ఎవరికోసమీ ఎక్సైజ్ విధానం?

ప్రభుత్వానికి ఒక ఎక్సైజ్ విధానం అనేది ఉంటుందని, ప్రజలు తాగే మద్యంమీద పన్నులు విధిస్తూ ఆదాయం సంపాదించడమే ఆ విధాన లక్ష్యమని తెలిసిన మధ్యతరగతిలో సాధారణంగా రెండు రకాల ప్రతిస్పందనలు ఉంటాయి. ఒకటి, ‘మరి ప్రభుత్వానికి పాలన నడపడానికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి   నిధులు అవసరం కదా, వీలయిన అన్ని మార్గాలలోనూ పన్నులు వసూలు చేయాలి గదా, లేకపోతే ఇంతమంది ప్రభుతోద్యోగులకు జీతభత్యాలు, ఇన్ని పాఠశాలలు, ఇన్ని ఆస్పత్రులు, ఇన్ని ప్రజారవాణా సాధనాలు, వగైరా వగైరా ఎలా నడుస్తాయి’ అని చాలమంది ప్రశ్నిస్తారు. ఈ రూపంలో పన్ను ఎంత వస్తుందో, ప్రభుత్వ ఖర్చులలో ఈ ఆదాయం లేకపోతే వచ్చే లోటు ఏమిటో, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఉన్నాయో లేవో వారికి స్పష్టంగా తెలియకపోవచ్చు. కాని వారికి ఇటువంటి అవగాహన ప్రచార సాధనాల నుంచి అంది ఉంటుంది. ఇటీవల ఒక సినిమాలో హాస్యంలాగ ఒక పాత్ర నోట పలికించిన సంభాషణలో ‘మేం తాగుబోతులం కాం. టాక్స్ పేయర్స్ మి. మేం తాగి పన్నులు చెల్లించకపోతే  ఈ పాలనే నడవదు’ అనే మాట ఈ అవగాహనకు ఒక ఉదాహరణ. ఇక మరొక ప్రతిస్పందన తాగడం అనేదాన్ని నైతికదృష్టితో, ఆరోగ్యదృష్టితో చూసి అది అనైతికమనో, తప్పు అనో, అనారోగ్యకరమనో భావిస్తుంది. ‘మనుషులు తాగగూడదు’ అనే ఆదర్శాన్ని ప్రకటిస్తుంది.  తాగడం వల్లనే చాల నేరాలు జరుగుతున్నాయని అనుకుంటుంది. ఈ తాగుబోతుతనాన్ని ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయో అని ఆశ్చర్యపోతుంది. ప్రభుత్వాలు నిర్బంధపూరితంగానైనా సరే మద్యనిషేధ విధానాన్ని అమలు చేయాలని, అంటే ఎక్సైజ్ విధానాన్ని వదులుకోవాలని కోరుతుంది.

ఈ ‘పన్ను చెల్లింపుదారు’ అవగాహన గాని, ‘వ్యసనపరుడు’ అవగాహన గాని ప్రభుత్వ ఎక్సైజ్ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సరిపోవు. ఎక్సైజ్ విధానానికి చారిత్రక మూలాలూ, దానివల్ల  పాలకులకు రాజకీయార్థిక సాంస్కృతిక ప్రయోజనాలూ ఉన్నాయి గనుక, దాన్ని కేవలం పన్నుల వనరు గానో, వ్యసనంగానో చూస్తే అరకొరగానే అర్థమవుతుంది. తప్పనిసరిగా ఎక్సైజ్ విధానంలో పన్ను ఆదాయం కోణం, మద్యపానంలో వ్యసనం కోణం ఉన్నాయి గాని ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతిలో ఎక్సైజ్ విధానం వల్ల పాలకవర్గాలకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు రాజకీయ, సాంస్కృతిక ప్రయోజనాలు కూడ ఉన్నాయి. అందుకే ఈ వ్యవస్థ ఇలాగే ఉన్నంతకాలం పాలకులు ఆ ఎక్సైజ్ విధానాన్ని వదులుకోవడం, మద్యనిషేధాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం సాధ్యం కాదు. నిజానికి ఈ మద్యం మీద, మాదకద్రవ్యాల మీద పన్నులు విధించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదే అయినప్పటికీ, వామపక్ష ప్రభుత్వాలతో సహా ఏ పార్టీ ప్రభుత్వాలు కూడ తాము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలలో ఎక్సైజ్ విధానాన్ని సమూలంగా మార్చడానికి ప్రయత్నించలేదు. “మద్య నిషేధం ఆచరణ సాధ్యమైన విధానం కాదు గనుక, కల్తీ చేసిన, పన్ను చెల్లించని మద్యాల తయారీని, సరఫరాను, అమ్మకాలను అడ్డుకోవడం,  రాష్ట్రానికి రాగలిగినంత ఎక్కువ పన్ను ఆదాయాన్ని రాబట్టడం అనే రెండు కర్తవ్యాలు ప్రభుత్వం ముందున్నాయి” అని పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వం కూడ అంటున్నది.

