భూబకాసురుల కొత్త ఎత్తుగడ ప్రత్యేక దోపిడీ మండలాలు

ఈభూమి సెప్టెంబర్ 2010 కోసం

ఆంధ్ర ప్రదేశ్ దేశంలోని చాల రాష్ట్రాల కన్న ఎక్కువ ప్రత్యేక ఆర్థిక మండలాలతో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 108 ప్రత్యేక ఆర్థిక మండలాలతో మొదటి స్థానంలో ఉండగా, 106 ప్రత్యేక ఆర్థిక మండలాలతో ఆంధ్రప్రదేశ్ ఆ స్థానాన్ని చేరడానికి పోటీపడుతోంది. ఇలా ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేసే విధానం స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే ఇంగ్లిషు పేరు పొడి అక్షరాలతో ఎస్ ఇ జెడ్ – సెజ్ – పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది. దేశం మొత్తం మీద 23 రాష్ట్రాలలో కలిసి పూర్తి అనుమతి పొందిన సెజ్ లు 577 ఉండగా వాటిలో 106 ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇంకా 155 సెజ్ లు సూత్రప్రాయ అనుమతి పొంది పూర్తి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. దేశంలోని సెజ్ లలో పద్దెనిమిది శాతానికి పైన ఒక్క మన రాష్ట్రానికే అందాయి. దేశంలో ఏడు శాతం జనాభాకూ, ఎనిమిది శాతం విస్తీర్ణానికీ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి పద్దెనిమిది శాతం సెజ్ లు దక్కడం ఆశ్చర్యం కలిగించవచ్చు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలలో, కేటాయింపులలో రాష్ట్రానికి న్యాయంగా రావలసిన వాటా కూడ రాని పరిస్థితిలో ఈ సెజ్ ల వెల్లువ మాత్రం మనమీద ఎందుకు ఇంతగా కురిసిందో అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కు ఈ మహా ఘనత ఎందుకు వచ్చిందో, అసలిది ఘనతేనో కాదో, దీనివల్ల రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి, సాధారణ ప్రజానీకానికి ఏం జరగబోతున్నదో ఆలోచించాలి.

ఎంత పెద్ద అంకె కనబడితే అంత గొప్ప అనీ, అది మంచో చెడో తెలియకపోయినా జాబితాలో అందరికన్న పైన ఉండడం సాధించవలసిన విజయమనీ అనుకునే విలువలు ప్రస్తుతం రాజ్యం చేస్తున్నాయి. ఐదు సంవత్సరాల కింద సున్నాగా ఉన్న ప్రత్యేక ఆర్థిక మండలాల సంఖ్య ఇవాళ 106 గా ఉన్నదంటే పెరుగుదల రేటు 10,600 శాతం అనీ, కనుక మనం అందలం ఎక్కినట్టేననీ, ఇక స్వర్గానికి బెత్తెడేననీ వాదించే అర్థశాస్త్రవేత్తలు కూడ ఉన్నారు. అంకె వెనుక దాగిఉండే సామాజిక పరిణామాలను, వాటి మంచిచెడులను పట్టించుకోకుండా అంకెలను మాత్రమే చూస్తూ పారవశ్యంలో మునిగిపోయే బుద్ధిజీవులున్నారు. ఇటువంటి ఆలోచనలు సమాజంలో ఉండడం వల్లనే ఎక్కువ ప్రత్యేక ఆర్థిక మండలాలను, పెట్టుబడుల గురించీ, ఉద్యోగావకాశాల గురించీ, ఎగుమతి ఆదాయాల గురించీ నిజమవుతాయో కావో తెలియని భారీ భారీ అంకెలను చూపి తామే ఈ ఘనత సాధించామని రాజకీయ నాయకులూ అధికారులూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అభివృద్ధి అంటే జీవితాలకు సంబంధం లేనిదనీ, కేవలం అంకెలు మాత్రమేననీ అనుకునేవాళ్లు ఈ ప్రగల్భాలను నమ్ముతున్నారు కూడ.

ఇంతకీ ఈ ప్రత్యేక ఆర్థిక మండలాలు అంటే ఏమిటి? అవి మన దేశంలో ఎందుకు ఏర్పరుస్తున్నారు? అవి మన రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువ ఉన్నాయి? వాటివల్ల మన రాష్ట్రంలోని ప్రజలకూ వనరులకూ ప్రభుత్వానికీ సామాజిక వ్యవస్థకూ ఏమి జరగబోతోంది?

ప్రత్యేక ఆర్థిక మండలాలు అంటే దేశానికీ రాష్ట్రానికీ అవసరమైన ఆర్థిక కార్యకలాపాలు జరపడాన్ని ప్రోత్సహించే ప్రత్యేక విధానాలు అమలయ్యే మండలాలు అని స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. అవి ఇతర ప్రాంతాలకన్న ప్రత్యేకమైనవి. వాటిలో ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన కార్యకలాపాలు జరుగుతాయి. అవి నిర్దిష్టమైన భూభాగంలో ఉంటాయి. ఆ పదబంధంలోని మూడు మాటలకూ మూడు కచ్చితమైన అర్థాలున్నాయి. వీటిని ఎవరు నిర్వహించినా, ప్రభుత్వమే నిర్వచించి ఆ ప్రత్యేకతకు, మండల పరిమితులకూ పూచీ పడుతుంది. అయితే మొత్తం దేశాన్నీ రాష్ట్రాన్నీ సమానంగా చూడవలసిన ప్రభుత్వం కొన్ని మండలాలనే ఎందుకు ప్రత్యేకంగా చూడాలనీ, కొన్ని ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలకే ఎందుకు ప్రాధాన్యత, ప్రత్యేకత చూపాలనీ ప్రశ్నలు రావచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానానికి కొంచెం చరిత్రలోకి వెళ్లాలి.

