ఖనిజ సంపదల కాణాచి మన మాతృభూమి ఏ ఘనుల బొక్కసాలకీ గనుల సంపద?

ఈభూమి మాసపత్రిక ఆగస్ట్ 2010 సంచిక కోసం

“అల్యూమినియం వాడకంలో, బాక్సైట్ నుంచి అల్యూమినాను రాబట్టడంలో పరిశ్రమ ఎంత నైపుణ్యం సంపాదించినా బాక్సైట్ లేకుండా అల్యూమినియం తయారు చేయడం సాధ్యం కాదు. అల్యూమినియం లేకుండా విమానం తయారు చేయడం సాధ్యం కాదు. మరి అమెరికా వాడే బాక్సైట్ లో 80 నుంచి 90 శాతం విదేశీ వనరుల నుంచి సరఫరా అయ్యేటప్పుడు, అమెరికన్ అల్యూమినియం పరిశ్రమ, విమాన పరిశ్రమ, సైనిక శక్తి మనుగడ సాగాలంటే ఆ సరఫరా నిరంతరాయంగా ఉంటుందనే హామీ కావాలి.”

ఈ మాటలు హారీ మాగ్డాఫ్ అనే మార్క్సిస్టు అర్థ శాస్త్రవేత్తవి. ఆయన ఆ మాటలు అని నలభై సంవత్సరాలు దాటిపోయింది. సోవియట్ యూనియన్ నిర్మాత వ్లాదిమిర్ లెనిన్ 1917 లో రాసిన ‘సామ్రాజ్యవాదం- పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ’ అనే పుస్తకానికి యాభై ఏళ్లు నిండిన సందర్భంగా న్యూయార్క్ లో జరిగిన సోషలిస్టు మేధావుల సదస్సులో సమర్పించిన పత్రంలో ఆయన ఈ మాటలు అన్నారు. లోకం చాల మారిపోయిందనీ, సామ్రాజ్యవాదం గురించి లెనిన్ విశ్లేషణకు కాలం చెల్లిపోయిందనీ విమర్శలు వస్తున్న సందర్భం అది. ఆ సదస్సులో సమర్పించిన ‘ది న్యూ ఇంపీరియలిజం’ (కొత్త సామ్రాజ్యవాదం) అనే ఆ వ్యాసంలో కొత్త ప్రపంచంలో మారినదేమిటో, మారనిదేమిటో, మారిందని అనిపిస్తున్నదేమిటో ఆయన వివరించారు. భారీ పారిశ్రామిక, వ్యాపారసంస్థలు తమ గుత్తాధిపత్యాన్ని యథాతథంగా కొనసాగించాలంటే, తమ లాభాలను యథాతథంగా ఉంచుకోవాలనీ, పెంచుకోవాలనీ అనుకుంటే, ముడిసరుకుల కోసం విదేశాల మీద ఆధారపడక తప్పదని ఆయన రుజువు చేశారు. అతి సాధారణమైన ఖనిజాల నుంచి అరుదైన ఖనిజాలదాకా అన్నిటి విషయంలోనూ అమెరికా ‘నిరుపేద దేశం’ గానే ఉన్నదనీ, అందువల్లనే సామ్రాజ్యవాదపు దురాక్రమణ దాహం మరింత పెరిగిందనీ ఆయన తిరుగులేని గణాంకాలతో అద్భుతంగా వాదించారు.

నలభై ఏళ్ల తర్వాత ఆ పరిస్థితి మరింత తీవ్రతరమయింది గాని తగ్గలేదు, మారలేదు. ప్రపంచీకరణ ఆ ఖనిజవనరుల దాహాన్ని, బకాసుర ఆకలిని రక్తదాహం స్థాయికి పెంచింది. యుద్ధాలకు కారణమవుతోంది. అమెరికాకు చెందిన, లేదా అమెరికాకు ఆసక్తి ఉన్న బహుళజాతి సంస్థలు పెరిగాయి, వాటి ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది, అవి అమ్ముకునే సరుకుల సంఖ్య, ఆ అమ్మకాలు జరిగే మార్కెట్లు పెరిగాయి. అంటే వాటి ఉత్పత్తి సామర్థ్యానికి తగిన స్థాయిలో లోహాల కోసం నిరంతర అన్వేషణ పెరిగింది. వారి యంత్రభూతాలు నిరాటంకంగా నడవాలంటే అవసరమైన లోహాల పరిమాణం పెరిగింది. ఆ లోహాలు తమ దేశాలలో దొరకవనే వాస్తవం వారికి తెలిసివచ్చింది. అందుకని వారికి భూగోళం మీద తెలిసిన గనులన్నిటిమీద అధికారం కావాలనే కాంక్ష మరింత పెరిగింది. ఇంకా కొత్త గనులు ఎక్కడ దొరుకుతాయా అనే వెతుకులాట, ఆదుర్దా పెరిగాయి (ఇటీవల అఫ్ఘనిస్తాన్ లో విస్తారమైన ఖనిజ నిలువలు ఉన్నాయని కనిపెట్టిన వార్తల గురించి, ఆ ప్రాంతంలో తిష్ట వేసిన అమెరికన్ సైన్యాల గురించి పాఠకులకు తెలుసు.) అందుకే ఆయా గనులు ఉన్న దేశాల పాలకులు తమ చెప్పుచేతల్లో, కీలుబొమ్మలుగా ఉండాలనే కోరిక పెరిగింది.  భూగోళం కూడ అయిపోయి తమకు అవసరమయిన ఖనిజాలు, లోహాలు చంద్రగ్రహం మీదనో, మరొక చోటనో దొరుకుతాయా అనే అన్వేషణలకు కూడ బహుళజాతి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి.

సరే, హారీ మాగ్డాఫ్ అమెరికన్ అయినా, మార్క్సిస్టు కాబట్టి అమెరికాను విమర్శించడానికే అలా రాశారని ఎవరయినా అనుకుంటే, స్వయంగా అమెరికన్ ప్రభుత్వ పత్రం ఒకటీ, ప్రభుత్వం కోసం పనిచేసిన పరిశోధకుడి పత్రం ఒకటీ ఉన్నాయి. అవి మరింత పాతవి.

అమెరికా ప్రభుత్వపు అత్యున్నత అధికారి, స్టేట్ డిపార్ట్ మెంట్ విధాన నిర్ణయ శాఖాధిపతి జార్జి కీనన్ 1948లో లాటిన్ అమెరికన్ రాయబారులకు అమెరికా ప్రభుత్వ విధానాలను వివరిస్తూ “ఆ ప్రాంతాల్లో ఉన్న ముడిసరుకులను కాపాడుకోవడం అమెరికా ప్రభుత్వ లక్ష్యాలలో ప్రధానమైనది” అన్నాడు. పరాయి దేశాల ముడి సరుకుల మీద, ఖనిజ వనరుల మీద అమెరికా ప్రేమ అంతటిది!  ఆయనే 1948 ఫిబ్రవరిలో పిపిఎస్-23 అనే రహస్య ప్రణాళికా పత్రం ఒకటి రాశాడు. “ప్రపంచ సంపదలో సగం మనదగ్గరే ఉంది. కాని ప్రపంచ జనాభాలో మనం 6.3 శాతం మాత్రమే. అందువల్ల మనపట్ల ఇతరులకు అసూయా ద్వేషాలు కలిగే అవకాశం ఉంది. ఈ అసమానతా స్థితిని కొనసాగించడానికి మనకు వీలు కల్పించే సంబంధ బాంధవ్యాలను కనిపెట్టడమే రానున్న రోజుల్లో మన నిజమైన కర్తవ్యం” అనే ఆణిముత్యాలు ఆ పత్రంలోవే.

