ఉద్యోగ కల్పనకేనా ఈ తొందర?

ప్రజాతంత్ర వారపత్రిక ఆఖరి పేజీ, సెప్టెంబర్ 7, 2010

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తలపెట్టిన గ్రూప్ వన్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష చిలికి చిలికి గాలివాన అయి, చివరికి ఏమీ తేల్చకుండానే, దేన్నీ ముంచకుండానే, అసలు ప్రశ్నలను రేకెత్తించకుండానే, తలెత్తిన ముఖ్యమైన సందేహాలకు సమాధానాలు చెప్పకుండానే దారి తప్పిపోయింది. ఆ వారం, పది రోజుల రగడ వేడిని రగిల్చినంతగా వెలుగును ప్రసరించలేకపోయింది.

నిజానికి ఈ ఏపీపీఎస్సీ వ్యవహారం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రకూ, పాలకుల నైతికతకూ, దుర్మార్గానికీ, పాలనలో సమానతా భావనకూ, న్యాయానికీ సంబంధించిన ఎన్నో విషయాలు చర్చించే అవకాశం ఉండింది. కాని ఆ చర్చ కన్న ఎక్కువగా అధికార యంత్రాంగపు మొరటుతనం గురించీ, నిర్బంధం గురించీ చర్చ జరిగింది. ఈ గ్రూప్ వన్ పరీక్షల సందర్భంగా మొత్తంగా ఏపీపీఎస్సీ జరిపిన అక్రమాల గురించీ, అమలు చేసిన వివక్ష గురించీ చర్చించవలసిన పక్షం ఆ పనిని సమర్థంగా చేయలేకపోయింది. ఇక అవతలి పక్షానికైతే ఇటువంటి చర్చ జరపవలసిన అవసరమే లేదు. ఆ పక్షానికి తెలిసినదల్లా ఇతరుల హక్కులను దుర్మార్గంగా కబళించడం, ఎవరయినా అడ్డుచెపితే విరుచుకుపడడం, ఇంకా తీవ్రమైన ప్రశ్నలు వస్తే లాఠీలూ తూటాలూ ప్రయోగించి శ్మశాన శాంతి నెలకొల్పడం. అదే జరిగి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు పరీక్షలు జరిగాయి.

కాని జరిగిపోయిన విషాదాన్ని సవరించలేకపోయినా, భవిష్యత్తులో జరగబోయే విషాదాలను నివారించడానికి ఇప్పటికైనా చర్చ జరపవలసిన అవసరం ఉంది.

రాచరికాలు నడిచినప్పుడు తమ పాలనాధికారులుగా ఎవరు ఉండాలనేది రాజు ఇష్టాయిష్టాల మీద ఆధారపడుతుంది. కాని ప్రజాస్వామిక పాలనలో ప్రభుత్వోద్యోగాలలో నియామకాలు జరపడానికి ఒక ప్రభుత్వ సంస్థ ఉంటుంది. ఆ సంస్థ కొన్ని నిర్దిష్టమైన, సర్వజనామోదమైన, హేతుబద్ధమైన  నిబంధనల మేరకు పనిచేయవలసి ఉంటుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసి ఉంటుంది.  ఉద్యోగ నియామకాలు జరిపేటప్పుడు తన పాలనా పరిధిలోని అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల, అన్ని బృందాల మధ్య సామాజిక న్యాయాన్ని పాటించడం ప్రభుత్వానికి తప్పనిసరి అవసరమవుతుంది. అలా జరగకపోతే ప్రజలలో కొన్ని వర్గాల నుంచో, కొన్ని ప్రాంతాల నుంచో, కొన్ని బృందాల నుంచో మాత్రమే ఉద్యోగులు ఉండి, అసమతుల్యతతో, పాలనా విధానాలు, నిర్ణయాలు, అమలు ఆయా అధికార వర్గాలకు అనుకూలంగానే సాగే అవకాశం ఉంటుంది. పాలనలో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం ఉండదు. అంటే మౌలికమైన ప్రాతినిధ్య ప్రజాస్వామిక భావనకే అవరోధం ఏర్పడుతుంది.

అసఫ్ జాహీ రాజులు తమకు ఎవరు ఎంత నజరానా ఇచ్చారనే దాన్ని బట్టి పాలనాధికారులను నియమిస్తున్నారని విమర్శించిన బ్రిటిష్ పాలకులు పందొమ్మిదో శతాబ్ది చివరి రోజుల్లోనే హైదరాబాద్ సివిల్ సర్వీస్ ఏర్పాటు చేశారు. ఆ హైదరాబాద్ సివిల్ సర్వీస్ నియామకాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే 1919లో ముల్కీ నిబంధనలు వచ్చాయి. అవి సక్రమంగా అమలు జరగడం లేదని, దాని నియామకాలలో కూడ హైదరాబాదీలకు అన్యాయం జరుగుతున్నదని 1930లలోనూ, 1952లోనూ ముల్కీ ఉద్యమం తలెత్తింది.