ప్రస్తుతం నడుస్తున్న ఎక్సైజ్ విధానానికి రూపాలు చాల మారి ఉండవచ్చు గాని సారాంశంలో ప్రజల మద్యపానపు అలవాటు మీద ప్రభుత్వాలు సొమ్ముచేసుకోవచ్చుననే ఆలోచన కౌటిల్యుని అర్థశాస్త్రం నాటినుంచీ ఉంది. అనేక రకాల మద్యాల గురించీ, మద్యపానాన్ని ప్రభుత్వం నియంత్రించడం గురించీ, తాగే స్థలాల గురించీ, తాగే వారి అర్హతల గురించీ, పన్నుల విధానం గురించీ అర్థశాస్త్రం వివరంగా చెప్పింది. అంటే క్రీ.పూ. రెండో శతాబ్దానికీ, క్రీ.శ. రెండో శతాబ్దానికీ మధ్య కాలానికే మద్యపానం మీద పాలకులు పన్నులు వసూలు చేయవచ్చుననే ఆలోచన ఉందని అనుకోవచ్చు. కాని ఆశ్చర్యకరంగా అర్థశాస్త్రంలోనే “ఎవరయినా వారి ఆదాయానికి మించి మద్యపానం చేసినా, భవిష్యత్తుకోసం ఆదా చేయకుండా మద్యపానం చేసినా వారిని రక్షకభటులకు అప్పగించాలి” అనే నిబంధన కూడ ఉంది.

ఏమైనా, అప్పటినుంచి బ్రిటిష్ అధికారం వచ్చేదాకా దేశంలో రాచరికం, భూస్వామ్యం కొనసాగాయి గనుక, ఆ నాటి విలువలలో విలాసాలకు, అందులోనూ మద్యానికి ప్రాధాన్యత హెచ్చు గనుక మద్య అనుకూల విధానాలే కొనసాగాయి.

పెట్టుబడిదారీ విధానంలో అన్ని అంశాలనూ లాభనష్టాల దృష్టితో చూడడం జరుగుతుంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయం గురించి కూడ ఆ దృక్పథమే సాగింది.  అయితే అదే సమయంలో పెట్టుబడిదారీ విధానం తొలిరోజుల్లో బ్రిటన్ లో కొన్ని రంగాలలో నైతిక దృష్టితో కలగలిసి సాగింది. అందుకే పెట్టుబడిదారీ విధాన సిద్ధాంతకర్త ఆడమ్ స్మిత్ తన వెల్త్ ఆఫ్ నేషన్స్ లో మద్యపానం మీద పన్ను గురించి రాసినది చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. “మత్తెక్కించే మద్యాలు సామాన్య ప్రజల ఆరోగ్యాలకు హానికరమైనవి గనుకా, వారి నైతిక వర్తనను కలుషితం చేస్తాయి గనుకా, వాటి వినియోగాన్ని తగ్గించే దిశగా ఇటీవల గ్రేట్ బ్రిటన్ లో పన్నుల విధానం ఉంది” అని ఆ హెచ్చు పన్నుల విధానాన్ని విమర్శిస్తున్న వారికి అది ఎందుకు అవసరమో ఆయన జవాబు చెప్పాడు. అంటే మద్యం మీద ఎక్కువ పన్ను వేసి దాని ధర పెంచడం ద్వారా దాని వినియోగాన్ని తగ్గించాలని బ్రిటిష్ ప్రభుత్వం కనీసం పద్దెనిమిదో శతాబ్దంలోనయినా అనుకున్నదన్నమాట.

