అరుంధతీ రాయ్ నేరమేమిటి?

నవలా రచయిత, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ మీద, మరికొందరి మీద దేశద్రోహ నేరం కేసుపెట్టి అరెస్టు చేయాలనీ, ఆమెను ఉరితీయాలనీ కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్ తో సహా కొన్ని నగరాల్లో ఆమె దిష్టిబొమ్మలను కూడ దహనం చేశారు. మన సమాజంలో సమాచారం లేకుండానో, తప్పుడు సమాచారం మీదనో ఎంత సులభంగా భావోద్వేగాలను రెచ్చగొట్టవచ్చునో చూపడానికి ఇది ఉదాహరణ. అలా అసమంజసమైన, తప్పుడు కారణాల మీద అమాయకులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం రాజకీయ పక్షాలకూ, పాలకవర్గ ప్రతినిధులకూ, కొందరు అరకొర మేధావులకూ అలవాటయిపోయింది. ఆపనిలో వారికి వాస్తవాలతోనూ, చరిత్రతోనూ, హేతుబద్ధతతోనూ, ప్రజాభిప్రాయంతోనూ నిమిత్తం లేదు.

ఇంతకీ అరుంధతీ రాయ్ చేసిన నేరమేమిటి?

అక్టోబర్ 21 న ఢిల్లీలో కమిటీ ఫర్ ది రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో కాశ్మీర్ సమస్యపై ‘ఆజాదీ – ఏకైక మార్గం’ అనే సదస్సు జరిగింది. ప్రదర్శనకారుల వైపు నుంచి రాళ్లు రువ్వడం తప్ప మరే హింసాత్మక సంఘటన జరగకపోయినా, మూడునెలల వ్యవధిలో ప్రభుత్వ బలగాల కాల్పులలో నూట పదకొండు మంది యువకులు బలి అయిపోయిన నేపథ్యంలో కాశ్మీర్ గురించి ఢిల్లీలో ఇటువంటి సదస్సు జరపడం అవసరం, ప్రశంసనీయం. కాశ్మీర్ ప్రజలమీద జరుగుతున్న దాడిని ఖండించడానికి, బాధిత కాశ్మీర్ ప్రజలకు మద్దతు తెలిపేవారు ఈ దేశంలో ఉన్నారని చెప్పడానికి ఆ సదస్సు ప్రయత్నించింది. ఆ సదస్సులో హురియత్ నేత సయ్యద్ అలీ షా జిలానీ, కాశ్మీర్ విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుసేన్, రచయితలు అరుంధతీ రాయ్, వరవరరావు, నాగా హక్కుల ఉద్యమ కారుడు వెనుహ్, మణిపూర్ పౌరహక్కుల నాయకుడు మాలెం నింగ్తౌజా, పశ్చిమ బెంగాల్ పౌరహక్కుల నాయకుడు సుజాతో భద్ర, జమ్మూ పౌరహక్కుల నాయకుడు శివ నందన్, దళ్ ఖాల్సా నాయకుడు హర్ చరణ్ జిత్ సింగ్, పాత్రికేయులు నజీబ్ ముబారకీ, శుద్ధబ్రత సేన్ గుప్తా, చరిత్ర ప్రొఫెసర్ అమిత్ భట్టాచార్య, ఆర్ డి ఎఫ్ నాయకుడు జి ఎన్ సాయిబాబా తదితరులు మాట్లాడారు.

సంఘ పరివార్ నాయకులు, పయనీర్ వంటి పత్రికలు, టైమ్స్ నౌ వంటి ఛానెళ్లు చేస్తున్న అబద్ధ ప్రచారాలను, వక్రీకరణలను పక్కనపెట్టి, ఐదుగంటలకు పైగా జరిగిన, ఏడువందలమంది హాజరయిన ఆ సదస్సులో నిజంగా ఏం జరిగిందో, వక్తలు ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే ఎన్నో మార్గాలున్నాయి.

ఔను, అరుంధతీ రాయ్, వరవరరావు, సుజాతో భద్రా తదితరులు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదనీ, కాశ్మీరీ ప్రజల స్వాతంత్ర్యాకాంక్షను భారతీయులు బలపరచవలసి ఉందనీ అన్నారు. ఆ ఒక్కమాట అని ఊరుకోలేదు. ఆ మాటలను అనేక కోణాలనుంచి వివరించారు, సమర్థనలు, వాదనలు వినిపించారు. ఆ మాటలపట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చును గాని, ఈ దేశంలో అమలవుతున్న చట్టాలప్రకారం గాని, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగాని ఆ మాటలు నేరాలు కావు. పైగా ఆ మాటలకు పూర్తిగా చారిత్రక, హేతుబద్ధ, రాజకీయ ఆధారాలు ఉన్నాయి.

