అత్యవసరమైనదీ కొత్తచూపు

ఆర్ ఎస్ రావు గారి తెలుగు రచనలన్నీ ఒక్కచోటికి తేవాలనే చిరకాలపు కల ఇప్పుడు నెరవేరుతోంది.

ఏ అంశం గురించి అయినా వాస్తవాల మీద ఆధారపడిన సునిశితమైన పరిశోధన చేయడం, సాధారణంగా ఇతర పరిశీలకులకు తట్టని కొత్త ప్రశ్నలు రేకెత్తించడం, ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో కొత్త ఆలోచనలు ప్రేరేపించే విశ్లేషణ చేయడం, ఆ విశ్లేషణను మళ్ళీ వాస్తవాల దగ్గరికి తీసుకువచ్చి పరీక్షించడం, పాఠకుల కళ్లు మిరుమిట్లు గొలిపేలా తన వాదనలను వివరించడం, అపారమైన అనుభవం నుంచీ, అధ్యయనం నుంచీ ఆ వాదనలకు బలం చేకూర్చే ఉదాహరణలు ఇవ్వడం – ఏది మాట్లాడినా మార్కిస్టు దృక్పథాన్ని, సంవిధానాన్ని శ్రోతలకు, పాఠకులకు అతి సులభంగా అందించడం ఆర్ ఎస్ రావు గారి ప్రత్యేకతలు.

 

ఆ ప్రత్యేకతలు ఇప్పటికి ముప్పై సంవత్సరాలుగా తెలుగు పాఠకులకూ, శ్రోతలకూ అనుభూతమయ్యాయి, అవుతున్నాయి. ముఖ్యంగా  పర్ స్పెక్టివ్స్ ప్రచురణ సంస్థ 1990లో ప్రచురించిన ‘అభివృద్ధి – వెలుగు నీడలు’ వ్యాసం ద్వారా, అంతకు ముందూ ఆ తర్వాతా సృజన, అరుణతారలలో అచ్చయిన అనేక వ్యాసాల ద్వారా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సభల్లో ఉపన్యాసాల ద్వారా ఆయన పరిశీలనా పద్ధతి లోని కొత్తచూపు చాలమందికి ఇదివరకే తెలిసింది. పర్ స్పెక్టివ్స్ సంస్థే 1995లో ప్రచురించిన ఆర్ ఎస్ రావు గారి ఇంగ్లిషు వ్యాసాల సంకలనం ‘టువార్డ్స్ అండర్ స్టాండింగ్ సెమి ఫ్యూడల్ సెమి కలోనియల్ సొసైటీ’ మరికొంత ఆసక్తిని రేకెత్తించింది.

 

అలా కొన్ని వ్యాసాలు చదివినవాళ్లు, ఉపన్యాసాలు విన్నవాళ్లు మొత్తంగా ఆయన రచనలన్నీ తెలుగులో ఒక్కచోట ఉంటే బాగుండునని చాల రోజులుగా అడుగుతున్నారు. అసలు ఏ విషయమయినా ఎలా ఆలోచించాలి, విశ్లేషించడానికి ఏ సంవిధానాన్ని అవలంబించాలి, ఎలా వివరించాలి అనే ప్రశ్నలకు ఆయన వ్యాసాలన్నీ ఒక్కదగ్గర చదివినప్పుడు సమాధానాలు దొరుకుతాయి.

 

ఈ సంపుటంలో ఆర్ ఎస్ రావు గారు 1980 నుంచీ 2010 దాకా రాసిన, ఉపన్యాసాలను అచ్చులోకి తెచ్చిన తెలుగు రచనలన్నీ – దాదాపు నలభై రచనలు – మొదటిసారిగా ఒక్కదగ్గరికి వస్తున్నాయి. వీటిలో కొన్ని పత్రికలలో, కొన్ని వ్యాస సంకలనాలలో ఇదివరకే అచ్చయ్యాయి. తెలుగు సమాజానికి అత్యంత ముఖ్యమయిన, అవసరమయిన ఈ పని చేసే అవకాశం వీక్షణం పబ్లికేషన్స్ కు దొరికినందుకు చాల సంతోషంగా ఉంది.