అలాగే డ్యూయీ ఆండర్సన్ అనే అల్యూమినియం వ్యవహారాల నిపుణుడు రాసిన ఒక పత్రాన్ని 1951లో యు ఎస్ పబ్లిక్ అఫేర్స్ ఇన్ స్టిట్యూట్ ప్రచురించింది. “అల్యూమినియం ఆధునిక యుద్ధతంత్రంలో అతి ముఖ్యమైన ఏకైక పదార్థం. పెద్దఎత్తున అల్యూమియం నిల్వలను వాడకుండా, ధ్వంసం చేయకుండా ఇవాళ ఘర్షణ సాధ్యమే కాదు, యుద్ధంలో విజయం సాధించడం సాధ్యమే కాదు…రక్షణ వ్యవహారాలకు అల్యూమినియం కీలకం. అల్యూమినియం వల్లనే యుద్ధ విమానాలు, రవాణా విమానాలు సాధ్యమయ్యాయి. అణ్వాయుధాల తయారీలోనూ, అణ్వాయుధాలను దూరతీరాలకు పంపించడంలోనూ అల్యూమినియం అవసరం. అల్యూమినియం ఉండడం, అది కూడ పెద్ద మొత్తంలో ఉండడం గెలుపుకూ ఓటమికీ మధ్య విభజనరేఖను గీస్తుంది…”

ఇది ఒకే ఒక్క లోహానికి సంబంధించిన కథ. ఇటువంటి ముఖ్యమైన, అవసరమైన లోహాలు ఎన్నో ఉన్నాయి. ఆ లోహాల తయారీలో ఉపయోగపడే ఖనిజాలు మరెన్నో ఉన్నాయి. అవన్నీ ఎక్కువగా దక్షిణార్ధగోళంలో, అంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో ఉన్నాయి. ఉత్తరార్ధ గోళంలో, తమ దేశాలలో కొన్ని ఖనిజ నిలువలు ఉన్నప్పటికీ, వాటిని ఇప్పుడే తవ్వితీయాలని ఆయా ప్రభుత్వాలు, బహుళజాతి సంస్థలు అనుకోవడం లేదు. దక్షిణార్ధ గోళంలోని పేద దేశాలన్నిటినీ తమ సొంత పెరడుగా భావించే బహుళజాతి సంస్థలు మొట్ట మొదట అక్కడి వనతులను కొల్లగొట్టాలని ఆలోచిస్తున్నాయి. అందుకే అక్కడి ఖనిజాలను తవ్వి తీసుకోవడానికి తమను అనుమతించే ప్రభుత్వాలో, లేదా తవ్వితీసి తమకు చౌకగా అమ్మే ప్రభుత్వాలో ఆయా దేశాలలో ఉండాలని బహుళజాతి సంస్థలు ఆశిస్తున్నాయి. ఆ బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం అమెరికా వంటి అగ్రరాజ్యాల ప్రభుత్వాలు గాని, ప్రపంచబ్యాంకు – అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ – ప్రపంచ వాణిజ్య సంస్థ దుష్టత్రయం గాని పని చేస్తున్నాయి.

ఇదీ మన ఖనిజాల గురించీ, మన గనుల గురించీ మాట్లాడుకునేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన నేపథ్యం. మన మాయల మరాఠీల ప్రాణం ఏ ఏడేడు సముద్రాల అవతల, అగ్నికీలల మధ్య, మర్రిచెట్టు తొర్రలో, చిలుకలో ఉన్నదో తెలుసుకుంటే గాని ఈ మాయల మరాఠీ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియదు.

మన దేశం నుంచి రోజుకు కొన్ని లక్షల టన్నుల ఖనిజంగాని, ముడి లోహాలు గాని విదేశాలకు, కచ్చితంగా చెప్పాలంటే బహుళజాతి సంస్థల కార్ఖానాలకు, గిడ్డంగులకు వెళ్తూ ఉంటాయి. అవి సరుకుల, పరికరాల, యంత్రాల, ఆయుధాల తయారీకి ఉపయోగపడవచ్చు, లేదా మారు బేరానికి ఉపయోగపడవచ్చు. లేదా ఊరికే నిలువ చేయడానికైనా కావచ్చు. ఆ లోహాల, ఖనిజాల విలువ రోజుకు కొన్ని వేలకోట్ల రూపాయలు ఉంటుంది. ఆ ఖనిజనిక్షేపాలు తవ్వే కాంట్రాక్టులు చేపట్టినవాళ్లు, అమ్ముకునేవాళ్లు, మారుబేరం చేసేవాళ్ళు, వాటిని తమ పరిశ్రమలలో వాడుకునే వాళ్లు, స్వదేశీయులైనా విదేశీయులైనా వేలకోట్ల రూపాయలు గడిస్తున్నారు. జాతిసంపదమీద అధికారాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వాలు కొన్ని వందలకోట్ల రూపాయలు  పన్నుల రూపంలో, సుంకాల రూపంలో వాటా సంపాదిస్తున్నాయి. కాని ఆ ఖనిజనిక్షేపాలు ఎవరి నేలలో ఉన్నాయో, ఎవరి బతుకులలో భాగమో, ఎవరు వాటిని తవ్వితీస్తున్నారో వారి బతుకులు మాత్రం రోజురోజుకూ ఛిద్రమవుతున్నాయి. ఈ ఖనిజ నిలువలు ఉన్న ప్రాంతాలు ప్రధానంగా ఆదివాసి, అటవీ ప్రాంతాలు, రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ వంటి రక్షణ ఉన్న ప్రాంతాలు. ఆంధ్ర ప్రదేశ్ లో 1 ఆఫ్ 1970 చట్ట సవరణ, ఒడిషాలో 2 ఆఫ్ 1956 చట్ట సవరణ వంటి రక్షణ ఉన్న ప్రాంతాలు. అయినా ఖనిజ నిలువల దోపిడీ నిరంతరాయంగా సాగిపోతోంది.

ఒరిస్సాలోని అపారమైన ఇనుము, మాంగనీస్, బాక్సైట్ ఖనిజనిలువలతో అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత రిసోర్సెస్ అనే బహుళజాతిసంస్థ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. జార్ఖండ్ లోని ఖనిజనిలువలను బహుళజాతి సంస్థలకు, గనుల మాఫియాకు అప్పగించి కమిషన్లు సంపాదించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి మధు కోడా వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులను కూడ చెరిపేసి ఇనుపఖనిజం తవ్వుకున్న భారతీయ జనతాపార్టీ మంత్రి గాలి జనార్దనరెడ్డి వందల కోట్లకు పడగెత్తడం మాత్రమే కాదు, రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వ విధానాలను శాసిస్తున్నాడు. రెండు రాష్ట్రాలలోనూ అనేక సంస్థలలో బేనామీ పెట్టుబడులు పెడుతున్నాడు. ఖమ్మం జిల్లా బయ్యారం అటవీ ప్రాంతంలోని ఇనుపఖనిజం నిలువల గురించి సాగుతున్న వివాదం ఇవాళ ప్రతిఒక్కరి దృష్టిలోనూ ఉంది.

ఒరిస్సా, జార్ఖండ్, చత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో ఖనిజనిలువలను బహుళజాతి సంస్థలు అక్రమంగా తవ్వుకుపోతున్న వార్తలు, కడపజిల్లాలో ఇనుప ఖనిజం తవ్వకాలలో గాలి జనార్ధనరెడ్డికి చెందిన ఓబుళాపురం మైన్స్ కంపెనీ సాగించిన అక్రమాల వార్తలు, ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది గనుల మాఫియాకు విశాల భూభాగాలను కట్టబెట్టడానికేనని రచయిత్రి అరుంధతీ రాయ్ చేసిన విమర్శలు, అవతార్ సినిమా – వీటితో ఇటీవల ఖనిజాల గురించి, ఖనిజనిలువల వినియోగం గురించి పెద్దఎత్తున చర్చ మొదలయింది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ రహస్యాలుగా, ప్రజల దృష్టికి రాకుండా ఉండిపోయిన అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సరిగ్గా ఈ సమయానికే భారత ప్రభుత్వం గనుల (అభివృద్ధి – నియంత్రణ) చట్టం 2010 ముసాయిదా తయారుచేసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే కార్యక్రమంలో ఉంది. అయితే గనుల తవ్వకంలో ఇమిడి ఉన్న జీవన భద్రత, విస్ఠాపన, అటవీ విధ్వంసం, పర్యావరణ సమస్యలు వంటివేవీ ఈ ముసాయిదాలో ప్రస్తావనకు కూడ రాలేదు. గనుల తవ్వకం లైసెన్సుల విషయంలో జరుగుతున్న మోసాల గురించి లోకం కోడై కూస్తున్నా, ఈ ముసాయిదాలో మాటవరుసకయినా ఆ మాట లేదు. పైగా, ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం విద్యుత్ రంగంలో స్వతంత్ర నిర్ణయాధికార సంస్థగా రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసిన పద్దతిలోనే గనుల రంగంలో కూడ స్వతంత్ర ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసి, ప్రభుత్వం ఇప్పుడున్నంత బాధ్యతను కూడ వదులుకోవడానికి సిద్ధపడుతోంది.

