గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయవచ్చా?

ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ ఆగస్ట్ 16, 2010

“ఆజాద్ ఎన్ కౌంటర్ బూటకం కాదు” అని ఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ అన్నారని చదివినప్పుడు గవర్నర్ విధులూ అధికారాలూ ఏమిటని మరొకసారి అనుమానం కలిగింది. “ఆజాద్ ది బూటకపు ఎన్ కౌంటర్ అంటూ పలు పౌర సంఘాలు చేస్తున్న ఆరోపణలను గవర్నర్ కొట్టిపారేశారు. అలా అని తాను అనుకోవడం లేదని, పోలీసు ఆపరేషన్ లో భాగంగానే ఆజాద్ మరణించారని చెప్పారు. నక్సల్స్ ను ఎదుర్కోవడానికి రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ ఉందన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య అదుపులోనే ఉందని, ఇటీవల రెండు, మూడు సందర్భాల్లో నక్సల్స్ పై పోలీసులు పైచేయి సాధించారని చెప్పారు. అయినా, నిరంతరం నిఘాపెట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నక్సల్స్ వ్యతిరేక బలగాలు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లడానికి సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే అక్కడ రోడ్లు, సెల్ టవర్ల నిర్మాణానికి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే విశాఖపట్నంను నక్సల్ ప్రభావిత జిల్లాల జాబితాలో చేర్చాలని కూడ కేంద్రాన్ని కోరానని చెప్పారు” అనే వార్త చదివితే అక్కడ మాట్లాడుతున్నది రాష్ట్ర డిజిపినో, పోలీసు మంత్రో అనిపిస్తుంది గాని గవర్నర్ అనిపించదు. మన పాలనా వ్యవస్థల దిగజారుడు చివరికిక్కడికి చేరిందన్నమాట.

నిజానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆ అధికారం చేపట్టిన తరువాత సాగిన ఎనిమిది నెలల కాలంలోనూ ఆయన తన పదవికి తగని, తన పరిధిలోకి రాని అనేక విషయాల మీద వ్యాఖ్యానించారు. సాధారణంగా పాలకులు, ప్రత్యేకించి ప్రజల మీద అంతులేని అధికారం ఉన్నదని అనుకునే పోలీసులు, ఆధిపత్య శక్తులు మాట్లాడినట్టు మాట్లాడారు. ఈ రాష్ట్రంలోనే ఐపిఎస్ అధికారిగా నాలుగు దశాబ్దాల కింద ఉద్యోగ జీవితం ప్రారంభించి దేశాన్నంతా నిఘా కళ్లతో పరీక్షించే ఇంటిలిజెన్స్ బ్యూరో అత్యున్నత స్థానం దాకా ఎదిగిన శ్రీమాన్ ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ గారికి ఇంకా ఆ అధికార స్వభావం వదిలినట్టులేదు.

ఎన్నికైన “ప్రజాప్రతినిధుల”నూ, మంత్రులనూ, ముఖ్యమంత్రినీ పక్కన పెట్టి వారి శాఖా వ్యవహారాలపై వ్యాఖ్యానించడం ఈ ఎనిమిది నెలలలో గవర్నర్ చాలసార్లు చేశారు. ఆ శాసనసభ్యులూ మంత్రులూ ముఖ్యమంత్రీ కూడ తమ వ్యవహారాలలో గవర్నర్ జోక్యాన్ని అడ్డుకునే చిన్నమెత్తు నిరసన ప్రకటన చేయలేదు సరిగదా, తమ మధ్య తగాదాలనూ రాజభవన్ కే నివేదించుకోవాలనుకున్నారు. చివరికి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రానికి ప్రాజెక్టులు తేవడం మీద గవర్నర్ శ్రద్ధాసక్తులను ఒక వేదిక మీద ముఖ్యమంత్రి స్వయంగా పొగిడారు. కేంద్రప్రభుత్వం తరఫున బలవంతంగా రాష్ట్రాల మీద రుద్దబడే గవర్నర్ పదవి అసలు ఈ దేశ సమాఖ్య స్వభావానికే భంగకరమైనదని, దాన్ని రద్దు చేయాలని చర్చ జరిగిన 1980 దశకం గుర్తుకొస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. నిత్యజీవిత పాలనా వ్యవహారాలలో గవర్నర్ జోక్యం ఎంత పరిమితంగా ఉంటే అంత మంచిదని దేశంలో గత మూడు దశాబ్దాలుగా తీవ్రంగా చర్చలు జరిగాయి. ఆ నేపథ్యంలో ఒక గవర్నర్ కు ఇటువంటి లేని అధికారాలను కట్టబెట్టడం గాని, స్వాధీనం చేసుకోవడం గాని ఎటునుంచి ఎటుజరిగినా ప్రజాస్వామ్యలేమినీ, పాలనావ్యవస్థల విధ్వంసాన్నీ సూచిస్తాయి.