ప్రపంచవ్యాప్తంగా వలసవాద చరిత్ర వల్ల దేశాల మధ్య ఆర్థిక అసమానతలు తలెత్తాయి. సంపన్నమైన సహజ వనరులు ఉన్న దేశాలు పేద ఆర్థిక వ్యవస్థలు గానూ, ఎటువంటి వనరులూ లేకపోయినా అరకొర వనరులతోనైనా కొన్ని దేశాలు సంపన్న ఆర్థిక వ్యవస్థలుగానూ మారిపోయాయి. పదిహేను, పదహారో శతాబ్ది నుంచి ఇరవయో శతాబ్ది మధ్యభాగం దాకా ప్రపంచంలో సాగిన ఈ వలస వాదం దేశాల మధ్య ఇటువంటి విభజన రేఖను గీయడం మాత్రమే కాక, “సంపన్న” దేశాల నుంచి వచ్చే సిద్ధాంతాలనూ ఆలోచనలనూ అనుసరించడం తప్ప “పేద” దేశాలకు మరొక దారి లేదనే అవగాహనను కూడ తయారు చేసింది.

ఈ నేపథ్యంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వలస పాలన నుంచి విముక్తమయిన దేశాల ప్రభుత్వాల ముందర తాము కూడ “అభివృద్ధి చెందిన” దేశాలమని అనిపించుకోవడం ఎలా అనే పెద్ద ప్రశ్న లేచి నిలిచింది. “మా ‘అభివృద్ధి’ అంతా మా ఎగుమతుల వల్లనే జరిగింది, ఎగుమతే అభివృద్ధికి చోదకశక్తి, కనుక మీరు కూడ ఎగుమతి ప్రధాన పరిశ్రమలు పెట్టుకోండి. మీ వ్యవసాయాన్ని వదిలిపెట్టండి” అని పెద్ద దేశాల ఆర్థికశాస్త్రవేత్తలు పేదదేశాల రాజకీయ నాయకులకు ఉద్బోధించడం మొదలుపెట్టారు. “మరి అవతలి దేశాల వాళ్ళు కొనుక్కోగలిగిన సరుకులు ఎగుమతి చేస్తే గదా ఫలితం ఉండేది, ఆ మార్కెట్లకు కావలసిన సరుకులు మేమెట్లా తయారు చేసేది” అని ప్రశ్నిస్తే, “సింపుల్, మేం వచ్చి అక్కడ కంపెనీలు పెడతాం, లేదా అక్కడ మా ఏజెంట్లను నియమిస్తాం. మీకు తెలియని సాంకేతిక పరిజ్ఞానం ఇస్తాం. దానివల్ల మీ పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. మీ వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. మీకు సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది. ఆ కంపెనీల సరుకులు మా మార్కెట్లలో మీరు అమ్ముకోవచ్చు. ఆ ఎగుమతి ఆదాయంతో మీరు అభివృద్ధి చెందవచ్చు. కాకపోతే ఈ అభివృద్ధికి కాస్త మూల్యం చెల్లించాలి. మా కంపెనీలు అక్కడికి రావడానికి ఏ ఆంక్షలూ పెట్టకండి. మా కంపెనీలు అక్కడికి రావడానికి ఆకర్షణగా పన్ను రాయితీలు ఇవ్వండి. తక్కువ ధరకు సౌకర్యాలు కల్పించండి. రక్షణ ఇవ్వండి. మీ జాతీయోద్యమ విలువలను మరచిపోండి, ఈస్టిండియా కంపెనీలను అనుమానంగా చూసే మైండ్ సెట్ నుంచి బయటపడండి” అని ఉద్బోధలు సాగాయి.

అలా దక్షిణార్ధ గోళంలోని లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాలలో ఎగుమతి లక్ష్య సంస్థలు (ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్ – ఇఓయు) ఎగుమతి ప్రధాన మండలాలు (ఎక్స్ పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్- ఇపిజెడ్), స్వేచ్ఛావాణిజ్య మండలాలు ( ఫ్రీ ట్రేడ్ జోన్స్ – ఎఫ్ టి జెడ్) మొదలయ్యాయి. భారతదేశంలో కూడ ఆ వరుసలోనే 1965లో కాండ్లాలో మొదటి ఎగుమతి ప్రధాన మండలం మొదలయింది. ఆ తర్వాత గడిచిన మూడు దశాబ్దాలలో మరొక ఆరు అటువంటి ప్రత్యేక వాణిజ్య, ఆర్థిక, పారిశ్రామిక మండలాలు ఉనికిలోకి వచ్చాయి. అయితే ఈ మండలాలలో కూడ ఎగుమతి జరిగినదీ, ఉద్యోగ కల్పన జరిగినదీ తక్కువ. ఆ పేరుతో బహుళజాతి సంస్థలకూ, దేశంలోని వారి దళారీలకూ రాయితీలూ మినహాయింపులూ దక్కినది ఎక్కువ. అది వేరే కథ, ఇప్పుడు అవసరం లేదు.