అయితే ఖనిజ వనరుల వ్యాపారం కొత్తది కాదు. ఇప్పుడు కనబడుతున్న స్థాయిలో అక్రమాలు, అవినీతి ఇదివరకు లేకపోవచ్చుగాని, ఖనిజ వనరుల వ్యాపారం గతంలో కూడ ఉంది. ఇసుక తవ్వుకుపోతూ వాగులు వట్టిపోయేలా చేయడం, గ్రామాల పరిసరాలలో ఉన్న కొండలను తొలిచి ఇళ్లనిర్మాణాలకు వాడడం, సున్నపురాయి తవ్వుకుని అక్రమంగా అమ్ముకోవడం దగ్గరినుంచి వేల సంవత్సరాలుగా భూమిలో భద్రంగా ఉన్న ఖనిజనిలువలను, ఆ ప్రాంతవాసులకు ఉపయోగపడవలసిన సంపదను కొల్లగొట్టడం వరకూ మన సమాజంలో ఈ అక్రమవ్యాపారం సర్వత్రా వ్యాపించి ఉంది. ఈ గనుల తవ్వకాలు మన సంపదను మనకు కాకుండా చేస్తున్నాయి, దొంగ వ్యాపారుల పాలు చేస్తున్నాయి. మన పర్యావరణాన్ని, ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. మన పాలనా విధానాలను నిర్ణయిస్తున్నాయి, ప్రభావితం చేస్తున్నాయి. చివరికి ప్రభుత్వాదాయానికి కూడ గండి కొడుతున్నాయి.

ఇదంతా ఎవరి సొమ్ము? ఎవరు కబ్జా చేసి సొంత బొక్కసాలు నింపుకుంటున్నారు? ప్రకృతి సహజంగా సమాజానికి అందిన ఈ సంపద, వేల సంవత్సరాలుగా భూమిలో నిక్షిప్తమై, ఆ భూమిపుత్రులందరికీ సమానంగా అందవలసిన సంపద, ఆ భూమిపుత్రుల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడవలసిన ఈ సంపద ఎందువల్ల పిడికెడు మంది సంపన్నుల చేతుల్లోకి ప్రవహిస్తున్నది? ఏ రాజకీయార్థిక, సామాజిక శక్తులు ఈ జాతి సంపదను కొద్దిమందికి హక్కుభుక్తంగా రాసి ఇస్తున్నాయి?

మన దేశంలో మానవజీవితానికి అవసరమైన ఖనిజ నిలువలు అనేకం ఉన్నాయని, వాటిని వాడుకోవచ్చునని ప్రాచీనకాలం నుంచి కూడ అవగాహన ఉంది. ఇనుము, రాగి, వెండి, బంగారం వంటి లోహాల గురించీ, ఉక్కు, కంచు వంటి మిశ్రమాల గురించి భారతీయులకు వేలసంవత్సరాలుగా తెలుసు. కాని ఆధునిక గనుల తవ్వకం, ఖనిజాల వాడకం బ్రిటిష్ పాలనతోనే మొదలయ్యాయి. బ్రిటిష్ వలసవాదుల పాలనావిధానమే భారత ఉపఖండంలోని సహజ వనరులను కొల్లగొట్టి తమ దేశానికి తరలించుకుపోవడం, తమ పరిశ్రమలకు ముడిసరుకులుగా వాడుకోవడం మీద ఆధారపడింది. ఈస్టిండియా కంపెనీ రోజులలోనే 1774లో రాణిగంజ్ లో మొదటి ఆధునిక బొగ్గుగనిని తెరవడంతో భారతదేశంలో పరాయిదేశాల ఖనిజ దాహం మొదలయింది. దేశంలో ఉన్న ఖనిజనిక్షేపాల మొట్టమొదటి చిత్రపటాన్ని బ్రిటిష్ అధికారులే 1821లో తయారుచేశారు. రైళ్లకు అవసరమయిన బొగ్గు నిలువలను కనిపెట్టి తవ్వడంకోసం 1851లో బిటిష్ ప్రభుత్వం జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ప్రారంభించింది. అలాగే గనులు, భూగర్భ వనరుల శాఖను 1887లో ఏర్పాటు చేసింది.  గనులకోసం భూసేకరణ చట్టాన్ని 1885లోనే తీసుకువచ్చింది. ఆ తర్వాత 1901 భారత గనుల చట్టం, 1923 భారత గనుల పాలనా చట్టం వంటి చట్టాల ద్వారా దేశంలోని ఖనిజనిలువల మీద ఈస్టిండియా కంపెనీకి, బ్రిటిష్ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం నియమించిన కంట్రాక్టర్లకు అధికారాన్ని స్థిరపరచుకుంది.

ఇందుకు భిన్నంగా జాతీయోద్యమం దేశంలోని ఖనిజ సంపదమీద దేశప్రజలందరికీ హక్కు ఉంటుందని భావించింది. గనులు, ఖనిజనిలువలు ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తి కావడానికి వీలులేదని భావించింది. అందుకే 1947 తర్వాత గనులను, ఖనిజ సంపదను జాతికి చెందిన ఉమ్మడి ఆస్తిగా గుర్తించి వాటిని నియంత్రించే, అభివృద్ధిచేసే, పరిరక్షించే బాధ్యతను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. భారతరాజ్యాంగం గనులను, ఖనిజాభివృద్ధిని కేంద్ర జాబితాలోనూ, రాష్ట్ర జాబితాలోనూ చేర్చింది. చమురు క్షేత్రాల, చమురు సంబంధిత ఖనిజనిలువల, పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తుల నియంత్రణ, అభివృద్ధి (అంశం 53), పార్లమెంటు చట్టం ద్వారా కేంద్రప్రభుత్వానికి అప్పగించిన గనుల, ఖనిజ నిలువల నియంత్రణ, అభివృద్ధి (అంశం 54) కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని ఇతర గనుల, ఖనిజాల అభివృద్ధి అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ( రాష్ట్ర జాబితా అంశం 23) వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని గనుల మంత్రిత్వ శాఖ దేశంలోని ఖనిజాల సర్వేక్షణకు, అన్వేషణకు, ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది. సహజవాయువు, పెట్రోలియం, అణుధార్మిక ఖనిజాలు మినహా మిగిలిన ఖనిజాలన్నిటికీ గనుల మంత్రిత్వశాఖదే బాధ్యత. గనుల, ఖనిజాల (నియంత్రణ – అభివృద్ధి) చట్టం, 1957 ద్వారా భారత ప్రభుత్వం ఈ పని చేస్తుంది.

ఈ విధానాల ప్రకారం అల్యూమియం, రాగి, జింక్, సీసం, బంగారం, నికెల్ వగైరా ఖనిజాలను కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కిందికి తెచ్చారు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, మినరల్ ఎక్స్ ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్  వంటి కేంద్రప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేశారు. వీటిలో భారత్ అల్యూమియం కంపెనీని, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ ను ఇటీవల ప్రైవేటీకరించారు. ఇవికాక తమ పరిధిలోని ఖనిజాల అభివృద్ధి కోసం దాదాపు అన్నిరాష్ట్ర ప్రభుత్వాలు ఖనిజాభివృద్ధి సంస్థలను ఏర్పరచుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కూడ కొన్ని సంస్థలను ఏర్పాటు చేశాయి. ఈ చట్టబద్ధమైన, పాలనాపరమైన ఏర్పాట్లద్వారా దేశంలోని ఖనిజ నిలువల అన్వేషించి, వెలికితీసి, దేశాభివృద్ధి కోసం వినియోగించాలని ఆశించారు. కాని జరిగినది మరొకటి. అసలు ఉద్దేశాలలోనే లోపముందా, ఆచరణలో లోపముందా అనే చర్చకు పెద్దగా ప్రయోజనం లేదు.

దేశంలో దాదాపుగా లేని ఖనిజం లేదని చెప్పవచ్చు. వీటిలో ఇనుప ఖనిజం, రాగి ఖనిజం, క్రోమైట్, జింక్ సమ్మేళనాలు, బంగారం, మాంగనీస్ ఖనిజం, బాక్సైట్, సీసం మిశ్రమాలు, వెండి, సున్నపురాయి, మాగ్నెసైట్, డోలమైట్, బరైటిస్, కావొలిన్, జిప్సం, అపటైట్, ఫాస్ఫరైట్, స్టియటైట్, ఫ్లోరైట్ అనే ఖనిజాలు ముఖ్యమైనవి. ఈ ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాలన్నిటిలోనూ భారతదేశానికి చాల ప్రాముఖ్యత ఉంది.

