ఎవరి విమోచన దినం?

ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ, ఆగస్ట్ 30, 2010

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా జరపాలనే డిమాండ్ రోజురోజుకూ ఎక్కువవుతున్నది. పన్నెండు సంవత్సరాల కింద ‘విమోచన స్వర్ణోత్సవాలు’ జరిపినప్పుడు దాన్ని విమోచన అనడంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఉండేది. ఇవాళ ఆ మతోన్మాద పార్టీ నినాదానికి వంతపాడేవాళ్లు చాల మంది తయారయ్యారు. తమను తాము సెక్యులర్ పార్టీలమని చెప్పుకునే అన్ని పార్టీలూ అదేమాట అంటున్నాయి. తెలంగాణ ఆకాంక్షల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడ తెలంగాణ మీద సైనికదాడి జరిగిన ఆ రోజును విమోచన అని పిలవడానికి ఉత్సాహపడుతోంది. ఆ సెప్టెంబర్ 17, 1948 తర్వాత మూడు సంవత్సరాల పాటు సాయుధ పోరాటం కొనసాగించి, నెహ్రూ – పటేల్ సైన్యాల కాల్పులలో మూడు వేల మంది కార్యకర్తలను, సానుభూతిపరులను పోగొట్టుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ, దాని నుంచే పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కూడ ఆ హత్యాకాండకు నాంది పలికిన దినాన్ని విమోచన దినం అంటున్నాయి.

ఇంత అవమానకరమైన, అచారిత్రకమైన రాజకీయాలు నడుస్తున్నప్పుడు ఏమి రాయాలో, చరిత్రలో వాస్తవంగా జరిగినదాన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదు. నిజానికి 1998లో భారతీయ జనతాపార్టీ ఈ విషప్రచారం ప్రారంభించినప్పుడు చారిత్రక, సమకాలీన ఆధారాలను ఉటంకిస్తూ ఈ విషయం మీద నా మొదటి వ్యాసం రాశాను. ఆ తర్వాత ఇంకా లోతుగా పరిశోధన చేసిన కొద్దీ ఈ దినాన్ని విమోచన దినం అనడానికి ఎందుకు వీలులేదో కొత్త ఆధారాలెన్నో దొరుకుతూ వచ్చాయి. అందుకే ఆ తర్వాత మరో మూడు నాలుగు వ్యాసాలు రాశాను. ఇప్పుడు వాటిలోంచి, 2008లో రాసిన వ్యాసాన్ని మళ్లీ ఆఖరి పేజీ పాఠకులతో పంచుకోవాలని ఉంది.

“హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ  ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ‘మావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టే’ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ‘దీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టే’ అని బ్లాక్ మెయిల్ చేస్తూవచ్చిన సంఘ పరివారం ఇప్పటికి చాలమందిని లొంగదీసింది. అలా లొంగిపోయినవారి జాబితా ఇంకా పెరిగిపోతోంది. మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక భావజాల పక్షం చేస్తున్న ప్రయత్నాలకు ఎవరెవరు ఏ ప్రయోజనాలకొరకు లొంగిపోదలచుకున్నారో వారి వారి ఇష్టం గాని, సెప్టెంబర్ 17, 1948 ని ‘హైదరాబాద్ విమోచన దినం’ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది.

ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన కిందికి తెచ్చిన రోజు. అలా తేవడం కోసం, పోలీస్ చర్య పేరుతో జరిపిన సైనిక దాడి విజయం సాధించిన రోజు. విలీనం అనే మాట వాడడం కూడ కష్టం. ఆ మాటలోకూడ విలీనమయ్యేవారి ఆమోదం ఉందనే అర్థం ఉంది. 1948 సెప్టెంబర్ 17 చర్యకు నిజంగా తెలంగాణ ప్రజామోదం ఉందా అనేది సందేహాస్పదమే.