కనుక ఉద్యోగ నియామకాలలో తమ భాగస్వామ్యం కోసం నిలదీయడం, పోరాడడం తెలంగాణ వాసులకు కొత్తది కాదు, అధికారంలో ఉన్నవారు తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయమూ కొత్తది కాదు. ఇప్పుడు కొత్తగా అన్యాయం జరిగిన, జరుగుతున్న సందర్భం మాత్రమే ప్రత్యేకమైనది.

హైదరాబాద్ సివిల్ సర్వీస్ ను, 1953లో మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కలిపి, 1956లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకాల కోసం ప్రాథమిక పరీక్ష నిర్వహించడానికి 2008 డిసెంబర్ 29న ప్రకటన జారీచేసింది. మొదట 129 ఉద్యోగాలకోసం వచ్చిన ఈ ప్రకటనకు అనుబంధంగా 2009 జూలై 27న మరొక 72 ఉద్యోగాలు అదనంగా కలిపారు. ఇందులో మూడు డీఎస్పీ ఉద్యోగాలను పక్కనపెట్టి మొత్తం 198 ఉద్యోగాల నియామకం కోసం ప్రాథమిక పరీక్ష జరపడానికి నిర్ణయించారు. ఆ పరీక్షను కూడ మొదట 2010 జూలై 25న జరపడానికి నిర్ణయించి తెలంగాణ ఉపఎన్నికల వల్ల వాయిదావేశారు. మళ్లీ ఆగస్ట్ 29న జరుపుతామని ప్రకటించి సిండికేట్ బ్యాంక్ నియామకాల పరీక్ష ఉండడంతో సెప్టెంబర్ 5కు వాయిదా వేశారు.

అంటే ఇప్పటికే మొదటి ప్రకటన వచ్చి ఇరవై నెలలు గడిచాయి. పరీక్ష రెండు సార్లు వాయిదా కూడ పడింది. ఇప్పుడు మళ్లీ ఒకసారి వాయిదా వేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండనక్కరలేదు. సెప్టెంబర్ 5వ తేదీని అనుల్లంఘనీయమైన పవిత్రమైన తేదీగా ఏమీ చూడనక్కరలేదు. అందుకోసం కళాశాలలనూ, విశ్వవిద్యాలయాలనూ నిర్బంధ శిబిరాలుగా మార్చి, సెక్షన్ 144 విధించి, పోలీసు పహరాలో పరీక్షలు జరపనక్కరలేదు. చాల మామూలు పాలనాపరమైన కారణాలతోనే వాయిదా పడిన పరీక్ష మరొకసారి వాయిదాపడితే నష్టం ఏమీ ఉండేది కాదు. పైగా ఈ సారి వాయిదా వేయడానికి చాల సరయిన, హేతుబద్ధమైన కారణం ఉంది.

ఈ ప్రకటన వచ్చిన తర్వాత సరిగ్గా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమవుతున్నదని కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. ఆ ప్రకటనతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రద్దయిపోయే సంధి దశలోకి ప్రవేశించిందని అర్థం. కనుక 2009 డిసెంబర్ 9 తర్వాత “ఆంధ్ర ప్రదేశ్” పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అర్థం లేదు. ఆ హోం మంత్రి ప్రకటనకు మార్పులు, చేర్పులు జరిగినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ ను యథాతథంగా కొనసాగిస్తాము అనే ప్రకటనకూడ రాలేదు. ఆంధ్రప్రదేశ్ భవితవ్యం గురించి హోం మంత్రిత్వ శాఖకు సలహా ఇవ్వడానికి జస్టిస్ శ్రీకృష్ణ నాయకత్వంలో ఒక అధ్యయన బృందాన్ని నియమించారు. అంటే డిసెంబర్ 9 ప్రకటన రద్దు కాలేదు, వాయిదా పడింది. కనుక ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన పనులు, కనీసం వివాదాస్పదమైన పనులు, తక్షణం జరగకపోయినా ఫరవాలేని పనులు  వాయిదా పడవలసి ఉంటుంది. నిజానికి ప్రస్తుత గ్రూప్ వన్ నియామకాలు వాయిదా పడినందువల్ల వచ్చే తక్షణ నష్టమేమీ లేదు.

