిలో ఉండి వేర్పాటువాదాన్ని వినిపించడం కాదు. సీమాంధ్రమంత్రులు చేయాల్సిన పనే చేశారు. వారు చెయ్యాల్సిన పని వారు చేసినందుకు మీరు వారిని నిందిస్తున్నారు.

 2. phani says:

  తాడెపల్లి,
  మీరు చెప్పేదాని ప్రకారం పొట్టి శ్రీ రాములు కూడా దేశద్రోహే అన్న మాట..మనం ప్రతి నవంబర్ ఒకటో తారీఖున దేశద్రోహ దినం జరుపుకోవాలి ఐతే..

 3. gajula says:

  TADEPALLIGAARU MEDHAVI ANNA VISHAYAM EVARAINA OPPUKOVALSINDE.PRASTUTA VISHAYAMLO PRATYEKARAASTRA DEMANDNU CHATTASAVARANADVAARA JHATHIDROHAANNI CHEYADAM YERUDAATAAKA THEPPA TAGALESINATLU VUNTUDI,NAA AMAAYAKATVAM KAAKAPOTHE TADEPALLILAANTI MEDHAVIKI IVANNI TELIYAVANI KAADU.MAA SAMASYANU KUUDA MEERU PEDDAMANASUTHO ARTHAM CHESUKUNI MEERE CHEPPARU NUUTIKI 60% SAMAIKYAVAADULUNNARANI ,IDE MAA SAMASYA E MAJORITY THONE SAMAIKYAVAADULANABADE SEEMAANDRULU MAMMULANU DHOCHUKUNTUNNARU,MAA MAANAANA MAMMULANU BRATHAKANIVVANDI ANE MEMU TELANGAANA RAASTRAM KAAVALANI KORUKUNTUNNAME THAPPA ,MAAKU TELUGUPRAJALU EKKADUNNA BHAGUNDAALANE KORUKUNTAAMU,SOMPETA RAIYULAKU MAA SAMPURNA MADDATHU TELUPUTUNNAMU.SAADANAA SAMPATTIVUNNA E MANTRI,MUKYAMANTRI MAAKU E SAMAIKYA RAASTRAMLO NYAAYAM CHEYYALEDU,IKKADA MEERU PEDDA MANASSUTHO MAMMULANU MAA TELANGAANARASTRAMLO MANCHIGAA BRATHAKAALANI KORUKUNTAARANI AASISTU ,GAJULA

 4. నేను వ్రాసినది వేఱు. మీరు ప్రస్తావిస్తున్నది వేఱు. మంత్రుల డిమాండుని ఏ కోణంలోంచి చూడాలో నేను వ్రాశాను. ఏది దేశద్రోహమో, ఎవఱు దేశద్రోహులో మీరు వ్రాస్తున్నారు. I am not here to argue with you. Because in my personal experoence, most advocates of Telangana have vary raw, wild emotions but no persuassive reason.

  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండుని ఆంధ్రరాష్ట్ర డిమాండుతో పోలుస్తూ చేస్తున్న ఈ అనవసరమైన పోలిక గుఱించి గత కొద్దికాలంగా వింటున్నాం. పూర్వ మద్రాసు రాష్ట్రం ఏకజాతిరాష్ట్రం కాదు. అది ప్రజాభీష్టంతో, ప్రజాస్వామికంగా ఏర్పడ్డది కాదు. వలసపాలకుల సౌలభ్యార్థం నానాజాతుల కిచిడీగా సృష్టించబడింది. ఆ కిచిడీ నుంచి బయటపడి ఏకజాతిరాష్ట్రాల్ని ఏర్పఱచాలనే ఉద్దేశంతో ప్రారంభమైనవి భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం మొదలైన ఆందోళనలు. భాషాజాతులూ, భాషారాష్ట్రాలూ ఇంగ్లీషువారీ దేశంలో అడుగుపెట్టక ముందునుంచి ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ఏర్పడక ముందునుంచి ఉన్నాయి. అవే నిఖార్సైన నిజమైన సహజమైన యూనిట్లు. పరిపాలనలో ఆ సహజత్వం, ఆ సమగ్రత్వం కోసమే భాషారాష్ట్రాలు. అంతే తప్ప ఒకే జాతికి, ఒకే మతానికీ, ఒకే భాషకూ, ఒకే సాంస్కృతిక వారసత్వానికీ చెందిన, రెండు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఒకఱిని దోపిడీదారులుగా, ఇంకొకఱిని బానిసలుగా వర్ణించడం, వివాదాల పరిష్కారానికి ఉన్న అన్ని శాంతియుత మార్గాల్నీ విసర్జించడం నిజంగా జాతిద్రోహమే అవుతుంది. misleading అవుతుంది. రాజకీయప్రయోజనాల కోసం – శాంతియుతంగా అన్నదమ్ముల్లా దశాబ్దాల తరబడి పక్కపక్కనే కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య లేని శత్రుత్వాల్ని పనిగట్టుకొని సృష్టించడం అవుతుంది. అదే జాతిద్రోహం. ఇతరులపై ఒకప్పుడు మనం ప్రయోగించిన ఈ “దోపిడీ” ఎట్సెటరా కమ్యూనిస్టు పదజాలాన్ని మనలో మనం మనవాళ్ళ మీద, మన స్వదేశీయుల మీద, మన స్వరాష్ట్రీయుల మీద ప్రయోగించడం పూర్తి అసహజం, అసమంజసం. ఉద్యమం వేడిలో మీకిది అర్థం కాకపోవచ్చు. But some day, wisdom, good counsel and reason will prevail. Reason will trumph. Natural instincts will succeed. We all have an in-born Telugu instinct. Don’t forget that.

