ప్రాంతీయ ఉద్యమాలను ఎలా అర్థం చేసుకోవాలి?

మనసీమ కోసం,

ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన, సాగుతున్న ప్రజాందోళన రాష్ట్రంలో బుద్ధిజీవులలో చాల ఆలోచనలు రేకెత్తించింది. రాష్ట్ర విభజన అవసరమా, రాష్ట్ర విభజన కోరిక కొందరు నిరుద్యోగులయిన రాజకీయ నాయకులదా, ప్రజలదా, తెలుగుతల్లిని ముక్కలు చేయడం సరయినదేనా, ప్రాంతీయ అసమానతలను వలస దోపిడీ అనవచ్చునా, ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతానికి వెళ్లాలంటే వీసాలు, అనుమతులు కావాలా లాంటి ప్రశ్నలు, ప్రశ్నిస్తే నాలుక చీరేస్తాం, ఆకాంక్ష ప్రకటించడం దేశద్రోహం వంటి ఉద్వేగభరితమైన బెదిరింపులు, చరిత్ర వక్రీకరణలు, ఇష్టారాజ్యంగా గణాంకాల వినియోగం, ఒక ప్రాంతపు కళా సంస్కృతుల పట్ల మరొక ప్రాంతంలో చిన్నచూపు, నిరాదరణ, వ్యతిరేకత వంటి వివాదాస్పదమైన, ఉద్వేగ భరితమైన అంశాలెన్నో మిళితమైనందువల్ల ఒక హేతుబద్ధమైన, శాస్త్రీయమైన చర్చ జరగడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. వివాదంలో పాల్గొన్న అన్ని పక్షాలూ తరతమభేదాలతో అసత్య, అర్ధసత్య ప్రచారానికి, వక్రీకరణలకు దిగినందువల్ల కంటికి కనిపించే కఠిన వాస్తవాలు కూడ కనుమరుగయిపోయాయి. చరిత్ర, గణాంకాలు, సైద్ధాంతిక అవగాహనలు అర్థరహితమైన క్రీడావినోదంగా మారిపోయాయి.

ఈ సంక్షుభిత, ఉద్వేగ భరిత స్థితి వల్ల ఒక ప్రాంతంనుంచి వచ్చిన న్యాయమైన వ్యక్తీకరణలను, హేతుబద్ధమైన వాదనలను కూడ మరొక ప్రాంతం వారు అనుమానించే, అపార్థం చేసుకునే, అవమానించే పరిస్థితి వచ్చింది. రాయలసీమ, ఉత్తరాంధ్రల వెనుకబాటుతనం గురించి గాని, ఆదివాసులకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన గురించి గాని మాట్లాడడమే తెలంగాణకు వ్యతిరేకమని అనుకోవడం, తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి అడిగితే రాయలసీమకు నష్టపరిహారం కట్టిఇవ్వాలనడం, ఒక ప్రాంతపు నాయకులు మరొక ప్రాంతానికి అన్యాయమే జరగలేదని అనడం, ఒక ప్రాంతపు వెనుకబాటుతనానికి మరొక ప్రాంతపు వెనుకబాటుతనాన్ని పోటీ పెట్టడం, తమ ప్రాంతంలో పుడితే చాలు అందరూ మంచివాళ్లనీ, ఇతర ప్రాంతంలో పుట్టినవాళ్లందరూ చెడ్డవాళ్లనీ ముద్రకొట్టడం వంటి అనారోగ్యకరమైన వాదనా పద్ధతులు రాజ్యం చేశాయి.

ఈ వాదనాపద్ధతులు రాజకీయవాదుల మోసపూరిత ఎత్తుగడలకు, తమ తమ నియోజకవర్గాలను రెచ్చగొట్టి తమ గొడుగు కింద నిలుపుకోవడానికి సరిపోవచ్చు గాని, మామూలు ప్రజలకు, ఆలోచనాపరులకు వాటితో ఏకీభావం ఉండనక్కరలేదు. కాని దురదృష్టవశాత్తూ ఇటువంటి ఉద్రేకపూరితమైన, అతిశయంతో కూడిన మాటలే ఎక్కువమందిని ఆకర్షించే స్థితి ఇవాళ తెలుగు సమాజంలో నెలకొని ఉంది.

ఈ ఉద్రిక్త అనాలోచిత స్థితి నుంచి బయటపడాలంటే కొంచెం స్థిమితంగా ఆలోచించవలసిన విషయాలున్నాయి. అసలు ప్రాంతీయ ఉద్యమాలు అంటే ఏమిటి, అవి ఎలా తలెత్తుతాయి, వాటి వెనుక ఉండే చారిత్రక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలు ఏమిటి, అవి ప్రజలను ఎలా ఆకట్టుకుంటాయి, అసలు ఈ ఉద్యమాలను ఎలా అర్థం చేసుకోవాలి, వాటిలో పాలకుల పాత్ర ఎంత, ప్రజల పాత్ర ఎంత, వాటి పరిష్కారం ఎలా జరుగుతుంది వంటి ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు అన్వేషించవలసి ఉంది. ఈ ప్రశ్నల, సమాధానాల అవగాహన నుంచి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా తలెత్తగల ప్రజా ఉద్యమాల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవలసి ఉంది. ప్రత్యేకించి తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాల, ప్రజల వెనుకబాటుతనం గురించి చర్చించవలసి ఉంది.

ప్రాంతీయ ఉద్యమం అనే సమాసంలో ఉన్న రెండు మాటలూ పైకి కనబడుతున్నంత సులభమైనవి కావు. మొదటి మాట – ప్రాంతం – అంటే అర్థం ఏమిటి? అది కేవలం భౌగోళిక అంశమా, లేక దానిలో మానసిక స్థితి ఇమిడి ఉందా? దానికి చరిత్ర జోడవుతుందా? ఒక ప్రాంతం అనే మాటకు నిర్వచనాన్ని సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాలు ప్రభావితం చేస్తాయా? భౌగోళికం మాత్రమే అయితే ఆ భూగోళానికి పరిధీ పరిమితీ ఏమిటి? ప్రాంతమంటే గ్రామమా, మండలమా, తాలూకానా, జిల్లానా, కొన్ని జిల్లాలు కలిసిన భూభాగమా, రాష్ట్రమా, దేశమా, కొన్ని దేశాలు కలిసిన భాగమా, ఖండమా? ఈ అన్ని అర్థాల లోనూ ప్రాంతం అనే మాట వాడకంలో ఉంది. అసలు ప్రాంతం అనేది సాపేక్షికమా, నిరపేక్షమా? గ్రామం అనే యూనిట్ లోనే ఎన్నో ప్రాంతాలు ఉంటాయి. కొన్ని గ్రామాల సముదాయంలో మళ్లీ ప్రాంతీయ విభజన చేయవచ్చు. అలాగే మండలం, తాలూకా, జిల్లా, రాష్ట్రం, దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలు, దేశాలు అన్నీ వాటికంటే పెద్ద భూగోళంతో పోల్చినప్పుడు ప్రాంతాలే అవుతాయి. అలాగే చరిత్రలో ప్రాంతంగా నిన్న గుర్తించబడినదానికీ, ఇవాళ గుర్తించబడుతున్నదానికీ కూడ తేడాలు ఉన్నాయి. కనుక ప్రాంతం అన్నది సాపేక్షికమే తప్ప పరమం కాదు. ఒకానొక రాజకీయార్థిక, సామాజిక, చారిత్రక సందర్భంలో గుర్తింపుకు వచ్చే ఒక నిర్దిష్ట ప్రాంతం వేరు. అది అన్ని సందర్భాలలోనూ ఒకటే కాకపోవచ్చును. ఒక సందర్భంలో అది మరొక ప్రాంతంతో కలిసి, ఇంకొక భౌగోళిక ప్రతిపత్తితో వ్యవహరిస్తూ ఉండవచ్చును. కొండలు, నదులు, అడవులు సరిహద్దులుగా ఉండే ఒక నైసర్గిక భూభాగాన్ని ఒక ప్రాంతంగా వ్యవహరిస్తే కొంత అర్థం ఉంటుంది గాని, ఆ నైసర్గిక అంశాలను పక్కన పెట్టి చారిత్రిక క్రమంలో ఒకే పాలన కింద ఉన్న భూభాగాన్నే ప్రధానంగా ఒక ప్రాంతంగా పిలవడం జరుగుతోంది.