పైగా ఇప్పుడే నియామకాలు జరిగిపోవాలని కోస్తాంధ్ర, రాయలసీమ పాలకులు చేస్తున్న హడావిడి చూస్తే దానిలో అనుమానించవలసినది ఏదో ఉందనే అనిపిస్తున్నది. ఇంత హడావిడిగా పరీక్షలు జరిపి, వీలయినంత వరకు తెలంగాణ అభ్యర్థులను ఫెయిల్ చేసి, ప్రధాన పరీక్ష కూడ జరిపి ఈ పదవులన్నిటిలోనూ కోస్తాంధ్ర, రాయలసీమ అభ్యర్థులను నింపితే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తమ అభ్యర్థులకు ప్రభుత్వోద్యోగాలు ఉంటాయి. ఏర్పడబోయే రాష్ట్రాలమధ్య ఉద్యోగుల పంపిణీ జరిగినా తాము కోరుకున్న చోట ఉండవచ్చు. ఇప్పుడే ఖాళీలు నింపేస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర వాసులకు ఇచ్చుకోవడానికి ఖాళీలు మిగలవు. ఈ హడావిడిలో ఇటువంటి దురాలోచనలెన్నో ఉన్నాయి.

అందువల్లనే తెలంగాణ వాదులు, ముఖ్యంగా విద్యార్థులు ఈ పరీక్షల వాయిదా కోరారు. ఎట్లాగూ తెలంగాణ రాబోతుంది గనుక ఈ పరీక్షలు ఎందుకు అని అడిగి ఉండవలసింది గాని పాపం వాళ్లు ఆ ప్రశ్న కూడ అడగలేదు. పరీక్షలకు ముందే ఈ 198 ఉద్యోగాలలో 42 శాతం తెలంగాణ అభ్యర్థులకు కేటాయిస్తామని ప్రకటించమని మాత్రమే అడిగారు. ఆ వాటా ప్రకటించేవరకూ పరీక్షలను వాయిదా వేయమని మాత్రమే అడిగారు. నిజానికి ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న పాలకులయినా అతి సులభంగా అంగీకరించవలసిన అత్యంత న్యాయమైన, సాధారణమైన డిమాండ్ ఇది. ఆ డిమాండ్ ను ఎదుర్కోవడానికి తిట్లు, దుర్భాషలు, నిందలు, వక్రీకరణలు, బలప్రయోగాలు, నిర్బంధం అవసరమా?

ఆ వక్రీకరణ వాదనలో ఒకటి ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలు జోన్లకు సంబంధించినవి కావు గనుక, వీటిలో వాటాలు ఉండవనేది. తమను తాము మేధావులుగా భావించుకునేవారు పత్రికలలోనూ, టీవీ తెరలమీదా ఈ వాదన చేయడం వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నది.

ఈ పరీక్షల నోటిఫికేషన్ లో ప్రాంతాలవారీ వాటాల విభజన గాని, ఆరు సూత్రాల పథకం గాని వర్తించబోదని ఉన్నమాట నిజమే. అయితే ఇక్కడ ఆలోచించవలసింది ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు, గ్రూప్ వన్ ఉద్యోగాలకు జోన్లు వర్తించవనే సూత్రం గురించి మాత్రమే కాదు. నిజం చెప్పాలంటే 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చిన ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు, రాష్ట్రాన్ని జోన్లుగా విభజించడం కూడ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగానే జరిగాయి. ఆ లొసుగుల గురించి చర్చ మరొకసారి కాని, రాజ్యాంగానికి జరిగిన సవరణను, ప్రత్యేకంగా చేరిన 371 డి అధికరణాన్ని ఇక్కడ మననం చేసుకోవాలి.

ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారమే తెలంగాణకు ఆంధ్ర ప్రదేశ్ లో 42 శాతం వాటా రావాలి. ఆ వాటా ఇస్తామనే హామీతోనే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. కాని గత యాభై నాలుగు సంవత్సరాల పాలనలో తెలంగాణకు ఆ వాటా రానందువల్లనే రాష్ట్ర విభజన డిమాండ్ తలెత్తింది. ప్రత్యేకించి నీళ్లలో, నిధులలో, నియామకాలలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో రావలసిన వాటా రాలేదనే వాస్తవమే తెలంగాణ ప్రజలను ఇవాళ్టికీ కదిలిస్తున్నది.

