వీక్షణం – సెప్టెంబర్ 2010 సంపాదకీయం

ఎపిఐఐసి – ఎమార్ – ఎంజిఎఫ్ భూకుంభకోణం

రైతులనుంచీ, సామాజిక ఉమ్మడి ఆస్తులనుంచీ అడ్డగోలుగా వేలాది ఎకరాల భూమిని సేకరించడం, సేకరించిన భూములను ఇష్టారాజ్యంగా ఆశ్రితులకూ, సంపన్నులకూ కట్టబెట్టడం, తామే రాసుకున్న చట్టపరమైన నిబంధనలను కూడ పాటించకపోవడం పాలకులకు నిత్యకృత్యమైపోయింది. ఇటీవల బయటపడుతున్న ఎమార్ – ఎంజిఎఫ్ కుంభకోణం ఈ పాలకుల  మహా అక్రమాలకు మరొక నిదర్శనం. అధికారంలో ఉన్న స్వార్థప్రయోజన శక్తులు, పాలక ముఠాలు, అభివృద్ధి సాధించడానికనే పేరుతో ఏర్పాటయిన ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి సాగిస్తున్న మూకుమ్మడి దోపిడీ ఇది. ఈ శక్తులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రైవేటు పెట్టుబడిదారులతో, వ్యాపారులతో ఎలా కుమ్మక్కయ్యాయో, ఈ ఇద్దరు దొంగలూ కలిసి ఊళ్లకు ఊళ్లు ఎలా పంచుకు తిన్నారో ఈ ఉదంతం, దీనికి అనుబంధంగా బయటపడుతున్న వివరాలు తెలియజెపుతున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతుంటే ఇటువంటి అక్రమాలను బయటపెట్టవలసిన బాధ్యత ప్రతిపక్షాలకు, ప్రచార సాధనాలకు ఉండేది. కాని ప్రతిపక్ష నేతలకూ, వారి ఆశ్రితులకూ కూడ ఈ అక్రమాలలో భాగం ఉంది. వారూ ఆ తానులో ముక్కలే. రాష్ట్రంలో ఇవాళ ఉన్న స్థితిలో ప్రచార సాధనాలు తమ ముఠా ప్రయోజనాలకోసం తప్ప, ఇటువంటి అక్రమాలను బయటపెట్టే పరిస్థితి లేదు. చివరికి పాలకవర్గ ముఠా కీచులాటలవల్ల, వాటాల తగాదా వల్ల ఈ వ్యవహారాలు బయటపడి తీగలాగితే డొంక కదులుతోంది. ఎమార్ ప్రాపర్టీస్ పిజెఎస్ సి అనే దుబాయి కంపెనీ పద్నాలుగు దేశాలలో రియల్ ఎస్టేట్ తదితర వ్యాపార రంగాలలో ఉంది. 1997లో ప్రారంభమైన ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో 2002లోనే ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) దగ్గర 285 ఎకరాల భూమి సంపాదించింది. ప్రస్తుతానికి ఆ కంపెనీ అవతారం మారిపోయింది. రియల్ ఎస్టేట్ లోనూ, రుణాలిచ్చే వ్యాపారంలోనూ ఉన్న ఢిల్లీకి చెందిన ఎంజిఎఫ్ అనే కంపెనీతో కలిసి 2005లో ఏర్పడిన ఎమార్ ఎంజిఎఫ్ అనే కొత్త కంపెనీకి ఈ ఆస్తులన్నీ చేరిపోయాయి. ఒక ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుని భూమి సంపాదించిన కంపెనీ, ఆ ప్రభుత్వ సంస్థ అనుమతి గానీ, కనీసం సమాచారంగానీ లేకుండా మరొక కంపెనీతో కలిసిపోయి, కొత్త కంపెనీకి తన ఆస్తులు బదిలీ చేయవచ్చునా అనే ప్రశ్నకు తావులేదు. ఈ కొత్త కంపెనీ లోగోలో ‘క్రియేటింగ్ న్యూ ఇండియా’ అని ఉపశీర్షిక ఉంటుంది. కొత్త భారతదేశాన్ని సృష్టించడం అంటే ఇప్పటికే భారతదేశంలో ఉన్న మనుషులను తొలగించడం, వారి ఆస్తులను, వనరులను కొల్లగొట్టడం, చట్టాలను