అందుకే ఇటువంటి పన్నుల గురించి రాజకీయార్థిక శాస్త్ర పాఠ్య పుస్తకాలలో ‘నిరోధకంగా పనిచేసే పన్ను’ అనీ, ‘అపచారపు పన్ను’ అనీ, ‘పరిసరాలను చెడగొట్టకుండా ఉండే పన్ను’ అనీ, ‘ఆ అలవాటువల్ల కలిగే నష్టాలను పరిహరించడానికి వేసే పన్ను’ అనీ, ‘శిక్షగా వేసే పన్ను’ అనీ చెపుతారు. అయితే ఇవన్నీ పాఠ్య పుస్తకాల వరకే గాని ఈ పన్ను వల్ల నిజంగా మద్యపానం తగ్గిపోవాలని ప్రభుత్వాలు అనుకుంటున్న దాఖలాలు ఏమీ లేవు. ఎప్పటికప్పుడు ఎక్కువమంది తాగాలనీ, ఎక్కువ మద్యం వినియోగం కావాలనీ, తద్వారా ఎక్కువ పన్ను ఆదాయం రావాలనీ లక్ష్యాలు విధించి, అవి సాధించవలసిందిగా, అంటే బలవంతాన తాగించవలసిందిగా ప్రభుత్వాలే సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నాయి.

బ్రిటిష్ పాలనలోని మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం, స్వతంత్ర రాచరికంగా ఉండిన హైదరాబాద్ ప్రభుత్వం రెండూ కూడ మద్యం మీద పన్ను ఆదాయాన్ని ప్రధానంగా భావించాయి. హైదరాబాద్ ప్రభుత్వం చాల విషయాలలో బ్రిటిష్ పాలనావిధానాలను అనుసరించడానికి ప్రయత్నించింది. అంతకుముందు అరాచకంగా ఉండిన ఆబ్కారి (ఎక్సైజ్) విధానాన్ని సంస్కరించాలని, తక్కువ మద్యం వినియోగంతో ఎక్కువ ఆదాయం ఒనగూరే మద్రాసు పద్ధతి అమలు చేయాలని 1905లో భావించింది. నిజానికి మద్రాసు రాష్ట్రంలో మాదకద్రవ్యాల మీదా, మద్యం మీదా ప్రభుత్వ నియంత్రణ 1808లోనే మొదలయి 1886 మద్రాస్ ఆబ్కారీ చట్టం తో క్రమబద్ధమయింది. నాటుసారా, కల్లు, విదేశీ సారా, గంజాయి మొక్క నుంచి తయారయ్యే మత్తుపదార్థాలు, నల్లమందు అన్నీ ఈ చట్టం కిందికి తీసుకువచ్చారు. ఏ ప్రాంతంలో ఎన్ని సారా దుకాణాలు ఉండాలి, అక్కడ అమ్మే సారా ఎంత ఘాటయినది ఉండాలి నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉండేది. ఆ దుకాణాలు నడిపే లైసెన్సును ఏడాదికి ఒకసారి వేలం పాటలద్వారా నిర్ణయించేవారు. దానితోపాటు అమ్మిన పరిమాణాన్ని బట్టి సుంకం ఉండేది. అంటే మొత్తం మీద ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతాలలోనూ దాదాపు ఒకటే రకమయిన ఎక్సైజ్ విధానం కనీసం 1905 నుంచి 1947 దాకా సాగింది. మళ్లీ ఇప్పుడు కొనసాగుతున్న విధానం కూడ దాని నమూనాలోనే తయారయింది.