గవర్నర్ వ్యక్తిగత స్థాయిలో కూడ తాను నిర్వహిస్తున్న పదవి ఆశించే హుందాతనాన్ని చూపని ఉదంతం కూడ ఒకటి ఉంది. ఆయన గవర్నర్ అయ్యాక విపరీతంగా దేవాలయాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్తున్నారు. అక్కడ బహిరంగంగా తన మత విశ్వాసాలను ప్రకటిస్తున్నారు. ఒక లౌకిక, ప్రజాస్వామిక రాజ్యాంగ అధికారం నిర్వహించే వ్యక్తి అటువంటి పనులు చేయవచ్చునా అనే మౌలిక ప్రశ్న దాక కూడ పోనక్కరలేదు. అలా వెళుతున్నపుడు ఆయన వ్యక్తిగత హోదాలో వెళుతున్నారా, అధికారిక హోదాలో వెళుతున్నారా, అధికారిక హోదాలో వెళుతున్నట్టయితే ఆ ప్రయాణాలకూ, అక్కడ వసతి సౌకర్యాలకూ ఎంత ప్రజాధనం ఖర్చవుతున్నదో వివరాలున్నాయా అని సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు పిటిషన్ వేశారట. దానితో కోపం వచ్చిన గవర్నర్ కనీసం రెండు బహిరంగ సమావేశాల్లో సమాచారహక్కు చట్టం గురించి వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా మాట్లాడారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. గవర్నర్ వంటి చట్టబద్ధ, బాధ్యతాయుత పదవిలో ఉంటూ సమాచార హక్కు చట్టం వంటి ముఖ్యమైన ప్రజోపయోగకర చట్టాన్ని విమర్శించడం, గేలి చేయడం విచారకరం.

అలాగే, ఈ ఢిల్లీ పర్యటన సందర్భంగానే ఆయన జగన్ యాత్ర వల్ల ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తదని కూడ అన్నారు. జగన్ యాత్ర శాంతి భద్రతల సమస్య అవుతుందా కాదా అనే విషయం ప్రత్యక్షంగా గవర్నర్ పరిధిలోని విషయం కాదు. దానిమీద ఆయన మాట్లాడనక్కరలేదు. రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం రద్దయి, రాష్ట్రపతి పాలన నెలకొన్నప్పుడు మాత్రమే అటువంటి సమస్యలు గవర్నర్ అధికార పరిధిలోకి వస్తాయి గాని ప్రస్తుతానికైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేదు.

“వేర్పాటు వాదులంతా దేశద్రోహులంటూ సీమాంధ్ర మంత్రులు శ్రీకృష్ణ కమిటీకి చెప్పారంటూ వచ్చిన వార్తలపై కూడ గవర్నర్ స్పందించారు. సీమాంధ్ర మంత్రులు ఎవరినీ దేశద్రోహులని చెప్పలేదని, ఈ విషయాన్ని సీఎం రోశయ్య కూడా స్పష్టం చేశారని అన్నారు. దేశద్రోహులంటూ సీమాంధ్ర మంత్రులు వ్యాఖ్యానించారని చెప్పడం కేవలం కొంతమంది ఊహాజనితమని గవర్నర్ అన్నారు” అని పత్రికలు రాశాయి.

కోస్తాంధ్ర, రాయలసీమ మంత్రులు శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదిక గురించి వారి తరఫున వకాల్తా పుచ్చుకోవలసిన, సమర్థించవలసిన అవసరం గాని, అధికారం గాని గవర్నర్ కు లేవు. పైగా అలా అనవసరపు వకాల్తా పుచ్చుకుని ఆయన చేసిన వ్యాఖ్యానం పూర్తిగా సత్యదూరం. మంత్రుల నివేదికలో, 23వ పేజీలో, రాష్ట్రవిభజన కోరడం దేశద్రోహమని అక్షరాలా రాసి ఉంది. అలా లేదని దేశ రాజధానిలో పత్రికలవారితో గవర్నర్ చెప్పడం ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడమే.