ఇది ఇలా ఉండగానే 1991లో దేశంలో నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ విధానాలు ప్రవేశించాయి. వాటిలో భాగంగా దేశదేశాల సంపన్నులకు, బహుళ జాతి సంస్థలకు భారత దేశం ఇష్టారాజ్యపు క్రీడాస్థలం అయిపోయింది. ఆ బహుళ జాతి సంస్థలు అప్పటిదాకా దేశంలో నామమాత్రంగానైనా ఉండిన ప్రజా సంక్షేమ, స్వావలంబన, స్వయం సమృద్ధి చట్టాలను, నిబంధనలను మార్పు చేయమని ఒత్తిడి తేవడం ప్రారంభించాయి. ఆ దశాబ్దంలో మన ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ, ద్రవ్య, బ్యాంకింగ్, బీమా, ప్రజారోగ్య, విద్యా రంగాలన్నిటా మార్పులు రావడం మొదలయింది. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వపు ఎగుమతి దిగుమతుల విధానం మారి 1997లో కొత్త విధానం వచ్చింది. ఆ విధానంలో ప్రకటించిన రాయితీలు, మినహాయింపులు కూడ సరిపోవన్నట్టు, 2000 ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని ప్రకటించింది.

ఈ కొత్త ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని ప్రకటించినది అప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్ డి ఎ) ప్రభుత్వం. అప్పటికి వాణిజ్య మంత్రిగా ఉన్న మురసోలి మారన్ 2000 మార్చ్ లో చైనా వెళ్ళి వచ్చారు. అక్కడ కార్మికులకు ఏ హక్కులూ లేకుండా వారిని పీల్చి పిప్పి చేసి అతి చౌకగా సరుకులు తయారు చేసి ప్రపంచ మార్కెట్ ను ఆక్రమిస్తున్న సెజ్ విధానాన్ని చూసి ఆయన మురిసిపోయారు. తిరిగిరాగానే భారతదేశంలో కూడ అటువంటి విధానం ఉండాలని ప్రకటించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించాయి. ప్రతిపక్షాల నిరసనల వల్లనో, మిత్ర పక్షాలలో కొందరిని బుజ్జగించడంలో భాగంగానో ఎన్ డి ఎ ప్రభుత్వం ఆ విధానాన్ని అప్పటికి పక్కనపెట్టింది.

కాని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సెజ్ విధానం మీద వెనక్కి వెళుతుండగానే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ విధానాన్ని సొంతం చేసుకోవాలని, దొడ్డిదారిన అయినా ప్రవేశ పెట్టాలని ఉవ్విళ్లూరడం మొదలుపెట్టాయి. అందులో ఎన్ డి ఎ లో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ అగ్రభాగాన ఉండి 2002 ఏప్రిల్ 9న ఒక జి. ఓ. ద్వారా ప్రత్యేక ఆర్థిక మండలాల విధాన చట్రాన్ని ప్రకటించింది. విశాఖపట్నం, కాకినాడలలో సెజ్ ల  ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో సెజ్ లు ఏర్పరచడానికి అధీకృత ప్రభుత్వ సంస్థగా ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) ను నియమించింది. ఈ ఎపిఐఐసి సెజ్ లకు ఇవ్వడానికి, ఇతర వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు ఇవ్వడానికనే పేరుతో ఎలా లక్షలాది ఎకరాలు సేకరించి, రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణానికి ద్వారాలు తెరిచిందో ఇటీవల బయటపడుతున్న కొన్ని వాస్తవాలు చూపుతున్నాయి. నిజానికి బయటపడుతున్న వార్తలు ఎపిఐఐసి పేరిట పాలకులు చేయించిన భూకబ్జాలలో పదోవంతు గురించి మాత్రమే.

తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని అనుసరించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కేంద్రంలో ఆ విధానాన్ని ప్రతిపాదించిన ఎన్ డి ఎ లో అది భాగస్వామ్య పార్టీగా ఉండింది. అలాగే 1995 నుంచే రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు అనుకూల ఆర్థిక విధానాలను అమలు చేస్తూ బహుళజాతి సంస్థల కోసం, దేశదేశాల సంపన్నులకోసం పాలనా విధానాలను రూపొందించిన, మార్చిన పార్టీ అది.

కాని ప్రత్యేక ఆర్థిక మండలాల విధానానికి ఒక అనూహ్య దిశ నుంచి ఆశ్చర్యకరమైన ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వంలో తామే విమర్శించిన ఆ విధానాన్ని సిపిఐ (ఎం) నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం పశ్చిమబెంగాల్ లో కళ్లకు అద్దుకోవడం మొదలు పెట్టింది. 2003 జూన్ 28న ప్రచురించిన అసాధారణ గెజిట్ ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మణికంచన్ ప్రత్యేక ఆర్థిక మండలానికి సంబంధించిన విధానాన్ని ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం కేటాయించినది కోల్ కత్తా నగరంలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలమే కావచ్చు గాని, సెజ్ ను విదేశీ భూభాగంతో సమానంగా గుర్తించడం ఎందుకు అవసరమో, పన్నుల విధింపులో, విదేశీ పెట్టుబడిలో, ఇతర లావాదేవీలలో ఎంత ఉదారంగా ఉండాలో, స్థానిక నిబంధనలను, ఆంక్షలను ఎలా తొలగించాలో ఈ గెజిట్ లో వామపక్ష ప్రభుత్వం అక్షరాలా రాసింది.

