తిండిగింజలు వ్యర్థమయ్యే పందికొక్కుల రాజ్యం

ఈభూమి అక్టోబర్ 2010 సంచిక కోసం

ఆకలిగొన్నవారికి కావలసిన తిండి దొరకక చనిపోవడం, దొరల గుమ్ముల్లో, గరిసెల్లో తిండిగింజలు ముక్కిపోవడం, పందికొక్కులకు ఆహారం కావడం చాలమందికి చాల సంవత్సరాలుగా తెలిసిన కథే. ‘అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ డెబ్బై సంవత్సరాల కింద రాసినది ఆ స్థితి గురించే. ఆరోజుల్లో ఆ వైపరీత్యానికి కారణం రాజుల నిరంకుశత్వమనో, వలసపాలకుల దుర్మార్గ పాలన అనో, కరువుకాటకాలనో చెప్పుకుని సంతృప్తి పడేవాళ్ళం.

ఆ పాలన రద్దయి అధికారమార్పిడి జరిగి అరవై మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. దేశాన్నీ దేశ ప్రజలనూ అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రణాళికలూ పథకాలూ కోట్ల కోట్ల రూపాయల కేటాయింపులూ యథావిధిగా జరిపోతున్నాయి. వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలలో గణనీయమైన పెరుగుదలా కనబడుతోంది. ఒకటి రెండు సంవత్సరాలు వర్షాభావం ఉన్నా ఆహారభద్రత కోసం కోట్ల టన్నుల ఆహారధాన్యాలు నిలువ చేసుకునే పద్ధతులూ వచ్చాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడ ఆకలీ పేదరికమూ తగ్గలేదు. అన్నపు రాశులు కుళ్లిపోవడమూ, పందికొక్కుల (ఇది జంతువు పేరు ఎంతమాత్రం కాదు, మనుషులలో ఒక రకం) భోజనం కావడమూ జరుగుతూనే ఉన్నాయి. ఇది కూడ పాతకథే.

ఈ పాతకథనే మళ్లీ ఒకసారి చెప్పుకోవలసిన పరిస్థితి దాపురించింది. ఈ వ్యవహారం మీద పది సంవత్సరాలుగా దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ముందర ఎడతెగని ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడ నడుస్తున్నది. చివరి తీర్పు ఇవ్వడానికి తాత్సారం చేస్తున్న న్యాయస్థానం రెండు డజన్లకు పైగా మధ్యంతర ఉత్తర్వులు మాత్రం ఇచ్చింది. కాని ఇప్పుడు ఈ కథలో కొంత భాగం సంచలనాత్మకంగా పత్రికలకు ఎక్కేసరికి, సుప్రీంకోర్టు తనకిదంతా ఇప్పుడే తెలిసినట్టు కళ్లెర్రజేసింది. ప్రజా ప్రతినిధులనబడే వాళ్లు తమకూ అప్పుడే తెలిసినట్టు ‘అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోతున్నదో చూడండి’ అని లోకసభలో గగ్గోలు పెట్టారు. ‘సుప్రీంకోర్టు చెపితే శిలాశాసనమా? ఆ సూచనను వినాలో లేదో ఆలోచిస్తాం’ అని సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి, భారత రాజకీయాల్లో చిరకాలంగా ఉన్న వ్యక్తి శరద్ పవార్ అత్యంత బాధ్యతారహితంగా, తాపీగా అన్నారు. మామూలుగా అలుగుటయే ఎరుంగని పరమాత్ముడిగా పేరు పడిన ప్రధానమంత్రివర్యులు డా. మన్మోహన్ సింగ్ కు సుప్రీంకోర్టు మీద కోపం కూడ వచ్చింది. ‘సుప్రీంకోర్టు ఇటువంటి విషయాల్లో వేలుపెట్టకుండా తన పని తను చూసుకుంటే మంచిది. అధికారవ్యవస్థ చేసే విధానపరమైన పనుల గురించి న్యాయవ్యవస్థ మాట్లాడగూడదు’ అని హెచ్చరించారు. ‘ఠాఠ్ నా మాటే తీసేస్తారా’ అని సుప్రీంకోర్టు మరొకసారి గర్జించింది.