ముందే చెప్పినట్టు అసలు రాష్ట్రాలకు గవర్నర్ పదవి ఎందుకు అనే చర్చ చాల కాలంగానే ఉంది. ఎన్నికైన ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఉండగా రాజ్యాధినేతగా గవర్నర్ అనే పదవి అవసరమా లేదా, ఒకవేళ ఉన్నా అది ఎన్నికల ద్వారా జరగాలా, పైనుంచి నియామకం ద్వారా జరగాలా అని రాజ్యాంగ నిర్ణయ సభలో చాల చర్చ జరిగింది. అటూ ఇటూ చాల వాదనలు నడిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఉండాలని, అయితే గవర్నర్ ఎంపిక మాత్రం పరోక్ష ఎన్నికల ద్వారా కూడ కాక, నియామకం ద్వారా జరగాలని నిర్ణయించారు. కేంద్రప్రభుత్వ సలహాపై రాష్ట్రపతి ఈ నియామకం చేయాలని నిర్దేశించారు. ఈ పదవికి ఉండే విధులూ బాధ్యతలూ రాజ్యాంగంలోనే స్పష్టంగా నిర్దేశించకుండా ఉండిపోయారు. పాత సంస్థానాధీశులను రాజ ప్రముఖ్ లు గా గుర్తించిన 1956 వరకూ గవర్నర్ లనూ రాజప్రముఖ్ లనూ సమానంగా చూశారంటే ఈ పదవి కేవలం రాచరిక అవశేషంగా, పాత ఆధిపతుల హోదాలనూ అధికారాలనూ కొనసాగించేదిగా మాత్రమే ఉండిపోయింది.

ఎవరిని ఎలా నియమించాలనే స్పష్టమైన నిబంధనలు లేవు గనుక ఆశ్రితులను, రాష్ట్రాలలో తమ ప్రయోజనాలను రక్షించేవారినీ గవర్నర్లుగా పంపించడం ఢిల్లీ పాలకుల వ్యూహం అయిపోయింది. అందుకే 1950లలో తమిళనాట ద్రవిడ ఉద్యమంలో భాగంగా వేసిన నాటకాలలో నటుడు ఎం ఆర్ రాధా “కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మంత్రి అవుతాడు, ఓడిపోతే గవర్నర్ అవుతాడు” అని పరిహాసం ఆడేవారని కన్నబిరాన్ రాశారు. కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ ఒకేపార్టీ పాలన సాగినన్ని రోజులూ ఈ గవర్నర్ల పాలన బాగానే సాగింది. కాని భిన్నమైన పార్టీల పాలన ఉన్నప్పుడు, రాష్ట్రాలలో ప్రజా ఉద్యమాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరి తీసుకున్నప్పుడు గవర్నర్లు కేంద్రం ఏజెంట్లుగా మారిపోయారు. కేరళతో 1959లో ప్రారంభించి డజన్లకొద్దీ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలో గవర్నర్ల నివేదికలే ప్రాతిపదికలు గనుక రాష్ట్రాలలో గవర్నర్ల పాత్ర సందేహాస్పదం అయింది. రాష్ట్ర పాలకపార్టీకీ, కేంద్రం పంపించిన గవర్నర్లకూ మధ్య ఘర్షణకు మనరాష్ట్రంలో 1984లో రాంలాల్ తొలగింపు నుంచి నందిగ్రామ్ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వానికీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీకీ, ఇటీవల గాలి జనార్దనరెడ్డి అక్రమాల మీద కర్ణాటక ప్రభుత్వానికీ గవర్నర్ ఎచ్ ఆర్ భరద్వాజ్ కూ జరిగిన వివాదం దాకా ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి. 1980లలో కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా గవర్నర్లను మార్చే సంప్రదాయం మొదలయి ఆ పదవి అంతరార్థం ఏమిటో అందరికీ అర్థమయ్యేటట్టు చేసింది. అందుకే అసలు గవర్నర్ పదవే బూటకమనీ, దాన్ని రద్దు చేయాలనీ, గవర్నర్లను వెనక్కి పిలవాలనీ అనేక డిమాండ్లు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యం వల్లా, తాను ఆ పదవిలోకి వచ్చిన ప్రత్యేక, అసాధారణ స్థితి వల్లా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎక్కువ బాధ్యతాయుతంగా, చట్టబద్ధంగా పనిచేయవలసిన అవసరం ఉండింది. రాష్ట్ర చరిత్రలోని మహా సంక్షుబిత, వివాదాస్పద కాలంలో ఆయన ఆ పదవి చేపట్టారు. ఆయన ఆ పదవిలోకి రావడానికి ముందు ఉన్న నేపథ్యాన్ని చూస్తే కనీసం మూడు ముఖ్యమైన సూచికలు ఉన్నాయి. ఒకటి, అంతకు ముందరి గవర్నర్ అగౌరవంగా దిగిపోవలసి వచ్చింది గనుక ఆ పదవీ గౌరవాన్ని ఇనుమడింపజేసే బాధ్యత కొత్త గవర్నర్ మీద ఉండింది. రెండు, ఆయన పదవి స్వీకరించే నాటికి సరిగ్గా నెలరోజులుగా రాష్ట్రంలో ఒక విస్తృత ప్రజా ఉద్యమం నడుస్తున్నది. ఆ ప్రజా ఉద్యమాన్ని సరిగా అర్థం చేసుకుని దాన్ని పరిష్కరించే మార్గాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సూచించే బాధ్యత ఆయన మీద ఉండింది. మూడు, అప్పటికి రాష్ట్ర పాలకపార్టీలో ముఠా తగాదాల వల్ల పాలన అరకొరగా, అస్తవ్యస్తంగా సాగుతున్నది. రాజ్యాంగబద్ధ అధిపతిగా ఆ గందరగోళాన్ని సవరించవలసిన బాధ్యత ఆయనపై ఉండింది. ఆ మూడు పనులూ ఆయన చేయలేకపోవడం, సరిగా చేయలేకపోవడం, ఆ పనులు చేస్తున్నానుకుని అందుకు విరుద్ధమైన పనులు చేయడం విచారకరం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra. Bookmark the permalink.