మొట్టమొదట భారత శిక్షా స్మృతిలో దేశద్రోహం (సెడిషన్)ను నిర్వచించే సెక్షన్ 124-ఎ (చట్టబద్ధంగా ఏర్పడిన భారత ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని, వ్యతిరేకతను కలిగించడానికి మాటల ద్వారా, చేతల ద్వారా ప్రయత్నించడం) ఇక్కడ వర్తించదు. ఆ సెక్షన్ లోనే వివరణ 2, వివరణ 3 అని చేర్చిన నిబంధనల ప్రకారం ‘భారత ప్రభుత్వ చర్యలను మార్చాలనే ఉద్దేశంతో చేసే విమర్శలు ఈ పరిధిలోకి రావు’ అని ఉంది. కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ చర్యలను మార్చవలసి ఉందని ఇవాళ కొత్తగా జిలానీయో, అరుంధతీ రాయో అనడం లేదు. గాంధీ, నెహ్రూలనుంచి ఇవాళ్టిదాకా ఎందరో అన్నారు. తన చర్యలను సవరించుకుంటానని భారత ప్రభుత్వమే స్వయంగా ఐక్యరాజసమితి ముందర, ఇతర చోట్ల  ఎన్నోసార్లు వాగ్దానం చేసింది. అసలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహం అవుతుందనే ఈ సెక్షన్ అనుచితమైనది. దేశమంటే మట్టి కాదోయ్ అన్నట్టుగానే ప్రభుత్వం కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మరొకసారి చెప్పవలసి ఉంది. అలాగే మనరాష్ట్రంలోనూ దేశంలోనూ  ఈ అరవై ఏళ్లలో ఎంతోమందిపై ఈ సెక్షన్ కింద దేశద్రోహ నేరం ఆరోపించి విచారణ జరిపారు గాని రుజువై శిక్షలు పడిన దాఖలాలు లేవు.

ఇక ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఆమోదించిన అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల ప్రకటన లో మొదటి అధికరణమే ప్రజలందరికీ స్వయంనిర్ణయాధికారాన్ని హామీ ఇస్తుంది. 1966లో అంగీకరించిన ఈ ప్రకటన మీద భారత ప్రభుత్వం కూడ సంతకం చేసింది. మొన్న ఢిల్లీ సదస్సులో వక్తలందరూ పూర్తిగా ఈ అంతర్జాతీయ హక్కుల ప్రకటనకు లోబడి మాత్రమే మాట్లాడారు. వారిని విమర్శిస్తున్న వారే ఆ అంతర్జాతీయ ప్రకటనను ఉల్లంఘిస్తున్నారు. అలా విమర్శిస్తున్న భారతీయ జనతాపార్టీ ఈ దేశాన్ని పాలించిన కాలంలో కూడ ఆ అంతర్జాతీయ ప్రకటనను ఆమోదించబోనని ఎన్నడూ అనలేదు.

ఈ చట్టపరమైన, సాంకేతికమైన అంశాలను అలా ఉంచినా, కాశ్మీర్ చరిత్రను స్థూలంగా పరిశీలించినా ఢిల్లీ సదస్సు వక్తలు సంపూర్ణంగా చారిత్రక ఆధారాలతోనే మాట్లాడారని అర్థమవుతుంది. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదనే మాటను, కాశ్మీరీ ప్రజల ఆజాదీ ఆకాంక్షను మాత్రం ఇక్కడ చూద్దాం.