లెక్కచేయకపోవడం, ప్రభుత్వాలను తనకు బానిసలుగా చేసుకోవడం అని అర్థం. ఈ కొత్త కంపెనీలో ఎపిఐఐసి వాటా మొదట తగ్గిపోయి, ఆ తర్వాత సున్నా అయిపోయింది. కాని ఆ కంపెనీ చేతిలో భూమి మాత్రం 535 ఎకరాలకు పెరిగిపోయింది. ఈ వ్యవహారంలో మొట్టమొదట ప్రశ్నించవలసింది ఎపిఐఐసికి ఈ భూసేకరణ వ్యవహారం ఎందుకు అని. ఎపిఐఐసి అనేది రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ఏర్పడిన ప్రభుత్వ సంస్థ. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవలసిన అవసరమే లేదు. కాని పారిశ్రామికాభివృద్ధికోసం భూమి సేకరిస్తున్నాననే బూటకపు ప్రకటనలతో అది వేలాది ఎకరాల ప్రభుత్వ, ఉమ్మడి భూమినీ, రైతుల సొంత భూములనూ కూడ తన ఖాతాలోకి చేర్చుకుంది. ఆ భూమిని దేశదేశాల సంపన్నులకు కారుచౌకధరలకో, తన వాటా కొనసాగుతుందనే పేరుతో ఉచితంగానో కట్టబెడుతోంది. ఒక అంచనా ప్రకారం 2004-05 నుంచి 2008-09 మధ్య నాలుగు సంవత్సరాలలోనే ఎపిఐఐసి రైతులనుంచి ఇరవై వేల ఎకరాలు, ప్రభుత్వం నుంచి డెబ్బైమూడు వేల ఎకరాలు సేకరించి బహుశా రాష్ట్రంలో అందరికన్న పెద్ద భూస్వామి అయింది. ఈ భూమిని సేకరించినదేమో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం అనే పేరు మీద. కాని చేసినదేమో ఈ భూమినుంచి అడిగినవారికి అడిగినంత ధారాదత్తం చేయడం. అడిగినవారంటే ప్రజలు కాదు, భూమి కావలసిన వారు కాదు. నివాసం కోసం వందగజాల భూమి కావాలంటే, తమ బతుకు తాము బతకడానికి ఎకరమో రెండెకరాలో ఇమ్మంటే ఇవ్వకపోగా కాల్పులు జరిపి ప్రాణాలు బలిగొంటున్న పాలన ఇది. కాని రాజకీయ నాయకులో, వారి ఆశ్రితులో, బహుళజాతిసంస్థలో, రియల్ ఎస్టేట్ కంపెనీలో అడిగితే చాలు, అది పరిశ్రమ అవునాకాదా, అది అభివృద్ధేనా కాదా అనే ప్రశ్న కూడ లేకుండా వేలాది ఎకరాలు ఎపిఐఐసి నుంచి పొందవచ్చు. ఇలా పారిశ్రామికాభివృద్ధి అనే పచ్చి అబద్ధంతో వేలాది ఎకరాల భూములు సంపన్నుల సొంత ఆస్తులుగా మారిపోతున్నాయి. ఈ భయంకరమైన బందిపోటు దొంగతనంలో ఎమార్ ఎంజిఎఫ్ వంటి దొంగవ్యాపారులూ, మధ్య దళారీలూ, రాజకీయ నాయకులూ తమతమ పాత్రలు పోషిస్తున్నారు. మన సామాజిక ఆస్తులను, వనరులను కొల్లగొడుతున్నారు. ఇప్పుడు ఈ ఉదంతం బయటపడిన తర్వాత కూడ దానిలో ఇమిడి ఉన్న లంచగొండితనం గురించో, చట్టాల ఉల్లంఘనల గురించో చర్చ జరుగుతోంది. కాని అడగవలసిన మౌలిక ప్రశ్న అసలు మన ప్రజల సామాజిక ఆస్తులను కొల్లగొట్టే ఈ అధికారం ప్రభుత్వాలకూ పాలకులకూ సంపన్నులకూ ఎక్కడిదని. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ దోపిడీ పాలన ప్రజలకు మేలు చేస్తుందని, ప్రజాప్రాతినిధ్యంతో సాగే ప్రజాస్వామ్యమని ఇంకా ఎవరైనా నమ్ముతుంటే ఇటువంటి ఉదంతాలు ఆ నమ్మకాన్ని తుత్తునియలు చేస్తాయి.