6 Responses to గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయవచ్చా?

 1. sri says:

  వేణు గోపాల్ గారు,
  ఆయన వెళ్ళింది ఆంధ్రాలో ఉన్న దేవాలయాలకు గాని, మిగతా ఉన్నత పదవులలో ఉన్న వారిలా ప్రపంచ దేశాలను చుట్టటానికి బయలుదేర లేదు కదా. ఇలా ప్రతిదానిని మీరు విమర్శించటం మొదలుపేడితే మీ మీద ఉన్న గౌరవం కూడా పోగొట్టుకుంటారు. లౌకిక పదాన్ని ఉపయోగించి విమర్సించే మీరు ఈ దేశం లో లౌకిక వాదం మేజారిటి ప్రజల భావాలను అణగదొక్కడానికి మీ లాంటి వారు దుర్వినియోగ పరుస్తున్నారు. దానిని విచక్షణ ఉన్న, చదువుకున్న ప్రజలందరూ ఎప్పుడొ గుర్తించారు. మీలాంటి వారు గవర్నర్ దేవాలయాలకు పోవటం తప్పులా చిత్రికరించటం ఎమీ బాగా లేదు.

 2. Hateweb says:

  నాయకులు ఇఫ్తార్ విందులివ్వడాన్ని మీరు విమర్శించడం లేదేం ? గవర్నర్ ఆధికారికంగా నాస్తికుడిలా ప్రవర్తించాలని భారతరాజ్యాంగం చెబుతోందా ? గవర్నర్ కూడా మనిషి కాదా ? అతనికొక వ్యక్తిగత జీవితం, అందులో మతం, మతవిశ్వాసం ఏమీ ఉండకూడదా ? మతాన్ని ఆధికారికంగా గుర్తించి ఆ మతప్రాతిపదికన రిజర్వేషన్లని కూడా కల్పించిన రాష్ట్రమిది అని మర్చిపోయారా ? మఱి గవర్నర్ ఎక్కడికెళ్ళినా భార్యని కూడా వెంట తీసుకెళుతున్నారు. అంటే ఆధికారిక వేడుకల్లో తన కుటుంబాన్ని అక్రమంగా ఇన్వాల్వు చేస్తున్నాడని విమర్శించవచ్చునా ?

 3. gajula says:

  mitrulu sri gaaru,venugopalgaaru chaala vishayaalu chepparu meeru vaati meeda kuuda spandinchandi,governergaaru ekkada tirigina adikaradurviniyogam cheste adi thappe,samacharahakku chattanni vimarshinchinantha maatrana aayana chesina tappu voppu kaadu,prajalaku javaabudaarigaa vundakunda-delhiki vunte prajaswamyamlo chaala anarthaalu jarugathayi

 4. sri says:

  గాజుల గారు, గవర్నర్ కూడా ఒక పౌరుడే అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఆయన ఎమీ విమర్శలు చేయ కుడదు అనటం బాగా లేదు. ఎర్ర జెండా పార్టి వారు రెండురకాలు. ఒకరు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంచొ ఎన్నికలలో పాల్గోనె వారు, ఇంకొకరు అడవులలో ఉండి పోరాటం చేసె వారు. వీరికి ఎన్నికల మీద నమ్మకం లేదు. మొదటి వారుఇ సి.పి.యం/ఐ ఎప్పుడు నిజాయితి గురించి మాట్లాడుతుంటారు. నాటి ఇంద్రజిత్ గుప్తా, బర్ధన్ నుంచి రాఘవులు,నారాయణ వరకు. వీరికి ఉన్న సౌలభ్యం ఈ జన్మకు వీరు అధికారంలో కి వచ్చె ప్రసక్తి లేదు కనుక తామను తామి పెద్ద గొప్ప నిజాయితి పరులుగా భావించుకొని ఇతరులను అతిగావిమర్సిస్తారు. అదే కేరళా, బెంగాలు లో వీరి పాలన చూడండి ఎలా ఉంట్టుందో మరి. అన్ని పార్టిల లాగె ఉండటం కాక ఇంకా కొంచెం ఎక్కువ రౌడీజం ఉంట్టునిది. ఇక అడవుల్లో ఉండే ఎర్ర జెండా వారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనపుడు ఊరకనే ప్రస్తుత ప్రభుత్వాలు రాజ్యంగ బద్దం గా పని చేయటం లేదు అని గవర్నర్ విధులను ప్రశ్నించే హక్కు అసలకి వీరికి లేదు.
  ——————————————————————————–
  అయ్యా, వీరి సిద్దాంతానికి చాలా బలం ఉందని అనుకుంటారు గాని వాస్తవానికి ఈ ఎర్ర పార్టిల సిద్దంత పరమైన బలం ఎమీ లేదు. ప్రస్తుత ప్రభుత్వం లోపాలే వీరి బలాలు. అంతకు మించి ఎమీ లేదు.
  గవర్నర్ గారు ఈ మధ్య ఒక వి.సి. ని తొలగించారు. అదే కాక వి.సి. నియామకాల పైన, విద్యా వ్యవస్థ లోని అవినీతి పైనా ఆయన ప్రత్యేక దృష్టి సారించి ఇంతకు ముందు గవ్రనర్ ల కన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ వాతా వరణం లో తెలుగు వారికి ఈ చర్యలు ఎంతో ఉపయోఈగపడతాయి. టి.టి.డి. మాజి చైర్మన్ సి.ఐ.డి. దర్యాప్తు జరిపించండి అని లేఖ సమర్పించటానికి పోతె అపాయింట్ మెంట్ ఇవ్వ లేదని చదివాను. ఆయన ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్క్ష చేస్తున్నాడను కోండి. అది వేరె విషయం. మరి మీరు కూడా ఇటువంటి వాటిని గుర్తించాలి. అంతే కాని లక్షల కోట్ల అవినీతి జరుగుతున్న ఎమీ చేయ లేక చూస్తున్న మన రాష్ట్ర ప్రజలు, గవర్నర్ గారు వేళ్ళిన గుడి ఖర్చుల గురించి రాయటం అక్కడి అదేదో ఆయన తప్పుడు పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు రాస్తే వేణుగోపాల్ గారి నిజాయితీనే శకించ వలసి వస్తుంది. మీకు తెలియంది ఎమీటంటె అసలికి అంత నిజాయితీని ప్రజలేమి కోరు కోవటం లేదు. వాళ్ల కి కూడ స్వంత విచక్షణ ఉంది. వారికి రాష్ట్రం లో జరిగె వేల, లక్షల కోట్ల అవినితి గవర్నర్ ప్రయాణానికి ఐన లక్షల రూపాయల ఖర్చులను పోల్చుకొంటారు. ఎవరు ఎంతటి నిజాయితీ పరులో గుర్తిస్తారు. స్వల్ప విషయాలపై సమాచార హక్కు కింద కోర్ట్ కెళ్ళటం ఆయనని పథకం ప్రకారం ఎడిపించటం లో వేసిన ఒక ఎత్తు. ఇదొక రకమైనా బ్లాక్ మైల్ చేయటం. ఎందుకంటె ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నాడు కనుక. ఇటువంటి చిన్న వాటిని అడ్డు పెట్టుకొని అతని మీద బురద జల్లే ప్రయత్నం, ఇటువంటివి చాలా పాత టెక్నిక్స్ ఇంకా కొంతమంది అనుసరించటం ఆక్షేపణియం.ప్రజలు హర్షించరు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s