 

ఆర్ ఎస్ రావు గారిని నేను ముప్పై సంవత్సరాలుగా చూస్తూ, వింటూ, చర్చిస్తూ, అమోదిస్తూ, విభేదిస్తూ, ప్రతిసారీ ఆశ్చర్యపోతూ ఉన్నాను. ప్రతిసారీ ఆయన అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు గాని, ఆయన చూస్తున్న వస్తువునే మనం ఆయన లాగ చూడలేకపోయామే అని మాత్రం అనుకునే పరిస్థితి ఉంటుంది. అందరూ, లేదా ఎక్కువమంది చూసిన కోణం కన్న భిన్నమైన కోణాన్ని ఆయన చూస్తున్నారే అనిపిస్తుంది. ఆ వాస్తవానికి సంబంధించిన మరికొన్ని ముఖాలు ఉండే అవకాశం విస్మరించామే అనిపిస్తుంది. పాత ప్రశ్నలకు కొత్త జవాబులు వెతకడం, కొత్త ప్రశ్నలు వేయడం ఆయన ఆలోచనలో సహజమనిపించేటంతగా అలవాటయిపోయిన ప్రక్రియ.

 

సి వి సుబ్బారావు ద్వారా ఆర్ ఎస్ రావు గారు పరిచయం. ఆర్ ఎస్ రావు గారు అప్పటికి ఒరిస్సాలోని సంబల్ పూర్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్ గా బుర్లాలో ఉంటున్నారు. బుర్లాలోని ఆయన ఇల్లు బి 1, జ్యోతి విహార అప్పటి మార్క్సిస్టు, ప్రగతిశీల ఆలోచనాపరులకు, కార్యకర్తలకు ఒక మేధోమథన కేంద్రం. సుబ్బారావు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ప్రతి వేసవి సెలవుల్లో ఒక నెల హనుమకొండనూ, మరొక నెల బుర్లానూ కేంద్రంగా పెట్టుకుని దేశమంతా తిరుగుతుండేవాడు. అలా ఆర్ ఎస్ రావు గారి గురించి సుబ్బారావు బాగా చెప్పి ఉండడంతో ఆయనను చూడడానికి రెండు సంవత్సరాల ముందునుంచే ఆ ‘బుర్లా కబుర్లు’ ప్రాతిపదికగా ఆయన గురించిన జానపదగాథలతో సిద్ధంగా ఉన్నాం. ఆయన మొదటిసారి 1981లో వరంగల్ వచ్చారు. రెండు మూడు చోట్ల మాట్లాడారు గాని కాకతీయ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర విభాగంలో ఉపన్యాసం ఒక అద్భుతం. బి ఎ విద్యార్థిగా, మార్క్సిస్టు రాజకీయార్థ శాస్త్రం చదవడం అప్పుడప్పుడే మొదలుపెట్టిన నన్ను ఆ ఉపన్యాసం ఉక్కిరిబిక్కిరి చేసింది. సమ్మోహపరచింది. ఆ తర్వాత ఆయన అక్కడ ఉన్న రెండుమూడు రోజులు ఆయనకు భక్తుడిగా కాకతీయ విశ్వవిద్యాలయం లోనూ, క్యాంపస్ ముందరి చాయ దుకాణాల్లోను, వరంగల్ లో జరిగిన ఇతర సమావేశాల్లోనూ గడిపిన గంటలు, నడిచిన సంభాషణలు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటూనే ఉంటాయి.

 

ఆ తర్వాత గడిచిన ముపై సంవత్సరాలలో ఆయనతో ఎన్నో కలయికలు, సంభాషణలు, చర్చలు, ఆయన రచనల అనువాదాలు, కలిసి పాల్గొన్న సభలు, కలిసిచేసిన ప్రయాణాలు, పనులు, కన్న కలలు, అవి జరగనప్పుడు పొందిన విచారాలు… ఒక్కమాటలో మనకాలపు గొప్ప మార్క్సిస్టు మేధావితో సన్నిహితంగా ఉండే అవకాశం రావడం నా జీవితాన్ని ఎంతో మార్చింది. ఆయన ఆలోచనా సరళి మరింత ఎక్కువ మందికి తెలిస్తే బాగుంటుందని ఎంతో కాలంగా ఆశిస్తున్నాను. మిత్రుడు ఎస్ సుధాకర్ ఎన్నోసార్లు అన్నాడు: ‘సారు మెథడాలజీ విశిష్టమైనది. అది ప్రతిఒక్కరికీ తెలిసే పని ఏదయినా చేయాలి’ అని.  నిజానికి ఆ పని సంపూర్ణంగా చేయడం సాధ్యమని అనుకోను గాని ఆ పని ఈ రూపంలో కొంతవరకైనా ఇప్పటికి జరుగుతోంది.