‘ముస్లిం పాలన కింద ఉండిన హైదరాబాదు హిందూ ప్రజలకు 1948 సెప్టెంబర్ 17 న కేంద్రప్రభుత్వం విమోచన కలిగించిందని, అందువల్ల హైదరాబాద్ రాజ్యాధీశుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయిన ఆ తేదీని హైదరాబాద్ విమోచన దినంగా జరపాల’ని సంఘ పరివారం వాదిస్తున్నది. అసలు హైదరాబాద్ ముస్లిం పాలన కింద ఉండిందనేదే అర్ధసత్యం. పాలకుల మతవిశ్వాసం ఇస్లాం కావచ్చుగాని, వారు ఆధారపడింది ఇటు ‘హిందూ’ భూస్వాముల మీద, అటు ‘క్రైస్తవ’ వలసవాదుల మీద. చివరికి మతోన్మాదులుగా పేరుపడిన రజాకార్ల సైన్యం కూడ హిందూ జాగీర్దార్ల, దేశ్ ముఖుల, భూస్వాముల తరఫున, వారి గడీలలో విడిదిచేసి, తిని తాగి,  పేద ప్రజల మీద, పోరాడుతున్న రైతు కూలీల మీద హంతక దాడులు చేసింది. అందువల్ల అసలు 1948 నాటి హైదరాబాద్ పాలనను, రజాకార్ల దాడులను ముస్లిం పాలనగా, ముస్లిం మతదాడులుగా చిత్రంచడమే ఒక కుట్ర.

అది ఒక నిరంకుశ పాలన అనే మాట, దాని నుంచి ప్రజలు విముక్తిని కోరుకున్నారనే మాట నిజమే.  కాని 1948 సెప్టెంబర్ 17 ఆ విముక్తిని కూడ సాధించలేదు. హైదరాబాద్ రాజ్య పాలన 1950 జనవరి 26 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదనే  సాగింది. ఆతర్వాత కూడ 1956 నవంబర్ 1 దాకా ఆయన రాజప్రముఖ్ గా కొనసాగాడు. దుర్మార్గమైన భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పి, ప్రజల గోళ్లూడగొట్టి పన్నులు వసూలుచేసి ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకడుగా పేరుపడ్డ నిజాం ఆస్తులను ఈ ‘విమోచన’ తర్వాత స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగించలేదు సరిగదా, ఆయనకే ఎదురుగా రాజభరణం, నష్టపరిహారాలు అందజేశారు. ఆయన ఆస్తులలో అత్యధిక భాగాన్ని, ఆయన అధికారాలను యథాతథంగా ఉంచారు. ఎవరి నుంచి విమోచన సాగినట్టు? ఎవరికి విమోచన దొరికినట్టు?

ఇంకొకవైపు నుంచి చూస్తే నిజాం పాలన నుంచి, భూస్వామ్య పీడన నుంచి విముక్తి కోరుతూ పోరాటం ప్రారంభించిన ప్రజలు ఆ పోరాటాన్ని 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఆపివేయలేదు. ఆ రోజుతో ఏదో మార్పు వచ్చిందని ప్రజలు భావించలేదు. గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చాడని ప్రజలు చెప్పుకున్నారు. అందుకే ఆ తర్వాత మూడు సంవత్సరాలపాటు ప్రజలు సాయుధ పోరాటం కొనసాగించారు. తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. తెలంగాణ సాయుధ రైతాంగపోరాటంలో 1946 జూలై 4 నుంచి 1948 సెప్టెంబర్ 17 దాకా నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు, అకృత్యాలు ఎక్కువ. ఆ పోరాట క్రమంలో ప్రజలు సాధించుకున్న విజయాలన్నిటినీ నెహ్రూ – పటేల్ సైన్యాలు ధ్వంసం చేశాయి. ప్రజలు ఆక్రమించుకున్న భూస్వాముల భూములను మళ్లీ భూస్వాములకు కట్టబెట్టాయి. రజాకార్లను అణచడం అనే పేరు మీద రెండు లక్షల మంది అమాయక ముస్లిం ప్రజలను ఊచకోత కోశాయి. ఆ బీభత్సకాండకు నాందిపలికిన సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా అభివర్ణించడం అర్థ రహితం.