  Unlike the erstwhile Madras State, or Hyderabad State, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ప్రాంతాల ప్రజల స్వచ్ఛంద అంగీకారంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడింది. ఇందుకు చరిత్రగ్రంథాలే సాక్షి. ఈనాడు కొందఱు బయల్దేఱి “ఈ సెటప్పు మాకు నచ్చలేదు, మార్చండి” అంటే అది సాధ్యపడదు. సాధ్యపడ్డానికి ఇదేమీ మన వ్యక్తిగత జీవితం కాదు. కోట్లాదిమంది జీవితాలకు సంబంధించిన విషయం. ఇది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం జాతిద్రోహం కాకపోవచ్చు. కానీ ఇది జాతిద్రోహంగా నెమ్మదిగా పరిణమిస్తుంది. ఇప్పటికే పరిణమిస్తున్నది. ఈ ఉద్యమంలో భావి-జాతిద్రోహ బీజాలు ఉన్నాయి. తెలుగుతల్లి విగ్రహాల్ని ధ్వంసం చేయడం జాతిద్రోహం కాక మఱేంటి ? తెలంగాణలో మాట్లాడేది తెలుగు కాదా ? తెలుగుతల్లి ఆంధ్రా ఏరియాకి పరిమితమా ? అంటే ఇక్కడ వేర్పాటువాదులు కోరుతున్నది కేవలం ఒక కొత్త పరిపాలనా విభాగం కాదనీ పక్కనున్న తెలుగు ఏరియాతో శాశ్వత శత్రుత్వమనీ ఈ సంఘటనలు నిరూఫిస్తున్నాయి. కనుక ఈ డిమాండుని జాతిద్రోహంగా అభివర్ణించడంలో అతిశయోక్తీ లేదు, అసత్యమూ లేదు.

 5. shayi says:

  @ తాడేపల్లి
  ” ఈ ఉద్యమంలో భావి-జాతిద్రోహ బీజాలు ఉన్నాయి. తెలుగుతల్లి విగ్రహాల్ని ధ్వంసం చేయడం జాతిద్రోహం కాక మఱేంటి ? తెలంగాణలో మాట్లాడేది తెలుగు కాదా ? తెలుగుతల్లి ఆంధ్రా ఏరియాకి పరిమితమా ? అంటే ఇక్కడ వేర్పాటువాదులు కోరుతున్నది కేవలం ఒక కొత్త పరిపాలనా విభాగం కాదనీ పక్కనున్న తెలుగు ఏరియాతో శాశ్వత శత్రుత్వమనీ ఈ సంఘటనలు నిరూఫిస్తున్నాయి. కనుక ఈ డిమాండుని జాతిద్రోహంగా అభివర్ణించడంలో అతిశయోక్తీ లేదు, అసత్యమూ లేదు. ” అన్నారు.
  అసలు ’జాతి’కి నిర్వచనం ఏమిటి? అంతా ఆంధ్ర జాతే అయితే ఈ హెచ్చు,తగ్గు భావనలెందుకు వచ్చాయి. ప్రతి విషయంలో ” ఈ తెలంగాణ వాళ్ళంతే!” అని, “ఇది తెలంగాణ పద్ధతి!” అని, ” ఇది తెలంగాణ యాస!” అని ఎత్తి పొడుపు మాటలు, అవహేళనలు 50 ఏళ్ళుగా ఎవరు చేస్తూ వచ్చారు? ఏం? ఆ పద్ధతులు, యాస ’తెలుగు’లో భాగం కాదా? ఏనాడైనా ఆంధ్రావాళ్ళు తామొక Superior race గా పోజు కొట్టారు గాని, తెలంగాణ వాళ్ళతో మమేకమయ్యారా?
  ఆ అవమానాలే తెలంగాణ వాళ్ళను తామొక ప్రత్యేక జాతిగా తమ అస్థిత్వాన్ని వెదుక్కొనేందుకు దోహదం చేసాయి. ఈ విషయం మీకు తెలియక కాదు. తెలియనట్టు నటిస్తారన్నది అతిశయోక్తీ కాదు, అసత్యమూ కాదు. ఒకసారి ప్రత్యేక జాతి భావన ఏర్పడ్డాక, ఆ ప్రజాస్వామ్య హక్కును కాదనే అర్హత ఎవరికీ ఉండదు. అందుకు కారణభూతమైన మిమ్మల్ని మీరు నిందించుకోవాలి అంతే.
  “తెలుగుతల్లి విగ్రహాల్ని ధ్వంసం చేయడం” అన్నది లేని పోని అభాండం. ఒక్కసారి సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి చూడండి. నిక్షేపంలా ఉంది. అసలు ’తెలుగు తల్లి’ విగ్రహాలు ఉన్నవి ఎన్ని? ఉన్న ఆ కొన్నీ తెలంగాణలోనే ఎందుకుండాలి? ఆంధ్రలో అవి విరివిగా ఎందుకు లేవు? “ఇదంతా తెలంగాణలో ’తెలుగు తల్లి’ promotion program కాదా?” అనే తెలంగాణ వాదులకు మీరిచ్చే సమాధానం ఏంటి? తెలంగాణలోని ప్రతి జిల్లాలో ’తెలంగాణ తల్లి’ విగ్రహం పెట్టినా, తెలంగాణ అస్థిత్వాన్ని ప్రచారం చేసినా, ’తెలుగు తల్లి’ ధ్వంసం అయినట్టు మీరెందుకు ఊహించుకొని బాధపడుతున్నారు? ఏం? అదంతా తెలుగులో భాగం కాదా? మీరెందుకు వేరుగా చూస్తున్నారు? మీ ఉద్దేశ్యంలో మీదే తెలుగా? అసలు మీలో తెలంగాణ అస్థిత్వాన్ని కూడా సమ్మిళితం చేసుకోగలిగే సమైక్య భావన లేనందుకు మీరే సిగ్గు పడాలి. 1949కి ముందే మహాకవి దాశరథి “నా ‘తెలంగాణ తల్లి’! కంజాత వల్లి!” అని ధారాళంగా పద్యాలు రాస్తున్న కాలంలో, ఇంకా ’తెలుగు తల్లి’ ప్రస్తావనే రాలేదని గ్రహించండి. 1956 తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక గాని ’తెలుగు తల్లి’ భావనకు రూపకల్పన జరిగింది. అప్పుడు మీరు ‘తెలుగు తల్లి’ని తెచ్చి, ‘తెలంగాణ తల్లి’ని ధ్వంసం చెసారనాలా? అయినా ‘తెలుగు తల్లి’ ఉండగా, ‘తెలంగాణ తల్లి’ ఉండకూడదా? మరి అలాగయితే, ‘భారత మాత’ ఉండగా ‘తెలుగు తల్లి’ విగ్రహం పెడితే ‘భారత మాత’ భావనను ధ్వంసం చేసినట్టు కాదా? అంటే, ‘తెలంగాణ తల్లి’, ‘తెలంగాణ యాస’, ‘తెలంగాణ సంస్కృతి’, చివరకు అప్పట్లో చంద్రబాబు పార్టీలో, ప్రభుత్వంలో నిషేధించినట్టు, ‘తెలంగాణ’ పదమే ఉండకూడదంటారన్న మాట. అవి తెలుగులో ఒక భాగం కాదంటారా? ఆ అస్థిత్వాన్ని తుడిచేసి, మిగిలిన తెలుగే ఉండాలంటారన్న మాట! ఇది ఆధిపత్య ధోరణి, అణచివేత కాదా?
  ఇప్పుడు చెప్పండి … మేము మీపై ద్వేషం కక్కుతున్నామా? మీరు మాపై ద్వేషం కక్కుతున్నారా? ఇప్పుడు ఆలోచించుకోండి … ’సమగ్రమయిన తెలుగు జాతి’ భావనకి మీరు ద్రోహం చేసారా? మేమా?
  అయినా… కేవలం భాషా ప్రతిపదిక పైనే జాతి భావన ఏర్పడాలన్న మీ మూర్ఖపు పట్టు ఏంటి? ఆ లెక్కన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా అన్ని ఒకే దేశంగా ఉండాలి కదా? ఉత్తర భారతమంతా ఒకే రాష్ట్రంగా ఉండాలి కదా?
  అయితే .. గియితే.. మేము రాష్ట్ర ద్రోహులం అని చెప్పుకోడానికి మాకు అభ్యంతరం లేదు. మేమలా మారడానికి సవాలక్ష కారణాలు చూపగలం. కాని ఒక్క విషయం ఆలోచించండి … అసలు అంతా ’భారత జాతి’ అన్న భావనను ధ్వంసం చేసి, తమిళులను వేరుగా చూసి, యావద్దేశంలోనే మొట్టమొదటిసారిగా వేర్పాటువాదాన్ని లేవదీసిన మీరా దేశ ద్రోహులు? మేమా?

