వార్త అంటే ఏమిటి?

వ్యాసప్రోక్త మహాభారతం సభాపర్వానికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, పురిపండా అప్పలస్వామి గార్ల తెలుగు వచనానువాదం (ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్, జూన్ 2008) చదువుతుంటే ఒక వాక్యం దిగ్భ్రాంతి కలిగించింది. ఆ దిగ్భ్రాంతినుంచి తేరుకోవడానికి కొంత పరిశోధన సాగిస్తే అది మరింత పెరిగింది గాని తగ్గలేదు. ‘కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత’ అనే నానుడి నిజమేనా అని కంగారు కలిగింది. అది పాఠకుల దృష్టికి తీసుకువచ్చి, విజ్ఞుల దగ్గరి నుంచి వివరణ పొందుదామని ఈ ప్రయత్నం.

ప్రధానస్రవంతి  జర్నలిజంలో ప్రవేశించిన 1984 నుంచీ కూడ “వార్త యందు జగము వర్ధిల్లుచుండు” అని నన్నయ అన్నాడనీ, ‘వార్త’కు సమాచారం (న్యూస్) అనే అర్థంలో మహాభారత కాలం నుంచీ మనుగడ ఉందనీ చాల సార్లు విన్నాను. నన్నయ పద్యంలోని వార్తకు అర్థం మనకు తెలిసిన సమాచారమే అన్నట్టు ఎ బి కె ప్రసాద్ గారు ఆ పద్యాన్ని చాలచోట్ల ఉటంకించారు. కాని శ్రీపాద – పురిపండా సభాపర్వంలో నారదుడు ధర్మరాజుకు రాజనీతి బోధించే క్రమంలో “నీ రాజ్యంలో వార్త – అంటే వ్యవసాయమూ, పశు సంరక్షణా, వాణిజ్యమూ – తగినవారివల్ల బాగా సాగుతోందా? వార్తవల్లే లోకం సుఖపడుతుంది” (పే. 13) అని చూసి ఆశ్చర్యం కలిగింది. వ్యాసుడు వార్త అన్నదీ మనం అంటున్నదీ ఒకటి కాదా అని సందేహం కలిగింది.

సభాపర్వంలో 69వ శ్లోకంగా “కచ్ చిత్ స్వానుష్ఠితా తాత వార్తా తే సాధుభిర్ జనైః/వార్తాయాం సంశ్రితస్ తాత లోకో~యం సుఖం ఏధతే” అని వ్యాసుడు రాశాడు. వ్యాసభారతానికి ప్రామాణిక ఇంగ్లిషు వచనానువాదం కీసరి మోహన్ గంగూలీ (1842-1895) చేయగా, 1883-1896 మధ్య ప్రచురితమయింది. దానిలో ఈ శ్లోకాన్ని “పుత్రా, వ్యవసాయం, వాణిజ్యం, పశుపోషణ, వడ్డీ వ్యాపారం అనే నాలుగు వృత్తులూ నిజాయితీపరులైన మనుషుల చేతుల్లోనే ఉన్నాయి గదా. రాజా, ప్రజల సంతోషం ఈ వృత్తులమీదనే ఆధారపడి ఉంది” అని అనువదించారు గంగూలీ.

అలాగే ప్రామాణిక సంస్కృత నిఘంటువు అమరకోశంలో కూడ “వార్త యనగా బేరము మొదలైన జీవనోపాయము; తదర్థములైన ధాన్యాదులును వార్త యనబడును. ఆ ధాన్యాదుల మోయువాడు గనుక వార్తావహుడు” అని ఉంది. వార్త అంటే వృత్తాంతము అనే అర్థంతోపాటు వ్యవసాయం, పశుపాలన, వాణిజ్యం అనే అర్థాలు కూడ ఉన్నాయి.

ఇక తెలుగులోకి వస్తే, నన్నయ శ్రీమదాంధ్ర మహాభారతములో సభాపర్వం ప్రథమాశ్వాసంలో 51వ పద్యంగా “వార్తయందు జగము వర్ధిల్లుచున్నది; యదియు లేనినాడ యఖిల జనులు/నంధకారమగ్నులగుదురు గావున/వార్త నిర్వహింపవలయు బతికి” అని రాశాడు.  వార్త అనే సంస్కృత శబ్దాన్ని యథాతథంగా ఉంచిన నన్నయ ఆ మాటకు తెలుగులో ఇవాళ మనం ఇచ్చుకుంటున్న అర్థాన్ని ఉద్దేశించాడో లేదో స్పష్టంగా తెలియదు.