తాము ప్రత్యేక ఆర్థిక మండలాల విధానానికి వ్యతిరేకులమనీ, తమవల్లనే ఆ చట్టంలో సవరణలు వచ్చాయనీ, సెజ్ వ్యతిరేక ఆందోళనకు తామే నాయకులమనీ, తాము పాలిస్తున్న రాష్ట్రాలలో సెజ్ లు లేనేలేవనీ సిపిఐ (ఎం), సిపిఐ రెండూ ఇప్పటికీ పెద్ద ఎత్తున వాదిస్తుంటాయి. మొన్నటికి మొన్న విజయవాడలో సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ విస్తృత సమావేశాల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ తాము పాలిస్తున్న పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురలలో సెజ్ లు లేవని అన్నారు. కాని సెజ్ ల గురించి కేంద్ర ప్రభుత్వం నడిపే వెబ్ సైట్ ప్రకారం పశ్చిమ బెంగాల్ లో 37, కేరళలో 28 సెజ్ లు ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసే అబద్ధమని కొట్టి పారేయదలచుకుంటే, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి శాఖ నడిపే వెబ్ సైట్ లో సెజ్ కీర్తనలు విస్పష్టంగానే ఉన్నాయి.

సరే, ఆ రాజకీయ అవకాశవాదాన్ని అలా ఉంచితే, 2004 మేలో ఎన్నికలలో గెలిచి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచీ ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాను విమర్శించిన పాత విధానాన్నే బిల్లుగా రూపొందించి, మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో కూడ చర్చించి,  పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ప్రజలకు ఉపయోగకరమైన చట్టాల, విధానాల రూపకల్పనలో ఏళ్లకు ఏళ్లూ దశాబ్దాలూ కూడ తీసుకునే పార్లమెంటు ఈ వినాశకర, ప్రజావ్యతిరేక చట్టాన్ని మాత్రం కొన్ని గంటల్లో, పెద్ద చర్చ లేకుండానే ఆమోదించింది. లోక్ సభలో జరుగుతున్న చర్చలన్నిటినీ యథాతథంగా ప్రచురిస్తున్న లోక్ సభ వెబ్ సైట్ ప్రకారం ఈ బిల్లుమీద చర్చ 2005 మే 10 సాయంత్రం 4.48కి మొదలై, 6.38కి ముగిసిపోయింది. దేశ ప్రజల జీవనోపాధినీ, జీవితాలనూ, వనరులనూ ధ్వంసం చేసే ఈ మహమ్మారి చట్టం ఇంత తక్కువ చర్చతో, నిరాటంకంగా అమలులోకి వచ్చింది.

జరిగిన రెండుగంటల లోపు చర్చలో నలుగురు “ప్రజా ప్రతినిధులు” మాట్లాడారు, ముగ్గురు మధ్యలో జోక్యం చేసుకున్నారు. మాట్లాడిన నలుగురిలో సిపిఐ (ఎం)కు చెందిన రూప్ చంద్ పాల్, సిపిఐ కి చెందిన గురుదాస్ దాస్ గుప్తా కొన్ని చిన్న అభ్యంతరాలు చెప్పినప్పటికీ బిల్లును తాము సమర్థిస్తున్నామని చూపుకోవడానికే ఎక్కువ ప్రయత్నించారు. ఇది చరిత్రాత్మకమైన, అవసరమైన కొత్తదారులు వేసే చట్టం అని సిపిఐ (ఎం) సభ్యుడు అన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకత ప్రకటించి తాము “అభివృద్ధి నిరోధకులమ”ని పేరు తెచ్చుకోదలచుకోలేదని, ఈ చట్టాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని సిపిఐ సభ్యుడు గురుదాస్ దాస్ గుప్తా అన్నారు. ఆ చట్టం ఎంత దుర్మార్గమయినదో ఒక్క మాటలో చెప్పాలంటే అది చట్టబద్ధంగానే దేశంలోపల చట్టాలు చెల్లని “విదేశీ భూభాగాలను” తయారు చేసి పెడుతుంది.

అలా చట్టరూపం ధరించిన సెజ్ విధానం ఇక విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఒకవైపు బిల్లు చట్టం కాకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెజ్ లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సెజ్ ల పేరుమీద భూమి కబ్జా చేయదలచుకున్న వ్యాపారులు అప్పటికే భూమిని ఎంపిక చేసుకుని దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. ఒక వ్యాపారి అయితే తనకు కావాలని అడుగుతున్న భూమినే తన చిరునామాగా దరఖాస్తులో చూపాడంటే ఈ వ్యవహారం ఎంత దొంగల దోపిడీగా సాగిందో అర్థమవుతుంది. అలా సెజ్ లు ఇంతింతై వటుడింతయి బలి చక్రవర్తిని తొక్కివేసిన వామనుడి లాగ ఐదు సంవత్సరాలలోనే పదిలక్షల ఎకరాలకు పైన కబ్జా చేసి ఏడువందల సెజ్ ల ఆక్టోపస్ గా దేశమంతా విస్తరించాయి.