 

ఆర్ ఎస్ రావు గారి ఆలోచనా ధోరణి గురించి ఆయన మిత్రులలో, శిష్యులలో ఒక మాట ఉంది. ఏ విషయం మీదనైనా ఆయన ‘కైట్ ఫ్లైయింగ’ (గాలిపటం ఎగరేయడం) చేస్తారని. అద్భుతమైన, భావస్ఫోర్కమైన ఈ ప్రతీకకు రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, ఏ విషయం గురించయినా ముందస్తు షరతులూ, పరిమితులూ, పరిధులూ లేకుండా ఎన్ని స్థాయిలలో, రంగాలలో, కోణాలలో వీలయితే అన్ని రకాలుగా ఆలోచన సాగించాలనేది. ఆ గాలిపటం ఎక్కడెక్కడికి వెళుతుందో తెలియదు. అది కొత్త లోకాలను చుట్టిరావచ్చు. కొత్త గాలులను ఆస్వాదించవచ్చు. కొత్త రంగులను అద్దుకోవచ్చు. అంటే, మానవ ఆలోచనకు ఉండవలసిన, సహజంగా ఉండే విస్తృతికి ఈ ప్రతీక ఒక నిదర్శనం. అయితే, అట్లన్ని గాలిపటం ఎటుపడితే అటు కొట్టుకునిపోయే, నిర్విచక్షణగా సాగే గాలివాటు వస్తువుగా చూడకపోవడమే ఇందులోని రెండో కోణం. ఆలోచనకు ఉండే, ఉండవలసిన విస్తృతిని అంగీకరిస్తూనే, ఆ గాలిపటం ఒక దారానికి అంటిపెట్టుకుని ఉండాలి. ఆ దారాన్ని ఒక మనిషి తన చేతిద్వారా నడుపుతూ ఉండాలి. ఆ మనిషి భూమి మీద నిలబడి ఉండాలి. ఈ రెండో కోణం మనిషి ఆలోచనకు ఇరుసుగా, కేంద్రంగా, పట్టి ఉంచే స్థిర బిందువుగా ఏ లక్ష్యం ఉండాలో చెపుతుంది. ఆర్ ఎస్ రావు గారి చేతిలో ప్రతి వస్తువూ గాలిపటం అవుతుంది. ఏ గాలిపటమైనా మార్క్సిస్ట్ సంవిధానపు ఇరుసు మీద, ఉత్పత్తి శక్తిగా ప్రజల అభివృద్ధి ఆకాంక్ష మీద ఆధారపడి ఉంటుంది.

 

ముప్పై సంవత్సరాల కాలవ్యవధిలో చేసిన ఈ ప్రసంగాలలో, రాసిన ఈ వ్యాసాలలో దాదాపు అన్ని ఆలోచనలూ మొదటినుంచీ చివరిదాకా కనబడతాయి. వాటిలో కొన్ని ఆలోచనలను కాలం పదును దేర్చి ఉండవచ్చు. కొన్ని ఆలోచనలను ఆయనే కాలక్రమంలో భిన్నంగా చూసి ఉండవచ్చు. కాని ఆ ఆలోచనల మధ్య, లేదా దృక్పథంలో ఏకసూత్రత మాత్రం విస్పష్టంగా కనబడుతుంది. అందుకు కారణం బహుశా ఆయనకు ఈ వ్యాసాలు మొదలయ్యేనాటికే ఏర్పడిన దృక్పథ స్పష్టత కావచ్చు. 1967లో నక్సల్బరీ ప్రజ్వలనంతో, కలకత్తా వీథులలో నక్సల్బరీ తరం ఆచరణను చూసిన అనుభవంతో,  తన ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానాన్నీ, భారత పీడిత ప్రజా ఉద్యమాల అవగాహనలనూ కలగలపడం మొదలుపెట్టిన మేధావి ఆయన. అప్పటినుంచీ దాదాపు పదిహేను సంవత్సరాలు ఇంగ్లిషులో కొన్ని రచనలు చేసినా, వాటిలో ‘ఇన్ సర్చ్ ఆఫ్ ఎ కాపిటలిస్ట్ ఫార్మర్’ ‘ఇన్ సర్చ్ ఆఫ్ ఎ మెథడ్’, ‘ఇన్ ఆన్ అటెంప్ట్ టు కమ్యూనికేట్’ వంటి ప్రభావశీలమైన రచనలు ఎన్నో ఉన్నా, ఆయన ఆలోచనలు తెలుగులోకి రాలేదు. ఆయన 1980 దశకం మొదటినుంచీ తెలుగు సమాజంలోకి – విప్లవ రచయితల సంఘం, అఖిలభారత విప్లవ సాంస్కృతిక సమితి, రాడికల్ విద్యార్థి సంఘం, సమీక్షావేదిక, పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్, ఉద్యోగ క్రాంతి  వంటి సంస్థలద్వారా, వివిధ పత్రికల ద్వారా – రావడం ప్రారంభించారు.