కాని కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అని తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురించిన ప్రతిపదార్థ తాత్పర్య, సరళ వ్యాఖ్యాన సహితమైన పుస్తకం లోకి వచ్చేసరికి వ్యాసుడి నుంచీ, నన్నయ నుంచీ చాల దూరం వచ్చేశాం. డాక్టర్ అప్పజోడు వేంకట సుబ్బయ్య వ్యాఖ్యాతగా, డాక్టర్ జి వి సుబ్రహ్మణ్యం ప్రధాన సంపాదకుడిగా వెలువడిన ఈ గ్రంథం (ప్రచురణ ఆగస్టు 2000, పే. 23) లో “వార్త+అందు+అ= వార్త (న్యూస్)” అని ఇంగ్లిషు కూడ కలిపి వార్తను మనకు తెలిసిన వార్త మాత్రమే అన్నట్టు అర్థం చెప్పారు. “ప్రపంచమంతా వార్తమీదే నడుస్తున్నది. అదిలేకుంటే ప్రజలంతా పెనుచీకట్లో మునిగినట్లే. అందువల్ల ప్రభువు వార్తను బాగా నడపాలి” అని తాత్పర్యం ఇచ్చారు.

ఇంకా ముందుకువెళ్లి “విశేషం” అనే వ్యాఖ్యానంలో “వార్త అంటే – వృత్తాంతం, వర్తనం, అర్థానర్థ వివేచన విద్య – అనే అర్థాలు ఉన్నాయి. వార్తలను, సేకరించటం, ప్రసరించటం ప్రభుత్వ బాధ్యత. అంతే కాదు, అది గొప్ప సామాజికావసరం కూడ. వార్తా నిర్వహణ సరిగా లేకుంటే ప్రభుత్వంలో ఒక విభాగానికి మరొక విభాగానికి, దేశంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి, సమాజంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అవగాహన కుంటుపడుతుంది. సమన్వయం లోపిస్తుంది. ఎక్కడ ఏం జరుగుతున్నదో, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో, ఏయే సమస్యలకు ఏయే పరిష్కారాలో ఎవ్వరికి తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందరు అంధకారంలో ఉన్నట్లే అవుతుంది. అందుచేత ప్రభువు వార్తను సమర్థంగా నిర్వహించాలి. ప్రత్యేకించి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వార్తా నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. ఒక విధంగా ప్రభుత్వానికి కళ్లు, చెవులు – ప్రజలకు కళ్లు, చెవులు – వార్తాపత్రికలే. ఇవి మామూలు కళ్లకు అందని దృశ్యాల్ని చూపిస్తాయి. మామూలు చెవులకు వినిపించని విషయాల్ని వినిపిస్తాయి” అని రాశారు. నారదుడు ధర్మరాజుకు బోధించిన రాజనీతి సందర్భంలో, రెండువేల ఏళ్లకింద మొదటిసారి సంకలితమై, వెయ్యి సంవత్సరాల కింద తెలుగులోకి వచ్చిన గ్రంథంలో ఆధునిక వార్తా పత్రిక గురించి, ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి వెతకడం ఎంత అసందర్భమో చెప్పనక్కరలేదు.

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు కూడ వార్త అనే సంస్కృత మూల పదానికి ఉన్న అర్థాలలో “సమాచారము” తోపాటే “జీవిక, వృత్తి, వైశ్యవృత్తి, వాణిజ్యము, సేద్యము, కృషి, అన్వీక్షక్యాది విద్యలలో నొకటి” అనే అర్థాలు ఇచ్చింది. “ఆంధ్ర గ్రంథములయందు మాత్రమే కానవచ్చుచున్నవి” అనే అర్థాలలో ప్రసిద్ధి, లోకోక్తి, నీతి అనే అర్థాలు ఇచ్చింది.

ఇంతకీ ధర్మరాజుతో నారదుడు ప్రస్తావించిన వార్త, వ్యాసుడు రాసిన వార్త, నన్నయ అనువదించిన వార్త, తితిదే వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించిన వార్త, కొందరు పత్రికాసంపాదకులు అన్వయించిన వార్త ఒకటేనా, వేరువేరా? అట్లాగే వార్తకు సమాచారం అనే అర్థం మాత్రమే చెప్పుకుంటే వ్యాసుడి శ్లోకానికైనా, నన్నయ పద్యానికైనా అన్వయదోషం రాదా? వార్త అంటే వ్యవసాయమనో జీవనవృత్తి అనో అర్థం చెప్పుకుంటే అందువల్ల ‘జగము వర్ధిల్లుచుండు’ అంటే సరిపోతుంది గాని, వార్త అని చెప్పుకుంటే అర్థం సరిపోతుందా? సమాచార వార్త వల్ల జగము వర్ధిల్లుతుందా, జగము వల్ల సమాచార వార్త వర్ధిల్లుతుందా?

ఎన్ వేణుగోపాల్

ఆగస్ట్ 16, 2010

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s