దీనికి మన చరిత్ర నుంచే ఉదాహరణలు ఇవ్వాలంటే మద్రాసు రాష్ట్రం అనే ఒక భౌగోళిక ప్రాంతంతో తెలుగు భాషా వ్యవహర్తల జిల్లాలు, వేరయిన భౌగోళిక ప్రాంతంగా భావించుకున్నాయి. మళ్లీ ఆ తెలుగు భాషా జిల్లాల నుంచే నాలుగు జిల్లాలు తమను తాము భిన్నమైన ప్రాంతంగా భావించుకున్నాయి. (అప్పటికి ఈ నాలుగు జిల్లాలలో ఒకటయిన బళ్లారి ఆ తర్వాత ఇందులోనుంచి వేరయింది). తర్వాత ఈ రెండు ప్రాంతాలూ మరొక తెలుగు భాషా ప్రాంతంతో కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడి పొరుగు రాష్ట్రాలయిన మహారాష్ట్ర తోనో, కర్ణాటక తోనో నదీజల పంపిణీ వివాదాలు వచ్చినప్పుడు ఒకటిగానూ వ్యవహరించాయి. తమలో తాము భిన్నమైన ప్రాంతాలుగానూ వ్యవహరించాయి. అంటే ప్రాంతం అనే మాట స్థల కాలాలను బట్టి మారుతుంది గాని ఎల్లకాలానికీ ఒకటే కాదన్నమాట.

అలాగే ఉద్యమం అనే మాట. ఆందోళన, సంఘటిత ప్రయత్నం అనే స్థూల అర్థాలతో వాడుకలో ఉన్న ఈ మాటకు సూక్ష్మంగా చూస్తే అర్థం ఏమిటి? ఎంతమంది పాల్గొంటే ఉద్యమం అవుతుందో కచ్చితమైన ప్రమాణాలు ఉన్నాయా? అసలు భాగస్వామ్యం ప్రమాణమా, లక్ష్యం ప్రమాణమా? ప్రచారసాధనాలను ప్రభావితం చేయగల ఎవరో ఒకరు చేసే ఏదో ఒక ప్రకటన ఉద్యమం అవుతుందా? కొద్దిమంది చేసే ప్రకటనలో, కొద్దిపాటి కార్యాచరణో, కొన్ని వర్గాల ప్రయోజనాల కొరకు జరిగేదో ఉద్యమం అవుతుందా? ప్రజాబాహుళ్యంలోని ఒక బృందం సాగించే ఆందోళన ఉద్యమమవుతుందా? సామాజిక వర్గాలలో ఒక వర్గం సాగిస్తే ఉద్యమమా, ఎక్కువ వర్గాలు సాగిస్తే ఉద్యమమా, దాదాపు అన్ని వర్గాలూ సాగిస్తే ఉద్యమమా? లేక అసలు ఉద్యమాన్ని ఈ భాగస్వామ్యంతో సంబంధం లేకుండానో, ఆ భాగస్వామ్యంతో పాటుగానో, ఉద్యమం అంటే కొన్ని లక్ష్యాలు ఉండడం, ఆ లక్ష్యాలు ఎక్కువమంది భాగం పంచుకోవడానికి వీలు కలిగించేవిగా ఉండడం అని అర్థాలు చెప్పుకోవాలా? ఏకవ్యక్తి లెటర్ హెడ్ సంస్థల ప్రకటనల దగ్గరినుంచి, లక్షలాది మంది పాల్గొనే చర్యలదాకా అన్నిటినీ ఉద్యమం అనడం, లక్ష్యాలతో సంబంధం లేకుండా, ఏదో ఒక భావోద్వేగంతో ఎక్కువమంది పాల్గొంటే ఉద్యమమే అనడం అలవాటయిపోయిన స్థితిలో ఈ ప్రశ్నలు లోతుగా ఆలోచించవలసి ఉంది.

ఈ నేపథ్యంలో ఆలోచించినప్పుడు ప్రాంతీయ ఉద్యమాలు అంటే స్థూలంగా అప్పటికి గుర్తించదగిన ఒక నిర్దిష్ట ప్రాంతంలో, ఆ ప్రాంత ప్రజల రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలకోసం, ప్రయోజనాల పరిరక్షణ కోసం సాగేవి అని అర్థం చెప్పుకోవచ్చు. ఆ ప్రాంత ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు పాల్గొనేవి, లేదా కనీసం అత్యధిక ప్రజల ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుని సాగేవి ప్రాంతీయ ఉద్యమాలు అనవచ్చు.

సాధారణంగా ప్రాంతీయ ఉద్యమాలు తత్కాలపు సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక వివక్ష నుంచీ, అసమానత నుంచీ తలెత్తుతాయి. ఈ వివక్ష, అసమానత వాస్తవికమైనదీ కావచ్చు, ఆలోచనలలో ఉన్నది కూడ కావచ్చు. అంటే ఆ ప్రాంతపు మనుషులు స్వయంగా అనుభవిస్తున్నదీ కావచ్చు, ఇంకా గుర్తింపుకు రాకుండా కేవలం సైద్ధాంతిక స్థాయిలో కొద్దిమందికి మాత్రమే తెలిసినదీ కావచ్చు. అది ఎంత ఎక్కువమంది ప్రజల అనుభవంలో ఉంటే అంత ఎక్కువమంది ఆ ఉద్యమంలో పాలు పంచుకుంటారు. లేదా కొందరు ఆలోచనాపరులు, మేధావులు, విశ్లేషకులు, రాజకీయ, సామాజిక నాయకులు సైద్ధాంతిక స్థాయిలో దాన్ని గుర్తించి ప్రచారం చేసే క్రమంలో, అప్పటికి గుర్తింపుకురాని చోట్ల కూడ అసమానత గురించీ, వివక్ష గురించీ గుర్తింపు రావచ్చు. ఆ క్రమంలో మరింత ఎక్కువమంది ఉద్యమంలో భాగం కావచ్చు. ఇప్పటికే ఎక్కువమందికి అనుభవంలోకి వచ్చి పాల్గొంటున్నదానికి ఉదాహరణగా తెలంగాణ, ఇంకా ఎక్కువమంది అనుభవంలోకి రాకుండా ఉన్నదానికి ఉదాహరణగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతీయ సమస్యలు నిలుస్తాయి.