 6. Shayi గారూ ! మీరు వ్రాసినవన్నీ చరిత్ర వాస్తవాలకీ, తెలుగుసాహిత్య వాస్తవాలకీ బొత్తిగా సంబంధం లేని అభాండాలూ, అపోహలూ, తెలంగాణవాదులు వాటికి నవీనంగా చెబుతున్న వక్రభాష్యాలూ ! మీరు తెలుగుసాహిత్యంలో ఏం చదివి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఆంధ్రావారు ఎప్పుడూ అననివీ, మనసులో కూడా అనుకోనివీ వారికి ఆపాదించి అన్యాయంగా మాట్లాడుతున్నారు తెలంగాణవాదులు. వారికి తమయందున్న హీనభావనని తీసుకెళ్ళి ఆంధ్రావారికి అంటగడుతున్నారు. నేను తెలుగుసాహిత్యాన్ని చాలాకాలంపాటు దున్నినవాణ్ణి. మీరు వ్రాసినవి టి.ఆర్.ఎస్. పార్టీ ప్రచారం చేసిన భావనలు. వీటిని ప్రచారం చేసినంత సులభం కాదు, నిరూపించడం.

  ఆంధ్రావారి స్థానిక సాహిత్యంలో తెలంగాణవారిని విమర్శిస్తూ గానీ, హేళన చేస్తూ గానీ ఇప్పటిదాకా ఒక్క పుస్తకమూ పేజీ లేదు. ఎక్కడైనా ఉంటే దయచేసి చూపించండి. మేము కూడా తెలుసుకొని పశ్చాత్తాపంతో లెంపలేసుకుంటాం. అసలు తెలంగాణవారు ఎలా ఉంటారో, ఏం మాట్లాడతారో, ఏం తింటారో ఆంధ్రా ఏరియాలో ఎవఱికీ తెలియదు. వాళ్లు తెలంగాణకి రారు. తెలియనివారి గుఱించి ఎవఱూ మాట్లాడరు. అయినా ఈ అసత్యప్రచారాన్ని తెలంగాణవాదులు ఎందుకు తలకెత్తుకున్నారో, ఈ అసత్యాలే పరమసత్యంగా తెలంగాణ అంతటా ఎందుకు ప్రచారంలోకి వచ్చాయో అర్థం కావడం లేదు.