 

నిజానికి ఆయన తెలుగు సమాజంలోకి వచ్చినది రచన కన్న ఎక్కువగా ఉపన్యాసం, సంభాషణ, చర్చ ద్వారానే. ఆయనది మౌఖిక సంప్రదాయం అనీ, ఇంకా లిఖిత సంప్రదాయంలోకి రాలేదనీ సుబ్బారావు పరిహాసం ఆడుతుండేవాడు. ఇక్కడ అచ్చవుతున్న రచనలలో దాదాపు సగం ఆ తర్వాత ఎవరో అక్షర రూపం ఇచ్చిన ఉపన్యాసాలే. అలాగే ఇక్కడ అచ్చవుతున్న రచనలలో ఉపన్యాసాలను మినహాయిస్తే ఎక్కువ భాగం ఆయన ఇంగ్లిషులో చేసిన రచనల అనువాదాలే. కొన్ని వ్యాసాలలో మొదటిసారి చదివేటప్పుడు కనబడే సంక్లిష్టతకు ఇది ఒక కారణం కావచ్చు. సాధారణంగా ఎంత జటిలమయిన విషయమయినా ఆయన మాటలలో, ఉపన్యాసంలో, సంభాషణలో, చర్చలో చాల సులభంగా కనడుతుంది. కాని రచనలోకి వచ్చేసరికి ఆ విషయపు బహుముఖీనత వల్ల, సంక్లిష్టత వల్ల ఆ సౌలభ్యం తగ్గిపోతుంది. అలాగే ఇంగ్లిషు వాక్యనిర్మాణ సంప్రదాయం వల్ల బహుముఖీనతను సులభంగా అర్థం చేయించవచ్చు గాని అదే తెలుగు అనువాదంలో క్లిష్టంగా మారిపోతుంది. అట్లాగే ఆయన విశ్లేషణా, వివరణా శైలిలో అమూర్తతకూ నిర్దిష్టతకూ, సాధారణత్వానికీ ప్రత్యేకతకూ, రూపానికీ సారానికీ నిరంతరం అటూ ఇటూ సాగుతుండే ప్రయాణం, సంభాషణ వల్ల కూడ కొన్నిసార్లు వ్యాసాలు ఒకటికి రెండుసార్లు చదవవలసిన అవసరం కలుగుతుంది.

 

భారత సామాజిక సంబంధాలు, భూస్వామ్యం, సామ్రాజ్యవాదం, భారత ఆర్థిక వ్యవస్థ చరిత్ర, ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానం, పాలనా విధానాలు, భూసంస్కరణలు, ప్రజా సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ భావజాలం, అభివృద్ధి, విస్థాపన, పర్యావరణం, చరిత్ర నిర్మాణంలో ప్రజల పాత్ర, భారత సామాజిక ఆర్థిక వ్యవస్థల సంక్షోభం, నక్సల్బరీ వెలుగులో భారత విప్లవోద్యమం నిర్మిస్తున్న చరిత్ర, సామ్యవాద ప్రయోగాలు, ప్రత్యామ్నాయ సంస్కృతి, పౌరహక్కుల ఉద్యమం, సామ్రాజ్యవాద ప్రభావానికీ కుల, మత వాదాలకూ సంబంధం, స్త్రీవాదం వంటి అనేక అంశాల మీద మనకాలపు మార్క్సిస్టు ఆలోచనా, విశ్లేషణా, వివరణా సంవిధానానికి నిదర్శనాలు ఈ వ్యాసాలు.