ఈలోగా భారత జాతీయోద్యమంలో ప్రభుత్వ వ్యతిరేక దృష్టి నుంచీ, నైతిక దృష్టి నుంచీ కూడ మద్యనిషేధం గురించి ఆలోచనలు, మద్యవ్యతిరేక పోరాట రూపాలు వచ్చాయి. “స్వాతంత్ర్యోద్యమాన్నయినా వాయిదా వేస్తాను గాని, మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని వాయిదా వేయలేను” అని గాంధీ అన్నాడు. అప్పటి ప్రభుత్వాదాయ వనరులలో ప్రధానమయినదిగా ఎక్సైజ్ ఆదాయం ఉండడం వల్ల మద్యపాన వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నంగా కూడ ఉండింది. బ్రిటిష్ ఇండియాలో అనేక చోట్ల సారా దుకాణాల ముందర ప్రదర్శనలు, సారా దుకాణాలు బద్దలు కొట్టడం, మద్యపాన వ్యతిరేక ప్రచారాలు సాగాయి. హైదరాబాద్ రాజ్యంలో కూడ అదేవిధంగా తాటిచెట్లను నరికే ఉద్యమం, గీసేవాడిదే చెట్టు అనే రూపంలో ప్రభుత్వానికి పన్ను కట్టబోమనే ఉద్యమం నడిచాయి. అయినా 1947 తర్వాత, మొక్కుబడిగా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో మద్యనిషేధం గురించి ఒక మాట చేర్చడం మినహా, ప్రభుత్వాలు దాన్ని తీవ్రమైన విషయంగా పరిగణించలేదు. ఎక్సైజ్ విధానాన్ని ఒక ఆదాయ మార్గంగా చూస్తూనే వచ్చాయి.

అధికార మార్పిడి తర్వాత మద్రాసు రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు జిల్లాలలో 1948లో మద్యనిషేధం ప్రారంభించి, ఆ తర్వాత దాన్ని రాయలసీమకు కూడ విస్తరించారు. 1952లో దాన్ని మొత్తం ఆంధ్ర ప్రాంతంలో అమలు చేశారు. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినతర్వాత కూడ తెలంగాణలో మద్యపానం కొనసాగుతుండగా, కోస్తాంధ్ర, రాయలసీమలలో మాత్రం మద్యనిషేధం అమల్లో ఉండేది. 1969 నవంబర్ 1 న ఆ ప్రాంతాలలో కూడ మద్యనిషేధాన్ని ఎత్తివేసి సారా, దేశవాళీ మద్యం అమ్మకాలను అనుమతించడం మొదలుపెట్టారు. 1986లో తెలుగుదేశం ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసింది. మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నడపడం మొదలుపెట్టింది. నెల్లూరు జిల్లా దూబగుంటలో మొదలయి జిల్లా అంతటా మద్య వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున సాగిన తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1993 ఏప్రిల్ లో నెల్లూరు జిల్లాలో, అక్టోబర్ నుంచి మొత్తం రాష్ట్రంలో సారా అమ్మకాలపై మాత్రం నిషేధం విధించింది. దేశవాళీ మద్యం (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ – ఐ ఎం ఎఫ్ ఎల్ అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఖరీదయిన మద్యం) అమ్మకాలు సాగనిచ్చారు.

ఆ తర్వాత ఎన్నికలలో మద్యనిషేధ వాగ్దానంతోనే అధికారానికి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 1995 జనవరి 16 నుంచి మొత్తం రాష్ట్రంలో మద్యనిషేధం విధించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1997లో ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. ఇక అప్పటినుంచీ ఏడాదికేడాదికీ ప్రభుత్వమే మద్యం అమ్మకాల లక్ష్యాలు నిర్ణయించి, ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ మద్యం అమ్మకాల ప్రోత్సాహంలో తెలుగుదేశం పార్టీకీ, కాంగ్రెస్ పార్టీకీ ఏమీ తేడాలేదు.