అది వాస్తవికమైనదయినా, ఆలోచనాపరమైనదయినా తప్పనిసరిగా ప్రతి ప్రాంతీయ అసమానతకూ వివక్షకూ చారిత్రక పునాది ఉంటుంది. ప్రాంతాల మధ్య నైసర్గికంగానే వనరుల హెచ్చుతగ్గులు ఉండవచ్చుగాని, చరిత్ర క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు, పాలకులు తమకు లేని వనరులను సంపాదించడం కొరకు, తమకు ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవడం కొరకు, తమ పరిమితులను అధిగమించే అవకాశాలను పెంచుకోవడం కొరకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఒక ప్రాంతపు పాలకులు, ఆధిపత్య శక్తులు ఇతర ప్రాంతాల వనరులను తమ ప్రాంతాలకు తరలించే పని కూడ చేస్తారు. అదేదో తమ ప్రాంతపు ప్రజల ప్రయోజనాలను రక్షించడానికి కాదు, ప్రధానంగా తమ బొక్కసాలు నింపుకోవడానికి మాత్రమే. కాని ఆ క్రమంలో వారి ప్రాంతం కూడ ఎంతో కొంత లాభపడుతుంది. అక్కడ మౌలిక సౌకర్యాలు కొంత పెరుగుతాయి. అక్కడ ప్రజలకు కూడ కాస్త మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయి. ఆ ప్రజల జీవితం పూర్తిగా సౌభాగ్యవంతం అయిపోతుందని కాదు గాని, ఏ ప్రాంతపు వనరుల దోపిడీ జరిగిందో ఆ ప్రాంత ప్రజల కన్న దోపిడీ చేస్తున్న పాలకవర్గాల ప్రాంతం మెరుగైన సౌకర్యాలను చవిచూడగలుగుతుంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వల్ల బ్రిటన్ లో పేదల, కార్మికుల పరిస్థితి ఏమీ మెరుగు కాలేదు. కాని భారతదేశ ప్రజలతో పోలిస్తే బ్రిటిష్ ప్రజలు తప్పనిసరిగా మెరుగైన జీవిత సౌకర్యాలు అనుభవించగలిగారు. ఇవాళ్టి సామ్రాజ్యవాద దేశాలలో అందరికీ పాలూ తేనే అందుతున్నాయని కాదు, కాని పేదదేశాల ప్రజల కన్న మెరుగైన జీవనాన్నే సామ్రాజ్యవాద దేశాలలో పేదలు కూడ  అనుభవించగలుగుతున్నారు. ఇలా దేశాల మధ్య కొనసాగే అసమానతల వంటివే, ఒక దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రాంతాల మధ్య ఉండే అవకాశం ఉంది. ఒకే దేశంలో, ఒకే రాష్ట్రంలో సాగే ఈ అసమానతలకు మూలాలు చరిత్రలో ఉండగా, వాటి పెరుగుదల పాలకుల విధానాల వల్ల జరుగుతుంది.

ఈ విధంగా ప్రాంతీయ అసమానతలు ప్రారంభమై పెరిగిపోతాయి. ఈ అసమానతలకు, అవి పెరగడానికి పూర్తికారణం పాలకవర్గాలే, పాలకవిధానాలే అన్నది మరచిపోతే, ప్రజాజీవనంలోని హెచ్చుతగ్గులు చూపి, ప్రజల మధ్య శత్రుత్వం పెంచడానికి ప్రయత్నించే శక్తులూ ఉంటాయి. సాధారణ ప్రజలకు అది నిజమేనేమో అనిపించి అనవసరమైన, అవాంఛనీయమైన శత్రుత్వాలు పెరగడానికి వీలు కలుగుతుంది. పాలకులు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ అసమానతలు కూడ రాత్రికి రాత్రి వచ్చిపడినవీ కావు, రాత్రికి రాత్రి తొలగించగలిగినవీ కావు. అందువల్ల ఈ అసమానతల చారిత్రక మూలాలను అర్థం చేసుకుని, చరిత్రలో జరిగిన అన్యాయాలను సవరించే పనిని జాగ్రత్తగా, ఓపికగా చేయవలసిందే.

గత పాలకులు, పాలనావిధానాలు ఉద్దేశపూర్వకంగానో, అనాలోచితంగానో చేసిన ఆ తప్పిదాలను సవరించే అవకాశమూ అధికారమూ వర్తమాన పాలకులకు ఉంటుంది. వర్తమాన పాలకులు ఆ బాధ్యతను నెరవేర్చనపుడు, లేదా అంతకన్న ఘోరంగా వర్తమాన పాలకులు కూడ గతంలో వనరులు అందిన ప్రాంతానికే అదనపు వనరులు అందిస్తూ వివక్షను కొనసాగించినపుడు, బాధిత ప్రాంతంలో ఆందోళన మొదలవుతుంది. చరిత్రలో తమకు జరిగిన అన్యాయాలను, ప్రస్తుతం కొనసాగుతున్న అన్యాయాలను వివరించే, విశ్లేషించే ఒక బుద్ధిజీవి వర్గం తలెత్తుతుంది. ఆ వర్గపు ఆలోచనలు వెంటనే రగుల్కొనడానికి ముడిసరుకు ఆ ప్రాంతంలోని ప్రతిమనిషి జీవితంలోనూ ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. ఈ మందుపాతరను ముట్టించేవాళ్ల ఉద్దేశాలు మంచివైనా, చెడ్డవైనా మందుపాతర పేలక తప్పదు. సంక్షుభిత జలాల్లో చేపలు పట్టడం అని ఒక ఇంగ్లిషు నుడికారం ఉంది. చేపలు పట్టేవాడిని తప్పుపట్టేకన్న అక్కడ సంక్షుభిత జలాలు ఉన్నాయని గుర్తించడం ముఖ్యం. ఆ సంక్షుభిత జలాల నుంచి సంక్షోభాన్ని తొలగించడానికి కృషి చేయడం ప్రారంభించినప్పుడే, చేపలు పట్టదలచుకున్నవాళ్ల దురాలోచనలను ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఆ సంక్షోభ పరిష్కారం కోసం ఏ పనీ చేయకుండా, కేవలం ఆ తప్పంతా ఆ సమస్యను వాడుకుంటున్న స్వార్థప్రయోజన శక్తులదే అని శాపనార్దాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా, అంతకంతకూ ఎక్కువ మంది ప్రజలను ఆ స్వార్థ ప్రయోజన శక్తుల ఒడిలోకి నెట్టినట్టవుతుంది.

నిజానికి ఇక్కడ ఇంకొక సమస్య కూడ ఉంది. ఒక ప్రాంతం అసమానతకు గురి కావడమంటే మొత్తం ప్రజానీకం అణచివేతకూ, దోపిడీకీ, పీడనకూ, వివక్షకూ గురి అవుతుందా, అది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు. కొందరు వ్యక్తులనో, కొన్ని సమూహాలనో చూపి “వెనుకబడిన” ప్రాంతంలో కూడ “అభివృద్ధి” చెందిన వాళ్లు ఉన్నారు గదా అని ప్రశ్నించవచ్చు. ఎంత వివక్షకు గురయిన సమాజంలోనయినా ఒక పాలకవర్గమో, ఒక దళారీ వర్గమో కొన్ని లాభాలయినా, కనీసం ఎంగిలి మెతుకులయినా పొంది, ఆ సమాజపు సగటు స్థితి కన్న పైననే ఉంటుంది. కనుక ప్రాంతం అనే అస్తిత్వాన్ని పక్కనపెట్టి వర్గం, కులం, మతం, పట్నం – పల్లె,  స్త్రీ పురుష భేదం లాంటి అస్తిత్వాలను గనుక చూస్తే ఒక ప్రాంతంలోనే భిన్నమైన జీవన ప్రమాణాలు కనబడతాయి. అట్లని ప్రాంతం అనే అస్తిత్వం అబద్ధం కాదు.