 

ఈ వ్యాసాలలో సగం నడుస్తున్న దశాబ్దానివి కాగా పావువంతుకన్న ఎక్కువ 1990లవీ, అంతకన్న తక్కువ 1980లవీ ఉండడం ఒక ఆసక్తికరమైన అంశానికి సూచిక. ఈ మూడు దశకాలలోనూ ఆయన దృష్టి ప్రసరించని సమకాలీన సమస్య లేదు. అలాగని అవి అప్పటికప్పుడు తలెత్తిన అంశాలపైన పైపైన పరిశీలించిన వ్యాసాలు కావు. తక్షణ, తాత్కాలిక విషయాన్ని పట్టించుకున్నదయినా, దీర్ఘకాలిక, సైద్ధాంతిక విషయాన్ని పట్టించుకున్నదయినా పాఠకులకు కొత్త చూపును అందించగలగడం ప్రతి వ్యాసంలోనూ ఉన్న ప్రత్యేకత.

 

ఈ పుస్తక పాఠకులెవరయినా సరే, ఈ కొత్తచూపును అర్థం చేసుకోవడానికి, తమ ఆలోచనలలో భాగం చేసుకోవడానికి, ఇతరులకు వివరించి విస్తరించడానికి ప్రయత్నించకుండా ఉండడం అసాధ్యం. ఈ కొత్త చూపుకు కొన్ని ఉదాహరణలు చూడండి:

 

“ఫ్యూడల్ ప్రయోజనాలూ పెట్టుబడిదారీ ఆస్తి ప్రయోజనాలూ సహజీవనం చేసే సమాజంలో పరస్పర వైరుధ్యం గల వివిధ శక్తులకు రాజ్యాధికారంలో వాటా ఉంటుంది… ఒకేఒక వర్గానికి చెందని రాజ్యం దానికదే ఒక వైరుధ్యం. దానివల్ల రాజ్యం మనుగడలోనూ పనిపాటుల్లోనూ కూడా అస్థిరత్వం తలెత్తుతుంది” అని ఆయన మన సమాజంలో రాజ్యాధికారం అనుభవిస్తున్న శక్తులలోని అస్థిరతను అర్థం చేసుకోవడానికి మార్గం చూపుతారు.

 

“భూసంస్కరణలు అమలుచేసి భూకామందుల్ని చికాకు పెట్టనవసరం లేకుండానూ, లేదా మరింత ఎక్కువ మంది కార్మికుల్ని పనిలో పెట్టుకోవాలని పారిశ్రామికుల్ని బలవంతపెట్టకుండానూ, పేదవారిని దారిద్ర్యరేఖ నుండి బయటికి తేవాలని చేసే ప్రయత్నాలన్నీ భూగోళం వాతావరణంలోనే ఉంటూ భూమ్యాకర్షణ శక్తి నుంచి తప్పించుకుని దానికెదురేగడానికి పడే పాట్ల వంటివే” అని భారత సమాజాన్ని మౌలికంగా సంస్కరించగల భూసంస్కరణలను వివరిస్తూ, ఆ పని చేస్తానని చెపుతూనే ఆరు దశాబ్దాలుగా పబ్బం గడుపుకొస్తున్న రాజ్యపు “సంక్షేమ” రూపం లోని డొల్లతనం ఎక్కడినుంచి వస్తున్నదో చూపుతారు.

 

మరి ఈ మౌలికమైన సామాజిక సంబంధాల మార్పునూ, రాజ్యాధికారంలో ఉన్న వర్గాల స్వభావాన్నీ అర్థం చేసుకునే చట్రం, అంటే భారత సమాజ వాస్తవికతను అర్థం చేసుకునే చట్రం, బహుశా ఆ వాస్తవికతను మార్చగలిగే ఆలోచనా – ఆచరణా చట్రం ఎవరి దగ్గర ఉంది? ఇంకా విజయం సాధించకపోయినా, ఇంకా ఒడిదుడుకులలో ఉన్నా, అది ఈ దేశ పీడిత ప్రజలు తమకు తాము ఇచ్చుకున్న నక్సల్బరీ పోరాట చట్రం మాత్రమేనని ఆర్ ఎస్ రావు గారు విస్పష్టంగా, సాధికారికంగా, సోదాహరణంగా ఈ వ్యాసాలలో నిరూపిస్తారు.