ఈ ప్రత్యేక ఆర్థిక మండలాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం చెప్పిన కారణాలలో ప్రధానమైనవి ఆరు: 1. అదనపు ఆర్థిక కార్యకలాపాల కల్పన. 2. సరుకుల, సేవల ఎగుమతికి ప్రోత్సాహం. 3. విదేశాల నుంచీ, దేశం నుంచీ కూడ అదనపు పెట్టుబడికి ప్రోత్సాహం. 4. అదనపు ఉద్యోగ కల్పన. 5. మౌలిక సౌకర్యాల అభివృద్ధి. 6. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రావడానికి అవకాశం.

ఈ కారణాలలో ఏ ఒక్కటీ పూర్తిగా నిజం కాదనడానికి గత ఐదు సంవత్సరాల సెజ్ విధానమే సాక్షి. ఇప్పటికి అనుమతి పొందినవీ, వాటిలో నోటిఫై అయినవీ, ఇంకా సూత్రప్రాయమైన అనుమతి పొందిన స్థాయిలోనే ఉన్నవీ అన్నీ పక్కనపెట్టినా, ప్రభుత్వ లెక్కల ప్రకారమే పని ప్రారంభించిన సెజ్ లు 95 ఉన్నాయి. ఈ 95 లో అదనపు ఆర్థిక కార్యకలాపాలు ఏ కొద్దిగానో ఉన్నా, ఆ ప్రాంతాలలో అంతకు ముందు సాగుతుండిన వ్యవసాయ, తదితర వృత్తుల వంటి ఆర్థిక కార్యకలాపాలతో పోలిస్తే అవి చెప్పుకోదగినవేమీ కావు. ప్రభుత్వ గణాంకాలలో సెజ్ ల ఎగుమతి ఆదాయం అనే పేరుతో రెండు లక్షల కోట్ల రూపాయలు చూపుతున్నప్పటికీ ఆ అంకెను కాస్త జాగ్రత్తగా చూడవలసి ఉంది. ఆ అంకెలో అంతకు ముందు నుంచే పనిచేస్తూ ప్రస్తుతం సెజ్ లుగా పేరు మార్చుకున్న కంపెనీల ఎగుమతులు కలిసి ఉన్నాయి. ఎగుమతి అనే మాటకు చట్టం ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఈ అంకెను మొత్తంగా విదేశీ మారక ద్రవ్య ఆదాయంగా చెప్పడానికి వీలులేదు. అంతకన్న ముఖ్యంగా సెజ్ లకు ఇస్తున్న రాయితీలు, మినహాయింపులు, పన్ను సెలవులతో పోలిస్తే ఈ అంకె సాధించడానికి పెడుతున్న ఖర్చు ఆదాయంతో సమానమో, ఆదాయం కన్న ఎక్కువో అనిపిస్తుంది. ఇంతచేసీ, మొత్తంగా దేశపు ఎగుమతి ఆదాయంలో ఈ సెజ్ ల ద్వారా వస్తున్నది ఎక్కువేమీ కాదు.

ఇప్పటికే ఏర్పాటయిన ప్రత్యేక ఆర్థిక మండలాలలో విదేశీ పెట్టుబడి వచ్చినవి చాల తక్కువ. వీటిలో ఎక్కువ భాగం స్థానిక పెట్టుబడిదారులవి, ఇతర దేశాలలో స్థిరపడిన భారతీయులవి, విదేశీ కంపెనీలతో మిలాఖతయి వాటికి శాఖలుగా పని చేసేవి. అలాగే సెజ్ లు గా ప్రకటిస్తున్న వాటిలో సగానికి సగం ఇప్పటికే పనిచేస్తున్న పారిశ్రామిక, వ్యాపార సంస్థలు. కేవలం 2005 సెజ్ చట్టం కల్పించే సదుపాయాలు పొందడానికే, భూమి సంపాదించడానికే, పన్నులు ఎగగొట్టడానికే ఆ కంపెనీలు పేరు మార్చుకున్నాయి. హైదరాబాద్ లోనే అలా రాత్రికి రాత్రి సెజ్ లు గా మారిపోయిన సాఫ్ట్ వేర్, వస్త్ర, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఇలా జాబితా చూస్తే కొత్త సెజ్ లు వచ్చినట్టు కనబడుతుంది గాని, అవి కొత్త పెట్టుబడులు కావు, విదేశీ పెట్టుబడులు అసలే కావు. అది కొత్త ఆర్థిక కార్యకలాపాల కల్పన కూడ కాదు.