మన దేశంలోనూ, రాష్ట్రం లోనూ కనీసం గత ఆరేడు దశాబ్దాలలో ప్రాంతీయ అసమానతలు, విభేదాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అసమాభివృద్ధి పెట్టుబడిదారీ అభివృద్ధి వ్యూహానికి ఒక అనివార్య నియమమని రాజకీయార్థ శాస్త్రం చెపుతోంది. పెట్టుబడిదారీ అభివృద్ధి నిరంతరాయంగా సాగడానికి ముడిసరుకుల కోసం ఒక వెనుకతట్టు ప్రాంతం కావాలి. మరొక ప్రాంతంనుంచి ముడిసరుకుల కోసమో, మార్కెట్ల కోసమో తనతో పోటీకి ఎవరూ తలెత్తకుండా చూసే రక్షణ వ్యూహం కావాలి. మన దేశంలోనైతే భూస్వామ్య, హైందవ, బ్రాహ్మణ్య భావజాలంలో అసమానత సహజమైనదనే విశ్వాసం ఉంది గనుక, ఆ పెట్టుబడిదారీ అసమానత, ఈ భూస్వామ్య అసమానత మిలాఖత్తయి మన ప్రాంతీయ అసమానతలను బలోపేతం చేశాయి. తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతంనుంచి కూడ ఒక చిన్న దళారీ వర్గాన్ని చేరదీసి (వీళ్లను జూనియర్ పార్ట్నర్ అంటున్నారు) వారికి తమతో సమానావకాశాలు ఇవ్వడం అనే తెలివైన ఎత్తుగడను కూడ ఇటీవల అమలు చేస్తున్నారు. అలా వెనుకబడిన, అభివృద్ధి చెందని ప్రాంతాలలో కూడ అభివృద్ధి చెందిన వర్గాలు ఉండవచ్చు. లేదా, అటువంటి అవకాశాలు దొరకని ప్రాంతీయ వర్గాలు కూడ ప్రాంతీయ అసమానతల జెండా పట్టుకుని ప్రజలను కూడగట్టడానికి, తమ వాటా కోసం బేరసారాలు ఆడడానికి ఈ ప్రజా సమూహాన్ని ఎరగా వాడుకోవచ్చు. అసలు ప్రాంతీయ అసమానతలు, వివక్ష లేనేలేవనీ, మనమంతా ఒకటే అనీ అభివృద్ధి చెందిన ప్రాంతాల పాలక ముఠాలు ఐక్యతా మంత్రాన్ని జపించవచ్చు.

ప్రజలకు తమ ప్రాంత వనరుల మీద తమకు నిజమైన అధికారం లేకపోవడం, అందువల్ల సాగే వెనుకబాతుతనం, ఇతర ప్రాంతాలతో పోలిస్తే నిజమైన అసమానతలు, ఆ అసమానతలు తొలగిపోవాలని కోరుకునే ప్రజల ఆకాంక్షలు, ఆ ఆకాంక్షలను వినియోగించుకుని తమ పబ్బం గడుపుకుందామనుకునే ఆ ప్రాంతానికే చెందిన ఆధిపత్య శక్తులు, అసలు ఆ ఆకాంక్షలే లేవని బుకాయించే యథాస్థితి శక్తులు, చారిత్రక సమర్థనలు, వక్రీకరణలు, పాలనావిధానాలలో అవకతవకలు – లాంటి అనేక విభిన్నమైన దృశ్యాలు కలగలసిన సంకీర్ణ, సంక్లిష్ట జీవనచిత్రాన్ని ప్రాంతీయ ఉద్యమాలు రూపుకడతాయి. వీటిలో ఏ ఒకదాన్నో చూసి ప్రాంతీయ ఉద్యమాల మీద మొత్తంగా వ్యతిరేకత పెంచుకోవడం సరికాదు. ప్రాంతీయ ఉద్యమాలలో స్వార్థపరశక్తులు ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ, అవి తప్పనిసరిగా ప్రజాజీవితం మెరుగుపడాలనే ఆకాంక్షకు చిహ్నాలు.

ప్రజలు తమ వనరులమీద తమ అధికారం కోల్పోయారనీ, వారికి అందవలసిన అభివృద్ధి ఫలాలు అందలేదనీ, అందువల్ల వారికి నిజమైన అసంతృప్తి ఉందనీ గుర్తించడం అవసరం. అందువల్లనే ప్రాంతీయ ఉద్యమాలు అనబడేవాటిలో ఎన్ని పరిమితులు ఉన్నా వాటిలో ప్రజల జీవిత ప్రమాణాల మెరుగుదల గురించిన ఆకాంక్షలు ఉన్నంతవరకూ అవి అభివృద్ధికరమైనవే. ఈలోగా వాటిని హైజాక్ చేయదలచిన, చేస్తున్న పాలకముఠాల ఎత్తుగడలను విప్పి చెపుతూ, నిజమైన ప్రజా ఆకాంక్షలను గుర్తిస్తూ, ఎత్తిపడుతూ, ఆ ఆకాంక్షల సాఫల్యం కోసం చిత్తశుద్ధితో పోరాడగలిగిన నాయకత్వాన్ని అభివృద్ధి చేయడమే, అందుకు అవసరమైన అవగాహనలను అందించడమే లక్ష్యంగా ప్రజానుకూల బుద్ధిజీవులు పనిచేయ వలసి ఉంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

12 Responses to ప్రాంతీయ ఉద్యమాలను ఎలా అర్థం చేసుకోవాలి?

 1. తెలుగుబాటసారి says:

  అసలు విషయం చెబితే తెలంగాణవారు బాధపడతారు. కోఫగిస్తారు కూడా. కానీ చెప్పక తప్పదు. మీరు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలకు వెనకబడి ఉండడంలో ఉన్న ఆనందం ముందుకెళ్ళడంలో లేదు. అసలు ముందుకెళ్ళాలనే కోరికే శూన్యం. అంతా వెనకచూపే. యాంబిషను, పెద్ద ప్రణాళికలూ, దూరాలోచన ఎరగరు. కోస్తాజనంతో పోలిస్తే కష్టపడే మనస్తత్త్వం ఉన్నవాళ్ళు తెలంగాణలో చాలా తక్కువ. మార్పు లేకుండా ఉన్నచోట ఉండిపోవడమే తెలంగాణకు అభిమతం. వారు ప్రతి మార్పుని ఆంద్రోల్ల కుట్రగా అభివర్ణిస్తారు. గొప్పైనా పేదైనా, సగటు కోస్తాజనం ఒక డైనమిక్ జనసమూహం. అందుకే అక్కడ పుట్టినంతమంది పారిశ్రామికవేత్తలూ, మేధావులూ, కవులూ, కళాకారులూ రచయితలూ రాష్ట్రంలోని మిహతా ప్రాంతాల్లో లేరు.

  మీరు చెబుతున్నట్లు తెలంగాణ వనర్లని ఇతరప్రాంతాలకు తరలించడం జరగలేదు. తద్భిన్నంగా ఇతరప్రాంతాల వనరులే తెలంగాణకు తరలివచ్చాయి. దీన్ని Reverse mobilization అని చెప్పుకోవచ్చు. ఉమ్మడిరాష్ట్ర వనరుల్ని వాడుకొని తెలంగాణ చాలా బాగుపడింది. నిజానికి తెలంగాణ ఉద్యమం లాంటిది నాన్-తెలంగాణ ఏరియాల్లో రావల్సి ఉంది. కానీ ఆశ్చర్యకరంగా అది అక్కడ కాక, తెలంగాణలో రావడం ఒక రికార్డు బ్రేకు. కోస్తా పెట్టుబడిదారులు తమ వనరుల్ని తమ ప్రాంతాల మీద కాక తెలంగాణమీద మదుపు చేశారు. అందుకు ఇప్పుడు బాధపడుతున్నారు. ఆంధ్రా ఏరియా తెలంగాణ కంటే సౌకర్యాల విషయంలో, పరిశ్రమల విషయంలో ఎన్నో దశాబ్దాలు వెనకబడి ఉంది. నేను చెప్పడం కాదు, మీరే స్వయంగా వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఒకవేళ రాష్ట్రం విడిపోతే ఆ ప్రాంతాలు తెలంగాణతో సమానం కావడానికి చాలా దశాబ్దాలు కష్టపడాల్సి వస్తుంది.