అంటే, ప్రపంచదేశాలన్నీ, ఆయా లోహాలతో పరిశ్రమలు నడిపే, వ్యాపారాలు చేసే బహుళజాతి సంస్థలన్నీ భారతదేశం మీద ఆధారపడవలసిందే తప్ప, భారతదేశానికి వాటితో పనిలేదు. ఆయా పరిశ్రమల ఉత్పత్తులు నిరాటంకంగా సాగాలంటే, వాటికి ముడిసరుకులయిన లోహాలు, ఖనిజాలు నిరంతరం అందాలంటే, ఆయా పరిశ్రమలు నడుపుతున్న బహుళజాతిసంస్థల లాభాలు ఇబ్బడిముబ్బడి కావాలంటే వారందరికీ భారతదేశపు ఖనిజాలు కావలసి ఉంటుంది. అంటే బేరసారాలాడడానికి, మనకు అనుకూలమైన విధానాన్ని అనుసరించడానికి, మనకు లాభసాటిగా ఉండే ఆంక్షలు, నిబంధనలు విధించడానికి భారత ప్రభుత్వానికి ఎక్కువ అవకాశం ఉంది. కాని భారత పాలకులకు భారత ప్రజల మీదికన్న తమ సొంత ఖజానాలు నింపుకోవడం మీద శ్రద్ధ ఎక్కువ. ప్రజల వోట్లతో గెలిచి గద్దెలెక్కిన ఈ పెద్దలు, దేశదేశాల సంపన్నుల, బహుళజాతిసంస్థల దళారులుగా పనిచేయడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారు. తెలిసి తెలిసీ భారతదేశపు అవకాశాలను, ఆధిక్యతను, సానుకూలతలను భంగపరిచారు. భారత ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారు.

ప్రభుత్వ రంగంలోని గనుల శాఖలను, సంస్థలను సవ్యంగా, ప్రజానుకూలంగా నడిపి ఉంటే, ఖనిజాల వెలికితీతలో శాస్త్రీయమైన, హేతుబద్ధమైన, సామాజిక శ్రేయోదాయకమైన పద్ధతులు అవలంబించి ఉంటే, ఖనిజ రూపంలోని దేశసంపద అంతా దేశప్రజలకే అందేది. దేశప్రజల సౌభాగ్యం కోసమే వినియోగంలోకి వచ్చేది. రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో అధికరణం 39లో చెప్పినట్టుగా, ‘సమాజపు భౌతిక వనరుల మీద యాజమాన్యం, నియంత్రణ ఉమ్మడి శ్రేయస్సు కోసం ఉపయోగపడేటట్టుగా పంపిణీ అవుతుంది’ అనే సూత్రాన్ని కచ్చితంగా అమలుచేసి ఉంటే ఖనిజసంపద ప్రస్తుతం జరుగుతున్నట్టుగా దుర్వినియోగం అయ్యేది కాదు. కొద్దిమంది సంపన్నుల చేతిలో, బహుళజాతిసంస్థల చేతిలో, వారి దళారీలుగా పనిచేస్తున్న స్వదేశీ పెట్టుబడిదారుల, ప్రభుత్వాధికారుల చేతిలో పోగుపడేది కాదు.

భారత ప్రభుత్వానికి 1947 నుంచి 1993 దాకా ప్రత్యేకంగా ఖనిజ విధానం అంటూ ఏమీలేదు. 1957 చట్టంలోనే గనుల తవ్వకాన్ని ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పగించడానికి వీలు కల్పించారు. 1960లో వెలువడిన ఖనిజాల రాయితీల నిబంధనలు ఇలా ప్రైవేటు వ్యక్తుల, సంస్థల చేతికి ఖనిజ నిలువలను అందించడానికి అవసరమైన విధివిధానాలను రూపొందించాయి. ఆర్థిక సరళీకరణ క్రమం మొదలయిన తర్వాత 1988లో వెలువడిన ఖనిజాల సంరక్షణ, అభివృద్ధి నిబంధనలు ఈ ప్రైవేటీకరణ క్రమాన్ని మరింత పెంచాయి. 1993లో మొదటిసారిగా తయారయిన జాతీయ ఖనిజ విధానం పూర్తిగా ప్రపంచీకరణ శక్తుల కనుసన్నల్లో, బహుళజాతిసంస్థల ప్రయోజనాలు నెరవేర్చడానికే తయారయింది. ఇంధన ఖనిజాలు, అణుధార్మిక ఖనిజాలు మాత్రం మినహాయించి మిగిలిన ఖనిజాలన్నిటిలోకి నేరుగా విదేశీ పెట్టుబడులు ప్రవేశించడానికి మార్గం సుగమమయింది. స్వదేశీ సంపన్నుల గనుల మాఫియా బహుళజాతి సంస్థలతో కుమ్మక్కయింది. ఆ విధానాన్ని కూడ 1994లో మరింత సవరించి ఇనుప ఖనిజం, రాగి, మాంగనీస్, సీసం, క్రోమ్ ఖనిజం, జింక్, గంధకం, మాలిబ్డినం, బంగారం, టంగ్ స్టన్, వజ్రాలు, నికెల్, ప్లాటినం మొదలయిన ఖనిజాలలోకి ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు సంస్థలు, బహుళజాతి సంస్థలు ప్రవేశించడానికి వీలు కల్పించారు. దానితో కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణాఫ్రికాలకు చెందిన ఎన్నో బహుళజాతి సంస్థలు నేరుగా గాని, తమ దళారులద్వారా గాని ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఖనిజాల, గనుల రంగంలోకి మరింతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అవకాశం ఇవ్వడానికి 2006లో మరిన్ని చట్టపరమైన మార్పులు చేశారు. ఇంకా ఇది సరిపోదన్నట్టు కేంద్రప్రభుత్వం తయారు చేస్తున్న కొత్త చట్టంలో గనుల, ఖనిజ నిలువల ప్రైవేటీకరణకు ఇంకా విస్తృత చర్యలున్నాయి.

బహుళజాతి సంస్థలకు గనుల, ఖనిజాల అవసరం ఎక్కువగా ఉండడంతో, ఇందులో విపరీతంగా లాభాలు ఉండడంతో, దేశంలో గనులను లీజుకు తీసుకునే స్థానిక పెత్తందారులు, వ్యాపారస్తులు, అధికారులు, రాజకీయవేత్తలు కలగలిసిన మాఫియా తయారయింది. ఈ గనుల మాఫియా నుంచి ప్రభుత్వం వసూలు చేసేది వాళ్ల లాభాలలో ఒక్క శాతం కన్న కూడ తక్కువ. అలా గనుల మాఫియా చట్టబద్ధంగా, ప్రభుత్వ అనుమతి ప్రకారం గనులు తవ్వితేనే 99 శాతం లాభాలు అప్పనంగా వచ్చి పడుతుండగా, ఇక అక్రమ తవ్వకాలు, లీజు ఇచ్చిన స్థలం కన్న ఎక్కువ భూమిలో తవ్వకాలు, లెక్కలు తక్కువచేసి చూపించడం, ప్రభుత్వానికి ఇవ్వవలసిన రాయల్టీ తగ్గించడానికి, ఎగ్గొట్టడానికి సాంకేతిక మార్గాలు వెతకడం వంటి అనేక అక్రమ పద్ధతులు ఉన్నాయి.