  తెలంగాణతల్లి అనే భావన నిజానికి లేదు. అది ఇటీవలి టి.ఆర్.ఎస్.పార్టీ సృష్టి. మీరు ఉటంకిస్తున్న దాశరథిగారు నాకు స్వయంగా వ్యక్తిగత పరిచయం. ఆయన ఇంటికి నేను తఱచుగా వెళ్ళేవాణ్ణి. ఆ దాశరథిగారే తెలుగువారి సమైక్యాన్ని ఆకాంక్షిస్తూ ’మహాంధ్రోదయం’ అని ఒక కావ్యాన్ని రచించారు. అయినా తెలంగాణతల్లి భావన తప్పని నేను అనలేదు. ఇప్పటిదాకా ఏ సమైక్యవాదీ అనలేదు. ఎందుకంటే భూమిని స్త్రీమూర్తిగా, తల్లిగా గౌరవించడం హిందూ సంస్కృతిలోనే ఉంది. అది తెలంగాణకి పరిమితమైన విషయం కాదు. అయితే భారతమాతలాగే తెలంగాణతల్లి భావనకి సైతం భౌగోళిక పరిమితులున్నాయి. తెలంగాణ అనేది ఒక భూఖండం (tract of land) మాత్రమే. తెలుగుతల్లి భావనకి ఆ పరిమితుల్లేవు. హిందువులకు దేవత అయిన భాషాసరస్వతినే మనం స్థానికంగా తెలుగుతల్లి అంటున్నాం. తెలుగుభాష ఎక్కడ మాట్లాడతారో అక్కడల్లా తెలుగు సరస్వతి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక భూమికి సంబంధించిన భావన (territorial concept) కాదు. భూమికి సంబంధం లేదు కనుక తెలుగుతల్లి రాజకీయ కాన్సెప్టు కాదు. అది intellectual concept. కనుక అది ఎక్కువ inclusive. కానీ తెలుగుతల్లిని రాజకీయాల్లోకి లాగి అవమానించినదెవఱు ? అసహ్యంగా మాట్లాడినదెవఱు ? “తెలంగాణతల్లి విగ్రహాలు పెట్టడం తెలుగుతల్లిని అవమానించడం” అని మేమెప్పుడైనా అన్నామా ? తెలుగుతల్లి విగ్రహాల్ని మొన్న డిసెంబరులో ముక్కలుముక్కలు చేసినదెవఱు ? ఆలోచించండి. బాగా గుర్తుచేసుకోండి. మొదట్నుంచీ రెచ్చగొట్టే మాటలూ, రెచ్చగొట్టే చేష్టలూ చేసేది మీ తెలంగాణవాదులే. రోజూ తిట్టేది మాత్రం సమైక్యవాదుల్ని. ఏం న్యాయం, చెప్పండి !

  ఏరియా మారితే జాతి మారదు. తెలంగాణవారు ఒక ప్రత్యేకజాతి అనడం అర్థం లేని పిచ్చిమాటలు. ఎలా, ఏ విశిష్ట ప్రాతిపదికన ప్రత్యేకజాతి అవుతారో శాస్త్రీయంగా విశదీకరిస్తే బావుంటుంది. మీరు చెప్పే ఆస్ట్రేలియన్లూ, బ్రిటీషువారూ, అమెరికన్లూ ఇప్పుడు వేఱువేఱుదేశాలైనా తామంతా ఒకే జాతి అని వారికి ఎల్లప్పుడూ తెలుసు, వారది ఒప్పుకుంటారు కూడా. అదీ enlightened జాతి లక్షణం. ఒకఱి నుంచి ఒకఱు వేలాది కిలోమీటర్ల దూరంలో వేఱువేఱు ఖండాల్లో నివసిస్తూండడం చేతా, పదుల కోట్లలో జనాభా ఉండడం చేతా వారంతా కలిసి ఒకే దేశంగా ఉండడం వారికి సాధ్యపడదు. That’s plainly understandable. వారు వేఱువేఱు దేశాలుగా ఉంటున్నది తెలంగాణవాదుల మాదిరి ద్వేషం వల్ల కాదు. వారిలా మనం ఉండడం మనకు సాధ్యపడుతుందా ? మనకు అంత జనాభా ఉందా ? మనకు అంత డబ్బుందా ? మనకు అంత భూభాగం ఉందా ? వారికున్న వలసరాజ్యాల నేపథ్యం లాంటిది మన తెలుగువారికుందా ? మనకు ఈ ఆంధ్రప్రదేశ్ భూభాగం కాకుండా ఇంకెక్కడైనా ఒక తెలుగుద్వీపమో, తెలుగు కాంటినెంటో, తెలుగుసామ్రాజ్యమో ఉన్నాయా ? ఎంత చిన్నవాళ్ళం మనమీ ప్రపంచంలో ! ఎంత ఒంటరివాళ్ళం ఈ ప్రపంచంలో ! ఇంత చిన్న, బలహీనజాతి తమలో తాము గుద్దులాడుకోవడం ప్రయోజనదాయకమేనా ? ఎన్నో జిల్లాల్ని కోల్పోయి క్రాపింగ్ చేయబడ్ద మనం ఇప్పటికే సూక్ష్మంగా మారిపోయిన మన జాతిని ప్రత్యేకరాష్ట్రాల పేరుతో ఇంకా ఇంకా సూక్ష్మీకరించుకోవడం తెలివైన పనేనా ? అదీ గాక ఏ జాతికి ఉన్న భూమి, వనరులు, స్థానిక పరిస్థితులూ,అవసరాలూ, చారిత్రిక అనివార్యతలూ ఆ జాతికి ఉంటాయి. దాన్ని బట్టి దాని రాజకీయవ్యవస్థలు కూడా ఉంటాయి. ఇందులో మనం హిందీవాళ్లతోను, ఇంగ్లీషువాళ్ళతోను పోలిక తెచ్చుకునేదేమీ లేదు. ఒకే చొక్కా అందఱికీ నప్పదు.

  తెలుగుతల్లి భావన బ్రిటీషువారి హయాములో వందేమాతరం ఉద్యమకాలంలో 1905 ప్రాంతంలో మొదలయింది. మీరు అనుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత వచ్చినది కాదు. ఆ భావనే తెలంగాణలో కూడా ఆంధ్రమహాసభ ఏర్పడడానికి, శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషానిలయాన్ని సుల్తాన్ బజారులో నెలకొల్పడానికీ దారితీసింది. ఈ విషయమై క్రిందటి శతాబ్దంలో వచ్చిన తెలుగు సాహిత్యాన్ని చదివితే మీకు విషయం తెలుస్తుంది. తెలుగుతల్లి విగ్రహాలు నెలకొల్పడం మాత్రం ఎన్.టి.ఆర్. హయాములో మొదలయింది. మీరనుకుంటున్నట్లు అవి కేవలం ఒక ప్రాంతంలో కాక యావద్ ఆంధ్రప్రదేశ్ లోను నెలకొల్పబడ్డాయి.