  • sravan says:

   @తెలుగుబాటసారి! u can’t say that!! i don’t know wat u have studied. but ur analysis about telangana is quitely wrong.

  • sravan says:

   @తెలుగుబాటసారి! u can’t say that!! u can have great fealing abt ur birth place! but other places also same like.
   ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని చెప్పడానికి నీకు అధికారం లేదు. ఒక ఆఫ్రికన్ కు ఆఫ్రికా ఎంత ఇష్టమో (స్వస్థలం) అదే అందరికీ వుంటుంది. ఒకచోట విజ్ఞానులు, మరోచోట అజ్ఞానులు పుట్టరు!!!
   ఏమన్నారు?? “” అక్కడ పుట్టినంతమంది పారిశ్రామికవేత్తలూ, మేధావులూ, కవులూ, కళాకారులూ రచయితలూ రాష్ట్రంలోని మిహతా ప్రాంతాల్లో లేరు.””

   ఆ మాటకొస్తే మీరంతా విజ్ఞానులు కనక మీరు తెలంగాణ, రాయలసీమ వారితో విడిపోయి అభివృద్ధి చెందండి. మీ అవసరము కూడ వారికి లేదు.

 2. తెలుగుబాటసారి says:

  శ్రవణ్ గారూ ! ఉన్నమాట చెప్పానని ఊరికే ఉడుక్కొని లాభమేముంది, మీరు తెలంగాణలోని బౌద్ధిక వాతావరణాన్ని మార్చలేనప్పుడు ! (మార్చడం సంగతి అలా ఉంచి, అసలు బౌద్ధిక వాతావరణమే తెలంగాణలో లేదు. అందరూ “ఇదిగో పులి అంటే అదిగో తోక” అనేవారూ, ప్లాటిట్యూడ్స్ మాట్లాడేవాళ్ళూ, ఆవేశపరులే తప్ప స్థిమితంగా కూర్చుని తర్కించే ఓపిక గల ఆలోచనాపరులెవ్వరూ తెలంగాణలో లేరు. అలాంటివాళ్ళెవరన్నా అరుదుగా ఉంటే వారిని తెలంగాణవాదులు మీద పడి చంపేస్తారు.) అభిమానాల కంటే విశ్లేషణ ముఖ్యం. కోస్తావారిమీద నాకు ప్రత్యేక అభిమానమేమీ లేదు. కోస్తాతో తెలంగాణ సమానమైతే సంతోషించేవాళ్ళలో నేను మొట్టమొదటివాణ్ణి. ఎందుకంటే ఈ ప్రాంతీయ గొడవల వెనక అసలు కారణం – బౌద్ధిక, సాంస్కృతిక ఎదుగుదల విషయంలో ప్రాంతాల మధ్య చరిత్రగతిలో ఏర్పడ్డ వ్యత్యాసాలు. వీటిని సరిచేయగలిగితే మనం సమైక్యం గురించి పదేపదే మొత్తుకోవాల్సిన అవసరం ఉండదు. మన పూర్వ తెలుగు నాయకులు మన ప్రాంతాల్ని రాజకీయంగా ఏకం చేశారు తప్ప ఈ వ్యత్యాసాల్ని సరిచేసే ప్రణాళికేదీ వారి దగ్గర లేదు. రాష్ట్రం ఏర్పడ్దాక రాజకీయాలకే ప్రాధాన్యం పెరిగింది. ప్రాంతాలని మానసికంగా, భావోద్వేగపరంగా కలిపి ఉంచాల్సిన అవసరం గురించి తదనంతర నాయకులు పూర్తిగా మర్చిపోయారు. అందువల్లనే ఈ రోజు మనం కలహించుకుంటున్నాం.

  నేను నిజంగానే ఉన్న విషయం వెల్లడి చేశాను. బహుశా నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదేమో ! కోస్తా డైనమిజమ్ గురించి అందరికీ తెలుసు, రాష్ట్రీయులకూ, రాష్ట్రేతరులకూ కూడా ! నేను చెప్పి చెడ్డవాణ్ణయ్యాననుకుంటా. తెలంగాణ బాగుపడాలంటే కోస్తావారి మార్గాన్ని గ్రహించి అందులో నడవక తప్పదు. ఊరికే ద్వేషించడం వల్ల ప్రయోజనం లేదు. ద్వేషం మన కళ్ళు పొడిచేసి మనల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. ఇలా ద్వేషించడం వల్లనే 54 ఏళ్ళు కలిసున్నా వారి నుంచి తెలంగాణ ఏమీ నేర్చుకోలేక వెనకబడిపోయింది. పైగా కోస్తావారి సద్గుణాల్ని దుర్గుణాలుగా ప్రచారం చేసి “తామేదో నైతికంగా కోస్తావారి కంటే మెరుగ్గా ఉన్నా”మనే వృథాభ్రమని తెలంగాణ ప్రజల్లో కలిగించి వారిని అలాగే ఉంచేశారు తెలంగాణాభిమానులు. హైదరాబాదులోని తెలంగాణవారు మాత్రం కోస్తావారితో సహజీవనం చేసి వారికి భాగస్వాములై వారి మార్గంలో నడిచి సంపన్నులయ్యారు. అందుచేతనే వివేకవంతులైన హైదరాబాదీ తెలగాణ్యులు రాష్ట్రవిభజనని వ్యతిరేకిస్తున్నారు. మిగతా జిల్లాలలో మాత్రం స్వాగతిస్తున్నారు.

  ఇటువంటి ప్రజల్ని పెట్టుకొని మీరు ప్రత్యేకరాష్ట్రం సాధించినా ప్రయోజనమేముంటుంది ? తెలంగాణ ముందుకు పోలేక యథామామూలుగా చతికిలబడే ఉంటుంది. అప్పుడు కూడా అన్ని రంగాలలోను ఆంద్రోల్ల నాయకత్వం యథామామూలుగా కొనసాగుతుంది. కారణం – అసలు లోపం స్థానిక ప్రజల్లోనే ఉంది. ఆంద్రోల్లలో లేదు. హైదరాబాదులో ఏ రంగంలో ఏ ప్రత్యేక నైపుణ్యం గల పనిమంతులు కావాలన్నా ఆంద్రోల్లని వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే. తెలంగాణవాళ్ళలో నైపుణ్యాలు ఉన్నవాళ్ళు అరుదుగా మాత్రమే లభిస్తారు. ఉదాహరణకి – కరుడుగట్టిన తెలంగాణవాదులు కూడా భవనాలు నిర్మించుకోవాలంటే ప్రకాశం జిల్లా మేస్త్రీల్ని పిలవాల్సిందే. గత్యంతరం లేదు. గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో డిమాండు చేసినట్లు మేస్త్రీపనుల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండు చేద్దామా ? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది ? ఆలోచించండి. ఎందుకు పనులు నేర్చుకోలేకపోతున్నారు తెలంగాణవాళ్ళు ? లేదా, వారి నైపుణ్యాలు ఆధునిక పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి ఎందుకు సరిపోవడంలేదు ? తెలంగాణ యొక్క ఈ వెనకబాటు ఆంద్రోల్ల సృష్టి కాదు. ఇది self-imposed. అది గ్రహించలేక ప్రత్యేకరాష్ట్రం వస్తే బాగుపడతామనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే – మీరు వ్యక్తిగతంగా ఏదైతే సాధించలేరో, దాన్ని సామూహికంగా కూడా సాధించలేరు. ముందు వ్యక్తిగతంగా ఎలా బాగుపడాలో తెలుసుకుంటే ఆ తరువాత సామూహికంగా ఎలా బాగుపడాలో కూడా అర్థమవుతుంది. కోస్తావారు చేసినది అదే.