సంపాదకీయ వ్యాఖ్యలు

కామన్ వెల్త్ క్రీడలు అవసరమా?

‘దేశంలో కరువు విలయ తాండవం చేస్తోంది. ప్రజలకు తినడానికి రొట్టె కూడ దొరకడం లేదు’ అని చెప్తే ఫ్రెంచి యువరాణి, ఆ తర్వాత పదహారో లూయీని పెళ్లాడి మహారాణి అయిన మేరీ ఆంటోనెట్ ‘అయితే కేకులు తినవచ్చుగదా’ అందట. పేదరికం గురించీ ఆకలి గురించీ తన నిర్లక్ష్యాన్నీ అజ్ఞానాన్నీ చాటుకున్నదట. మహాఘనత వహించిన ప్రజాస్వామిక, సర్వసత్తాక భారత ప్రభువులు ఆ పద్దెనిమిదో శతాబ్దపు ఫ్రెంచి పాలకురాలికన్న దుర్మార్గులమని చూపదలచుకున్నట్టున్నారు. ఒకవైపు కోట్లాదిమంది భారత ప్రజలు దారిద్ర్యంతో, ఆకలిచావులతో, ఆత్మహత్యలతో, అధికధరలతో సతమతమైపోతూ ఉంటే, వెయ్యి రూపాయలకూ వంద రూపాయలకూ కూడ మొఖంవాచిపోతూ ఉంటే, అక్షరాలా ముప్పైవేల కోట్ల రూపాయలు బూడిదలో పోయడానికి భారత ప్రజాస్వామిక ప్రభువులకు కనీసం సిగ్గనిపించడంలేదు. కేవలం 72 దేశాలకు చెందిన ఓ పదివేల లోపు క్రీడాకారులు పన్నెండు రోజులపాటు ఢిల్లీలో పదిహేడు ఆటలలలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి, పోటీపడి ఆ ముప్పైవేల కోట్ల రూపాయలు  తగలేయబోతున్నారు. ఇక ఈ నిధుల కెటాయింపులో, ఖర్చులో ఉన్న అక్రమాలు సరేసరి. నిజానికి భారతదేశం ముందర ఉన్న ప్రాధాన్యతలలో ఈ క్రీడల నిర్వహణ మొదటిస్థానంలో ఉండవలసిన అవసరం లేదు. ఇవాళ్టికివాళ భారత సమాజం ముందర ఉన్న ఏ ప్రధాన సమస్యను నిజంగా పరిష్కరించదలచినా ఇంతకన్న తక్కువ నిధులతోనే సాధ్యమవుతుంది. నిధుల కొరత పేరుతో పక్కన పెడుతున్న ఏ అభివృద్ధి పథకాన్ని చేపట్టినా, నీటిపారుదల సౌకర్యాలు కల్పించినా, విద్యాలయాలో, ఆసుపత్రులో, పరిశ్రమలో ఏర్పరచినా అవి ఉత్పాదక ఆస్తులుగా మారి, ప్రస్తుత జీవనోపాధిని పెంచడం మాత్రమే కాదు, భవిష్యత్తు ఆదాయాలకు ఉపయోగపడతాయి. పోనీ, దేశపు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనీ, క్రీడా సౌకర్యాలు మెరుగుపరచాలనీ ఈ పాలకులకు ఆసక్తే ఉంటే, ఈ ఖర్చులో పదో వంతుతో గ్రామీణ స్థాయి నుంచి చేయవలసిన పనులెన్నో ఉన్నాయి. దేశీయ క్రీడలలో ప్రోత్సాహం కరువై నశించిపోతున్నవీ, కునారిల్లుతున్నవీ ఎన్నో ఉన్నాయి. పాఠశాలల్లో, గ్రామీణ, చిన్నపట్టణాల, జిల్లాకేంద్రాల స్థాయిలో క్రీడాకారులు అవసరమైన సౌకర్యాలు లేక, క్రీడామైదానాలూ క్రీడాపరికరాలూ లేక తమ ఉత్సాహాన్ని తమలోనే దిగమింగుకుంటున్నారు. లేదా, ప్రభుత్వమూ బహుళజాతిసంస్థలూ ప్రోత్సహిస్తున్న ఏకైక గుత్తాధిపత్య క్రీడ క్రికెట్ వైపు చూస్తున్నారు. ఇటువంటి స్థితిలో తలపెట్టిన కామన్ వెల్త్ క్రీడలలో సాగుతున్న అవినీతి గురించి, పెద్దమొత్తంలో దుర్వినియోగమవుతున్న నిధుల గురించి వార్తలు వస్తున్నాయి. ఆ దుర్వినియోగం జరగకపోయినా అసలు ఈ ఆటలు అవసరమా అని అడగవలసి ఉంది. ఇలాగే రొట్టెలు లేని ప్రజలకు కేకులు తినమని పాలకులు ఉద్బోధ సాగిస్తూపోతే చివరికి మేరీ ఆంటోనెట్ కు పట్టినగతి పట్టకతప్పదు.

నేపాల్ లో ఏం జరుగుతోంది?