పత్రికలకూ టెలివిజన్ ఛానెళ్లకూ వ్యాఖ్యాతలకూ రాజకీయనాయకులకూ బోలెడంత పని దొరికింది. అన్ని రాజకీయపక్షాలూ ఆందోళనా గాంభీర్యమూ నిండిన తీవ్రమైన ప్రకటనలు చేశాయి. జూలై 28 నుంచి ఇది రాస్తున్న సెప్టెంబర్ 28 దాకా, అంటే అక్షరాలా అరవై రోజులపాటు, న్యాయస్థానంలోనూ, చట్టసభలలోనూ, అధికార యంత్రాంగంలోనూ, సమాజంలోనూ  చాల చర్చ నడిచింది. ‘అబ్బ ఇంత రభస జరిగింది గదా, అసలు పని ఏమన్నా ముందుకు కదిలిందా’ అని మీరు అమాయకంగా చూడబోయారా, పప్పులో కాలు వేసినట్టే. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కథ హాయిగా తన అలవాటు కొద్దీ కంచికే వెళిపోయింది. లేదా వెళ్ళే దారిలో ఉంది. ఇదంతా మిమ్మల్నీ, నన్నూ, మనబోటి వాళ్లనూ మాయ చేసే తతంగమే తప్ప ఏమీ జరగలేదు.

ఇంతకీ అసలేమిటీ కథ?

మనిషయి పుట్టినందుకు బతికి ఉండాలంటే తినాలి గదా, తింటేనే గదా మనిషిగా మనుగడ సాగించేది? మనిషిగా బతికి ఉంటేనే గదా రాజ్యాంగంలో పందొమ్మిదో అధికరణం హామీ ఇస్తున్న భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్సభాస్వాతంత్ర్యాలు, ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ, ఏ వ్యాపారమైనా, వృత్తయినా చేసుకునే స్వేచ్ఛ అనుభవించగలిగేది. అంటే ఈ ప్రాథమిక హక్కులు అమలు కావాలన్నా బతికి ఉండాలి గనుక ముందు అసలు తిండి తినడానికి ఉన్న స్వేచ్ఛ గురించీ, అవకాశం గురించీ మాట్లాడాలి గదా. అధికరణం 21లో హామీ ఇచ్చిన జీవన స్వేచ్ఛకు సుప్రీంకోర్టు వేరు వేరు సందర్భాలలో ఇచ్చిన విస్తృత నిర్వచనాలలో ఆహార స్వేచ్ఛ కూడ అంతర్భాగమవుతుంది గదా, జీవించడమంటే మొదట తినడమే గదా, అందువల్ల ఆహారహక్కును గౌరవిస్తానని హామీ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా, ఉచితం కాదా (ఉచితం అంటే ధరలేనిది అనే అర్థంలో కాదు, తగినది అనే అర్థంలో) అని ఒక అమాయకపు సంస్థకు మరింత వెర్రి ఆలోచన వచ్చింది. పందికొక్కుల రాజ్యంలో పందికొక్కులకే తప్ప మామూలు మనుషులకు ఆహారహక్కు ఉండడానికి వీలులేదని ఆ సంస్థకు తెలియకపోయింది. ఆ సంస్థ 2001లో నేరుగా సుప్రీంకోర్టునే ఈ ప్రశ్న అడిగింది.

ఆ సంస్థ పేరు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ – పియుసిఎల్. ఇంత అమాయకపు ఆలోచన చేసినది ఆ సంస్థకు చెందిన రాజస్థాన్ శాఖ. అయితే పాపం సిద్ధార్థుడికి ప్రశ్నలు ఉదయించడానికి వీథుల్లో అనారోగ్యం, మృత్యువు, ఆకలి, దుఃఖం కనిపించినట్టుగానే ఈ పియుసిఎల్ వారికి రాజస్థాన్ లో కనిపించిన ఒక వాస్తవ విచిత్ర సంఘటనే ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యానికి మూలం.