 

“నక్సలైట్లు ఇంకా విజయం సాధించి ఉండకపోవచ్చు. కాని భారత ఆర్థిక వ్యవస్థలో పేదరైతులకూ, వ్యవసాయ కూలీలలకూ ప్రధాన స్థానం ఉంటుందని వాళ్ళు లేవనెత్తిన అంశాలు, పేదరికం గురించీ, మార్కెట్ సమస్య గురించీ లేవనెత్తిన అంశాలు ఒకవైపు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మీద, సహాయం మీద ఆధారపడడం గురించిన ప్రశ్నలు మరొకవైపు ఒక చట్రాన్ని ప్రతిపాదించే ఇతివృత్తాలవుతాయి. ఆ చట్రం పకడ్బందీ చట్రం కాకపోయినప్పటికీ, భారత వాస్తవికతను అర్థం చేసుకునే చట్రం ఇదే” అని ఏడవ పంచవర్ష ప్రణాళిక నమూనా మీద సదస్సులో 1984లో ఆయన అన్నారు. ఆ చట్రాన్ని అర్థం చేసుకోవడం, వివరించడం, విశ్లేషించడం, విస్తరించడం, ఇంకా పకడ్బందీగా చేయడానికి ప్రయత్నించడం, ఈ చట్రం వైపు ఇతర ఆలోచనాపరులను ఆకర్షించడం ఈ వ్యాసాలు చేసే పని.

 

–          ఎన్ వేణుగోపాల్

-హైదరాబాద్, అక్టోబర్ 16, 2010

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

4 Responses to అత్యవసరమైనదీ కొత్తచూపు

 1. అయ్యా!

  ఈ ఆరెస్ రావుగారెవరో మీకు బాగా తెలిసి వుండచ్చు. కనీసం అయన పూర్తి పేరైనా ప్రచురించకపోతే, అయనకి మీరు యేమి న్యాయం చేసినట్టు?

  అన్నట్టు–మీరేదో “నమ్మకాలపై…….తీర్పు” టపా వ్రాస్తే, నేను వ్యాఖ్యానించాననుకుంటా. దాన్ని ప్రచురించారా? జవాబిచ్చారా?

 2. gajula says:

  ఆర్ .యస్ రావు గారి రచనలు చదివే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు .

 3. పుస్తకం కవర్ పేజీ కూడా ఇస్తే బాగుండేది. ఈ వ్యాసం చదివి ఎప్పుడో బుక్ షాప్ దగ్గర ఆ పుస్తకం చూస్తే కొందరి చెయ్యి వెంటనే ఆ పుస్తకం పైకి వెళ్తుంది కదా. ఆర్ ఎస్ రావుగారు కళింగాంధ్ర వాసి అని నేను విన్నది నిజమేనా సార్?

 4. ఆర్.యస్.రావు గారి కొత్తచూపు పుస్తకము నేను చదువుతున్నాను. పూర్తి కావచ్చింది. చాలా బాగుంది. దానితో పాటుగా భారతి గారి ” అభివృద్ధిని ఇలా చూద్దాం ” పుస్తకము కూడా చదివాను చాలా బాగున్నాయి.

  ఆర్.యస్.రావు గారు పుస్తకంలో చాలాచోట్లలో ” అన్నీ వేదాల్లోనే ఉన్నాయష ” అని అగ్రిహోత్రావధాన్లు గారి మాటల్ని ఉదహరిస్తుంటారు. అది నిజమే. మనం ముందుకు పోతున్నాము. మార్క్సుని దాటి కూడా ముందుకు పోవాలి. ఇలాంటి అభ్యుదయకరమైన చర్చలో ప్రతీదానికి మార్క్సు మార్గంలోనే పరిష్కారం ఉందని రాయడం, ప్రతీ విషయాన్ని మార్క్సు దృష్టితోనే చూడడం కూడా దాని స్పూర్తికి విరుద్దం. వెనక్కి చూడడం.

  మార్క్సిజం శాస్త్రీయమైనదని ఒప్పుకొందాము. కానీ శాస్త్రం ముందుకెళ్ళాలి. మనం ఆగకూడదు. మనం ఆర్.యస్.రావు గారు, వేణుగోపాల్ గార్లనే మైలురాళ్ళ దగ్గరికి వచ్చాము. ఇంకా వెనక్కెందుకు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s