అలాగే సెజ్ ల వల్ల బోలెడంత ఉద్యోగ కల్పన జరుగుతుందని, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెపుతున్న మాటలో నిజం కన్న అబద్ధం పాలు ఎక్కువ. గత ఐదు సంవత్సరాలలో సెజ్ లలో ఐదు లక్షల పై చిలుకు ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం చెపుతోంది గాని, ఈ అంకె అంతకు ముందు వాగ్దానం చేసిన దానిలో పదో వంతు కూడ కాదు. సెజ్ లలో పేరు మార్చుకున్న పాత పారిశ్రామిక, వ్యాపార సంస్థలు కూడ ఉన్నాయి గనుక నిజంగా వచ్చిన కొత్త ఉపాధికల్పన ఈ అంకె కన్న తక్కువే గాని ఎక్కువ ఉండదు. దేశంలో మొత్తం సంఘటిత రంగంలో ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే ఈ అంకె సముద్రంలో కాకిరెట్ట. కాకపోతే ఆ ఉద్యోగాలు కల్పించినవారికి రాయితీలు, మినహాయింపులు లేవు, ఈ ఉద్యోగాలు కల్పించినవారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అంతే కాదు, ఈ సెజ్ ల ఉపాధి కల్పనలో మరొక కిటుకు కూడ ఉంది. చాల సెజ్ లు రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చాయి గనుక, వాటిలో నిర్మాణ పనుల వల్ల తొలిరోజుల్లో ఎక్కువ మంది పనివాళ్లు అవసరం అవుతారు గనుక ఈ అంకె వాపే గాని, నిజమైన బలుపు కాదు. ఈ సెజ్ లు ఏర్పాటు చేసిన భూములనుంచి, గ్రామాలనుంచి, సముద్ర తీర ప్రాంతాల నుంచి ఉపాధి కోల్పోయిన వారు కనీసం ఇరవై లక్షల మంది ఉంటారు. ప్రభుత్వం చెపుతున్న అంకె నిజమయినదే అనుకున్నా, ఇరవై లక్షల మంది బతుకు కొల్లగొట్టి, ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నమాట.

సెజ్ ల తో విదేశీ సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని కూడ ప్రభుత్వం సమర్థిస్తోంది. కాని ఇప్పటిదాకా వచ్చిన సెజ్ లలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్, సాఫ్ట్ వేర్ సర్వీసులు, గృహ నిర్మాణం, పాదరక్షల తయారీ, లోదుస్తుల తయారీ, బొమ్మల తయారీ, ఔషధాల తయారీ వంటి రంగాలలోనే గనుక వాటిలో మనకు విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అవసరమూ లేదు, అది రానూ లేదు. పాత కంపెనీలు కొత్త పేర్లు పెట్టుకోవడం, అవి ఇప్పటికే అనుభవం, పరిజ్ఞానం ఉన్న పారిశ్రామిక, వ్యాపార రంగాలలోనే పనిచేస్తుండడం లాంటి కారణాల వల్ల ఈ సెజ్ ల ఉత్పత్తులు, సేవలు కొత్తగా ఎగుమతి అయ్యేదీ లేదు, విదేశీ మారకద్రవ్యం రాబడి వచ్చేదీ లేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే సెజ్ లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చెపుతున్న కారణాలన్నీ పచ్చి అబద్ధాలు, వక్రీకరణలు, లేదా అర్ధ సత్యాలు.

సెజ్ లు రావడానికి అసలు కారణాలు భారతదేశంలో విస్తారంగా భూమి ఉండడం, ఆ భూమి చౌకగా దొరకడం, ఆ భూమిని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని సేకరించి తమ చేతుల్లో పెట్టడం. ఈ కారణాలు బహుళజాతిసంస్థలకు, దేశదేశాల సంపన్నులకు నోరూరిస్తున్నాయి. సెజ్ పేరు చెప్పి లక్షలాది ఎకరాల భూమిని హస్తగతం చేసుకోవచ్చు. దాన్ని పరిశ్రమ పేరుతో తీసుకున్నా, నిజంగానే పరిశ్రమలు పెట్టినా, తీసుకున్న భూమిలో సగ భాగాన్ని పారిశ్రామికేతర అవసరాలకు వాడుకోవచ్చు. అసలు పరిశ్రమ, వ్యాపారం అని కూడ అనకుండా నేరుగా రియల్ ఎస్టేట్ కంపెనీ కూడ సెజ్ గా గుర్తింపు పొందవచ్చు. ఈ అవకాశాల వల్ల విదేశీ, స్వదేశీ సంపన్నులందరికీ ఇది కామధేనువులాగ కనబడుతోంది. అందువల్లనే చాల సెజ్ లు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాయి, రియల్ ఎస్టేట్ లాభసాటిగా ఉండే పెద్ద పట్టణాల పరిసరాల్లో మాత్రమే సెజ్ లు ఉన్నాయి. దీనితో పాటు సెజ్ పేరు పెట్టుకుంటే పన్నులు తగ్గించుకోవచ్చు. ఎగ్గొట్టవచ్చు. కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉండవచ్చు. ఇంతకన్న లాభసాటి వ్యాపారం ఎక్కడుంది?