కాశ్మీర్ నిజంగానే భారతదేశంలో ఎన్నడూ భాగం కాదు. నిజానికి ఒక పాలనా ప్రాంతంగా భారతదేశం అనేదే పద్నాలుగో శతాబ్దానికి ముందు లేదు. అప్పటినుంచీ ఢిల్లీ రాజధానిగా ఒక విశాల పాలనా ప్రాంతం ఏర్పడిందనుకున్నా దానిలో చేరిన భూభాగం కన్నా చేరని భూభాగమే ఎక్కువ. అంతకుముందరి పాలకులకన్న ఎక్కువ భూభాగాన్ని బ్రిటిష్ వలస పాలకులు పాలించినప్పటికీ 560 సంస్థానాలలోకి, దాదాపు సగం భారతదేశంలోకి వాళ్లు ప్రవేశించనే లేదు. 1947 ఆగస్ట్ 15న ఏర్పడిన భారతదేశంతో పోల్చదగిన “భారతదేశం” అంతకు ముందెన్నడూ లేదు. కనుక కాశ్మీర్ గాని, ఈశాన్య రాష్ట్రాలు గాని, హైదరాబాద్ రాజ్యంగాని భారతదేశంలో అంతర్భాగాలని వాదిస్తే అది కొన్ని భావోద్వేగాల మీద, విశ్వాసాల మీద ఆధారపడి చేసే వాదనే అవుతుందిగాని వాస్తవ చరిత్ర మీద ఆధారపడి చేసే వాదన కాజాలదు.

మిగిలిన ప్రాంతాల సంగతి ఇక్కడ అప్రస్తుతం గాని, “భారతదేశం”లో కాశ్మీర్ ఎలా భాగమయిందో చరిత్ర కాస్త చూడవలసి ఉంది. కాశ్మీర్ లోయ ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉంటూ వచ్చింది. భారత ఉపఖండంలో ప్రవేశించిన సైనిక పటాలాలన్నీ ఆ వాయవ్యదిశనుంచే వచ్చినందువల్ల రాజకీయ పాలనా ప్రాంతంగా కాశ్మీర్ లోయ సరిహద్దులు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి. పద్నాలుగో శతాబ్ది వరకూ ఈ ప్రాంతాన్ని బౌద్ధ, హిందూ మతాలకు చెందిన పాలకులు స్వతంత్రంగా పాలించారు. ఆ తర్వాత ఆ లోయలోనే ముస్లిం పాలకుల స్వతంత్ర రాజ్యం మొదలయింది. ఆ ముస్లిం పాలకులమీదనే అక్బర్ సైన్యాలు 1587లో దండయాత్రచేసి కాశ్మీర్ ను మొగల్ సామ్రాజ్యంలో అంతర్భాగం చేసుకోవడంతో కాశ్మీర్ ఢిల్లీ పాలన కిందికి వచ్చింది. అంటే ఇవాళ ‘కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం’ అంటున్నవారికి ఆధారం దొరికినది ఒక స్థానిక “ముస్లిం” పాలకుడి మీద మరొక “ముస్లిం” పాలకుడు సాగించిన దండయాత్ర అన్నమాట. మొగల్ చక్రవర్తులు కాశ్మీర్ ను రెండు శతాబ్దాలు తమకింద ఉంచుకున్నారు. 1752లో అప్ఘనిస్తాన్ కు చెందిన అహ్మద్ షా అబ్దాలీ కాశ్మీర్ మీద దండెత్తి మొగల్ సైన్యాన్ని ఓడించాడు. ఆ తర్వాత ఏడు దశాబ్దాలపాటు పఠాన్ రాజులకింద అటూ ఇటూగా స్వాతంత్ర్యం అనుభవించిన స్థానిక సామంతరాజులు కాశ్మీర్ ను పాలించారు. 1819లో సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ కాశ్మీర్ ను లోబరచుకుని 1846 దాకా పాలించాడు. బ్రిటిష్ పాలకులు అడిగిన కోటి రూపాయల కప్పం చెల్లించలేక రంజిత్ సింగ్ కాశ్మీర్ ను బ్రిటిష్ పాలకులకు అప్పగించాడు. అప్పటి గవర్నర్ జనరల్ హార్డింగ్ ఈ విశాల భూభాగాన్ని తమ ప్రత్యక్ష పాలనలో ఉంచుకోవడం అనవసర ఖర్చుగా భావించి, కప్పం చెల్లించడానికి అంగీకరించిన జమ్మూ పాలకుల సంతతికి చెందిన గులాబ్ సింగ్ చేతికి ఇచ్చాడు. అమృతసర్ లో 1846 లో కుదిరిన ఒప్పందం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వాధికారాన్ని గుర్తిస్తూనే స్వతంత్ర రాజ్యంగా కొనసాగడానికి గులాబ్ సింగ్ కు అవకాశం దొరికింది. ఆ గులాబ్ సింగ్ వారసుడైన రాజా హరిసింగ్ కాశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేస్తూ 1947 అక్టోబర్ 26న సంతకం చేశాడు. శ్రీనగర్ నుంచి పారిపోయి వచ్చి జమ్మూ రాజభవనంలో నిద్రపోతున్న రాజా హరిసింగ్ ను నిద్రలేపి ఆ విలీన ఒప్పందం మీద ఎలా సంతకం చేయించారో అప్పటి హోం కార్యదర్శి వి పి మీనన్ రాసిన ‘ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్’ చాల వివరంగా చెపుతుంది. ఇదీ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమయిన చరిత్ర. ఇది చెప్పడం నేరమవుతుందా?