రాష్ట్రంలో అనుమతి పొందిన దాదాపు ఏడువేల మద్యం దుకాణాలలో, 800 బార్లలో మద్యం అమ్మకాలు సాగించే హక్కు ఎవరిదో నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ రెండు సంవత్సరాలకు ఒకసారి వేలం పాటలు నిర్వహిస్తుంది. ప్రతిసారీ వేలం పాటలు జరిగేటప్పుడు ప్రభుత్వమే గత వేలం పాట కన్న 15 శాతం పెంచి లైసెన్స్ ఫీజు నిర్ణయిస్తుంది. అంటే పాటలో నెగ్గాలంటే అంతకన్న ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడాలన్నమాట. మరోమాటల్లో చెప్పాలంటే గత సంవత్సరం కన్న ఈ సంవత్సరం కనీసం 15 శాతం ఎక్కువ మందిచేత, లేదా పాతవారితోనే 15 శాతం ఎక్కువ మద్యాన్ని తాగిస్తామని దుకాణదారులు ప్రభుత్వానికి హామీ ఇవ్వాలన్నమాట.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొదటి సంవత్సరం (1957-58)లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎక్సైజ్ ఆదాయం రు. 5.95 కోట్లు ఉండింది. అప్పటికి సగానికన్న ఎక్కువ ప్రాంతంలో మద్య నిషేధం అమలులో ఉండడం వల్ల ఇది ప్రాతినిధ్య గణాంకం కాదనుకున్నా, నిషేధం ఎత్తివేసిన తర్వాత మొదటి సంవత్సరమైన 1970-71లో అది రు. 25.88 కోట్లుగా ఉండింది. ఆ తర్వాత గడిచిన నలభై సంవత్సరాలలో అది 300 రెట్లు పెరిగి  2010-11లో రు. 7,512.00 కోట్ల అంచనాకు చేరింది. ప్రజా జీవితంలోని ఇతర ఏ అంశాన్ని తీసుకున్నా ఇలా 300 రెట్ల పెరుగుదల కాదు గదా మూడు నాలుగు రెట్ల పెరుగుదల కూడ లేదు.

ఇలా ఎక్సైజ్ ఆదాయం సంపాదించడం ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసమే అని రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు చెపుతుంటారు. కాని లక్షకోట్ల రూపాయల పైన ఉన్న బడ్జెట్ లో ఏడువేల కోట్ల రూపాయల ఆదాయం అంత నిర్ణయాత్మకమైనదేమీ కాదు. ఆపాటి నిధులను ఇతర మార్గాల ద్వారా సంపాదించవచ్చు,   మిగిలిన ఖర్చులలో పొదుపు పాటించి సంపాదించవచ్చు. అసలు ప్రభుత్వం తలచుకుంటే తన ఆదాయ వ్యయాలను సక్రమంగా సమీక్షించుకుంటే తగ్గించుకోగలిగిన ఖర్చులు, పెంచుకోగలిగిన ఆదాయాలు ఎన్నో ఉన్నాయి. భద్రతా వ్యయం, రుణాల అసలు, వడ్డీల చెల్లింపులు, ప్రైవేటు విద్యా, ఆరోగ్య, రవాణా సంస్థలకు చెల్లింపులు, ప్రభుత్వ పనులు చేయడానికి అనవసరంగా కాంట్రాక్టర్లను నియమించుకుని వారికి చేస్తున్న చెల్లింపులు చాల వరకు తగ్గించవచ్చు, కొన్నయితే పూర్తిగా మానెయ్యవచ్చు. అలాగే, ప్రభుత్వాదాయం పెంచుకోవడానికి కూడ ఎన్నో మార్గాలున్నాయి. రాష్ట్రంలోని ఖనిజ వనరులను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించి, వారు దోచుకుపోతుంటే చూస్తూ కూచున్న ప్రభుత్వం, ఆ గనులను ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థచేతనే తవ్వించి సొంతంగా ఖనిజాలను అమ్మినా, కనీసం ఆ ప్రైవేటు ఖనిజ సంస్థలు సంపాదిస్తున్న లాభాలలో ఎక్కువభాగాన్ని పన్నుగా వసూలుచేసినా, రాష్ట్రాదాయం పెరుగుతుంది.