పియుసిఎల్ బాధ్యులు కొందరు 2001 తొలిరోజుల్లో జైపూర్ నగర శివార్లలో భారత ఆహార సంస్థ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – ఎఫ్ సి ఐ) గోదాములు చూశారు. ఆ మూసి ఉన్న గోదాముల్లో లోపల స్థలం ఉందో లేదో తెలియదు గాని, ఆరుబయట మాత్రం టార్పాలిన్ కప్పి ఉన్న ఆహారధాన్యాల కుప్పలు బోలెడు కనిపించాయి. అంతకుముందు ఎప్పటినుంచి ఆ ఆహారధాన్యాల బస్తాలు ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉన్నాయో గాని టార్పాలిన్ ను చీల్చుకుని బైటికి వచ్చిన మొలకలూ కనబడ్డాయి. తిండిగింజలు కుళ్లిపోయిన వాసనా వచ్చింది. అక్కడినుంచి ఐదు కిలోమీటర్ల లోపలే ఉన్న ఒక గ్రామంలో మాత్రం జనం కరువుతో, దారిద్ర్యంతో విలవిలలాడుతున్నారు. ఆ ఊరి జనం ‘వరుసల వారీ తిండి’ అనే వినూత్న పద్ధతి కనిపెట్టారు. అంటే ఒక కుటుంబంలో కొందరు ఒకరోజు తింటే మరికొందరు మరొకరోజు తింటారన్నమాట. ఉన్న తిండిగింజలు పొదుపుగా వాడుకోవాలంటే ప్రతిమనిషీ వారానికి మూడు రోజులు తింటే సరిపోతుందనే విషాద నిర్ణయానికి వచ్చారు వాళ్లు.

మనిషికి పూటకు కావలసిన రెండువందల గ్రాముల కన్న తక్కువ ఆహార ధాన్యాల గురించి ఆ రాజస్థాన్ జనం ఇటువంటి పద్ధతి కనిపెట్టిన సంవత్సరమే ఎఫ్ సి ఐ గోదాములలో ఆరు కోట్ల టన్నుల (టన్ను అంటే వెయ్యి కిలోలు – అంటే కనీసపక్షం ముప్పై కోట్ల మందికి సరిపోయే ఆహారం) ఆహారధాన్యాల నిలువలు ఉన్నాయి. చట్టప్రకారం దేశంలో ఆహార భద్రతకోసం నిలువ ఉంచవలసినది రెండుకోట్ల టన్నులు కాగా, ఆ సంవత్సరం నాలుగుకోట్ల టన్నులు ఎక్కువ సేకరించి నిలువ చేశారు. నిలువ చేశారనడం కంటే కుళ్లిపోయేలా చేశారు అనడం సమంజసమేమో.

ఇంత దారుణమైన, అస్తవ్యస్తమైన పాలనా విధానాలేమిటి అని పియుసిఎల్ కు సందేహం వచ్చింది. ప్రజల ఆహార హక్కు గురించి ప్రభుత్వానికి చెప్పండి అని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది. దానిమీద జరుగుతున్న విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ పది సంవత్సరాలలో కొన్ని ప్రజానుకూల నిర్ణయాలను, ఉత్తర్వులను ప్రకటించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను కట్టుదిట్టంగా, సక్రమంగా అమలు చేయమని ఆదేశించింది. ఉపాధి హామీ పథకాలను అమలు చేయమని ఆదేశించింది. బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయమని ఆదేశించింది. సమగ్ర శిశు అభివృద్ధి పథకాన్నీ, ఆంగన్ వాడీలనూ అమలు చేయమని ఆదేశించింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికీ, ఎగువన ఉన్నవారికీ చౌకధరల దుకాణాలలో తక్కువధరకు తిండిగింజలు సరఫరా చేయమని ఆదేశించింది. ప్రతిరాష్ట్రంలోనూ ఆహారభద్రతా పథకాలు ఎలా అమలవుతున్నాయో పరిశీలించి తనకు క్రమబద్ధంగా నివేదికలు ఇవ్వడానికి యంత్రాంగాన్ని తయారుచేసింది.