ఇక ఆజాదీ విషయానికొస్తే, రాజా హరిసింగ్ పాలనా కాలంలోనే అక్కడి ప్రజానీకం రాజరికానికి వ్యతిరేకంగా, నయా కాశ్మీర్ ను ఏర్పరచుకోవడానికి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంలో వీరోచిత పోరాటాలు చేశారు. ఆ పోరాటంపై గొడ్డలిపెట్టులా భారత-పాకిస్తాన్ విభజన, సంస్థానాల స్వాతంత్ర్యాన్ని గుర్తించడం ఆలోచనలు వచ్చాయి. భారత్ తో విలీనం నాటకీయ పరిస్థితిలో జరిగినా, భారత్ లో చేరాలా, పాకిస్తాన్ లో చేరాలా, స్వతంత్రంగా ఉండాలా అనే విషయమై శాంతిభద్రతలు ఏర్పడగానే ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రజలు కోరుకున్న ప్రకారమే నిర్ణయిస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మాట విలీనం తర్వాత వారం రోజులకు, 1947 నవంబర్ 2న ప్రధాని నెహ్రూ ఆల్ ఇండియా రేడియోలో ప్రకటించాడు. ఆ వాగ్దానాన్నే పార్లమెంటులో పునరుద్ఘాటించాడు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగేంతవరకూ విలీనం తాత్కాలికం గనుకనే రాజ్యాంగంలో ప్రత్యేకమైన అధికరణం 370 చేరింది. ప్రజాభిప్రాయ సేకరణ సమస్య ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి కూడ చేరి 1948 ముంచి 1957 వరకు ఐదు సార్లు ప్లెబిసైట్ జరపమని తీర్మానాలు జరిగాయి గాని భారత ప్రభుత్వం వాటన్నిటినీ తుంగలో తొక్కింది.

ఒకవైపు జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద తాను చేసిన వాగ్దానాలను ఉల్లంఘిస్తూనే, మరొకవైపు కాశ్మీర్ లో కుట్రలకూ కుహకాలకూ అణచివేతకూ భారతప్రభుత్వం తెరతీసింది. నేషనల్ కాన్ఫరెన్స్ ను, ఇతర రాజకీయ పక్షాలను నిర్వీర్యం చేసింది. ప్రజలు తమంతట తామో, అప్పటికప్పుడు ఏర్పరచుకున్న సంస్థల ఆధ్వర్యంలోనో స్వయం నిర్ణాయాధికారం కోసం, హామీల అమలు కోసం పోరాడుతుంటే అతి భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించింది. కనీసం డెబ్బై వేలమంది కాశ్మీరీ యువకులను భారత ప్రభుత్వం చంపి వేసింది. జనాభాకు మించిన స్థాయిలో ఏడు లక్షల సైనిక, అర్ధ సైనిక బలగాలతో కాశ్మీర్ ను నిర్బంధ శిబిరంగా మార్చింది. ఈ అణచివేత అంతా ఆజాదీ కోరిక మరింత బలపడడానికే దారితీసింది. అందువల్లనే 1949లో గాని, 1989లో గాని ఆజాదీ కోరని వాళ్లు కూడ ఇవాళ ఆజాదీ తప్ప మరొక మార్గం లేదనుకుంటున్నారు. అరుంధతీ రాయ్ అయినా మరొకరయినా గుర్తించినదీ, గుర్తించవలసినదీ ఈ ప్రజా ఆకాంక్ష మాత్రమే. ఈ దేశంలో ప్రజల ఆకాంక్షను గుర్తించడమే నేరమూ దేశద్రోహమూ ఎప్పటి నుంచి అయింది?

–          ఎన్ వేణుగోపాల్

 

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu. Bookmark the permalink.

7 Responses to అరుంధతీ రాయ్ నేరమేమిటి?

 1. ఆమెను విమర్శించిన వాల్లు మాత్రం చేసిన నేరమేమిటి?