ఇలా భూములను బడా పారిశ్రామిక, వ్యాపార గృహాలకు, సంపన్నులకు అప్పగించడం వల్ల లక్షల ఎకరాలు భూములు – ఆహార పంటలకూ కూరగాయల పెంపకానికీ పశుగణాభివృద్ధికీ చేపల పెంపకానికీ ఉపయోగపడుతున్న భూములు – వ్యవసాయానికి, అనుబంధ వృత్తులకూ దూరం అవుతున్నాయి. దానితో దేశపు ఆహార భద్రతకు విఘాతం కలుగుతుందని, అది దేశానికి వినాశకరమని ఎం ఎస్ స్వామినాథన్ వంటి శాస్రవేత్తలు కూడ సెజ్ విధానాన్ని విమర్శించారు. సెజ్ లకు పన్ను రాయితీలు, మినహాయింపులు, పన్ను సెలవుల వల్ల ప్రభుత్వ ఖజానాకు రావలసిన ఆదాయంలో లోటు వస్తుందని కనుక సెజ్ విధానాన్ని హేతు బద్ధం చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడ మొదటినుంచీ అభ్యంతరాలు చెపుతోంది. తొలి సంవత్సరాలలో, అంటే సెజ్ ల సంఖ్య ఇంకా మూడు వందలకు మించనప్పుడే, వాటి వల్ల సాలీనా లక్షకోట్ల రూపాయల పన్ను ఆదాయం తరిగిపోతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంది. ఇప్పుడు సెజ్ ల సంఖ్య రెట్టింపు అయింది గనుక ఆ ఆదాయ లోటు కూడ రెట్టింపు అయి ఉండవచ్చు. ఆహార భద్రతను దెబ్బతీసినా, పన్నుల రాబడిని దెబ్బతీసినా ఫరవాలేదని, తమ ఆశ్రితులకు వేలాది ఎకరాల భూములు, తమకు కోట్ల కొద్దీ ముడుపులు దక్కితే చాలునని ఏలినవారు అనుకుంటున్నారు. ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కూడ కాదు. అన్ని పార్టీలూ తాము అధికారంలో ఉన్నచోట సెజ్ లు ఏర్పరస్తున్నాయి, సెజ్ లను సమర్థిస్తున్నాయి. తాము ప్రతిపక్షంలో ఉన్నచోట సెజ్ లను వ్యతిరేకిస్తున్నాయి.

ఇక మన రాష్ట్రానికే వస్తే, హైదరాబాద్ చుట్టుపట్ల విపరీతంగా ప్రభుత్వ భూమి, ఉమ్మడి భూమి, వారసులు ఎవరో తెలియని భూమి ఉంది. నిజాం ప్రభువులకు సొంత ఖర్చులకోసం మొత్తం సంస్థానంలోని పది శాతం భూమి – యాభై లక్షల ఎకరాల – భూమి ఉండేది. సర్ఫ్ ఎ ఖాస్ అనే పేరుతో ఉండిన ఆ భూమి 1949లో ఒక చట్టం ద్వారా ప్రభుత్వానికి చేరింది. ఆ సమయానికే జాగీర్దారీ, ఇనాం ల రద్దు వల్ల కూడ లక్షలాది ఎకరాల భూమి భూస్వాముల చెర నుంచి బయట పడింది. అందులో ఎక్కడయినా కౌలుదార్లు ఉంటే కౌల్దారీ రక్షణ చట్టం కింద వారికి అందినది మినహాయించినా, లక్షలాది ఎకరాల భూమి ఈ సర్ఫ్ ఎ ఖాస్ నుంచీ, విదేశాలకు పారిపోయిన పాత జాగీర్దార్ల, దేశముఖుల ఆస్తులనుంచీ, ఇనాం ల నుంచీ మొదట హైదరాబాద్ ప్రభుత్వానికీ, ఆంధ్ర ప్రభుత్వానికీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మారింది. చాల భూమి ఎవరు యజమానులో తెలియకుండా ఉండిపోయింది. ఈ చరిత్ర వల్లనే ఇప్పటికీ హైదరాబాదులో భూవివాదాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇలా దేశంలో మరే రాష్ట్ర రాజధానిలోనూ ప్రభుత్వానికి లేనంత భూమి హైదరాబాద్ లో ప్రభుత్వానికి సమకూరింది. ఆ భూమిని లీజుల పేరు మీద, ప్రజాప్రయోజనంగల సంస్థల పేరు మీద ఉచితంగానో తక్కువ ఖరీదుకో ఇస్తూ పోగా పోగా, మిగిలినదాని మీద ఇప్పుడు సెజ్ ల పేరు మీద దాడి జరుగుతోంది. మధ్యలో ఈ భూమి నుంచి దళితులకో, వెనుకబడిన వర్గాలకో  పంపిణీ చేసిన భూమిని, అసిన్డ్ భూములను కూడ వెనక్కి తీసుకుని సెజ్ లకు అప్పగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇక ప్రభుత్వం పేరు మీద, గ్రామ ఉమ్మడి అవసరాల కోసం ఉన్న భూమిని ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా పందారం చేస్తున్నది.

ఇలా భూమిని ఇవ్వడం పారిశ్రామికాభివృద్ధికేననీ, రైతుల నుంచి భూమిని తీసుకున్నప్పుడు దానికి తగిన నష్ట పరిహారం కట్టి ఇస్తే అభ్యంతరం దేనికనీ అధికారులు, రాజకీయ నాయకులు వాదిస్తున్నారు.

గత ఐదు సంవత్సరాల చరిత్ర చూస్తే సెజ్ లకూ పారిశ్రామికాభివృద్ధికీ ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టమవుతుంది. కనుక ఆ పేరు మీద భూమి సేకరించడం, పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ఇవ్వడం భూబకాసురుల కొత్త ఎత్తుగడే తప్ప అందులో ప్రజాప్రయోజనం ఏమీ లేదు.