ఈ ఆదేశాలన్నీ అమలవుతున్నాయో లేదో, అరకొరగా అమలవుతున్నాయో తెలియదు గాని, ఈ కథలో ఒక కొత్త మలుపు జూలై మూడో వారంలో జరిగింది. ఢిల్లీ నుంచి వెలువడే హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ట్రాకింగ్ హంగర్ (ఆకలి పరిశీలన) అనే శీర్షిక కింద ధారావాహిక కథనాలు ప్రారంభించింది. ఆ పత్రిక విలేకరులు సమర్ హల్రంకర్, మన్ ప్రీత్ రణధవా ‘ఇండియా లెట్స్ గ్రేన్ రాట్ ఇన్ స్టెడ్ ఆఫ్ ఫీడింగ్ పూర్’ (తిండి గింజలను పేదలకు పంచే బదులు కుళ్ళిపోనిస్తున్న భారతదేశం) అని జూలై 26 సంచికలో రాసిన వార్తాకథనంలో ఆశ్చర్యకరమైన వాస్తవాలు కొన్ని బయటపెట్టారు.

దేశంలో ప్రస్తుతం ఒక కోటీ ఎనబై లక్షల టన్నుల వరి, గోధుమ ఆహారధాన్యాలు టార్పాలిన్ల కింద ఎటువంటి రక్షణా లేకుండా ఉన్నాయని వాళ్లు రాశారు. మొత్తంగా దేశంలో అప్పటికి భారత ఆహార సంస్థ దగ్గర నిలువ ఉన్న ఐదు కోట్ల తొంబై లక్షల టన్నుల ఆహారధాన్యాలలో నాలుగుకోట్ల ఇరవై లక్షల టన్నులు మాత్రమే పక్కా గిడ్డంగులలో ఉన్నాయి. టార్పాలిన్ల కింద సరైన రక్షణ లేకుండా ఉన్న ఆహారధాన్యాల నిలువలు 2008లో తొంబై నాలుగు లక్షల టన్నులు ఉండగా అవి 2009లో ఒకకోటీ అరవై లక్షల టన్నులకు, 2010 జూన్ 1 నాటికి ఒక కోటీ ఎనబై లక్షల టన్నులకు పెరిగిపోయాయి. వీటిలో కనీసం ఒక కోటి టన్నుల తిండి గింజలను అప్పటికి సంవత్సరం కింద సేకరించి, టార్పాలిన్ల కింద నిలువ చేశారని ఆ వార్తలో రాశారు. అవి కుళ్లిపోతున్నాయని, వాటి విలువ పదిహేడు వేల కోట్ల రూపాయలనీ వాళ్లు రాశారు. ఇంకా నిర్దిష్టంగా పంజాబ్ లో నలభై తొమ్మిది వేల టన్నుల ఆహారధాన్యాలు సేకరించి మూడు సంవత్సరాలు గడిచాయని, ఈ మూడు సంవత్సరాలుగా అవి ఎండకు ఎండుతూ వానకు  తడుస్తూ ఉండిపోయాయనీ రాశారు. ఇలా మూడు సంవత్సరాలు ఉంటే ఆ ఆహారధాన్యాలు మనుషులుగానీ, పశువులుగానీ తినడానికి పనికి రాకుండా పోతాయి.

ఇది ఇలా ఉండగా ఈ కుళ్లిపోతున్న ఆహార ధాన్యాల నిలువలను కాపాడడానికి ప్రభుత్వానికి, భారత ఆహార సంస్థకు సాలీనా కనీసం పదిహేనువేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఈ దుస్థితిని గుర్తించి తమ దగ్గర నిలువలను ఉపయోగకరంగా వినియోగించమని భారత ఆహార సంస్థ కూడ ప్రభుత్వాన్ని కోరుతూ అనేక లేఖలు రాసింది. దేశంలోని పేద జిల్లాలుగా గుర్తించిన 150 జిల్లాలలో ఈ ధాన్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తే బాగుంటుందని కూడ ఎఫ్ సి ఐ సూచించింది. ఆ సూచనలన్నిటినీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని చెప్పనక్కరలేదు.