  నిజం ఎప్పుడూ బాధాకరంగా ఉంటుంది. అది చెప్పినవాణ్ణి పీక పిసికి చంపుదామన్నంత కోపం కూడా వస్తుంది. కానీ ఒక నిజాన్ని ఒకడు చెప్పకపోతే అది మనంతట మనమైనా గ్రహించక తప్పని పరిస్థితిని దేవుడు కల్పిస్తాడు. ప్రకృతి కల్పిస్తుంది. పరిస్థితులు కల్పిస్తాయి.

  ప్రాంతమంటారా ? ఆంధ్రప్రదేశ్ అంతా నా ప్రాంతమే. అందరూ నావాళ్ళే. తెలంగాణవాళ్ళూ నావాళ్ళే. కానీ నావాళ్ళు అని చెప్పి నేను సమస్య మూలాల గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తే, వారిని ఊరికే పొగిడి ఆకాశానికెత్తితే నేను తెలంగాణకి మేలు చేసినవాణ్ణవుతానా ? కీడు చేసినవాణ్ణవుతానా ?

  • సాధారణంగా నేను నా రచనల మీద వచ్చే అభిప్రాయాలకు జవాబు చెప్పాలని, ఆ చర్చలో పాల్గొనాలని అనుకోను. ఒకరి అభిప్రాయ వ్యక్తీకరణ బయటి ప్రపంచంలోకి వెళ్లాక దానిమీద ఎవరికైనా ఏ వ్యాఖ్య అయినా చేసే హక్కు ఉంటుంది. ఆ హక్కును గౌరవించడం ఒక ప్రజాస్వామిక విలువ అని నా బ్లాగ్ శీర్షికలోనే వోల్టేర్ మాటలతో సూచించాను. అయినా తనకు తానే హేట్ వెబ్ (ద్వేష జాలం – అబ్బ ఎంత సముచితమైన నామకరణం!!) అని పేరుపెట్టుకున్న తెలుగు బాటసారి ద్వేషాన్నీ అజ్ఞానాన్నీ అతిశయాన్నీ చదువుతుంటే ఏం చేయాలో తెలియడం లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోకపోవడం ఒక ఎత్తయితే చరిత్ర గతిలో తలెత్తిన అసమానతల గురించి తెలిసినట్టు మాట్లాడుతూనే, ఆ అసమానతలను తొలగించడానికే రాసి ఇచ్చిన ఒప్పందాలను కోస్తాంధ్ర – రాయలసీమ పాలకవర్గాలు ఎందుకు అమలు చేయలేదో చరిత్ర తెలియనట్టు నటించడం మరొక ఎత్తు. తెలంగాణ మాగాణంలో వికసించిన అద్భుతమైన సాహిత్య, సాంస్కృతిక, రాజకీయార్థిక విశ్లేషణా సృజనను, తెలంగాణ ప్రజలు వెయ్యి సంవత్సరాలుగా నిలుపుకుంటున్న ధిక్కార సంస్కృతిని ఈ తెలుగు బాటసారి తెలుసుకోగలిగితే ఎంత బాగుండును!!!

 3. sunamu says:

  మీ ప్రశ్న విషయంలో చాలా విస్తృతమైనది. కాని సమాధానాలలో మళ్ళీ అది సంకుచితమైపోతోంది.
  ప్రాంతంగా ఎవరు ఎవరిని పిలిచినా, భౌగోళికంగా నిర్దేశించినా, ప్రజలే ఆ విభజనలో భాగమో కాదో నిర్ణయించుకుంటారు (మీరు చెప్పిన బళ్ళారి లాగ).
  ప్రజలకు పాలకుల కంటే తమ వెనుకబాటు తనం గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. వాళ్ళు నిత్యజీవితాన్ని ఎదురుగా చూసి తైపార వేసుకుంటారు (Compare చేసుకుంటారు) గనుక. పాలకులు అలా కాదు… వాళ్ళ దగ్గరికి వచ్చిన సమాచారం మీద ఎక్కువగా ఆధార పడతారు. ఇందులో నిజం పాలు సందేహాస్పదం. గణాంకాలు నిజం చెబుతాయి గాని వాటిని నిజం చెప్పనీయరు. [ఈ కథ నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఒకరు చెప్పింది : జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తండ్రి గారు ఒక సుప్రసిద్ధ గణాంక వేత్త. స్వాతంత్ర్యం రాకముందు ఒక సారి ఒక గణాంక సూచీ ( Statistical Index) విలువ ఎక్కువ ఉండడం చూసి, తన పై అధికారికి తను సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తుంది గనుక ఆ విలువలో చిన్న మార్పు చెయ్యమని సుబ్రహ్మణ్య స్వామి తండ్రి గారి పై అధికారి అయిన ఇంగ్లీషు దొర అతన్ని కోరితే, అతను తన ఉద్యోగులు కష్టపడి సంపాదించిన సమాచారం ఆధారంగా వచ్చిన సూచీ ఇది , దీనిని మార్చలేను అని, వాదోపవాదాల తర్వాత తన రాజీనామా సమర్పిం చేడట.] దీనిని అత్యవసర పరిస్థితిలో ఇందిరా గాంధీ హయాంలో జరిగిన సంఘటన తో పోల్చండి. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం జీవన వ్యయ సూచీ ననుసరించి ఇచ్చేవారు. ఎమెర్జెన్సి లో ధరలు పెరుగుతున్నా ఒక సారి ధరలు తక్కువ ఉన్నాయని గణాంకాలు సరిదిద్ది, ఇచ్చిన కరువుభత్యం ఒక వాయిదా వెనక్కి తీసుకుంది ప్రభుత్వం.
  ప్రకృతి తన వనరులు అన్ని ప్రాంతాలకూ సమానంగానే పంచుతుంది. కాని ప్రతి వనరునీ అన్నిచోట్లా సమానంగా పంచదు. మనుషులు కూడా ప్రకృతిలోని వనరులే. కనుక ఒక చోట మేధావులు పుట్టి ఇంకొక చోట తెలివితక్కువ వాళ్ళు పుట్టరు. అది ప్రాంతమైనా, కులమైనా, వర్గమైనా దేశమైనా ఒక్కటే. కాకపొతే గుర్తింపులోనే తేడాలన్నీ.
  ఉద్యమాలు ఎందుకు వస్తాయి అన్న విషయానికి వస్తే … ఏ కాలంలో నైనా సమాజం దాని ప్రశ్నలకు సమాధానాలు అదే వెతుక్కుంటుంది. ఒకే ప్రశ్న విభిన్న కాలాలలో/ ప్రాంతాలలో ఎదురైనా దాని సమాధానం ఒక లాగ ఉండదు. ఉద్యమం అన్నది ఒక సామాజిక సమస్యకు ప్రజలు ఎన్నుకునే సమాధానం. అంటే పాలకులకు అ సమాధానం అవగాహన అవకో, అవగాహన అయినా దాన్ని తమ స్వంత ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్న స్వార్థం తోనో, నొక్కిపెట్టడానికి ప్రయత్నించి నపుడు, ప్రజలే ఆ సమాధానాన్ని తెలియజెప్పడానికి చేసే ప్రయత్నం ఉద్యమం. అది భాషకు సంబందించినదైనా, విమోచనకు సంబంధించిన దైనా కావచ్చు. తమ వెనుకబాటు తనం గురించి సామాన్య ప్రజలకు, మేధావులనబడే వారి కన్నా చాలా అవగాహన ఉంటుంది. వాళ్లకి చిత్త శుధ్ధి కూడా ఉంటుంది. ఎటొచ్చీ ఈ మేధావులతోనే మనకు తంటా. ( For every Statement there are exceptions. They are excepted here ) వీళ్ళకు చిత్త శుధ్ధి కంటే విత్త శుధ్ధి ఎక్కువ. కనుక వాళ్లకి ఏ గూడులో జేరితే లాభమో, ప్రాణానికి నిరపాయమో , ఆ గూడులో సందర్భాన్ని బట్టి మారుతుంటారు. (నిరక్షరాస్యుడికి చదువుమీద ఉన్నంత గౌరవం చదువుకున్న వాళ్లకు లేకపోవడం నేనెరిగిన సత్యం. ఇది చాలా మందికి అనుభవమై ఉండవచ్చు కూడా)
  కాకపొతే economic inequality అన్నది Roulette Machine లాంటిది. అది నచ్చకపోతే భూకంపం తర్వాత వచ్చే upheaval అనుకోవచ్చు. అందుకే మనం “Rags to Riches” వింటుంటాం. అది వ్యక్తులకే కాదు సమూహాలకు కూడా వర్తిస్తుంది. (గోదావరి ఆనకట్ట రాక ముందు గోదావరి జిల్లాలు ఉత్తి చవిటి నేలలు.) పెట్రోలు నిల్వలు కనుక్కున్న తర్వాత మధ్య ఆసియా దేశాలలో కొన్నిటి జాతకం మారిపోయింది) బండ్లు ఓడలవడం అంటే ఇదే. దీన్ని ఎవరూ ఆపలేరు. అది ప్రకృతి పరిణామ క్రమం. అందులోని అంతర్భాగమే ప్రజలు తీసుకు వచ్చే ఉద్యమాలు కూడా.
  అయితే ఇదంతా సహజ పరిణామ క్రమంలో వచ్చే విషయంలో నిజం. కాని, ఇప్పుడు ప్రభుత్వ ప్రేరేపిత ఉద్యమాలు చాలా వస్తున్నాయి, వచ్చేయి కూడా. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మార్చాలన్నప్పుడల్లా పాత బస్తీలో అల్లర్లు రేగుతుండేవి (దీన్ని ఉద్యమం తో పోల్చ తగదు అని అనుకోవచ్చు. కాని ఇప్పుడు జరిగే అల్లర్లను బట్టి ఉద్యమాలుగా పరిగణిస్తున్న నేపధ్యం లో ఇది అనివార్య మైంది) ఒకప్పుడు. అగ్రరాజ్యాలు (ఇప్పటికీ ) తమకు అనుకూలమైన పాలకులు లేనిచోటల్లా ప్రభుత్వాలపై తిరుగుబాటును ప్రోత్సహించడం షరా మామూలే.