 2. hkjk says:

  అపరిపక్వ మేధావులు చేస్తున్న విత౦డ వాదాలతో విసుగోస్తో౦ది. అ మాటకొస్తే ఎన్నో రాజ్యాలు భారతదేశం లో అ౦తర్భాగ౦ కాదు. కానీ స్వాత౦త్య౦ తరువాత ఎన్నో స౦స్థంఆలను విలీన౦ చేసి భారతదేశం ఏర్పాటు చేసారు.

  కాశ్మీర్ రణ౦ వెనుక మన దాయాదుల, శత్రువుల కుట్రలున్నాయి. కాశ్మీర్ ఇచ్చేస్తే భారత భూభాగ౦ మన ప్రత్యర్థులకు సులభ లక్ష్యమవుతు౦ది. ప్రస్తుత మేధావులకు స౦చలనాల మిద వున్నా శ్రద్ద దేశ భవిష్యత్తు మీద, భావోద్వేగాల మీద ఉ౦డదు.

 3. ఒక సాధారణ ప్రశ్న,
  కాశ్మీరు ప్రజలు భారత ప్రభుత్వం నిర్వహించే ఎన్నికలలో ఎందుకు పాల్గొంటున్నారు?

  ఒక క్లిష్టమైన ప్రశ్న,
  ఒకవేళ కాశ్మీరుకు స్వతంత్రం వస్తే అది మరో ఆఫ్ఘనిస్తాన్ లా కాదని మీరు పైన చెప్పిన వక్తలు హామీ ఇవ్వగలరా?

 4. Ranjith says:

  As late Balagopal said India is divide into three parts they are Bharat, India and America within India, So Kashmir is Integral part of India only for India and America within India who are upper middle class, “Main stream Media” and for political parties. If Kashmiri’s want to be with India then why AFSA, why article 370a and atleast why don’t India conduct plebiscite as Nehru agreed to that in UN. I’m asking people who are against the self determination of Kashimiri’s that where were you when army killed 80,000 people within 50 years, where were you when women raped and killed, where were you when unarmed teenagers were killed and one can imagine that if 800,000 Indian soldiers are present in little valley how much land you are grabbing from people of Kashmir and on the top they have to show ID to roam in Kashmir to a non-Kashmiri, what kind of justice is this? I strongly believe that our opinion doesn’t not matter, nobody give a damn about its their birth right to decide what they want! It is applicable to POK what I meant before. Kashmir belongs to Kashmir’s whether it is Pakistan or India they have to leave.

 5. Anonymous says:

  Expect chesaa… ;)

 6. gajula says:

  arundathiraiki maa sangheebaavaanni teliyachestunnaamu.

 7. surender says:

  సార్… మీరు చెప్పింది బాగానే ఉంది……మీరు భారతదేశం ఎలా ఆవిర్భవించిందో…చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన విధంగానే….ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రత్యేక గళాన్ని విప్పాలనా మీ ఉద్దేశం….. చరిత్ర ఆధారంగా కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కాబట్టి, దానిని స్వతంత్ర దేశంగా అవతరించాలని మీ వ్యాస సారంశం అనుకుంటే… ఈశాన్య రాష్ట్రాలు కూడా ప్రత్యేకం కావాలంటున్నాయి….అలాగే పంజాబ్ కూడా ప్రత్యేక దేశం కావాలంటూ సిక్కులు ఉద్యమాలు చేస్తున్నారు. అంతేగాక… దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో కలిసిన తెలంగాణను కూడా ప్రత్యేక దేశం చేయాలి కదా……
  మరొక విషయం……
  మీరు చెప్పిన కాశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం….వారి అభిష్టం…. అని అన్నారు…మీ యొక్క ప్రజల స్వేచ్చపై ఉన్న జాలి చాలా బాగుంది… నాకు బాగా నచ్చింది…. కాశ్మీర్ సమస్య గత అరవై సంవత్సరాల నుండి ఉన్నది.
  మీరు ఈ దేశం సమైఖ్యంగా ఉండాలనుకుంటున్నారా….లేక ముక్కలు కావాలనుకుంటున్నారా…..
  నిజం ఏదైనా… మీలాంటి వారు రాసే వ్యాసాలు… చేసే వ్యాఖ్యాలు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని నేను అనుకుంటున్నాను….
  తప్పయితే మన్నించండి……..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s