అప్పటికే సుప్రీంకోర్టులో ఆహారహక్కు మీద వ్యాజ్యం నడుస్తున్నది గనుక ఈ హిందుస్తాన్ టైమ్స్ వార్త అక్కడ ప్రస్తావనకు వచ్చింది. పియుసిఎల్ న్యాయవాది కాలిన్ గాన్ సాల్వెస్ ఆ వార్త చదివి వినిపించారు. న్యాయస్థానంలో ధర్మాసనంపై ఉన్న న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ ఒక పేద దేశంలో ఆహారాన్ని ఇలా దుర్వినియోగం చేయడం నేరమని వ్యాఖ్యానించారు. ఈ వార్త మీద ప్రభుత్వం తన ప్రతిస్పందనను తెలియ జేయాలనీ, ఇలా ఆహారం కుళ్లిపోతున్న ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ సంజాయిషీ చెప్పాలనీ న్యాయమూర్తులు ఆదేశించారు. “మీకు ఆహార ధాన్యాలను నిలువ చేయడం రాకపోతే, దాన్ని పేదలు తినడానికైనా ఇవ్వండి” అని భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ మీద న్యాయమూర్తులు కోప్పడ్డారు. ఆ తర్వాత వాయిదాలో ఆగస్ట్ 12న తిండిగింజలను పేదలకు పంపిణీ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు.

అప్పటికి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి గనుక ప్రతిపక్షాలు దీన్ని ఒక అనువైన ఆయుధంగా చూశాయి. నిజానికి ఆ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోనూ, ఇప్పటికీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ ఎవరూ ఈ దుర్మార్గానికి అతీరులు కారు. కాని, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని చేజారనీయదలచుకోలేదు. కుళ్లిపోతున్న తిండిగింజల సమస్య అధికారపక్షం మీద దాడిచేయడానికి చేతికి అందివచ్చిన సమస్యగా ప్రతిపక్షాలు భావించాయి. వారి విమర్శలకు జవాబు చెపుతూ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ న్యాయస్థానం పేదలకు తిండిగింజలు పంపిణీ చేయమని ఆదేశమేదీ ఇవ్వలేదనీ, తాము ఆ ఆదేశాన్ని పరిశీలిస్తున్నామనీ అన్నారు. ప్రధాని డా. మన్మోహన్ సింగ్ అలా ఉచితంగా పంపిణీ చేయడం సాధ్యం కాదనీ, అయినా సుప్రీం కోర్టు ఇటువంటి విషయాల్లో వేలు పెట్టకూడదనీ అన్నారు.

ఈలోగా ఆహార సబ్సిడీ వినియోగంపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక ఒకటి కూడ చర్చకు వచ్చింది. విలాస్ ముత్తెంవార్ నాయకత్వంలోని ఈ స్టాండింగ్ కమిటీ ఆహార సబ్సిడీ వ్యవహారంలో ప్రభుత్వమూ, ఎఫ్ సి ఐ అస్తవ్యస్తంగా పనిచేస్తున్నాయని విమర్శించింది. ప్రతిఏటా ప్రణాళికా సంఘం వందల కోట్ల రూపాయలు కొత్త గిడ్డంగుల నిర్మాణం కోసం కేటాయిస్తున్నప్పటికీ, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నిర్లక్ష్యం వల్ల ఆ నిర్మాణాలు సాగడం లేదనీ, అందువల్ల తిండిగింజలను ఆరుబయట నిలువ చేసి, కుళ్లిపోయేలా చేయవలసి వస్తున్నదని ఈ స్టాండింగ్ కమిటీ విమర్శించింది.

ఆగస్ట్ 31 న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ విషయాన్ని మళ్లీ ఒకసారి పరిగణన లోకి తీసుకున్నారు. “మేం చేసింది సూచన కాదు. అది మా ఆదేశం. అది మా ఆదేశంలో అంతర్భాగం. మీ మంత్రికి చెప్పండి” అని జస్టిస్ భండారీ, జస్టిస్ దీపక్ వర్మ  ప్రభుత్వ న్యాయవాదికి తీవ్రంగానే చెప్పారు.

ఆ తర్వాత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నాయకత్వాన సమావేశమైన మంత్రివర్గ సమావేశం ఇరవై ఐదు లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రం విడుదల చేయాలనీ, అవి కూడ ఉచితంగా కాక దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వర్తించే ధరలకు అమ్మాలనీ నిర్ణయించింది. కాని ఈ నిర్ణయం ఎప్పటికి అమలవుతుందో తెలియదు. ఈ లోగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని అక్టోబర్ 18కి వాయిదా వేసింది. కుళ్లిపోతున్న తిండిగింజలు మరో రెండు నెలలు ఎక్కువ కుళ్లిపోయాయి.