కాని అటువంటి చర్యలకు ఈ పాలకవర్గాలు, ఈ ప్రభుత్వం పూనుకోవు. మద్యం వ్యాపారం ద్వారా లాభపడుతున్న వర్గాలు, పరిపాలన సాగిస్తున్న వర్గాలు ఒకటే కనుక ఈ ప్రభుత్వం తన వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయడం అసాధ్యం. అంతే కాక, ప్రజలు ఇలా వ్యసనాలకు, మత్తుపదార్థాలకు, తప్పుడు మార్గాలకు బానిసలయితేనే, పొందవలసిన చైతన్యం పొందకుండా ఉంటారు. అంటే పాలకవర్గాలు సాగిస్తున్న అక్రమాలను ప్రజలు ప్రశ్నించకుండా, ఎదిరించకుండా ఉండాలంటే, తప్పనిసరిగా ప్రజలను ఇటువంటి అపసవ్య మార్గాలలోకి మళ్లించవలసి ఉంటుంది. ఆ రకంగా మద్య వ్యాపారంతో పాలకులకు ఆర్థిక ప్రయోజనాలూ ఉన్నాయి, రాజకీయ, సాంస్కృతిక ప్రయోజనాలూ ఉన్నాయి.

మొత్తం మీద ప్రభుత్వాలు ఇప్పుడు అమలు చేస్తున్న ఎక్సైజ్ విధానం ప్రజల మేలు కోసం కాదు. అది ప్రజల ఆరోగ్యాలను రక్షించేదీ కాదు, ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయడానికి నిధులు కావాలనే పేరుమీద ఆ ప్రజల ఆరోగ్యాలనూ జీవితాలనూ కుటుంబాలనూ గుల్ల చేసి డబ్బులు దండుకునేది. ప్రజలను వ్యసనపరులుగా తమ రాజకీయార్థిక విధానాలను ప్రశ్నించి పోరాడలేని శక్తిహీనులుగా మార్చేది. వారి బలహీనతలను పెంచి పోషించి, వారు మేల్కొని తమ మీద, తమ విధానాల మీద తిరగబడకుండా చేసేది. ఇన్ని లోపాలతో, దురాలోచనలతో, ప్రజావ్యతిరేకంగా ఉన్న విధానానికి తప్పకుండా ప్రత్యామ్నాయం ఉంటుంది, ఉండాలి. కాని ప్రస్తుతం ఉన్న సామాజిక రాజకీయార్థిక వ్యవస్థలో, ఈ పాలకవర్గాల ఆధిపత్యంలో ఆ ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. ఆ ప్రత్యామ్నాయం గురించి ప్రజలు ఆలోచించడానికి కూడ వీలు లేని స్థితిని పాలకులు తయారుచేసి పెట్టారు. ఉన్న వ్యవస్థలో ఏవో అతుకులూ మాట్లూ వేసినప్పటికీ, ఎక్సైజ్ విధానం వంటి ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగుతూనే ఉంటాయని విభిన్న రాజకీయ పక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల చరిత్ర చెపుతోంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

2 Responses to ఎవరికోసమీ ఎక్సైజ్ విధానం?

 1. SNKR says:

  Venu Gopal garu,
  Good article, I agree with your views. I have something to say.
  1) Implementing strict prohibition is certainly a burden, with no revenue
  2) Most of the politicians are in the business
  3) Non-drinking people overlook it’s ill-effects and justify the ST on liquor as source of legitimate income
  4) Some parts drinking is part of tradition in some occassions ( like in Telangana as KCR mentioned once)

 2. gajula says:

  no comment.prastutha vyavasthalo pratyamnayamu kaadu,comment raase parisththi ledu.emani raayaali.anni-andariki thelusu .thaage vaalle daadaapu 90%gaa vunna samaajamulo ,emi korukovaali?evaru vintaaru?evaru amalu chestaaru?kaakapothe etuvanti thaagudu alavaatu leni samaajamu kaavaalani korukovadamu atyaasenaa?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s