  ఆంధ్రావారు ఏం చేసినా తెలంగాణవారిని మాయ చేయడానికే అనే ఈ భ్రాంతిలోంచి బయటపడండి. ఆంధ్రా ఏరియాలో గత శతాబ్దంలో చాలా ఉద్యమాలు వచ్చాయి. అందులో తెలుగు జాతీయతా ఉద్యమం ఒకటి. అది తెలంగాణక్కూడా పాకింది. అందువల్లనే ఈ రాష్ట్రం ఏర్పడింది. ఇందులో తెలంగాణవారు సమానహోదాలో భాగస్వాములుగా ఉంటూ వచ్చారు. ఒకపక్క అన్నిహక్కులూ అనుభవిస్తూ ఆంధ్రావారిని దూషించడం, తమను తాము హీనపఱచుకోవడం సమంజసం కాదు. తెలంగాణ గుఱించి హీనంగా మాట్లాడుతున్నది తెలంగాణవాదులే. ఈ రోజు తెలంగాణ ఉత్పత్తిలోను, సౌకర్యాలలో ఆంధ్రా ఏరియా కంటే చాలా ముందుంది. కానీ ప్రజలు వెనకబడి ఉన్నారు. ఈ వెనకబాటుకు వారి చారిత్రిక నేపథ్యమూ, జీవనవేదాంతమే కారణం. అందుకు ఆంధ్రావారిని నిందించడం సరికాదు. ఆ నేపథ్యం నుంచి బయటపడితే జీవనవేదాంతాన్ని మార్చుకుంటే వారు ఆంధ్రావారితో సమానమౌతారు. కానీ ఆంధ్రావారిని ద్వేషించి వారితో సహవాసాన్ని పోగొట్టుకుంటే ఇదేదీ జఱగదు. ప్రజాస్వామ్యంలో ఎవఱూ ఎవఱినీ పనిగట్టుకొని ఉద్ధరించరు. మనం ప్రయత్నపూర్వకంగా సాధించని సమానత్వాన్ని మనకెవ్వఱూ తెచ్చి ఇవ్వరు. వాస్తవానికి ఆంధ్రావారు ఒక్కొక్కఱూ వ్యక్తిగతంగా మాత్రమే ముందున్నారు. ఒక ప్రాంతంగా చూసుకున్నప్పుడు ఉత్పత్తిలోను, సౌకర్యాలలోను తెలంగాణ కంటే చాలా వెనకబడి ఉన్నారు.

  నియంతృత్వాల్లోను, రాజఱికాల్లోను రాజ్యానికి జీవితబీమా అవసరం లేదు. ఆయా నాయకుల సైనిక, ఆయుధబలమే వాటికి జీవితబీమా. కానీ ప్రజల అభీష్టంతో ఏర్పడే రాజ్యాలకు జీవితబీమా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో జఱుగుతున్నట్లు సదరు రాజ్యం మీద దుష్ప్రచారం చేసి దాన్ని కూలగొట్టి తమ సొంత రాజ్యాల్ని స్థాపించడానికి జాతిద్రోహులు ఎల్లప్పుడూ సిద్ధంగా కాచుకొని కూర్చుంటారు కనుక. అందువల్లనే ప్రత్యేక దేశాల కోసం డిమాండు చేసేవారిని జాతిద్రోహులుగా పరిగణిస్తూ ఈనాడు ప్రతి దేశంలోను చట్టాలున్నాయి. మన దేశంలో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రాంత మంత్రులడిగినది – రాష్టాల ప్రాదేశిక సమగ్రతని కాపాడడం కోసం ఆ చట్టాల పరిధిని ఇంకాస్త విస్తరించమని ! అందులో అనౌచిత్యమేమీ లేదు. ఱేపు తెలంగాణ ఏర్పడితే దానికి మాత్రం అలాంటి చట్టాల రూపంలో జీవితబీమా అవసరం లేదా ? అప్పుడు కేసీయార్ లాగే ఒకడు లేచి తనకు ఉత్తర తెలంగాణ కావాలని డిమాండు చేస్తే మీరొప్పుకుంటారా ? లేక అడిగినవాడికల్లా లేదనకుండా రాజకీయ భూభాగాల్ని పంచి ఇస్తూ రాష్ట్రాల్ని ప్రకటిస్తూ పోతారా ? ఆలోచించండి.

 7. మన చర్చ సంగతెలా ఉన్నా ఆంధ్రమంత్రులు ఇంత మాటన్నారంటే తెలంగాణ రావడం చాలా కష్టమేమో అనిపిస్తోంది. వాళ్లు తప్పకుండా దాన్ని భవిష్యత్తులో ఒక చట్టంగా తీసుకొస్తారు. దేవుడు మేల్జేసి ఈ అంతర్లీన మెసేజి, ఈ కఠోరసత్యం తెలంగాణలో మఱిన్ని హత్యల్నీ, ఆత్మహత్యల్నీ ప్రేరేపించకుండు గాక.