ఇంతకూ సమకాలీన చరిత్రకారులు, పరిశీలకులు ఎవరూ ఆ తేదీని విమోచన దినంగా పేర్కొనలేదు. స్వయంగా ఆ సైనికదాడిని నడిపిన వాళ్లు, మంత్రాంగం నెరపినవాళ్లు, సమర్థించినవాళ్లు కూడ దాన్ని విలీనం, పోలీసు చర్య వంటి మాటలతోనే సూచించారు గాని విమోచన అనలేదు. కొన్ని సంవత్సరాల కింద సంఘపరివారం ప్రారంభించిన ‘విమోచన’ ఆలోచన ఇవాళ అన్ని రాజకీయపక్షాలకు అంటుకున్నట్టుంది. అందరికన్న ఎక్కువ ఆశ్చర్యకరంగా ఆ తేదీన మొదలుపెట్టి తెలంగాణ సాయుధపోరాట వార్షికోత్సవాలు జరపాలని సిపిఐ, సిపిఎం నిర్ణయించుకున్నాయి. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటానికి సంకేతాత్మక ప్రారంభమైన దొడ్డి కొమరయ్య అమరత్వ దినం (1946 జూలై 4) గాని, సాయుధ సమర ప్రారంభానికి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూమ్ మొహియుద్దీన్ లు పిలుపు ఇచ్చిన 1947 సెప్టెంబర్ 11 గాని, సాయుధ పోరాటాన్ని అధికారికంగా విరమించిన 1951 అక్టోబర్ 20 గాని సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భం అవుతాయి గాని, తమ కార్యకర్తలను ఇతోధికంగా చంపడానికి కారణమైన, తాము అప్పుడు ఏమార్పూ లేదని భావించి పోరాటం కొనసాగించిన తేదీకి ఇవాళ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ పోరాట అమరుల త్యాగాల సాక్షిగా వామపక్షాలు సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది.

ఇంకా విచిత్రంగా ప్రత్యేక తెలంగాణ వాదులలో కొందరు కూడ హైదరాబాద్ విమోచన దినాన్ని గుర్తిస్తున్నారు. నిజానికి 1948 సెప్టెంబర్ 17 ను అందరికన్న ఎక్కువగా వ్యతిరేకించవలసినవారు ప్రత్యేక తెలంగాణ వాదులు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని రద్దు చేయడం ప్రారంభమయిన చీకటి రోజు అది. హైదరాబాదు రాజ్యం, అందులో భాగంగా తెలంగాణ చిత్రపటం చెరిగిపోయి, ఇవాళ తెలంగాణ వాదులు చెపుతున్న ‘ఆంధ్ర వలసపాలకుల పాలన’కు నాంది పలికిన రోజు అది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో 1956 నవంబర్ 1 న స్థిరపడిన ప్రక్రియకు తొలి అడుగు పడినది 1948 సెప్టెంబర్ 17 ననే.

చారిత్రక వాస్తవాలతోగాని, జరిగిన చరిత్రతోగాని, సమకాలీన ఆధారాలతోగాని, తదనంతర పరిణామాలను బట్టిగాని ఎంతమాత్రం అంగీకరించలేని ‘విమోచన దినాన్ని’ జరపడానికి సంఘపరివారానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం, సమాజాన్ని నిట్టనిలువునా చీల్చే ప్రయోజనం ఉంది. కాని చరిత్ర తెలిసినవారు, తెలియనివారు, ఆ చరిత్రలో భాగమయినవారు, ఆ చరిత్రవల్ల ధ్వంసమయినవారు అందరికందరూ ఆ సంబరాలకు పరుగెత్తి పోవడమేనా? అవి ఎవరి సంబరాలో,  మనం పాల్గొనవచ్చునో లేదో కనీస ఆలోచన ఉండనక్కరలేదా?”

ఈ మాటలు రాసిన రెండు సంవత్సరాల కింద కనీసం సిపిఐ, సిపిఎం లు సెప్టెంబర్ 17ను విమోచన దినమని అనలేదు. ఆ రోజున సాయుధపోరాట వార్షికోత్సవం జరపడానికి నిర్ణయించాయి. ఇప్పుడు విమోచన అనడానికి కొత్తగా వచ్చిన మార్పు ఏమిటి? తెలంగాణకు ఆ రోజు విముక్తి దొరికిందని ఇవాళ కొత్తగా సిపిఐ, సిపిఎంలకు ఎలా తెలిసివచ్చింది? మరి అది విమోచనమనుకుంటే ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు పోరాటం ఎందుకు కొనసాగించినట్టు? మూడువేలమందిని ఎందుకు బలి ఇచ్చినట్టు? ‘ఆ నాటి మా నాయకత్వం తప్పుడు అంచనాల వల్ల ఆ విమోచనాన్ని గుర్తించలేకపోయాం, అందుకే పోరాటం సాగించి, మూడువేలమంది చావుకు కారణమయ్యాం’ అని ఆ రెండు పార్టీల నాయకత్వాలు మొదట ప్రకటించి ఆ తర్వాత విమోచన గురించి మాట్లాడితే బాగుండేది.

