కొమరయ్య, కుమార్, కొమ్రన్న…

దళిత బహుజన ఆలోచనా స్రవంతిలో కొన్ని వినూత్నమైన, విభిన్నమైన అవగాహనలు ప్రవేశపెట్టిన చిరకాల మిత్రుడు, పేరుతోనే ఎంతోమందికి అన్న అయిన కొమ్రన్న (కేసరాజు కొమరయ్య) యాభై ఏళ్ల వయసుకే, సమయానికి సరయిన వైద్యం అందక కన్నుమూశాడు. ఇటీవల ఎక్కువగా రాస్తూ, సంభాషిస్తూ రచయితగా, సున్నితమైన బహుజన ఆలోచనాపరుడిగా నిలబడతాడని వాగ్దానం వస్తూ ఉండగానే అనారోగ్యం ఆ వాగ్దానాన్ని దెబ్బతీసింది.

కొమరయ్యగా మొదలై, కొంత ఆకర్షణీయంగా ఉండాలనుకొని కుమార్ అని రాసుకుంటూ, మళ్లీ మూలాల గుర్తింపుతో, కొత్త చూపుతో ‘కొమ్రన్న’గా మారిన కొమరయ్య గురించి ఆలోచిస్తుంటే ముప్పై సంవత్సరాల వెనుకటి రూపమే గుర్తుకొస్తోంది – చామనచాయకు ఒక రవ్వ తక్కువే అయినా కళకళలాడే ఆకర్షణీయమైన రూపం, ఏ భావమయినా పారదర్శకంగా కనిపించే వెడల్పయిన ముఖం, రింగులు తిరిగిన వత్తు జుట్టు, ధారాళంగా సాగే వాగ్ధార, ప్రతిమాటలోనూ వ్యంగ్యమూ హాస్యమూ చిప్పిల్లుతూ శ్రోతను ఆకట్టుకుని తనలో లీనం చేసుకునే హావభావాలు, ప్రభావశీలమైన వ్యక్తిత్వం…. 1979-81 మధ్య వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో చూసిన కేసరాజు కొమరయ్య రూపం అది.

కొమరయ్య నాకు ఒక సంవత్సరం సీనియర్. అప్పటికే కవిత్వం రాస్తున్నాడు, ఉపన్యాసాలు ఇస్తున్నాడు. బాగా పాడేవాడు. మంచి చదువరి. డిగ్రీ విద్యార్థుల తొలియవ్వనంలో ఆకర్షించగల అన్ని లక్షణాలూ ఉన్నవాడు.  అన్నిటికన్న మిన్నగా మా ఊరికి కూతవేటు దూరంలో ఉండే మీదికొండ నుంచి వచ్చాడు. అందుకే చాల సహజంగా సన్నిహిత మిత్రుడయ్యాడు. సాహిత్య, సామాజిక, రాజకీయ ఆసక్తులవల్ల ఆయన తరగతిలోని మరి ఇద్దరు మిత్రులూ, నా బోటి వాళ్లూ ఆర్ట్స్ కాలేజిలో అప్పుడు సాగుతుండిన బ్రహ్మాండమైన విద్యార్థి ఉద్యమ, ఆలోచనాపరుల బృందంలో భాగస్తులమయి సన్నిహితులమయ్యాం. అందరమూ ఒక్క రాజకీయ విశ్వాసాలనే బలపరచేవాళ్లమేమీ కాదు గాని ఒకేరకమైన సాహిత్య, సామాజిక, తాత్విక, రాజకీయ ఆసక్తులుగలవాళ్లం. చదివే, ఆలోచించే, చర్చించే అలవాటున్నవాళ్లం, పాటలంటే చెవి కోసుకునేవాళ్లం. సభలకూ సమావేశాలకూ తప్పనిసరిగా వెళ్లేవాళ్లం. సీనియర్ గనుక, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు గనుక ఒక రకంగా కొమరయ్య మా నాయకుడు. అప్పటికి కాలేజిలో బలంగా ఉండిన విద్యార్థి సంఘాలు – రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ – మూడిటి లోనూ కొమరయ్యకు ఆత్మీయ మిత్రులు ఉండేవాళ్లు.

మా కాలేజి సాహిత్య కార్యదర్శిగా ఆయన ఎంతోమందిని ప్రభావితం చేశాడు. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం ప్రితిష్ నందీ సంపాదకుడిగా యూత్ టైమ్స్ అని పత్రిక నడిపేవాడు. 1980లోనో, 1981లోనో అది పొయెట్రీ ఆఫ్ లవ్ అని ఒక ప్రత్యేక సంచిక తెచ్చింది. దానిలో కవితలను ఇద్దరమూ పోటీపడి అనువదించడం నిన్ననో మొన్ననో జరిగినట్టుంది. మా ఈ సాహిత్య స్నేహానికి ఒక రాజకీయ చేర్పు కూడ ఉంది. కొమరయ్య ఫైనలియర్ లో, నేను సెకండియర్ లో ఉండగా ఆయన బావమరది వెంకటరమణ ఫస్టియర్ లో చేరాడు. చరిత్రాత్మక తెలంగాణ సాయుధపోరాటపు కడివెండి నుంచి వచ్చిన రమణ ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్లి అమరుడయ్యాడు.