 8. shayi says:

  తాడేపల్లి గారు!
  చరిత్ర వాస్తవాలకీ, తెలుగుసాహిత్య వాస్తవాలకీ బొత్తిగా సంబంధం లేని అభాండాలూ, అపోహలూ, వక్రభాష్యాలు ఎవరివో మీ సమాధానం చూస్తేనే అర్థమవుతుంది. తొలి తెలుగు సమ్రాజ్యాన్ని, అటుపై దక్షిణ దేశంలో తొలి మహారాణిని, తొలిసారి దేశి కవిత్వాన్ని, జాను తెనుగు సొబగులను, ఆ పైన తొలి అచ్చతెనుగు కావ్యాన్ని, తొలి యక్షగాన కావ్యాన్ని, ఇంకా స్వాతంత్ర్యానంతరం, తెలుగులో తొలి కేంద్ర సాహిత్య అకాడమి విజేతను, సినిమాల్లో తొట్ట తొలి గీత రచయితను, ఉద్యమాల్లో తొలి విప్లవ గీతరచయితను, మరింకా దేశానికే తొలి తెలుగు ప్రధానిని, ప్రపంచానికే తొలి మిమిక్రీ కళాకారుణ్ణి, … ఇలా ఎందరో ఆద్యులను, మహానుభావులను అందించిన తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రజలు తమను తామే హీనపరచుకొంటున్నారనడం హాస్యాస్పదం. ఆంధ్రా వారికి ఏదో అంటగట్టాల్సిన ఖర్మ తెలంగాణ వాళ్ళకు లేదు. ఆంధ్రావాళ్ళే తమ ఆధిపత్యాన్ని కుయుక్తులను ప్రయోగించి తెలంగాణ వాళ్ళను అవమానిస్తుంటారు. అలా అని అందరు ఆంధ్రావాళ్ళు నూటికి నూరు శాతం అలాంటివారే అని ఎవరూ అనలేదు. మెజారిటీ మాత్రం తెలంగాణ వాళ్ళను గాయపరచిన వారే. తెలంగాణలో ఒక్కొక్క గుండెను తట్టి చూడండి. చిన్నప్పటి నుండి తాము పడ్డ అవమానాలు, మోసాల పరంపరలను కథలుగా చెప్పి మౌనంగా రోదిస్తారు. ఇదంతా నిత్య జీవితంలో విషయమయితే, సాహిత్యంలో ఒక్క పేజీ చూపమనడం చూస్తే … నాకు నవ్వొస్తుంది. ఇంకా ఈ వ్యవహారం సాహిత్యంలో కూడా ప్రవేశించాలా మహాశయా? అయినా .. మీరడిగింది ఒక్కటంటే ఒక్క పేజీయే కదా! ఆ ముచ్చట కూడా తీర్చుకోవాలంటే, ’గోల్కొండ కవుల సంచిక’ గ్రంథంలోని ఉపోద్ఘాతం చదవండి. ఆనాటి ముడుంబై వారి ఘనకార్యానికి లెంపలు వేసుకొంటారో, దుంపలు తెంచుకొంటారో మీరే చెప్పాలి.
  మీరు తెలుగుసాహిత్యాన్నిఏపాటి దున్నారో గాని, ’అగ్నిధార’, ’రుద్ర వీణ’ చదివి ఉంటే, “తెలంగాణతల్లి అనే భావన నిజానికి లేదు” అనలేరు. అలాంటి భావన భూభాగాలకే ఉంటాయి. కాని భాషాపరంగా ఎక్కడా కనిపించదు. అయినా మేము అలా ఉండకూడదని కూడా అనడం లేదు. ఏదైనా భావనే. దానికి నా భావన మాత్రం కరెక్ట్, మీ భావన తప్పు అనడం మూర్ఖత్వం. “తెలంగాణతల్లి విగ్రహాలు పెట్టడం తెలుగుతల్లిని అవమానించడం అని మేమెప్పుడైనా అన్నామా ?”
  అని తప్పించుకోడం బాగాలేదు. ఇలాంటి విషయాలు మీరో వర్గానికి, నేనో వర్గానికి ప్రతినిధులుగా చేసే చర్చలు. అంతే గాని వ్యక్తిగతం కాదు. అలా అన్నవాళ్ళని గురించి వాకబు చేయండి. ఆ మాటకి వస్తే .. ఒకటో, అరో తెలుగుతల్లి విగ్రహం ఎవరైనా పగులగొడితే .. అది నేను పగులగొట్టానా?… అని నేను అనవచ్చా? మీ చర్చ చిన్న పిల్లల మాటల్లా ఉన్నాయి.
  ” తెలుగుతల్లి భావన బ్రిటీషువారి హయాములో వందేమాతరం ఉద్యమకాలంలో 1905 ప్రాంతంలో మొదలయింది.తెలుగుతల్లి విగ్రహాలు నెలకొల్పడం మాత్రం ఎన్.టి.ఆర్. హయాములో మొదలయింది. ” అన్నారు.
  మరి తెలంగాణ తల్లి భావన కూడా ఎప్పుడొ 70,80 ఏళ్ళ కింద పుట్టి, విగ్రహాలు నెలకొల్పడం మాత్రం KCR హయాంలో ప్రారంభమయింది. తెలుగు తెల్లి విషయంలో digest అయిన సంగతి తెలంగాణ తెల్లి విషయంలో digest ఎందుకు కావడం లేదు?
  ” … ఈ రాష్ట్రం ఏర్పడింది. ఇందులో తెలంగాణవారు సమానహోదాలో భాగస్వాములుగా ఉంటూ వచ్చారు. ఒకపక్క అన్నిహక్కులూ అనుభవిస్తూ … ” అంటూ మళ్ళీ అమాయకత్వం నటిస్తూ, అన్యాయమేమీ జరగలేదని అసత్యాలు వల్లిస్తున్నారు. ఈ దొంగ మాటలు ఇంకెన్నాళ్ళులెండి. మరో నాలుగు నెలలు. ఆ పైన శ్రీకృష్ణ కమిటీ ఎలాగు తేలుస్తుంది. మీరు చేసిన అన్యాయాల చిట్టా ఒక శాశ్వత document గా నిలిచిపోతుంది.
  మా ’జీవన వేదాంతం’ మాకు ఉండనివ్వండి. మీతో కలిసి ఉండడం ఎందుకు? మీతో పోటీ పడెందుకు మా విలువలను మంట గలిపి మేము స్వార్థం, స్వలాభం కోసం కుయుక్తులు నేర్చుకోడం ఎందుకు? ఇప్పటికే మా పిల్లలు చెడిపోతున్నారు. పక్కవాడికి సాయం చేయాలంటే “ముందు మాకేంటి?” అని ఆలోచిస్తున్నారు.
  మాకు రాష్ట్రమంటే ఒక మానసిక బాంధవ్యం. మీకు ’జీవిత భీమ’ … ఎంత ప్రీమియం కడితే, ఎంత రిటర్న్స్ పొందొచ్చనే వ్యాపారం. మీకు, మాకు కుదరదండి.