ఇక నష్టపరిహారం విషయానికి వస్తే, ఆ నష్ట పరిహారం అందేది భూమి, ఆస్తి ఉన్నవారికే తప్ప లేనివారికి కాదు. ఇవాళ్టికీ మన గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై శాతం మందికి మాత్రమే భూమి ఉంది. మిగిలిన జనాభా ఆ భూమి మీద జరిగే వ్యవసాయం కల్పించే పనుల మీదనే ఆధారపడి ఉన్నారు. వారికి నష్ట పరిహారం ఏమీ ఉండదు. వారి జీవనోపాధి అయిన వ్యవసాయం రద్దయిపోతుంది. ఇక పొట్ట చేత పట్టుకుని వలస వెళ్ల వలసి వస్తుంది. నష్టపరిహారం అందినవారికి కూడ, అది ఎంత ఎక్కువ అందినప్పటికీ, తెలిసిన వృత్తి వ్యవసాయం చేసే అవకాశం రద్దయిపోతుంది. వచ్చిన డబ్బు ఉత్పాదకంగా ఖర్చు పెట్టుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఆ డబ్బు కూడ కొద్ది సంవత్సరాల్లోనే చెయ్యి జారి పోతుంది. పండినా పండకపోయినా శాశ్వత జీవనోపాధి వనరుగా ఉన్న భూమీ పోయి, చేతికి వచ్చిన డబ్బూ అయిపోయి, వారు వీథుల్లో ఖాళీ చేతులతో నిలబడవలసి వస్తుంది.

ఇలా సెజ్ లు నిర్మూలించిన గ్రామాలలో రైతులు, భూమి లేని ప్రజలు నష్ట పోవడం మాత్రమే కాదు, మరెన్నో సామాజిక అనర్థాలు జరిగాయి. అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అవి అసైన్డ్ భూములు కాబట్టి నష్ట పరిహారం ఇవ్వనక్కరలేదనీ, పట్టాభూములతో సమానంగా ఇవ్వనక్కరలేదనీ అన్నారు. చెరువులు, పచ్చిక బయళ్లు, శ్మశానాలు, బీళ్లు, బంజర్లు, చిట్టడవులు, మడ అడవులు, సముద్ర తీరాలు వంటి గ్రామ ఉమ్మడి భూములను ఆక్రమించారు. ఆక్రమించిన భూముల చుట్టూ కంచెలు వేశారు. కొన్ని గ్రామాలలో శ్మశానాలను ఆక్రమించడంతో చనిపోయినవారిని దహనం చేయడం, ఖననం చేయడం సమస్య అయింది. కొన్ని గ్రామాలలో సెజ్ లు పాతిన కంచెల వల్ల మల విసర్జనకు ఉపయోగిస్తుండిన బహిరంగ స్థలాలు కరువైపోయాయి. నిజానికి ఈ భూ ఆక్రమణ వ్యవహారంలో సెజ్ లు ఒక భాగం మాత్రమే. సెజ్ ల పేరు లేని చోట్ల కూడ ఇతర అభివృద్ధి పథకాల పేరుతో భూముల కైంకర్యం విపరీతంగా జరిగిపోయింది.

ఏది ఏమైనా ఐదు సంవత్సరాల అనుభవం తర్వాత సెజ్ అనేది కేవలం భూకబ్జా సాధనంగా మాత్రమే మిగిలింది గాని అందులో ప్రభుత్వం, పాలకులు చెపుతున్న సామాజిక ప్రయోజనాలేమీ లేవు. అందువల్లనే అన్ని చోట్లా ప్రజలు సెజ్ లకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. తమకు చాతనయిన చోట, అవకాశం ఉన్నచోట, సరయిన నాయకత్వం ఉన్నచోట పాక్షిక విజయాలు కూడ సాధించారు. కాని ఇప్పటికీ ఈ విధానపు దుర్మార్గాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా గుర్తించి, దాన్ని రద్దుచేయాలనే ఏకైక డిమాండ్ తో రాష్ట్ర వ్యాపిత, దేశ వ్యాపిత విశాల ప్రజారాశుల సంఘటిత ఉద్యమం నిర్మాణం కావలసే ఉన్నది. అక్కడక్కడా విడివిడిగా జరుగుతున్న ప్రజా ఆందోళనలన్నిటినీ ఏకం చేసి విస్తృత ప్రజా ఉద్యమం జరిపినప్పుడే ఈ సెజ్ ల మహమ్మారి తొలగిపోతుంది.

(ప్రత్యేక ఆర్థిక మండలాల మీద విరివిగా వచ్చిన రచనల నుంచి, ఈ రచయితే గతంలో రాసిన ‘ప్రత్యేక ఆర్థిక మండలాలు – కొత్త భూస్వామ్యం’ (వీక్షణం, డిసెంబర్ 2006), ‘ప్రత్యేక ఆర్థిక మండలాలు – రాజకీయార్థిక దృక్పథం’ (ప్రత్యేక మృత్యు మండలాలు – సెజ్ లపై పరిశీలనా వ్యాసాలు, ఆగస్ట్ 2008), ‘పోలేపల్లిపై విషాదంపై రచన ఎందుకు?’ (ఓడిపోలే….పల్లె, మే 2009), ‘ప్రత్యేక దోపిడీ మండలాలకు ఐదేళ్లు’ (ఈభూమి, మే 2010) ల నుంచి కొన్ని వాదనలను తీసుకోవడం జరిగింది. ఆయా రచయితలకు, సంపాదకులకు కృతజ్ఞతలు)

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s