ఇక్కడ ఒక చట్టబద్ధమైన అవినీతి మార్గం గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. మినరల్ కన్సెషన్ రూల్స్ (ఖనిజ రాయితీ నిబంధనలు) 1960 లో 24 ఎ (6) అనే నిబంధన ఒకటి ఉంది. ‘ఎవరయినా ఆసామి ఒక గనిని లీజుకు తీసుకుంటే, దాని కాలపరిమితి ముగిసిన తర్వాత, కొనసాగించమని నిర్ణీత వ్యవధిలోపల దరఖాస్తు పెట్టుకుంటే, సంబంధిత అధికారి ఆ దరఖాస్తు మీద ఏ నిర్ణయం తీసుకోకపోయినా, లీజు పునరుద్ధరించబడినట్టే’ అని ఆ నిబంధన చెపుతుంది.  అంటే గనుల శాఖ అధికారికి నిర్ణయం తీసుకోకుండా ఉండడానికి లంచం పెడితే గని తవ్వకందారు గనిని తవ్వుకుంటూనే ఉండవచ్చు. నిజానికి ఆ లంచం కూడ అవసరం లేదు, మన ప్రభుత్వ శాఖల అలసత్వం వల్ల, కాగితాలు కదలడానికి నెలలూ సంవత్సరాలూ పడతాయి గనుక ఈ లోగా గని లీజు పునరుద్ధరణ జరిగిపోతుందన్న మాట. 2009 లో సుప్రీం కోర్టులో ఒడిషాలో గనుల అవినీతి గురించి దాఖలయిన ఒక పిటిషన్ లో ఈ నిబంధన గురించి  దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటికి ఒడిషాలో పనిచేస్తున్న 341 గనుల్లో కేవలం 126 మాత్రమే తగిన అనుమతులతో పనిచేస్తున్నాయి. మిగిలినవాటిలో ఎక్కువభాగం పైన చెప్పిన నిబంధనను ఉపయోగించుకుని పనిచేస్తున్నాయి. ఈ అనుమతిలేని గనుల వల్ల ఆ గనుల తవ్వకందార్లు మూడులక్షల కోట్ల రూపాయలు సంపాదించారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇక రాష్ట్రం విషయానికి వస్తే, దేశంలోని ఖనిజనిలువల సంపదలో రాష్ట్రానిది రెండవ స్థానం. రాష్ట్రంలో దాదాపు 50 పారిశ్రామిక ఖనిజాల వెలికితీత, ఉత్పత్తి జరుగుతోంది. బొగ్గు, సహజవాయువు, సున్నపురాయి, అభ్రకం, బరైటిస్, బాక్సైట్, సముద్రతీరపు ఇసుక, స్టియటైట్, క్వార్ట్ జ్, ఫెల్డ్ స్పార్, మాంగనీస్, డోలమైట్, గ్రానైట్ వంటి ఖనిజాలెన్నో రాష్ట్రంలో ఉన్నాయి.  ఇంకా వెలికితీయని, అన్వేషించవలసిన ఖనిజ నిలువలు ఎన్నో ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో సింగరేణి బొగ్గుగనులు కాక ఐదు లక్షల ఎకరాలలో వివిధ గనుల తవ్వకాలు ప్రైవేటు వ్యక్తుల, వ్యాపారసంస్థల చేతుల్లో ఉన్నాయి. గనులు తవ్విపెడతామని లీజుకోసం, అనుమతులకోసం ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నవారి సంఖ్య ఏటేటా వేలాదిగా పెరుగుతోందంటేనే గనుల వ్యాపారం చాల లాభసాటి వ్యవహారం అయిపోయిందని అర్థం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2005-06లో ఈ గనుల ద్వారా రు. 7,803 కోట్ల విలువగల ఖనిజాల వెలికితీత జరిగింది. కాని ప్రభుత్వానికి పన్నులు, లీజు, రాయల్టీ, ఆదాయవాటాల ద్వారా అందినది రు. 1,075 కోట్లు మాత్రమే. అంటే తెలుగు ప్రజల ఉమ్మడి వారసత్వ సంపద నుంచి ఆ ఒక్క సంవత్సరమే 6,728 కోట్ల రూపాయలు కొన్ని డజన్ల మంది గనుల వ్యాపారుల బొక్కసాలకు చేరిందన్నమాట. ఈ అంకెను గత ఇరవై సంవత్సరాల వ్యవధితోనో, పది సంవత్సరాల వ్యవధితోనో హెచ్చవేస్తే మన రాజకీయ నాయకులు-అధికారులు-గనుల వ్యాపారులు సాగించిన అక్రమార్జనలో కొంతభాగానికి లెక్క తేలుతుంది. ఆ వేల కోట్ల రూపాయల సంపద అంతా న్యాయంగా ప్రజా సంక్షేమానికీ, అభివృద్ధికీ వెచ్చించవలసినది.

ఇదంతా ప్రజల సంపద. ఉమ్మడి వారసత్వం. దాన్ని ప్రజల అవసరాల కోసం, అభివృద్ధికోసం ప్రణాళికాబద్ధంగా వినియోగించాలి. దొరికే ఖనిజసంపదనంతా సమీక్షించి, పద్ధతి ప్రకారం వెలికితీస్తూ, రాష్ట్రంలోనే ఆ ఖనిజాల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. అ పారిశ్రామిక ఉత్పత్తుల వ్యాపారం ద్వారా ఆదాయం సంపాదించవచ్చు. దొరికే ఖనిజాలను ఉపయోగించి విద్యుదుత్పత్తి, సిమెంట్, ఎరువులు, సెరామిక్స్, గ్లాస్, ఉక్కు, గృహ నిర్మాణ పరికరాలు, వినియోగవస్తువులు తయారుచేసే పరిశ్రమలు ఎన్నో స్థాపించవచ్చు. గనుల తవ్వకాన్ని ప్రభుత్వరంగంలోనే నిర్వహిస్తూ ఖనిజాల విలువనంతా రాష్ట్ర ఖజానాకే చేర్చవచ్చు. ఎక్కడైనా సాంకేతిక కారణాల కొద్దీ ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు లీజు ఇవ్వవలసి వచ్చినా ప్రజాధనం ప్రైవేటు వ్యక్తుల, సంస్థల కైంకర్యం కాకుండా రాయల్టీలు, పన్నులు శాస్త్రీయంగా విధించి ప్రభుత్వాదాయం పెంచవచ్చు. కాని అవి జరిగే పాలనా విధానాలు లేవు.

అవన్నీ లాభ నష్టాల లెక్కలతో, డబ్బు సంపాదనే సార్థకతకు చిహ్నంగా సాగుతున్న రాజకీయార్థిక వ్యవస్థలో, ఆధిపత్య శక్తులకే అన్ని అధికారాలూ అనే విలువల చట్రంలో సాధ్యం కావు. అవి సాధ్యం కావాలంటే సహజసంపదలన్నీ ప్రజలవి మాత్రమేననే ప్రత్యామ్నాయ దృక్పథం కావాలి. ప్రజలు ఏ జల్, జంగల్, జమీన్ మీద ఆధారపడి ఉన్నారో వాటి మీద సకలాధికారాలూ ప్రజలవే అనే కొత్త దృక్పథం ఆధారంగా వ్యవస్థ నిర్మాణం జరగాలి.


Box 1

కళ్లు తిరిగిపోయే లాభాలు!

గనుల యజమానుల సంపాదన ఎంత ఉంటుందో ఉజ్జాయింపుగా లెక్కకట్టినా కళ్లు తిరుగుతాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో నవంబర్ 2009 లో భారత ఇనుపఖనిజం ధర (ఆ ఖనిజంలో 63.5 శాతం ఇనుము ఉన్నట్టయితే) టన్నుకు 106 డాలర్లు పలికింది. రూపాయల్లో చెప్పాలంటే ఇది రు. 4895.

కేంద్రప్రభుత్వ గనుల శాఖ ఎప్పటికప్పుడు రాయల్టీ రేట్లను ప్రకటిస్తుంది. గనుల శాఖ వెబ్ సైట్ మీద సెప్టెంబర్ 12, 2000న ప్రకటించిన రేట్ల నోటిఫికేషనే తాజాగా ఉంది. దాని ప్రకారం 62 శాతం నుంచి 65 శాతం ఇనుము ఉన్న ఖనిజానికి టన్నుకు ప్రభుత్వానికి చెల్లించవలసిన రాయల్టీ రు. 14.50 (అక్షరాలా పద్నాలుగు రూపాయల యాభై పైసలు!)

అలాగే కేంద్రప్రభుత్వ గనుల శాఖ రేట్స్ ఆఫ్ డెడ్ రెంట్ అని మరొక కౌలు వసూలు చేస్తుంది. ఇది విస్తీర్ణాన్ని బట్టి, లీజు తీసుకుని ఎంతకాలం గడిచిందనే దాన్ని బట్టి మారుతుంది. ఏమయినా గరిష్టంగా చెల్లించవలసింది హెక్టేరుకు (రెండున్నర ఎకరాలకు) సంవత్సరానికి రు. 350. అంటే ఇది సగటున టన్నుకు లెక్కకడితే చిల్లరపైసల్లోకి మారుతుంది.

యంత్రాలకు, తవ్వకానికి, సిబ్బందికి, రవాణాకు, వివిధ ప్రభుత్వ శాఖలకు లంచాలకు అన్నీ కలిపి ఎంత ఎక్కువలో ఎక్కువ ఖర్చు లెక్కకట్టినా టన్నుకు రు. 1000 కన్న ఎక్కువ కావడానికి అవకాశం లేదు.

అంటే ఒక గని యజమాని ఒక్కటన్ను ఇనుపఖనిజం మాత్రమే తవ్వి ఎగుమతి చేసినా మూడువేల రూపాయలు లాభం చేసుకోవచ్చు.