అలాగే ఆ వ్యాసం రాసినప్పుడు తెలంగాణ వాదులలో కొందరు అని మాత్రమే అన్నాను గాని, ప్రస్తుతం తెలంగాణ ఆకాంక్షలకు ఏకైక ప్రతినిధిగా చెప్పుకునే పార్టీ కూడ విమోచనగా గుర్తించడం మాత్రమే కాదు, ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని అడుగుతున్నది. విమోచన దినంగా గుర్తించాలని అడుగుతున్న రోజు నిజానికి దురాక్రమణ దినం. అప్పటికే భారత ప్రభుత్వం కూడ హైదరాబాద్ ను స్వతంత్ర దేశంగా గుర్తించి యథాతథ ఒడంబడిక చేసుకున్నది. స్వతంత్ర దేశంగానే హైదరాబాద్ ఐక్య రాజ్య సమితిలో భారత ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసి చర్చ కోసం ఎదురుచూస్తున్నది. అటువంటి సమయంలో ఆ చర్చకు ఒక రోజు ముందు భారత సైన్యాలు హైదరాబాద్ మీద దురాక్రమణ జరిపి భారత దేశంలో విలీనం చేసుకున్నాయి. ఆ విలీనం వల్లనే 1956 నవంబర్ 1 విద్రోహ దినానికి వీలు కలిగింది. ఈ చరిత్రనంతా పక్కన పెట్టి తెలంగాణవాదులు కూడ విమోచన అనడం భావ్యమేనా? ఈ రెండు సంవత్సరాలలో కాషాయ వాదనకు ఇంత ఆదరణ పెరిగిందా? అయినా ఎరుపూ గులాబీ కూడ కాషాయపు ఛాయలేనా?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telangana. Bookmark the permalink.

8 Responses to ఎవరి విమోచన దినం?

 1. raman says:

  interesting sir
  It tells us how the history will be twisted for the cheap political gains

 2. Shankar says:

  ముద్రారాక్షసము. అది విరోచనదినం అయ్యుంటుంది అని నా అనుమానం.

 3. Raj says:

  ఇంతకి మీకు ప్రత్యేక రాష్ట్రము కావాలా లేక ప్రత్యేక దేశం కావాలా?

 4. తెలుగుబాటసారి says:

  “నిజానికి 1948 సెప్టెంబర్ 17 ను అందరికన్న ఎక్కువగా వ్యతిరేకించవలసినవారు ప్రత్యేక తెలంగాణ వాదులు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని రద్దు చేయడం ప్రారంభమయిన చీకటి రోజు అది. హైదరాబాదు రాజ్యం, అందులో భాగంగా తెలంగాణ చిత్రపటం చెరిగిపోయి, ఇవాళ తెలంగాణ వాదులు చెపుతున్న ‘ఆంధ్ర వలసపాలకుల పాలన’కు నాంది పలికిన రోజు అది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో 1956 నవంబర్ 1 న స్థిరపడిన ప్రక్రియకు తొలి అడుగు పడినది 1948 సెప్టెంబర్ 17 ననే.” అంటున్నారు మీరు. చాలా ఆశ్చర్యంగా ఉంది.

  తెలంగాణ అని మీరు చెబుతున్న భూఖండానికి చరిత్రలో ప్రత్యేకమైన/ స్వంత/ స్వతంత్ర రాజకీయ అస్తిత్వం ఎప్పుడూ లేదు. ఇంతకు పూర్వం ఉన్నది హైదరాబాదు రాష్ట్రమే తప్ప తెలంగాణ కాదు. ఇప్పుడూ అంతే ! బహుశా ఇక ముందూ అంతే ! అటువంటప్పుడు తెలంగాణ అస్తుత్వాన్ని రద్దు చేయడమనే ప్రశ్న ఎలా తలెత్తుతుంది ? అసలు లేనిదాన్ని ఎలా రద్దుచేస్తారు ?

 5. gajula says:

  mitrulaku namaskaramulu,hyderabadrastramlo telanganapranthame keelakamainadi-oka manishiki voka kaalu,vokacheyi poyinaa aa manishini ade perutho pilustaaru thappa vere perutho pilavaru.september17 voka shatruvu nunchi vidudala-maro shatruvu chetilo bandigaa cheppu kovachhu.mana telanganaku ‘roots ‘kathanaayakudu kuntaakinteku daggari polikalu vunnayi,bhanisagaa chethulu maaradamu.

 6. Sanjay says:

  Hello Raj, Your question or doubt amuses me.. You still do not know what we seek? What did you achieve from your beloved Madras state? country or failed state?
  Whatever we want, we don’t want Seemandhra or samakhyandhra in it. DOT

 7. Ranjith says:

  Actually, demand for a anonymous state is not a bad Idea at all, as central govt. is refusing to declare a state within the state.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s