కొమరయ్య ఇంగ్లిషు సాహిత్యం ప్రధానాంశంగా బి ఎ 1981లో పూర్తి చేసుకుని, ఎం ఎ ఇంగ్లిషులో చేరిన తర్వాత కూడ యూనివర్సిటీలోనో, చౌరస్తాలోనో, సభలలోనో కలుస్తుండేవాళ్లం. ఎం ఎ అయిన తర్వాత కూడ చాల రోజులు ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లిష్ కోచింగ్ సంస్థలలోనూ, తక్కువ జీతంతో కాంట్రాక్టు లెక్చరర్ గానూ పనిచేశాక దాదాపు పది సంవత్సరాలకు గాని స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. అఫ్రికన్ ఇంగ్లిష్ సాహిత్యం మీద పిఎచ్ డి చేద్దామనుకుని, అది ఆగిపోయి, చివరికి భాషాశాస్త్ర విషయంతో పిఎచ్ డి ముగించాననిపించాడు. సహచర అధ్యాపకులతో సమస్యలవల్లనో, ఇతర సమస్యలవల్లనో గాని అధ్యాపకుడిగా రాణించవలసినంతగా రాణించలేకపోయాడు. డిగ్రీ రోజుల్లో ఆయన రచనాశక్తీ ఉపన్యాసశైలీ చూసి రచయితగానూ అధ్యాపకుడిగానూ ఎంతో ఎదుగుతాడనుకున్న నా బోటి మిత్రులకు నిరాశ మిగిలింది. ఒక అట్టడుగు కులం నుంచి వచ్చి ఎంతో ప్రతిభా అధ్యయనమూ శక్తి సామర్థ్యాలూ ఉండి అవి సమాజానికి ఉపయోగపడవలసినంతగా ఉపయోగపడడం లేదే అనిపించేది.

మళ్లీ ఆయన క్రియాశీలంగా మారినది కొంత బహుజన ఉద్యమ సందర్భంగానూ, మరికొంత ఎక్కువగా ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయ నినాదాన్ని విశ్వసించినప్పుడూ. గత నాలుగైదు సంవత్సరాలుగా చాల వ్యాసాలే రాశాడు, కొన్ని కవితలూ రాశాడు. ఇటీవల ఎక్కువగా పత్రికా చర్చలలో పాల్గొంటున్నాడు. చాకలి ఐలమ్మ ఉజ్వల వారసత్వాన్ని ఎత్తిపడుతూ రచనలు చేశాడు. మొత్తం మీద ముప్పై ఏళ్లుగా రాస్తున్నప్పటికీ రాయవలసినంత రాయలేదు.

తాను సంకలనం చేసిన ఒక కవితా సంకలనం గురించి చెపితే ఆయన విశిష్టత తెలుస్తుంది. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు ప్రకటించగానే, వాటివల్ల దేశ సమైక్యత దెబ్బతింటుందని, వాటిని ప్రతిఘటిస్తూ కవిత్వ సంకలనం తేవాలనుకుంటున్నానని మా ఇద్దరికీ ఆర్ట్స్ కాలేజిలో గురువు పేర్వారం జగన్నాథం గారు ఒక ప్రకటన ఇచ్చారు. మోర్దోపు దున్న అని ఒక కవితా సంకలనం తెచ్చారు. ఆ ప్రకటన, పుస్తకం చూసి ఆగ్రహించిన వాళ్లు ఎంతోమంది ఉండవచ్చు గాని, కొమరయ్య మాత్రమే ఆ ప్రకటనకు ప్రతిగా, ‘ముస్లిం రిజర్వేషన్లను ఆహ్వానిస్తున్న శ్రమగౌరవ ఉత్పత్తి కులాల కవితల సంకనం’ వేస్తానని ప్రకటన ఇచ్చి, దాదాపు ఎనభై కవితలు సంకలనం చేసి ‘మా బోనులోకి మరో సింహం’ ప్రచురించాడు. దానికి తాను రాసిన ఇరవై పేజీల ముందుమాట చాల ఆలోచనాస్ఫోరకమైన విషయాలు చర్చించింది.

ఒకవైపు చాకలి ఐలమ్మ గతం, మరొకవైపు వెంకటరమణ వర్తమానం. ఈ ఇద్దరిమధ్య మరొకదారి కోసం వెతుకుతూ గెలిచాడో ఓడాడో తెలియకముందే మెదడు నరాలు చిట్లి మనమధ్యనుంచి వెళిపోయిన కొమ్రన్న లేవదీసిన ప్రశ్నలలో కొన్ని దురుసుగానో, మొరటుగానో, అసందర్భంగానో కనబడవచ్చు. కాని అవి వేదననుంచి వెలువడిన, నిజాయితీ నిండిన ప్రశ్నలు. తరతరాలుగా ఈ సమాజపు మురికిని వదిలించే గౌరవనీయమైన వృత్తికి చెందిన మనిషి వేసిన ప్రశ్నలు. అన్ని ప్రశ్నలనూ సగౌరవంగా ఆహ్వానించాలనే అవగాహన ఉన్నన్ని నాళ్లూ కొమ్రన్న రూపమూ స్వభావమూ సజీవంగానే ఉంటాయి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

One Response to కొమరయ్య, కుమార్, కొమ్రన్న…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s