నీళ్ల విషయంలోనయితే, గోదావరి పరీవాహక నిడివిలో 79 శాతం, కృష్ణ పరీవాహక నిడివిలో 69 శాతం ఆక్రమిస్తున్న తెలంగాణకు, ఆ నదుల మీద కట్టిన ప్రాజెక్టుల కాల్వల ద్వారా అందుతున్న నీరు 20 శాతం కన్న తక్కువ. ఇక విద్యకు గాని, వైద్యానికి గాని, రవాణా సౌకర్యాలకు గాని, మొత్తంగా అభివృద్ధికి గాని వెచ్చిస్తున్న నిధులలో తెలంగాణకు విస్తీర్ణం దృష్ట్యా అందవలసిన 40 శాతం గాని, జనాభా రీత్యా అందవలసిన 42 శాతం గాని అందిన దాఖలా గత యాభైనాలుగు బడ్జెట్లలో ఒక్క బడ్జెట్ లో మచ్చుకైనా చూడలేం. నిధుల కేటాయింపులలో 1969 నాటికి జరిగిన ఈ అక్రమాల గురించి కుమార్ లలిత్ కమిటీ, వశిష్ట భార్గవ కమిటీ తేల్చిచెప్పాయి. నియామకాల స్థితీ అంతేనని 1969కి ముందు తెలంగాణ ప్రాంతీయ మండలి అనేకసార్లు చెప్పింది. ఆ సమస్య మీదనే 1969 ఉద్యమం, 1972 ఉద్యమం, ముల్కీ నిబంధనల మీద సుప్రీంకోర్టు తీర్పు, ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు కూడ అమలు కాకపోవడం వల్లనే జయభారత రెడ్డి కమిటీ వచ్చింది. ఆ కమిటీ మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చిన శాసన సభా కమిటీ, గిర్ గ్లాని కమిషన్ కూడ నియామకాలలో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి స్పష్టంగా చెప్పాయి.

ఈ చరిత్రలో భాగంగా వచ్చినదే 32వ రాజ్యాంగ సవరణ. అది రాజ్యాంగంలో ప్రత్యేకంగా 371 డి అధికరణాన్ని ప్రవేశపెట్టి “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక అవకాశాలు కల్పించే అధికారాన్ని” రాష్ట్రపతికి ఇచ్చింది. అది “ఉద్యోగాల, విద్యా సౌకర్యాల విషయంలో, రాష్ట్రం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుంటూనే, రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలకు సమాన అవకాశాలను, సౌకర్యాలను కల్పించడం” కోసం రాష్ట్రపతికి ఈ ప్రత్యేక అధికారాలు ఇచ్చింది.

ఇప్పుడు, రాష్ట్ర విభజన అంశం వేదిక మీద ఉండగా, దానిపైన హోం మంత్రిత్వ శాఖ అధ్యయన బృందం పనిచేస్తుండగా, జరుగుతున్న గ్రూప్ వన్ నియామకాల ప్రక్రియలో ఈ రాజ్యాంగ నిర్దేశాన్ని – సమాన అవకాశాలు కల్పించాలనే ఆదేశాన్ని – విస్మరించడానికి ఇంత హడావిడిగా ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనేదే అసలు ప్రశ్న.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Prajatantra, Telugu. Bookmark the permalink.

4 Responses to ఉద్యోగ కల్పనకేనా ఈ తొందర?

 1. SRRao says:

  మీకు, మీ కుటుంబానికి
  వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

  SRRao

  శిరాకదంబం

 2. Sravya Vattikuti says:

  అసలు మీరు నిజంగ ఆసం అండీ ఎంత దూరం ఆలోచించారు , ఈ పరీక్షల్లో ఆంధ్ర, రాయలసీమా వాళ్ళను నింపేసి ఇక ఆ ఉద్యోగాలతో వాళ్ళు తరతరాలు బతికేద్దమనుకున్నారా ? అసలు ఈ ఆలోచనలు వామ్మో ఇవన్నీ చదువుతుంటే ఎక్కడో ఉండవలసిన మీరు ఇక్కడ ఉన్నారు అనిపిస్తుంది . ఒక సందేహం మీ ఉద్దేశ్యం లో ఆంధ్ర , రాయలసీమ వాళ్ళు రోజు అన్నం , కూర వండుకు తింటారు అనుకుంటారా లేకపోతే రేపెప్పుడో తెలంగాణా వస్తుంది ఇప్పుడో తెలంగాణా వాళ్ళ అస్తులు దోచి ఒక వంద తరాలకి సరిపడా వండి పెట్టుకున్నరంటారా ?
  దోపిడీ అంటే ఇలా కూడా చేయచ్చు అని పెద్ద మనిషి ని మహా మనిషీ గా మర్చి వ్యాసాలు రాస్తారు మీరు , వాళ్ళ సంస్థల్లో మీ పనిచేస్తూ వాళ్ళ భజన చేస్తారు , సామాన్య జనాల మీద మాత్రం విరుచుకుపడి వాళ్ళ మీద ఇలాంటి విషాన్ని చిమ్మే రాతలు రాస్తారు . ఎవరి మీద మీ ద్వేషం ?

 3. Yedukondalu says:

  I agree with your valid points.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s