ఇటీవల ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన వివాదం వచ్చినప్పుడు తమకు ఏడాదికి డెబ్బై లక్షల టన్నుల ఇనుపఖనిజం ఎగుమతి చేసే అనుమతి ఉందని ఆ కంపెనీ న్యాయవాది సుప్రీంకోర్టు ముందర చెప్పారు. గనియజమానుల సగటు లాభం టన్నుకు మూడువేల రూపాయలు కాదనీ, సగానికి సగంగా పదిహేను వందల రూపాయలు మాత్రమేననీ అనుకున్నా ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సంవత్సర లాభం వెయ్యి కోట్ల రూపాయల పైచిలుకేనన్నమాట.

Box 2

గణాంకాలు

భారతదేశం ఖనిజ వనరుల కాణాచి. లడాఖ్ నుంచి లక్షద్వీపాల దాకా, కచ్ నుంచి కోహిమా దాకా సువిశాల భారత దేశంలో లేని ఖనిజం లేదు. పారిశ్రామికాభివృద్ధికైనా, నిత్య జీవితంలో వాడుకునే సరుకుల, పనిముట్ల, యంత్రాల తయారీకైనా, యుద్ధ సామగ్రి తయారీకయినా ప్రపంచం మొత్తానికీ అవసరమైన అన్ని లోహాలూ భారతదేశంలో దొరికే ఖనిజాల ద్వారా తయారవుతాయి. ఆసియా ఖండంలోనూ, ప్రపంచం మొత్తంలోనూ భారతదేశం అతి ప్రధానమైన ఖనిజ ఉత్పత్తిదారు, సరఫరాదారు. మొత్తం దేశంలో దాదాపు 90 ఖనిజాలు దొరుకుతాయి. వాటిలో నాలుగు ఇంధన ఖనిజాలు, 11 లోహ ఖనిజాలు, 52 లోహేతర ఖనిజాలు, 22 చిన్న ఖనిజాలు ఉన్నాయి.

ప్రపంచ దేశాల ఖనిజ ఉత్పత్తి జాబితా చూస్తే భారతదేశం అభ్రకంలో మొదటి స్థానంలో, క్రోమైట్, బెరైటిస్ లలో రెండో స్థానంలో, బొగ్గు, లిగ్నైట్ లలో మూడో స్థానంలో, ఇనుప ఖనిజంలో నాలుగో స్థానంలో, బాక్సైట్, ముడి ఉక్కులలో ఐదవ స్థానంలో, మాంగనీస్ లో ఏడవ స్థానంలో, అల్యూమియంలో ఎనిమిదవ స్థానంలో ఉంది.

ఖనిజ నిలువలలో భారతదేశంతో పోల్చదగిన సంపద ఉన్న దేశాలు బహుకొద్ది. కాని అటువంటి ఖనిజాలే లేని దేశాలు, భారత పాలక విధానాలవల్ల ఇక్కడినుంచి ఖనిజాలు కొల్లగొట్టుకుపోయి, వాటితో తయారుచేసిన సరుకులనూ, యంత్రాలనూ, పరికరాలనూ మళ్లీ భారతదేశంతో సహా ప్రపంచానికంతా అమ్ముతున్నాయి.

దేశవ్యాప్తంగా ఇరవై వేల చోట్ల వివిధ ఖనిజాల నిక్షేపాలు ఉన్నాయని అంచనా కాగా దాదాపు నాలుగువేల గనుల్లో పని జరుగుతోంది. అయితే దేశంలోని మొత్తం గనులలో 90 శాతం పదకొండు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, ఒడిషా, చత్తీస్ గడ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక) లోనే ఉన్నాయి. నిక్షేపాలన్నీ అడవులలో, నదీలోయలలో ఉండడం భారత దేశపు ఖనిజాల ప్రత్యేకత. సరిగ్గా ఆ ప్రాంతాలలోనే ఈ దేశపు ఆదివాసి జనాభాలో అత్యధికులు – దాదాపు ఏడుకోట్ల మంది – ఉన్నారు.

2005 నాటి లెక్కల ప్రకారం దేశంలో 328 కోట్ల టన్నుల బాక్సైట్ ఖనిజం, 139 కోట్ల టన్నుల రాగి ఖనిజం, 52 కోట్ల టన్నుల సీసం ఖనిజం, 242 కోట్ల టన్నుల జింక్ ఖనిజం, 1463 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం (హెమటైట్), 1061 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం (మాగ్నెటైట్), 21 కోట్ల టన్నుల క్రోమైట్ ఖనిజం ఉన్నాయి. ఇంకా మాగ్నెసైట్, మాంగనీసు, సున్నపురాయి, రాక్ ఫాస్ఫేట్, సిలిమనైట్, గార్నెట్, క్యానైట్, డొలమైట, వజ్రాలు, బంగారం వంటి ఖనిజాలు కోట్ల టన్నులలోనూ లక్షల టన్నులలోనూ ఉన్నాయి. ఈ ఖనిజాల వెలికితీత ప్రస్తుత పరిమాణంలోనే సాగితే సిలిమనైట్, క్యానైట్ మినహా ఇతర ఖనిజాలన్నీ కొన్ని దశాబ్దాలలోనో, రెండు మూడు శతాబ్దాలలోనో వట్టిపోతాయి. నిజానికి ఇప్పటికే గత పది, పదిహేను సంవత్సరాలలో మన వార్షిక వెలికితీత రెండు మూడు రెట్లు పెరిగిపోయింది.

Box 3

ఆదివాసుల స్థితి

మన ఖనిజ నిక్షేపాల పరిమాణం గురించి గణాంకాలు తెలుసుకున్నట్టుగానే, ఈ ఖనిజ నిక్షేపాలతో లాభపడుతున్నదెవరో, నష్ట పోతున్నదెవరో కూడ తెలుసుకోవాలి.

ఖనిజాలు ఏ సమాజం నివసిస్తున్న నేల కింద ఉన్నాయో వారికి మొట్టమొదట చెందుతాయి. అంటే అవన్నీ వాళ్లేమీ తినలేరు గనుక వాటిని హేతుబద్ధంగా తవ్వితీసి తమ ఇతర అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకునే మొదటి హక్కు వాళ్లది కావాలి. ఆతర్వాత, వాళ్లు నివసిస్తున్నది ఒక పాలనా ప్రాంతమయితే, ఆ పాలనా ప్రాంత వాసులందరికీ కూడ ఆ వనరులమీద హక్కు ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు మన దేశంలోని ఖనిజాలమీద మొదటి హక్కు ఆదివాసులది, ఆ తర్వాతి హక్కు ఆయా రాష్ట్ర ప్రజలది, ఆ తర్వాతి హక్కు మొత్తం భారతదేశ ప్రజలది. ఈ హక్కు ప్రజలది మాత్రమే. పాలకులది ఎంతమాత్రం కాదు. పాలకులు నిజంగా ప్రజా ప్రతినిధులుగా అధికారంలోకి వచ్చి ఉంటే, ప్రజోపయోగం కోసమే పని చేస్తూ ఉంటే, అప్పుడు కూడ ప్రజల అనుమతి తీసుకుని మాత్రమే ఈ ఖనిజాల వినియోగం ఎలా జరగాలని నిర్ణయించాలి. కాని ప్రజా ప్రతినిధులుగా ఐదేళ్లకోసమో, ఇంకా తక్కువ కాలానికో (పదమూడు రోజులు పనిచేసిన ప్రభుత్వం కూడ ఉంది మనకు!) అధికార పీఠం ఎక్కినవాళ్లు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు, ఆ తక్కువ సమయంలోనే ఖనిజ వనరుల తవ్వకం లైసెన్సులు తమ కుటుంబ సభ్యులకు, ఆశ్రితులకు ఇచ్చుకుంటున్నారు.