పది సంవత్సరాల సాయుధ పోరాటంతో అసాధారణ విజయాలు సాధించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించి, ప్రభుత్వాధికారాన్ని కూడ చేపట్టిన నేపాల్ ప్రజా విప్లవోద్యమం ఒడిదుడుకుల బాటన పడింది. పార్లమెంటులోని 599 మంది సభ్యులలో కనీసం 300 మంది సభ్యుల మద్దతు కూడగట్టి ప్రధానమంత్రి కావడానికి మావోయిస్టు నాయకుడు ప్రచండ చేస్తున్న ప్రయత్నం నాలుగుసార్లు ఓటమి పాలయి, సెప్టెంబర్ 5న ఐదోసారి మరొక పరీక్షను ఎదుర్కోబోతోంది. యునిఫైడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) సభ్యులు 238 మంది, నేపాలీ కాంగ్రెస్ సభ్యులు 114 మంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) సభ్యులు 109 మంది ఉన్న ఈ పార్లమెంటులో ఏ ఒక్క పార్టీకీ ఒంటరిగా మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి లేదు. 85 మంది దాకా ఉన్న మధేసి జాతీయ పక్షాల సభ్యులు మావోయిస్టులకు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే అధికారం కావాలంటే మావోయిస్టులు కూడ అంకెల గారడీలో, కప్పల తక్కెడ రాజకీయాలలో పడకతప్పదు. వేలాదిమంది విప్లవకారులు, ప్రజలు హత్యలకూ నిర్బంధానికీ గురయినప్పుడు కూడ ఓడిపోని విప్లవం, ఐదు సంవత్సరాల పార్లమెంటరీ కుషన్ సీట్లలో, అధికార కాంక్షల ఎత్తుగడలలో పడి వేగంగా ఓటమి దిశగా పయనిస్తోంది. భూయాజమాన్యంలో అసమానతలు, కుల అణచివేత, జాతుల అణచివేత, వెనుకబాటుతనం, పొరుగున ఉన్న భారత ప్రభుత్వపు పెత్తందారీతనం వంటి నిజమైన సమస్యలను పరిష్కరించి, ప్రజా ప్రత్యామ్నాయ అధికారాన్ని స్థాపించాలనే ఆకాంక్ష పక్కకు పోయి, పార్లమెంటులో అవతలి అభ్యర్థికన్న ఎక్కువ వోట్లు తెచ్చుకోవడం ఎట్లా అనే ఏకైక సూత్రం చుట్టూ ఇవాళ నేపాల్ ప్రజా ఉద్యమం తిరుగుతోంది.  ఇరవైఒకటో శతాబ్దపు సోషలిజాన్ని నిర్మిస్తున్నామనే వాగ్దానం చేసినవారికైనా గుర్తుందో లేదో తెలియని స్థితి ఏర్పడింది. గత దశాబ్దం చివరిలో ప్రపంచ పీడితప్రజల ఆశాజ్యోతిగా నిలిచిన నేపాల్ విప్లవం తిరోగమన మార్గం పట్టిందని ఇప్పుడే నిర్ధారించడం తొందరపాటు కావచ్చు. కాని అది పురోగమన మార్గంలో ఉన్నదని కూడ నిర్ధారించడానికి వీలు లేదని అనేక సూచనలు చెపుతున్నాయి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద దుర్మార్గాలూ, అభివృద్ధి నిరోధక ప్రభుత్వాల అక్రమాలూ అంతకంతకూ ఎక్కువగా వెల్లడవుతూ, ప్రపంచం ముందర సోషలిజం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని తెలిసివస్తున్న ఇవాళ్టి సందర్భంలో ఆ సోషలిజాన్ని సాధించే మార్గాల గురించి ఇంకా లోతయిన చర్చ, ఆచరణ అవసరమని నేపాల్ అనుభవం నేర్పుతున్నది. పార్లమెంటరీ మార్గం ఒక చిన్న ప్రాతినిధ్య బృందానికి అధికారం ఇవ్వడానికే తప్ప ప్రజాభాగస్వామ్యపు నిజమైన ప్రజాస్వామ్యం సాధించడానికి పనికిరాదని మూడు శతాబ్దాల ప్రపంచ చరిత్ర చెపుతుండగా నేపాల్ మళ్లీ ఆ దారి పట్టింది. సాయుధపోరాటం ఆధిపత్య శక్తులను చికాకు పరచడానికీ, అక్కడక్కడ దెబ్బతియ్యడానికీ, అధికారం సాధించడానికీ పనికిరావచ్చుగాని, ప్రజల చైతన్యం, భాగస్వామ్యం పెరగడానికీ, ప్రజల సృజనాత్మకత వెల్లివిరియడానికీ పనికి రాకపోవచ్చునని నేపాల్ అనుభవం నేర్పుతున్నది. ఈ పాఠాలను నేపాల్ విప్లవోద్యమ నాయకులు నేర్చుకుంటారో లేదో గాని, సోషలిజం ఆవశ్యకత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ ప్రజలందరూ నేర్చుకోవలసి

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s