అలా కుళ్ళిపోతున్న తిండి గింజలు మొత్తం ఫ్రాన్స్ దేశ పౌరులు ఏడాదిపాటు తినే తిండికి సమానం. అలా కుళ్ళిపోతున్న తిండిగింజలు 21 కోట్ల మంది భారతీయులకు ఏడాది పాటు తిండి పెట్టగలుగుతాయి. ఇలా ఒకవైపు విలువైన ఆహారధాన్యాలు కుళ్లిపోతుండగా దేశంలో కనీసం 15 కోట్ల మంది రోజుకు ఒక పూట తిండి తోనే గడపవలసి వస్తున్నదని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దేశంలోని చిన్నారి పిల్లలలో సగం మంది పోషకాహార లోపాల వల్ల బాధపడుతున్నారు. ఈ ప్రాతిపదికన భారతదేశం దుర్భర దారిద్ర్యంలో ఉన్న సహారా ఎడారిలోని దేశాలకన్న వెనుకబడి ఉంది. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ ప్రతి సంవత్సరం తయారు చేసే ప్రపంచ అన్నార్తుల సూచిక ప్రకారం ఎనభై ఎనిమిది దేశాల జాబితాలో భారతదేశం అట్టడుగున 66వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అన్నార్తులలో నలుగురిలో ఒకరు భారతదేశంలోనే ఉన్నారు. అంకెల్లో చెప్పాలంటే వీరి సంఖ్య 23 కోట్లు. దేశంలో నలభై ఆరు కోట్ల మంది రోజుకు రు. 56 కన్న తక్కువ వినియోగంతో బతుకుతున్నారు. వారికి తిండి పెట్టలేని మన మహా ఘనత వహించిన సమాజం, వెలిగిపోతున్న భారతదేశం, అగ్రరాజ్యంగా ఎదగబోతున్న, వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశం, ఐక్యరాజ్యసమితి భద్రతాసమితి సభ్యత్వం కోసమూ, కామన్ వెల్త్ క్రీడల నిర్వహణా గొప్పల కోసమూ ఎగబాకుతున్నది.

గింజ గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అని హిందీ/ఉర్దూ సామెత. విధిని నమ్మదలచుకున్నవాళ్లు అది నమ్మవచ్చు గాని వాళ్లయినా, విధిని నమ్మనివాళ్లయినా తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసిందేమంటే, గింజ గింజ మీద రాసి ఉండేది అది దొరకక పస్తుపడుకున్నవారి పేరు. గింజ గింజకూ అంటి ఉండేది అది పండించినవారి చెమటా నెత్తురూ. ఒకగింజ, ఒక మెతుకు మన నోట్లోకి వెళుతున్నప్పుడు తలచుకోవలసింది ఆ ఇద్దరి గురించీ – ఆ మెతుకు దొరకని వారి గురించీ, ఆ మెతుకు పండించిన వారి గురించీ. ఇవాళ దేశంలో మురిగిపోతున్న, కుళ్లిపోతున్న కోట్లాది టన్నుల తిండిగింజలన్నిటి మీద ఆ గింజలు దొరికి ఉంటే బతికి ఉండగలిగిన అభాగ్యుల పేర్లు ఉన్నాయి. వ్యవసాయం గిట్టుబాటుకాని వృత్తిగా మారిపోయినా, మరొక దిక్కులేక ఆ పంటలు పండించి ఎఫ్ సి ఐ గోదాములలో నింపి రాలిపోయిన లక్షలాది రైతు కూలీల చెమటా నెత్తురూ ఉన్నాయి. పియుసిఎల్ అడిగిందనో, పత్రికలు రాశాయనో, సుప్రీంకోర్టు చెప్పిందనో, శరద్ పవార్లూ మన్మోహన్ సింగులూ గంభీర ప్రవచనాలు చేస్తున్నారనో కాదు, మనుషులం అయినందుకు, రోజూ మూడు పూటలో రెండు పూటలో తినగలిగే అవకాశం దొరికినందుకు, ఆ అవకాశాలు కోల్పోయిన కోట్లాది అభాగ్యులకోసం, ఆ ఆకలిగొన్న నోళ్లకు అందకుండా గోదాముల్లో మురిగిపోతున్న తిండిగింజల గురించి అడగవలసి ఉంది. ఇది మన సమస్య కాదని ముఖం పక్కకు తిప్పుకోవడానికి వీల్లేదు. ఇది అక్షరాలా, మెతుకు మెతుకునా మన సమస్యే. మానవత్వం సమస్యే.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