 9. sravan says:

  ఇక్కడ 3 విషయాలున్నయండి. 1. రాజకీయ నేతలు సమస్యలు సృష్టిస్తున్నారు తప్ప పరిష్కారం ఆలోచించట్లేదు. 2. ఏ ప్రాంతమైనా విడిపోవాలని ఎప్పుడు కోరుతుంది??? వివక్ష వున్నప్పుడో అసమానతలను చూపుతున్నప్పుడో లేక బాగా అభివృద్ధి చెందినప్పుడో !!! అంతే కాని తిన్నది అరక్క కాదు. ఏమీ తోచక కాదు. బాగా అభివృద్ధి చెందినది కేవలం హైద్రాబాదు మాత్రమే. హైద్రాబాద్ లొ అన్ని ప్రాంతాల ప్రజలూ వున్నారు. వారిని ఏమీ తెలంగాణా వదిలి వెళ్ళమని చెప్పలేదే? 3. ఇక్కడ పరిపాలన పరముగానే విడిపోవాలని ప్రాంతీయ ప్రజల కోరిక. అంతే కాని తెలుగు ప్రజలుగా కాదు.
  ఇవన్నీ కాదు కాని ఒక్క మాట! కేవలం ఇంట్లో వాళ్ళనే ఉమ్మ వుంచలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఉమ్మద్డి గా ఎలా కోరుథున్నారు??

 10. పచ్చకామెర్ల రోగికి ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుంది. తమలో ప్రాంతీయ సంకుచితత్వం ఉంది కనుక అందరికీ అదే ఉందనుకుంటారు తెలంగాణవాదులు. తాము ఒక సమాచారమూ, తర్కమూ, హేతువూ ఏమీ లేకుండా ప్రతిదాన్నీ ప్రాంతీయ రంగుటద్దాలలోంచి చూస్తారు కనుక అందరూ అలాగే చూడాలనీ, చూస్తారనీ అనుకుంటారు. నాకు తెలిసి ఆంధ్రవారిలో ప్రాంతీయ సెంటిమెంట్లు లేవు. వారికి ఇంగ్లీషు రాకపోయినా వారి జీవనశైలి దృష్ట్యా, ఆచరణలోను, ఆదర్శాలలోను అదొక ఒక కాస్మోపాలిటన్ ఆలోచనలున్న జనాభా. వారికి భూమిపరమైన అటాచిమెంటు చాలా తక్కువ. ఎక్కడైనా బతకడానికి సిద్ధపడతారు. అవసరమైతే ఎక్కడకైనా వెళతారు. అలాగే ఎవరినైనా రానిస్తారు, ఆదరిస్తారు. వారు ఒకప్పుడు బర్మాలోను, ఉగాండా (ఆఫ్రికా) లోను కూడా లక్షలాది ఎకరాల భూములు కొన్నారు. కనుక ప్రాంతీయ ప్రాతిపదిక మీద వారు తెలంగాణ మీద ఏదో చిన్నచూపు చూశారని ఆరోపిస్తే ఆంధ్రా ఏరియా గుఱించి బాగా తెలిసినవారి దృష్టిలో అది నమ్మలేని విషయం. అయినా నేనడిగిన ఆధారాలు మీరెక్కడ చూపించారు ? ఎవఱైనా తెలంగాణ అనభివృద్ధికి కారణమైన అంతర్గత లోపాల్ని ప్రస్తావిస్తే వారు తెలంగాణకి శత్రువులనే మీ లెక్క. ఇవి సరిదిద్దితే బావుంటుందనేది మీ దృష్టిలో తెలంగాణని హీనపఱచడం. ఇహ మిమ్మల్ని ఒప్పించే అవకాశాన్ని మీరు ఇతరులకి ఎక్కడిస్తున్నట్లు ?