  కనుక ఇప్పటి ఉద్యమాల గురించి ఎందుకు వస్తాయో , ఎలా వస్తాయో, అవి ప్రజా ఉద్యమాలో కావో కొన్ని సందర్భాలలో ఖచ్చిత మైన సమాధానం ఇవ్వడం కష్టం. కాని ఒకటి మాత్రం నిజం. ప్రజా ఉద్యమాలకు కొలమానం అందులో ప్రజల నిబద్ధత. వాళ్ళ త్యాగం. నాయకుల త్యాగం. ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివెయ్యడమో, వాయిదా వెయ్యడమో చెయ్యగలరేమో గాని , ప్రజలందరూ అకాంక్షించినపుడు దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.

 4. తెలుగుబాటసారి says:

  వేణుగోపాల్ గారూ !

  నన్ను మీరు ఒక కోస్తావాడనుకొని ఒక వ్యాఖ్య కూడా రాసేశారు. సంతోషం. నా మెయిల్ ఐ.డి.లో ఉన్న hate నామవాచకం కాదు, క్రియాపదం. అది ఇంటర్నెట్ విషయమై.

  “అంతా వేర్పాటువాదులకే తెలుసు, సమైక్యవాదులకి ఏమీ తెలియదు.” అంతే గదా మీ అభిప్రాయం. ఒక ప్రాంతం బాగుపడాలంటే ఒప్పందాలూ, సూత్రాలూ మార్గం కాదు. అది ప్రయోగపూర్వకంగా చరిత్ర నిరూపించిన సత్యం. అయినా ఇంకా మీరు ఆ TRS తర్కంతోనే మాట్లాడడం ఆశ్చర్యకరం. మీరు తెలంగాణలాంటి ప్రాంతాలకు ఒకేసారి రెండులక్షల కోట్లు మంజూరు చేసినా అవి బాగుపడడం కష్టం. ఎందుకంటే అసలది బాగుపడే మార్గమే కాదు. అసలు విషయం, డబ్బులో గానీ, ఉద్యోగాలలో గానీ ప్రాజెక్టులలో గానీ లేనే లేదు. ముందు ప్రజల సాంస్కృతిక స్థాయినీ, బౌద్ధికస్థాయినీ మెరుగుపరచకుండా వారిని ఆర్థికంగా బాగుచేయలేం. తెలంగాణవారి సాంస్కృతికస్థాయి వారిని అన్నిరంగాలలోను అగ్రగాములుగా నిలపగల మట్టంలో లేదని నేనంటున్నానంటే – మీరు బాధపడతారని అసలు విషయాన్ని చాలా మైల్డ్ గా మార్చి చెబుతున్నానని అర్థం చేసుకోండి. తెలంగాణ సాంస్కృతిక స్థాయిని చాలా కష్టపడి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. వేర్పాటువాదులు అది మానేసి జనాన్ని రెచ్చగొట్టి వారిని ఇంకా డౌన్‌గ్రేడ్ చేస్తున్నారు.