భారతదేశంలో ఖనిజ నిలువలు విస్తారంగా ఉన్న ప్రాంతాల పటాన్నీ, అడవుల పటాన్నీ, అంటే ఆదివాసి నివాస ప్రాంతాల పటాన్నీ పోల్చి చూస్తే ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం బయటపడుతుంది. దేశంలోని ఖనిజ నిలువల్లో, ముఖ్యంగా విలువైన ఖనిజ నిలువల్లో అత్యధిక భాగం ఆదివాసుల నివాసస్థలాల భూగర్భంలోనే ఉన్నాయి. భూగోళం మొత్తం మీద అత్యంత విలువైన, అవసరమైన చమురు, సహజవాయు నిక్షేపాలు ఎక్కువగా ముస్లిం మతవాసుల నివాసస్థలాల కింద ఉన్నాయని, వాటిని రాబట్టడానికే అగ్రరాజ్యాలు సామ దాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నాయని అందరికీ తెలుసు. గత అరవై సంవత్సరాలుగా అమెరికా ప్రభుత్వాలు పశ్చిమాసియా దేశాలలో పెడుతున్న చిచ్చు ఆ సహజ వనరుల నిక్షేపాల మీద తన అదుపుకోసమే. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోగానే పశ్చిమాసియా దేశాలలో తన తైనాతీగా ఇజ్రాయెల్ ను సృష్టించిన దగ్గరినుంచి, సౌదీ అరేబియా వంటి చోట్ల నిరంకుశ రాచరికాలకు మద్దతు ఇవ్వడం దగ్గరినుంచి, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల మీద దాడుల దాకా అమెరికా ఈ చమురు దాహాన్ని బహిరంగంగానే ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పుడు దానికే తీవ్రవాదం మీద యుద్ధం అని పేరు పెట్టింది.

ఈ ఖనిజ నిక్షేపాల దాహం విషయంలో  భారత పాలకుల చరిత్ర కొంచెం భిన్నమైనది. మొదటినుంచీ కూడ భారతపాలకులు నేరుగా తమ అవసరాల కోసం, తమ పారిశ్రామికాభివృద్ధి కోసం ఈ ఖనిజ నిలువల మీద దాడి చేయడం లేదు. పరాయి పాలకుల కోసం, సామ్రాజ్యవాదులకు, బహుళజాతిసంస్థలకు ఈ సంపదలు దోచిపెట్టడంకోసం తమ సొంత పాలితులయిన ఆదివాసుల మీద యుద్ధం చేస్తున్నారు. నూతన ఆర్థిక విధానాల తర్వాత, ముఖ్యంగా 1993 నూతన ఖనిజవిధానం తర్వాత ఈ దాడి ఎక్కువయింది. ప్రపంచీకరణ క్రమంలో బహుళజాతిసంస్థలకు ఇంకా ఇంకా ఎక్కువ ఖనిజాలు, లోహాలు అవసరమయ్యాయి కాబట్టి భారత ఖనిజాలను వారికి అప్పగించి మధ్య దళారీలుగా తాము ముడుపులు పొందడానికి, తమ స్విస్ బ్యాంకు ఖాతాలు పెంచుకోవదానికి భారత పాలకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాలకు వాళ్లకు సహకరిస్తున్నది అభివృద్ధి భావజాలపు మాయాజాలం. వెనుకబడిన ఆదివాసులను అభివృద్ధి చేయడం కొరకే, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం కొరకే గనుల తవ్వకం, ఖనిజ విక్రయం జరుపుతున్నామనే తప్పుడు వాదనలను పాలకులు తరచూ వినిపిస్తుంటారు. అభివృద్ధి అనేది ఎంత మిరుమిట్లు గొలిపే, మాయగొలిపే, భ్రమలు పెంచే భావజాలమంటే, నిజంగా స్వార్థ ప్రయోజనాలు లేవని అనిపించే రాజకీయ పక్షాలు, రాజకీయ నాయకులు కూడ ఈ అభివృద్ధి మంత్రంతో ఆదివాసులను బలి ఇచ్చే యజ్ఞంలో రుత్విక్కులయిపోతారు. కాషాయం నుంచి ముదురు ఎరుపు దాకా పాలకులందరూ, వాళ్లు రాష్ట్ర ప్రభుత్వాలను నడిపేవారయినా, కేంద్రంలో ప్రభుత్వం వెలగబెడుతున్న వారయినా అందరూ ఈ విషయంలో ఒకటే. అయితే స్వార్థ ప్రయోజనాల కొరకో, లేదా తప్పుడు భావజాలానికి బలి అయ్యో ఈ ఖనిజ నిలువల వెలికితీత కార్యక్రమంలో భాగస్వాములయి, తిలాపాపం తలా పిడికెడు పంచుకుంటున్నారు.

ఇంతకూ ఎవరి అభివృద్ధి కోసమని చెప్పి ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే యజ్ఞం జరుగుతున్నదో, ఎవరిని బలిపశువులుగా రోజు రోజూ వధిస్తూ, భయపెడుతూ, బెదిరిస్తూ, ఖనిజ నిలువల ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నం జరుగుతున్నదో ఆ ఆదివాసులు ఇవాళ ఎలా ఉన్నారు? వారికి కావలసిన అభివృద్ధి ఏమిటి? వారికి పాలకులు ఇస్తున్న అభివృద్ధి ఎమిటి?

దేశంలోని అత్యధికంగా వెనుకబడిన, అతి ఎక్కువ పేదరికం ఉన్న 150 జిల్లాల జాబితాలో 30 జిల్లాలు ఖనిజ సంపద ఉన్నవే.  ఖనిజాల మీదనే ఎక్కువగా ఆధారపడే జార్ఖండ్, చత్తీస్ గడ్, ఒడిషాలు, ఖనిజ సంపద మీద అంతగా ఆధారపడని తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ లకన్న వెనుకబడి ఉన్నాయంటే ఖనిజాల వల్ల ఆ రాష్ట్రాలు సాధిస్తున్న అభివృద్ధి ఏమీ లేదని తేలుతుంది. ఖనిజ సంపద విస్తారంగా ఉన్న రాష్ట్రాలలో తక్కువ తలసరి ఆదాయం, ఎక్కువ పేదరికం, తక్కువ పెరుగుదల రేట్లు, ఎక్కువ శిశు మరణాల సంఖ్య, పోషకాహార లోపం వంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఆ ప్రాంతాలలో ప్రాథమిక విద్య లేదు, ప్రాథమిక వైద్య సౌకర్యాలు లేవు. రవాణా సదుపాయాలు లేవు. విపరీతమైన వర్షపాతం, ఏడాది పొడుగునా పారే సెలయేళ్లు ఉన్నప్పటికీ వ్యవసాయ అభివృద్ధి లేదు. ఆదివాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి కనీస చర్యలేవీ ఈ ఆరు దశాబ్దాలలో జరగలేదు. ఆ ఆదివాసులు నివసించే ప్రాంతం నుంచి తవ్వుకుపోతున్న ఖనిజాల వ్యాపారంలో లాభాలలో పదో వంతు తిరిగి వారి అభివృద్ధికి ఖర్చుపెట్టినా, వేల కోట్ల రూపాయలు వారికి దక్కి ఉండేవి.  ఆదివాసుల జీవనం మెరుగయి ఉండేది.

Box 4

గనుల మాఫియా

ఖనిజాల వెలికితీత, శుద్ధి, ఎగుమతి, సరఫరా, ఉత్పత్తి రంగాలలో ఉన్న విపరీతమైన లాభాల వల్ల ఈ రంగంలోకి బహుళజాతిసంస్థలు, వారి ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు పెద్దఎత్తున చొరబడ్డారు. గనుల తవ్వకం ఆ ప్రాంతంలోని ప్రజల జీవనాన్ని ధ్వంసం చేస్తుంది గనుక అందువల్ల వచ్చే ప్రతిఘటనను ఎదుర్కోవడానికి అన్ని చోట్లా గనుల తవ్వకందార్లు మాఫియాగా మారిపోయారు. గనుల వ్యాపారుల సామ్రాజ్యంలో కేవలం ప్రతిఘటించేవారిని బెదిరించడం మాత్రమే కాక, లైసెన్సులు తీసుకోవడంలో అక్రమాలు, లైసెన్సు తీసుకున్న ప్రాంతం కన్న ఎక్కువ ప్రాంతంలో తవ్వకాలు జరపడం, పోటీ కంపెనీలకు కెటాయించిన స్థలం లోంచి ఖనిజాన్ని దొంగతనం చేయడం, ఖనిజాన్ని అక్రమ రవాణా చేయడం, స్థానిక రెవెన్యూ, అటవీ, పోలీసు అధికారులను తమ పోషణలో ఉంచుకోవడం వంటి మాఫియా కార్యక్రమాలెన్నో చేయవలసి ఉంటుంది.