6 Responses to తిండిగింజలు వ్యర్థమయ్యే పందికొక్కుల రాజ్యం

 1. మీ వ్యాసం చాలా బావుంది.ఇందులోని కొన్ని నిజాలు విభ్రాంతికరంగా ఉన్నాయి.అదే సమయంలో బాధను కలిగిస్తున్నాయి.మన ప్రభుత్వాధికారులు ఎంత బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నారో తెలుస్తోంది.ఈ ఘటనకు బాధ్యులైన అధికారులనందరినీ కనీసం వారం రోజుల పాటూ తిండిలేకుండా మాడ్చితే కానీ వాళ్ళకు బుద్ధిరాదేమో

 2. chavakiran says:

  How Sad!

  Let us quickly have our Telangana country and solve this problem.

 3. gajulla says:

  ఇది పందికొక్కుల రాజ్యమే కాదు ,’చావ’లేక బ్రతుకుతున్న రాజ్యం కూడా .మీరు మానవత్వం గురించి చెబుతున్నారు ,మానవత్వము అనేది వొక పాటముగా అవుసరమైన కాలములో మనము వున్నామనే విషయాన్ని మీరు మర్చిపోయారు .అసలు దేశ ప్రజలకు ఏమి అవుసరమో ఆ దిశగా మన ప్రభుత్వాలు పని చేసిన దాఖలాలు లేవు .ఎవడు అడిగాడు commonwealthgames కావాలని ,ఎవడు అడిగాడు చంద్రయానుకు వెళ్ళాలని ,అలా అడిగినవాడికి సాటి భారతీయుల ఆకలి గురించి తెలియదంటే ‘వాడో -వీడో ఎవరో భారతీయుడు కాదన్నమాటే ‘.ప్రభుత్వమూ ఇలాగే వుంటే ఆకలి దాడులు జరగవని ఎవరైనా హామీ ఇవ్వగలరా ?

 4. Srikanth says:

  అవినీతి, మోసం వీటన్నిటి కన్నా పెద్ద పదం “నిర్లక్ష్యం”. ప్రభుత్వమైనా, న్యాయస్థానాలైనా, సామాన్య మానవుడైనా దాని కేంద్ర బిందువు “మనిషి మెదడు”

 5. శ్రవణ్ కుమార్.H says:

  వీటన్నిటికీ ఒక పరిష్కారం వుంది. అయితే అది దీర్ఘకాలికం. ప్రతీ విద్యార్థికి డిగ్రీ స్థాయిలో ఒక సంవత్సరం పూర్తిగా వ్యవసాయపు పనులు నిర్బంధంగా చేయించాలి. దీనివల్ల ఆహారంపై ఒక గౌరవం, అవగాహన, పండించే రైతు మీద గౌరవం, వృధా చెయ్యని తత్వం ఇవన్నీ మెండుగా విద్యార్థులకు పట్టు పడుతాయి.

  ఇంకా ఒక సంవత్సరం పూర్తిగా నిర్బంధ సైనిక శిక్షణ ఇవ్వాలి. దీనివల్ల క్రమశిక్షణ, దేశంపట్ల భక్తి పెరుగుతుంది.

  పై సూచనలవల్ల ఏమాత్రం సైడ్ ఎఫెక్త్స్ లేవు కనుక ఆచరింప తగినది. మొక్కై వంగనిది మానై వంగునా??

 6. SravaN kumAr hArati says:

  “ఒకగింజ, ఒక మెతుకు మన నోట్లోకి వెళుతున్నప్పుడు తలచుకోవలసింది ఆ ఇద్దరి గురించీ – ఆ మెతుకు దొరకని వారి గురించీ, ఆ మెతుకు పండించిన వారి గురించీ”
  అద్భుతమూ, తప్పక ఆచరింపవలసింది. nice !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s