  అదే విధంగా మన రాయలసీమవారు యాభై వేల కోట్లు డిమాండు చేస్తున్నారు. ఆ డిమాండు గురించి కూడా నేను అదే అంటాను. బాగుపడడానికి ప్రాథమికంగా ఆయా ప్రాంతాలలోని ప్రజల వ్యక్తిగత, కౌటుంబిక శ్రమ, కృషి, చాలా అవసరం. తెలంగాణలో అది లోపించిందనే నా అభిప్రాయం. అందుకే కోస్తా మల్టినేషనల్స్ ఉన్నాయి. కానీ తెలంగాణ మల్టినేషనల్స్ ఏవీ లేవు. అసలు తెలంగాణకు చెందిన రాష్ట్రస్థాయి కంపెనీలు కూడా ఏమీ లేవు. వారు కోస్తావారిని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. నేర్చుకోవడంలో తప్పులేదు. అది అవమానకరమైన విషయమేమీ కాదు. అది అవమానకరమని భావించి మీరు పై వ్యాఖ్య వ్రాశారని నాకు అనిపిస్తున్నది. తెలంగాణవారు నేర్చుకోవాలని అనడమే మీ గుండెలో కలుక్కుమని గుచ్చుకున్నది. కానీ నా మీద కోపం తెచ్చుకోకుండా స్థిమితంగా ఆలోచించండి. నా తాత్పర్యం మీకు బోధపడుతుంది. విమర్శించడం సులభం. కానీ నేర్చుకోవడం కష్టం. మొదటిదానికి అహంకారం సరిపోతుంది. కానీ రెండో దానికి దాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఆ కోస్తావారే ఒకప్పుడు అనేక ఇతరజాతుల నుంచి సిగ్గువిడిచి నేర్చుకొని ఈ స్థాయికి ఎదిగారు. వారు బాగుపడడానికి ఏ ఒప్పందాలు అవసరమయ్యాయి ? ఎవరు ఏ ప్రత్యేక ప్యాకేజిలు వారికి ప్రకటించారు ? ఎవరు ఏ ప్రాంతీయ రిజర్వేషన్ వారికిచ్చారు ? ఒకసారి ఆలోచించండి. అది నిజంగా నిస్సందేహంగా చాలా సత్తా ఉన్న జనాభా. ఆర్థికపరంగా అందరూ చూసి నేర్చుకోదగ్గ జనాభా. అందుచేత వారితోనే ఇతరులు ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చింది. వారిని చూసి ఇతరులు భయపడే పరిస్థితి కూడా ఉంది, వారి దగ్గర రాజధానీనగరం లాంటివేమీ లేకపోయినా ! వారు భూముల్ని కొనకుండా కర్నాటక ప్రభుత్వం చట్టాలు కూడా చేయాల్సివచ్చిందంటే వారి Financial long hand ఎంత దూరం వెళ్ళిందో ఆలోచించండి. వారు ఈరోజు మహారాష్ట్రలో యావత్తు విదర్భప్రాంతాన్ని ఋణగ్రస్తం చేసి గుప్పిట్లో పెట్టుకున్నారంటే ఆలోచించండి. ఇదంతా ఎందుకు ? తెలంగాణ విషయంలో కేంద్రం సానుకూల ప్రకటన చేసి కూడా ఎవరిని చూసి తక్షణం వెనక్కు తగ్గాల్సివచ్చిందో ఆలోచించండి. ఇదంతా వేలాది, లక్షలాది కోట్ల రూపాయల డబ్బు, దాని ద్వారా సంపాదించిన అధికారమూ, పరపతీ రిమోట్ కంట్రోల్ లేకుండానే, ఆ డబ్బు వెనక దాన్ని సంపాదించిన ఆ ప్రజల యొక్క దశాబ్దాల కఠోరదీక్ష, పట్టుదల లేకుండానే సాధ్యమైందా ? ఆలోచించండి. ఇప్పుడు కరెక్టుగా చెప్పండి, వారిని చూసి తెలంగాణవాళ్ళు చాలా నేర్చుకోవాలని నేనంటే అందులో తప్పేముందో !

  “తెలంగాణ ప్రజల ఆకాంక్షలు”

  చాలా తరచుగా వింటున్నామీ మాట. ఏమిటా ఆకాంక్ష ? మిగతా తెలుగువారినుంచి వేరుపడాలని ! వేరుపడడం వెనక ఉద్దేశ్యం ? వేరుపడడానికి గల ప్రయోజనం ? అగమ్యగోచరం. తామెందుకు వేరుపడాలనుకుంటున్నారో తమకే సరిగా తెలియదు. తాము వేరుపడాలని నిశ్చయించుకొని “ఇతరులే తమని వేరుగా చూస్తున్నా”రనే తప్పుడు వాదాన్ని రివర్సులో లేవదీశారు. బహుశా తెలంగాణ అనే పేరు కోసం ఈ తాపత్రయం. కానీ ఇతర తెలుగు ప్రాంతాలక్కూడా వారి ప్రాంతాల పేరుతో ప్రత్యేక రాష్ట్రాలు లేవు. ఇంతకుముందూ, ఇప్పుడూ కూడా ! అటువంటప్పుడు అలాంటిదొకటి తెలంగాణకు లేకపోతే అదొక పెద్ద అన్యాయమేమీ కాదు. ఇది కూడా కేసీయార్ కి మంత్రిపదవి ఉన్నంతకాలం తలెత్తలేదు. అది ఊడినాకనే తలెత్తింది. అంతకుముందు కూడా నేను బతికే ఉన్నాను. అప్పుడెవరూ ఈ ఆకాంక్షల గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాదు. ఇది 60 ఏళ్ళనాటి ఉద్యమమని అబద్ధాలు కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

  • gajula says:

   telugubhatasaari,anna! neeku namaskaarame.kalla mundu telangaana vaallaku inni anyaayaalu jarugutunna meeku kanapaddamu ledu.thama brathukule bhanisabrathukulaithe ika abhivruddi etlaa avuthaaru.nehru polika gurthu ledaa-amaayakapu ammayi(telangana),thuntariabbayi(andhra)-idi chaaladaa andhrapradesh yerpadetappudu telangana etlundeno cheppadaaniki?voka samaajamu abivruddiki-vaati paalakulu,vyavasaayamu,neetipaarudala,chaduvu,bhaasha,bhayatiprapanchamuthosambandaalu,samsruthi ivanni dhohadamu chesthaayi.mari andhraatho ,telangananu yevidangaa samaanasthayi vundo bhatasaari kaabatti meeru cheppali.anaa!neevu bhaatasaarivi kadane-telanganaku evarevaru,etletla anyaayamu chesaaro neeku thelvadaane.leka andrhlloku longipoyi itlaa maatladatha vundaavo jara chepparaade.neeku ivemi thelvadante ,inka ennirojulani pichhonilaaga thiruguthaave ,neeku andhra nachhithe akkade settle ayi challagaa vunde anna!maa gurinchi marchipoye,maa brathukulu memu brathukuthame,nuvvu challagaa vunde anna.

 5. sravan says:

  “”కోస్తాతో తెలంగాణ సమానమైతే సంతోషించేవాళ్ళలో నేను మొట్టమొదటివాణ్ణి””
  అన్నారు కదా ! మీరు తెలుసుకోవాల్సి వున్న విషయం ఒకటి : ఏ ప్రాంతము ఇంకో ప్రాంతంతో సమానమవదు. అమెరికా భారత్ అవదు. భారత్ అమెరికా అవదు. అట్లే తెలంగాణా కోస్తా అవదు. కోస్తా తెలంగాణా అవదు. అలా మారాల్సిన అవసరమూ లేదు. కోస్తా గొప్ప కోస్తాది. సీమ గొప్ప సీమది. తెలంగాణా గొప్ప తెలంగాణాది.
  “”తెలంగాణ బాగుపడాలంటే కోస్తావారి మార్గాన్ని గ్రహించి అందులో నడవక తప్పదు””
  బాగుపడడం అనేది ప్రాంతీయ అతీతం. ఎవరూ ఎక్కడా 100% బాగుగా లేరు. కొద్ది అసమానతలు తప్పదు. ఎవరికివారు స్వయంప్రతిపత్తి కోరటం సహజమే . చరిత్ర లో విడిపోవటానికే ఉద్యమాలు జరిగాయి.(జర్మనీ లాంటివి చాలా కొన్ని మాత్రమే మినహాయింపు)

  మీ ఇంట్లో వాళ్ళనే ఉమ్మడి గా వుంచలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఉమ్మడిగా వుంచాలని ఎలా కోరుతున్నారు?

 6. sravan says:

  “”ఇది 60 ఏళ్ళనాటి ఉద్యమమని అబద్ధాలు కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.””
  u really don’t know abt history. once try to read dasarathi krishnamachari’s JEEVANA YANAM

 7. sravan says:

  @sunamu and @venugopal

  i am agreeying with u.
  i am from vizag. but my native is kurnool dist. i studied in telangana.
  కనీసం ఒక పది జిల్లాలు తిరిగినవారు, అక్కడి పరిస్థితులు పరిశీలించినవారు (నిస్వార్థంగా) ఈ చర్చ చేసేందుకు ప్రముఖులు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s