  కొందరి అవకాశవాదం, మరికొందరి ఆత్మన్యూనతాభావమూ, అసూయ, ఇంకొందరి గతకాలభ్రమ, పెక్కురి అజ్ఞానం, పలువురి అమాయకత్వం – ఇదే ఈ తెలంగాణవాదానికి పెట్టుబడి. అందుకే ఇలాంటి వాదాలు తెలంగాణలో మాత్రమే చెలామణి అవుతున్నాయి, తెలంగాణలో ఉన్నాయని చెప్పబడుతున్న సమస్యలు నిజానికి అన్ని ప్రాంతాలకూ ఉన్నప్పటికీ ! వీటిని ఇంకే ప్రాంతంలోను చెలామణి చేయలేం. అందుకే అక్కడ ఇలాంటి ఉద్యమాలూ, ఉద్యమనాయకులూ లేరు. అసత్యాలతోను, అర్ధసత్యాలతోను, వక్రభాష్యాలతోను ఒక వాదాన్ని అమాయక ప్రజల్లో నమ్మించవచ్చు. కానీ వాటితో ఒక రాజ్యాన్ని మటుకు మీరెప్పటికీ నిర్మించలేరు. పొఱపాటున నిర్మించినా నిలబెట్టలేరు. తెలంగాణలో ప్రజలు ప్రత్యేకరాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, అదే ఆ వాదానికున్న సమర్థనకి నిదర్శనమనీ మురిసిపోతున్నారు. ఆ ప్రజలు అమాయకులు. వారు జీవితంలో ఎన్నడూ ఈ విషయాల గురించి లోతుగా ఆలోచించినవారు కారు. వారెప్పుడూ ఆంధ్రప్రాంతీయులతో కలిసి జీవించినవారు కారు. వారి దగ్గఱున్న డాటా టి.ఆర్.ఎస్. పార్టీ సప్లై చేసినటువంటిది. వారికి రెండో పార్శ్వం తెలియదు. వారు కేవలం టి.ఆర్.ఎస్. వాగ్దానాలకూ (మనిషికి అయిదెకరాలు), ప్రచారానికీ (మనల్ని బలవంతంగా ఆంధ్రాలో కలిపారు, పదిలక్షల ఉద్యోగాలు etc.) మోసపోతున్న పిచ్చిఅమాయకులు మాత్రమే. అలాంటి అమాయకుల చేత, పిచ్చివారి చేత హత్యలూ, ఆత్మహత్యలూ చేయించడం పెద్ద కష్టం కాదు. కానీ తెలంగాణ ఇంకా ఇంకా ఆధునికం అయిన కొద్దీ, తెలంగాణ ప్రజల మొబిలిటీ (చలనశీలత) ఇప్పటికంటే ఇంకా మెఱుగైనకొద్దీ ఈ ప్రచారాలలోని అవాస్తవికతని, అసంబద్ధతనీ వారు తప్పకుండా గ్రహిస్తారు. నిజం నిప్పులాంటిది, నిలకడ మీదనే తెలుస్తుంది. కాబట్టే ఈస్ట్ జర్మనీ కూడా మఱల వెస్ట్ జర్మనీతో కలిసిపోవడానికి తహతహలాడింది. అంతకుముందు ఈస్ట్ జర్మనీ నాయకులు వెస్ట్ జర్మనీ మీద ప్రచారం చేసినవన్నీ వట్టి అవాకులూ, చెవాకులని అక్కడి ప్రజలు గ్రహించారు. అదే విధంగా తెలంగాణ ప్రజలు ఆంధ్రావారిలాగే చదువుకుంటున్నకొద్దీ వారు కూడా ముమ్మూర్తులా ఆంధ్రావారికి అచ్చమైన ప్రతిబింబాలుగా మారతారు. అప్పుడీ తెలంగాణవాదం తప్పనిసరిగా బోనెక్కించబడుతుందని, అటుపిమ్మట అటకెక్కించబడుతుందనీ మర్చిపోకండి.

  శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక తెలంగాణకి పూర్తి అనుకూలంగా నివేదిక రాస్తుందని మీరు భావిస్తున్నట్లున్నారు . మనిషన్నాక ఆ మాత్రం ఆశావాదం తప్పకుండా ఉండాలి. కానీ ఆ కమిటీ యొక్క అసలు ప్రయోజనం వేఱు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే కమిటీ లేకుండానే ఇవ్వొచ్చు. నా అంచనాలో – తెలంగాణని ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పఱుస్తూ భారత పేఱోలగంలో ఒక బిల్లుని అఖండ మెజారిటీతో నెగ్గించినా కూడా ఆచరణలో అది ఏర్పడడం కష్టం. ఎందుకు ? అనడిగితే, సారీ, ప్రస్తుతం నేనేమీ చెప్పదల్చుకోలేదు.

 11. sravan says:

  పైన పేర్కొన్న చివరి స్టేట్ మెంట్ లో చిన్న సవరణ : ” ” కేవలం ఇంట్లో వాళ్ళనే ఉమ్మడిగా వుంచలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఎలా కోరుతున్నారు?? ” “

 12. shayi says:

  @ తాడేపల్లి
  వాదించడం చేతకాకపోయేసరికి ఒక సామెత ఆసరా తీసుకోడం, ప్రతివాదులను అజ్ఞానం ..అసత్యాలు .. వక్రభాష్యాలని నిందించడం ఆంధ్రావాళ్ళకు అలవాటే.
  “ఆంధ్రావాళ్ళు ఎంతో ప్రతిభావంతులు, తెలంగాణవాళ్ళు వాళ్ళతో పోటీపడలేక ఆత్మ న్యూనతతో వేర్పాటు కోరుతున్నారు.. కాని కలసి ఉంటే కలదు సుఖం … తెలంగాణవాళ్ళూ కొద్దికొద్దిగా అభివృద్ధి చెంది కొన్నాళ్ళకు పరిపక్వత చెంది ఆంధ్రావాళ్ళుగా లేదా వాళ్ళకు సమానంగా తయారవుతారు. అప్పుడు వేర్పాటు తప్పని తెలుసుకొంటారు. ఈలోగా వేర్పాటు కోసం ఎంత ప్రయత్నించినా ఆంధ్రావాళ్ళ తెలివితేటలముందు అవేం పనిచేయవు” వంటి భావాలతో మీలాంటివాళ్ళ మెదళ్ళు పూర్తిగా మురిగిపోయాయి.
  ఇలాంటి అహంకార ఆభిజాత్య ధోరణి చరిత్రలో ఇదే మొదలా ఏంటి? రావణాసురుని చూడలేదా? దుర్యోధనుని చూడలేదా? బ్రిటిష్ వాణ్ణి చూడలేదా? నిజాంను చూడలేదా? అంతెందుకు … మొన్నే కదా! ” 45 సీట్లలో పోటీ చేసి 10 సీట్లలో గెలిచారు… ఎక్కడ పెట్టుకొంటావ్ రాజేందర్! నీ తలకాయ? ” అని అసెంబ్లీలో అహంకరించి, ప్రతి తెలంగాణ గుండెను గాయపరచి అవమానించిన నాయకుడు మూడు నెలలలోపే తలకాయ ఎక్కడొ, మొండెం ఎక్కడొ తెలియని స్థితిలో దుర్మరణం చెందాడు. కాబట్టి మీ భ్రమలో మీరు మునిగిపోదురు గాక !
  మేము నమ్మేది, చరిత్ర మాకు నేర్పింది మాత్రం .. ” సత్యమేవ జయతే ! ధర్మమేవ జయతే !! “

  • kiran says:

   సత్యమేవ జయతే ! ధర్మమేవ జయతే !! అందరూ కోరేది ఇదే

 13. Pingback: 2010 in review « KadaliTaraga : a wave in the Ocean !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s