భారత ఖనిజ రంగంలో వ్యాపారం చేస్తున్న బహుళజాతి సంస్థలలో కొన్ని:

ట్రాన్స్ వరల్డ్ గార్నెట్ కంపెనీ, కెనడా

ఆంగ్లో అమెరికన్ ఎక్స్ ప్లొరేషన్ (ఇండియా) బివి, నెదర్లాండ్స్

ఫెల్ప్స్ డాడ్జ్ ఎక్స్ ప్లొరేషన్ కార్పొరేషన్, యు ఎస్ ఎ

బి ఎచ్ పి బిల్లిటన్, ఆస్ట్రేలియా

పెబుల్ క్రీక్ రిసోర్సెస్ లిమిటెడ్, కెనడా

మెరిడియన్ పీక్ రిసోర్సెస్ కార్పొరేషన్, కెనడా

రియో-టింటో మినరల్స్ డెవలప్ మెంట్ లిమిటెడ్, యు కె

మెట్ డిస్ట్ గ్రూప్, యు కె

డి-బీర్స్ కన్సాలిడేటెడ్ మైన్స్ లిమిటెడ్, దక్షిణాఫ్రికా

పోస్కో, దక్షిణ కొరియా

మిత్తల్ – ఆర్సెలార్, నెదర్లాండ్స్

ఎం ఎం కె, రష్యా

కోరస్, బ్రిటన్ – నెదర్లాండ్స్

జిందాల్ సౌత్ వెస్ట్ స్టీల్, భారతదేశం

టాటా స్టీల్

ఎస్సార్ స్టీల్

వేదాంత రిసోర్సెస్, యు కె

Box 5

సినిమాలు, పుస్తకాలు

ఖనిజ నిలువల గురించి, గనుల మాఫియా గురించి, ఖనిజాల కోసం బహుళజాతి సంస్థలు ఎన్నెన్ని సమాజాలను ధ్వంసం చేశాయో చెప్పే చరిత్ర గురించి అర్థం చేసుకోవడానికి ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడవలసిన సినిమాలు, చదవవలసిన రచనలు:

లియొనార్డో డి కాప్రియో, జెన్నిఫర్ కానెల్లీ, జిమోన్ హూన్సో ప్రధాన పాత్రధారులుగా ఎడ్వర్డ్ జ్విక్ 2006లో తీసిన బ్లడ్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆఫ్రికాలోని సియరాలియోన్ అనే చిన్నారి దేశంలో దొరికే వజ్రాల వల్ల ఆ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలలో ఎన్నెన్ని దురాగతాలు సంభవించాయో ఆ సినిమా వీక్షకుల కంట తడిపెట్టేలా వివరించింది. ఇతరదేశాలలో ఆడంబరంగా, విలాసంగా ధరిస్తున్న వజ్రాలకు ఎంత నెత్తురు అంటి ఉన్నదో ఆ సినిమా చూపింది. ఆ వజ్రాల వెతుకులాటలో సాయుధ ముఠాల ఘర్షణలు, చిన్నారి పిల్లలను సైనికులుగా మలచడం, ఆదిమ తెగల ప్రజలను, ఒక్క తల్లి కడుపున పుట్టినవారినీ, తండ్రీకొడుకులనూ ఒకరి మీదికి ఒకరిని శత్రువులుగా ఉసిగొల్పడం, వజ్రాలు అమ్మి ఆయుధాలు కొనడానికి ప్రభుత్వ వ్యతిరేక సాయుధ బృందాలు ప్రయత్నించడం, స్మగ్లరు, కుట్రలు, కుహకాలు, ఈ క్రమంలో వజ్రాల వ్యాపారం చేసే బహుళజాతిసంస్థలు, వాటి చెప్పుచేతల్లో నడిచే ప్రభుత్వాలు, ప్రభుత్వాల సాయుధ బలగాలు ఎన్ని అక్రమాలకు పాల్పడతాయో బ్లడ్ డైమండ్ చూపుతుంది.  ఇటువంటి అక్రమ, సంఘర్షణా మయమైన, నెత్తురంటిన వజ్రాలను కొనడాన్ని నిషేధిస్తూ 2000లో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానం కూడ ఆమోదించింది గాని ఇప్పటికీ ఈ అక్రమ వ్యాపారం సాగుతూనే ఉంది. ప్రపంచ వజ్రాల వ్యాపారంలో అగ్రస్థానాన ఉన్న డి బీర్స్ అనే బహుళజాతి సంస్థ (ఇది ఇప్పుడు భారతదేశంలో వజ్రాల వ్యాపారంలో కూడ ఉంది) ఈ సినిమా నిర్మాతల మీద ఒత్తిడి తెచ్చి ‘ఇదంతా కల్పన, వాస్తవంతో ఎక్కడయినా పోలికలు ఉంటే యాదృచ్ఛికమే’ అని ముక్తాయింపు వేసేలా చేసింది. ఆ ప్రకటన, కథలో కొన్ని అసంగతాలు ఉన్నప్పటికీ,  ఖనిజాలకు ఎంతెంత నెత్తురు అంటుకుని ఉందో ఈ సినిమా ప్రేక్షకులకు తెలియజెప్పింది.

బ్లడ్ డైమండ్ కన్న ఎక్కువ నిర్దిష్టంగా, సూటిగా, స్పష్టంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసిన సినిమా 2009లో వచ్చిన అవతార్. ఒక శాస్త్రవిజ్ఞానకల్పన చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ 2154లో మనుషులు మరొక సౌరకుటుంబంలో పాండోరా అనే గ్రహం మీద ఉన్న అనబ్టేనియం అనే విలువైన ఖనిజం కోసం అక్కడి నావి అనే జీవజాతిని, అక్కడి ప్రకృతిని  ధ్వంసం చేసి. ఎన్ని ఘోరాలు చేస్తారో కళ్లకు కట్టాడు. ఆ సినిమాలోని మనుషులు అమెరికన్ బహుళజాతి కంపెనీలకు, వేదాంత రిసోర్సెస్ కు ప్రతిరూపమని, అనబ్టేనియం అనే ఖనిజం చమురు, సహజవాయువు, బాక్సైట్ అని, ఆ పాండోరా గ్రహం పశ్చిమాసియానో భారతదేశంలోని ఒరిస్సానో అని, నావి జాతి అరబ్బులకో ఖోండులకో ప్రతిరూపమని ఎంతో మంది వ్యాఖ్యానించారు. ఒక దేశ పాలకులకు మరొక దేశంలోని, ప్రాంతంలోని వనరులను కొల్లగొట్టే హక్కు ఉందా అనీ, ఆ క్రమంలో అక్కడి ప్రజల జీవితాన్ని, ప్రకృతిని ధ్వంసం చేయడం దుర్మార్గం కాదా అనీ చాల చర్చకు ఈ సినిమా వీలు కల్పించింది.

రాకేశ్ కల్షియాన్ సంపాదకుడిగా పానోస్ సౌత్ ఏషియా అనే స్వచ్ఛంద సంస్థ ప్రచురించిన కాటర్ పిల్లర్ అండ్ ది మహువా ఫ్లవర్ భారత దేశంలోని గనుల్లో జరుగుతున్న కల్లోలాన్ని పదమూడు వ్యాసాల్లో వివరంగా చిత్రించింది.

ఫెలిక్స్ పాడెల్ అనే ఆంథ్రొపాలజిస్టు, సమరేంద్ర దాస్ అనే ఒడియా రచయిత కలిసి రాసిన ‘ఔట్ ఆఫ్ దిస్ ఎర్త్ – ఈస్ట్ ఇండియా ఆదివాసీస్ అండ్ ది అల్యూమినియం కార్టెల్’(ఓరియంట్ బ్లాక్ స్వాన్, హైదరాబాద్ ప్రచురణ 2010) నిశితమైన పరిశోధనతో ఒక చిన్న రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదలో ఒకానొక లోహాన్ని తయారుచేసే ఖనిజం ఉన్నందువల్ల ఆ రాష్ట్రాన్నీ, ఆ రాష్ట్ర ప్రజలనూ ధ్వంసం చేయడానికి బహుళజాతిసంస్థలు ఎన్నెన్ని కుట్రలు పన్నుతాయో వివరించింది.

పర్యావరణ పక్షపత్రిక డౌన్ టు ఎర్త్ ను నడిపే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ గత సంవత్సరం రిచ్ లాండ్స్ పూర్ పీపుల్ అనే నివేదికను ప్రచురించింది. నవలా రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ ది లాండ్ ఈజ్ మైన్ శీర్షికతో గత సంవత్సరం ఔట్ లుక్ పత్రికలో ఒక సుదీర్ఘమైన ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించారు.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu. Bookmark the permalink.

2 Responses to ఖనిజ సంపదల కాణాచి మన మాతృభూమి ఏ ఘనుల బొక్కసాలకీ గనుల సంపద?

 1. chavakiran says:

  And then
  Let us get Telangana state
  and sell Telangana ganulu to Telangana doralu.

 2. Yedukondalu says:

  Venu,
  Great article .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s